06-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఎంత సమయము లభిస్తే అంత సమయము ఏకాంతములోకి వెళ్ళి స్మృతి యాత్ర చేయండి, ఎప్పుడైతే మీరు గమ్యానికి చేరుకుంటారో అప్పుడు ఈ యాత్ర పూర్తవుతుంది’’

ప్రశ్న:-
సంగమములో తండ్రి తన పిల్లలలో ఏ గుణాన్ని నింపుతారు, అది అర్ధకల్పము వరకు కొనసాగుతూ ఉంటుంది?

జవాబు:-
తండ్రి అంటారు - ఏ విధంగా నేను అతి మధురముగా ఉన్నానో, అలాగే పిల్లలను కూడా మధురముగా తయారుచేస్తాను. దేవతలు చాలా మధురమైనవారు. పిల్లలైన మీరు ఇప్పుడు మధురముగా అయ్యే పురుషార్థాన్ని చేస్తున్నారు. ఎవరైతే అనేకుల కళ్యాణము చేస్తారో, ఎవరిలోనైతే ఎటువంటి ఆసురీ ఆలోచనలు లేవో, వారే మధురమైనవారు. వారికే ఉన్నత పదవి ప్రాప్తిస్తుంది. వారికే తర్వాత పూజ జరుగుతుంది.

ఓంశాంతి
తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - ఈ శరీరానికి యజమాని ఆత్మ. ఈ విషయాన్ని మొదట అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు జ్ఞానము లభించింది. మొట్టమొదట అయితే నేను ఒక ఆత్మను అని అర్థం చేసుకోవాలి. శరీరము ద్వారా ఆత్మ పని చేస్తుంది, పాత్రను అభినయిస్తుంది. ఇటువంటి ఆలోచనలు ఇతర మనుష్యులకెవ్వరికీ రావు ఎందుకంటే వారు దేహాభిమానములో ఉన్నారు. ఇక్కడ - నేను ఒక ఆత్మను, ఇది నా శరీరము, ఆత్మనైన నేను పరమపిత పరమాత్ముని సంతానాన్ని అన్న ఈ సంకల్పములో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఈ స్మృతినే ఘడియ-ఘడియ మర్చిపోతూ ఉంటారు. మొట్టమొదట దీనిని పూర్తిగా గుర్తుంచుకోవాలి. యాత్రలకు వెళ్ళినప్పుడు - అలా వెళ్తూనే ఉండండి అని చెప్తూ అంటారు. అలాగే మీరు కూడా ఈ స్మృతి యాత్రలో నడుస్తూనే ఉండాలి అనగా స్మృతి చేస్తూ ఉండాలి. స్మృతి చేయటం లేదు అంటే యాత్ర చేయటం లేదన్నట్లే. దేహాభిమానము వస్తుంది. దేహాభిమానము వల్ల ఏదో ఒక వికర్మ జరుగుతూనే ఉంటుంది. అలాగని మనుష్యులు సదా వికర్మలు చేస్తారని కాదు, కానీ ఆ సమయములో వారి సంపాదన అయితే ఆగిపోతుంది కదా. అందుకే ఎంత వీలైతే అంత స్మృతియాత్రలో ఢీలాగా అవ్వకూడదు. ఏకాంతములో కూర్చుని మీలో మీరు విచార సాగర మంథనము చేసుకుంటూ పాయింట్లను తీయాల్సి ఉంటుంది. ఎంత సమయము బాబా స్మృతిలో ఉంటున్నారు? మధురమైన పదార్థము అనేది గుర్తుకొస్తూ ఉంటుంది కదా.

ఈ సమయములో మనుష్య మాత్రులందరూ ఒకరికొకరు నష్టాన్నే కలిగించుకుంటున్నారని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. అయితే ఈ సందర్భములో బాబా కేవలం టీచర్లను మహిమ చేస్తారు. అయితే టీచర్లలో కూడా కొందరు చెడుగా ఉంటారు. కానీ వాస్తవానికి టీచరు అనగా నేర్పించేవారు, వారు మ్యానర్స్ నేర్పిస్తారు. ఎవరైతే దైవ భక్తి కలిగిన మంచి స్వభావము కలవారు ఉంటారో వారి నడవడిక కూడా బాగుంటుంది. తండ్రి ఒకవేళ మద్యము తాగితే పిల్లలకు కూడా ఆ సాంగత్యము అంటుకుంటుంది. దీనినే చెడు సాంగత్యము అని అంటారు ఎందుకంటే ఇది రావణ రాజ్యము కదా. తప్పకుండా ఒకప్పుడు రామ రాజ్యము ఉండేది కానీ అది ఎలా ఉండేది, దాని స్థాపన ఎలా జరిగింది, ఈ అద్భుతమైన విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్ (మధురము, ఇంకాస్త మధురము, అత్యంత మధురము) అని అంటారు కదా. తండ్రి స్మృతిలో ఉంటూనే మీరు పవిత్రముగా అయి ఇతరులను కూడా పవిత్రముగా తయారుచేస్తారు. తండ్రి కొత్త సృష్టిలోకి రారు. సృష్టిలో మనుష్యులు, జంతువులు, పంటపొలాలు మొదలైనవన్నీ ఉంటాయి. మనుష్యుల కొరకు అన్నీ కావాలి కదా. శాస్త్రాలలో ఇచ్చిన ప్రళయము యొక్క వృత్తాంతము కూడా తప్పే. వాస్తవానికి ప్రళయము జరుగదు. ఈ సృష్టి చక్రము అలా తిరుగుతూనే ఉంటుంది. పిల్లలు ఆది నుండి అంతిమము వరకు అన్నీ బుద్ధిలో ఉంచుకోవాలి. మనుష్యులకైతే అనేక రకాల చిత్రాలు గుర్తుకొస్తూ ఉంటాయి. అలాగే ఉత్సవాలు, తిరునాళ్ళు గుర్తుకొస్తూ ఉంటాయి. అవన్నీ హద్దులోనివి, మీది అనంతమైన స్మృతి, అనంతమైన సంతోషము, అనంతమైన ధనము. వీరు అనంతమైన తండ్రి కదా. హద్దులోని తండ్రి ద్వారా అన్నీ హద్దులోనివే లభిస్తాయి. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన సుఖము లభిస్తుంది. అసలు సుఖము అనేది ధనము ద్వారానే లభిస్తుంది. ధనమైతే అక్కడ అపారముగా ఉంటుంది. అక్కడ అంతా సతోప్రధానముగా ఉంటుంది. మేము ఇంతకుముందు సతోప్రధానముగా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ అలా తయారవ్వాలి అని మీ బుద్ధిలో ఉంది. ఇది కూడా మీకు ఇప్పుడు తెలుసు, మీలో కూడా నంబరువారుగా ఉన్నారు - స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్ (మధురము, ఇంకాస్త మధురము, అత్యంత మధురము) గా ఉన్నారు కదా. బాబా కన్నా మధురముగా అయ్యేవారు ఉంటే వారే ఉన్నత పదవిని పొందుతారు. ఎవరైతే అనేకుల కళ్యాణము చేస్తారో వారే స్వీటెస్ట్ (అత్యంత మధురమైనవారు). తండ్రి కూడా స్వీటెస్ట్ కదా, అందుకే అందరూ వారిని తలచుకుంటూ ఉంటారు. తేనె లేక పంచదార మొదలైనవాటినే స్వీటెస్ట్ అని అనరు. మనుష్యుల నడవడికను ఉద్దేశించి ఇలా అనడం జరుగుతుంది. ఇతడు నా స్వీట్ చైల్డ్ (మధురమైన బిడ్డ) అని అంటారు కదా. సత్యయుగములో అశాంతిని కలిగించే విషయమేదీ ఉండదు. అంత ఉన్నత పదవిని పొందేవారు తప్పకుండా ఇక్కడ పురుషార్థము చేసి ఉంటారు కదా.

మీకు ఇప్పుడు కొత్త ప్రపంచము గురించి తెలుసు. మీ కొరకు అయితే రేపే కొత్త ప్రపంచమైన సుఖధామములా ఉంటుంది. శాంతి ఎప్పుడు ఉండేది అనేది మనుష్యులకు తెలియనే తెలియదు. విశ్వములో శాంతి ఏర్పడాలి అని అంటూ ఉంటారు. పిల్లలైన మీకు తెలుసు - విశ్వములో ఒకప్పుడు శాంతి ఉండేది, దానిని ఇప్పుడు మళ్ళీ స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని అందరికీ ఎలా అర్థం చేయించాలి? మనుష్యులకు ఎంతో అవసరమైన పాయింట్లను మీరు వెలికి తీయాలి. విశ్వములో శాంతి ఏర్పడాలి అని దాని కోసం మొరపెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే అశాంతి చాలా ఎక్కువగా ఉంది. ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని ఎదురుగా పెట్టాలి. వీరి రాజ్యము ఉన్నప్పుడు విశ్వములో శాంతి ఉండేది, దానినే స్వర్గము, దైవీ ప్రపంచము అని అంటారు. అక్కడ విశ్వములో శాంతి ఉండేది. నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు. ఇది ముఖ్యమైన విషయము. విశ్వములో శాంతి ఎలా స్థాపన అవుతుంది అని ఆత్మలందరూ కలిసి అంటారు. ఆత్మలందరూ పిలుస్తూ ఉంటారు. కానీ మీరు ఇక్కడ విశ్వములో శాంతిని స్థాపన చేసే పురుషార్థము చేస్తున్నారు. ఎవరైతే విశ్వములో శాంతిని కోరుకుంటున్నారో, వారికి మీరు చెప్పండి - భారత్ లోనే ఒకప్పుడు శాంతి ఉండేది, భారత్ స్వర్గముగా ఉన్నప్పుడు శాంతి ఉండేది, ఇప్పుడు ఉన్నది నరకము, నరకమైన కలియుగములో అశాంతి ఉంది ఎందుకంటే ఇక్కడ ధర్మాలు అనేకమున్నాయి, ఇది మాయ రాజ్యము. భక్తి యొక్క వైభవ ప్రదర్శన కూడా ఉంది. రోజురోజుకు ఇది వృద్ధిని పొందుతూ ఉంటుంది. మనుష్యులు కూడా ఉత్సవాలు, తిరునాళ్ళు మొదలైనవాటికి వెళ్తూ ఉంటారు, అందులో ఏదో సత్యము తప్పకుండా ఉంటుందని భావిస్తారు. వాటి ద్వారా ఎవరూ పావనముగా అవ్వలేరని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పావనముగా అయ్యే మార్గాన్ని మనుష్యులెవ్వరూ తెలియజేయలేరు. పతిత-పావనుడు ఒక్క తండ్రియే. ప్రపంచము ఒక్కటే, కేవలం దీనిని కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము అని అంటారు. కొత్త ప్రపంచమున్నప్పుడు కొత్త భారత్, కొత్త ఢిల్లీ అని అంటారు. ఈ ప్రపంచము కొత్తదిగా మారనున్నది, అందులో మళ్ళీ కొత్త రాజ్యము ఉంటుంది. ఇక్కడ ఈ పాత ప్రపంచములో పాత రాజ్యము ఉంది. కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము అని దేనిని అంటారో కూడా మీకు తెలుసు. భక్తి విస్తారము ఎంత ఎక్కువగా ఉంది! దీనినే అజ్ఞానము అని అంటారు. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రియే. రామ రామ అని అనమని లేక ఇంకేదో చేయమని తండ్రి మీకు చెప్పడం లేదు. ప్రపంచ చరిత్ర మరియు భూగోళము ఏ విధంగా పునరావృతమవుతుందో పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఈ విద్యను ఇప్పుడు మీరు చదువుతున్నారు. దీని పేరే ఆత్మిక విద్య, ఆధ్యాత్మిక జ్ఞానము, దీని అర్థం కూడా ఇంకెవ్వరికీ తెలియదు. జ్ఞానసాగరుడు అని ఒక్క తండ్రినే అనడం జరుగుతుంది. వారు ఆత్మిక నాలెడ్జ్ ఫుల్ తండ్రి. తండ్రి ఆత్మలతో మాట్లాడుతారు. ఆత్మిక తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీరు భావిస్తారు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. ఆత్మిక జ్ఞానాన్నే ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు.

పరమపిత పరమాత్మ ఒక బిందువని, వారు ఇప్పుడు మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ ఆత్మలు చదువుతున్నారు అన్న విషయమును మీరు మర్చిపోకూడదు. ఆత్మలైన మనకు ఏ జ్ఞానమైతే లభిస్తుందో దానిని ఇతర ఆత్మలకు ఇస్తాము. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో ఉంటారో అప్పుడే స్మృతి అనేది నిలుస్తుంది. స్మృతిలో చాలా అపరిపక్వముగా ఉన్నారు, వెంటనే దేహాభిమానము వచ్చేస్తుంది. దేహీ-అభిమానులుగా అయ్యే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆత్మనైన నేను వీరితో ఒప్పందము కుదుర్చుకుంటున్నాను, ఆత్మనైన నేను వ్యాపారము చేస్తున్నాను, ఈ విధంగా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడములోనే లాభముంది. నేను యాత్రలో ఉన్నాను అని ఆత్మకు జ్ఞానము ఉంది. కర్మలైతే చేయవలసిందే. పిల్లలు మొదలైనవారిని కూడా సంభాళించాలి, వ్యాపార వ్యవహారాలు కూడా చేసుకోవాలి. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేసేటప్పుడు, నేను ఒక ఆత్మను అన్నది స్మృతిలో ఉండాలి, ఇది చాలా కష్టము. తండ్రి అంటారు, ఏ విధమైన తప్పుడు పనులు ఎప్పుడూ చేయకూడదు. అన్నింటికన్నా పెద్ద పాపము వికారాలు. అదే బాగా విసిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు పావనముగా అవుతామని ప్రతిజ్ఞ చేస్తారు. దాని స్మృతిచిహ్నమే ఈ రక్షాబంధనము. ఇంతకుముందు అయితే మీకు చాలా తక్కువ ధర కల రాఖీ లభించేది. బ్రాహ్మణులు వెళ్ళి రాఖీ కడుతూ ఉండేవారు. ఈ రోజుల్లోనైతే రాఖీలు కూడా ఎంత ఫ్యాషనబుల్ వి తయారుచేస్తున్నారు. వాస్తవానికి ఇది ఈ సమయము యొక్క విషయమే. మీరు తండ్రితో ఇలా ప్రతిజ్ఞ చేస్తారు - మేము ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళము, మీ నుండి విశ్వానికి యజమానులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటాము అని. తండ్రి అంటారు, 63 జన్మలు విషయ వైతరిణీ నదిలో మునుగుతూ వచ్చారు, ఇప్పుడు మిమ్మల్ని క్షీరసాగరములోకి తీసుకువెళ్తాను. వాస్తవానికి సాగరమేమీ లేదు, కేవలం దానితో పోల్చడం జరుగుతుంది. మిమ్మల్ని శివాలయములోకి తీసుకువెళ్తారు. అక్కడ అపారమైన సుఖము ఉంటుంది. ఇప్పుడు ఇది అంతిమ జన్మ. ఓ ఆత్మల్లారా, పవిత్రముగా అవ్వండి. తండ్రి చెప్పే మాటలు మీరు వినరా? మీ తండ్రియైన ఈశ్వరుడు చెప్తున్నారు - మధురమైన పిల్లలూ, వికారాలలోకి వెళ్ళకండి. జన్మ-జన్మాంతరాల పాపాలు తలపై ఉన్నాయి, అవి నన్ను స్మృతి చేయడం ద్వారానే భస్మమవుతాయి. కల్పక్రితము కూడా మీకు శిక్షణను ఇచ్చాను. బాబా, మేము మిమ్మల్ని స్మృతి చేస్తూ ఉంటాము అని మీరు బాబాకు గ్యారంటీ ఇచ్చినప్పుడే బాబా కూడా మీకు గ్యారంటీని ఇస్తారు. మీరు ఎంతగా స్మృతి చేస్తూ ఉండండి అంటే ఇక శరీర భావమే ఉండకూడదు. సన్యాసులలో కూడా కొందరు చాలా దృఢముగా, పక్కా బ్రహ్మజ్ఞానులుగా ఉంటారు. వారు కూడా అలా కూర్చుంటూ, కూర్చుంటూనే శరీరాన్ని వదిలివేస్తారు. ఇక్కడైతే మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు పావనముగా అయి వెళ్ళాలి. వారైతే వారి మతముపై నడుస్తూ ఉంటారు. వారేమీ శరీరాన్ని వదిలి ముక్తి-జీవన్ముక్తిలోకి వెళ్ళరు. అలా జరగదు. వారు మళ్ళీ ఇక్కడికే వస్తారు, కానీ వారి అనుచరులు అతను నిర్వాణాన్ని పొందారని భావిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరు, అలా వెళ్ళే నియమమే లేదు. వృక్షము తప్పకుండా వృద్ధిని పొందేది ఉంది.

ఇప్పుడు మీరు సంగమయుగములో కూర్చున్నారు, మిగిలిన మనుష్యులందరూ కలియుగములో ఉన్నారు. మీరు దైవీ సాంప్రదాయమువారిగా అవుతున్నారు. మీ ధర్మానికి చెందినవారు ఎవరైతే ఉన్నారో వారంతా వస్తూ ఉంటారు. దేవీ-దేవతల వంశవృక్షము కూడా అక్కడ ఉంది కదా. ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయి ఇతర ధర్మాలలోకి వెళ్ళిపోయారు, మళ్ళీ అందులో నుండి బయటికి వస్తారు. లేకపోతే వారి స్థానాన్ని ఎవరు నింపుతారు? తప్పకుండా వారు వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు మళ్ళీ వస్తారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఇతర ధర్మాలలోకి వెళ్ళిపోయినవారిలో నుండి చాలా మంచి-మంచి వారు కూడా వస్తారు, వారు వారి స్థానములోకి వచ్చేస్తారు. మీ వద్దకు ముస్లిములు మొదలైనవారు కూడా వస్తూ ఉంటారు కదా. చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఇక్కడికి ఇతర ధర్మాల వారు ఎలా వెళ్తున్నారు అని పరిశీలిస్తూ ఉంటారు. ఎమర్జెన్సీ సమయములోనైతే చాలామందిని పట్టుకుంటారు, మళ్ళీ డబ్బు లభించడంతో వారిని వదిలేస్తారు కూడా. కల్పపూర్వము ఏదైతే జరిగిందో దానిని మీరు ఇప్పుడు చూస్తున్నారు. కల్పపూర్వము కూడా ఇలాగే జరిగింది. మీరు ఇప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా, ఉత్తమ పురుషులుగా అవుతారు. ఇది సర్వోత్తమమైన బ్రాహ్మణుల కులము. ఈ సమయములో తండ్రి మరియు పిల్లలు ఆత్మిక సేవలో ఉన్నారు. పేదవారిని ధనవంతులుగా తయారుచేయడము - ఇది ఆత్మిక సేవ. తండ్రి కళ్యాణము చేస్తున్నారు కావున పిల్లలు కూడా ఇందులో సహాయము చేయాలి. ఎవరైతే అనేకులకు మార్గాన్ని తెలియజేస్తారో వారు చాలా ఉన్నత స్థానాన్ని చేరుకోగలుగుతారు. పిల్లలైన మీరు పురుషార్థము చేయాలి, అంతేకానీ చింతించకూడదు, ఎందుకంటే మీ బాధ్యత తండ్రిపై ఉంది. పురుషార్థము చాలా తీవ్రముగా చేయించడం జరుగుతుంది, ఇక ఆపై ఏ ఫలము లభించినా దానిని కల్పపూర్వము లభించిన దానిగానే భావించడం జరుగుతుంది. తండ్రి పిల్లలకు చెప్తున్నారు - పిల్లలూ, చింతించకండి. సేవలో కృషి చేయండి, కానీ ఎవరూ తయారవ్వకపోతే మీరేమి చేస్తారు! ఈ కులానికి చెందనివారు కాకపోతే ఇక మీరు ఎంత కష్టపడినా కానీ కొందరు మిమ్మల్ని తక్కువగా ఇబ్బందిపెడతారు, కొందరు ఎక్కువగా ఇబ్బందిపెడతారు. బాబా ఏమన్నారంటే - ఎప్పుడైతే దుఃఖాలు బాగా కలుగుతాయో, అప్పుడు మళ్ళీ వస్తారు. మీ శ్రమ ఏదీ వృధా అవ్వదు. మీ పని సరైన మార్గాన్ని తెలియజేయడము. శివబాబా అంటున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. భగవంతుడు తప్పకుండా ఉన్నారని చాలామంది అంటూ ఉంటారు. మహాభారత యుద్ధ సమయములో భగవంతుడు ఉన్నారని భావిస్తారు. కానీ అతను ఏ భగవంతుడు అన్న విషయములోనే తికమకపడ్డారు. శ్రీకృష్ణుడు అయితే అక్కడ ఉండరు. శ్రీకృష్ణుడు అవే పోలికలతో మళ్ళీ సత్యయుగములోనే ఉంటారు. ప్రతి జన్మలోనూ పోలికలు మారుతూ ఉంటాయి. సృష్టి ఇప్పుడు పరివర్తన అవుతూ ఉంది. పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచముగా ఇప్పుడు భగవంతుడు ఏ విధంగా తయారుచేస్తున్నారు అనేది ఎవ్వరికీ తెలియదు. చివరికి మీ పేరు ప్రసిద్ధమవుతుంది. స్థాపన జరుగుతోంది, ఆ తరువాత వీరు రాజ్యము చేస్తారు, మళ్ళీ వినాశనము కూడా జరుగుతుంది. ఒకవైపు కొత్త ప్రపంచాన్ని, ఇంకొకవైపు పాత ప్రపంచాన్ని చూపించే ఈ చిత్రము చాలా బాగుంది. బ్రహ్మా ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనము... అని అంటారు కూడా. కానీ ఏమీ అర్థం చేసుకోరు. ముఖ్యమైన చిత్రము త్రిమూర్తి చిత్రము. ఉన్నతోన్నతమైనవారు శివబాబా. శివబాబా బ్రహ్మా ద్వారా మనకు స్మృతియాత్రను నేర్పిస్తున్నారని మీకు తెలుసు. బాబాను స్మృతి చేయండి, యోగము అన్న పదము కష్టముగా అనిపిస్తుంది. స్మృతి అన్న పదము చాలా సహజమైనది. బాబా అనే పదము చాలా ప్రియమైనది. ఏ తండ్రి నుండైతే విశ్వ రాజ్యాధికారము లభిస్తుందో, ఆత్మలమైన మేము ఆ తండ్రిని స్మృతి చేయలేకపోతున్నామే అని మీ అంతట మీకే సిగ్గు కలుగుతూ ఉంటుంది. తండ్రి కూడా అంటారు, నీవు బుద్ధిహీనుడివి, తండ్రిని స్మృతి చేయలేకపోతే వారసత్వాన్ని ఎలా పొందుతావు? వికర్మలు ఎలా వినాశనమవుతాయి? మీరు ఆత్మ, మీ పరమపిత పరమాత్మనైన నేను అవినాశీని కదా. మేము పావనముగా అయి సుఖధామములోకి వెళ్ళాలి అని మీరు కోరుకుంటే మరి శ్రీమతముపై నడవండి. తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. స్మృతి చేయకపోతే వికర్మలు ఎలా వినాశనమవుతాయి! అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అన్ని రకాలుగా పురుషార్థము చేయాలి, చింతించకూడదు ఎందుకంటే స్వయంగా తండ్రియే మన బాధ్యతను వహిస్తున్నారు. మనము చేసేది ఏదీ వృధా అవ్వదు.

2. తండ్రి సమానముగా చాలా చాలా మధురముగా తయారవ్వాలి. అనేకుల కళ్యాణము చేయాలి. ఈ అంతిమ జన్మలో పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. వ్యాపార-వ్యవహారాలు చేసుకుంటూ - నేను ఒక ఆత్మను అని అభ్యాసము చేయాలి.

వరదానము:-
ప్రవృత్తి యొక్క విస్తారములో ఉంటూ ఫరిశ్తాతనాన్ని సాక్షాత్కారము చేయించే సాక్షాత్కారమూర్త భవ

ప్రవృత్తి యొక్క విస్తారము ఉన్నప్పటికీ విస్తారాన్ని సర్దిపెట్టుకునే మరియు ఉపరామముగా ఉండే అభ్యాసాన్ని చేయండి. ఇప్పుడిప్పుడే స్థూల కార్యాలను చేయడము, ఇప్పుడిప్పుడే అశరీరిగా అవ్వడము - ఈ అభ్యాసము ఫరిశ్తాతనాన్ని సాక్షాత్కారము చేయిస్తుంది. ఉన్నతమైన స్థితిలో ఉండటం వలన చిన్న-చిన్న విషయాలు వ్యక్త భావము కలవిగా అనుభవమవుతాయి. ఉన్నతిలోకి వెళ్ళినట్లయితే నీచత్వము స్వతహాగానే దూరమవుతుంది. శ్రమ నుండి రక్షింపబడతారు. సమయము కూడా మిగులుతుంది, సేవ కూడా ఫాస్ట్ గా జరుగుతుంది. బుద్ధి ఎంత విశాలముగా అవుతుందంటే ఇక ఒకే సమయములో అనేక కార్యాలు చేయగలుగుతారు.

స్లోగన్:-
సంతోషాన్ని స్థిరముగా ఉంచుకునేందుకు ఆత్మ రూపీ దీపములో జ్ఞానమనే తైలాన్ని ప్రతిరోజూ వేస్తూ ఉండండి.

అవ్యక్త సూచనలు - సహజయోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి

పిల్లలపై బాబాకు ప్రేమ ఉంది, అందుకే వారు సదా ఏమంటారంటే - పిల్లలూ, మీరు ఎవరైనా, ఎలా ఉన్నా సరే మీరు నా వారే. అలా మీరు కూడా సదా ప్రేమలో లవలీనులై ఉండండి. బాబా, మీరు ఎవరైనా అంతా మీరే అని మనస్ఫూర్తిగా అనండి. ఎప్పుడూ అసత్య రాజ్యము యొక్క ప్రభావములోకి రాకండి. శ్రేష్ఠ భాగ్య రేఖను గీసుకునే కలమును బాబా పిల్లలైన మీ చేతికి ఇచ్చారు. మీరు ఎంత కావాలంటే అంత భాగ్యాన్ని తయారుచేసుకోవచ్చు.