‘‘పూర్వజుడను మరియు పూజ్యుడను అన్న స్వమానములో ఉంటూ
మనసా ద్వారా సర్వుల పాలన చేయండి, పూర్తి వృక్షానికి సకాష్ ను
అందించండి’’
ఈ రోజు బాప్ దాదా తమ నలువైపులా ఉన్న పూర్వజ మరియు పూజ్య
ఆత్మలను చూస్తున్నారు. తమను తాము పూర్వజ ఆత్మలుగా
భావిస్తున్నారు కదా. పూజ్య ఆత్మల నివాసము ఎక్కడ? మీ వృక్షాన్ని
ఎదురుగా తీసుకురండి, అందులో చూడండి, మీ స్థానము ఎక్కడ ఉంది?
పూర్వజులైన మీ స్థానము వేర్ల స్థానములో ఉందని మీకు తెలుసు కదా.
మీ స్థానము వృక్షములోని వేర్లలో కూడా ఉంది మరియు కాండములో కూడా
ఉంది. వేర్ల ద్వారానే పూర్తి వృక్షానికి పాలన లభిస్తుంది.
కావున మీరు ఈ వృక్షము యొక్క కొమ్మలు-రెమ్మలకు మరియు ఆకులకు
పాలనను అందించే, సకాష్ ను ఇచ్చే పూర్వజులు. పూర్వజులతోపాటు మీరు
పూజ్యులు కూడా. కాండము ద్వారా చివరి ఆకుకు కూడా సకాష్
లభిస్తుంది. మరి స్వయాన్ని పూర్తి వృక్షానికి సకాష్ ను
ఇచ్చేవారిగా అనుభవం చేస్తున్నారా? పూర్వజులమైన మేము సర్వ ఆత్మల
రూపీ కొమ్మలు-రెమ్మలకు మరియు ఆకులకు సకాష్ ఇస్తున్నాము అన్న నషా
ఉంటుందా! ఎలా అయితే బ్రహ్మాబాబాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్
అని అంటారో, అలాగే వారి పిల్లలు, సహచరులైన మీరు కూడా మాస్టర్
గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్లు. పూర్తి వృక్షములోని ఆత్మలకు
పూర్వజ ఆత్మలైన మీ పట్ల ఆకర్షణ ఉంది. పూర్వజ ఆత్మలైన మీరు వారి
పాలనను శక్తుల ద్వారా చేస్తున్నారు. ఎలా అయితే పూర్వజ ఆత్మలైన
మీ అందరి పాలనను బాబా చేసారు, బాబా ఎలా చేసారు? శక్తుల ద్వారా.
అలాగే మీరు కూడా పూర్వజులము అన్న సంబంధముతో శక్తుల ద్వారా వారి
పాలనను చేసేవారు. ఈ రోజుల్లో ఆత్మలందరూ దుఃఖితులుగా ఉన్నారు,
తమ-తమ దేవీ-దేవతలను పిలుస్తూ ఉన్నారు - రండి, మమ్మల్ని
రక్షించండి, మాకు శాంతిని ఇవ్వండి, మాకు శక్తిని ఇవ్వండి, ఓ
క్షమా సాగరులైన పూర్వజుల్లారా, మాకు పాలనను ఇవ్వండి అని మొర
పెట్టుకుంటున్నారు. ఈ పిలుపు పూర్వజ ఆత్మలైన మీ చెవులకు
వినిపిస్తుందా? మేమే పూర్వజులము అని అనుభవం చేస్తున్నారా?
పూర్తి వృక్షములో చూడండి, ఇతర ధర్మానికి చెందిన ఆత్మలు కూడా
వృక్షములో కొమ్మలు-రెమ్మల స్థానములో ఉన్న కారణముగా వారు కూడా
మిమ్మల్ని ఈ దృష్టితోనే చూస్తున్నారు. వారికి కూడా పూర్వజులు
మీరే. ఏ ధర్మానికి చెందిన ఆత్మలను మీరు కలిసినా సరే, వీరు కూడా
మా వృక్షానికి చెందిన కొమ్మలు-రెమ్మలే అని భావిస్తున్నారా! వారు
కూడా మిమ్మల్ని కలుసుకున్నప్పుడు వీరు మా వారే అని భావిస్తారు!
మా వారు అన్న భావన ఆ ఆత్మలకు కూడా కలుగుతుంది మరియు కలగాలి కూడా.
మరి అంతటి నషా, అంతటి దయ మీ లోపలి నుండి వస్తున్నాయా? వారు -
దయ చూపించండి అని మొర పెట్టుకుంటున్నారు... ఇప్పుడు
సమయమనుసారముగా పూర్వజ ఆత్మలైన మీ అందరూ మనసా ద్వారా శక్తుల
పాలనను ఇవ్వాలి. వారికి అవసరముంది. ఎంతగా మీరు మీ పూర్వజ స్థితి
యొక్క నషాలో ఉంటారో, అంతగానే మీ ద్వారా వారి పాలన జరుగుతుంది.
మామూలుగా కూడా చూడండి, ఎవరి పాలన అయినా, లౌకికములోనైనా కూడా,
పాలన పెద్దవారి ద్వారానే జరుగుతుంది. పెద్దవారే వారి జీవితానికి
కావలసిన ఆహార-పానీయాలు, ఆదాయానికి ఆధారమైన చదువు కోసం ఏర్పాట్లు
చేస్తారు. ఏ విధముగా బాబా పిల్లలైన మీ అందరికీ భిన్న-భిన్న
శక్తులతో పాలన చేసారో, అదే విధముగా ఇప్పుడు మీ కర్తవ్యము -
మొత్తము వృక్షము యొక్క కొమ్మలు-రెమ్మలకు మరియు ఆకులకు పాలన
చెయ్యడము. ఇంతటి ఉల్లాసము పూర్వజ ఆత్మలైన మీకు వస్తుందా? నషా
ఉందా? అలాగే మీరు పూజ్యులు కూడా. చూడండి, పూర్తి డ్రామాలో ఎంతగా
ఆత్మలైన మీకు పద్ధతి అనుసారముగా పూజ జరుగుతుందో, అంతగా మరే ఇతర
మహాత్ములకు గాని, ధర్మపితలకు గాని జరగదు. మీ పూజ నియమానుసారముగా
ఉంటుంది, హారతి ఇవ్వడము, నైవేద్యము అర్పించడము, ఈ విధముగా
మరెవ్వరికీ జరగదు. మహిమ కూడా చూడండి, మీకు పద్ధతి ప్రకారముగా
కీర్తన జరుగుతుంది. మరెవ్వరికీ ఈ విధముగా మహిమ జరగదు. మీరు
పూర్వజులతో పాటు పూజ్యులు కూడా. డ్రామాలో మీకు జరిగేటువంటి పూజ
మరియు మహిమ మరెవ్వరికీ లేదు.
బాప్ దాదా ఇటువంటి పూజ్య మరియు పూర్వజ ఆత్మలైన మిమ్మల్ని
చూసి ఎంతగా సంతోషిస్తారు! బాబా హృదయము నుండి పదే-పదే ఇదే పాట
వస్తుంది - వాహ్, నా పూర్తి వృక్షానికి పూర్వజ మరియు పూజ్య
ఆత్మల్లారా వాహ్! ఈ రోజుల్లో బాప్ దాదా పిల్లలైన మీ అందరినీ మీ
స్వమానము ఏదైతే ఉందో - బాబా సమానముగా సంపన్నముగా మరియు
సంపూర్ణముగా అవ్వాలి అని, ఆ రూపాన్నే చూడాలని కోరుకుంటున్నారు.
దీని కోసం పిల్లలు ఒక్క విషయము పట్ల శ్రద్ధ పెట్టాలి. బాప్ దాదా
చూసారు, పిల్లలందరూ పురుషార్థాన్ని చాలా బాగా చేస్తారు కూడా,
కానీ ‘సదా’ అన్న పదాన్ని ప్రతి ఒక్కరూ తమ పురుషార్థములో
చేర్చాలి. అటెన్షన్ పెట్టాలి. బాప్ దాదా పిల్లలను అడుగుతున్నారు.
ఎలా అయితే బాప్ దాదా పిల్లలైన మీ అందరినీ శ్రేష్ఠ స్వమానధారీ
ఆత్మ రూపములో చూస్తారో, అలాగే మీరు స్వయాన్ని కూడా అటువంటి
స్వమానధారిగా భావిస్తున్నారా?
బాప్ దాదా చూసారు - పిల్లలు కూడా ఇప్పుడు తమ రాజ్యానికి
వెళ్ళాలని కోరుకుంటున్నారు. ‘‘ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి’’.
ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు తిరుగు ప్రయాణమవ్వాలి అన్న ఈ
పాటను కూడా మనసులో పాడుకుంటూ ఉంటారు. దీని కోసం బాప్ దాదా
ముందుగానే చెప్పి ఉన్నారు - పూర్తి సమయమంతా స్వయాన్ని ఏదో ఒక
సేవలో బిజీగా పెట్టుకోండి. బాప్ దాదా చూసారు - సేవ పట్ల అభిరుచి,
సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలు ఇప్పటికీ పిల్లల్లో ఉన్నాయి. మంచి
సేవా సమాచారాన్ని కూడా బాప్ దాదా వింటూ ఉంటారు. కానీ బాప్ దాదా
తీవ్ర గతితో ముందుకు వెళ్ళడానికి పిల్లలకు విశేషమైన అటెన్షన్
ను ఇప్పిస్తున్నారు - కేవలం ఒక్క వాచా సేవ మాత్రమే చెయ్యకండి,
సేవ చేస్తున్నట్లయితే ఒకే సమయములో మూడు సేవలనూ కలిపి చేయండి -
మనసా ద్వారా సకాష్ ను ఇవ్వండి, వాచా ద్వారా జ్ఞానాన్ని ఇవ్వండి
మరియు కర్మణా ద్వారా అనగా మీ సంపర్కము ద్వారా, సంబంధము ద్వారా,
ముఖము ద్వారా ఎటువంటి సేవను చేయండి అంటే దాని ప్రభావము కూడా
సేవలో ఉండాలి. ఒకే సమయములో మూడు సేవలను కలిపి చేయండి ఎందుకంటే
ఇప్పుడు సేవలో కొంచెం మార్పు రావాలని, కొంచెం మారాలని ఆత్మలు
కోరుకుంటున్నారు. మరి ఒకే సమయములో మూడు సేవలనూ చెయ్యగలరా?
చెయ్యగలరా? చెక్ చేసుకుంటూ ఉన్నారా - వాచా సేవ చేస్తున్నప్పుడు
ఆ సమయములో మనసా ద్వారా మరియు కర్మణా అనగా సంబంధ-సంపర్కాల ద్వారా
కూడా సేవ జరుగుతుందా! కలిపి జరుగుతున్నాయా! మేము ఒకే సమయములో
మూడు సేవలను చేస్తున్నాము అని ఎవరైతే భావిస్తున్నారో, వారు
చేతులెత్తండి. ఒకే సమయములో మూడు సేవలు. మరి ఇప్పుడు అటెన్షన్
ప్లీజ్. అప్పుడప్పుడు కాదు. ఏమి జరుగుతుందంటే, సేవ అయితే
చేస్తారు కానీ సేవతో పాటు స్వయములో మరియు తోటివారిలో సంతుష్టత
ఉండాలి ఎందుకంటే సేవకు ఫలము సంతుష్టత మరియు సంతోషము. కావున చెక్
చేసుకోండి, సేవ అయితే చేసారు కానీ ఇంతకుముందు కూడా వినిపించాము,
సేవలో సంతోషము ఎప్పుడు కలుగుతుందంటే స్వయము, తోటివారు మరియు
వాయుమండలము అన్నింటిలోనూ సంతుష్టతా వైబ్రేషన్లు ఉండాలి. సేవలో
సఫలత కోసం మూడు విషయాలను విశేషముగా వినిపించాము, గుర్తుండే
ఉంటాయి కదా. ఒకటి - సేవ అనగా నిమిత్త భావము. రెండు - నిర్మాన
భావన. మూడు - నిర్మల వాణి. భావము, భావన మరియు స్వభావము. ఈ మూడూ
కలిసి సేవలో ఉన్నట్లయితే స్వయము కూడా సంతుష్టముగా ఉంటారు,
తోటివారు కూడా సంతుష్టముగా ఉంటారు మరియు ఎవరి సేవనైతే చేసారో
వారు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. నిమిత్త భావము ఉన్నవారు బాబా
వైపు సంబంధాన్ని జోడిస్తారు. ఒకవేళ నిమిత్త భావము లేకపోతే
బాబాకు అంత సమీపముగా రారు. కావున ఎప్పుడు సేవ చేసినా చెక్
చేసుకోండి - భావము, భావన మరియు స్వభావము సరిగ్గా ఉన్నాయా? మరియు
ఈ రోజుల్లో బాప్ దాదా చూసారు - బాప్ దాదా చెప్పిన ముఖ్యమైన
విషయము ఏదైతే ఉందో - ప్రతి ఒక్కరూ మరియు స్వయము కూడా, సేవ కోసం
ఎక్కడికి వెళ్ళినా కానీ చెక్ చేసుకోండి, మీ తోటివారు
సంతుష్టముగా ఉన్నారా? ఎందుకంటే సేవలోని సఫలత ఏమిటంటే, సంతుష్టతా
ఫలము ప్రాప్తించడము, సంతోషము ప్రాప్తించాలి. దానితో పాటు బాప్
దాదా ఒక విషయములో సూచనను ఇస్తున్నారు - నడుస్తూ, తిరుగుతూ,
సంగఠనలో కూడా ఉంటారు, తోడుగా ఏదో ఒక సేవ కూడా జరుగుతూ ఉంటుంది,
అటువంటి సమయములో ఇతరులను ఆత్మ రూపములో చూడండి. ఆత్మ రూపములో
చూస్తారు కూడా, అభ్యాసము కూడా చేస్తారు, కానీ ఎప్పుడైతే ఆత్మను
చూస్తున్నారో, అప్పుడు ఆత్మను నిజ సంస్కారాలతో చూస్తున్నారా?
లేక మిక్స్ సంస్కారాలేవైతే ఉన్నాయో, అవి కూడా కనిపిస్తున్నాయా?
ఆత్మను చూడటములో పాస్ అయ్యారు, కానీ ఏ సంస్కారాలను వారిలో
చూస్తున్నారు? ఆ ఆత్మ యొక్క నిజ సంస్కారాలతో కనెక్షన్ లోకి
వస్తున్నారా? లేక వారి వర్తమాన సంస్కారాలు కూడా ఎదురుగా
వస్తున్నాయా? బాబా అంటున్నారు, ఈ రోజు నుండి ఎవరినైనా సరే,
ఆత్మ రూపములో చూడండి, అంతేకాక ఆ ఆత్మ యొక్క నిజ సంస్కారాలేవైతే
ఉన్నాయో, ఆ రూపములో చూడండి. అప్పుడు ఇక ఎప్పుడూ కూడా పరస్పరంలో
జరిగే కొన్ని-కొన్ని విషయాలేవైతే ఉన్నాయో అవి జరగవు. ఇప్పుడు
ఆత్మ రూపములో అయితే చూస్తున్నారు కానీ దానితోపాటు వర్తమాన
సంస్కారాలు కూడా ఎదురుగా వస్తున్నాయి. కావున పరస్పరంలో ఏదైతే
సంపూర్ణ స్థితి ఉండాలో, అందులో దూరం ఏర్పడుతుంది. కావున నిజ
సంస్కారాలు కలిగిన ఆత్మను చూడండి. అప్పుడు సంగఠనలో ఏదైతే ఆటంకము
వస్తుందో, ఆ ఆటంకము సమాప్తమైపోతుంది.
ఈ బ్రాహ్మణ పరివారము శ్రేష్ఠ పరివారము. పరివారానికి చాలా
మహిమ ఉంది. ఈ ఈశ్వరీయ పరివారము పదే-పదే లభించదు. కల్పములో ఒకే
ఒక్కసారి ఈ ఈశ్వరీయ పరివారము లభించింది, ఇంత పెద్ద పరివారము
మొత్తము కల్పములో ఇంకెప్పుడూ లభించదు. పరివారము యొక్క విశేషతను
తెలుసుకోవటము మరియు పరివారములో నడుచుకోవటము, ఇది ఒక గొప్ప
సబ్జెక్ట్. ఈ జ్ఞానానికి పునాది నిశ్చయము అని ఇంతకుముందు కూడా
వినిపించాము కదా. ఆ నిశ్చయములో నాలుగు విషయాలు ఉన్నాయి. బాబా
మరియు దాదా పట్ల నిశ్చయమైతే ఎలాగూ ఉండాలి, దానితోపాటు జ్ఞానములో,
డ్రామాలో, పరివారములో అన్నింటిలోనూ నిశ్చయము ఉండాలి. కావున
నిశ్చయబుద్ధి కలవారిగా అయినప్పుడు సహజ పురుషార్థులుగా అయిపోతారు.
ఏ విధముగా బాప్ దాదాపై నిశ్చయము ఉందో, అలా పరివారముపై కూడా
నిశ్చయము తప్పకుండా ఉండాలి. మామూలుగా కూడా చూడండి, మీరు
దేనినైనా ప్యాకింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారు? నాలుగు వైపులా
టైట్ గా చేస్తారు కదా, ఒకవేళ ఒకవైపు టైట్ చేయకపోయినా సరే అలజడి
అయిపోతుంది. అలాగే బాబా, జ్ఞానము, జ్ఞానములో కూడా విశేషముగా
డ్రామా మరియు పరివారము. ఒకవేళ ఈ నాలుగు విషయాలు దృఢముగా
లేనట్లయితే విఘ్నాలు వస్తాయి. విఘ్నాలను దాటి వేయడము పట్ల
అటెన్షన్ పెట్టవలసి ఉంటుంది. అందుకే పరివారాన్ని తెలుసుకోవటము,
పరివారము పట్ల ప్రేమ, ఒకరినొకరు అర్థం చేసుకోవటము - ఇది చాలా
అవసరము.
మీరు పూర్వజులు, పూజ్యులు. కావున ఈ విషయాలను కూడా స్వయములో
మరియు సహచరులలో తీసుకుని రావాలి. ఏమైనా గాని, నంబరువారుగా అయితే
ఉన్నారు కదా! కానీ బ్రాహ్మణ పరివారపు విశేష కార్యము ఆశీర్వాదాలు
ఇవ్వటము మరియు ఆశీర్వాదాలు తీసుకోవటము. కొంతమంది పిల్లలు
ఏమంటారంటే, ఇతరులు క్రోధము చేసినప్పుడు వారు ఆశీర్వాదాలను ఎలా
తీసుకుంటారు! వారు ఆశీర్వాదాలు తీసుకోరు, క్రోధము చేస్తారు.
బాప్ దాదా ఏమంటున్నారంటే - సరే, సంస్కారానికి వశమై వారు
శాపనార్థాలు ఇస్తున్నారు, మీరు ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నారు
కానీ వారు శాపనార్థాలు ఇస్తున్నారు. అప్పుడు ఆ శాపనార్థాలను
తీసుకునేది ఎవరు? తీసుకునేది మీరా లేక వారా? వారు ఇచ్చేవారు,
మీరు తీసుకునేవారు. మరి వారి శాపనార్థాలను మీరెందుకు
తీసుకున్నారు? ఒకవేళ ఆ ఆత్మను వారి నిజ సంస్కారాలతో చూస్తే మీకు
దయ కలుగుతుంది. స్వయము కూడా సురక్షితముగా ఉండండి, శాపనార్థాలను
తీసుకోకండి. తీసుకునేవారు మీరు. శాపనార్థాలను ఇవ్వకండి,
తీసుకోకండి.
బాప్ దాదా ఈ రోజు పిల్లలందరికీ హోమ్ వర్క్ ఇస్తున్నారు,
ఎప్పుడైనా ఎవరినైనా సరే, ఆత్మ రూపములో చూడండి, వారి వర్తమాన
సంస్కారాల రూపములో చూడకండి. ఆత్మ అని అన్నప్పుడు ఆ ఆత్మ యొక్క
నిజ సంస్కారాలేవైతే ఉన్నాయో, ఆ నిజ సంస్కారాల రూపముతోనే
సంబంధములోకి కూడా రండి మరియు దృష్టిలో కూడా ఆ దృష్టితోనే
చూసినట్లయితే ఈ విఘ్నాలేవైతే కలుగుతున్నాయో, వేటి కారణముగానైతే
పురుషార్థములో తీవ్రత రావటము లేదో, ఇక అప్పుడు వృత్తి మారుతుంది,
దృష్టి మారుతుంది కావున విషయాలు సమాప్తమైపోతాయి. ఎవరిలో ఎటువంటి
విషయాలను చూసినా కానీ, బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పారు, సదా
బ్రాహ్మణ పరివారములోని ప్రతి ఒక్కరి కర్తవ్యము ఏమిటంటే - శుభ
భావనను, శుభ కామనను ఇవ్వటము మరియు శుభ భావనను, శుభ కామనను
తీసుకోవటము. ఆ సంస్కారముతో చూడండి మరియు నడుచుకోండి. మరొక
విషయాన్ని కూడా చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పాను,
అక్కడక్కడ సంగఠనలో ఒక్కోసారి పరదర్శన, పరచింతన మరియు పరమతము
వైపుకు ఆకర్షితులవుతారు. ఇప్పుడు పర అనేటువంటి ఈ మూడింటినీ కట్
చేయండి, ఒక్క పరను ఉంచండి, ఆ ఒక్క పర ఏమిటంటే - పర ఉపకారము. పర
ఉపకారము చేయాలి, మీరు పర ఉపకారులు, బ్రాహ్మణుల స్వభావము పర
ఉపకారము. పర దర్శనము కాదు, ఈ పరను కట్ చేయండి. ఈ మూడూ చాలా
నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే సదా మీ ఈ స్వమానాన్నే
గుర్తుంచుకోండి - బ్రాహ్మణ ఆత్మనైన నా స్వమానమే ‘పర ఉపకారి’.
రాబోయే సీజన్ లో బాప్ దాదా ప్రతి బిడ్డలోనూ ఈ పరివర్తనను
చూడాలని కోరుకుంటున్నారు, వీలవుతుందా? బాప్ దాదా అభినందనలు
తెలియజేస్తున్నారు, పరస్పరములో ఒకరికొకరు అటెన్షన్ ను
ఇప్పించుకుంటూ ఉండండి. ఏం చేయాలి? ప్రతిరోజూ రాత్రి పడుకునే
ముందు బాప్ దాదాకు గుడ్ నైట్ చెప్పేకంటే ముందు మీ మొత్తము
రోజంతటి లెక్కాపత్రాన్ని వారి ముందు ఉంచండి. మంచి చేసారా లేక
చెడు చేసారా? ఏది చేస్తే ఆ లెక్కాపత్రాన్ని బాప్ దాదాకు అందించి
మీ బుద్ధిని ఖాళీ చేసుకుని గుడ్ నైట్ చెప్పండి మరియు బాబా
స్మృతిలోనే నిద్రపోండి. అప్పుడు మీ నిద్ర చాలా బాగా ఉంటుంది.
మొదట స్వయాన్ని ఖాళీ చేసుకోవాలి, బుద్ధిలో ఏ విషయాన్నీ
ఉంచుకోకూడదు, వారిని తండ్రి రూపములో చూస్తూ మొత్తము
లెక్కాపత్రాన్ని సత్యమైన హృదయముతో వారి ముందు ఉంచినట్లయితే మీకు
ధర్మరాజుపురిలోకి వెళ్ళాల్సిన అవసరము రాదు. సత్యమైన హృదయముపై
సాహెబు రాజీ అవుతారు. హోమ్ వర్క్ లభించింది కదా! ఒకటి,
నడుస్తూ-తిరుగుతూ మీ పూర్వజ మరియు పూజ్య స్వరూపపు సేవను
చెయ్యగలరు. బాబా చూసారు - ఈ జానకి బచ్చీ ఆరోగ్యము బాగా
లేకపోయినా కానీ, కరాచీ సేవలో విశేషముగా మనసా సకాష్ ను అందించారు,
ఎవరు నిమిత్తమైనా కానీ వీరు ప్రాక్టికల్ గా చేసారు. అక్కడి
ఆత్మలకు సకాష్ లభించింది, మరియు ఉల్లాసములో ఇంకా, ఇంకా ముందుకు
వెళ్తున్నారు. ఈ విధముగా బాప్ దాదా ప్రాక్టికల్ ఉదాహరణను చూసారు.
కావున మీరందరూ కూడా చెయ్యగలరు. దుఃఖితులకు, మొర
పెట్టుకుంటున్నవారికి సంతోషపు అలను చేర్చగలరు. మా దేవి, మా
దేవత ఎప్పుడు వచ్చి దయ చూపిస్తారు అని మీ భక్తులు మిమ్మల్నే
పిలుస్తూ ఉన్నారు. మీకు వినిపించటం లేదు కానీ బాబాకు చాలా
వినిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇష్టదైవాన్ని పిలుస్తున్నారు.
మీ భక్తులు ఎవరు అనేది మీకు తెలియదు కానీ భక్తులకైతే మీరు
తెలుసు కదా. వారైతే పిలుస్తున్నారు మరియు బ్రాహ్మణ ఆత్మలైన
మీలోని ప్రతి ఒక్కరికీ భక్తులు ఉన్నారు. మీరు ఢీలాగా ఉన్నా,
తెలివైనవారిగా ఉన్నా కానీ మీకు కూడా భక్తులు ఉన్నారు, ఎందుకంటే
వేర్ల స్థానములో కూర్చుని ఉన్నారు కదా. కావున మీది సకాష్ ఇచ్చే
పాత్ర. ఇప్పుడు మనసా సేవను పెంచండి. మరియు ఎంతగా బిజీగా ఉంటారో,
అంతగా నిర్విఘ్నముగా ఉంటారు. చెయ్యగలరు కదా! మనసా సేవను చెయ్యటం
తెలుసు కదా! మంచిది. నియమపూర్వకముగా చేస్తుంటారా లేక
అప్పుడప్పుడూ చేస్తుంటారా? ఒకవేళ అప్పుడప్పుడు చేస్తున్నట్లయితే
దానిని రెగ్యులర్ చేయండి మరియు ఒకవేళ కొద్దిగా చేస్తున్నట్లయితే
దానిని మరింత పెంచండి. ఎందుకంటే మొత్తము కల్పానికి ఆధారము
ఇప్పటి సేవా ఫలమే. పూజారిగా అయినా లేక రాజ్య అధికారిగా అయినా,
రెండింటికీ ఆధారము ఇప్పటి సేవ, ఇప్పటి అవస్థ, ఇప్పటి మాట,
ఇప్పటి సంబంధ-సంపర్కాలు. అందుకే బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు
- ఇప్పుడు ఎంత శాతము ఉందో దానికంటే ఎక్కువ పెరగాలి. మామూలుగా
కూడా, బాప్ దాదా మొదటి నుండి కూడా చెప్తూ ఉన్నారు, చెయ్యాలంటే
ఇప్పుడే చేయండి, మరెప్పుడో కాదు. బాప్ దాదాకు ‘ఎప్పుడో’ అన్న
పాటను చాలా వినిపిస్తూ ఉంటారు. దానిని చాలా మంచిగా చేసి
వినిపిస్తుంటారు కానీ బాప్ దాదాకు ఈ ‘ఎప్పుడో’ అన్న పాట బాగా
అనిపించదు. ‘ఇప్పుడే, ఇప్పుడే’ అన్న పాట బాగా అనిపిస్తుంది.
త్వరిత దానము మహాపుణ్యము. మరి ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థమైందా?
అచ్ఛా!
బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలందరినీ చూసి సంతోషిస్తారు
కూడా ఎందుకంటే బాప్ దాదా పిల్లలు లేనిదే ఒంటరిగా ఏమీ
చెయ్యాలనుకోరు. అందుకే ప్రతి రోజూ పిల్లలను ఆహ్వానిస్తూ ఉంటారు.
తీవ్ర పురుషార్థీ పిల్లలూ, మధురమైన పిల్లలూ, ప్రియమైన పిల్లలూ,
ఇప్పుడు పదండి. అచ్ఛా!
నలువైపులా ఉన్న పిల్లలను చూసి బాప్ దాదా, సమ్ముఖములో
కూర్చుని ఉన్నా లేక ఎక్కడ కూర్చుని ఉన్నా, అందరికీ తండ్రి
గుర్తున్నారు. మరి బాబాకు కూడా ఎవరు గుర్తున్నారు? నలువైపులా
ఉన్న పిల్లలు గుర్తున్నారు ఎందుకంటే బాబా ప్రతి బిడ్డ కోసం ఇదే
ఆశను పెట్టుకుంటారు - ప్రతి బిడ్డ బాబా సమానముగా అవ్వాల్సిందే.
బాబాకు ప్రతి బిడ్డ పట్ల ఆశలు ఉన్నాయి, పిల్లలు నంబరువారుగా
ఉన్నారు అని వారికి తెలుసు, అయినా కానీ తమ నంబరు అనుసారముగానైనా
సరే సంపన్నముగా అవ్వాల్సిందే కదా. ఏమేమి చేస్తున్నారు అనేది
ప్రతి ఒక్కరి పురుషార్థము ద్వారా కూడా చూస్తూ ఉంటారు. బాబాకు
చాలా ప్రేమ కలుగుతుంది. పిల్లలు కష్టపడుతున్నప్పుడు - నా
పిల్లలు కష్టము నుండి దూరమవ్వాలి, ప్రేమలో నిమగ్నమైపోవాలి అని
చాలా ప్రేమ కలుగుతుంది. ప్రేమలో మెజారిటీ పాస్ అయ్యారు కానీ
విషయాలలోకి వచ్చినప్పుడు బాబాను మర్చిపోతారు.
నలువైపులా ఉన్న పిల్లలు బాప్ దాదా యొక్క పదమాల, పదమాల రెట్ల
ప్రేమను, హృదయపూర్వక అనురాగాన్ని స్వీకరించండి. అందరికీ,
యజమానులైన పిల్లలకు బాబా లక్షలాది అభినందనలను తెలియజేస్తున్నారు.
ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. అచ్ఛా!