08-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - సదా ఇదే సంతోషములో ఉండండి - మేము 84
జన్మల చక్రాన్ని పూర్తి చేసాము, ఇప్పుడిక ఇంటికి వెళ్తాము, ఈ కర్మభోగము ఇంకా కొద్ది
రోజులు మాత్రమే ఉంటుంది’’
ప్రశ్న:-
వికర్మాజీతులుగా అయ్యే పిల్లలు వికర్మల నుండి రక్షించుకునేందుకు ఏ విషయము పట్ల చాలా
శ్రద్ధ వహించాలి?
జవాబు:-
అన్ని
వికర్మలకు మూలం అయిన దేహాభిమానము ఏదైతే ఉందో, ఆ దేహాభిమానములోకి ఎప్పుడూ రాకూడదు,
దీని పట్ల శ్రద్ధ వహించాలి. దీని కొరకు పదే-పదే దేహీ-అభిమానులుగా అయి తండ్రిని
స్మృతి చేయాలి. మంచి మరియు చెడు యొక్క ఫలము తప్పకుండా లభిస్తుంది, చివరిలో
మనస్సాక్షి తింటుంది. కానీ ఈ జన్మ యొక్క పాపాల భారాన్ని తేలికపరచుకునేందుకు తండ్రికి
సత్యముగా వినిపించాలి.
ఓంశాంతి
అన్నింటికంటే పెద్ద లక్ష్యము స్మృతియే. చాలామందికి కేవలం వినాలి అనే అభిరుచి మాత్రమే
ఉంటుంది. జ్ఞానాన్ని అర్థం చేసుకోవడమైతే చాలా సులభము. 84 జన్మల చక్రాన్ని అర్థం
చేసుకోవాలి, స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి, అంతే, ఎక్కువేమీ లేదు. మనమంతా స్వదర్శన
చక్రధారులము అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఈ స్వదర్శన చక్రముతో ఎవరి
శిరస్సును ఖండించరు. శ్రీకృష్ణుడి విషయములో ఆ విధంగా చూపించారు. ఈ లక్ష్మీ-నారాయణులు
విష్ణువులోని రెండు రూపాలు. వారికి స్వదర్శన చక్రము ఉందా? మరి శ్రీకృష్ణునికి కూడా
చక్రము ఎందుకు చూపిస్తారు? ఒక పత్రిక ఉంది, అందులో శ్రీకృష్ణునివి అనేక చిత్రాలను
చూపిస్తారు. తండ్రి వచ్చి మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు, అంతేకానీ చక్రముతో
అసురులను ఏమీ హతమార్చరు. ఎవరికైతే ఆసురీ స్వభావము ఉంటుందో వారిని అసురులు అని అంటారు.
వాస్తవానికి మనుష్యులు మనుష్యులే కదా. స్వదర్శన చక్రముతో అందరినీ హతమారుస్తారని కాదు.
భక్తి మార్గములో కూర్చుని రకరకాల చిత్రాలు ఏవేవో తయారుచేసారు. రాత్రికి పగలుకు
ఉన్నంత తేడా ఉంది. పిల్లలైన మీరు ఈ సృష్టి చక్రాన్ని మరియు మొత్తం డ్రామా అంతటినీ
తెలుసుకోవాలి ఎందుకంటే ఇందులో మీరందరూ పాత్రధారులు. ఆ హద్దులోని నటులకైతే తమ
డ్రామాను గురించి తెలుసు. కానీ ఇది అనంతమైన డ్రామా. దీనిని పూర్తి విస్తారముగా అర్థం
చేసుకోలేరు. ఆ డ్రామా కేవలం రెండు గంటలు మాత్రమే ఉంటుంది కావున తమ పాత్ర గురించి
వారికి పూర్తి విస్తారముగా తెలుసు. ఇక్కడైతే 84 జన్మల గురించి తెలుసుకోవలసి ఉంటుంది.
తండ్రి అర్థం చేయించారు - నేను బ్రహ్మా రథములోకి ప్రవేశిస్తాను. బ్రహ్మా యొక్క
84 జన్మల కథ కూడా కావాలి. మనుష్యుల బుద్ధిలోకి ఈ విషయాలు రావు. 84 లక్షల జన్మలు
ఉన్నాయా లేక 84 జన్మలు ఉన్నాయా అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేరు. తండ్రి అంటారు,
మీ 84 జన్మల కథను నేను వినిపిస్తాను. 84 లక్షల జన్మలు ఉన్నట్లయితే వాటి గురించి
వినిపించేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది. మీరైతే - ఇది 84 జన్మల కథ అని ఒక్క
క్షణములో తెలుసుకుంటారు. మనము 84 జన్మలు ఎలా తీసుకున్నాము అన్నది మీరు తెలుసుకుంటారు.
ఇది 84 లక్షల జన్మల కథ అయినట్లయితే దీనిని ఒక్క క్షణములో అర్థం చేసుకోలేరు కదా. అసలు
84 లక్షల జన్మలు లేనే లేవు. పిల్లలైన మీకు కూడా సంతోషము ఉండాలి. మన 84 జన్మల చక్రము
పూర్తయింది. ఇప్పుడు మనము ఇంటికి వెళ్తాము. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఈ కర్మభోగము
ఉంటుంది. వికర్మలు భస్మమై కర్మాతీత అవస్థ ఏ విధంగా ఏర్పడుతుంది - దీని కొరకు ఈ
యుక్తిని తెలియజేసారు. ఇకపోతే ఈ జన్మలో ఏ వికర్మలైతే చేసారో, వాటిని మీరు వ్రాసి
ఇచ్చినట్లయితే భారము తెలికవుతుంది అని అర్థం చేయిస్తారు. జన్మ-జన్మాంతరాల వికర్మల
గురించైతే ఎవరూ వ్రాయలేరు. కానీ వికర్మలైతే జరుగుతూనే వచ్చాయి. ఎప్పటినుండైతే రావణ
రాజ్యము మొదలైందో అప్పటినుండి కర్మలు వికర్మలుగా అవుతాయి. సత్యయుగములో కర్మలు
అకర్మలుగా అవుతాయి. భగవానువాచ - మీకు కర్మ, అకర్మ, వికర్మల గతిని గురించి అర్థం
చేయిస్తాను. వికర్మాజీతుల కాలము లక్ష్మీ-నారాయణులతో ప్రారంభమవుతుంది. మెట్ల వరుస
చిత్రములో ఇది చాలా స్పష్టముగా ఉంది. శాస్త్రాలలో ఈ విషయాలేవీ లేవు. మేమే
సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా ఉండేవారము అని ఈ రహస్యాన్ని కూడా పిల్లలైన మీరు
అర్థం చేసుకున్నారు. విరాట రూపము యొక్క చిత్రాలను కూడా చాలా ఎక్కువగా తయారుచేస్తూ
ఉంటారు కానీ దాని అర్థము ఏ మాత్రము తెలియదు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇది అర్థం
చేయించలేరు. ఈ బ్రహ్మా కంటే పైన కూడా ఎవరో ఉన్నారు కదా, వారే ఇతనికి నేర్పించి
ఉంటారు. ఒకవేళ ఇతనికి గురువులెవరైనా నేర్పించి ఉన్నట్లయితే, ఆ గురువులకు కేవలం ఇతను
ఒక్కరే శిష్యునిగా ఉండరు కదా. తండ్రి అంటారు - పిల్లలూ, మీరు పతితుల నుండి పావనులుగా,
పావనుల నుండి పతితులుగా అవ్వవలసిందే. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. అనేక సార్లు
ఈ చక్రములో తిరుగుతూ వచ్చారు. ఇలా తిరుగుతూనే ఉంటారు. మీరు ఆల్రౌండ్ పాత్రధారులు.
ఆది నుండి అంతిమము వరకు మీకు తప్ప ఇంకెవరికీ పాత్ర లేదు. మీకే తండ్రి అర్థం
చేయిస్తుంటారు. ఇతర ధర్మాలవారు ఫలానా ఫలానా సమయములో వస్తారు అన్నది కూడా మీరు అర్థం
చేసుకున్నారు. మీది మాత్రం ఆల్రౌండ్ పాత్ర. క్రిస్టియన్ల విషయములో వారు సత్యయుగములో
ఉన్నారని అనరు. క్రిస్టియన్లు ద్వాపరయుగములో మధ్యలో వస్తారు. ఈ జ్ఞానము పిల్లలైన మీ
బుద్ధిలోనే ఉంది. మీరు దీనిని ఎవరికైనా అర్థం చేయించవచ్చు కూడా. ఇతరులెవ్వరికీ
సృష్టి ఆదిమధ్యాంతాల గురించి తెలియదు. రచయిత గురించే తెలియనప్పుడు ఇక రచన గురించి
ఎలా తెలుసుకుంటారు. బాబా అర్థం చేయించారు - ధర్మయుక్తమైన విషయాలేవైతే ఉన్నాయో,
వాటిని ముద్రించి విమానాల ద్వారా వెదజల్లాలి. అటువంటి పాయింట్లపై లేదా టాపిక్లపై
కూర్చుని వ్రాయాలి. పని ఏమీ లేదు అని పిల్లలు అంటారు. కానీ బాబా అంటారు, ఈ సేవ అయితే
చాలా ఉంది. ఇక్కడ ఏకాంతములో కూర్చుని ఈ పని చేయండి. బయట ఏవైతే పెద్ద-పెద్ద సంస్థలు
ఉన్నాయో, గీతా పాఠశాలలు మొదలైనవి ఉన్నాయో, వారందరినీ మేల్కొల్పాలి. ఇది పురుషోత్తమ
సంగమయుగమని అందరికి సందేశాన్ని ఇవ్వాలి. తెలివైనవారు ఎవరైతే ఉంటారో, వారు -
తప్పకుండా సంగమయుగములోనే కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనము జరుగుతుందని
వెంటనే అర్థం చేసుకుంటారు. సత్యయుగములో పురుషోత్తములైన మనుష్యులు ఉంటారు. ఇక్కడ
ఆసురీ స్వభావము కల పతిత మనుష్యులు ఉన్నారు. ఇది కూడా బాబా అర్థం చేయించారు. కుంభ
మేళాలు మొదలైనవి జరిగినప్పుడు ఎంతోమంది మనుష్యులు స్నానాలు చేయడానికి వెళ్తారు.
స్నానాలు చేయడానికి ఎందుకు వెళ్తారు? పావనముగా అవ్వాలని కోరుకుంటారు. కావున
ఎక్కడెక్కడికైతే మనుష్యులు స్నానాలు చేయడానికి వెళ్తారో, అక్కడికి వెళ్ళి సేవ చేయాలి.
ఈ నీరు ఏమీ పతిత-పావని కాదు అని మనుష్యులకు అర్థం చేయించాలి. మీ వద్ద చిత్రాలు కూడా
ఉన్నాయి. గీతా పాఠశాలలకు వెళ్ళి ఈ కరపత్రాలను పంచి పెట్టాలి. పిల్లలు సేవ కావాలని
కోరుకుంటారు. గీతా భగవానుడు పరమపిత పరమాత్మ శివుడు, అంతేకానీ శ్రీకృష్ణుడు కాదు అని
ఈ టాపిక్ పై కూర్చుని వ్రాయండి. ఆ తర్వాత శ్రీకృష్ణుడి చరిత్ర యొక్క మహిమ గురించి
వ్రాయండి, అలాగే శివబాబా యొక్క చరిత్ర గురించి వ్రాయండి, అప్పుడు వారు తమంతట తామే
నిర్ణయించుకుంటారు. పతిత-పావనుడు ఎవరు? అన్న టాపిక్ పై కూడా పాయింట్లు వ్రాయాలి. ఆ
తర్వాత శివ-శంకరుల తారతమ్యాన్ని కూడా చూపించాలి. శివుడు వేరు, శంకరుడు వేరు. కల్పము
ఆయుష్షు 5000 సం.లు అన్నది కూడా బాబా అర్థం చేయించారు. మనుష్యులు 84 జన్మలు
తీసుకుంటారు, అంతేకానీ 84 లక్షల జన్మలు కాదు. ఇటువంటి ముఖ్యమైన విషయాలను క్లుప్తముగా
వ్రాయాలి, అప్పుడు వాటిని విమానాల నుండి కూడా వెదజల్లవచ్చు, అలాగే వాటిపై అర్థం
చేయించవచ్చు కూడా. సృష్టి చక్రము చిత్రములో - ఫలానా, ఫలానా ధర్మాలు ఫలానా, ఫలానా
సమయాలలో స్థాపన అవుతాయి అని చాలా స్పష్టముగా ఉంది. కావున ఈ సృష్టి చక్రము చిత్రము
కూడా ఉండాలి. అందుకే ముఖ్యమైన 12 చిత్రాల క్యాలెండర్లను కూడా ముద్రించవచ్చు, వాటిలో
మొత్తము జ్ఞానము అంతా వచ్చేస్తుంది మరియు సేవ సహజముగా జరుగుతుంది. ఈ చిత్రాలు
తప్పకుండా ఉండాలి. ఏయే చిత్రాలను తయారుచేయాలి, ఏయే పాయింట్లను వ్రాయాలి అన్నది
కూర్చుని వ్రాయండి.
మీరు గుప్త వేషములో ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేస్తున్నారు. మీరు గుప్త యోధులు.
మీ గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి కూడా గుప్తముగా ఉన్నారు, జ్ఞానము కూడా
గుప్తముగా ఉంది. ఈ జ్ఞానానికి సంబంధించిన శాస్త్రాలు మొదలైనవేవీ తయారవ్వవు. ఇతర
ధర్మ స్థాపకులకు సంబంధించిన బైబిల్ మొదలైనవి ముద్రించబడతాయి, వాటిని వారు
చదువుతుంటారు. అలా ప్రతి ధర్మము వారివి ముద్రించబడతాయి. కానీ మీవి మళ్ళీ భక్తి
మార్గములో ముద్రించబడతాయి. ఇప్పుడు ముద్రించబడవు, ఎందుకంటే ఇప్పుడైతే ఈ శాస్త్రాలు
మొదలైనవన్నీ అంతమవ్వనున్నాయి. ఇప్పుడు మీరు బుద్ధిలో కేవలం స్మృతి చేయాలి. తండ్రి
వద్ద కూడా బుద్ధిలో జ్ఞానము ఉంది. తండ్రి శాస్త్రాలు మొదలైనవాటినేమీ చదవరు. వారు
నాలెడ్జ్ ఫుల్. నాలెడ్జ్ ఫుల్ అంటే అందరి హృదయాలలో ఏముందో తెలిసినవాడు అని మనుష్యులు
అనుకుంటారు. భగవంతుడు అన్నీ చూస్తారు కావుననే కర్మల ఫలాన్ని ఇస్తారు అని భావిస్తారు.
కానీ తండ్రి అంటారు, ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. డ్రామాలో ఎవరైతే వికర్మలు
చేస్తారో, వారికి దానికి శిక్ష ఉంటుంది. మంచి లేక చెడు కర్మలకు ఫలము లభిస్తుంది.
దానికి వ్రాత పూర్వకమైన చిట్టాలు ఏమీ ఉండవు. కర్మల ఫలము తప్పకుండా మరుసటి జన్మలో
లభిస్తుందని మనుష్యులు భావిస్తారు. అంతిమ సమయములో - నేను ఈ-ఈ పాపాలు చేసాను అని
మనస్సాక్షి బాగా తింటుంది. అన్నీ గుర్తుకొస్తాయి. ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి
జన్మ లభిస్తుంది. ఇప్పుడు మీరు వికర్మాజీతులుగా అవుతున్నారు కావున ఇక అటువంటి
వికర్మలు ఏమీ చేయకూడదు. అన్నింటికంటే పెద్ద వికర్మ దేహాభిమానులుగా అవ్వడము. బాబా
పదే-పదే చెప్తున్నారు - దేహీ-అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయండి, పవిత్రముగా
అయితే తప్పకుండా ఉండవలసిందే. అన్నింటికంటే పెద్ద పాపము కామ ఖడ్గాన్ని ఉపయోగించడము.
ఇదే ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది, అందుకే సన్యాసులు కూడా, దీనిని కాకిరెట్టతో
సమానమైన సుఖము అని అంటారు. అక్కడ దుఃఖము అన్న మాటే ఉండదు. ఇక్కడ అంతా దుఃఖమే దుఃఖము,
అందుకే సన్యాసులకు వైరాగ్యము వస్తుంది. కానీ వారు అడవులలోకి వెళ్ళిపోతారు. వారిది
హద్దులోని వైరాగ్యము, మీది అనంతమైన వైరాగ్యము. ఈ ప్రపంచమే అశుద్ధమైనది. బాబా, మీరు
వచ్చి మా దుఃఖాలను హరించి మాకు సుఖాన్ని ఇవ్వండి అని అందరూ అంటారు. తండ్రియే
దుఃఖహర్త, సుఖకర్త. కొత్త ప్రపంచములో ఈ దేవతల రాజ్యము ఉండేదని, అక్కడ ఏ రకమైన దుఃఖము
ఉండేది కాదని పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. ఎప్పుడైనా ఎవరైనా శరీరము వదిలితే,
వారు స్వర్గస్థులయ్యారని మనుష్యులు అంటారు. కానీ మేము నరకములో ఉన్నాము అని వారు
అర్థం చేసుకోరు. మేము మరణించిన తర్వాత స్వర్గములోకి వెళ్ళాలి అని భావిస్తారు. కానీ
ఆ వెళ్ళినవారు స్వర్గములోకి వెళ్ళారా లేక మళ్ళీ ఈ నరకములోకే వచ్చారా అన్నదేమీ అర్థం
చేసుకోరు. పిల్లలైన మీరు ముగ్గురు తండ్రుల రహస్యాన్ని కూడా అందరికీ అర్థం
చేయించవచ్చు. ఇద్దరు తండ్రుల గురించైతే అందరూ అర్థం చేసుకుంటారు - లౌకిక తండ్రి
మరియు పారలౌకిక తండ్రి. ఆ తర్వాత అలౌకిక తండ్రి అయిన ప్రజాపిత బ్రహ్మా ఉన్నారు, వారు
ఈ సంగమయుగములో ఉంటారు. బ్రాహ్మణులు కూడా కావాలి కదా. ఆ బ్రాహ్మణులేమీ బ్రహ్మా యొక్క
ముఖ వంశావళి బ్రాహ్మణులు కారు. బ్రహ్మా ఉండేవారని వారికి తెలుసు, అందుకే బ్రాహ్మణ
దేవీ-దేవతాయ నమః అని అంటారు. కానీ ఇలా ఎవరిని అంటారు మరియు ఆ బ్రాహ్మణులు ఎవరు
అన్నది ఎవరికి తెలియదు. మీరు పురుషోత్తమ సంగమయుగీ బ్రాహ్మణులు. వారు కలియుగీ
బ్రాహ్మణులు. ఇది పురుషోత్తమ సంగమయుగము, ఈ సమయములో మీరు మనుష్యుల నుండి దేవతలుగా
అవుతారు. దేవీ-దేవతా ధర్మము యొక్క స్థాపన జరుగుతోంది. కావున పిల్లలు అన్ని
పాయింట్లను ధారణ చేయాలి, అలాగే సేవ కూడా చేయాలి. పూజలు చేసేందుకు లేక శ్రాద్ధము
కొరకు బ్రాహ్మణులు వస్తారు. అప్పుడు వారితో కూడా మీరు చిట్-చాట్ చేయవచ్చు. మీరు
వారిని సత్యమైన బ్రాహ్మణులుగా తయారుచేయవచ్చు. ఇప్పుడు భాద్రపద మాసము వస్తుంది,
అప్పుడు అందరూ పితృదేవతలందరికీ తద్దినాలు పెడుతూ ఉంటారు. వాటిని కూడా మీరు యుక్తిగా
ఆచరించాలి, లేకపోతే బ్రహ్మాకుమారీల వద్దకు వెళ్ళి అన్నీ వదిలేసారు అని
మాట్లాడుకుంటారు. వారు అసంతుష్టమయ్యే విధంగా ఏమీ చేయకూడదు. యుక్తిగా మీరు వారికి
కూడా జ్ఞానాన్ని ఇవ్వవచ్చు. తప్పకుండా బ్రాహ్మణులు వస్తారు, అప్పుడే కదా వారికి మీరు
జ్ఞానాన్ని ఇవ్వగలరు. ఈ మాసములో మీరు బ్రాహ్మణులకు ఎంతో సేవను చేయవచ్చు.
బ్రాహ్మణులైన మీరైతే ప్రజాపిత బ్రహ్మాకు సంతానము. బ్రాహ్మణ ధర్మాన్ని ఎవరు
స్థాపించారో చెప్పండి? అని మీరు వారిని అడగండి. మీరు ఇంట్లో కూర్చునే వారి కళ్యాణము
కూడా చేయవచ్చు. ఎవరైనా అమరనాథ్ యాత్రకు వెళ్తున్నారనుకోండి వారు కేవలం మీరు వ్రాసిన
వివరణను చూసి పూర్తిగా అర్థం చేసుకోలేరు. అక్కడ కూర్చుని వారికి అర్థం చేయించవలసి
ఉంటుంది. నేను మీకు సత్యమైన అమరనాథ్ కథను వినిపిస్తున్నాను. అమరనాథుడు అని ఒక్కరినే
అంటారు. అమరనాథుడు అనగా అమరపురిని స్థాపన చేసేవారు. అదే సత్యయుగము. ఈ విధంగా సేవ
చేయవలసి ఉంటుంది. అక్కడికి కాలి నడకన వెళ్ళవలసి ఉంటుంది. మంచి-మంచి పెద్ద-పెద్ద
వ్యక్తులు ఎవరైతే ఉంటారో వెళ్ళి వారికి అర్థం చేయించాలి. సన్యాసులకు కూడా మీరు
జ్ఞానము ఇవ్వవచ్చు. మీరు మొత్తం సృష్టి అంతటికీ కళ్యాణకారులు. శ్రీమతమనుసారముగా మనము
విశ్వ కళ్యాణము చేస్తున్నాము - బుద్ధిలో ఈ నషా ఉండాలి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఎప్పుడైతే ఏకాంతము లేక తీరిక దొరుకుతుందో, అప్పుడు జ్ఞానము యొక్క మంచి-మంచి
పాయింట్లపై విచార సాగర మంథనము చేసి వ్రాయాలి. అందరికీ సందేశాన్ని అందించేందుకు మరియు
అందరి కళ్యాణము చేసేందుకు యుక్తులు రచించాలి.
2. వికర్మల నుండి రక్షించుకునేందుకు దేహీ-అభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి
చేయాలి. ఇప్పుడు ఏ వికర్మలు చేయకూడదు, ఈ జన్మలో చేసిన వికర్మలను బాప్ దాదాకు
సత్యముగా వినిపించాలి.
వరదానము:-
అనివార్యమైన నిశ్చితమైన విధి గురించి తెలిసి కూడా శ్రేష్ఠ
కార్యానికి ప్రత్యక్ష రూపాన్ని ఇచ్చే సదా సమర్థ భవ
కొత్త శ్రేష్ఠ విశ్వము తయారయ్యే విధి అనివార్యము మరియు
నిశ్చితము అయినప్పటికీ, సమర్థ భవ యొక్క వరదానీ పిల్లలు కేవలం కర్మ మరియు ఫలము యొక్క,
పురుషార్థము మరియు ప్రారబ్ధము యొక్క, నిమిత్తము మరియు నిర్మాణము యొక్క కర్మ
సిద్ధాంతము అనుసారముగా నిమిత్తముగా అయ్యి కార్యము చేస్తారు. ప్రపంచములోనివారికి ఆశ
కనిపించదు. కానీ మీరు అంటారు - ఈ కార్యము అనేక సార్లు జరిగింది, ఇప్పుడు కూడా
జరిగేదే ఉంది, ఎందుకంటే స్వ పరివర్తన యొక్క ప్రత్యక్ష ఋజువు ఎదురుగా ఇంకే ఋజువు
అవసరమే లేదు. అంతేకాక పరమాత్ముని కార్యము సదా సఫలమయ్యే తీరుతుంది.
స్లోగన్:-
చెప్పడము తక్కువ, చేయడము ఎక్కువ - ఈ శ్రేష్ఠమైన లక్ష్యము మహానులుగా చేస్తుంది.
అవ్యక్త సూచనలు -
సహజయోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి
సేవలోనైనా లేక స్వయము
యొక్క ఎక్కే కళలోనైనా సఫలతకు ముఖ్య ఆధారము - ఒక్క బాబా పట్ల ఎడతెగని ప్రేమ. బాబా
తప్ప మరేదీ కనిపించకూడదు. సంకల్పాలలో కూడా బాబా, మాటలలో కూడా బాబా, కర్మలలో కూడా
బాబా తోడు. ఇటువంటి లవలీన స్థితిలో ఉంటూ ఒక్క మాటను మాట్లాడినా స్నేహముతో కూడిన ఆ
మాట ఇతర ఆత్మలను కూడా స్నేహములో బంధించివేస్తుంది. ఇటువంటి లవలీన ఆత్మ పలికే ఒక్క
‘బాబా’ అన్న పదమే ఇంద్రజాలపు మంత్రములా పని చేస్తుంది.
| | |