09-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తండ్రితో పాటు ఎగిరేందుకు పూర్తిగా
పవిత్రముగా అవ్వండి, సంపూర్ణముగా సరెండర్ అవ్వండి, ఈ దేహము కూడా నాది కాదు -
పూర్తిగా అశరీరులుగా అవ్వండి’’
ప్రశ్న:-
ఉన్నతమైన
గమ్యానికి చేరుకునేందుకు ఏ భయము తొలగిపోవాలి?
జవాబు:-
కొంతమంది
పిల్లలు మాయా తుఫానులకు చాలా భయపడుతారు. బాబా, ఈ తుఫానులు చాలా సతాయిస్తున్నాయి,
వీటిని ఆపు చేయండి అని అంటారు. బాబా అంటారు - పిల్లలూ, ఇది బాక్సింగ్. ఆ బాక్సింగ్
లో కూడా ఒక వైపు నుండే దాడి జరుగుతూ ఉండదు కదా. ఒకవేళ ఒకరు 10 దెబ్బలు వేస్తే,
రెండవవారు తప్పకుండా 5 వేస్తారు, అందుకే మీరు భయపడకూడదు. మహావీరులుగా అయి విజయులుగా
అవ్వాలి, అప్పుడు ఉన్నతమైన గమ్యానికి చేరుకోగలరు.
పాట:-
ప్రతిజ్ఞ చేసి
మీ ద్వారము వద్దకు వచ్చాము...
ఓంశాంతి
పిల్లలు పాట విన్నారు. తప్పకుండా పాటలో ఏదో రహస్యము ఇమిడి ఉంది, ఎందుకంటే బాబా ఈ
రికార్డును కొని దీని అర్థాన్ని కూర్చుని అర్థం చేయిస్తున్నారు. దీనినే, జీవిస్తూ
మరణించి తండ్రికి చెందినవారిగా అవ్వడమని అంటారు. తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత
టీచరుకు చెందినవారిగా అవ్వాలి, టీచరు తర్వాత మెజారిటీ గురువులను ఆశ్రయిస్తారు.
క్రిస్టియన్లు కూడా పిల్లలు జన్మిస్తూనే, వారిని క్రిస్టియనైజ్ చేస్తారు (క్రిస్టియన్లుగా
చేస్తారు). వారిని గురువు ఒడిలో పెడతారు, ఆ గురువు ఫాదర్ కావచ్చు లేదా ఇంకెవరైనా
కావచ్చు. ఫాదర్ అంటే ఇక్కడ క్రైస్టు కాదు. క్రైస్టు పేరు మీద మేము క్రిస్టియన్లుగా
అవుతామని వారంటారు.
ఇప్పుడు పిల్లలైన మీరు ముందు తండ్రికి చెందినవారిగా అవుతారు, అశరీరులుగా అవుతారు.
మన తనువు-మనసు-ధనము ఏవైతే ఉన్నాయో, అవన్నీ బాబాకు అర్పణ చేస్తాము, జీవిస్తూ
మరణిస్తాము అనగా ఆత్మలమైన మనము వారికి చెందినవారిగా అవుతాము, ఇది బుద్ధిలో ఉండాలి.
నావి అంటూ ఏవైతే ఉన్నాయో, నా శరీరము, నా ధనము, సంపద, సంబంధీకులు మొదలైనవి ఏవైతే
ఉన్నాయో, అన్నింటినీ మర్చిపోతాము. మరణించిన తర్వాత అంతా మర్చిపోతారు కదా. ఇది ఎంత
పెద్ద గమ్యము. మనము అశరీరి ఆత్మలము, ఇది పక్కా చేసుకోవాలి. అంతేకానీ, మీరు శరీరాన్ని
వదిలి మరణిస్తారని కాదు. అలా కాదు. ఆత్మ పూర్తిగా పవిత్రముగా అవ్వలేదు కదా. తండ్రికి
చెందినవారిగా అయ్యారు కానీ, బాబా అంటారు - మీ ఆత్మ అపవిత్రముగా ఉంది. ఆత్మ రెక్కలు
తెగిపోయాయి. ఇప్పుడు ఆత్మ ఎగరలేదు. తమోప్రధానముగా ఉన్న కారణముగా ఒక్క మనిషి కూడా
తిరిగి వెళ్ళలేరు. మాయ రెక్కలను పూర్తిగా విరిచేసింది. బాబా అర్థం చేయించారు - ఆత్మ
అన్నింటికన్నా వేగముగా వెళ్తుంది. ఆత్మ కన్నా వేగవంతమైనది ఇంకేదీ ఉండదు. ఆత్మ
వేగాన్ని ఎవరూ చేరుకోలేరు. చివరిలో ఆత్మలన్నీ దోమల వలె పరుగెడతాయి. ఎక్కడికి
వెళ్తాయి? చాలా చాలా దూరంగా, సూర్య, చంద్రులను కూడా దాటి వెళ్తాయి. అక్కడ నుండి అవి
తిరిగి రావు. వారి రాకెట్లు మొదలైనవైతే వెళ్ళి తిరిగి వస్తాయి. అవి సూర్యుని వరకైతే
చేరుకోలేవు. మీరైతే వాటికన్నా చాలా దూరంగా వెళ్ళాలి. సూక్ష్మవతనము కన్నా పైన ఉన్న
మూలవతనానికి వెళ్ళాలి. ఆత్మకు రెక్కలు లభిస్తాయి. లెక్కాచారాలను సమాప్తము చేసుకుని
ఆత్మ పవిత్రముగా అవుతుంది. వినాశన సమయానికి సంబంధించి చాలా మహిమ వ్రాయబడి ఉంది.
ఆత్మలందరూ లెక్కాచారాలను సమాప్తము చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడైతే ఆత్మలందరూ మలినముగా,
పాపాత్ములుగా ఉన్నారు. పెద్ద గురువులు, సాధు-సన్యాసులు మొదలైనవారు ఉన్నారు, వారు
తమను తాము గురువులుగా భావిస్తారు. అహమ్ బ్రహ్మస్మి... అహమ్ బ్రహ్మోహమ్ అని అంటారు.
మేము బ్రహ్మతత్వానికి చేరుకున్నామని అంటారు. ఇప్పుడు, ఇక్కడే కూర్చుని ఉంటూ
బ్రహ్మతత్వానికి ఎక్కడ చేరుకున్నారు. ఆత్మలమైన మనము బ్రహ్మతత్వములో నివసించేవారము
అని ఇప్పుడు మీకు తెలుసు. కానీ, ఇప్పుడు అక్కడికి ఎవరూ వెళ్ళలేరు. ఆత్మలన్నీ ఇక్కడ
పునర్జన్మలు తీసుకుంటాయి. ఇది అనంతమైన డ్రామా. పాత్రధారులందరూ పాత్రను
అభినయించేందుకు అక్కడ నుండి తప్పకుండా రావాలి. అందరి ఆత్మలు స్టేజి పైకి వచ్చాయి.
వినాశన సమయము వచ్చినప్పుడు అందరూ వచ్చేస్తారు, అక్కడ ఉండి ఏం చేస్తారు! పాత్రధారి
పాత్రను అభినయించకుండా ఇంటిలో కూర్చుని ఉండిపోరు కదా. నాటకములోకి తప్పకుండా రావాల్సి
ఉంటుంది. అక్కడ నుండి అందరూ వచ్చిన తర్వాత, తండ్రి అందరినీ తీసుకువెళ్తారు. తండ్రి
అంటారు - నేను ఇక్కడ ఉన్నా కానీ ఆత్మలు వస్తూ ఉంటారు, నంబరువారుగా వృద్ధి చెందుతూ
ఉంటారు. ఆ తర్వాత మీరు వెళ్ళడము కూడా నంబరువారుగా వెళ్తారు. అంతా మీ అవస్థపై ఆధారపడి
ఉంది, అందుకే మీరు మరజీవులుగా అవ్వాలి. నేను ఆత్మను అన్న నిశ్చయము ఏర్పరచుకోవడము
శ్రమతో కూడుకున్నది. పిల్లలు పదే-పదే దేహాభిమానములోకి వచ్చి మర్చిపోతారు. ఎప్పుడైతే
పూర్తిగా సరెండర్ అవుతారో, అప్పుడే దేహీ-అభిమానులుగా ఉంటారు. బాబా, ఇదంతా మీదే. నేను
కూడా మీ వాడినే. ఈ దేహము కూడా నాది కాదు, దీనిని నేను వదిలేస్తాను. బాబా, నేను మీ
వాడిని. బాబా అంటారు - నా వారిగా అయ్యి, మిగిలినవారందరి నుండి మమకారాన్ని తొలగించండి.
అలాగని ఇక్కడకు వచ్చి కూర్చోవడము కాదు. మీరు మీ వ్యాపార-వ్యవహారాలను చేసుకోవాలి.
ఇంటిని సంభాళించాలి. పిల్లలు తల్లిదండ్రుల ఋణాన్ని తీర్చుకోవాలి. వారి సేవ చేసి
రిటర్ను ఇవ్వాలి. తల్లిదండ్రుల పాలనకు పిల్లలు ఋణగ్రస్తులు అవుతారు. ఇప్పుడు తండ్రి
మీ పాలనను చేస్తున్నారు. ప్రారంభములో ఎవరైతే వచ్చారో, వారంతా వెంటనే సరెండర్
చేసేసారు. వారి వద్ద ఏమీ ఉంచుకోలేదు, సరెండర్ చేసేసారు, ఆ ధనముతో పిల్లలైన మీరు
భారత్ ను పావనముగా చేస్తున్నారు. భారత్ మాత్రమే పూర్తిగా పవిత్రముగా ఉండేది.
భారతవాసులంతటి పవిత్రమైనవారు, సుఖమయమైనవారు ఇంకెవరూ ఉండరు. భారత్ అన్నింటికన్నా
పెద్ద తీర్థ స్థానము. ఇక్కడకు పతిత-పావనుడైన తండ్రి వచ్చి మొత్తం సృష్టిని మరియు
పతితులను కూడా పవిత్రముగా తయారుచేస్తారు. ఇప్పుడు ఈ తత్వాలు మొదలైనవన్నీ శత్రువుల
వలె ఉన్నాయి. భూకంపాలు వస్తాయి, తుఫానులు వస్తాయి ఎందుకంటే తమోప్రధానముగా ఉన్నారు.
ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, అవి చాలా దుఃఖము కలిగిస్తాయి. ఈ సమయములో అన్నీ
దుఃఖమిచ్చే వస్తువులే ఉన్నాయి. సత్యయుగములో అన్నీ సుఖమిచ్చే వస్తువులే ఉంటాయి.
అక్కడ, ఈ తుఫానులు లేదా వేడి గాలులు మొదలైనవేవీ ఉండవు. మీలో కూడా ఈ విషయాలను చాలా
కొద్దిమందే అర్థం చేసుకుంటారు. ఈ రోజు ఇక్కడ ఉండి, రేపు లేకపోతే, వారు ఏమీ అర్థం
చేసుకోలేదని అనడము జరుగుతుంది. ఇక్కడికి వస్తారు కానీ అందరూ నిలవరు. ఇక్కడ నుండి
వెళ్ళి, 10 రోజుల తర్వాత - బాబా, ఫలానావారిని మాయ తినేసిందని సమాచారము వ్రాస్తారు.
ఇలా జరుగుతూ ఉంటుంది. చిన్న పుష్పాలు పెద్దవిగా అయ్యాక వాటి నుండి ఫలాలు వెలువడతాయి.
అటువంటివారిలో ఇతరులను తమ సమానముగా తయారుచేసే శక్తి ఉంటుంది. వారి నుండి ఫలము
వెలువడుతుంది.
తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత ప్రజలను కూడా తయారుచేయాలి, వారసులను కూడా
తయారుచేయాలి. పండాలు (మార్గదర్శకులు)గా అయి బాబా వద్దకు వచ్చి, ఇక మేము గమ్యానికి
చేరుకున్నామని అనుకోకూడదు. అలా కాదు. గమ్యము చాలా పెద్దది. మాయ తుఫానులు చాలా
వస్తాయని అంటారు. మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు కావున తుఫానులైతే వస్తాయి.
బాబా, మేము మీ వారిగా ఉండేవారము, మీ నుండి వారసత్వాన్ని తీసుకున్నాము, తర్వాత
పునర్జన్మలు తీసుకుంటూ 84 జన్మలను దాటి, మళ్ళీ వచ్చి మీవారిగా అయ్యామని అంటారు.
నేనైతే మీ నుండి వారసత్వాన్ని తీసుకుని తీరుతాను అని అంటారు. కావున ఇటువంటి తండ్రిని
అంతగా స్మృతి చేయాలి మరియు ఇతరులను తమ సమానముగా తయారుచేసి ఫలాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
లేకపోతే మాల ఎలా తయారవుతుంది. తండ్రి యొక్క వారసులను ఎలా తయారుచేస్తారు. ప్రజలు కూడా
కావాలి, సింహాసనముపై కూర్చునే వారసులు కూడా కావాలి. తండ్రి వద్దకైతే చాలామంది
వస్తారు, తర్వాత విడాకులు ఇచ్చేస్తారు. బుద్ధియోగము తెగిపోయిందంటే, ఇక ఆట
సమాప్తమైపోతుంది.
కొంతమంది పిల్లలు బాబా వద్దకు వచ్చి - బాబా, ఏ తుఫాను ప్రభావితము చేయని విధముగా
అవస్థను ఎలా తయారుచేసుకోవాలి అని అడుగుతారు. దీని మార్గాన్ని అయితే తెలియజేస్తూనే
ఉంటారు - తండ్రిని స్మృతి చేయండి. తుఫానులైతే వస్తాయి. బాక్సింగ్ లో ఎవరో ఒకరే
దెబ్బలు తింటూ ఉండటాన్ని ఎప్పుడైనా చూశారా. తప్పకుండా ఇరువురిలోనూ ధైర్యముంటుంది.
ఒకరు 5 దెబ్బలు వేస్తే, మరొకరు 10 దెబ్బలు వేస్తూ ఉండవచ్చు. ఇది కూడా బాక్సింగే.
తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మాయ పారిపోతూ ఉంటుంది, కానీ అది వెంటనే జరగదు.
మాయతో కుస్తీ పట్టాల్సి ఉంటుంది. ఎవరైనా సరే, మాయ చెంపదెబ్బ వేయదని అనుకోకండి. ఇది
పెద్ద బాక్సింగ్. చాలామంది భయపడతారు, మాయ బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. ఇది యుద్ధ
స్థలము కదా. బుద్ధియోగాన్ని జోడించడములో మాయ పెద్ద విఘ్నాలను వేస్తుంది. శ్రమ అంతా
యోగములోనే ఉంది. జ్ఞానయుక్త ఆత్మలంటే నాకు ప్రియమని బాబా అంటారు. అలాగని, కేవలం
జ్ఞానాన్ని ఇచ్చేవారే ప్రియమైనవారని కాదు. ముందైతే యోగము పూర్తిగా ఉండాలి. తండ్రిని
స్మృతి చేయాలి. మాయ విఘ్నాలకు భయపడకూడదు. విశ్వానికి యజమానులుగా అవుతారు కదా. అందరూ
అవుతారా? 16108 మాలైతే చాలా పెద్దది. ఇది అంతిమానికల్లా పూర్తవుతుంది. త్రేతా
అంతిమానికల్లా ఎంతమంది రాకుమారులు, రాకుమారీలు తయారవుతారు, దీనికి సంబంధించిన కొన్ని
గుర్తులైతే ఉన్నాయి కదా. 8 మణులకు కూడా గుర్తులు ఉన్నాయి. 108 మణులకు కూడా గుర్తులు
ఉన్నాయి. ఇది పూర్తిగా రైట్. త్రేతా అంతిమములో 16108 మంది రాకుమార-రాకుమారీలు ఉంటారు.
ప్రారంభములో అంతమంది ఉండరు. ముందు కొద్దిమంది ఉంటారు, ఆ తర్వాత సంఖ్య వృద్ధి చెందుతూ
ఉంటుంది. వారంతా ఇక్కడే తయారవుతారు. ఈ అవకాశము చాలా మంచిది కానీ ఇందులో చాలా శ్రమ
ఉంది. మరణిస్తాను కానీ ఎప్పుడూ వదలను... అని పాటలో కూడా అంటారు. బాబా, ఈ
తనువు-మనస్సు-ధనము, అంతా మీదే, మేము అశరీరులుగా అయి మిమ్మల్ని స్మృతి చేస్తాము,
బుద్ధియోగాన్ని మీతో జోడిస్తాము అని అంటారు. అప్పుడు బాబా అంటారు, ఇదంతా పిల్లలైన
మీ కోసమే. పిల్లలు అంటారు, మా వద్ద ఉన్నదంతా మీదే. ఇదంతా భగవంతుడే ఇచ్చారని అంటారు
కదా! ఇప్పుడు తండ్రి అంటారు, ఇదంతా సమాప్తమవ్వనున్నది. మీ వద్ద ఏముంది? ఈ శరీరము
కూడా సమాప్తమైపోతుంది. ఇప్పుడు, నేను వాటిని ఎక్స్ చేంజ్ చేసి మీకు ఇస్తాను. కేవలం
ఎక్స్ చేంజ్ చేస్తారు కదా. కావున, తండ్రి అంటారు - పిల్లలూ, అశరీరులుగా అవ్వండి,
నన్ను స్మృతి చేయండి, బుద్ధితో అంతా సరెండర్ చేయండి. రాజా హరిశ్చంద్రుని కథ ఉంది కదా.
తాకట్టు పెట్టమని అన్నారు కదా.
తండ్రి అంటారు - నేను ఈ శాస్త్రాలు మొదలైనవాటన్నిటి సారాన్ని మీకు అర్థం చేయిస్తాను.
నేనే మిమ్మల్ని బ్రహ్మా నోటి ద్వారా రాజా-రాణులుగా తయారుచేసాను, ఇప్పుడు మళ్ళీ
తయారుచేస్తాను. ఎప్పుడూ కూడా మనుష్యులు, మనుష్యులకు గీతను వినిపించి, రాజయోగాన్ని
నేర్పించి, రాజా-రాణులుగా తయారుచేయలేరు. అటువంటప్పుడు, గీతను వినడము వల్ల లాభమేముంది?
తండ్రి అంటారు - నేను స్వయముగా కల్ప-కల్పము వచ్చి మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా
తయారుచేస్తాను. నా వారిగా అయితేనే వారసులుగా అవుతారు కదా. కావున, ఎంతగా యోగములో
ఉంటారో, అంతగా శుద్ధముగా అవుతూ ఉంటారు. బాబా, ఇదంతా మీదే. మేమైతే ట్రస్టీలము. మీ
ఆజ్ఞ లేకుండా మేము ఏమీ చేయము అని అంటారు. శరీర నిర్వహణను ఎలా చేసుకోవాలనే
డైరెక్షన్లు కూడా తీసుకుంటారు. చాలా వరకు పేదవారే పూర్తి లెక్కాపత్రాన్ని ఇస్తారు.
షావుకారులు ఇవ్వలేరు, సరెండర్ అవ్వలేరు, వారిలో ఎవరో అరుదుగా వెలువడుతారు. జనకుని
పేరు ఉంది కదా. పిల్లా-పాపలు ఉన్నారంటే, జాయింట్ ప్రాపర్టీ ఉందంటే, మరి దాన్ని వేరు
ఎలా చేస్తారు. షావుకారులు సరెండర్ అవ్వాలంటే, తమ ఆస్తిని విడిగా ఎలా తీయాలి? తండ్రి
ఉన్నదే పేదల పెన్నిధి. అందరికన్నా పేదవారు మాతలు, వారికన్నా పేదవారు కన్యలు. కన్యలకు
ఎప్పుడూ వారసత్వము యొక్క నషా ఉండదు. కొడుకులకు తండ్రి ఆస్తి యొక్క నషా ఉంటుంది.
కావున, వాటన్నింటినీ వదిలి వైకుంఠ వారసత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దానము అనేది
సదా పేదవారికే ఇవ్వడము జరుగుతుంది. భారత్ అన్నింటికన్నా పేదది, అమెరికా చాలా
షావుకారు. వారికి వారసత్వాన్ని ఇస్తారా? భారత్ అన్నింటికన్నా షావుకారుగా ఉండేది,
అప్పుడు వేరే ధర్మమేదీ ఉండేది కాదు. కేవలం భారతవాసులే ఉండేవారు, ఒకే భాష ఉండేది.
భగవంతుడు ఒక్కరే. నేను ఒకే రాజ్యాన్ని, ఒకే ధర్మాన్ని, ఒకే భాషను స్థాపన చేస్తాను.
ఒకే సర్వశక్తివంతమైన గవర్నమెంటును స్థాపన చేస్తాను. ఒకటి నుండి తర్వాత రెండు, మూడు
అవుతాయి. ఇప్పుడు ఎన్ని ధర్మాలు ఉన్నాయి, ఆ తర్వాత తప్పకుండా ఒకే ధర్మము రావాల్సి
ఉంటుంది. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయము. అప్పుడు ఒకే ధర్మము ఉండేది. విద్వాంసులు
సత్యయుగ ఆయువును లక్షల సంవత్సరాలని వ్రాశారు. సత్యయుగము అంటే ఏమిటి అనేది అర్థం
చేసుకోరు. ఎవరైనా మరణించినప్పుడు వారు స్వర్గవాసులయ్యారని అనగా పైకి వెళ్ళి
ఉండవచ్చని భావిస్తారు. దిల్వాడా మందిరములో కూడా స్వర్గాన్ని పైకప్పులో చూపించారు.
కావున మనుష్యులు తికమకపడతారు. వాస్తవానికి స్వర్గమనేది పైన ఏమీ లేదు. బాబా వద్దకు
వెళ్ళి, మళ్ళీ ఇక్కడికే వచ్చి రాజ్యము చేస్తామని ఇప్పుడు మీకు తెలుసు. ఎవరికైనా
అర్థం చేయించగలిగేలా ఈ జ్ఞానము బుద్ధిలో ఉండాలి. కచ్చాగా (అపరిపక్వముగా) ఉండేవారిని
మాయ పిచ్చుక తినేస్తుంది, అందుకే ఫొటోలు కూడా తెప్పించడము జరుగుతుంది. రిజిస్టరు
పెట్టడము జరుగుతుంది.
బాబా వద్దకు సమాచారము వస్తూ ఉంటుంది - ఫలానావారు ఒకే ఒక జ్ఞాన బాణాన్ని వేసారు,
దానితో నేను బాబాకు చెందినవాడిగా అయిపోయాను. శాస్త్రాలలో కూడా - కుమారీల ద్వారా
బాణాలు వేయించారని వ్రాయబడి ఉంది. అరే, తండ్రిని ఎందుకు మర్చిపోయారు? దీనిని జ్ఞాన
బాణము అని అంటారు. కేవలం తండ్రి స్మృతిని ఇప్పించాలి. అంతేకానీ, హింసాత్మకమైన బాణాల
విషయమేమీ కాదు. తండ్రి అంటారు - నేను బ్రహ్మా ముఖము ద్వారా అన్ని శాస్త్రాల
రహస్యాన్ని మీకు అర్థం చేయిస్తాను. బ్రహ్మా అయితే తప్పకుండా ఇక్కడే ఉండాలి. వారు
విష్ణువు నాభి కమలము నుండి బ్రహ్మాను చూపించారు. వారికి ఏమీ తెలియదు. మనుష్యులకు ఏది
తోస్తే అది వ్రాసేశారు. అశుద్ధత అయితే చాలా ఉంది. మంత్ర-తంత్రాల వారు కూడా చాలామంది
అయిపోయారు. సత్యము ఎప్పుడైతే వెలువడుతుందో, అప్పుడు అసత్యమైనవారు దానిని ఎదిరిస్తారు.
శివబాబా నిరాకారుడు మరియు ఈ బ్రహ్మా సాకారుడు, అంతేకానీ, నాభి మొదలైనవాటి విషయమేమీ
లేదు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఇప్పుడు జ్ఞానయుక్త ఆత్మలుగా అవ్వాలి, కేవలం జ్ఞానాన్ని వింటూ,
వినిపించేవారిగా కాదు. స్మృతి చేసే శ్రమను కూడా చేయాలి. అశరీరులుగా అయి, అశరీరి
తండ్రిని స్మృతి చేయాలి.
2. తండ్రికి చెందినవారిగా అయి వేరే విషయాలన్నింటి నుండి మమకారాన్ని తొలగించాలి.
ఈ దేహము కూడా నాది కాదు. పూర్తి దేహీ-అభిమానులుగా అయి పూర్తిగా సరెండర్ అవ్వాలి.
వరదానము:-
మాస్టర్ ఆల్మైటీ అథారిటీ యొక్క సీటుపై సెట్ అయి ఉండే సహజ
మరియు సదాకాలిక కర్మయోగీ భవ
ఏ విధముగా ఏదైనా మెషినరీని సెట్ చేసినప్పుడు దానిని
ఒక్కసారి సెట్ చేసినట్లయితే ఇక అది దానంతట అదే నడుస్తూ ఉంటుందో, అదే విధముగా మాస్టర్
ఆల్మైటీ అథారిటీ యొక్క స్థితిలో స్వయాన్ని ఒక్కసారి సెట్ చేసుకున్నట్లయితే
ఇంకెప్పుడూ బలహీనపు మాటలు వెలువడవు. ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ అదే సెట్టింగ్
అనుసారముగా వాటంతట అవే నడుస్తూ ఉంటాయి. ఇదే సెట్టింగ్ సహజముగా మరియు సదాకాలికముగా
కర్మయోగులుగా మరియు నిరంతర నిర్వికల్ప సమాధిలో ఉండే సహజయోగులుగా చేస్తుంది.
స్లోగన్:-
నేను అని
అనేందుకు బదులుగా బాబా, బాబా అని అనడము - ఇదే స్మృతికి నిదర్శనము.
అవ్యక్త ప్రేరణలు -
సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా తయారుచేసుకోండి, సహనశీలురుగా అవ్వండి
ఎవరైతే సహనశీలురుగా
ఉంటారో, వారే డ్రామా యొక్క డాలుపై నిలవగలరు మరియు హర్షితముగా ఉండగలరు. సహనశీలత
లేకపోతే డ్రామా యొక్క డాలును పట్టుకోవడము కూడా కష్టమవుతుంది. ఈ సమయములో ఏ కర్మలైతే
చేస్తారో, అందులో చేసేవారు మరియు చేయించేవారి యొక్క స్మృతి సదా ఉండాలి. చేయించేవారు
తండ్రి, చేసేవారు నిమిత్తము, ఒకవేళ దీనిని స్మృతిలో ఉంచుకుని కర్మలు చేసినట్లయితే
సాక్షీగా ఉంటూ పాత్రను అభినయిస్తున్నారు అన్నట్లు అనుభవమవుతుంది.