09-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ పురుషోత్తమ సంగమయుగము కళ్యాణకారి యుగము, ఈ యుగములోనే చదువు ద్వారా మీరు శ్రీకృష్ణపురికి యజమానులుగా అవ్వాలి’’

ప్రశ్న:-
తండ్రి మాతలపై జ్ఞాన కలశాన్ని ఎందుకు పెడతారు? ఏ ఒక్క ఆచారము భారత్ లోనే కొనసాగుతుంది?

జవాబు:-
పవిత్రతా రాఖీని కట్టి అందరినీ పతితుల నుండి పావనులుగా చేసేందుకని తండ్రి మాతలపై జ్ఞాన కలశాన్ని పెడతారు. రక్షాబంధనము యొక్క ఆచారము కూడా భారత్ లోనే ఉంది. సోదరి తన సోదరునికి రాఖీ కడుతుంది. ఇది పవిత్రతకు గుర్తు. తండ్రి అంటారు - పిల్లలూ, మీరు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పావనులుగా అయ్యి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు.

పాట:-
భోళానాథుని కన్నా అతీతమైనవారు...

ఓంశాంతి
ఇది భోళానాథుని మహిమ, వారిని ‘ఇచ్చేవారు’ అని అంటారు. శ్రీ లక్ష్మీ-నారాయణులకు ఈ రాజ్య భాగ్యాన్ని ఎవరు ఇచ్చారు అనేది పిల్లలైన మీకు తెలుసు. తప్పకుండా భగవంతుడే ఇచ్చి ఉంటారు, ఎందుకంటే స్వర్గ స్థాపనను వారే చేస్తారు. స్వర్గ రాజ్యాధికారాన్ని భోళానాథుడు లక్ష్మీ-నారాయణులకు ఎలా అయితే ఇచ్చారో, అలాగే శ్రీకృష్ణుడికి ఇచ్చారు. రాధా-కృష్ణులు అన్నా, లక్ష్మీ-నారాయణులు అన్నా, విషయము ఒకటే. కాకపోతే రాజధాని లేదు. వారికి పరమపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ రాజ్యాన్ని ఇవ్వలేరు. వారి జన్మ స్వర్గములో జరిగింది అనే అంటాము. ఇది పిల్లలైన మీకే తెలుసు. పిల్లలైన మీరే జన్మాష్టమి నాడు అర్థం చేయిస్తారు. శ్రీకృష్ణుని జన్మాష్టమి ఉందంటే మరి రాధది కూడా ఉండాలి ఎందుకంటే ఇద్దరూ స్వర్గవాసులే. రాధా-కృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీ-నారాయణులు అవుతారు. ముఖ్యమైన విషయమేమిటంటే - ఈ రాజ్యాన్ని వారికి ఎవరు ఇచ్చారు? అలాగే ఈ రాజయోగాన్ని ఎప్పుడు మరియు ఎవరు నేర్పించారు? స్వర్గములో అయితే నేర్పించి ఉండరు. సత్యయుగములో అయితే వారు ఎలాగూ ఉత్తమ పురుషులుగానే ఉంటారు. కలియుగము తర్వాత సత్యయుగము వస్తుంది. మరి తప్పకుండా కలియుగ అంతిమములో రాజయోగాన్ని నేర్చుకుని ఉంటారు, తద్వారా కొత్త జన్మలో రాజ్యాన్ని ప్రాప్తి చేసుకున్నారు. పాత ప్రపంచము నుండి కొత్త పావన ప్రపంచముగా తయారవుతుంది. తప్పకుండా పతిత-పావనుడే వచ్చి ఉంటారు. ఇప్పుడు సంగమయుగములో ఏ ధర్మము ఉంటుంది అనేది ఎవ్వరికీ తెలియదు. పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచానికి మధ్యన ఇది పురుషోత్తమ సంగమయుగము, దీని గాయనమే ఉంది. ఈ లక్ష్మీ-నారాయణులు కొత్త ప్రపంచానికి అధిపతులు. వీరి ఆత్మకు గత జన్మలో పరమపిత పరమాత్మ రాజయోగాన్ని నేర్పించారు. ఆ పురుషార్థపు ప్రారబ్ధము వారికి తర్వాత కొత్త జన్మలో లభిస్తుంది. దీని పేరు కళ్యాణకారీ పురుషోత్తమ సంగమయుగము. తప్పకుండా అనేక జన్మల అంతిమ జన్మలోనే వీరికి ఎవరో రాజయోగాన్ని నేర్పించి ఉంటారు. కలియుగములో అనేక ధర్మాలు ఉన్నాయి, సత్యయుగములో ఒకే దేవీ-దేవతా ధర్మము ఉండేది. సంగమయుగములో ఉన్న ఏ ధర్మము ద్వారా వారు పురుషార్థము చేసి రాజయోగాన్ని నేర్చుకున్నారు మరియు సత్యయుగములో ప్రారబ్ధాన్ని అనుభవించారు? సంగమయుగములో బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులే జన్మించారు అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. చిత్రములో కూడా బ్రహ్మా ద్వారా కృష్ణపురి స్థాపన అని ఉంది. విష్ణుపురి అనండి లేదా నారాయణపురి అనండి, విషయము ఒకటే. ఈ చదువు ద్వారా మరియు పావనముగా అవ్వడము ద్వారా మనము కృష్ణపురికి యజమానులుగా అవుతాము అని ఇప్పుడు మీకు తెలుసు. ఇది శివ భగవానువాచ కదా. శ్రీకృష్ణుని ఆత్మనే అనేక జన్మల అంతిమ జన్మలో మళ్ళీ ఇలా అవుతారు. 84 జన్మలు తీసుకుంటారు కదా. ఇది 84వ జన్మ, వీరికే బ్రహ్మా అన్న పేరు పెడతారు. లేకపోతే బ్రహ్మా ఎక్కడి నుండి వస్తారు. ఒకవేళ ఈశ్వరుడు రచనను రచిస్తే మరి బ్రహ్మా-విష్ణు-శంకరులు ఎక్కడి నుండి వచ్చారు? మరి వారు రచనను ఎలా రచించారు? మాయమంత్రాలు చేసి రచించారా! తండ్రియే వారి చరిత్ర గురించి తెలియజేస్తారు. దత్తత తీసుకోవడం జరిగినప్పుడు పేరు మారుస్తారు. ఇంతకుముందు బ్రహ్మా అన్న పేరు లేదు కదా. అనేక జన్మల అంతిమములో... అని అంటారు, మరి తప్పకుండా పతిత మానవుడిగా అయ్యారు. బ్రహ్మా ఎక్కడి నుండి వచ్చారు అన్నది ఎవ్వరికీ తెలియదు. అనేక జన్మల అంతిమ జన్మ అంటే ఎవరిది అయినట్లు? లక్ష్మీ-నారాయణులే అనేక జన్మలు తీసుకున్నారు. నామ, రూప, దేశ, కాలాలు మారుతూ ఉంటాయి. శ్రీకృష్ణుని చిత్రములో 84 జన్మల కథ స్పష్టముగా వ్రాసి ఉంది. జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుని చిత్రాలు కూడా చాలా అమ్ముడుపోతూ ఉండవచ్చు ఎందుకంటే శ్రీకృష్ణుని మందిరములోకైతే అందరూ వెళ్తారు కదా. రాధా-కృష్ణుల మందిరములోకే వెళ్తారు. శ్రీకృష్ణునితో పాటు రాధ తప్పకుండా ఉంటుంది. రాకుమారి-రాకుమారులైన రాధా-కృష్ణులే మహారాజు-మహారాణి అయిన లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. వారే 84 జన్మలు తీసుకుని తిరిగి అంతిమ జన్మలో బ్రహ్మా-సరస్వతులుగా అయ్యారు. అనేక జన్మల అంతిమములో తండ్రి ప్రవేశించారు మరియు ‘నీకు నీ జన్మల గురించి తెలియదు’ అని వీరికే చెప్తారు. మీరు మొదటి జన్మలో లక్ష్మీ-నారాయణులుగా ఉండేరు, తర్వాత ఈ జన్మ తీసుకున్నారు. అయితే వారు అర్జునుడు అని పేరు పెట్టారు. అర్జునుడికి రాజయోగాన్ని నేర్పించారు అన్నారు. అర్జునుడిని వేరు చేసేసారు. కానీ ఇతని పేరు అర్జునుడు కాదు. బ్రహ్మా యొక్క జీవిత చరిత్ర కావాలి కదా. కానీ బ్రహ్మా మరియు బ్రాహ్మణుల యొక్క వర్ణన ఎక్కడా లేదు. ఈ విషయాలను తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. పిల్లలందరూ వింటారు, ఆ తర్వాత పిల్లలు ఇతరులకు అర్థం చేయిస్తారు. కథను విని తర్వాత ఇతరులను కూర్చోబెట్టి వినిపిస్తారు. అలా మీరు కూడా వింటారు మరియు తర్వాత వినిపిస్తారు. ఇది పురుషోత్తమ సంగమయుగము, లీప్ యుగము, ఎక్స్ ట్రా యుగము. పురుషోత్తమ మాసము వచ్చిందంటే 13 నెలలు అవుతాయి. ఈ సంగమయుగములోని పండుగలనే ప్రతి సంవత్సరము జరుపుకుంటారు. ఈ పురుషోత్తమ సంగమయుగము గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ సంగమయుగములోనే తండ్రి వచ్చి పవిత్రముగా తయారుచేసే ప్రతిజ్ఞను చేయిస్తారు. పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచ స్థాపనను చేస్తారు. రక్షాబంధనము యొక్క ఆచారము కూడా భారత్ లోనే ఉంది. సోదరి తన సోదరుడికి రాఖీ కడుతుంది. కానీ ఆ కుమారి కూడా తర్వాత అపవిత్రమైపోతుంది. ఇప్పుడు తండ్రి మాతలైన మీపై జ్ఞాన కలశాన్ని పెట్టారు. బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలు కూర్చుని పవిత్రతా ప్రతిజ్ఞను చేయించి రాఖీని కడతారు. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అయ్యి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. అంతేకానీ రాఖీ మొదలైనవి కట్టవలసిన అవసరం లేదు. ఇది అర్థం చేయించడం జరుగుతుంది. ఉదాహరణకు సాధు-సన్యాసులు దానము అడుగుతారు, కొందరు క్రోధాన్ని దానమివ్వండి అని అంటారు, కొందరు ఉల్లి తినకండి అని అంటారు. ఎవరైతే స్వయం తినకుండా ఉంటారో వారే దానము తీసుకుంటూ ఉండవచ్చు. వీటన్నిటికన్నా భారీ ప్రతిజ్ఞను అయితే అనంతమైన తండ్రి చేయిస్తారు. మీరు పావనముగా అవ్వాలనుకుంటే పతిత-పావనుడైన తండ్రిని స్మృతి చేయండి. ద్వాపరము నుండి మొదలుకుని మీరు పతితముగా అవుతూ వచ్చారు. ఇప్పుడు మొత్తము ప్రపంచమంతా పావనమైనది కావాలి, దానినైతే తండ్రియే తయారుచేయగలరు. సర్వుల గతి, సద్గతిదాతగా మనుష్యులెవ్వరూ అవ్వలేరు. తండ్రియే పావనముగా అయ్యే ప్రతిజ్ఞను తీసుకుంటారు. భారత్ పావన స్వర్గముగా ఉండేది కదా. పతిత-పావనుడు ఆ పరమపిత పరమాత్మయే. శ్రీకృష్ణుడిని పతిత-పావనుడు అని అనరు. వారు జన్మ తీసుకుంటారు. వారికి తల్లిదండ్రులను కూడా చూపిస్తారు. ఒక్క శివునిదే అలౌకిక జన్మ. నేను సాధారణ తనువులో ప్రవేశిస్తాను అని వారు స్వయమే తమ పరిచయాన్ని ఇస్తారు. శరీరము యొక్క ఆధారాన్ని తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది. నేను జ్ఞాన సాగరుడిని, పతిత-పావనుడుని, రాజయోగాన్ని నేర్పించేవాడిని. తండ్రియే స్వర్గ రచయిత మరియు నరకాన్ని వినాశనము చేయిస్తారు. స్వర్గము ఉన్నప్పుడు నరకము ఉండదు. ఇప్పుడు పూర్తిగా రౌరవ నరకముగా ఉంది. ఎప్పుడైతే పూర్తిగా తమోప్రధాన నరకములా అవుతుందో, అప్పుడే తండ్రి వచ్చి సతోప్రధాన స్వర్గాన్ని తయారుచేస్తారు. 100 శాతం పతితము నుండి 100 శాతం పావనముగా తయారుచేస్తారు. మొదటి జన్మ తప్పకుండా సతోప్రధానమైనదే లభిస్తుంది. పిల్లలు విచార సాగర మంథనము చేసి భాషణ ఇవ్వాలి. అర్థం చేయించే విధానము ఒక్కొక్కరిదీ వేరు-వేరుగా ఉంటుంది. తండ్రి కూడా ఈ రోజు ఒక విషయాన్ని, రేపు మరో విషయాన్ని అర్థం చేయిస్తారు. ఒకే విధంగా అయితే అర్థం చేయించరు. ఒకవేళ టేప్ ద్వారా ఎవరైనా ఏక్యురేట్ గా విన్నా కానీ అంతే ఏక్యురేట్ గా తిరిగి వినిపించలేరు. తప్పకుండా తేడా వస్తుంది. తండ్రి ఏదైతే వినిపిస్తారో, అదంతా డ్రామాలో ఫిక్స్ అయి ఉందని మీకు తెలుసు. ప్రతి అక్షరము కల్పక్రితం ఏదైతే వినిపించారో దానిని మళ్ళీ ఈ రోజు వినిపిస్తారు. రికార్డు నిండి ఉంది. భగవంతుడు స్వయం అంటున్నారు - నేను 5000 సంవత్సరాల క్రితం ప్రతి అక్షరము ఏదైతే వినిపించానో, అదే ఇప్పుడు వినిపిస్తాను. ఇది షూటింగ్ చేయబడిన డ్రామా. ఇందులో కొద్దిగా కూడా తేడా రాదు. ఇంత చిన్న ఆత్మలో రికార్డు నిండి ఉంది. ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరిగింది అన్నది కూడా పిల్లలు అర్థం చేసుకుంటారు. నేటికి 5000 సంవత్సరాల క్రితములో కొన్ని రోజులు తక్కవ అని అనవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇంకా చదువుకుంటూ ఉన్నారు. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. పిల్లల హృదయములో ఎంత సంతోషముంది. శ్రీకృష్ణుని ఆత్మ 84 జన్మల చక్రములో తిరిగింది అని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుని నామ-రూపాలలోకి రాబోతుంది. పాత ప్రపంచాన్ని కాలదన్నుతున్నట్లుగా, కొత్త ప్రపంచము చేతిలో ఉన్నట్లుగా చిత్రములో చూపించారు. ఇప్పుడు ఇంకా చదువుకుంటూ ఉన్నారు, అందుకే శ్రీకృష్ణుడు రాబోతున్నాడు అని అంటారు. తప్పకుండా తండ్రి అనేక జన్మల అంతిమములోనే చదివిస్తారు. ఈ చదువు పూర్తయితే శ్రీకృష్ణుడు జన్మ తీసుకుంటాడు. చదువుకు ఇంకా కొద్ది సమయమే ఉంది. తప్పకుండా అనేక ధర్మాల వినాశనము జరిగిన తర్వాత శ్రీకృష్ణుడి జన్మ జరిగి ఉంటుంది. అది కూడా కేవలం ఒక్క శ్రీకృష్ణుడు మాత్రమే కాదు, పూర్తి శ్రీకృష్ణపురి అంతా ఉంటుంది. బ్రాహ్మణులే మళ్ళీ ఈ రాజయోగాన్ని నేర్చుకుని దేవతా పదవిని పొందుతారు. జ్ఞానము ద్వారానే దేవతలుగా అవుతారు. తండ్రి వచ్చి చదువు ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. ఇది పాఠశాల, ఇందులో చాలా ఎక్కువ సమయము పడుతుంది. చదువు అయితే సహజమైనదే, ఇకపోతే యోగములో శ్రమ ఉంది. శ్రీకృష్ణుడి ఆత్మ ఇప్పుడు పరమపిత పరమాత్ముని ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటుంది అని మీరు చెప్పవచ్చు. విష్ణుపురి రాజ్యాన్ని ఇవ్వడానికి శివబాబా బ్రహ్మా ద్వారా ఆత్మలమైన మనల్ని చదివిస్తున్నారు. మనం ప్రజాపిత బ్రహ్మాకు సంతానమైన బ్రాహ్మణ, బ్రాహ్మణీలము. ఇది సంగమయుగము. ఇది చాలా చిన్నని యుగము. పిలక అన్నిటికంటే చిన్నదిగా ఉంటుంది కదా, దానికన్నా పెద్దది ముఖము, దాని కన్నా పెద్దవి బాహువులు, వాటి కన్నా పెద్దది పొట్ట, దానికన్నా పెద్దవి కాళ్ళు. విరాట రూపాన్ని చూపిస్తారు, కానీ దాని వివరణను ఎవ్వరూ చెప్పలేరు. పిల్లలైన మీరు ఈ 84 జన్మల చక్ర రహస్యాన్ని అర్థం చేయించాలి. శివ జయంతి తర్వాత శ్రీకృష్ణ జయంతి ఉంటుంది.

పిల్లలైన మీ కొరకు ఇది సంగమయుగము. మీ కొరకు కలియుగము పూర్తయిపోయింది. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, ఇప్పుడు నేను మిమ్మల్ని సుఖధామానికి, శాంతిధామానికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. మీరు సుఖధామములో ఉండేవారు, ఆ తర్వాత దుఃఖధామములోకి వచ్చారు. బాబా, ఈ పాత ప్రపంచములోకి రండి అని పిలుస్తారు. ఇది మీ ప్రపంచమైతే కాదు. ఇప్పుడు మీరు ఏమి చేస్తున్నారు? యోగబలముతో మీ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. అహింసా పరమో దేవీ-దేవతా ధర్మము అని అంటారు. మీరు అహింసకులుగా అవ్వాలి. కామ ఖడ్గాన్ని ఉపయోగించకూడదు, అలాగే గొడవపడటము, కొట్లాడటము చేయకూడదు. తండ్రి అంటారు, నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తాను. లక్షల సంవత్సరాల విషయమే లేదు. తండ్రి అంటారు, యజ్ఞములు, తపస్సులు, దాన-పుణ్యాలు మొదలైనవి చేస్తూ మీరు కిందకు పడిపోతూ వచ్చారు. జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తుంది. మనుష్యులైతే కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతూ ఉన్నారు, వారు అసలు మేలుకోవడమే లేదు, అందుకే తండ్రి అంటారు - నేను కల్ప-కల్పము వస్తాను, డ్రామాలో నా పాత్ర కూడా ఉంది. పాత్ర లేకుండా నేను కూడా ఏమీ చేయలేను. నేను కూడా డ్రామా బంధనములో ఉన్నాను. పూర్తిగా సమయానికి వస్తాను. డ్రామా ప్లాన్ అనుసారముగా నేను పిల్లలైన మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్తాను. ఇప్పుడు మన్మనాభవ అని చెప్తున్నాను. కానీ దీని అర్థము కూడా ఎవరికీ తెలియదు. తండ్రి అంటారు, దేహపు సర్వ సంబంధాలను విడిచి నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అయిపోతారు. తండ్రిని స్మృతి చేయడానికి పిల్లలు శ్రమ చేస్తూ ఉంటారు. ఇది ఈశ్వరీయ విశ్వ విద్యాలయము, పూర్తి విశ్వానికి సద్గతిని ఇచ్చే ఈశ్వరీయ విశ్వ విద్యాలయము మరొకటేది ఉండదు. తండ్రి అయిన ఈశ్వరుడే స్వయంగా వచ్చి పూర్తి విశ్వాన్ని పరివర్తన చేస్తారు. నరకము నుండి స్వర్గముగా తయారుచేస్తారు. అప్పుడు దానిపై మీరు రాజ్యము చేస్తారు. శివుడిని బబుల్ నాథ్ అని కూడా అంటారు ఎందుకంటే వారు వచ్చి మిమ్మల్ని కామ ఖడ్గము నుండి విడిపించి పావనముగా తయారుచేస్తారు. భక్తి మార్గములో అయితే ఎంతో ఆర్భాటము ఉంటుంది, ఇక్కడైతే శాంతిగా స్మృతి చేయవలసి ఉంటుంది. వారు అనేక రకాల హఠయోగాలు మొదలైనవి చేస్తారు. వారి నివృత్తి మార్గమే వేరు. వారు బ్రహ్మ తత్వాన్ని నమ్ముతారు. ఆ బ్రహ్మయోగులు తత్వయోగులు. కానీ అది ఆత్మలు నివసించే స్థానము, దానిని బ్రహ్మాండము అని అంటారు. వారు బ్రహ్మ తత్వాన్నే భగవంతునిగా భావిస్తారు, దానిలో లీనమైపోతామని అనుకుంటారు అంటే ఆత్మను వినాశీగా చేస్తున్నారు. తండ్రి అంటారు, నేనే వచ్చి సర్వులకు సద్గతిని ఇస్తాను. శివబాబాయే సర్వులకు సద్గతిని ఇస్తారు కావున వారు వజ్రము వంటివారు. వారు మిమ్మల్ని బంగారు యుగములోకి తీసుకువెళ్తారు. మీది కూడా ఇది వజ్రతుల్యమైన జన్మ, ఆ తర్వాత బంగారు యుగములోకి వెళ్తారు. ఈ జ్ఞానాన్ని మీకు తండ్రియే వచ్చి చదివిస్తారు, దీని ద్వారా మీరు దేవతలుగా అవుతారు. ఆ తర్వాత ఈ జ్ఞానము కనుమరుగైపోతుంది. ఈ లక్ష్మీ-నారాయణులలో కూడా రచయిత మరియు రచనల గురించిన జ్ఞానము లేదు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పాత ప్రపంచములో ఉంటూ డబుల్ అహింసకులుగా అయ్యి యోగబలముతో తమ కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసుకోవాలి. తమ జీవితాన్ని వజ్రతుల్యముగా తయారుచేసుకోవాలి.

2. తండ్రి ఏదైతే వినిపిస్తారో, దానిపై విచార సాగర మంథనము చేసి ఇతరులకు వినిపించాలి. ఈ చదువు పూర్తయితే మేము కృష్ణపురిలోకి వెళ్తాము అని సదా నషా ఉండాలి.

వరదానము:-
అపవిత్రత యొక్క నామ-రూపాలను కూడా సమాప్తము చేసి హిజ్ హోలీనెస్ అనే టైటిల్ ను ప్రాప్తి చేసుకునే హోలీహంస భవ

ఏ విధముగా హంస ఎప్పుడూ రాళ్ళను ఏరదో, రత్నాలనే ధారణ చేస్తుందో, అలా హోలీహంసలు ఎవ్వరి అవగుణాలను అనగా రాళ్ళను ధారణ చెయ్యరు. వారు వ్యర్థాన్ని మరియు సమర్థాన్ని వేరు చేసి, వ్యర్థాన్ని వదిలేస్తారు, సమర్థాన్ని అలవరచుకుంటారు. అటువంటి హోలీహంసలే పవిత్రమైన శుద్ధ ఆత్మలు, వారి ఆహారము, వ్యవహారము అన్నీ శుద్ధముగా ఉంటాయి. ఎప్పుడైతే అశుద్ధత అనగా అపవిత్రత యొక్క నామ-రూపాలు కూడా సమాప్తమైపోతాయో, అప్పుడు భవిష్యత్తులో హిజ్ హోలీనెస్ అన్న టైటిల్ ప్రాప్తిస్తుంది, అందుకే ఎప్పుడూ పొరపాటున కూడా ఎవరి అవగుణాలను ధారణ చెయ్యకండి.

స్లోగన్:-
ఎవరైతే పాత స్వభావ, సంస్కారాల యొక్క వంశాన్ని కూడా త్యాగము చేస్తారో, వారే సర్వంశ త్యాగులు.

అవ్యక్త సూచనలు - సహజయోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి

ఏ కార్యము చేస్తున్నా కూడా బాబా స్మృతిలో లవలీనులై ఉండండి. ఏ విషయము యొక్క విస్తారములోకి వెళ్ళకుండా, విస్తారానికి బిందువు పెట్టి బిందువులో ఇమిడిపోయేలా చేయండి. బిందువుగా అవ్వండి, బిందువు పెట్టండి, అప్పుడు మొత్తము విస్తారమంతా, మొత్తము వల అంతా ఒక్క క్షణములో ఇమిడిపోతుంది మరియు సమయము పొదుపు అవుతుంది, శ్రమ పడటము నుండి విముక్తులవుతారు. బిందువుగా అయ్యి బిందువులో లవలీనులైపోతారు.