10-10-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైనపిల్లలూ - మీకు ఒక్క తండ్రి నుండి ఏక మతము లభిస్తుంది, దానిని అద్వైత మతము అని అంటారు, ఈ అద్వైత మతము ద్వారానే మీరు దేవతలుగా అవ్వాలి’’

ప్రశ్న:-
మనుష్యులు ఈ భూల్-భులయ్యా ఆట (తికమకదారుల ఆట) లో అన్నింటికన్నా ముఖ్యంగా ఏ విషయాన్ని మర్చిపోయారు?

జవాబు:-
మన ఇల్లు ఎక్కడుందో, ఆ ఇంటి యొక్క మార్గాన్నే ఈ ఆటలోకి వచ్చి మర్చిపోయారు. ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి మరియు ఎలా వెళ్ళాలి అనేది తెలియనే తెలియదు. మిమ్మల్ని అందరినీ తమతో పాటు తీసుకువెళ్ళేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. వాణి నుండి అతీతంగా స్వీట్ హోమ్ కు (మధురమైన ఇంటికి) వెళ్ళడమే ఇప్పుడు మీ పురుషార్థము.

పాట:-
రాత్రి ప్రయాణికుడా అలసిపోకు...

ఓంశాంతి
డ్రామా ప్లాన్ అనుసారంగా పాట అర్థాన్ని ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. మనుష్యుల ద్వారా కొన్ని పాటలు ఎలా తయారుచేయబడ్డాయి అంటే అవి మీకు సహాయం చేస్తాయి. ఇప్పుడు మనమే మళ్ళీ దేవీ-దేవతలుగా అవుతున్నామని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఏ విధంగా ఆ చదువును చదువుకునేవారు, మేము డాక్టరుగా, బ్యారిస్టరుగా అవుతున్నామని అంటారో, అదే విధంగా - మనమే మళ్ళీ కొత్త ప్రపంచము కొరకు దేవతలుగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది. ఈ ఆలోచన కేవలం మీకు మాత్రమే కలుగుతుంది. కొత్త ప్రపంచము, అమరలోకము అని సత్యయుగాన్నే అంటారు. ఇప్పుడు సత్యయుగమూ లేదు, దేవతల రాజ్యమూ లేదు. ఇక్కడ అవి ఉండవు. మీకు తెలుసు - ఈ చక్రములో తిరిగి ఇప్పుడు మనము కలియుగములో కూడా అంతిమంలోకి వచ్చి చేరుకున్నాము. ఇంకెవ్వరి బుద్ధిలోకి ఈ చక్రము రాదు. వారు సత్యయుగము లక్షల సంవత్సరాలు అని అంటారు. తప్పకుండా 5 వేల సంవత్సరాల తర్వాత ఈ చక్రము తిరుగుతూ ఉంటుందని పిల్లలైన మీకు నిశ్చయముంది. మనుష్యులు 84 జన్మలే తీసుకుంటారు, లెక్క ఉంది కదా. ఈ దేవీ-దేవతా ధర్మాన్ని అద్వైత ధర్మము అని కూడా అంటారు. అద్వైత శాస్త్రాన్ని కూడా నమ్ముతారు. అది కూడా ఒక్కటే, మిగిలిన ధర్మాలు అనేకమున్నాయి, శాస్త్రాలు కూడా అనేకమున్నాయి. మీరు ఒక్కరే. ఒక్కరి ద్వారా ఒకే మతము లభిస్తుంది. దీనిని అద్వైత మతము అని అంటారు. ఈ అద్వైత మతము మీకు లభిస్తుంది. దేవీ-దేవతలుగా అయ్యేందుకు ఈ చదువు ఉంది కదా, అందుకే తండ్రిని జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. కొత్త ప్రపంచము కోసం మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. స్కూలులో విద్యార్థులు ఎప్పుడైనా టీచర్ ను మర్చిపోతారా? లేదు. గృహస్థ వ్యవహారములో ఉండేవారు కూడా పెద్ద పొజిషన్ పొందాలని చదువుకుంటారు. మీరు కూడా గృహస్థ వ్యవహారంలో ఉంటూ, మీ ఉన్నతి కోసం చదువుకుంటారు. మేము అనంతమైన తండ్రి ద్వారా చదువుకుంటున్నాము అని మనసులో ఉండాలి. శివబాబా కూడా తండ్రి, ప్రజాపిత బ్రహ్మా కూడా తండ్రి. ప్రజాపిత బ్రహ్మా, ఆదిదేవ్ అన్న పేర్లు ప్రసిద్ధమైనవి. కాకపోతే వీరు ఒకప్పుడు ఉండేవారు. ఉదాహరణకు గాంధీ కూడా గతంలోనే ఉండేవారు కదా. వారిని బాపూజీ అని అంటారు కానీ అర్థము చేసుకోరు, ఏదో నామమాత్రంగా అంటూ ఉంటారు. ఈ శివబాబా సత్యాతి-సత్యమైనవారు, బ్రహ్మాబాబా కూడా సత్యాతి-సత్యమైనవారు, లౌకిక తండ్రి కూడా సత్యాతి-సత్యమైనవారే ఉంటారు. ఇకపోతే మేయర్ మొదలైనవారినైతే నామమాత్రంగా బాపూ (తండ్రి) అని అంటారు. వారందరూ ఆర్టిఫీషియల్. వీరు రియల్. పరమాత్మ తండ్రి వచ్చి ప్రజాపిత బ్రహ్మా ద్వారా ఆత్మలను తమవారిగా చేసుకుంటారు. వారికి తప్పకుండా చాలామంది పిల్లలుంటారు. శివబాబాకు అందరూ పిల్లలే, వారిని అందరూ తలచుకుంటారు. అయినా కొందరు వారిని కూడా నమ్మరు, పక్కా నాస్తికులుగా ఉంటారు - ఈ ప్రపంచము సంకల్పాలతో తయారయ్యింది అని అంటారు. ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయిస్తారు - మనము చదువుకుంటున్నామని, చదివించేవారు శివబాబా అని బుద్ధిలో గుర్తుంచుకోండి. ఇది రాత్రింబవళ్ళు గుర్తుండాలి. మాయ ఈ విషయాన్నే పదే-పదే మరిపింపజేస్తుంది, అందుకే స్మృతి చేయవలసి ఉంటుంది. తండ్రి, టీచర్, గురువు ముగ్గురినీ మర్చిపోతారు. ముగ్గురూ ఒక్కరే, అయినా మర్చిపోతారు. ఇందులోనే రావణుడితో యుద్ధము జరుగుతుంది. తండ్రి అంటారు - హే ఆత్మలూ, మీరు సతోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. శాంతిధామంలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేవారు. పవిత్రత లేకుండా ఏ ఆత్మ కూడా పైన ఉండలేదు, అందుకే ఆత్మలందరూ పతితపావనుడైన తండ్రిని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే అందరూ పతితులుగా, తమోప్రధానముగా అవుతారో, అప్పుడు తండ్రి వచ్చి అంటారు - నేను మిమ్మల్ని సతోప్రధానంగా తయారుచేస్తాను. మీరు శాంతిధామంలో ఉన్నప్పుడు అక్కడ అందరూ పవిత్రంగా ఉండేవారు. అపవిత్ర ఆత్మలు అక్కడ ఉండలేవు. అందరూ శిక్షలను అనుభవించి పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. పవిత్రంగా అవ్వకుండా ఎవరూ తిరిగి వెళ్ళలేరు. బ్రహ్మ తత్వములో లీనమయ్యారు, ఫలానా జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని కొందరు అంటారు. ఇవన్నీ భక్తి మార్గపు అనేక అభిప్రాయాలు. మీది అద్వైత మతము. మనుష్యుల నుండి దేవతలుగా ఒక్క తండ్రి మాత్రమే తయారుచేయగలరు. కల్ప-కల్పము తండ్రి చదివించేందుకు వస్తారు. వారి పాత్ర కల్పక్రితము వలె యథావిధిగా నడుస్తుంది. ఇది అనాదిగా తయారై-తయారుచేయబడిన డ్రామా కదా. సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, తర్వాత ఈ సంగమయుగము ఉంది. ముఖ్యమైన ధర్మాలు కూడా - దేవతా ధర్మము, ఇస్లామ్ ధర్మము, బౌద్ధ ధర్మము, క్రిస్టియన్ ధర్మము, వీరికి రాజ్యము ఉంటుంది. బ్రాహ్మణులకూ రాజ్యము ఉండదు, కౌరవులకూ రాజ్యము ఉండదు. ఇప్పుడు పిల్లలైన మీరు అనంతమైన తండ్రిని ఘడియ-ఘడియ స్మృతి చేయాలి. మీరు బ్రాహ్మణులకు కూడా అర్థం చేయించవచ్చు. బాబా చాలా సార్లు అర్థం చేయించారు - మొట్టమొదట బ్రాహ్మణుల పిలక ఉంటుంది, బ్రహ్మా వంశావళి మొట్టమొదట మీరే. ఈ విషయాలు మీకు తెలుసు, తర్వాత భక్తి మార్గములో మనమే పూజ్యుల నుండి పూజారులుగా అవుతాము. ఇప్పుడు మళ్ళీ మనమే పూజ్యులుగా అవుతున్నాము. ఆ బ్రాహ్మణులు గృహస్థులుగా ఉంటారు, సన్యాసులుగా ఉండరు. సన్యాసులు హఠయోగులు, ఇళ్ళు-వాకిళ్ళను వదలడము అంటే హఠమే కదా. హఠయోగులు కూడా అనేక రకాల యోగాలు నేర్పిస్తారు. జైపూర్ లో హఠయోగుల మ్యూజియం కూడా ఉంది. అక్కడ రాజయోగానికి సంబంధించిన చిత్రాలు లేవు. రాజయోగానికి సంబంధించిన చిత్రాలు ఇక్కడ దిల్వాడాలో ఉన్నాయి. రాజయోగానికి సంబంధించిన మ్యూజియం అయితే లేదు. హఠయోగానికి సంబంధించిన మ్యూజియంలు ఎన్ని ఉన్నాయి. రాజయోగ మందిరము ఇక్కడ భారత్ లో మాత్రమే ఉంది. ఇది చైతన్యమైనది. ఇక్కడ మీరు చైతన్యంలో కూర్చున్నారు. మనుష్యులకు స్వర్గము ఎక్కడ ఉందో ఏ మాత్రం తెలియదు. దిల్వాడా మందిరంలో కింద తపస్యలో కూర్చున్నారు, అది సంపూర్ణ స్మృతిచిహ్నము. తప్పకుండా స్వర్గాన్ని పైనే చూపించవలసి ఉంటుంది. స్వర్గము పైన ఉందని మనుష్యులు భావిస్తారు. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. అర్ధకల్పము తర్వాత స్వర్గము మళ్ళీ కిందకు వెళ్ళిపోతుంది, మళ్ళీ అర్ధకల్పము స్వర్గము పైకి వస్తుంది. దీని ఆయుష్షు ఎంతో ఎవరికీ తెలియదు. తండ్రి మీకు మొత్తం చక్రము గురించి అర్థము చేయించారు. మీరు జ్ఞానము తీసుకుని పైకి వెళ్తారు, చక్రము పూర్తవుతుంది, మళ్ళీ కొత్తగా చక్రము ప్రారంభమవుతుంది. ఇది బుద్ధిలో నడుస్తూ ఉండాలి. ఆ నాలెడ్జ్ చదివేటప్పుడు బుద్ధిలో పుస్తకాలు మొదలైనవన్నీ గుర్తుంటాయి కదా. ఇది కూడా చదువు. ఇది నిండుగా ఉండాలి, దీనిని మర్చిపోకూడదు. ఈ చదువును చదువుకునేందుకు వృద్ధులు, యువకులు, పిల్లలు మొదలైనవారందరికీ హక్కు ఉంది. కేవలం అల్ఫ్ (పరమాత్మ) ను తెలుసుకోవాలి. అల్ఫ్ ను తెలుసుకున్నారంటే తండ్రి ఆస్తి కూడా బుద్ధిలోకి వచ్చేస్తుంది. జంతువులకు కూడా పిల్లలు మొదలైనవన్నీ బుద్ధిలో ఉంటాయి. అడవిలోకి వెళ్ళినా ఇల్లు మరియు పిల్లలు గుర్తుకొస్తూ ఉంటాయి. వాటంతటవే వెతుక్కుంటూ వచ్చేస్తాయి. ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలూ, నన్నొక్కరినే స్మృతి చేయండి మరియు తమ ఇంటిని స్మృతి చేయండి, అక్కడి నుండే మీరు పాత్రను అభినయించేందుకు వచ్చారు. ఆత్మకు ఇల్లు చాలా ప్రియమనిపిస్తుంది. ఎంతగా గుర్తు చేసుకుంటారు కానీ దారి మర్చిపోయారు. మనము చాలా దూరంలో నివసిస్తాము అని మీ బుద్ధిలో ఉంది. కానీ మరి ఆ ఇంటికి ఎలా వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకు మనం వెళ్ళలేము అనేదేమీ తెలియదు, అందుకే తికమక దారుల ఆటను కూడా తయారుచేస్తారని బాబా అన్నారు, ఇందులో ఎటు నుండి వెళ్ళినా ద్వారం మూసి ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసు - ఈ యుద్ధము తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ మృత్యులోకము నుండి అందరూ వెళ్ళిపోతారు, ఇంతమంది మనుష్యులందరూ నంబరువారుగా ధర్మము అనుసారంగా మరియు పాత్ర అనుసారంగా వెళ్ళి అక్కడ ఉంటారు. మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. మనుష్యులు బ్రహ్మ తత్వములోకి వెళ్ళేందుకు ఎంతగా కష్టపడుతుంటారు. వాణి నుండి అతీతముగా వెళ్ళాలి. ఆత్మ శరీరము నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏ శబ్దమూ ఉండదు. అది మన స్వీట్ హోమ్ (మధురమైన ఇల్లు) అని పిల్లలకు తెలుసు. తర్వాత దేవతలది మధురమైన రాజధాని, అద్వైత రాజధాని.

తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. పూర్తి జ్ఞానమంతా అర్థము చేయిస్తారు, దీని గురించే మళ్ళీ భక్తిలో శాస్త్రాలు మొదలైనవి కూర్చుని తయారుచేసారు, ఇప్పుడు మీరు ఆ శాస్త్రాలు మొదలైనవి చదవకూడదు. ఆ పాఠశాలల్లో వృద్ధులు మొదలైనవారు చదువుకోరు. ఇక్కడైతే అందరూ చదువుకుంటారు. పిల్లలైన మీరు అమరలోకములో దేవతలుగా అవుతారు, అక్కడ ఎవరూ ఎవరినీ నిందించే మాటలు మాట్లాడరు. ఇప్పుడు మీకు తెలుసు - స్వర్గము ఒకప్పుడు ఉంది, దానికి మహిమ ఉంది. ఎన్ని మందిరాలను తయారుచేస్తారు. వారిని అడగండి - ఈ లక్ష్మీనారాయణులు ఎప్పుడు ఉండి వెళ్ళారు? వారికి అసలేమీ తెలియదు. ఇప్పుడు మనము మన ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు. ఓం అర్థము వేరు మరియు సో హమ్ యొక్క అర్థము వేరు అని పిల్లలకు అర్థం చేయించారు. కానీ వారు ‘ఓం’ మరియు ‘సో హమ్ సో’, ఈ రెండింటికీ ఒకటే అర్థాన్ని చెప్పారు. ఆత్మలైన మీరు శాంతిధామములో నివసిస్తారు, తర్వాత పాత్రను అభినయించేందుకు వస్తారు. దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా అవుతారు. ఓం అనగా నేను ఆత్మను. ఎంత తేడా ఉంది. కానీ వారు రెండింటికీ ఒకటే అర్థాన్ని చెప్పారు. ఇవి బుద్ధితో అర్థము చేసుకునే విషయాలు. ఎవరైనా పూర్తిగా అర్థము చేసుకోకపోతే కునికిపాట్లు పడుతూ ఉంటారు. సంపాదనలో ఎప్పుడూ కునికిపాట్లు పడరు. ఆ సంపాదన అల్పకాలము కోసమే ఉంటుంది. ఇదైతే అర్ధకల్పము కోసం ఉంటుంది. కానీ బుద్ధి వేరే వైపు భ్రమిస్తుంది, అందుకే అలసిపోతారు. ఆవలింతలు తీస్తూ ఉంటారు. మీరు కళ్ళు మూసుకుని కూర్చోకూడదు. ఆత్మ అవినాశీ, శరీరము వినాశీ అని మీకు తెలుసు. కలియుగీ నరకవాసులైన మనుష్యులు చూడడంలో మరియు మీరు చూడడంలో కూడా రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. ఆత్మలమైన మనము తండ్రి ద్వారా చదువుకుంటున్నాము. ఇది ఎవరికీ తెలియదు. జ్ఞానసాగరుడైన పరమపిత పరమాత్మ వచ్చి చదివిస్తారు. ఆత్మలమైన మనము వింటున్నాము. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మీ బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. శివబాబా మనకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు, ఇందులో చాలా రిఫైన్ బుద్ధి కావాలి. బుద్ధిని రిఫైన్ గా చేసుకునేందుకు తండ్రి యుక్తులను తెలియజేస్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే తండ్రి తప్పకుండా గుర్తుకొస్తారు. తండ్రి స్మృతి ఉండాలని మరియు మొత్తం కల్పమంతా తెగిపోయి ఉన్న సంబంధము జోడించబడి ఉండాలనే స్వయాన్ని ఆత్మగా భావించడం జరుగుతుంది. అక్కడ ప్రారబ్ధము ఉంటుంది, సుఖమే సుఖము ఉంటుంది, దుఃఖము యొక్క మాటే ఉండదు. దానిని స్వర్గము అని అంటారు. స్వర్గ రచయితయే స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు. అటువంటి తండ్రిని కూడా ఎంతగా మర్చిపోతూ ఉంటారు. తండ్రి వచ్చి పిల్లలను దత్తత తీసుకుంటారు. మార్వాడీలు ఎక్కువగా దత్తత తీసుకుంటారు, అప్పుడు - నేను షావుకారుల ఒడిలోకి వచ్చానని పిల్లలకు సంతోషముంటుంది కదా. షావుకారుల బిడ్డ పేదవారి వద్దకు ఎప్పుడూ వెళ్ళడు. మీరు ప్రజాపిత బ్రహ్మా పిల్లలు కావున తప్పకుండా ముఖవంశావళులే అవుతారు కదా. బ్రాహ్మణులైన మీరు ముఖవంశావళి. వారు కుఖవంశావళి. ఈ వ్యత్యాసం మీకు తెలుసు. మీరు అర్థము చేయించినప్పుడు వారు ముఖవంశావళులుగా అవుతారు. ఇది దత్తత తీసుకోవడము వంటిది. పత్నిని ఈమె నా పత్ని అని భావిస్తారు. వాస్తవానికి స్త్రీ కుఖవంశావళినా లేక ముఖవంశావళినా? వాస్తవానికి స్త్రీ అయితే ముఖవంశావళి. తర్వాత పిల్లలు జన్మించినప్పుడు, వారు కుఖవంశావళిగా అవుతారు. తండ్రి అంటారు - వీరంతా ముఖవంశావళి, నా వారు అనగానే నా వారిగా అయిపోయారు కదా. ‘నా పిల్లలు’ అని అనడంతో నషా ఎక్కుతుంది. కావున వీరంతా ముఖవంశావళి, ఆత్మలు ముఖవంశావళి కాదు కదా. ఆత్మ అనాది-అవినాశీ అయినది. ఈ మనుష్య సృష్టి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో మీకు తెలుసు. పాయింట్లు అయితే పిల్లలకు ఎన్నో లభిస్తాయి. అయినా బాబా అంటారు - వేరే ఏదీ ధారణ చేయలేకపోయినా, చెప్పడం రాకపోయినా సరే, ఫర్వాలేదు, మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీరు భాషణ మొదలైనవి చేసేవారి కన్నా ఉన్నత పదవిని పొందగలరు. భాషణ చేసేవారు కొన్ని సందర్భాలలో తుఫానుల్లో పడిపోతారు. కానీ వారు పడకుండా, తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఉన్నత పదవిని పొందగలరు. అన్నింటికన్నా ఎక్కువగా వికారాలలో పడిపోయేవారు 5 అంతస్తుల నుండి పడిపోవడంతో ఎముకలు విరిగిపోతాయి. 5వ అంతస్తు - దేహాభిమానము. 4వ అంతస్తు - కామము, ఆ తర్వాత మిగిలినవి. బాబా అంటారు - కామము మహాశత్రువు. బాబా, మేము పడిపోయాము అని కూడా వ్రాస్తారు. మేము పడిపోయాము అని క్రోధం కోసం ఈ విధంగా అనరు. నల్ల ముఖం చేసుకున్నట్లయితే పెద్ద దెబ్బ తగులుతుంది, ఇక ఆ తర్వాత - కామము మహాశత్రువు అని ఇతరులకు చెప్పలేరు. వికారీ దృష్టిని చాలా సంభాళించుకోవాలి అని బాబా పదే-పదే అర్థం చేయిస్తారు. సత్యయుగంలో వివస్త్రంగా అయ్యే మాటే ఉండదు. వికారీ దృష్టి ఉండదు. నిర్వికారీ దృష్టి ఉంటుంది. అది సివిలియన్ రాజ్యము (పవిత్రుల రాజ్యము). ఈ సమయంలో ఇది వికారీ ప్రపంచము. ఇప్పుడు మీ ఆత్మకు పవిత్రమైన దృష్టి లభిస్తుంది, అది 21 జన్మల కొరకు ఉపయోగపడుతుంది. అక్కడ ఎవరూ వికారులుగా అవ్వరు. ఇప్పుడు ముఖ్యమైన విషయాన్ని తండ్రి అర్థం చేయిస్తారు, తండ్రిని స్మృతి చేయండి మరియు 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయండి. శ్రీ నారాయణుడిగా ఉన్నవారే అంతిమంలోకి వచ్చి భాగ్యశాలి రథముగా అవుతారు అనేది కూడా ఒక అద్భుతము. వీరిలో తండ్రి ప్రవేశిస్తారు కావున భాగ్యశాలిగా అవుతారు. బ్రహ్మా నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మాగా, ఈ 84 జన్మల చరిత్ర బుద్ధిలో ఉండాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి స్మృతి ద్వారా బుద్ధిని రిఫైన్ గా చేసుకోవాలి. బుద్ధి చదువుతో సదా నిండుగా ఉండాలి. తండ్రిని మరియు ఇంటిని సదా గుర్తుంచుకోవాలి మరియు ఇతరులకు స్మృతిని ఇప్పించాలి.

2. ఈ అంతిమ జన్మలో వికారీ దృష్టిని సమాప్తము చేసి నిర్వికారీ దృష్టిని తయారుచేసుకోవాలి. వికారీ దృష్టిని చాలా సంభాళించుకోవాలి.

వరదానము:-
దాతాతనపు స్థితి మరియు ఇముడ్చుకునే శక్తి ద్వారా సదా విఘ్న వినాశక, సమాధాన స్వరూప భవ

విఘ్న-వినాశక సమాధాన స్వరూపులుగా అయ్యే వరదానము విశేషముగా రెండు విషయాల ఆధారముగా ప్రాప్తిస్తుంది:-
1. మనము దాతా పిల్లలము కావున మనము అందరికీ ఇవ్వాలి అని సదా స్మృతిలో ఉండాలి. గౌరవము లభించాలి, స్నేహము లభించాలి అప్పుడే స్నేహీలుగా అవుతాము అని కాదు. నేను ఇవ్వాలి.
2. స్వయము కొరకు మరియు సంబంధ-సంపర్కాలలో సర్వుల కొరకు ఇముడ్చుకునే శక్తి స్వరూపము యొక్క సాగరముగా అవ్వాలి. ఈ రెండు విశేషతల ద్వారా శుభ భావన, శుభ కామనలతో సంపన్నులుగా, సమాధాన స్వరూపులుగా అవుతారు.

స్లోగన్:-
సత్యాన్ని తమ సహచరునిగా చేసుకున్నట్లయితే మీ నావ ఎప్పుడూ మునగదు.

అవ్యక్త సూచనలు - స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగము చెయ్యండి

ఎప్పుడైతే మనసులో సదా శుభ భావన మరియు శుభ ఆశీర్వాదాలను ఇచ్చే అభ్యాసము నేచురల్గా అవుతుందో అప్పుడు మీ మనసు బిజీ అయిపోతుంది. మనసులో ఏదైతే అలజడి ఉంటుందో, దాని నుండి స్వతహాగానే పక్కకు తప్పుకుంటారు. స్వ పురుషార్థము విషయములో ఇంతకుముందు నిరాశకు లోనై ఉండవచ్చు, కానీ అది ఇప్పుడు జరగదు. ఇంద్రజాలము అయిపోతుంది.