12-04-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా'
30.11.2009
‘‘బాబాకు మరియు సర్వులకు ప్రియులుగా అయ్యేందుకు
సంతుష్టమణిగా అయ్యి ప్రతి పరిస్థితి యొక్క ప్రభావము నుండి
ముక్తులుగా ఉండండి’’
ఈ రోజు నలువైపులా ఉన్న సంతుష్ట ఆత్మలను చూస్తున్నారు.
సంతుష్టమణులు నలువైపులకు తమ మణి యొక్క మెరుపును
వ్యాపింపజేస్తున్నారు. అన్నింటికన్నా అత్యంత పెద్ద స్థితి
సంతుష్టత. సదా సంతుష్టత సర్వులకు ప్రియముగా అనిపిస్తుంది.
బాబాకైతే అది ఎలాగూ ప్రియమే. ఎవరికైతే సర్వ ప్రాప్తులు ఉన్నాయో,
సదా సంతుష్టముగా వారే ఉండగలరు. ప్రాప్తులకు ఆధారము సంతుష్టత,
అందుకే ఇటువంటి ఆత్మలు సర్వ బ్రాహ్మణాత్మలకు ప్రియమైనవారు.
సర్వ ప్రాప్తులు అనగా సదా సంతుష్టత. సంతుష్ట ఆత్మ యొక్క
ప్రభావము వాయుమండలములో కూడా పడుతుంది. అంతేకాక, సర్వ ప్రాప్తులు
పరమాత్ముని కానుక వంటివి. పరమాత్మ తండ్రి ద్వారా సర్వ శక్తులను,
సర్వ గుణాలను, సర్వ ఖజానాలను ప్రాప్తి చేసుకున్న ఆత్మ సదా
సంతుష్టముగా ఉంటుంది. సంతుష్ట ఆత్మ యొక్క స్థితి సదా
ప్రగతిశీలంగా ఉంటుంది. పరిస్థితి సంతుష్ట ఆత్మపై ప్రభావము
చూపలేదు ఎందుకంటే ఎక్కడైతే సంతుష్టత ఉంటుందో అక్కడకు సర్వ
శక్తులు, సర్వ గుణాలు స్వతహాగానే వస్తాయి. ఒక్క సంతుష్టత అనేక
గుణాలను తన సొంతం చేసుకుంటుంది. కావున ప్రతి ఒక్కరూ స్వయాన్ని
ప్రశ్నించుకోండి - నేను సదా సంతుష్ట ఆత్మగా ఉంటున్నానా!
సంతుష్ట ఆత్మ సదా సర్వులకు, తండ్రికి సమీపముగా మరియు సమాన
స్థితిలో ఉంటుంది. కానీ ఈ స్థితిలో ఉండేందుకు ఎంతో సాక్షీదృష్టా
అవస్థ కావాలి, త్రికాలదర్శీ అవస్థ కావాలి. ప్రతి కర్మను
త్రికాలదర్శిగా చూస్తూ అనగా ప్రతి విషయము యొక్క మూడు కాలాలను
పరిశీలించి ఆ తర్వాత కర్మను చేయాలి. దీని కొరకు రెండు విషయాలు
అవసరము. ఆ రెండు విషయాలు ఏమిటంటే - సంబంధము మరియు సంపద. సంబంధము
కూడా అవినాశీగా ఉండాలి మరియు సంపద కూడా అవినాశీగా ఉండాలి. ఇవి
అవినాశీ తండ్రి ద్వారా ప్రాప్తిస్తాయి. ఎప్పుడైతే అవినాశీ సంపద
మరియు అవినాశీ సంబంధము ప్రాప్తిస్తాయో, అప్పుడు ఆత్మ సదా
సంతుష్టముగా ఉంటుంది మరియు తండ్రికి, సర్వాత్మలకు అతి ప్రియము
అయిపోతుంది. మాయా రూపములో ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ గాబరా
పడరు. అనంతమైన తెర పైన మిక్కీ మౌస్ ఆట జరుగుతున్నట్లుగా
అనుభవమవుతుంది, కలత చెందరు, మిక్కీ మౌస్ ఆటను చూసి మనోరంజనాన్ని
పొందుతారు. మాయ యొక్క భిన్న-భిన్న రూపాలను భిన్న-భిన్న మిక్కీ
మౌస్ రూపాలుగా అనుభవం చేస్తారు. ఇటువంటి స్థితి యొక్క
అనుభవాన్ని బాబా ద్వారా అందరూ ప్రాప్తి చేసుకోవలసిందే మరియు
చేసుకున్నారు కూడా.
బాప్ దాదా చూస్తున్నారు, విజయీ ఆత్మలు నిర్భయులుగా, ఏకాగ్ర
బుద్ధి కలవారిగా అయి ఎటువంటి పరిస్థితిలోనూ అలజడిలోకి రారు.
బాబాకు ప్రతి బిడ్డ పట్ల ఉన్న శుభ ఆశ ఏమిటంటే - ప్రతి బిడ్డ సదా
విజయీగా అయ్యి బాబాకు తమ విజయ స్వరూపాన్ని చూపించాలి. మరి ప్రతి
ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి - నేను ఎవరిని? బాప్ దాదా
ఇంతకుముందు కూడా వినిపించారు, ‘అప్పుడప్పుడు’ అన్న పదాన్ని
సమయమనుసారముగా ఇప్పుడు బ్రాహ్మణ డిక్షనరీ నుండి సమాప్తము చేయండి.
బాబా నుండి సదా కొరకు వారసత్వాన్ని తీసుకోవాలి అన్నప్పుడు ప్రతి
ప్రాప్తి సదా ప్రాప్తమై ఉండాలి ఎందుకంటే బాబా యొక్క హృదయపూర్వక
ఆశలను పూర్తి చేసే ఆశా దీపాలు మీరు. వారి సంకల్పములో కూడా
‘అప్పుడప్పుడు’ అన్న పదము రాలేదు. ఎందుకని? సదా తండ్రితోపాటుగా
మరియు తండ్రికి సహచరునిగా ఉన్నారు. బాబాతోపాటు ఉండేవారు కూడా
మరియు సహచరునిగా అయి విశ్వ పరివర్తన కార్యాన్ని చేసేవారు కూడా.
మరి చెప్పండి, సదా అన్న ఈ వరదానాన్ని బాప్ దాదా ద్వారా
ప్రాప్తి చేసుకున్నారు కదా! జన్మ తీసుకోగానే బాప్ దాదా ప్రతి
బిడ్డకు సదా ఇదే వరదానాన్ని ఇస్తున్నారు - సదా యోగీ భవ, పవిత్ర
భవ. ఈ వరదానము ద్వారా ఏయే ప్రాప్తులైతే కలుగుతాయో, అవి సదా
కొరకు నిలిచి ఉంటాయి, అప్పుడప్పుడూ మాత్రమే కాదు. కావున
పిల్లలందరూ సదా కొరకు అధికారులు, ఎందుకంటే బాబాకు ప్రతి బిడ్డ
పట్ల, అది చివరి బిడ్డ అయినా కూడా, బాబాకు ప్రతి బిడ్డ పట్ల
మనస్ఫూర్వకమైన ప్రేమ ఉంది ఎందుకంటే ఎవరైతే పెద్ద-పెద్దవారు
ఉన్నారో, ఎవరైతే తమను తాము తెలివైనవారిగా భావిస్తున్నారో, వారు
కూడా బాబాను గుర్తించలేకపోయారు, కానీ బాప్ దాదా యొక్క చివరి
బిడ్డ కూడా బాబాను గుర్తించారు. మనస్ఫూర్తిగా నా బాబా అని
అంటారు, అందుకే బాబాకు ప్రతి బిడ్డ పట్ల అవినాశీ ప్రేమ ఉంది,
అందుకే ప్రతి బిడ్డకు బాబా యొక్క వరదానము ఉంది. పిల్లలు
నంబరువారుగా ఉన్నా కానీ బాప్ దాదా రోజూ ఒకే సమయములో, ఒకే
వరదానాన్ని పిల్లలందరికీ ఒకేసారి ఇస్తున్నారు. బాప్ దాదా యొక్క
ప్రతి బిడ్డ నంబరువారుగా ఉన్నా కానీ ‘నా బాబా’ అని అన్నారంటే
ఇక ప్రతి రోజు వరదానానికి అధికారులుగా అయిపోయినట్లే. ప్రతి
బిడ్డ, ఎక్కడ ఉన్నా సరే, ఇండియాలో ఉన్నా లేక విదేశాలలో ఉన్నా
కానీ, వరదానమైతే బాప్ దాదా నుండి అందరికీ ఒకటే లభిస్తుంది మరియు
వరదానాన్ని ప్రాప్తి చేసుకుని సంతోషిస్తారు కూడా. కానీ రెండు
రకాల పిల్లలు ఉన్నారు. ఒకరు, వరదానాన్ని చూసి తప్పకుండా
సంతోషిస్తారు కానీ ముందు నంబరు ఎవరు తీసుకుంటారంటే, ఎవరైతే
కేవలం వరదానాన్ని చూసి సంతోషపడరో మరియు ఇది నా వరదానము అని
కేవలం వర్ణించరో, కానీ వరదానాన్ని ఫలీభూతము చేస్తారో, వరదానము
నుండి లాభము తీసుకుని వరదానము యొక్క ఫలాన్ని పొందుతారో, వారు
మందు నంబరు తీసుకుంటారు. బీజము ఉంది కానీ బీజాన్ని ఫలీభూతము
చేయకపోతే, ఫలాలు వెలువడేలా చేయకపోతే కేవలం సంతోషము ఉంటుంది.
వరదానము నుండి ఫలం వెలువడేలా చేయడానికి... ఏదైనా బీజము
ఉందనుకోండి, దాని నుండి ఫలం వెలువడేలా చేయడానికి దానికి నీరు
మరియు ఎండ కావాలి, అప్పుడే ఫలము వెలువడుతుంది. అలాగే ఇక్కడ కూడా
ప్రతి బిడ్డ వరదానము నుండి ఫలం వెలువడేలా చేయాలంటే, ఆ ఫలం
ద్వారా విస్తారము జరగాలంటే, తమ మనసులోనే వరదానము నుండి వచ్చిన
ఫలం ద్వారా వృద్ధి జరగాలంటే, దాని కోసం ఇక్కడ కూడా బాబా అంటారు
- వరదానము నుండి ఫలాన్ని వెలువడేలా చేసేందుకు పదే-పదే
వరదానాన్ని స్మృతిలోకి తీసుకురండి, స్మృతి స్వరూప స్థితిలో
స్థితులవ్వండి. పదే-పదే స్మరణ కాదు, కానీ స్మృతి ఉండాలి, ఇది
నీరు అందించడము మరియు స్వరూపములో స్థితులవ్వడము అనగా ఎండను
అందించడము. అది ఫలీభూతమైనప్పుడు స్వయంలో కూడా ఎంతో శక్తి
నిండుతుంది మరియు ఇతరులకు కూడా ఆ ఫలం ద్వారా శక్తిని అనుభవం
చేయించగలరు.
మరి బాప్ దాదా ఇప్పుడు ఏమి కోరుకుంటున్నారు? ఎందుకంటే బాప్
దాదా కొద్ది సమయము నుండి సమయము గురించి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు.
ప్రతి బిడ్డ యొక్క చదువు యొక్క రిజల్టు అకస్మాత్తుగా రానున్నది,
దీని కోసం సదా ఎవర్రెడీగా ఉండాలి. దీనితోపాటు బాప్ దాదా ఈ
సూచనను కూడా ఇస్తున్నారు, అదేమిటంటే - ఇప్పుడు ఇది ఎగిరే కళ
కోసం తీవ్ర పురుషార్థము చేసే సమయము. నడుస్తున్నాము కాదు,
ఎగురుతున్నాము. సాధారణ రీతిలో తమ దినచర్యను గడపడమంటే, ఇప్పుడు
అలా సాధారణ రీతిలో పురుషార్థము చేసే సమయము గడిచిపోయింది, అందుకే
బాప్ దాదా సూచనను ఇస్తున్నారు - ప్రతి క్షణము, ప్రతి సంకల్పము
చెక్ చేసుకోండి. ఒకవేళ తీవ్ర పురుషార్థము చెయ్యకుండా ఒక గంట
సాధారణ పురుషార్థములో ఉన్నట్లయితే ఆ ఒక్క గంటలోనే అకస్మాత్తుగా
ఒకవేళ ఫైనల్ పేపర్ యొక్క సమయము వస్తే, అప్పుడు అంతిమ స్థితిని
బట్టి గతి ఏర్పడుతుంది. ఆ ఒక్క గంట యొక్క సాధారణ పురుషార్థము
ఎంత నష్టపరుస్తుంది! అందుకే బాప్ దాదా ప్రతి బిడ్డకు, ప్రతి
సంకల్పము, ప్రతి క్షణము సమయము యొక్క మహత్వాన్ని గురించి
ఎప్పటికప్పుడు సూచనను ఇస్తూనే ఉన్నారు. అలజడి సమయములో అచలంగా
ఉండే పురుషార్థాన్ని తీవ్ర పురుషార్థులే చెయ్యగలరు. సాధారణ
పురుషార్థీ ఎవర్రెడీగా అవ్వడానికి ఎక్కువ సమయము తీసుకుంటారు
మరియు బాప్ దాదా ఏమన్నారంటే, ఒక్క క్షణములో బిందువు అనగా ఫుల్
స్టాప్ పెట్టాలి. ఒకవేళ తీవ్ర పురుషార్థీగా లేకపోతే ఏమవుతుంది?
అనుభవీలే కదా. ఫుల్ స్టాప్ కు బదులుగా ప్రశ్నార్థకమైతే రావడము
లేదు కదా! బిందువు ఎంత సహజముగా ఉంటుంది మరియు ప్రశ్నార్థకము
ఎంత వంకరగా ఉంటుంది. ఫుల్ స్టాప్ అనగానే ఫుల్ స్టాప్ పడిపోవాలి.
కామా చిహ్నము కూడా రాకూడదు, ఆశ్చర్య చిహ్నము కూడా రాకూడదు. ఏం
చెయ్యను - అని ఆలోచించడానికి కూడా సమయము లభించదు. అంత ఫాస్ట్
గా పురుషార్థము చేయడమే పేపరులో పాస్ అవ్వడము అని ఏ బిడ్డ
ఊహించలేరు.
బాప్ దాదా చూస్తున్నారు, ఇప్పటికీ ఏవో కొన్ని కారణాల వలన
ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా... ఇవి కొంతమంది పిల్లల యొక్క రోజువారీ
చార్టులో కనిపిస్తూ ఉంటాయి. ఎంతోమంది చార్టులో బాప్ దాదా చూసారు,
వ్యర్థ సంకల్పాల అల ఎక్కువ సమయాన్ని తీసేసుకుంటుంది మరియు
వ్యర్థము యొక్క వేగము ఎంత తీవ్రముగా ఉంటుందంటే, సాధారణ
సంకల్పాల ఒక్క గంట ఫాస్ట్ సంకల్పాల ఒక్క నిమిషముతో సమానము.
అందుకే ఈ రోజు - సర్వులకు ప్రియమైన మరియు బాప్ దాదాకు ప్రియమైన
సంతుష్ట ఆత్మలు ఎవరెవరు? అని చూస్తున్నారు. సంతుష్ట ఆత్మల
సంకల్పములో కూడా - ఇది ఎందుకు, ఏమిటి అన్న భాష స్వప్నములో కూడా
రాదు ఎందుకంటే ఆ ఆత్మకు విశేషముగా మూడు విషయాలు, మూడు బిందువులు
గుర్తుంటాయి - ఆత్మ, పరమాత్మ మరియు డ్రామా, మూడింటినీ సమయానికి
వినియోగించగలరు ఎందుకంటే అటువంటి సమయములో సర్వ శక్తుల ఖజానా
అవసరము మరియు మాస్టర్ సర్వశక్తివంతులు ఎవరంటే - ఏ సమయములో ఏ
శక్తిని ఆజ్ఞాపిస్తే అది హాజరైపోవాలి. సహనశక్తి అవసరమున్నప్పుడు
ఎదుర్కునే శక్తి వస్తే - అది కూడా శక్తియే కానీ ఆ సమయములో అది
ఉపయోగపడదు. కావున సర్వ ఖజానాలకు తాళంచెవి మూడు బిందువులు - మీరు,
బాబా మరియు డ్రామా.
బాప్ దాదాకు ఒక సంకల్పము ఉంది, చెప్పమంటారా? చెయ్యాల్సి
ఉంటుంది. ఎవరైతే చెయ్యడానికి సిద్ధముగా ఉన్నారో వారు
చేతులెత్తండి. చెయ్యాల్సి ఉంటుంది. అచ్ఛా, అందరూ
చేతులెత్తుతున్నారు. మనసు యొక్క చేతిని ఎత్తుతున్నారా లేక
శరీరము యొక్క చేతిని ఎత్తుతున్నారా? మనసు యొక్క చేయి పక్కాగా
ఉంటుంది. బాప్ దాదా సమయమనుసారముగా ప్రతి బిడ్డ పట్ల ఈ శుభమైన
ఆశను ఉంచుతున్నారు - 15 రోజుల తర్వాత మళ్ళీ బాబా మిలనము
జరుగుతుంది కదా, ఈ 15 రోజులలో ట్రయల్ కోసం విశేషముగా ఈ అభ్యాసము
చేయండి, వాస్తవానికి ఈ అభ్యాసము సదా ఉండాలి కానీ 15 రోజుల
ట్రయల్ చేయండి మరియు మీ-మీ కనెక్షన్లలో ఉన్న సెంటర్లలో కూడా
చేయించండి, అక్కడకు వెళ్ళి అయినా, ఫోన్ చేసి అయినా వారికి -
హోమ్ వర్క్ చేస్తున్నారా అని గుర్తు చేయండి. హోమ్ వర్క్ ఏమిటి?
ఈజీయే, ప్రతి ఒక్కరూ భిన్న-భిన్న పరిస్థితులను, విషయాలను
దాటుతూనే ఉంటారు కానీ ఈ 15 రోజులు ప్రతి ఒక్కరూ సంకల్పాలు, వాణి
మరియు కర్మలలో కనీసం 80 శాతం మార్కులు తీసుకోవాలి. ఎంతైనా బాప్
దాదా 20 శాతం వదిలేస్తున్నారు. సమ్మతమేనా? సమ్మతమేనా?
ఇవ్వమంటారా? ఈ హోమ్ వర్క్ ను ఇవ్వమంటారా? అచ్ఛా, 15 రోజులు,
మాయ కూడా వింటుంది. విషయాలైతే వస్తాయి, విషయాలను చూడకండి, పాస్
అవ్వాలి అని గుర్తుంచుకోండి. 15 రోజులు పెద్ద విషయమేమీ కాదు,
కానీ ప్రతి ఒక్కరూ సత్యమైన మనసుతో, స్వచ్ఛమైన మనసుతో,
స్వప్నములో కూడా, సంకల్పము, వాణి మరియు కర్మలో కూడా పాస్ అయి
చూపించండి. వీలవుతుందా? వీలవుతుందా? టీచర్లు చెప్పండి,
వీలవుతుందా? 15 రోజులంటే అసలేమీ కాదు, కానీ బాప్ దాదా ట్రయల్
కోసం చెప్తున్నారు - సంకల్పాలు కూడా వ్యర్థమవ్వకూడదు, యుద్ధము
జరగకూడదు, విజయీగా ఉండాలి. 15 రోజులు పూర్తి విజయీగా ఉండాలి.
కష్టమా లేక సహజమా? సహజమేనా, చేతులెత్తండి. సహజమేనా? మరి బాప్
దాదా ఈ 15 రోజుల రిజల్టును చూస్తారు. ఇక తర్వాత పెంచుతారు. 15
రోజులైతే ఎవరైనా చెయ్యగలరు కదా! చెయ్యగలరు కదా! మధుబన్ వారు?
మధుబన్ వారు చేతులెత్తండి. మధుబన్ వారు ముందు కూర్చున్నారు.
చాలా మంచిది. విదేశీయులు మరియు ఇండియావారు అందరూ చేయాలి.
గ్రామములోనివారైనా, పెద్ద పట్టణాలలోనివారైనా, అందరూ 15 రోజుల
రికార్డును పెట్టాలి. ఎందుకు, ఏమిటి అన్న ప్రశ్నలు
ఉత్పన్నమవ్వకూడదు. ఏమి చెయ్యను విషయమే అలా ఉంది అని చెప్పకండి.
80 శాతం మార్కులు తీసుకోవలసిందే. బాప్ దాదా అయితే ఇంకా సులువు
చెయ్యడానికి 20 శాతాన్ని వదిలిపెట్టేసారు. ఎందుకంటే బాప్ దాదా
చూస్తున్నారు, అక్కడక్కడ నడుస్తూ-నడుస్తూ ఉండగా మాయ
నిర్లక్ష్యాన్ని మరియు సోమరితనాన్ని తీసుకువస్తుంది. రాయల్
సోమరితనాన్ని తీసుకువస్తుంది అనగా ఇది జరిగింది, అది జరిగింది...
ఈ రాయల్ సోమరితనము, నిర్లక్ష్యము తీవ్ర పురుషార్థములో లోటును
తీసుకువస్తాయి ఎందుకంటే ఇప్పుడు బాప్ దాదా విద్యార్థులందరితోనూ,
ప్రతి విద్యార్థితోనూ ఇప్పుడు 15 రోజుల రిహార్సల్ చేయించి కొంత
సమయము వరకు ఇలాగే అభ్యాసం చేయించాలనుకుంటున్నారు, అప్పుడు
ఎవర్రెడీగా ఉన్నాము అని అందరి చేత చేతులెత్తించాలి
అనుకుంటున్నారు. ఎవర్రెడీగా ఉంటే అందరూ చేతులెత్తగలుగుతారు.
దీని కోసం బహుకాలము యొక్క అభ్యాసము కావాలి. అందుకే ఇప్పుడు ఈ
కొద్దిపాటి అభ్యాసాన్ని చేయిస్తున్నారు. అచ్ఛా!
మొదటిసారి ఎంతమంది వచ్చారు, వారు
లేవండి:- బాగుంది. బాప్ దాదా
ఎదురుగా వచ్చినందుకు మీకు ఈ రోజు అభినందనలు, అభినందనలు. బాబా
దృష్టి పిల్లలపై పడింది మరియు పిల్లల దృష్టి బాబాపై పడింది.
కావున చాలా-చాలా అభినందనలు. అచ్ఛా, వేరే కేక్ అయితే లేదు కానీ
సంతోషమనే కేక్ ను తినండి. మంచిది. ఇప్పుడు ఆలస్యముగా వచ్చారు
కానీ ఫాస్ట్ గా వెళ్ళి ముందు నంబరును తీసుకోవచ్చు, అందుకే బాప్
దాదా తరఫున మరియు మీతోటి సోదరీ-సోదరులందరి తరఫున అందరికీ
అభినందనలు, అభినందనలు. ఎటువంటి ఉదాహరణగా తయారవుతారంటే, లాస్ట్
వచ్చేవారు కూడా ఫాస్ట్ గా వెళ్ళి ఫస్ట్ లైన్ లోకి రాగలరు. అచ్ఛా!
బాప్ దాదా ఆశలను పూర్తి చేసే నలువైపులా ఉన్న ఆశా దీపాలు, ఎందుకు,
ఏమిటి అన్న భాష నుండి అతీతముగా ఉండేవారు, సదా ఏకరసంగా, సదా
ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు, బాబాలోనే జీవితము యొక్క
విశేషమైన మూడు సంబంధాలను తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువును
అనుభవం చేసేవారు, తండ్రి నుండి వారసత్వాన్ని, టీచరు నుండి చదువు
యొక్క వారసత్వాన్ని మరియు సద్గురువు నుండి వరదానాల వారసత్వాన్ని
పొందే పదమాల రెట్ల భాగ్యశాలి పిల్లలందరికీ బాప్ దాదాల
ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:-
(ఈ సారి నలువైపులా సేవల ప్రోగ్రామ్ లు చాలా బాగా జరిగాయి) అందరూ
అందరికీ సహాయము కూడా బాగా చేసుకున్నారు. ఎలా చేయాలి అని ఎవరూ
ఆలోచించాల్సిన అవసరము రాలేదు, చెయ్యాల్సిందే. పరస్పరము సహాయము
చేసుకోవడం వలన అన్ని ప్రోగ్రాములు బాగా జరిగాయి. శబ్దమైతే
వ్యాపించింది. సందేశమైతే లభించింది. ఇప్పుడు ముందుకు వెళ్ళండి.
(యోగములో అందరూ చాలా మంచి అనుభూతి చేసారు) ఎందుకంటే టాపిక్ యే
- వరదానాలను తీసుకోవడము కదా. కావున యోగము యొక్క ప్రోగ్రామ్ తో
అనుభవం చేసారు.
పంజాబ్ జోన్ సేవాధారులతో:-
పంజాబ్ కు డ్రామానుసారముగా ఈ సన్యాసులు, మహాత్ముల సేవ చేసే
అవకాశము మంచిగా లభించింది మరియు చేస్తూ ఉన్నారు కూడా. పంజాబ్
లో స్థాపనా సమయములో సేవ ఆరంభమైనప్పుడు అటువంటి సహయోగులు మరియు
వారస క్వాలిటీవారు నిమిత్తమయ్యారు. ఎంతగా హంగామా చేసేవారు
ఉన్నారో, అంతగానే సింహము క్వాలిటీ వారు కూడా తయారయ్యారు.
ఇప్పుడు పంజాబ్ ఏమి చేయాలి? ఈ విశేషత అయితే ఉంది. ఇప్పుడు
పంజాబ్ వారు ఎటువంటి ప్రసిద్ధమైన సింహాన్ని తయారుచెయ్యండంటే,
వారు సభలో మైక్ గా అయి తమ అనుభవాన్ని వినిపించాలి. మైక్ పెద్దగా
ఉండాలి, చిన్నగా కాదు. గవర్నమెంట్ వి.ఐ.పి.లు వేరుగా ఉంటారు,
కానీ మహాత్ములలో కూడా వి.ఐ.పి.లు ఉంటారు, అటువంటి పెద్ద మైక్
ను ఎవరినైనా తయారుచేయండి, వారు తమ అనుభవముతో ఇతరులను
ఉత్సాహములోకి తీసుకురావాలి. అటువంటివారినెవరినైనా వెలికి తీయండి,
తయారుచేయండి. వీలవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ
ఏమనుకుంటున్నారంటే, సాధు-సన్యాసుల చేసే సేవ అయితే ద్వాపరము
నుండి ప్రారంభమైంది అని, కానీ ఒక పెద్ద గురువు మరొకరిని, తమ
శిష్యుడిని తమ సమానముగా తయారుచెయ్యడం, ఇటువంటి ఉదాహరణలు వారిలో
ఉండవు. కానీ బాప్ దాదా అయితే పిల్లలను తమకన్నా కూడా
తెలివైనవారిగా తయారుచేసారు. పిల్లలు పబ్లిక్ లోకి వస్తారు.
అందుకే పంజాబ్ వారు ఏదైనా నవీనతను చేసి చూపించండి. వి.ఐ.పి.లు
అయితే అన్ని వైపుల నుండి వస్తారు, కానీ మీరు ఎటువంటివారిని
తీసుకురావాలంటే, అది విని అందరూ మేలుకోవాలి, సందేశము లభించాలి.
వీలవుతుందా? చూస్తాము. కొద్ది సమయమైతే పడుతుంది కానీ అటువంటి
వారినెవరినైనా తయారుచేసి చూపించండి. ఇకపోతే వృద్ధి అయితే
జరుగుతుంది. అచ్ఛా!
వరదానము:-
బాబా చేయి మరియు తోడు యొక్క స్మృతి
ద్వారా కష్టమైనదానిని సహజము చేసే చింతలేనివారిగా మరియు
నిశ్చింతులుగా కండి
ఏ విధముగా ఎవరైనా పెద్దవారి చేతిలో
చేయి ఉన్నప్పుడు స్థితి చింత లేకుండా మరియు నిశ్చింతగా ఉంటుందో,
అదే విధముగా ప్రతి కర్మలోనూ ఎలా భావించాలంటే - బాప్ దాదా
నాతోపాటు ఉన్నారు కూడా మరియు నా ఈ అలౌకిక జీవితము యొక్క చేయి
వారి చేతిలో ఉంది అనగా జీవితము వారికి అర్పితమై ఉంది, అప్పుడు
బాధ్యత కూడా వారిదే అవుతుంది. అన్ని భారాలను బాబాకు అప్పగించి
స్వయాన్ని తేలికగా చేసుకోండి. భారాన్ని దించడానికి మరియు
కష్టమైనదానిని సహజము చేయడానికి సాధనము - బాబా చేయి మరియు తోడు.
స్లోగన్:-
పురుషార్థములో సత్యత ఉన్నట్లయితే బాప్ దాదా యొక్క ఎక్స్ ట్రా
సహాయాన్ని అనుభవం చేస్తారు.
అవ్యక్త సూచనలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత
గుణాలను ధారణ చేయండి’’
ఒకవేళ మీతో ఎవరైనా ఘర్షణ పడితే, మీరు వారికి మీ స్నేహమనే నీటిని
ఇవ్వండి, మీరు మీ మధురత మరియు నమ్రత అనే గుణాలను వదలకండి.
నమ్రత అనే డ్రెస్ను ధరించి ఉండండి. ఈ నమ్రతయే కవచము, ఇదే
రక్షణకు సాధనము. సంస్కారాల రాస్ను కలుపుకునేందుకు అన్నింటికంటే
సహజమైన పద్ధతి ఏమిటంటే - స్వయం నమ్రచిత్తులుగా, మధురతా
సంపన్నులుగా అవ్వండి, ఇతరులకు శ్రేష్ఠమైన సీట్ను ఇవ్వండి.
|
|
|
|