12-10-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 17.03.2006


‘‘శ్రేష్ఠ వృత్తి ద్వారా శక్తిశాలి వైబ్రేషన్లను మరియు వాయుమండలాన్ని తయారుచేసే తీవ్ర పురుషార్థము చేయండి, ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి’’

ఈ రోజు ప్రేమ సాగరుడు మరియు శక్తి సాగరుడు అయిన బాప్ దాదా తమ స్నేహీ పిల్లలను, చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలను, ప్రియమైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. పిల్లలందరూ కూడా దూర-దూరాల నుండి స్నేహమనే ఆకర్షణతో మిలనం జరుపుకునేందుకు చేరుకున్నారు. సమ్ముఖంలో కూర్చుని ఉన్నా లేక దేశ-విదేశాలలో కూర్చుని ఉన్నా, స్నేహ మిలనాన్ని జరుపుకుంటున్నారు. బాప్ దాదా నలువైపులా ఉన్న స్నేహీ, సహయోగీ, సహచరులైన పిల్లలందరినీ చూసి హర్షిస్తున్నారు. ఇప్పుడు త్వరత్వరగా తండ్రిని ప్రత్యక్షము చెయ్యాలి అన్న ఒకే సంకల్పము మెజారిటీ పిల్లల హృదయంలో ఉండటాన్ని బాప్ దాదా చూస్తున్నారు. తండ్రి అంటారు, పిల్లలందరి ఉల్లాసము చాలా బాగుంది, కానీ ఎప్పుడైతే ముందు స్వయాన్ని తండ్రి సమానంగా సంపన్నంగా, సంపూర్ణంగా ప్రత్యక్షము చేస్తారో, అప్పుడే తండ్రిని ప్రత్యక్షము చెయ్యగలరు. పిల్లలు తండ్రిని అడుగుతారు, ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది? మరియు తండ్రి పిల్లలను అడుగుతారు, మీరు చెప్పండి, మీరు స్వయాన్ని తండ్రి సమానంగా ఎప్పుడు ప్రత్యక్షము చేస్తారు? మీరు సంపన్నముగా అయ్యేటువంటి డేట్ ను ఫిక్స్ చేసారా? విదేశీయులైతే ఒక సంవత్సరము ముందే డేట్ ను ఫిక్స్ చెయ్యటం జరుగుతుంది అని అంటారు. మరి స్వయము తండ్రి సమానంగా అయ్యేందుకు పరస్పరంలో మీటింగ్ చేసుకుని డేట్ ను ఫిక్స్ చేసారా?

ఈ రోజుల్లో ప్రతి వర్గము వారి మీటింగ్ లు చాలా జరుగుతూ ఉండటాన్ని బాప్ దాదా చూస్తున్నారు. డబుల్ విదేశీయుల మీటింగ్ గురించి కూడా బాప్ దాదా విన్నారు. చాలా బాగా అనిపించింది. అన్ని మీటింగ్ లు బాప్ దాదా వద్దకైతే తప్పకుండా చేరుకుంటాయి. కనుక బాప్ దాదా అడుగుతారు, దీని డేట్ ఎప్పుడు ఫిక్స్ చేసారు? ఈ డేట్ ను డ్రామా ఫిక్స్ చేస్తుందా లేక మీరు ఫిక్స్ చేస్తారా? ఎవరు చేస్తారు? లక్ష్యమైతే మీరు పెట్టుకోవాల్సే ఉంటుంది. మరియు లక్ష్యము కూడా చాలా మంచి లక్ష్యము పెట్టుకున్నారు, చాలా గొప్ప లక్ష్యము పెట్టుకున్నారు, ఇప్పుడు కేవలము ఎటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారో దాని అనుసారంగా లక్షణాలను, శ్రేష్ఠ లక్ష్యము అనుసారంగా తయారుచేసుకోవాలి. ఇప్పుడు లక్ష్యము మరియు లక్షణాలలో వ్యత్యాసము ఉంది. ఎప్పుడైతే లక్ష్యము మరియు లక్షణాలు సమానమవుతాయో, అప్పుడు లక్ష్యము ప్రాక్టికల్ లోకి వస్తుంది. ఇప్పుడు పిల్లలందరూ అమృతవేళ మిలనం జరుపుకుంటారు మరియు సంకల్పాలు చేస్తారు, వాటిని చాలా బాగా చేస్తారు. నలువైపులా ఉన్న పిల్లల ప్రతి ఒక్కరి ఆత్మిక సంభాషణను బాప్ దాదా వింటారు. చాలా సుందరమైన విషయాలను మాట్లాడుతారు. పురుషార్థం కూడా చాలా బాగా చేస్తారు కానీ పురుషార్థంలో ఒక విషయంలో తీవ్రత కావాలి. పురుషార్థము ఉంది కానీ తీవ్ర పురుషార్థము కావాలి. ఆ తీవ్రత విషయంలో దృఢత కావాలి.

బాప్ దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరి ప్రతి ఇదే ఆశ ఉంది - సమయమనుసారంగా ప్రతి ఒక్కరు తీవ్ర పురుషార్థులుగా అవ్వాలి. నంబరువారుగా ఉండవచ్చు, బాప్ దాదాకు తెలుసు కానీ నంబరువారుగా ఉన్నవారిలో కూడా తీవ్ర పురుషార్థము సదా ఉండాలి, దీని అవసరముంది. సంపన్నము అయ్యేందుకు సమయము వేగంగా ముందుకు వెళ్తూ ఉంది, కానీ ఇప్పుడు పిల్లలు తండ్రి సమానంగా అవ్వాల్సిందే, ఇది కూడా నిశ్చితమయ్యే ఉంది, కేవలము ఇందులో తీవ్రత కావాలి. ప్రతి ఒక్కరు స్వయాన్ని చెక్ చేసుకోవాలి - నేను సదా తీవ్ర పురుషార్థిగా ఉన్నానా? ఎందుకంటే పురుషార్థంలో పరీక్షలైతే చాలానే వస్తాయి మరియు రావాల్సిందే, కానీ తీవ్ర పురుషార్థులు పరీక్షలో పాస్ అవ్వటము ఎంత నిశ్చితమై ఉందంటే తీవ్ర పురుషార్థులు పరీక్షలో పాస్ అయ్యే ఉన్నారు. పాస్ అవ్వాలి కాదు, పాస్ అయ్యే ఉన్నారు, ఇది నిశ్చితము. సేవను కూడా అందరూ మంచి అభిరుచితో చేస్తున్నారు కానీ బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పారు, వర్తమాన సమయమనుసారంగా ఒకే సమయంలో మనసా-వాచా మరియు కర్మణా ద్వారా అనగా నడవడిక మరియు ముఖము ద్వారా మూడు రకాల సేవలు జరగాలి. మనసు ద్వారా అనుభవము చేయించటము, వాణి ద్వారా జ్ఞాన ఖజానా యొక్క పరిచయాన్ని చేయించటము మరియు నడవడిక మరియు ముఖము ద్వారా సంపూర్ణ యోగీ జీవితము యొక్క ప్రాక్టికల్ రూపాన్ని అనుభవము చేయించటము, మూడు సేవలూ ఒకే సమయములో చేయాలి. వేర్వేరుగా కాదు, సమయము తక్కువగా ఉంది మరియు సేవ ఇప్పటికీ చాలా చేయాల్సి ఉంది. బాప్ దాదా చూసారు, సేవకు అన్నింటికన్నా సహజమైన సాధనము - వృత్తి ద్వారా వైబ్రేషన్లను తయారుచేయటము మరియు వైబ్రేషన్ల ద్వారా వాయుమండలాన్ని తయారుచేయటము, ఎందుకంటే వృత్తి అన్నింటికంటే వేగవంతమైన సాధనము. సైన్స్ యొక్క రాకెట్ ఎంత వేగంగా వెళ్తుందో అలాగే మీ ఆత్మిక శుభ భావన, శుభ కామనల వృత్తి, దృష్టి మరియు సృష్టిని పరివర్తన చేస్తుంది. ఒకే స్థానములో కూర్చుని ఉన్నా కూడా వృత్తి ద్వారా సేవ చెయ్యగలరు. విన్న విషయాన్ని ఎంతైనా మర్చిపోవచ్చు, కానీ వాయుమండలము యొక్క అనుభవం ఏదైతే కలుగుతుందో, దానిని మర్చిపోరు. ఏ విధంగా మధుబన్ లో అనుభవం చేసారు, ఇది బ్రహ్మాబాబా యొక్క కర్మభూమి, యోగ భూమి, చరిత్ర భూమి కల వాయుమండలము అని. ఇప్పటివరకు కూడా ప్రతి ఒక్కరూ, ఆ వాయుమండలాన్ని ఎవరైతే అనుభవము చేస్తారో, దానిని మర్చిపోరు. వాయుమండలము యొక్క అనుభవము మనసులో ముద్రించుకుపోతుంది. మరి వాణి ద్వారా పెద్ద-పెద్ద ప్రోగ్రాములైతే చేస్తూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరూ తమ శ్రేష్ఠ ఆత్మిక వృత్తి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా వాయుమండలాన్ని తయారుచెయ్యాలి, కానీ - ఎప్పుడైతే మీ హృదయంలో, మనసులో ఎవరి పట్ల కూడా తప్పుడు వృత్తికి చెందిన వైబ్రేషన్ ఉండదో, అప్పుడే వృత్తి ఆత్మికంగా మరియు శక్తిశాలిగా అవుతుంది. మీ మనసు యొక్క వృత్తి సదా స్వచ్ఛంగా ఉండాలి ఎందుకంటే ఏ ఆత్మ పట్లనైనా ఒకవేళ ఏదైనా వ్యర్థమైన వృత్తి కానీ లేక జ్ఞానము పరంగా నెగెటివ్ వృత్తి కానీ ఉన్నట్లయితే, నెగెటివ్ అనగా చెత్త, ఒకవేళ మనసులో చెత్త ఉన్నట్లయితే శుభ వృత్తి ద్వారా సేవ చేయలేరు. కావున ముందుగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి - నా మనసు యొక్క వృత్తి శుభమైనదిగా, ఆత్మికముగా ఉందా? నెగెటివ్ వృత్తిని కూడా మీ శుభ భావన, శుభ కామనల ద్వారా నెగెటివ్ ను కూడా పాజిటివ్ లోకి మార్చగలరు ఎందుకంటే నెగెటివ్ కారణంగా మీ మనసులోనే వ్యాకులత కలుగుతుంది కదా! వ్యర్థమైన ఆలోచనలైతే నడుస్తాయి కదా! కావున ముందుగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, నా మనసులో ఎటువంటి ఘర్షణ జరగడం లేదు కదా? నంబరువారుగా అయితే ఉన్నారు, మంచివారు కూడా ఉన్నారు, వారితో పాటు ఘర్షణ పడేవారు కూడా ఉన్నారు, కానీ ‘వీరు ఇలాంటివారు’ అని భావించడం మంచిదే. రాంగ్ ను రాంగ్ గా భావించాలి, రైట్ ను రైట్ గా భావించాలి, కానీ మనసులో దానిని కూర్చోబెట్టకూడదు. అర్థం చేసుకోవటము వేరు, నాలెడ్జ్ ఫుల్ గా అవ్వటం మంచిదే, రాంగ్ ను రాంగ్ అనే అంటారు కదా! కొంతమంది పిల్లలు అంటారు - బాబా, వీరు ఎలాంటివారో మీకు తెలియదు! మీరు చూస్తే అప్పుడు తెలుస్తుంది అని. తండ్రి ఒప్పుకుంటారు, మీరు చెప్పే కన్నా ముందే - వారు అలాంటివారు అని ఒప్పుకుంటారు, కానీ అటువంటి విషయాలను మీ మనసులో, వృత్తిలో పెట్టుకుంటే స్వయము కూడా వ్యాకులపడతారు. మరియు చెడు విషయము ఒకవేళ మనసులో ఉంది, హృదయంలో ఉంది అంటే, ఎక్కడైతే చెడు విషయము ఉంటుందో, వ్యర్థమైన ఆలోచనలు ఉంటాయో, వారు విశ్వ కళ్యాణకారులుగా ఎలా అవుతారు? మీ అందరి కర్తవ్యము ఏమిటి? మేము లండన్ యొక్క కళ్యాణకారులము, ఢిల్లీ యొక్క కళ్యాణకారులము, యు.పి యొక్క కళ్యాణకారులము అని ఎవరైనా అంటారా? లేదా ఎక్కడైతే ఉంటారో, సరే, దేశం కాకపోయినా సెంటరు యొక్క కళ్యాణకారులా? కర్తవ్యము గురించి అయితే అందరూ విశ్వ కళ్యాణకారులము అనే అంటారు. మరి అందరూ ఎవరు? విశ్వ కళ్యాణకారులేనా? అలా అయితే చేతులెత్తండి (అందరూ చేతులెత్తారు) విశ్వ కళ్యాణకారి! విశ్వ కళ్యాణకారి! అచ్ఛా. మరి మనసులో ఏ రకమైన చెడు అయితే లేదు కదా? అర్థము చేసుకోవటం వేరు, ఇది రైట్, ఇది రాంగ్ అని అయితే అర్థము చేసుకోండి, కానీ మనసులో కూర్చోబెట్టకండి. మనసులో అటువంటి వృత్తిని పెట్టుకోవటం వలన దృష్టి మరియు సృష్టి కూడా మారిపోతుంది.

బాప్ దాదా హోమ్ వర్క్ ఇచ్చారు - ఏమిచ్చారు? ఇది అన్నింటికన్నా సహజ పురుషార్థము, దీనిని అందరూ చెయ్యగలరు, మాతలు కూడా చెయ్యగలరు, వృద్ధులు కూడా చెయ్యగలరు, యువత కూడా చెయ్యగలరు, పిల్లలు కూడా చెయ్యగలరు, దానికి విధి ఏమిటంటే, కేవలం ఒకే పని చెయ్యండి, ఎవరి సంపర్కములోకి వచ్చినా - ‘‘ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి.’’ వారు శాపాన్ని ఇచ్చినా కానీ మీరు కోర్సులో ఏమని చెప్తారు? నెగెటివ్ ను పాజిటివ్ లోకి మార్చుకోవాలి అనే కదా, మరి స్వయానికి కూడా ఆ సమయంలో కోర్సు చేసుకోండి. ఛాలెంజ్ ఏమిటి? ప్రకృతిని కూడా తమోగుణీ నుండి సతోగుణీగా చెయ్యాల్సిందే. ఈ ఛాలెంజ్ ఉంది కదా! ఉందా? ప్రకృతిని కూడా సతోప్రధానంగా చేయాలి అని మీరందరూ కూడా ఈ ఛాలెంజ్ చేసారా? తయారుచెయ్యాలా? తల ఊపండి, చేతులూపండి. చూడండి, ఇతరులను చూసి ఊపకండి. మనస్ఫూర్తిగా ఊపండి, ఎందుకంటే ఇప్పుడు సమయమనుసారంగా వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారుచేసే తీవ్ర పురుషార్థము యొక్క అవసరముంది. కావున వృత్తిలో ఒకవేళ ఏ కొంచెమైనా చెత్త ఉంది అంటే, వృత్తి ద్వారా వాయుమండలాన్ని ఎలా తయారుచేస్తారు? ప్రకృతి వరకు మీ వైబ్రేషన్ వెళ్తుంది, వాణి అయితే వెళ్ళదు. వైబ్రేషన్ వెళ్తుంది మరియు వైబ్రేషన్ అనేది వృత్తి ద్వారా తయారవుతుంది, మరియు వైబ్రేషన్ ద్వారా వాయుమండలము తయారవుతుంది. మధుబన్ లో కూడా అందరూ ఒకే విధంగా అయితే ఉండరు. కానీ బ్రహ్మాబాబా మరియు అనన్యమైన పిల్లల వృత్తి ద్వారా, తీవ్ర పురుషార్థము ద్వారా వాయుమండలము తయారయ్యింది.

ఈ రోజు మీ దాదీ గుర్తుకొస్తున్నారు, దాదీ యొక్క విశేషత ఏమి చూసారు? ఎలా కంట్రోల్ చేసారు? ఎప్పుడైనా, ఎలాంటి వృత్తి కలవారైనా, వారి లోపాన్ని దాదీ మనసులో పెట్టుకోలేదు. అందరికీ ఉల్లాసాన్ని కలిగించారు. మీ జగదంబ మాత వాయుమండలాన్ని తయారుచేసారు. తెలిసి కూడా తమ వృత్తిని సదా శుభమైనదిగా ఉంచుకున్నారు, ఆ వాయుమండలాన్ని మీరందరూ అనుభవము చేస్తున్నారు. ఫాలో ఫాదర్ చేయాలి అన్నది వాస్తవమే గానీ బాప్ దాదా ఎల్లప్పుడూ ఏమంటారంటే, ప్రతి ఒక్కరిలోనూ విశేషతలను తెలుసుకుని ఆ విశేషతలను తమవిగా చేసుకోండి. పిల్లలు ప్రతి ఒక్కరూ దీనిని నోట్ చేసుకోండి, బాప్ దాదాకు ఎవరైతే పిల్లలుగా అయ్యారో, ఆ పిల్లలు ప్రతి ఒక్కరిలో, వారు మూడవ నంబరువారైనా కావచ్చు, కానీ ఇది డ్రామా యొక్క విశేషత, బాప్ దాదా యొక్క వరదానము, పిల్లలందరిలో 99 పొరపాట్లు అయినా ఉండవచ్చు కానీ ఒక్క విశేషత అయితే తప్పకుండా ఉంటుంది. ఆ విశేషత ద్వారా ‘నా బాబా’ అనేందుకు హక్కుదారులుగా అయ్యారు. పరవశులుగా ఉన్నారు కానీ తండ్రిపై ఎడతెగని ప్రేమ ఉంటుంది, అందుకే బాప్ దాదా ఇప్పుడు సమయం యొక్క సమీపత అనుసారంగా తండ్రి యొక్క స్థానాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క చోట, అది గ్రామంలో కావచ్చు, పెద్ద జోన్ లో కావచ్చు, సెంటర్స్ లో కావచ్చు కానీ ప్రతి ఒక్క స్థానంలో మరియు సహచరులలో శ్రేష్ఠ వృత్తితో కూడిన వాయుమండలము అవసరము. కేవలం ఒక్క పదాన్ని గుర్తుంచుకోండి, ఒకవేళ ఎవరైనా శాపనార్థాలు ఇచ్చినా కూడా, తీసుకునేవారు ఎవరు? ఇచ్చేవారు, తీసుకునేవారు ఒక్కరే అవుతారా లేక వేర్వేరు ఉంటారా? ఒకవేళ ఎవరైనా మీకు ఏదైనా పాడైన వస్తువును ఇస్తే, మీరేమి చేస్తారు? మీ వద్ద ఉంచుకుంటారా? లేక తిరిగి ఇచ్చేస్తారా లేక విసిరేస్తారా లేక అలమారీలో జాగ్రత్తగా ఉంచుకుంటారా? కావున హృదయంలో జాగ్రత్తగా ఉంచుకోకండి ఎందుకంటే మీ హృదయము బాప్ దాదా యొక్క సింహాసనము, కావున ఒక్క పదాన్ని ఇప్పుడు మనసులో పక్కాగా గుర్తుంచుకోండి, మాటలలో కాదు మనసులో గుర్తుంచుకోండి - ఆశీర్వాదాలను ఇవ్వాలి, ఆశీర్వాదాలను తీసుకోవాలి. ఏ నెగెటివ్ విషయాన్ని అయినా మనసులో పెట్టుకోకండి. అచ్ఛా, ఒక చెవితో వినడము, రెండో చెవితో వదిలేయటము మీ పనా లేక ఇతరుల పనా? అప్పుడే విశ్వములో, ఆత్మలలో తీవ్రగతితో కూడిన సేవను, వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారుచేసే సేవను చెయ్యగలరు. విశ్వ పరివర్తన చెయ్యాలి కదా! మరి ఏం గుర్తుంచుకుంటారు? మనసులో గుర్తుంచుకున్నారా? ఆశీర్వాదాలు అన్న పదాన్ని గుర్తుంచుకోండి, అంతే, ఎందుకంటే మీ జడ చిత్రాలు ఏమిస్తాయి? ఆశీర్వాదాలను ఇస్తాయి కదా! మందిరానికి వెళ్ళినప్పుడు ఏం కోరుకుంటారు? ఆశీర్వాదాలను కోరుకుంటారు కదా! ఆశీర్వాదాలు లభిస్తాయి అందుకే ఆశీర్వాదాలను కోరుకుంటారు. మీ జడ చిత్రాలు చివరి జన్మలో కూడా ఆశీర్వాదాలను ఇస్తాయి, వృత్తి ద్వారా వారి కోరికలను పూర్తి చేస్తాయి. మీరు పదే-పదే అటువంటి ఆశీర్వాదాలను ఇచ్చేవారిగా అయ్యారు కావుననే మీ చిత్రాలు కూడా ఈ రోజు వరకు ఆశీర్వాదాలను ఇస్తాయి. పరవశ ఆత్మలకు క్షమా సాగరుని పిల్లలు ఒకవేళ కొద్దిగా క్షమను ఇచ్చారనుకోండి, అది మంచిదే కదా! మరి మీరందరూ క్షమ యొక్క మాస్టర్ సాగరులా? అవునా, కాదా? అవును కదా! ‘మొదట నేను’ అని అనండి. ఇందులో హే అర్జున్ గా అవ్వండి. ఎటువంటి వాయుమండలాన్ని తయారుచెయ్యండి అంటే, ఎవరు ఎదురుగా వచ్చినా, వారు ఎంతో కొంత స్నేహాన్ని తీసుకోవాలి, సహయోగాన్ని తీసుకోవాలి, క్షమను అనుభవము చెయ్యాలి, ధైర్యాన్ని అనుభవము చెయ్యాలి, సహయోగాన్ని అనుభవము చెయ్యాలి, ఉల్లాస-ఉత్సాహాలను అనుభవము చెయ్యాలి. ఇలా చేయడము అవుతుందా? అవుతుందా? మొదటి లైన్ వారు, వీలవుతుందా? చేతులెత్తండి. ముందు చెయ్యాల్సి ఉంటుంది. మరి అందరూ చేస్తారా? టీచర్లు చేస్తారా? అచ్ఛా.

అన్నిచోట్ల నుండి పిల్లల ఈ-మెయిల్స్ మరియు ఉత్తరాలు అయితే వస్తూనే ఉంటాయి. మరి ఎవరైతే ఉత్తరాలు కూడా రాయలేదో, కానీ సంకల్పము చేసారో, అలా సంకల్పం చేసినవారి ప్రియస్మృతులు కూడా బాప్ దాదా వద్దకు చేరుకున్నాయి. ఉత్తరాలు చాలా మధురాతి-మధురంగా వ్రాస్తారు. ఉత్తరాలు ఎలా వ్రాస్తారంటే, వీరు ఉల్లాస-ఉత్సాహాలలో ఎగురుతూనే ఉన్నారు అన్నట్లుగా అనిపిస్తుంది. అది కూడా మంచిదే, ఉత్తరము వ్రాయటం వలన స్వయాన్ని బంధనములో బంధించుకుంటారు, ప్రమాణము చేస్తారు కదా! నలువైపులా ఉన్నవారికి, ఎవరెవరు, ఎక్కడెక్కడి నుండైతే చూస్తున్నారో లేదా వింటున్నారో, వారందరికీ కూడా బాప్ దాదా సమ్ముఖంలో ఉన్నవారి కంటే కూడా ముందుగా ప్రియస్మృతులను ఇస్తున్నారు ఎందుకంటే బాప్ దాదాకు తెలుసు, ఒక చోట ఒక సమయము ఉంది, ఇంకో చోట ఇంకో సమయం ఉంది, కానీ అందరూ చాలా ఉత్సాహంతో కూర్చుని ఉన్నారు, స్మృతిలో వింటున్నారు కూడా. అచ్ఛా.

తీవ్ర పురుషార్థము చేసి నంబరువన్ అవ్వాల్సిందేనని అందరూ సంకల్పము చేసారు. చేసారా? చేతులెత్తండి. అచ్ఛా, ఇప్పుడు టీచర్లు ఎత్తుతున్నారు. మొదటి లైన్ వారైతే నంబరువన్ యే కదా. అచ్ఛా - బాప్ దాదా ఈ డైరెక్షన్ ను కూడా ఇచ్చారు, మొత్తము రోజంతటిలో మధ్య-మధ్యలో 5 నిమిషాలు లభించినా, అందులో మనసు యొక్క ఎక్సర్ సైజ్ చెయ్యండి ఎందుకంటే నేటి ప్రపంచము ఎక్సర్ సైజ్ చేసేటువంటిది. కావున 5 నిమిషాలలో మనసు యొక్క ఎక్సర్ సైజ్ చెయ్యండి, మనసును పరంధామములోకి తీసుకురండి, సూక్ష్మవతనములో ఫరిశ్తాతనాన్ని గుర్తు చేసుకోండి, మళ్ళీ పూజ్య రూపాన్ని గుర్తు చేసుకోండి, తర్వాత బ్రాహ్మణ రూపాన్ని గుర్తు చేసుకోండి, తర్వాత దేవతా రూపాన్ని గుర్తు చేసుకోండి. ఎన్ని అయ్యాయి? ఐదు. కావున 5 నిమిషాలలో 5, ఈ ఎక్సర్ సైజ్ ను చెయ్యండి మరియు మొత్తము రోజంతటిలో నడుస్తూ-తిరుగుతూ దీనిని చెయ్యగలరు. అందుకు మైదానము అవసరం లేదు, పరిగెత్తాల్సిన అవసరం లేదు, కుర్చీ అవసరం లేదు, సీట్ అవసరం లేదు, మెషిన్ అవసరం లేదు. వేరే ఎక్సర్ సైజ్ లు శరీరానికి ఏవైతే అవసరమో, అవి చేయండి, అవి చేయొద్దు అని అనటం లేదు. కానీ ఈ మనసు యొక్క డ్రిల్, ఎక్సర్ సైజ్, మనసును సదా సంతోషంగా ఉంచుతుంది. ఉల్లాస-ఉత్సాహాలలో ఉంచుతుంది, ఎగిరే కళను అనుభవము చేయిస్తుంది. కావున ఇప్పుడిప్పుడే ఈ డ్రిల్ ను అందరూ ప్రారంభించండి - పరంధామము నుండి దేవత వరకు. (బాప్ దాదా డ్రిల్ చేయించారు) అచ్ఛా!

నలువైపులా ఉన్న సదా తమ వృత్తి ద్వారా ఆత్మిక శక్తిశాలి వాయుమండలాన్ని తయారుచేసే తీవ్ర పురుషార్థీ పిల్లలకు, సదా తమ స్థానాన్ని మరియు స్థితిని శక్తిశాలి వైబ్రేషన్లతో అనుభవం చేయించే దృఢ సంకల్పము కల శ్రేష్ఠాత్మలకు, సదా ఆశీర్వాదాలను ఇచ్చే మరియు ఆశీర్వాదాలను తీసుకునే దయార్ద్రహృదయ ఆత్మలకు, సదా తమను తాము ఎగిరే కళలో ఉన్నట్లు అనుభవం చేసే డబల్ లైట్ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-
విశాల బుద్ధి ద్వారా సంగఠన శక్తిని పెంచే సఫలతా స్వరూప భవ

సంగఠన శక్తిని పెంచడము - ఇది బ్రాహ్మణ జీవితపు మొట్టమొదటి శ్రేష్ఠమైన కార్యము. దీని కొరకు ఏదైనా విషయాన్ని మెజారిటీ నిర్ణయించినప్పుడు, ఎక్కడైతే మెజారిటీ ఉంటుందో నేను అక్కడే ఉంటాను - ఇదే సంగఠన శక్తిని పెంచడము. నా ఆలోచన చాలా మంచిది అంటూ అందులో మీ గొప్పతనాన్ని చూపించకండి. అది ఎంత మంచిదైనా కానీ ఎక్కడైతే సంగఠన తెగిపోతుందో అప్పుడు అది మంచిదైనా కానీ సాధారణమైపోతుంది. ఆ సమయంలో మీ ఆలోచనను త్యాగం చేయాల్సి వచ్చినా, ఆ త్యాగములోనే భాగ్యము ఉంటుంది. దీని ద్వారానే సఫలతా స్వరూపులుగా అవుతారు. సమీప సంబంధములోకి వస్తారు.

స్లోగన్:-
సర్వ సిద్ధులను ప్రాప్తి చేసుకునేందుకు మనసు యొక్క ఏకాగ్రతను పెంచండి.

అవ్యక్త సూచనలు - స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగము చెయ్యండి

సమయమనుసారంగా ఇప్పుడు మనసా మరియు వాచా సేవలను కలిపి చేయండి. కానీ వాచా సేవ సహజము, మనసా సేవలో అటెన్షన్పెట్టాల్సి ఉంటుంది, అందుకే సర్వాత్మల పట్ల మనసులో శుభ భావన, శుభ కామనలతో కూడిన సంకల్పాలు ఉండాలి. మాటలలో మధురత, సంతుష్టత, సరళత అనే నవీనత ఉన్నట్లయితే సేవలలో సహజంగా సఫలత లభిస్తూ ఉంటుంది.