13-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - బాబా మీ భాగ్యాన్ని మేలుకొలిపేందుకు వచ్చారు, పావనముగా అవ్వడము ద్వారానే భాగ్యము మేలుకుంటుంది’’

ప్రశ్న:-
ఏ పిల్లల భాగ్యమైతే మేలుకొని ఉందో, వారి గుర్తులేమిటి?

జవాబు:-
వారు సుఖ దేవతలుగా ఉంటారు. అనంతమైన తండ్రి నుండి సుఖపు వారసత్వాన్ని తీసుకుని అందరికీ సుఖాన్ని ఇస్తారు. వారు ఎప్పుడూ కూడా ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వలేరు. వారు వ్యాసుని పిల్లలు, సత్యాతి-సత్యమైన సుఖదేవులు. 2. వారు పంచ వికారాలను సన్యసించి సత్యాతి-సత్యమైన రాజయోగులుగా, రాజఋషులుగా పిలవబడతారు. 3. వారి అవస్థ ఏకరసముగా ఉంటుంది, వారికి ఏ విషయములోనూ ఏడుపు రాదు. వారినే మోహజీతులు అని అంటారు.

పాట:-
భాగ్యాన్ని మేలుకొలుపుకుని వచ్చాను...

ఓంశాంతి
పాటలోని ఒక్క లైను విన్నా కూడా మధురాతి మధురమైన పిల్లల రోమాలు నిక్కబొడుచుకోవాలి. వాస్తవానికి ఇది మామూలు పాటే కానీ దీని సారము ఇంకెవ్వరికీ తెలియదు. తండ్రియే వచ్చి అన్ని పాటలు మరియు అన్ని శాస్త్రాల అర్థాన్ని తెలియజేస్తారు. కలియుగములో అందరి భాగ్యము నిద్రించి ఉందని కూడా మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. సత్యయుగములో భాగ్యము మేలుకొని ఉంటుంది. నిద్రిస్తున్న భాగ్యాన్ని మేలుకొలిపేవారు మరియు మతాన్ని ఇచ్చేవారు అనగా భాగ్యాన్ని తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారే కూర్చుని పిల్లల భాగ్యాన్ని మేలుకొలుపుతారు. పిల్లలు జన్మించగానే వారి భాగ్యము మేలుకుంటుంది. కొడుకు జన్మించగానే నేను వారసుడిని అని అతనికి తెలుస్తుంది. అదే విధముగా ఇది అనంతమైన విషయము. కల్ప-కల్పము మన భాగ్యము మేలుకుంటుందని, మళ్ళీ నిద్రపోతుందని పిల్లలకు తెలుసు. పావనముగా అయినట్లయితే భాగ్యము మేలుకుంటుంది. పావన గృహస్థ ఆశ్రమమని అంటారు. ఆశ్రమము అనే పదము పవిత్రమైనది. పవిత్ర గృహస్థ ఆశ్రమము ఉంటుంది, దానికి వ్యతిరేకముగా అపవిత్ర పతిత ధర్మము ఉంటుంది, దీనిని ఆశ్రమము అని అనరు. గృహస్థ ధర్మమైతే అందరికీ ఉంటుంది. జంతువులకు కూడా ఉంటుంది. అందరూ పిల్లలకు జన్మనిస్తారు. గృహస్థ ధర్మములో ఉన్నాయని జంతువుల గురించి కూడా అంటారు. మనము స్వర్గములో పవిత్ర గృహస్థ ఆశ్రమములో ఉండేవారమని, దేవీ-దేవతలుగా ఉండేవారమని ఇప్పుడు పిల్లలకు తెలుసు. సర్వగుణ సంపన్నులు... అని వారి మహిమను కూడా పాడుతారు. స్వయము మీరు కూడా పాడేవారు. మనము మనుష్యుల నుండి దేవతలుగా మళ్ళీ అవుతున్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. దేవీ-దేవతల ధర్మము ఉంటుంది. ఇంకా బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడా దేవతలని అంటారు. బ్రహ్మా దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు... శివుని గురించి శివ పరమాత్మాయ నమః అని అంటారు, అంటే తేడా ఉన్నట్లే కదా. శివుడు మరియు శంకరుడు ఒక్కరేనని అనలేము. రాతిబుద్ధి కలవారిగా ఉండేవారు, ఇప్పుడు పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు. దేవతలనైతే రాతిబుద్ధి కలవారని అనరు. తర్వాత డ్రామా ప్లాన్ అనుసారముగా రావణ రాజ్యము తయారైనప్పుడు వారు కూడా మెట్లు దిగాల్సి ఉంటుంది, పారసబుద్ధి కలవారి నుండి రాతిబుద్ధి కలవారిగా అవ్వాల్సి ఉంటుంది. అందరికంటే బుద్ధిశాలులుగా తయారుచేసేవారైతే ఒక్క తండ్రి మాత్రమే. మిమ్మల్ని పారసబుద్ధి కలవారిగా తయారుచేస్తారు. మీరు ఇక్కడకు పారసబుద్ధి కలవారిగా అవ్వడానికి వస్తారు. పారసనాథుని మందిరము కూడా ఉంది. అక్కడ మేళా జరుగుతుంది. కానీ పారసనాథుడు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. వాస్తవానికి పారసముగా తయారుచేసేవారు తండ్రి మాత్రమే. వారు బుద్ధిశాలుల బుద్ధి వంటి వారు. ఇది పిల్లలైన మీ బుద్ధి కొరకు ఔషధము. బుద్ధి ఎంతగా మారిపోతుంది. చెడు చూడకండి... అని అంటూ ఉంటారు. ఇది కోతుల విషయమేమీ కాదు. మనుష్యులే కోతుల వలె తయారవుతారు. ఏప్స్ ను (తోక లేని కోతులను) మనుష్యులతో పోలుస్తారు. దీనిని ముళ్ళ అడవి అని అంటారు. ఒకరికొకరు ఎంతగా దుఃఖమిచ్చుకుంటూ ఉంటారు.

ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధికి ఔషధము లభిస్తూ ఉంది. అనంతమైన తండ్రి ఔషధాన్ని ఇస్తున్నారు. ఇది చదువు, దీనిని జ్ఞానామృతమని కూడా అంటారు. ఇది నీరేమీ కాదు. ఈ రోజుల్లో అన్నింటినీ అమృతమని అనేస్తున్నారు. గంగా జలాన్ని కూడా అమృతమని అంటారు. దేవతల పాదాలు కడిగి, ఆ నీటిని తాగుతారు. ఆ నీటిని ఉంచుకుంటారు, దానిని కూడా అమృతము యొక్క దానముగా భావిస్తారు. దానము తీసుకునేవారిని పతితులను పావనముగా చేసేవారు అని అనరు. గంగా జలాన్ని పతిత-పావని అని అంటారు. మనుష్యులు మరణించేటప్పుడు గంగా జలము నోటిలో ఉండాలని కూడా అంటారు. అర్జునుడు బాణము వేసి, అమృత జలాన్ని తాగించినట్లుగా చూపిస్తారు. పిల్లలైన మీరు బాణాలు మొదలైనవేవీ ఉపయోగించలేదు. బాణాలతో యుద్ధము చేసుకునే గ్రామము ఒకటుంది. అక్కడి రాజును ఈశ్వరుని అవతారమని అంటారు. తండ్రి అంటారు - వారంతా భక్తి మార్గపు గురువులు. సత్యాతి-సత్యమైన సద్గురువు ఒక్కరే. సర్వుల సద్గతిదాత ఒక్కరే, వారే అందరినీ తమతో పాటు తీసుకువెళ్తారు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ తిరిగి తీసుకువెళ్ళలేరు. బ్రహ్మ తత్వములో లీనమయ్యే విషయమేమీ లేదు. ఈ నాటకము తయారై ఉంది, ఈ చక్రము అనాదిగా తిరుగుతూనే ఉంటుంది. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు ఎలా రిపీట్ అవుతాయనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మనుష్యులకు అనగా ఆత్మలకు రచయిత అయిన తమ తండ్రి గురించి, ఎవరినైతే ఓ గాడ్ ఫాదర్ అని అంటూ స్మృతి చేస్తారో, వారి గురించి తెలియదు. హద్దు తండ్రిని కూడా గాడ్ ఫాదర్ అని అనరు. గాడ్ ఫాదర్ అనే పదాన్ని చాలా గౌరవముతో పలుకుతారు. వారినే పతిత-పావనుడు, దుఃఖహర్త-సుఖకర్త అని అంటారు. ఒకవైపు వారు దుఃఖహర్త-సుఖకర్త అని అంటారు, మరోవైపు ఏదైనా దుఃఖము కలిగినప్పుడు లేదా కొడుకు మొదలైనవారెవరైనా మరణించినప్పుడు, ఈశ్వరుడే సుఖ-దుఃఖాలను ఇస్తారని అనేస్తారు. ఈశ్వరుడు మా కొడుకును తీసుకువెళ్ళిపోయారు, ఇలా ఎందుకు చేసారు అని అంటారు! ఇక ఈశ్వరుడిని నిందిస్తారు. ఈశ్వరుడే కొడుకును ఇచ్చారని అంటారు, మరి వారు తిరిగి తీసుకుంటే మీరెందుకు ఏడుస్తున్నారు. ఈశ్వరుని వద్దకే వెళ్ళాడు కదా. సత్యయుగములో ఎప్పుడూ ఎవరూ ఏడవరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఏడ్చే అవసరమేమీ లేదు. ఆత్మ తన లెక్కాచారము అనుసారముగా వెళ్ళి పాత్రను అభినయించాల్సి ఉంటుంది. జ్ఞానము లేని కారణముగా మనుష్యులు ఎంతగా ఏడుస్తారు. పిచ్చివారిలా అయిపోతారు, ఇక్కడ - తల్లి మరణించినా కానీ హల్వా తినాలి, తండ్రి మరణించినా కానీ హల్వా తినాలి, నష్టోమోహులుగా అవ్వాలని బాబా అర్థం చేయిస్తున్నారు. నా వారు ఒక్క అనంతమైన తండ్రే, ఇంకెవ్వరూ లేరు. పిల్లల అవస్థ ఈ విధముగా ఉండాలి. మోహజీత్ రాజు కథను కూడా విన్నారు కదా. సత్యయుగములో ఎప్పుడూ దుఃఖము విషయము ఉండదు, ఎప్పుడూ అకాల మృత్యువు జరగదు. మనము కాలుడిపై విజయము పొందుతామని పిల్లలకు తెలుసు. తండ్రిని మహాకాలుడని కూడా అంటారు, వారు కాలుడికే కాలుడు. మీరు కాలుడిపై విజయము పొందాలి అనగా అక్కడ మిమ్మల్ని మృత్యువు ఎప్పుడూ కబళించదు. మృత్యువు ఆత్మను కానీ, శరీరాన్ని కానీ కబళించలేదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. దీనినే మృత్యువు కబళించడము అని అంటారు, అంతేకానీ మృత్యువనేది వస్తువేమీ కాదు. మనుష్యులు అచ్యుతమ్, కేశవమ్... అని మహిమను పాడుతూ ఉంటారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ 5 వికారాలు మీ బుద్ధిని ఎంతగా పాడు చేస్తాయి. ఈ సమయములో తండ్రి గురించి ఎవరికీ తెలియదు, అందుకే దీనిని అనాథల ప్రపంచమని అంటారు. పరస్పరములో ఎంతగా కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు. ఈ ప్రపంచమంతా బాబా ఇల్లు కదా. తండ్రి మొత్తము ప్రపంచములోని పిల్లలందరినీ పతితము నుండి పావనముగా తయారుచేయడానికి వస్తారు. తప్పకుండా అర్ధకల్పము పావన ప్రపంచముండేది కదా. రాముని రాజ్యములో ప్రజలు కూడా షావుకారులే మరియు ఆ నగరములో అందరూ దాతలే కాబట్టి ధర్మానికి సదా ఉపకారము జరుగుతుంది... అని అంటారు. కావున అక్కడ అధర్మమనే మాట ఎలా ఉండగలదు. అక్కడ పులి-మేక కలిసి నీరు తాగుతాయని అంటారు, కావున అక్కడకు రావణుడు మొదలైనవారు ఎక్కడ నుండి వస్తారు. ఏమీ అర్థం చేసుకోరు. బయటివారైతే ఇటువంటి మాటలను విని నవ్వుకుంటారు.

తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు, ఇది పతిత ప్రపంచము కదా. ఇప్పుడు ప్రేరణతో పతితులను పావనముగా చేస్తారా ఏమిటి! పతిత-పావనా రండి అని పిలిచారు కనుక వారు తప్పకుండా భారత్ లోనే వచ్చారు. జ్ఞానసాగరుడినైన నేను మిమ్మల్ని నా సమానముగా మాస్టర్ జ్ఞానసాగరులుగా తయారుచేయడానికి వచ్చానని ఇప్పుడు కూడా అంటారు. తండ్రినే సత్యాతి-సత్యమైన వ్యాసుడని అంటారు. కనుక వీరు వ్యాసదేవుడు, వారి పిల్లలైన మీరు సుఖదేవులు, మీరు ఇప్పుడు సుఖ దేవతలుగా అవుతారు. సుఖ వారసత్వాన్ని వ్యాసుడైన శివాచార్యుడి నుండి తీసుకుంటున్నారు. మీరు వ్యాసుని పిల్లలు. కానీ మనుష్యులు తికమకపడకుండా ఉండడానికి శివుని పిల్లలని అనడము జరుగుతుంది. వారి అసలు పేరు శివ. ఆత్మను తెలుసుకోవడము జరుగుతుంది, పరమాత్మను కూడా తెలుసుకోవడము జరుగుతుంది. వారే వచ్చి పతితుల నుండి పావనులుగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తారు. నేను ఆత్మలైన మీకు తండ్రిని అని అంటారు. అంగుష్టము వలె ఉంటారని అంటారు. అంత పెద్దగా ఉంటే ఇక్కడ (భ్రుకుటి మధ్యలో) నిలవలేరు కూడా. వారు చాలా సూక్ష్మమైనవారు. డాక్టర్లు కూడా ఆత్మను చూడటానికి చాలా కష్టపడతారు, కానీ చూడలేకపోతారు. ఆత్మను రియలైజ్ అవ్వవచ్చు. తండ్రి అడుగుతున్నారు - ఇప్పుడు మీరు ఆత్మను రియలైజ్ అయ్యారా? ఇంత చిన్నని ఆత్మలో ఒక రికార్డులో నిండినట్లుగా అవినాశీ పాత్ర నిండి ఉంది. ఇంతకుముందు మీరు దేహాభిమానులుగా ఉండేవారు, ఇప్పుడు దేహీ-అభిమానులుగా అయ్యారు. ఆత్మలమైన మనము 84 జన్మలు ఎలా తీసుకుంటూ ఉంటాము అనేది మీకు తెలుసు. దీనికి అంతము లేదు. ఈ డ్రామా ఎప్పటినుండి మొదలైందని కొందరు అడుగుతుంటారు. కానీ ఇది అనాది డ్రామా, ఇది ఎప్పుడూ వినాశనమవ్వదు. దీనిని తయారై, తయారుచేయబడిన అవినాశీ వరల్డ్ డ్రామా అని అంటారు. ప్రపంచము గురించి కూడా మీకు తెలుసు. ఎలాగైతే చదువురాని పిల్లలను చదివిస్తారో, అలా పిల్లలైన మిమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు. ఆత్మయే శరీరము ద్వారా చదువుకుంటుంది. ఇది రాతిబుద్ధి కలవారికి ఆహారము వంటిది. బుద్ధికి వివేకము (అవగాహన) లభిస్తుంది. పిల్లలైన మీ కోసమే బాబా చిత్రాలను తయారుచేయించారు. ఇది చాలా సులభము. త్రిమూర్తి బ్రహ్మా మరియు విష్ణు, శంకరుడు, ఇప్పుడు బ్రహ్మాను త్రిమూర్తి అని ఎందుకంటారు! దేవ దేవ మహాదేవ... అని అంటారు. ఒకరి కన్నా ఒకరు పైనున్నట్లుగా చూపిస్తారు కానీ అర్థమేమీ తెలియదు. ఇప్పుడు బ్రహ్మా దేవత ఎలా అవ్వగలరు.. బ్రహ్మాను ప్రజాపిత అని అంటారు, అటువంటప్పుడు వారు సూక్ష్మవతనములోని దేవతగా ఎలా అవ్వగలరు. ప్రజాపిత బ్రహ్మా అయితే ఇక్కడ ఉండాలి. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. తండ్రి అంటారు, నేను ఈ శరీరములోకి ప్రవేశించి ఇతని ద్వారా మీకు అర్థం చేయిస్తాను, ఇతడిని నా రథముగా చేసుకుంటాను. ఇతని అనేక జన్మల అంతిమములో నేను వస్తాను. ఇతను కూడా 5 వికారాలను సన్యసిస్తారు. సన్యసించేవారిని యోగులు, ఋషులని అంటారు. ఇప్పుడు మీరు రాజఋషులు. మీరు ప్రతిజ్ఞ చేస్తారు. ఆ సన్యాసులైతే ఇళ్ళు-వాకిళ్ళు వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడైతే స్త్రీ-పురుషులు కలిసి ఉంటారు, మేము ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళమని అంటారు. ముఖ్యమైన విషయము వికారాలకు సంబంధించినదే.

శివబాబా రచయిత అని మీకు తెలుసు. వారు కొత్త రచనను రచిస్తారు. వారు బీజరూపుడు, సత్, చిత్, ఆనందసాగరుడు, జ్ఞానసాగరుడు. స్థాపన, పాలన, వినాశనము ఎలా చేస్తారు అనేది తండ్రికి మాత్రమే తెలుసు. ఈ విషయాల గురించి మనుష్యులకు తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ విషయాలన్నింటి గురించి తెలుసు, అందుకే అందరికీ అర్థం చేయించగలరు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ప్రతి ఆత్మ యొక్క లెక్కాచారము ఎవరిది వారిదే, అందుకే ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే ఏడవకూడదు. పూర్తిగా నష్టోమోహులుగా అవ్వాలి. నాకైతే ఒక్క అనంతమైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అని బుద్ధిలో ఉండాలి.

2. బుద్ధిని పాడు చేసే 5 వికారాలను త్యాగము చేయాలి. సుఖ దేవతలుగా అయి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ఎవరికీ దుఃఖము ఇవ్వకూడదు.

వరదానము:-
సదా మర్యాదల రేఖ లోపల ఉండేటువంటి జాగ్రత్తను వహించే మర్యాద పురుషోత్తమ భవ

ఏ పిల్లలైతే స్వయాన్ని ఒక్క తండ్రికి అనగా రామునికి సత్యమైన సీతలుగా భావిస్తూ సదా మర్యాదల రేఖ లోపల ఉంటారో అనగా ఈ జాగ్రత్తను వహిస్తారో, వారు కేర్ ఫుల్ గా మరియు చియర్ ఫుల్ గా (జాగ్రత్తగా మరియు హర్షితముగా) స్వతహాగా ఉంటారు. కావున ఉదయము నుండి రాత్రి వరకు, ఏ మర్యాదలైతే లభించాయో, వాటి గురించిన స్పష్టమైన జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకుని, స్వయాన్ని సత్యమైన సీతగా భావిస్తూ మర్యాదల రేఖ లోపల ఉండండి, అప్పుడు మర్యాదా పురుషోత్తములు అని అంటారు.

స్లోగన్:-
సేవ యొక్క అతిలోకి వెళ్ళకండి, సేవ మరియు స్వ పురుషార్థము యొక్క బ్యాలెన్స్ ను ఉంచండి.

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు

‘‘అఖండ జ్యోతి తత్వము సైలెన్స్ లాడ్జి మరియు సాకార ప్రపంచము ప్లే గ్రౌండ్’’

ఆత్మల నివాస స్థానము అఖండ జ్యోతి మహాతత్వము, అక్కడ ఆత్మ ఈ శరీరము యొక్క పాత్ర నుండి ముక్తిగా ఉంటుంది అనగా సుఖ-దుఃఖాలకు అతీతమైన అవస్థలో ఉంటుంది, దానిని సైలెన్స్ లాడ్జి అని కూడా అంటారు మరియు ఆత్మలు శరీర సహితముగా పాత్రను అభినయించే స్థానము ప్లే గ్రౌండ్ ఈ సాకార ప్రపంచము. కనుక ముఖ్యమైనవి రెండు ప్రపంచాలు, ఒకటేమో - నిరాకారీ ప్రపంచము, రెండవది - సాకారీ ప్రపంచము. ప్రపంచములోనివారైతే కేవలం మాట వరుసకు - పరమాత్మే రచయిత, వారు పాలన చేస్తారు, సంహరిస్తారు, తినిపిస్తారు, హతమారుస్తారు, కాల్చేది కూడా వారేనని అంటుంటారు, కనుక సుఖ-దుఃఖాలను ఇచ్చేవారు కూడా వారేనని అంటుంటారు. ఎప్పుడైనా ఎవరికైనా దుఃఖము కలిగినప్పుడు - ప్రభూ, మీ దయ కారణముగానే మీరు చేసే పనులు మధురముగా అనిపిస్తాయని అంటారు. ఇప్పుడు ఇది అయథార్థ జ్ఞానము, ఎందుకంటే ఇది పరమాత్ముని పనేమీ కాదు. పరమాత్మ దుఃఖహర్త, అంతేకానీ దుఃఖకర్త కాదు. జన్మ తీసుకోవడము, జన్మ విడిచిపెట్టడము, సుఖ-దుఃఖాలను అనుభవించడము అనేది ప్రతి మనుష్యాత్మ యొక్క సంస్కారము. శారీరానికి జన్మనిచ్చేవారు తల్లిదండ్రులు, వారు కూడా కర్మబంధనాల అనుసారముగా తండ్రి కొడుకుల సంబంధములోకి వస్తారు. అదే విధముగా ఆత్మల తండ్రి పరమాత్మ, వారు అనంతమైన రచనను ఏ విధముగా స్థాపన మరియు పాలన చేస్తారు! వారు ఆ 3 రూపాలైన బ్రహ్మా, విష్ణు, శంకరులకు రచయిత, వారు ఈ ఆకారీ రూపాల ద్వారా దైవీ సృష్టి యొక్క స్థాపనను, ఆసురీ ప్రపంచ వినాశనాన్ని మరియు దైవీ ప్రపంచ పాలనను చేయిస్తారు. పరమాత్ముని ఈ 3 కర్తవ్యాలు అనంతమైనవి. ఇకపోతే ఈ సుఖ-దుఃఖాలు, జనన-మరణాలు అనేవి కర్మల అనుసారముగా జరుగుతాయి. పరమాత్మ అయితే సుఖదాత, వారు తమ పిల్లలకు దుఃఖాన్ని ఇవ్వరు. అచ్ఛా - ఓంశాంతి.

అవ్యక్త ప్రేరణలు - అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా) అవ్వండి

సంపూర్ణ పవిత్రత అనగా మనసులో కూడా ఏ ఒక్క వికారానికి చెందిన అంశము కూడా లేకుండా ఉండటము. జ్ఞానము, గుణాలు మరియు సర్వ శక్తుల ప్రాప్తులలో సదా సంపన్నముగా ఉంటూ సర్వ ప్రాప్తులకు చెందిన ప్రకాశ కిరీటము స్పష్టముగా కనిపించాలి. స్వయాన్ని సదా లైట్ ఆత్మిక రూపములో అనుభవము చేయాలి. కర్మలలో కూడా స్వయాన్ని లైట్ (తేలిక) గా అనుభవము చేయాలి.