14-12-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 18.02.2008


‘‘విశ్వ పరివర్తన కోసం శాంతి శక్తిని ప్రయోగించండి’’

ఈ రోజు బాప్ దాదా, విశ్వ పరివర్తకుడైన తండ్రి, తన ఆశా దీపాలైన పిల్లలను నలువైపులా చూసి హర్షిస్తున్నారు. పిల్లలకు బాప్ దాదాపై అతి-అతి-అతి ప్రేమ ఉంది అని బాప్ దాదాకు తెలుసు మరియు బాప్ దాదాకు కూడా పిల్లలందరి పట్ల పదమాల రెట్ల కన్నా కూడా అధిక ప్రేమ ఉంది మరియు ఈ ప్రేమ అనేది సదా ఈ సంగమయుగములో లభించేదే ఉంది. ఏ విధముగా సమయము సమీపముగా వస్తూ ఉందో ఆ అనుసారముగా పిల్లలు ప్రతి ఒక్కరి మనసులో - ఇప్పుడు ఏదైనా చెయ్యాల్సిందే అన్న సంకల్పము, ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి అని బాప్ దాదాకు తెలుసు, ఎందుకంటే నేటి మూడు సత్తాలు అతి అలజడిలో ఉండటాన్ని మీరు చూస్తున్నారు. ధర్మ సత్తా కావచ్చు, రాజ్య సత్తా కావచ్చు, సైన్స్ సత్తా కావచ్చు. సైన్స్ కూడా ఇప్పుడు ప్రకృతిని యథార్థ రూపములో నడిపించలేకపోతుంది. వారు ఏమంటారంటే - జరిగేదే ఉంది. ఎందుకంటే సైన్స్ సత్తా ప్రకృతి ద్వారా కార్యము చేస్తుంది. సైన్స్ సాధనాలు ఉన్నప్పటికీ, ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ప్రకృతి ఇప్పుడు కూడా కంట్రోల్ లో లేదు మరియు మున్ముందు ఈ ప్రకృతి ఆటలు మరింత పెరుగుతుంటాయి ఎందుకంటే ప్రకృతిలో కూడా ఇప్పుడు ఆది సమయములో ఉన్న శక్తి లేదు. ఇటువంటి సమయములో, ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు ఏ సత్తా పరివర్తన చెయ్యగలదు? ఈ సైలెన్స్ శక్తియే విశ్వ పరివర్తన చేస్తుంది. నలువైపులా ఉన్న అలజడిని తొలగించేవారు ఎవరు? తెలుసు కదా! పరమాత్మ పాలనకు అధికారులైన ఆత్మలు తప్ప మరెవ్వరూ ఇది చెయ్యలేరు. మరి మీ అందరికీ ఈ ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి - బ్రాహ్మణ ఆత్మలమైన మేమే బాప్ దాదాతో పాటు కూడా ఉన్నాము మరియు పరివర్తనా కార్యములో సహచరులము కూడా.

బాప్ దాదా విశేషముగా అమృతవేళలో మరియు మొత్తము రోజంతటిలో కూడా చూసారు, ఎంతగా ప్రపంచములో మూడు సత్తాల అలజడి ఉందో అంతగా శాంతి దేవీలు, శాంతి దేవుళ్ళు అయిన మీరు ఎంత శక్తిశాలిగా శాంతి శక్తిని ప్రయోగించాలో అందులో ఇప్పుడు లోపము ఉంది. కావున బాప్ దాదా ఇప్పుడు పిల్లలందరికీ ఈ ఉల్లాసాన్ని ఇప్పిస్తున్నారు. సేవా క్షేత్రములోనైతే ధ్వనిని మంచిగా వ్యాపింపజేస్తున్నారు, కానీ సైలెన్స్ శక్తిని నలువైపులా వ్యాపింపజేయండి (ఈ రోజు పదే-పదే దగ్గు వస్తూ ఉంది) వాయిద్యము (శరీరము) సరిగ్గా లేదు, అయినా కూడా బాప్ దాదా పిల్లలను కలవకుండా ఉండలేరు మరియు పిల్లలు కూడా బాప్ దాదాను కలవకుండా ఉండలేరు. బాప్ దాదా ఈ విశేష సూచనను ఇస్తున్నారు - ఇప్పుడు శాంతి శక్తి యొక్క వైబ్రేషన్లను నలువైపులా వ్యాపింపజేయండి.

ఇప్పుడు విశేషముగా బ్రహ్మాబాబాను మరియు జగదాంబను చూసారు, వారు స్వయం ఆది దేవ్ గా ఉంటూ శాంతి శక్తి విషయములో ఎంతగా గుప్త పురుషార్థము చేసారు. మీ దాదీ కర్మాతీతముగా అవ్వడానికి ఈ విషయాన్నే ఎంతగా పక్కాగా చేసుకున్నారు. బాధ్యతలు ఉన్నప్పటికీ, సేవా ప్లాన్లను తయారుచేస్తూ కూడా శాంతి శక్తిని జమ చేసుకున్నారు. (దగ్గు పదే-పదే వస్తూ ఉంది) వాయిద్యము ఎంత సరిగ్గా లేకపోయినా కానీ బాప్ దాదాకు ప్రేమ ఉంది! సేవా బాధ్యతలు ఎంత పెద్దగా ఉన్నా కానీ శాంతి శక్తి లేనిదే సేవలో సఫలత అనే ప్రత్యక్ష ఫలాన్ని ఎంతైతే కోరుకుంటారో అది అంతగా వెలువడదు మరియు స్వయము కోసం పూర్తి కల్పము యొక్క ప్రారబ్ధాన్ని కూడా సైలెన్స్ శక్తి ద్వారానే తయారుచేసుకోగలరు. దీని కోసం ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్వయము కోసం, పూర్తి కల్పము కోసం రాజ్యము మరియు పూజ్యము అనే ప్రారబ్ధాన్ని జమ చేసుకునేందుకు ఇదే సమయము ఎందుకంటే నాజూకు సమయము రానున్నది. ఇటువంటి సమయములో శాంతి శక్తి ద్వారా టచింగ్ పవర్ మరియు క్యాచింగ్ పవర్ చాలా అవసరమవుతుంది. ఎటువంటి సమయము వస్తుందంటే, ఈ సాధనాలు ఏమీ చెయ్యలేకపోతాయి, కేవలం ఆధ్యాత్మిక బలము మరియు బాప్ దాదా ఇచ్చే డైరెక్షన్ల టచింగ్ మాత్రమే కార్యము చేయించగలదు. కావున స్వయములో చెక్ చేసుకోండి - ఇటువంటి సమయములో మనసు, బుద్ధిలో బాప్ దాదా యొక్క టచింగ్ వస్తుందా? ఇందులో బహుకాలపు అభ్యాసము కావాలి. దీనికి సాధనము ఏమిటంటే - మనసు, బుద్ధి సదా, అప్పుడప్పుడు కాదు, సదా క్లీన్ (స్వచ్ఛము) మరియు క్లియర్ (స్పష్టము) గా ఉండాలి. ఇప్పుడు రిహార్సల్ పెరుగుతూ ఉంటుంది మరియు క్షణములో అది రియల్ అయిపోతుంది. కొద్దిగా కూడా ఒకవేళ మనసులో, బుద్ధిలో ఏ ఆత్మ పట్లనైనా లేక ఏ కార్యము పట్లనైనా, తోటి వారి పట్లనైనా, సహయోగుల పట్లనైనా, కొద్దిగానైనా నెగెటివ్ ఉన్నట్లయితే దానిని క్లీన్ మరియు క్లియర్ అని అనడము జరుగదు. అందుకే బాప్ దాదా ఈ విషయములో అటెన్షన్ ను ఇప్పిస్తున్నారు. రోజంతటిలో చెక్ చేసుకోండి - సైలెన్స్ శక్తిని ఎంత జమ చేసుకున్నాను? సేవ చేస్తూ కూడా సైలెన్స్ శక్తి ఒకవేళ వాణిలో లేకపోతే ప్రత్యక్ష ఫలమైన సఫలతను ఎంతగా కోరుకుంటున్నారో అంతగా ఉండదు. శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫలితము తక్కువ. సేవ చెయ్యండి కానీ శాంతి శక్తితో సంపన్నమైన సేవను చెయ్యండి. అప్పుడు మీరు ఆశించిన ఫలితముకన్నా ఎక్కువ ఫలితమే వస్తుంది. పదే-పదే చెక్ చేసుకోండి. ఇకపోతే బాప్ దాదాకు సంతోషముగా ఉంది - రోజురోజుకు ఏ సేవ చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా, దానిని బాగా చేస్తున్నారు, కానీ స్వయము పట్ల శాంతి శక్తిని జమ చేసుకోవడములో, పరివర్తన అవ్వడములో మరింత అటెన్షన్ పెట్టాలి.

చివరికి విశ్వ పరివర్తనకు నిమిత్తము ఎవరు అవుతారు అని ఇప్పుడు పూర్తి ప్రపంచమంతా వెతుకుతూ ఉంది! ఎందుకంటే రోజురోజుకు దుఃఖము మరియు అశాంతి పెరుగుతున్నాయి మరియు ఇంకా పెరిగేదే ఉంది. భక్తులు తమ ఇష్టులను స్మృతి చేస్తున్నారు, కొందరు అతిలోకి వెళ్ళి వ్యాకులతతో జీవిస్తున్నారు. ధర్మ గురువుల వైపుకు దృష్టి మళ్లిస్తున్నారు మరియు సైన్స్ వారు కూడా ఇప్పుడు ఇదే ఆలోచిస్తున్నారు - ఎలా చెయ్యాలి, ఎప్పటికల్లా జరుగుతుంది! మరి వీరందరికీ జవాబు ఇచ్చేవారు ఎవరు? అందరి హృదయాలలో ఇదే పిలుపు ఉంది - చివరికి ఈ గోల్డెన్ మార్నింగ్ ఎప్పుడు రానున్నది. మరి మీరందరే తీసుకువచ్చేవారు కదా! మీరేనా? దీనికి నేను నిమిత్తము అని భావించేవారు చేతులెత్తండి. నిమిత్తమా? (అందరూ చేతులెత్తారు) అచ్ఛా! ఇంతమంది నిమిత్తమైతే మరి ఎంత సమయములో జరగాలి! మీరందరూ కూడా సంతోషిస్తున్నారు మరియు బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. చూడండి, ఈ గోల్డెన్ ఛాన్స్ ప్రతి ఒక్కరికీ గోల్డెన్ సమయమనుసారముగా ప్రాప్తిస్తుంది.

ఏ విధముగానైతే పరస్పరములో సేవా మీటింగ్ లు చేస్తారో, సమస్యను పరిష్కరించడానికి కూడా మీటింగ్ చేస్తారో, అదే విధముగా ఇప్పుడు ఈ మీటింగ్ చెయ్యండి మరియు ఈ ప్లాన్ ను తయారుచెయ్యండి. స్మృతి మరియు సేవ. స్మృతి అంటే అర్థము శాంతి యొక్క శక్తి మరియు అది ఎప్పుడు ప్రాప్తిస్తుంది అంటే మీరు టాప్ స్టేజ్ లో ఉన్నప్పుడు. ఏ విధముగా ఏదైనా టాప్ స్థానము ఉన్నప్పుడు అక్కడ నిలబడితే అక్కడ నుండి అంతా ఎంత స్పష్టముగా కనిపిస్తుంది, అదే విధముగా మీ టాప్ స్టేజ్ ఏమిటి, అన్నింటికన్నా టాప్ లో ఏముంది? పరంధామము. బాప్ దాదా ఏమంటారంటే - సేవ చేయండి మరియు ఆ తర్వాత టాప్ స్టేజ్ కు వచ్చి బాబాతో పాటు కూర్చోండి. ఏ విధముగానైతే అలసిపోయినప్పుడు 5 నిమిషాలైనా ఎక్కడైనా శాంతిగా కూర్చుంటే తేడా తెలుస్తుంది కదా, అలాగే మధ్య-మధ్యలో బాబా వద్దకు వచ్చి కూర్చోండి. రెండవ టాప్ స్థానము ఏమిటంటే - సృష్టి చక్రాన్ని చూడండి, సృష్టి చక్రములో టాప్ స్థానము ఏమిటి? సంగమయుగము వద్ద ముల్లును టాప్ లో చూపిస్తారు కదా. కావున కిందకు వచ్చి సేవ చేసి మళ్ళీ టాప్ స్థానానికి వెళ్ళిపోండి. మరి అర్థమయిందా ఏమి చెయ్యాలో? సమయము మిమ్మల్ని పిలుస్తుందా లేక మీరు సమయాన్ని సమీపముగా తీసుకువస్తున్నారా? రచయిత ఎవరు? పరస్పరములో ఇటువంటి ప్లాన్లను తయారుచెయ్యండి. అచ్ఛా!

మీరు రావలసిందే అని పిల్లలు అన్నారు మరియు బాబా హాజీ (సరే) అన్నారు. అలాగే మీరు కూడా ఇతరుల విషయాలను, స్వభావాలను, వృత్తులను అర్థం చేసుకుంటూ హాజీ, హాజీ అని అన్నట్లయితే సంగఠన శక్తి సైలెన్స్ జ్వాలను ప్రజ్వలింపజేస్తుంది. జ్వాలాముఖిని చూసారు కదా. ఈ సంగఠన శక్తి శాంతి జ్వాలను ప్రజ్వలింపజేస్తుంది. అచ్ఛా!

మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బాంబే వారిది సేవా టర్న్:- పేరే మహారాష్ట్ర. మహారాష్ట్రకు విశేషముగా డ్రామానుసారముగా గోల్డెన్ గిఫ్ట్ ప్రాప్తించింది. అది ఏమిటి? బ్రహ్మాబాబా మరియు మమ్మా యొక్క పాలన మహారాష్ట్రకు డైరెక్ట్ గా లభించింది. ఢిల్లీ మరియు యు.పి. వారికి కూడా లభించింది కానీ మహారాష్ట్రకు ఎక్కువగా లభించింది. ఇప్పుడు మహారాష్ట్ర వారు మహాన్ గా అయితే ఉండనే ఉన్నారు. ఇప్పుడు ఏమి చెయ్యాలి! మహారాష్ట్ర వారు కలిసి ఎటువంటి ప్లాన్ ను తయారుచెయ్యండంటే, ఎటువంటి మీటింగ్ ను చెయ్యండంటే, అందరిదీ ఒకే స్వభావము ఉండాలి, ఒకే సంస్కారము ఉండాలి, శాంతి యొక్క శక్తిని ఎలా వ్యాపింపజెయ్యాలి అన్న ఒకే సేవా లక్ష్యము ఉండాలి - దీని కోసం ప్లాన్ ను తయారుచెయ్యండి. చేస్తారు కదా! చేస్తారా? అచ్ఛా, బాప్ దాదాకు ఒక నెల తర్వాత మీరు ఏమి ప్లాన్ ను తయారుచేసారు అన్న ఆ రిపోర్ట్ ను ఇవ్వండి. మీ ఈ ఆత్మిక సంభాషణతో మిగిలినవారు కూడా యాడ్ అవుతారు. భిన్న-భిన్న జోన్లు ఉన్నాయి కదా, వారు కూడా కలుస్తారు. ఇందులో ప్రధాన భాగాన్ని మీరు తయారుచెయ్యండి మరియు వజ్రాలను వారు పొదుగుతారు. ఉంది కదా ధైర్యము. టీచర్లు, ధైర్యము ఉందా! మొదటి లైన్ వారు, ధైర్యము ఉందా? సంస్కార మిలనము అనే రాస్ ను ఏ జోన్ వారు చేస్తారు? ఒక జోన్ వారు - శుభ వృత్తి, శుభ దృష్టి మరియు శుభ కృతి, ఇవి ఎలా ఉండాలి, ఒక జోన్ వారు ఈ విషయాన్ని చేపట్టండి. మరో జోన్ వారు - ఒకవేళ ఏ ఆత్మ అయినా స్వయం సంస్కార పరివర్తన చేసుకోలేకపోతుంటే, కోరుకుంటున్నా కానీ చెయ్యలేకపోతుంటే, వారి పట్ల దయార్ద్ర హృదయులుగా అయి, క్షమను, సహయోగాన్ని, స్నేహాన్ని ఇస్తూ ఎలా మన బ్రాహ్మణ పరివారాన్ని శక్తిశాలిగా తయారుచేయాలి అన్నదాని కోసం ప్లాన్ ను తయారుచెయ్యండి. ఇది వీలవుతుందా? వీలవుతుందా? మొదటి లైన్ వారు చెప్పండి, వీలవుతుందా? వీలవుతుంది అంటే చేతులెత్తండి, ఎందుకంటే మొదటి లైన్ లో అందరూ మహారథులు కూర్చుని ఉన్నారు. ఇప్పుడు బాప్ దాదా పేర్లు వినిపించరు, ప్రతి ఒక్క జోన్ వారు ఏది బాగా అనిపిస్తే అది తీసుకుని ఆత్మిక సంభాషణ చేసుకుని శివరాత్రి తర్వాత ఒక నెలలో రిజల్టును వినిపించండి. మహారాష్ట్ర కదా, మరింత మంచిది. వృద్ధి అయితే అన్ని చోట్ల జరుగుతోంది, అందుకు బాప్ దాదా అభినందనలు, అభినందనలు అని తెలుపుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏదైతే చేసారో దాని కోసం అభినందనలు, కానీ ఇప్పుడు క్వాలిటీని వృద్ధి చెయ్యండి. క్వాలిటీ అంటే షావుకారులు అని అర్థము కాదు, క్వాలిటీ అంటే స్మృతిని నియమానుసారముగా జీవితములో ఒక ప్రామాణికంగా చేసి చూపించేవారు. ఇకపోతే మైక్ లు మరియు వారసుల గురించైతే మీకు ఎలాగూ తెలుసు. నిశ్చయబుద్ధి మరియు నిశ్చింతగా ఉండాలి. అచ్ఛా!

డబల్ విదేశీయులలో యుగళులకు మరియు కుమారీలకు విశేషమైన రిట్రీట్ జరిగింది:- ఈ గుర్తును పెట్టుకుని వచ్చారు. బాగా అనిపిస్తుంది. ఇతరులకు కనిపించే విధముగా కుమారీలు అటువైపు తిరగండి. చుట్టూ తిరగండి. బాగుంది. అందరూ లక్కీయే కానీ కుమారీలు డబుల్ లక్కీ, ఎందుకని? ఆ మాటకొస్తే కుమారులు కూడా లక్కీయే, కానీ కుమారీలు ఒకవేళ కుమారీ జీవితములో అమరులుగా ఉన్నట్లయితే బాప్ దాదా యొక్క మరియు గురుభాయి యొక్క సింహాసనము లభిస్తుంది. హృదయ సింహాసనమైతే ఎలాగూ ఉండనే ఉంది. అదైతే అందరికీ ఉంది, కానీ గురువు యొక్క సింహాసనము అంటే దానిపై కూర్చుని మురళిని వినిపిస్తారు. టీచర్ గా అయి టీచ్ చేస్తారు. అందుకే బాప్ దాదా అంటారు, కుమారీలు డబల్ లక్కీ. కుమారీల కొరకు వారు 21 పరివారాలను ఉద్ధరిస్తారు అన్న గాయనము ఉంది. మీరైతే మీ 21 జన్మలను ఉద్ధరించుకున్నారు కానీ మీరు ఇంకా ఎవరి కోసమైతే నిమిత్తమవుతారో వారికి కూడా 21 జన్మల కొరకు ఉద్ధరణ జరుగుతుంది. ఇటువంటి కుమారీలే కదా. ఇటువంటి వారేనా? పక్కానా? ఎవరైతే కొద్ది-కొద్దిగా కచ్చాగా ఉన్నారో వారు చేతులెత్తండి. పక్కాగా ఉన్నారా. (దాదీలతో) మీరు చూసారు కదా, వీరు పక్కా కుమారీలేనా? పక్కాగా ఉన్నారా! మోహినీ బెహన్ (న్యూయార్క్) చెప్పండి, పక్కాగా ఉన్నారా? కుమారీల గ్రూప్ పక్కాగా ఉందా? వీరి టీచర్ ఎవరు! (మీరా బెహన్) పక్కా అయితే చప్పట్లు కొట్టండి. బాప్ దాదాకు కూడా సంతోషముగా ఉంది. అచ్ఛా! (ఇది కుమారీల 8వ రిట్రీట్ - వీరి టాపిక్ ఏమిటంటే - నావారు అనే భావన యొక్క అనుభవము. 30 దేశాల నుండి 80 మంది కుమారీలు వచ్చారు, అందరూ నావారు అన్న భావాన్ని చాలా బాగా అనుభవం చేసారు) అభినందనలు. వీరైతే కుమారీలు, మరి మీరందరూ ఎవరు? మీరు ఏమని చెప్పండంటే - వీరు కుమారీలైతే మేము బ్రహ్మాకుమారులము మరియు బ్రహ్మాకుమారీలము. మీరు కూడా తక్కువేమీ కాదు. ఇది కుమారుల గ్రూప్. ఇది మిక్సడ్ గ్రూప్. అచ్ఛా. యుగళులకు ఏ నషా ఉంది? ఎక్స్ ట్రా నషా ఏముందో తెలుసా! ఎప్పటినుండైతే ప్రవృత్తివారు ఈ జ్ఞానాన్ని ధారణ చెయ్యడము ప్రారంభించారో అప్పుడు మెజారిటీ ప్రజలలో మేము కూడా చెయ్యగలము అన్న ధైర్యము వచ్చింది. పూర్వము ఏమని భావించేవారంటే - బ్రహ్మాకుమారీలుగా అవ్వడమంటే అంతా వదిలిపెట్టడము అని. కానీ ఇప్పుడు ఏమని అనుకుంటున్నారంటే, బ్రహ్మాకుమారులు, కుమారీలుగా అయి పరివారాన్ని, వ్యవహారాన్ని అన్నింటినీ నడిపించవచ్చు అని. యుగళులది మరో విశేషత ఉంది. వారు మహాత్ములను కూడా ఛాలెంజ్ చేసారు - మేము కలిసి ఉంటూ, కార్యవ్యవహారాలు చేసుకుంటూ కూడా మా పరమార్థము శ్రేష్ఠమైనది అని, వారు విజయులు. కావున ఈ విజయము యొక్క ధైర్యాన్ని ఇప్పించడమనేది యుగళుల పని, అందుకే బాప్ దాదా యుగళులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. సరేనా. ఛాలెంజ్ చేసేవారు కదా, పక్కానా. ఎవరైనా వచ్చి సి.ఐ.డి. పని చేస్తే, చేస్తే చెయ్యనివ్వాలా, చేసుకోండి అని చెప్పాలా. అంత శక్తి ఉందా? ఉందా? చేతులెత్తండి. అచ్ఛా!

బాప్ దాదా సదా డబుల్ విదేశీయులను ధైర్యము కలవారిగా భావిస్తారు. ఎందుకని? బాప్ దాదా ఏమి చూసారంటే, పనికి కూడా వెళ్తారు, క్లాస్ కు కూడా వెళ్తారు, కొందరు క్లాస్ చేయిస్తారు కూడా మరియు ఆల్రౌండ్ సెంటర్ సేవలో కూడా సహాయకులుగా అవుతారు. అందుకే బాప్ దాదా - వీరు ఆల్రౌండ్ గ్రూప్ అన్న టైటిల్ ను ఇస్తున్నారు. అచ్ఛా. ఇలాగే ముందుకు వెళ్తూ ఉండండి మరియు ఇతరులను కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. అచ్ఛా!

టీచర్లతో:- టీచర్లు బాగున్నారా? టీచర్లు చాలామంది ఉన్నారు. మంచిది, చూడండి, తండ్రి సమానమైనవారు అన్న టైటిల్ మీకు కూడా ఉంది. తండ్రి కూడా టీచరుగా అయి వస్తారు. టీచరు అనగా స్వ అనుభవము యొక్క ఆధారముతో ఇతరులను కూడా అనుభవజ్ఞులుగా చేయడము. అనుభవము యొక్క అథారిటీ అన్నింటికంటే గొప్పది. ఒకవేళ ఒక్క సారి అయినా ఏదైనా విషయాన్ని అనుభవం చేసినట్లయితే జీవితాంతము మర్చిపోలేరు. విన్న విషయాన్ని, చూసిన విషయాన్ని మర్చిపోవచ్చు కానీ అనుభవం చేసిన విషయాన్ని ఎప్పుడూ మర్చిపోరు. కావున టీచర్లు అనగా అనుభవజ్ఞులుగా అయి అనుభవజ్ఞులుగా చెయ్యడము. ఇదే పని చేస్తున్నారు కదా! మంచిది. అనుభవంలో ఏదైతే లోటు ఉందో, దానిని ఒక్క నెలలో నింపుకోండి. ఆ తర్వాత బాప్ దాదా రిజల్టును అడుగుతారు. అచ్ఛా!

నలువైపులా ఉన్న బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారులకు మరియు విశ్వ రాజ్య సింహాసనాధికారులకు, సదా తమ సైలెన్స్ శక్తిని పెంచుకుంటూ ఇతరులకు కూడా ముందుకు సాగే ఉల్లాస-ఉత్సాహాలను ఇచ్చేవారికి, సదా సంతోషముగా ఉండేవారికి మరియు అందరికీ సంతోషమనే కానుకను ఇచ్చేవారికి, నలువైపులా ఉన్న బాప్ దాదా యొక్క లక్కీ మరియు లవ్లీ పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు ఆశీర్వాదాలు, నమస్తే.

వరదానము:-
ప్రతి పరిస్థితిలోనూ సురక్షితముగా ఉండే ఎయిర్ కండిషన్ టికెట్ యొక్క అధికారీ భవ

ఎవరైతే ఇక్కడ ప్రతి పరిస్థితిలోనూ సురక్షితముగా ఉంటారో ఆ పిల్లలకే ఎయిర్ కండిషన్ టికెట్ లభిస్తుంది. ఏ పరిస్థితి వచ్చినా కానీ, ఎటువంటి సమస్య వచ్చినా కానీ, ప్రతి సమస్యను క్షణములో దాటి వేసే సర్టిఫికెట్ కావాలి. ఏ విధముగా ఆ టికెట్ కోసం డబ్బులు ఇస్తారో అలా ఇక్కడ ‘‘సదా విజయీ’’ గా అయ్యే ధనము కావాలి, దాని ద్వారా టికెట్ లభించగలదు. ఈ ధనాన్ని ప్రాప్తి చేసుకునేందుకు కష్టపడవలసిన అవసరము లేదు, కేవలం సదా బాబాతో పాటు ఉన్నట్లయితే లెక్కలేనంత సంపాదన జమ అవుతూ ఉంటుంది.

స్లోగన్:-
ఎటువంటి పరిస్థితి అయినా సరే, పరిస్థితి వెళ్ళిపోవాలే కానీ సంతోషము పోకూడదు.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి

మీ రచన అయిన తాబేలు క్షణములో అన్ని ఇంద్రియాలను ఇముడ్చుకుంటుంది. ఇముడ్చుకునే శక్తి రచనలో కూడా ఉంది. మాస్టర్ రచయితలైన మీరు ఇముడ్చుకునే శక్తి ఆధారముతో క్షణములో అన్ని సంకల్పాలను ఇముడ్చుకుని ఒక్క సంకల్పములో స్థితులవ్వండి. ఎప్పుడైతే అన్ని కర్మేంద్రియాల యొక్క కర్మల స్మృతి నుండి అతీతముగా ఒకే ఆత్మిక స్వరూపములో స్థితులవుతారో, అప్పుడు కర్మాతీత అవస్థ యొక్క అనుభవమవుతుంది.