15-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - యోగబలము ద్వారానే ఆత్మ యొక్క తుప్పు వదులుతుంది, అందుకే యోగములో ఎప్పుడూ కూడా నిర్లక్ష్యము చేయకండి’’

ప్రశ్న:-
తండ్రి, పిల్లలకు అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు ఏ యుక్తిని తెలియజేశారు, అందులో మాయ నలువైపుల నుండి విఘ్నాలు కలిగిస్తుంది?

జవాబు:-
బాబా తెలియజేసిన యుక్తి ఏమిటంటే - పిల్లలూ, బ్రహ్మాకుమార-కుమారీలైన మీరు ఒక్క తండ్రి పిల్లలు, పరస్పరములో సోదరీ-సోదరులు, మీరు ఎప్పుడూ వికారీ చేష్టలు చేయకూడదు. సోదరీ-సోదరులు వికారాలలోకి వెళ్ళకూడదు. మీరు శివబాబా మతముపై నడుస్తూ అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. కానీ మాయ తక్కువైనదేమీ కాదు, ఈ విషయములోనే నలువైపుల నుండి విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది. మేము సోదరీ-సోదరులము, ఒక్క తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అనేది మర్చిపోతారు.

పాట:-
మిమ్మల్ని పొంది మేము...

ఓంశాంతి
పాటలోని ఒక్క మాట సరిపోతుంది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము లభిస్తుందని మరియు అది కల్ప-కల్పము లభిస్తుందని పిల్లలకు తెలుసు. అనంతమైన వారసత్వము తప్పకుండా భారత్ కే లభించిందని కూడా పిల్లలకు తెలుసు. ఇప్పుడు ఆ వారసత్వము లేదు, అది మళ్ళీ ఇప్పుడు లభిస్తూ ఉంది. ఇప్పుడైతే స్వర్గ వారసత్వము లేదని, రావణుడి ద్వారా నరకము యొక్క శాపము లభిస్తూ ఉందని మీరు చూస్తున్నారు. శాపము వల్ల మనుష్యులు దుఃఖితులు అవుతారు. వరము అనగా వారసత్వము ద్వారా సుఖపడతారు. శివబాబా అనంతమైన నిరాకార తండ్రి అని మరియు ప్రజాపిత బ్రహ్మా అనంతమైన సాకార తండ్రి అని ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలకు తెలుసు. ప్రజాపిత బ్రహ్మా తప్ప ఇంకెవరూ అనంతమైన సాకార తండ్రిగా అవ్వరు. గాంధీని కూడా బాపూజీ అని అనేవారు కానీ నియమానుసారముగా మొత్తం మనుష్య సృష్టికైతే వారు బాపూజీ అవ్వలేరు. మొత్తం నిరాకారీ ప్రపంచానికి బాపూజీ - శివుడు. మనము శివబాబాకు చెందినవారిగా అయ్యామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారసత్వాన్ని ఇచ్చేందుకని శివబాబా వచ్చి మనల్ని తమవారిగా చేసుకున్నారు. మధుబన్ కు దేని కోసమని వస్తారు? శివబాబాను కలుసుకునేందుకని వస్తారు, కానీ వారు నిరాకారుడు. కేవలం శివబాబా అని అంటే అర్థం చేసుకోరు, అందుకే బాప్ దాదా అని అంటారు. శివబాబా మరియు బ్రహ్మా దాదా (అన్నయ్య). దాదా పేరు వేరు, తండ్రి పేరు వేరు. ఆ నిరాకారుడు అందరికీ తండ్రి కూడా, అందరికీ తాతగారు కూడా. పిల్లలందరికీ బాప్ దాదా నుండి వారసత్వము తప్పకుండా లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి అందరికీ వారసత్వము లభిస్తుంది. ఆ తండ్రియే అందరి దుఃఖహర్త-సుఖకర్త. సత్యయుగములో మనుష్యులెవ్వరూ దుఃఖితులు అవ్వలేరు. దాని పేరు స్వర్గము, వారు స్వర్గాన్ని స్థాపన చేసే గాడ్ ఫాదర్. భారత్ అన్నింటికన్నా పురాతనమైనది, అంటే తప్పకుండా ఇంతకుముందు అన్నింటికన్నా కొత్తదిగా ఉండేది, అందుకే కదా ఇప్పుడు అన్నింటికన్నా పాతదిగా అయ్యింది. సత్యయుగము, కలియుగము అని భారత్ నే అంటారు. తప్పకుండా భారత్ స్వర్గముగా ఉండేది. ఈ లక్ష్మీ-నారాయణులు రాజ్యము చేసేవారు. ఈ విషయము మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీరు లక్ష్మీ-నారాయణుల మందిరానికి వెళ్తే వెంటనే ఈ విషయాలు బుద్ధిలోకి వస్తాయి - వీరికి ఈ వారసత్వము ఎలా లభించింది, వీరు పూజ్యులుగా ఎలా అయ్యారు, ఎప్పుడు రాజ్యము చేసారు, ఎవరి ద్వారా రాజ్యాన్ని పొందారు - ఇదంతా బుద్ధిలోకి వస్తుంది. ఇంతకుముందు లక్ష్మీ-నారాయణుల మందిరానికి వెళ్ళేవారు, మాలను తిప్పేవారు, కానీ వారి కర్తవ్యము గురించి ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు ఈ విషయము కేవలం మీ బుద్ధిలో ఉంది, అది కూడా నంబరువారుగా ఉంది. ఇప్పుడు మీరు లక్ష్మీ-నారాయణుల మందిరానికి వెళ్ళి నిలబడితే హర్షితులవుతారు. వారు ఈ ప్రారబ్ధాన్ని ఎలా పొందారు అనేది బుద్ధిలో ఉంది. సంగమయుగములోనే పొందారు ఎందుకంటే సంగమములోనే పాత ప్రపంచము పరివర్తన అవ్వనున్నది. సంగమములోనే తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పించారు. అనేక జన్మల అంతిమ జన్మలో తప్పకుండా వీరే బ్రహ్మాగా ఉండేవారని కూడా మీకు తెలుసు. బ్రహ్మా ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన జరుగుతుంది. వాస్తవానికి ఈ లక్ష్మీ-నారాయణులే మునుపటి జన్మలో బ్రహ్మా-సరస్వతులుగా ఉండేవారు. బ్రహ్మాతో పాటు బ్రాహ్మణ-బ్రాహ్మణీలు కూడా ఉంటారు. సత్యయుగములో లక్ష్మీ-నారాయణుల రాజధాని ఉండేది కదా. తప్పకుండా ప్రజాపిత కూడా ఉంటారు. ఇప్పుడు మనము పురుషార్థము చేస్తున్నామని మీకు తెలుసు. ఎవరైతే కల్పక్రితం పురుషార్థము చేసారో, వారిని మనము సాక్షీగా అయి చూస్తాము. ఒకటేమో రాజుల వంశము, రెండవది ప్రజల వంశము. ప్రజల్లో కూడా కొందరు చాలా షావుకారులుగా ఉంటారు, కొందరు తక్కువ షావుకారులుగా ఉంటారు. రాజులలో కూడా కొందరు చాలా షావుకారులుగా, కొందరు తక్కువ షావుకారులుగా ఉంటారు. మీరు లక్ష్మీ-నారాయణుల మందిరానికి వెళ్ళి, వీరు ఈ రాజ్యాన్ని ఎలా పొందారు అనేది ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఇప్పుడు మళ్ళీ వారే తమ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు, రాజధాని స్థాపనవుతోంది. ఇది ఎంత సహజము. అంబ ఎవరు అనేది కూడా తెలియదు. వీరు జగదాంబ అని మీరు అంటారు. కల్పక్రితం కూడా జగదాంబ, జగత్పిత ఉండేవారు. మనము వారి పిల్లలుగా ఉండేవారము. సంగమయుగములో బాబా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. జగదాంబకు పిల్లలు కూడా అనేకమంది ఉన్నారు. కానీ ఇంతమందినైతే ఇక్కడ కూర్చోబెట్టలేరు.

ఇప్పుడు మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించింది. తండ్రి జ్ఞానసాగరుడు కనుక తప్పకుండా పిల్లలకు జ్ఞానాన్నే ఇస్తారు. వారిని మనిషి అని గాని, దేవత అని గాని అనడం జరగదు. వారిని పరమాత్మ అనే అనడం జరుగుతుంది. మీరు ఎవరి మందిరానికి వెళ్ళినా, వారి జీవితచరిత్రను చెప్పగలరు. రాముని గురించి కూడా మీరు అర్థం చేయించగలరు. చంద్రవంశము ఇప్పుడు స్థాపనవుతూ ఉంది. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణుల ధర్మము కూడా స్థాపనవుతుంది. బ్రహ్మా పేరు ఎంత ప్రసిద్ధమైనది. బ్రహ్మా ద్వారా తండ్రి బ్రాహ్మణులను రచిస్తారు. మీరు బ్రహ్మాకుమార-కుమారీలుగా అవ్వడము వలన మీకు తెలుసు - మేము ఒక్క తండ్రి పిల్లలము, పరస్పరములో సోదరీ-సోదరులము కనుక మేము వికారీ చేష్టలు చేయలేము. సోదరీ-సోదరులు వికారాలలోకి వెళ్ళలేరు. తండ్రి ఈ యుక్తిని రచించారు - డ్రామానుసారముగా నీవు కూడా బ్రహ్మాకుమార్, నేను కూడా బ్రహ్మాకుమారీ. వాస్తవానికి ప్రపంచములోని వారందరూ బి.కె.లు. కానీ ఎవరికీ ఈ విషయము తెలియదు. మనము శివబాబా మతాన్ని అనుసరిస్తూ అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాము. మాయ కూడా తక్కువైనదేమీ కాదు. నలువైపుల నుండి విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది. మేము సోదరీ-సోదరులము, ఒకే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము అనేది మర్చిపోతారు. సత్యయుగములో ఒకే ధర్మముంటుందని, మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమవ్వనున్నాయని మంచి రీతిలో అర్థం చేసుకున్నారు. ఇది కొత్త విషయమేమీ కాదని కూడా పిల్లలకు తెలుసు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత ఈ చక్రము తిరుగుతుంది. తిథి-తారీఖులు కూడా వ్రాయబడి ఉన్నాయి. మేము శివబాబా నుండి ఈ యుక్తి ద్వారా వారసత్వాన్ని తీసుకుంటామని కూడా బుద్ధిలో ఉండాలి. లక్ష్యమైతే లభించింది కదా. తండ్రిని స్మృతి చేసి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. స్మృతి అనగా యోగబలముతోనే తుప్పు వదులుతుంది. ఇందులో ఎటువంటి నిర్లక్ష్యము ఉండకూడదు, అందుకే మురళీలు లభిస్తాయి. నిశ్చయబుద్ధి పక్కాగా ఉన్నట్లయితే ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఒకవేళ మురళి లభించలేదనుకోండి, అయినా కూడా, నేను బాబాకు చెందినవానిగా అయిపోయాను అన్నదైతే బుద్ధిలో ఉంటుంది కదా. బాబా అర్థం చేయించారు - మీ ఆత్మ తమోప్రధానముగా అయిపోయింది, ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. ఈ మహామంత్రాన్ని ఒక్క తండ్రి మాత్రమే తెలియజేస్తారు, ఇంకెవ్వరూ తెలియజేయలేరు. తండ్రియే అంటారు - మధురాతి మధురమైన పిల్లలూ, స్మృతిబలముతోనే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి. ఈ పదాలు ఉన్నాయి కానీ ఇవి ఎవరి బుద్ధిలోకి రావు. దేహ ధర్మాలన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని, తప్పకుండా కల్పక్రితం కూడా బాబా చెప్పారని, ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇవన్నీ దేహ ధర్మాలే కదా. అందరి తండ్రి ఒక్కరే. ఆత్మలందరూ ఆ తండ్రి ఒక్కరినే పిలుస్తారు. పోప్ కూడా భగవంతుడినే తలచుకుంటారు. ఓ గాడ్ ఫాదర్, దయ చూపించండి, ఈ మనుష్యులు పరస్పరములో కొట్లాడుకోకుండా క్రోధముతో కూడిన వీరి బుద్ధులను పరివర్తన చేయండి అని అంటారు. తలచుకోవడమైతే తండ్రినే తలచుకుంటారు కదా. ఇంకెవ్వరినీ తలచుకోరు. మీరు వచ్చి పతితులను పావనముగా చేయండి అని శివబాబానే పిలుస్తారు. పావనముగా అయిపోతే ఇక ఈ ఛీ-ఛీ రావణ ప్రపంచములో ఉండలేరు, అప్పుడిక తప్పకుండా కొత్త ప్రపంచము కావాలి. కలియుగము మారి సత్యయుగమైతే వస్తుంది కదా. కానీ ఈ మాత్రం కూడా అర్థం చేసుకోరు. ఒక డాక్టరు వచ్చేవారు, అతను ఏమన్నారంటే - ఇక కలియుగమే కొనసాగుతూ ఉంటుంది అని. అరే, సదా కలియుగమే ఎలా కొనసాగుతుంది. కలియుగము ఏమైనా బాగుందా ఏమిటి! వారు ఏమీ అర్థం చేసుకోరు, వారికి కేవలం భావన ఉంటుంది, ఇతరులను తీసుకువస్తూ ఉంటారు. వారికి బాణము తగలదు కానీ వారితో వచ్చినవారిలో ఎవరికైనా బాణము తగిలితే, ఆ తీసుకువచ్చినవారికి ఎంతోకొంత కమిషన్ లభిస్తుంది. వారు స్వర్గములోకైతే వచ్చేస్తారు. వారు వచ్చి తండ్రి నుండి కొద్దిగా విన్నా సరే స్వర్గములోకి తప్పకుండా వెళ్తారు. ఎంతైనా హెవెన్లీ గాడ్ ఫాదర్ ఎదురుగా వచ్చి కూర్చున్నారు కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను అందరికీ తండ్రిని కదా. శివబాబా ఎలా వస్తారు అని అంటూ కొంతమంది నమ్మరు. అరే, ఆత్మ రాగలిగినప్పుడు నేను ఎందుకు రాలేను. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకదానిలోకి వెళ్ళగలిగినప్పుడు నేను రాలేనా. లేదంటే మరి నేను ఎలా రావాలి! ఓ పతిత-పావన బాబా, మీరు వచ్చి పతితుల నుండి పావనముగా చేయండి అని పిలుస్తారు కూడా. తండ్రి అంటారు - నేను భారత్ లోనే వస్తాను, కల్ప-కల్పము యొక్క సంగమములో ఒక్కసారి మాత్రమే వస్తాను, మీరు 84 జన్మలు పూర్తి చేసుకున్నప్పుడు నేను వస్తాను. బాబా మళ్ళీ వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారని పిల్లలైన మీకు నిశ్చయముంది. తండ్రి అంటారు - పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడమే నా వ్యాపారము. అందుకే, కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనము అని అంటూ ఉంటారు, ఆ తర్వాత మీరు పాలన చేస్తారు. ప్రకాశము లభించింది కదా. కాళీ మందిరాన్ని చూసినప్పుడు ఇది అసత్యమైన చిత్రమని అర్థం చేసుకుంటారు. వాస్తవానికి కాళీ అంటే జగదాంబయే కానీ వారికి అటువంటి భయంకర రూపము లేదు. బెంగాల్ లో కాళీ ఎదురుగా బలి ఇస్తారు కానీ వారికేమీ తెలియదు. జగదాంబ మందిరానికి లక్షలాదిమంది వస్తారు. సదా మేళా జరుగుతున్నట్లుగానే ఉంటుంది. అక్కడ చిన్న మూర్తిని పెట్టారు కదా. ఆ మూర్తికి జగదాంబ అని పేరు పెట్టారు. ఇప్పుడు జగదాంబ అనేవారు ఒక్కరే ఉండాలి. సింధ్ లో కాళీ మందిరాన్ని ఎలా నిర్మించారు. ఒకసారి కోటలో బాంబు పేలింది, అప్పుడు ఒక ఫకీరు కాళీ మాతకు కోపం వచ్చిందని చెప్పారు, అంతే, ఇక వాళ్ళు వెళ్ళి అక్కడ కాళీ మందిరాన్ని నిర్మించారు. ఇంతకీ కాళీ అంటే ఎవరు! ఏమీ తెలియదు. మీకు ఇప్పుడు జ్ఞానము లభించింది, మీకు తెలియని విషయమంటూ ఏదీ లేదు. బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారని అర్థం చేసుకున్నారు కనుక పూర్తి పురుషార్థము చేయాలి కదా.

కుమార-కుమారీలు వివాహము చేసుకున్నప్పుడు మొదటి నంబరు దుఃఖము మొదలవుతుంది. మీకైతే వివాహము చేసుకోవాలనే ఆలోచన కూడా ఎప్పుడూ రాకూడదు. ఇప్పుడు తండ్రి అంటారు, ఈ రావణ రాజ్యము సమాప్తమవ్వనున్నది. ఇక్కడున్నది వికారీ గృహస్థ వ్యవహారము. దేవీ-దేవతల గురించి పాడుతూ ఉంటారు. ఈ దేవతలను నిర్వికారులుగా చేసేవారు ఎవరు అనేది ఎవరికీ తెలియదు! సత్యయుగము సంపూర్ణ నిర్వికారీ ప్రపంచము. అక్కడ కూడా వికారాలు ఉండేవని శాస్త్రాలలో చూపించారు కానీ అది ఉన్నదే నిర్వికారీ ప్రపంచము. వికారీ ప్రపంచానికి మరియు నిర్వికారీ ప్రపంచానికి ఎంత వ్యత్యాసము ఉంటుంది. ఈ విషయాలు ఇంకెవరి బుద్ధిలోనూ లేవు. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉన్నప్పుడు ఎంత కొద్దిమంది మనుష్యులు ఉండేవారు అనేది మీకు తెలుసు. ఒకే ధర్మము ఉండేది, ఆ తర్వాత వృద్ధి జరుగుతుంది. చక్రములో కూడా పూర్తిగా తిరగవలసి ఉంటుంది, అప్పుడే పృథ్వినంతా చుట్టి వచ్చారని అంటారు. సముద్రాన్ని అయితే చుట్టి రాలేరు. సత్యయుగములో కొద్దిమందే ఉంటారు కనుక ఎంత తక్కువ స్థలములో ఉంటారు. ఇప్పుడు మనుష్య సృష్టి యొక్క హద్దులు పూర్తి కానున్నాయి. పైన ఉన్న ఆ కొద్దిమంది ఆత్మలు కూడా వస్తూ ఉంటారు. మనుష్యుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అక్కడ నుండి ఆత్మలు రావడము పూర్తయినప్పుడు మీరు కర్మాతీత అవస్థను పొందుతారు. అప్పుడిక ఆత్మలు శరీరాలను వదిలి వెళ్ళాలి. వారు రావడము మరియు మీరు వెళ్ళడము జరుగుతుంది. కొంతమంది చొప్పున వస్తూ ఉంటారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము కదా. మొట్టమొదటగా మనము అక్కడకు వెళ్ళి ఉంటాము. మనము వెళ్ళేటప్పటికి ఎవరూ ఉండకూడదు. ఇవి విస్తారమైన విషయాలు. పిల్లలకు తండ్రి మళ్ళీ చెప్తున్నారు - అచ్ఛా, మీ ప్రియమైన తండ్రిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేయడము వలన మీకు లాభముంటుంది. ఆ చరిత్ర-భౌగోళికాలను మనుష్యులు చాలా చదువుతూ ఉంటారు. చాలా దూరదూరాలకు వెళ్తారు. చంద్రునిపైకి కూడా వెళ్తారు. ఇది సైన్సు యొక్క గర్వము. అతిలోకి వెళ్తారు. చంద్రునిపైన ఏమీ లేదు. మీరైతే సూర్య-చంద్రులను కూడా దాటి వెళ్తారు. ఈ జ్ఞానము మీ బుద్ధిలో ఇప్పుడు ఉంది. డ్రామా ప్లాన్ అనుసారముగా బాబా ఇవన్నీ తెలియజేస్తున్నారని మీరు అర్థం చేసుకుంటారు. తండ్రియే అంటారు - నేను మిమ్మల్ని పతితుల నుండి పావనముగా చేస్తాను, ఇది నా పాత్ర, భక్తి మార్గములో కూడా ఇది నా పాత్రే. వాస్తవానికి ఇది డ్రామాయే కదా. ఎలాగైతే మీరు పాత్రధారులో, అలా నేను కూడా పాత్రధారిని. నా పని మిమ్మల్ని పతితుల నుండి పావనముగా చేయడము. ఎవరైనా ఏదైనా చేస్తే, వారికి మహిమ జరుగుతుంది కదా. ఈ లక్ష్మీ-నారాయణులకు ఎంతటి మహిమ ఉంది. కానీ, వీరిని ఇంతటి యోగ్యులుగా ఎవరు తయారుచేసారు. వీరు సుఖధామానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడైతే రకరకాల దుఃఖాలు ఎన్ని ఉన్నాయి. ఈ రోజు ఎవరో మరణించవచ్చు, ఏదైనా గొడవ జరగవచ్చు. ఎవరి వద్దనైనా లక్షలు, కోట్లు, పదమాలు ఉన్నా సరే, ఒకవేళ ఏదైనా వ్యాధి వస్తే ఏమి చేస్తారు! బిర్లా వద్ద ఎంత ధనముంది! ఒక జన్మలో ఎంతో ధనము ఉండవచ్చు కానీ దుఃఖమనేదే లేనివారు ఎవ్వరూ లేరు. ఏదో ఒక రకమైన దుఃఖము అందరికీ ఉంటుంది. ఇప్పుడైతే ఈ ధనము మొదలైనవన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. కర్మాతీత అవస్థను ప్రాప్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళాలి కానీ ఎప్పుడైతే ఆత్మలు రావడము ఆగిపోతుందో, అప్పుడే తిరిగి వెళ్తారు. ఈ విస్తారాన్ని బుద్ధిలో ఉంచుకుని ఒక్క తండ్రిని ప్రేమగా స్మృతి చేయాలి.

2. జ్ఞానము యొక్క ప్రకాశము లభించింది, అందుకే నిశ్చయబుద్ధి కలవారిగా అయి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. ఎక్కడ ఉంటున్నా సరే, స్మృతి బలము ద్వారా ఆత్మను తమోప్రధానము నుండి సతోప్రధానముగా తయారుచేసుకునే పురుషార్థము చేయాలి.

వరదానము:-
స్వమానములో స్థితులై ఉంటూ విశ్వము ద్వారా గౌరవాన్ని ప్రాప్తి చేసుకునే దేహాభిమాన ముక్త భవ

చదువు యొక్క ముఖ్యమైన లక్ష్యము - దేహాభిమానము నుండి అతీతముగా అయి దేహీ-అభిమానులుగా అవ్వడము. ఈ దేహాభిమానము నుండి అతీతముగా మరియు విముక్తులుగా అయ్యేందుకు విధి - సదా స్వమానములో స్థితులై ఉండటము. సంగమయుగము మరియు భవిష్యత్తు యొక్క అనేక రకాల స్వమానాలేవైతే ఉన్నాయో, వాటిలో ఏ ఒక్క స్వమానములోనైనా స్థితులై ఉండటము ద్వారా దేహాభిమానము తొలగిపోతూ ఉంటుంది. ఎవరైతే స్వమానములో స్థితులై ఉంటారో, వారికి స్వతహాగానే గౌరవము ప్రాప్తిస్తుంది. సదా స్వమానములో ఉండేవారే విశ్వ మహారాజులుగా అవుతారు మరియు విశ్వము వారికి గౌరవాన్ని ఇస్తుంది.

స్లోగన్:-
సమయము అనుసారముగా స్వయాన్ని మలుచుకోవడమే నిజమైన బంగారముగా అవ్వడము.

అవ్యక్త ప్రేరణలు - జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి

ఇప్పుడు నిర్భయులుగా, జ్వాలాముఖులుగా అయ్యి ప్రకృతి మరియు ఆత్మలలో ఏదైతే తమోగుణము ఉందో, దానిని భస్మము చేయండి. తపస్య అనగా జ్వాలా స్వరూపపు స్మృతి, ఈ స్మృతి ద్వారానే మాయ మరియు ప్రకృతి యొక్క భయంకర రూపము శీతలమైపోతుంది. మీ మూడవ నేత్రము, జ్వాలాముఖీ నేత్రము మాయను శక్తిహీనముగా చేస్తుంది.