17-05-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 11.02.2010


‘‘శివుని జన్మదినము రోజున క్రోధము రూపీ జిల్లేడు పుష్పాలను బాప్ దాదాకు అర్పించి దర్పణముగా అవ్వండి, పవిత్ర ప్రవృత్తి యొక్క ప్రత్యక్ష ప్రమాణము ద్వారా ప్రత్యక్షతను సమీపముగా తీసుకురండి’’

ఈ రోజు పిల్లలందరూ - సమ్ముఖములో కూర్చున్న పిల్లలు మరియు నలువైపులా దేశ-విదేశాలలో కూర్చుని ఉన్న పిల్లలు చాలా సంతోషముతో తండ్రి యొక్క జన్మదినాన్ని మరియు తమ జన్మదినాన్ని జరుపుకుంటున్నందుకు అనేకానేక అభినందనలను, శుభాకాంక్షలను ఇస్తున్నారు. మీరు సమ్ముఖములో కూర్చుని ఉన్నారు మరియు దూరదూరాలలో కూడా సైన్స్ సాధనాల ద్వారా పిల్లలందరూ ఎంతో సంతోషముతో హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తున్నారు. ఇక్కడకు వచ్చిన మీరందరూ తండ్రి జన్మదినాన్ని జరుపుకోవడానికి వచ్చారా లేక మీ జన్మదినాన్ని కూడా జరుపుకోవడానికి వచ్చారా? ఎందుకంటే ఈ జయంతి విచిత్రమైన జయంతి. ఎందుకని విచిత్రమైనది? తండ్రి మరియు పిల్లల జన్మదినము ఒకేసారి జరుగుతుంది. పూర్తి కల్పములో ఇటువంటి జయంతి ఎక్కడా ఉండదు. పూర్తి కల్పమంతా ఒకసారి చుట్టి రండి. ఇది విచిత్రమైన జయంతి. బాప్ దాదా మీ అందరినీ అడుగుతున్నారు, మీరందరూ తండ్రికి అభినందనలు తెలపడానికి వచ్చారా లేక తండ్రి నుండి అభినందనలను తీసుకోవడానికి వచ్చారా? బాప్ దాదా ఒంటరిగా ఏమీ చెయ్యరు ఎందుకంటే జన్మ తీసుకోగానే యజ్ఞాన్ని రచించారు, మరి యజ్ఞములో బ్రాహ్మణులు కావాలి. కనుక మీ జన్మ కూడా తండ్రితోపాటు జరిగింది. దీనికి గుర్తుగా భక్తిలో కూడా శివరాత్రిని జరుపుకున్నప్పుడు, దానితోపాటు సాలిగ్రామాల పూజ కూడా జరుగుతుంది. అనేకానేక సాలిగ్రామాలను పూజిస్తారు. కనుక ఈ జయంతి అద్భుతమైన జయంతి. అందుకే ఈ జయంతిని వజ్రసమానమైన జయంతి అని అనడము జరుగుతుంది. బాప్ దాదా తమ తోడుగా ఉన్న పిల్లలందరికీ పదమాల, పదమాల రెట్లు తమ బాహువుల హారము మధ్యలో పదమాల, పదమాల రెట్లు అభినందనలను తెలియజేస్తున్నారు. ఇది కూడా తండ్రికి మరియు పిల్లలకు మధ్యన ఉన్న అత్యంత హృదయపూర్వకమైన ప్రేమకు గుర్తు. బాప్ దాదా పిల్లలకు చేసిన ప్రతిజ్ఞ ఏమిటంటే - కలిసే ఉంటాము, కలిసే వెళ్తాము. మరి చెప్పండి, పిల్లలు కూడా బాబాకు ప్రతిజ్ఞ చేసారు కదా! సంగమములో కలిసి ఉన్నాము, కలిసి ఉండాలి కూడా, విశ్వ సేవ కూడా కలిసి చేస్తున్నారు. ఉండటము కలిసే ఉండాలి, ఎగిరిపోయినా కలిసే ఎగిరిపోవాలి. మరి చెప్పండి, మీరు కూడా ప్రతిజ్ఞ చేసారు కదా - కలిసి ఉంటాము, కలిసి వెళ్తాము మరియు బ్రహ్మాబాబాతో కలిసి విశ్వముపై రాజ్యము చేస్తాము అని. ప్రతిజ్ఞ చేసారు కదా? పక్కా ప్రతిజ్ఞనా? ఇదే శివ జయంతి యొక్క విశేషత.

బాప్ దాదా అమృతవేళ నుండి ఏమి చూసారంటే, భిన్న-భిన్న స్థానాలలో ఉన్న పిల్లలు ఎంతో సంతోషముతో అభినందనలను, శుభాకాంక్షలను పంపుతున్నారు. మీరైతే ఇప్పుడు సమ్ముఖములో అభినందనలను తెలియజేస్తున్నారు కూడా మరియు తీసుకుంటున్నారు కూడా. ఇవ్వడము మరియు తీసుకోవడము రెండూ కలిపి జరుగుతున్నాయి. భగవంతుని పిల్లలు ఎంతటి అదృష్టవంతులు, భగవంతుని సమ్ముఖములో పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అందరి ముఖాలు సంతోషములో ఎగురుతూ ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఒకవైపు బాప్ దాదా పిల్లల భాగ్యాన్ని చూస్తున్నారు మరియు రెండవ వైపు భక్తులను కూడా చూస్తున్నారు. భక్తులు ఇప్పటికీ కూడా, రండి అని అంటూ భగవంతుడిని పిలుస్తున్నారు కానీ మీరు వారితో పాటు కలిసి జరుపుకుంటున్నారు. భక్తుల అనుభూతి కూడా తక్కువగా ఏమీ లేదు అన్నది బాప్ దాదా చూసారు. మీరు ఏదైతే ప్రాక్టికల్ గా చేస్తున్నారో, దానికి వారు స్మృతిచిహ్నము రూపములో ఎంత చక్కని విధితో స్మృతిచిహ్నాన్ని జరుపుకుంటున్నారు. మీరు వ్రతము చేపట్టారు కనుక వారు కూడా వ్రతానికి స్మృతిచిహ్నాన్ని తయారుచేసారు. వారు ఒక్క రోజుకు లేక కొద్ది సమయానికి వ్రతము చేపడతారు కానీ మీరు ఏ వ్రతాన్ని చేపట్టారు? అందరూ బాబా ఎదురుగా వ్రతాన్ని చేపడతామని ప్రతిజ్ఞను చేసారు కదా! మీరు బాబా వద్ద సంతోషముగా వ్రతము చేపట్టారు - బాబా, మేము ఈ పూర్తి జన్మంతా, బ్రాహ్మణ జన్మంతా వ్రతాన్ని ధారణ చేస్తాము అన్నారు. వ్రతాన్ని ధారణ చేసారు కదా! ఏ వ్రతము? పవిత్రతా వ్రతము. ఒక్క జన్మ కోసం వ్రతము చేపట్టారు. కానీ ఒక్క జన్మ యొక్క పవిత్రతా వ్రతము 21 జన్మల వరకు ఉంటుంది. భక్తులు కొద్ది సమయము కోసం ఆహార-పానీయాల వ్రతాన్ని చేపడతారు మరియు జాగరణ చేస్తారు. కానీ మీ ఇప్పటి ఒక్క జన్మ యొక్క జాగరణతో అందరూ అంధకారము నుండి వెలుగులోకి వచ్చారు మరియు మీ ఈ జాగరణ కూడా 21 జన్మల వరకు ఉంటుంది. ఇప్పుడు మీరు ఎటువంటి జాగరణను చేసారంటే పూర్తి విశ్వమంతా మీ జాగరణతో వెలిగే జ్యోతిలా అవుతుంది, ఎటువంటి దుఃఖము, అశాంతుల అంధకారము ఉండదు. మరి చెప్పండి, మీరు పూర్తి విశ్వాన్ని అంధకారము నుండి వెలుగులోకి తీసుకువచ్చారు, ఈ అనంతమైన వ్రతము మంచిగా అనిపిస్తుందా? కష్టమనిపించటం లేదు కదా? సహజమా లేక కష్టమా? సహజమనిపిస్తుందా! ఎవరికైతే సహజము అనిపిస్తుందో వారు చేతులెత్తండి. అప్పుడప్పుడూ కష్టమనిపించటం లేదా? అప్పుడప్పుడూ అనిపిస్తుందా? లేదా! ఎందుకంటే పవిత్రత మన జన్మ సిద్ధ అధికారము అని మీకు తెలుసు, అందుకే పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు, కానీ మనసా, వాచా, కర్మణా, సంబంధ-సంపర్కాలలో కూడా పవిత్రత. మీరు పవిత్రతా సంస్కారాలను సహజముగా ధారణ చేసేవారు. కనుక పవిత్రత యొక్క సంకల్పమునైతే చేసారు కానీ ఇప్పుడు సమయమనుసారముగా బాప్ దాదా సమయము గురించి వార్నింగ్ ను అయితే ఇస్తున్నారు. ఏ విధముగా పవిత్రతా వ్రతాన్ని ధైర్యము ఉంచి తమ స్వధర్మముగా భావిస్తూ ధారణ చేసారో, అదే విధముగా రెండవ భూతము క్రోధము. బాప్ దాదా ఈ రోజు అడుగుతున్నారు, ఒక మహాభూతము విషయములోనైతే వ్రతాన్ని చేపట్టి వృత్తిని మార్చుకున్నారు, కానీ క్రోధమనే రెండవ భూతము ఏదైతే ఉందో, ఆ భూతముపై విజయము పొందాలి అని కూడా సంకల్పము చేసారా లేక రెండవ భూతము కనుక పర్వాలేదు అని అనుకుంటున్నారా? ఎందుకంటే క్రోధమనేది అందరి కనెక్షన్ లోకి వస్తుంది. మరి ఈ రోజున అనగా ఎప్పుడు జన్మదినాన్ని జరుపుకున్నా కానీ ఒకరికొకరు కానుకలను కూడా ఇచ్చుకుంటారు. ఈ రోజు బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - ఎలా అయితే ధైర్యముతో మరియు తండ్రి సహాయముతో మొదటి నంబరు భూతముపై మెజారిటీ విజయాన్ని పొంది నడుచుకుంటున్నారో అలాగే క్రోధముపై కూడా విజయాన్ని పొందడము సాధ్యమేనా? ఎందుకంటే ఏ భూతమైనా సరే ఇబ్బంది పెడుతుంది. క్రోధమనే భూతమైతే ఇతరుల కనెక్షన్ లో వస్తుంది మరియు సంపర్కంలో వస్తుంది. తమ మనసులోనే క్రోధము వచ్చినా కూడా స్వయమూ క్రోధానికి వశమై నిస్సహాయులుగా అయిపోతారు. తండ్రి పుట్టినరోజును జరపడానికి వచ్చారు, ఈ రోజు బాప్ దాదా, భారత్ వారు మరియు విదేశీయులు, పిల్లలందరి నుండి క్రోధమనే కానుకను తీసుకోవాలనుకుంటున్నారు. వీలవుతుందా? వీలవుతుందా? ఈ రోజు బాబాకు ఈ కానుకను ఇవ్వగలము, మనసులో కూడా రాకూడదు, స్వప్నములో కూడా రాకూడదు, ఇలా స్వయానికి సంకల్పము ఇచ్చుకుని ధైర్యముతో ముందుకు వెళ్ళగలిగే శక్తి ఉందా? ఉందా? మరి బాబా ఎదురుగా ధైర్యముతో సంకల్పము చేయగలరా? చేస్తారా మరియు బాబా నుండి కానుకను తీసుకుంటారా? కానుకను ఇవ్వండి మరియు కానుకను తీసుకోండి. ఒకవేళ క్రోధముపై విజయము పొందినట్లయితే ఇతర వికారాలపై కూడా విజయము పొందగలము అన్న ధైర్యము వస్తుంది. మేము ఈ కానుకను ఇచ్చి బాబా నుండి కానుకను తీసుకుంటాము అని ఎవరు భావిస్తున్నారు? వారు చేతులెత్తండి. అచ్ఛా, జెండాలు ఊపుతున్నారు. కుమారీలు కూడా! చూడండి.

బాప్ దాదాకు పిల్లల ధైర్యము చూసి చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు దృశ్యాన్ని చూస్తున్నారు కదా! ఫోటో తియ్యండి, మళ్ళీ చేతులెత్తండి. అందరి ఫోటోను తియ్యండి. మీ ధైర్యానికి బాప్ దాదా ప్రతిరోజూ అమృతవేళ మీరు మిలనము చేసుకునేటప్పుడు విశేషముగా సహజ అనుభవీ ఆత్మగా అయ్యేందుకు అభినందనలు తెలియజేస్తారు ఎందుకంటే ఇంతమంది తమ-తమ స్థానాలలో ఉంటూ కూడా, వీరు ఇంతమంది ఉంటారు, కలిసి ఉంటారు, ప్రవృత్తిని సంభాళిస్తారు, ఇల్లు-వాకిలిని వదిలి వెళ్ళలేదు, కానీ పవిత్ర ప్రవృత్తిని తయారుచేసుకున్నారు అని అందరూ మిమ్మల్ని చూసినప్పుడు ఏమవుతుంది? ఆత్మల క్యూ ఏర్పడాలి అన్న మీ అందరి లోపల ఏదైతే శుభ భావన ఉందో, ఆ క్యూ మీకు కనిపిస్తుంది, ఎందుకంటే క్రోధము ప్రత్యక్షముగా కనిపిస్తుంది. వీరు పవిత్రత గురించి కేవలం చెప్పడమే కాదు, కానీ పవిత్రముగా ఉండి చూపిస్తున్నారు అని ప్రాక్టికల్ గా చూస్తారు. ప్రత్యక్షతను కోరుకుంటున్నారు కదా, అందుకు ఇదే ప్రత్యక్ష ప్రమాణము, దీనితో అందరూ ఆకర్షితులై స్వతహాగా వస్తారు. కానీ... వినిపించమంటారా? వినిపించమంటారా? క్రోధము రావడానికి మెజారిటీ కారణము ఏం గమనించడం జరిగిందంటే - ఎక్కడో అక్కడ ఈర్ష్య మరియు దానితోపాటు ఏదైనా చూసినప్పుడు కలిగే వ్యర్థ సంకల్పాలు అనే బీజము కూడా క్రోధాన్ని తీసుకువస్తుంది ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు బీజము, ఈ బీజము నుండి క్రోధము కూడా ఉత్పన్నమవుతుంది మరియు దీనికి ఒక్క పదము కారణమవుతుంది. ఆ ఒక్క పదము అనే బీజాన్ని ఒకవేళ సమాప్తము చేసినట్లయితే సహజమైపోతుంది. ఆ ఒక్క పదము ఏమిటంటే - ‘ఎందుకు’, ఇది ఎందుకు? ఇది ఎందుకు జరిగింది? ఇలా ఎందుకు చేసారు? ఇలా ఎందుకు చేస్తారు? ఈ ‘ఎందుకు’ అన్న పదానికి చాలా పెద్ద క్యూ ఉంది. ‘క్యూ’ అన్న అక్షరాన్ని ఇంగ్లీషులో వ్రాయడము ఎంత కష్టము! ‘ఎ’ అన్న అక్షరాన్ని వ్రాయడము ఎంత సహజము. బాప్ దాదా ఈ రోజు ఇదే కోరుకుంటున్నారు - ఈ ‘ఎందుకు’ అన్న పదము వలన వచ్చే క్యూ ను సమాప్తము చెయ్యండి. ఇప్పుడు త్వరత్వరగా బాబా ప్రత్యక్షత జరగాలి అని మీ అందరి ఆశ ఉంది కదా. ప్రతి ఒక్కరి హృదయములో బాబా స్నేహము యొక్క జెండాను ఎగరవేయాలి మరియు మనసు పాట పాడాలి. ‘మా బాబా వచ్చేశారు, మధురమైన బాబా వచ్చేశారు’ అని మనసులో పాట పాడాలి. త్వరత్వరగా ప్రత్యక్షతా జెండా అందరి హృదయాలలో ఎగరాలి అని ఇదే కోరుకుంటున్నారు కదా! దీని కోసం క్యూ (ఎందుకు), క్యా (ఏమిటి), కైసే హోగా (ఎలా అవుతుంది), ఈ కై కై అన్న భాషను సమాప్తము చేసి కై అని మాట్లాడాలంటే కమాల్ (అద్భుతము) అని మాట్లాడండి. కై-కై అని అనకండి. బాప్ దాదా పిల్లల కోసం హాస్టల్ తెరిచినప్పుడు, పాకిస్థాన్ లో జరిగిన విషయము ఇది, ఆది సమయములో జగదాంబ పిల్లలకు ఇదే చెప్పేవారు - కై కై భాష మాట్లాడకండి అని. కై కై అని ఎక్కువగా ఎవరు అంటారు? అది మంచిగా అనిపిస్తుందా? కావున ఇప్పుడు క్యూ, క్యూ అన్న క్యూ పెట్టకండి. హా జీ (సరేనండి), మంచిదండి, చాలా మంచిదండి, మనము కలిసి చేద్దాము, ఎగురుదాము, ఇటువంటి మాటలను మాట్లాడండి. భాష పరివర్తన వీలవుతుందా? కై కై కాదు, ఈ క్యూ ను వదిలిపెట్టండి, అప్పుడు ఆ క్యూ మొదలవుతుంది.

చూడండి, శివునిపై జిల్లేడు పుష్పాలనే అర్పిస్తారు. ఈ రోజు శివరాత్రిని జరుపుకుంటున్నారు, శివుని పుట్టినరోజును జరుపుకుంటున్నారు కావున అందరూ ఈ క్రోధమనే జిల్లేడు పుష్పాలను బాప్ దాదాకు అర్పించండి, అప్పుడు మీరు దర్పణములా అవుతారు. ఇష్టమే కదా! ఇష్టమేనా? మంచిది. మళ్ళీ బాప్ దాదా హోలీ సమయములో వచ్చినప్పుడు రిజల్టు చూస్తారు. అలసిపోకండి. జరగలేదు అని అనుకోవద్దు. నిశ్చయబుద్ధి కలవారిగా అయి చేయండి, చెయ్యాల్సిందే. చేతులు ఎత్తారు, చేతులు ఎత్తడమంటే బాబాకు ఇచ్చేసినట్లే. ఇచ్చారు కదా! మళ్ళీ చేతులెత్తండి. చూస్తున్నారా దాదీలు, చూస్తున్నారా? చప్పట్లు కొట్టండి. ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకండి. ఒకవేళ కొంచెం తక్కువైనా కానీ ఇక ముందు కొరకు ధైర్యము ఉంచండి, వదలకండి, ముందుకు వెళ్తూ ఉండండి. బాప్ దాదా కంబైన్డ్ గా ఉన్నారు. తోడుగా ఉన్నారు, కంబైన్డ్ గా ఉన్నారు అని అంటారు కదా. ఇటువంటి సమయములో ఏది జరిగినా కానీ బాప్ దాదా కంబైన్డ్ గా ఉన్నారు, వారిని మీ ఎదురుగా తెచ్చుకుని తర్వాత అర్పించండి. కానీ బాప్ దాదా కోరుకుంటుంది ఏమిటంటే - పిల్లలందరూ నంబరు వన్ గా ఉండాలి, బాబాకు ఇచ్చేసిన వస్తువు ఇప్పుడు అమానత్తు (బాబా వస్తువు) అయిపోయింది. చేతులు ఎత్తడమంటే ఇచ్చినట్లే, కనుక ఇప్పుడది మీది కాదు, అది బాబా వస్తువు. కనుక సంకల్పములో వచ్చినా కానీ అమానత్తులో కల్తీ జరిగినట్లు అర్థం, ఇది మంచిది కాదు. ఇచ్చిన వస్తువును ఎప్పుడూ తిరిగి తీసుకోరు ఎందుకంటే అది ఇక నాది కాదు.

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలకు, ఎవరైతే స్క్రీన్ పై కూడా చూస్తున్నారో, అక్కడ కూర్చుని అందరూ ఎంతో సంతోషముగా చూస్తున్నారు మరియు సంకల్పము కూడా చేస్తున్నారు. మరి మధుబన్ లేక అన్ని సెంటర్లు ఎలా తయారవుతాయి? ఎలా తయారవుతాయి? అన్ని సెంటర్లు నిర్విఘ్న భవ యొక్క వరదానీగా అవుతాయి. ఇష్టమే కదా! ఇష్టమేనా? ఎందుకంటే ఇప్పుడు దుఃఖము మరియు అశాంతి కారణముగా అకస్మాత్తుగా పరిస్థితులు ఎలా రానున్నాయంటే ఇక మీ అందరికీ ఆత్మలపై దయ కలుగుతుంది, ఎందుకంటే మీరు పూర్వజులు. మీరు పూజ్యులు కూడా మరియు పూర్వజులు కూడా. పూర్వజులు ఏ ఆత్మ యొక్క దుఃఖాన్ని గాని, డిస్టర్బెన్సును గాని చూడలేరు. ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో, దయ ఉంటుందో, వారి దుఃఖాన్ని చూడలేరు. సమయము మిమ్మల్ని పరివర్తన చేసే కన్నా ముందు మీరు పురుషార్థపు ప్రాప్తి యొక్క ప్రారబ్ధాన్ని ఇప్పటి నుండి అనుభవము చేయాలి అని బాప్ దాదా భావిస్తున్నారు, ఎందుకంటే మీకు నేర్పించేది సమయము కాదు, సమయము మీ టీచరు కాదు. మరి బాప్ దాదా కోరుకుంటున్నారు, హోలీ నాడు ప్రతి ఒక్కరూ మీ రిజల్టును వ్రాసుకోండి. ఎక్కువ విస్తారముగా వ్రాయకండి, అంత చదివే తీరిక కూడా ఉండదు. బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించి ఉన్నారు, ఎలా అయితే మీకు వరదానము కార్డు లభిస్తుంది కదా, అది ఎంత చిన్నగా ఉంటుంది, అందులో ఓ.కే అని వ్రాయండి. ఓ.కే అన్న మాట వ్రాయండి. ఒకవేళ పురుషార్థము చేస్తూ ఉన్నప్పుడు ఏమైనా జరిగితే ఓ.కే కి మధ్యలో అడ్డు గీతను పెట్టండి. ఈజీ కదా! పెద్ద కాగితాన్ని వేస్ట్ చెయ్యకండి. ఒకవేళ ఎక్కువ సార్లు అయితే రెండు సార్లు, మూడు సార్లు అడ్డు గీత కొడుతూ వెళ్ళండి మరియు హోలీ కన్నా ముందుగానే మధుబన్ కు పంపండి. అందరివీ కలిపి పంపినా పర్వాలేదు, టీచర్ పంపించవచ్చు. అప్పుడు, ఎవరు నంబర్ వన్ అని బాప్ దాదా వద్దకు రిజల్టు చేరుకుంటుంది. అప్పుడు బాప్ దాదా మీకు పదమాల, పదమాల రెట్లు హృదయపూర్వక స్నేహాన్ని కానుకగా ఇస్తారు. అచ్ఛా.

డబల్ విదేశీయులు ఉన్నారు కదా! చేతులెత్తండి. నంబర్ తీసుకుంటారు కదా! విదేశీయులు నంబరు తీసుకుంటారా లేక భారత్ వారు తీసుకుంటారా అన్నది చూద్దాము. బాగుంది. బాప్ దాదా అయితే అందరినీ ఆశావాదులుగా చూడాలని అనుకోవడము లేదు, కానీ బాబా ఆశలను పూర్తి చేసే బాబా యొక్క ఆశా దీపాలుగా చూడాలని కోరుకుంటున్నారు. అచ్ఛా - మధుబన్ వారు ఏమి చేస్తారు? మధుబన్ వారు చేతులెత్తండి. పైన ఉన్నవారు, కింద ఉన్నవారు, మధుబన్ వారందరూ చేతులెత్తండి. పైన ఉండేవారు కూడా చేతులు బాగా పైకి ఎత్తండి, చేతులు ఊపండి. అచ్ఛా. మధుబన్ అయితే నంబరు తీసుకోవాలి. తీసుకోవాలి కదా! తీసుకోవాలి, ఎందుకంటే మధుబన్ ను అందరూ చాలా త్వరగా కాపీ చేస్తారు. అచ్ఛా!

నలువైపులా కంబైన్డుగా ఉండే పిల్లలు చూస్తున్నారు కూడా, వింటున్నారు కూడా. కానీ ఎవరైతే వినడము లేదో వారు మురళి ద్వారానైతే తప్పకుండా వింటారు. కనుక నలువైపులా తండ్రికి స్నేహీ, సహయోగులుగా ఉన్న మధురాతి మధురమైన, ప్రియాతి ప్రియమైన పిల్లలకు బాప్ దాదా పదమాల, పదమాల రెట్లు అభినందనలను కూడా ఇస్తున్నారు, శుభాకాంక్షలను కూడా తెలియజేస్తున్నారు మరియు దానితోపాటుగా ప్రత్యక్షతా జెండాను త్వరత్వరగా ఎగిరింపజేసే సంకల్పాన్ని కూడా ఇస్తున్నారు. సమయము కోసం వేచి ఉండకండి, సమయాన్ని టీచరుగా చేసుకోకండి. బాబా తండ్రి, టీచరు మరియు సద్గురువు అయినప్పుడు, మీ జగదాంబ ఎలా అయితే చేసారో, రెండు పదాలతో నంబరును తీసుకున్నారు. బాబా చెప్పడము మరియు జగదాంబ చెయ్యడము - ఇటువంటి తీవ్ర పురుషార్థము చేసారు మరియు నంబరు తీసుకున్నారు. మీరందరూ కూడా ఒప్పుకుంటారు కదా, మరి మీరు కూడా ఫాలో మదర్ జగదాంబ. అచ్ఛా. అందరూ ప్రియస్మృతులను మరియు చాలా-చాలా హృదయపూర్వకమైన దీవెనలను స్వీకరించండి. అంతేకాక బాబా తన పిల్లలను యజమాని రూపములో చూసి నమస్తే చెప్తున్నారు.

బాప్ దాదా అన్ని జోన్ల వారికి చెప్పారు - వారసులను మరియు మైక్ లను తయారుచేయండి. ప్రభావశాలి మైక్ లను తయారుచేయండి - వారి అనుభవాన్ని విని మేము కూడా వీరిలా అవ్వాలి, ఎవ్వరినైనా తృప్తి పరచగలగాలి అని అనిపించాలి, ప్రేరణ రావాలి. అన్ని జోన్లు లిస్టును పంపండి. ఈ రోజు ఢిల్లీవారు లిస్టును పంపడాన్ని బాప్ దాదా చూసారు. ఇందుకు బాప్ దాదా అభినందనలు తెలియజేస్తున్నారు. అన్ని జోన్లు పంపితే అప్పుడు ఎంతమంది వారసులు తయారయ్యారు అని మీకు కూడా రిజల్టును వినిపిస్తాము. చెకింగ్ చేయిస్తాము, అంతేకానీ లిస్టు రాగానే ఒప్పుకుంటామని కాదు. గుప్త చెకింగ్ చేయిస్తాము. అచ్ఛా, ఆదిలో కూడా అభినందనలు మరియు శుభాకాంక్షలు లభించాయి. ఇప్పుడు కూడా బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ హృదయములో పేరు తీసుకుని పదమాల, పదమాల రెట్లు అభినందనలు తెలియజేస్తున్నారు. బాబా వద్ద అయితే పిల్లలందరి చిత్రము వతనములో ఇమర్జ్ అయి ఉంది. బాప్ దాదా పిల్లల పుట్టినరోజును జరిపారు మరియు పిల్లలు బాబా పుట్టినరోజును జరిపారు, ఇద్దరికీ అభినందనలు. అచ్ఛా.

వరదానము:-
అందరికీ గౌరవాన్ని ఇస్తూ తమ రికార్డును సరిగ్గా ఉంచుకునే సర్వుల స్నేహీ భవ

ఎవరు ఎంతగా అందరికీ గౌరవాన్ని ఇస్తారో, వారు అంతగానే తమ రికార్డును సరిగ్గా ఉంచుకోగలరు. ఇతరుల పట్ల గౌరవాన్ని ఉంచడము అంటే తమ రికార్డును తయారుచేసుకోవడము. ఏ విధముగా యజ్ఞానికి సహాయకులుగా అవ్వడమే సహాయము తీసుకోవడమో, అదే విధముగా గౌరవాన్ని ఇవ్వడమే గౌరవాన్ని తీసుకోవడము. ఒక్కసారి ఇవ్వడమంటే అనేక సార్లు తీసుకునేందుకు హక్కుదారులుగా అవ్వడము. చిన్నవారికి ప్రేమనివ్వండి మరియు పెద్దవారికి గౌరవాన్ని ఇవ్వండి అని అంటూ ఉంటారు కానీ ఎవరైతే అందరినీ పెద్దవారిగా భావిస్తూ గౌరవాన్ని ఇస్తారో, వారు అందరికీ స్నేహీలుగా అవుతారు. దీని కొరకు ప్రతి విషయములోనూ ‘‘ముందు మీరు’’ అన్న పాఠాన్ని పక్కా చేసుకోండి.

స్లోగన్:-
బాప్ దాదా ద్వారా లభించిన శిక్షణలు సమయానికి గుర్తు రావడమే తీవ్ర పురుషార్థము.

అవ్యక్త ప్రేరణలు - ‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చేయండి’’

ఎవరైతే ఆల్ రౌండ్ సేవ చేస్తారో, వారు విశేషముగా ఈ విషయము పట్ల ధ్యాస ఉంచాలి - ఎటువంటి పరిస్థితిలోనైనా సరే మీ స్థితి ఏకరసముగా ఉండాలి, అప్పుడు సఫలత లభిస్తుంది. శ్రీమతములో ఎప్పుడైతే మన్మతము, దేహ-అభిమానపు మతము, శూద్రత్వపు మతము మిక్స్ చేస్తారో, అప్పుడు స్థితి ఏకరసముగా ఉండదు. మనసు భిన్న-భిన్న రసాలలో ఉన్నట్లయితే స్థితి కూడా రకరకాలుగా ఉంటుంది. ఒక్కరి రసములోనే ఉన్నట్లయితే స్థితి ఏకరసముగా ఉంటుంది.