17-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ భారత భూమి నిరాకార తండ్రి యొక్క జన్మ-భూమి, మీకు రాజయోగాన్ని నేర్పించి రాజ్యాన్ని ఇవ్వడానికి, మీకు సేవ చేయడానికి తండ్రి ఇక్కడికే వస్తారు’’

ప్రశ్న:-
శివబాబా తన పిల్లలు ప్రతి ఒక్కరితోనూ ఏ ప్రతిజ్ఞను చేయిస్తారు?

జవాబు:-
మధురమైన పిల్లలూ, ప్రతిజ్ఞ చేయండి - బాబా, మేము ఎటువంటి వికర్మలు చేయము. మేము 5 వికారాలను దానము ఇస్తాము. ఒకవేళ మేము దానమిచ్చి మళ్ళీ తిరిగి తీసుకున్నట్లయితే, చాలా పాపం తయారవుతుందని, దానికి కఠినమైన శిక్షలు అనుభవించవలసి ఉంటుందని లోలోపల భయముండాలి. హరిశ్చంద్రుని కథ కూడా దీని ఆధారముగానే తయారుచేయబడి ఉంది.

ఓంశాంతి
ఇది పిల్లల యొక్క గాడ్లీ స్టూడెంట్ లైఫ్ (ఈశ్వరీయ విద్యార్థి జీవితము). మేము తండ్రి వద్దకు వచ్చామని పిల్లలకు తెలుసు. వారే వచ్చి కల్ప-కల్పము భారతవాసీ పిల్లలకు రాజ్య భాగ్యాన్ని ఇస్తారు. వారు భారత్ లోనే వస్తారు కదా. ఇది భారత భూమి. తమ మాతృభూమి పట్ల చాలా ప్రేమ, గౌరవముంటుంది. ఒకవేళ విదేశాలకు చెందిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఇక్కడ మరణిస్తే, వారిని తిరిగి విదేశాలకు తీసుకువెళ్తారు, అలాగే ఇక్కడి గొప్ప వ్యక్తి ఎవరైనా విదేశాలలో మరణిస్తే, వారిని ఇక్కడకు తీసుకువస్తారు. మాతృభూమి పట్ల గౌరవము ఉంటుంది. భారత్ ను భగవంతుని జన్మభూమి అని అంటారు. ఎవరినైతే భగవంతుడు లేక అల్లా, పరమాత్మ అని అంటారో, ఇప్పుడు మీరు వారి ఎదురుగా కూర్చున్నారని మీకు తెలుసు. వారికి పేరైతే తప్పకుండా ఉండాలి కదా. అల్లా అని అన్నా కూడా లింగాన్ని పూజిస్తారు. ఈశ్వరుడు లేక ఖుదా అని అంటున్నప్పుడు, తప్పకుండా వారి గుర్తులు కావాలి కదా. లింగాన్ని అన్ని చోట్ల పూజిస్తారు. ఈ రోజుల్లో చిత్రాలలో కూడా దేవతల ఎదురుగా పరమపిత పరమాత్ముని చిత్రమైన లింగాన్ని చూపిస్తారు. వారు అందరికన్నా ఉన్నతమైనవారు, వారికి తమదంటూ శరీరము లేదు, అందుకే వారిని నిరాకారుడని అంటారు. వారు సాకారుడు కాదు. మనము శిక్షణ తీసుకునేందుకని కల్ప-కల్పము వారి ముందు హాజరవుతామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. భగవానువాచ అని అన్నప్పుడు తప్పకుండా రాజయోగాన్ని నేర్పిస్తూ ఉండవచ్చు. విద్యార్థులకు రాజయోగాన్ని నేర్పించారు, తద్వారా వారు రాజా-రాణులుగా అయ్యారు. యుద్ధము మొదలైనవాటి విషయమేమీ లేదు. ఈ లక్ష్మీ-నారాయణులు మొదలైనవారు రాజ్యాధికారాన్ని యుద్ధము చేసి ఏమీ పొందలేదు. వారు సత్యయుగ రాజ్యాన్ని ఎలా పొందారు అనేది ప్రపంచానికి అసలు తెలియనే తెలియదు. మనము తండ్రి నుండి రాజ్యాన్ని తీసుకుంటున్నామని, మనము వారి సమ్ముఖముగా కూర్చున్నామని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. వారే మనకు తండ్రి, శ్రీకృష్ణుడు కాదు. శ్రీకృష్ణుడు చిన్న బాలుడు, అతడు రచన. ఇప్పుడు తప్పకుండా శ్రీకృష్ణుడు పదవిని తీసుకుంటున్నారు, దాని ఆధారముగా భవిష్యత్తులో వారు శ్రీకృష్ణుడిగా పిలువబడతారు. ఇదంతా చదువుకు సంబంధించిన విషయము.

తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తారని మీకు తెలుసు. ఎలాగైతే మనుష్యులు, మనుష్యులను బ్యారిస్టర్, ఇంజనీర్ మొదలైనవారిగా తయారుచేస్తారు. అక్కడ వారు మనుష్యులే కదా. మనము కూడా మనుష్యులమే కానీ మనము పతితముగా ఉన్నామని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి పావనముగా కూడా తయారుచేస్తారు మరియు మనకు వారసత్వాన్ని కూడా ఇస్తారు. కొత్త ప్రపంచమే పావన ప్రపంచముగా ఉంటుంది. కొత్త ప్రపంచములోనే రాజ్యముంటుంది. ఇప్పుడు మీరు తండ్రి సమ్ముఖముగా కూర్చున్నారు. ఎలాగైతే లౌకిక తండ్రి కూర్చుని పిల్లలకు ప్రేమగా అర్థం చేయిస్తారో, అలా వీరు విచిత్రుడైన పారలౌకిక తండ్రి. వీరి కోసమే త్వమేవ మాతాశ్చ, పితా త్వమేవ... అని మీరు పాడుతూ వచ్చారు. ఎవరినైతే మనము భక్తి మార్గములో మహిమ చేసామో, వారు తమ పాత్రను అభినయిస్తున్నారని ఈ సమయములో మీకు తెలుసు. మేము శివబాబా వద్దకు వచ్చామని మీరంటారు. ఉత్తరాన్ని కూడా - శివబాబా, కేర్ ఆఫ్ బ్రహ్మా అని వ్రాస్తారు. మీరు ఎవరికైనా పోస్టును చూపించినట్లయితే ఆశ్చర్యపోతారు - శివబాబా, కేర్ ఆఫ్ బ్రహ్మా, అని ఎప్పుడూ వినలేదే అని అంటారు. శివబాబా బ్రహ్మాలోకి వచ్చి విష్ణుపురిని స్థాపన చేస్తున్నారు, వారు ఎదురుగా నిలబడి ఉన్నారు. పైన శివబాబా ఉన్నారు. శివబాబా బ్రహ్మా ద్వారా స్థాపన చేసారు, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. ఇది ప్రవృత్తి మార్గము. లౌకిక విద్యలో కూడా బ్యారిస్టర్ చదివించేటప్పుడు, స్త్రీ-పురుషులు ఇరువురూ చదువుకుంటారు. స్త్రీలు కూడా జడ్జి, బ్యారిస్టర్, డాక్టర్ మొదలైనవారిగా అవుతారు. ఇది కూడా ప్రవృత్తి మార్గమే. సన్యాసులది నివృత్తి మార్గము, అది వేరు. ఒకవేళ శంకరాచార్యుడు రాకపోయి ఉంటే, పవిత్రత యొక్క అంశము మిగిలేది కాదని, భారత్ పూర్తిగా కాలిపోయుండేదని కూడా బాబా అర్థం చేయించారు. భారత్ ను నిలబెట్టేందుకని ఈ విధముగా నిశ్చితమై ఉంది. భారత్ చాలా పవిత్రముగా ఉండేది, తర్వాత అపవిత్రముగా అయ్యింది. ఇప్పుడు భారత్ ఎంత నిరుపేదగా ఉంది. బంగారు లంక సముద్ర గర్భములోకి వెళ్ళిపోయిందని అంటారు. ఇప్పుడు లంక అయితే బంగారముతో తయారుచేయబడి ఉండదు. ఈ కథలన్నీ కూర్చుని వ్రాశారు, వీటి వల్ల లాభమేమీ లేదు.

తప్పకుండా బాబా మనల్ని పూర్తి సహజమైన స్మృతి యొక్క బలముతో ఎంత ఉన్నతముగా తయారుచేస్తున్నారు అనేది పిల్లలైన మీకు తెలుసు. బాబా ప్రతిజ్ఞను చేస్తున్నారు - ఒకవేళ నిరంతరము స్మృతి చేసే పురుషార్థాన్ని చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి. భక్తి మార్గములో కూడా స్మృతి చేసే పురుషార్థము చేసారు కదా. ఎందుకు స్మృతి చేస్తారు? మాకు సాక్షాత్కారము కలగాలి అని స్మృతి చేస్తారు. అంతేకానీ, కృష్ణపురిలో మాకు రాజ్యాధికారము లభించాలని లేక మేము నరుని నుండి నారాయణునిగా అవ్వాలి అనేమీ స్మృతి చేయరు. మీకు కూడా - మేము మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి అనే ఆశ ఏమీ ఉండేది కాదు. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి భగవంతునికి ఎంతో సమయము పట్టదు అని అంటూ ఉంటారు కూడా. తప్పకుండా కలియుగము తర్వాత సత్యయుగము వస్తుందని మీరు చూస్తారు. కలియుగములో ఎంతమంది మనుష్యులు ఉన్నారు. సత్యయుగములో ఒకే ధర్మముంటుంది. ఇప్పుడు మీకు ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానము కూడా లభించింది. ఆత్మ జ్ఞానము ఉన్న మనుష్యులు ప్రపంచములో ఒక్కరు కూడా లేరు. ఆత్మలో 84 జన్మల పాత్ర ఎలా నిశ్చితమై ఉంది అనేది ఎవరికీ తెలియదు. ఈ మాటలు కూడా ఎప్పుడూ ఎవరి నుండి వినలేదు. తండ్రి అయితే జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు, నిరాకారుడు. మన ఆత్మ ఇప్పుడు పాపాత్మ నుండి పుణ్యాత్మగా అవుతూ ఉందని మీకు తెలుసు. సత్యయుగములోనైతే అందరూ పుణ్యాత్ములే. ఇక్కడ పాపాత్ములు ఉన్నారు. చాలా దాన-పుణ్యాలు చేసినవారిని పుణ్యాత్ములని అంటారని కాదు. అలా కాదు. పుణ్యాత్ములు సత్యయుగములో ఉంటారు. ఇక్కడ మనుష్యుల్లో ఎవరైతే దానపుణ్యాలు చేస్తారో, వారిని పుణ్యాత్ములుగా భావిస్తారు. అక్కడ మీకు దాన-పుణ్యాలు మొదలైనవి చేయవలసిన అవసరముండదు. అక్కడ అసలెవరూ పేదవారిగా ఉండరు. అక్కడ మీరు సదా కొరకు పుణ్యాత్ములుగానే ఉంటారు. మీరు మీ తనువు, మనసు, ధనము సర్వస్వము అనంతమైన తండ్రి కోసమని ఇస్తారు, దీనినే బలిహారమవ్వడమని అంటారు. తండ్రి అంటారు - ముందు నేను బలిహారమవుతానా లేక మీరా? బాబా అంటారు - ముందు మీరు బలిహారమవుతారు, అప్పుడు 21 జన్మల కోసం నా బలిహారము లభిస్తుంది. ఈ విషయాలను ఇప్పుడు మీరు మంచి రీతిలో అర్థం చేసుకుంటారు, డైరెక్టుగా వింటారు. ఇంటిలో ఉన్నా కూడా అక్కడికి మురళీ అందుతుంది, అంటే దూరము నుండి వింటారు. ఇప్పుడైతే తండ్రి సమ్ముఖముగా కూర్చున్నారు. తండ్రి అంటారు - పిల్లలూ, నేను మీకు తండ్రిని కూడా. ఇక్కడ అంధవిశ్వాసము యొక్క విషయమేమీ లేదు. బాబా తండ్రి కూడా, టీచరు కూడా. తండ్రికి చెందినవారిగా అవ్వడముతో వారు శిక్షణను ఇస్తారు, మీ బుద్ధిలో ఇప్పుడు జ్ఞానమంతా ఉంది. 84 జన్మల చక్రము కూడా మీకు అర్థం చేయించడము జరుగుతుంది. ఎవరైతే 84 జన్మలు తీసుకునేవారిగా ఉండరో, వారు అర్థం చేసుకోరు. తప్పకుండా మేము 84 జన్మల చక్రములో తిరిగి, ఇప్పుడు తిరిగి వెళ్తామని మీరు అర్థం చేసుకుంటారు. తండ్రి అంటారు - ఆత్మలైన మీరు అశరీరిగా వచ్చారు, మళ్ళీ అశరీరిగా అయ్యి తిరిగి వెళ్ళాలి. మీరు పవిత్రాత్మలుగా అయి వెళ్తారు. పవిత్రముగా అవ్వడము కోసం మీరు పురుషార్థము చేస్తున్నారు. యోగబలముతో అనగా స్మృతిబలముతో మీరు పవిత్రముగా అయిపోతారు. యోగమనే పదము శాస్త్రాలకు సంబంధించినది. రైట్ పదము స్మృతి. పత్నికి పతి యొక్క స్మృతి మరియు పతికి పత్ని యొక్క స్మృతి ఉంటుంది కదా. యోగము యొక్క అర్థమే స్మృతి. తండ్రి కూడా అంటారు - నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇతర సాంగత్యాల నుండి బుద్ధియోగాన్ని తెంచి, తండ్రినైన నాతో బుద్ధియోగాన్ని జోడించండి, స్మృతి చేయండి. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా మీ వికర్మలు వినాశనమవుతాయి. తప్పకుండా భారత్ కు కల్ప-కల్పము వారసత్వము లభిస్తుంది. శివజయంతి కూడా ప్రసిద్ధమైనది. ఎలాగైతే బుద్ధుడు, క్రైస్టు మొదలైనవారికి జయంతులు ఉంటాయో, అలాగే నిరాకార శివునికి కూడా జయంతి ఉంటుంది. వారు ఉన్నతోన్నతమైనవారు. కృష్ణ జయంతి కూడా ప్రసిద్ధమైనదే. కానీ వారు వచ్చి ఏమి చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణుడు సత్యయుగ రాకుమారుడిగా ఉండేవారు. సత్యయుగ రాకుమారునిగా అవ్వడము కోసం, వారికి తప్పకుండా ఎవరో అలాంటి కర్మలు నేర్పించి ఉంటారు. చిన్న పిల్లలైతే ఎలాగూ పవిత్రముగానే ఉంటారు. అక్కడ వికారాల విషయము ఉండదు. పిల్లలు శుద్ధముగా ఉంటారు. భగవంతుడు ఒక్కరే, వారే నిరాకారుడు, గాడ్ ఈజ్ వన్. మిగిలినవారంతా రచన. రచన నుండి రచనకు ఎప్పుడూ వారసత్వము లభించదు. వారసత్వము తండ్రి నుండి లభిస్తుంది. సోదరుడికి సోదరుడి నుండి వారసత్వము లభించదు. మీరంతా పరస్పరములో సోదరులు. బ్రదర్ హుడ్ (సోదర భావము) అని అంటారు కదా. తండ్రి అయితే ఒక్కరే. వారసత్వము తండ్రి నుండి లభిస్తుంది. సోదరులందరి సద్గతిదాత ఒక్క తండ్రే. ఆత్మలందరికీ తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. తండ్రి అంటారు - నేను వచ్చి ఆత్మలను చదివిస్తాను, ఆత్మలకు సద్గతినిస్తాను. తండ్రి కూర్చుని రాజయోగాన్ని నేర్పిస్తారు. ఈ చదువుకు సంబంధించిన పదవిని మీరు ఇక్కడ పొందరు. వారు బ్యారిస్టర్ మొదలైనవారిగా ఈ జన్మలోనే అవుతారు, తర్వాత ఇంకొక జన్మ తీసుకుని మళ్ళీ చదువుతారు.

ఈ చదువుతో మనము 21 జన్మలకు ప్రారబ్ధాన్ని పొందుతామని మీకు తెలుసు. అక్కడ సత్యయుగములో డాక్టర్ మొదలైనవారు ఎవరూ ఉండరు. అక్కడ అనారోగ్యాలే ఉండవు. అక్కడ మీరు గర్భ మహలులో ఉంటారు. ఇక్కడ గర్భ జైలులో ఉంటారు, అందులో చాలా శిక్షలు అనుభవిస్తారు. అందుకే, ఈ జైలు నుండి బయటకు తీయండి, మేము ఇక మళ్ళీ ఏ తప్పు చేయము అని పిలుస్తారు. ధర్మరాజుకు ప్రతిజ్ఞ చేస్తారు. ఇక్కడ మీరు శివబాబాకు ప్రతిజ్ఞ చేయాలి - బాబా, మేమెప్పుడూ వికర్మలు చేయము, మేము పంచ వికారాలను మీకు ఇచ్చేస్తాము. వికారాలనేవి వెంటనే ఏమీ వదిలిపోవని కూడా బాబాకు తెలుసు. మేము వికారాలను దానమిచ్చి మళ్ళీ తీసుకుంటే చాలా పాపం తయారవుతుందని లోలోపల భయము ఉండాలి. రాజా హరిశ్చంద్రుని ఉదాహరణ ఉంది కదా. 5 వికారాలనేవి వెంటనే ఏమీ వదిలిపోవని తండ్రికి తెలుసు. దానికి సమయము పడుతుంది. మీ కర్మాతీత అవస్థ తయారైనప్పుడు యుద్ధము మొదలవుతుంది. ఈ పంచ వికారాలు పెద్ద శత్రువులు. వాటిలో కూడా ముఖ్యమైనది ఒకటి - దేహాభిమానము. దానిని దానము చేయడము ఎంత కష్టము. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ, తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని పదే-పదే తండ్రి చెప్తారు. కానీ అలా జరగటము లేదు. దేహాభిమానులుగా అవ్వడముతో కామము యొక్క దెబ్బ తగులుతుంది. దేహాభిమానము అన్నింటికంటే తీక్షణమైనది. దేహీ-అభిమానులుగా అవ్వడములోనే శ్రమ ఉంది. ముఖ్యముగా దేహాభిమానము రావడముతోనే పాపము జరిగింది. పంచ వికారాలను దానముగా ఇవ్వాల్సి ఉంటుంది, దానికి సమయము పడుతుంది. ప్రియుడు లేకుండా ప్రేయసులు వెళ్ళలేరు. ముందు ప్రియుడు వెళ్ళాలి, ఆ తర్వాత ప్రేయసులు. ప్రియుడు వచ్చి ఆత్మలందరినీ తీసుకువెళ్ళాలి. కర్మాతీత అవస్థ తయారవ్వనంత వరకు పురుషార్థము చేయాలి. దేహాభిమానము రావడముతోనే మళ్ళీ పొరపాట్లు జరుగుతాయి. బాబా, దేహాభిమానములోకి వచ్చి వికారాలలో పడిపోయామని అంటారు. తుఫానులైతే చాలా వస్తాయి. వికారాల సంకల్పాలు వచ్చినా కానీ, కర్మేంద్రియాలతో ఎప్పుడూ ఎటువంటి పాపము చేయకూడదు. మాయను జయించేందుకు ఎంత శ్రమించవలసి ఉంటుంది. తండ్రి అంటారు - ఒకవేళ వివాహితులైతే, పవిత్రముగా ఉండి చూపించండి, అప్పుడు సన్యాసులు కూడా చూస్తారు. మీది ఎంత భారీ సంపాదనో చూడండి. పవిత్రముగా ఉండి చూపించినట్లయితే చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. మీపై అందరూ బలిహారమైపోతారు, బాబా కూడా మహిమ చేస్తారు. పవిత్రముగా కూడా ఉండాలి, కానీ యోగము కూడా కావాలి. యోగములోనే పదే-పదే విఘ్నాలు కలుగుతాయి. దేహాభిమానము వచ్చేస్తుంది. పవిత్రముగా ఉంటారు, అది సరే, పవిత్రతతోనే పవిత్ర ప్రపంచములో వారసత్వాన్ని పొందుతారు. కానీ మాయ కూడా మళ్ళీ తీవ్రతను చూపిస్తుంది, మాయ చాలా దాడి చేస్తుంది. ఇదంతా జరుగుతుందని తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలు ధైర్యాన్ని చూపిస్తారు కానీ దానితో పాటు నిరంతర స్మృతి కూడా ఉండాలి, అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. ఎవరైతే రుస్తుమ్ గా అవుతారో, వారిని మాయ కూడా చాలా సతాయిస్తుంది. స్మృతిలో కష్టం మీద ఉండగలుగుతారు. ఎవరైతే ఉండగలుగుతున్నారో, వారిని అనుభవం అడగాలి. వారు ఏమి అనుకుంటున్నారు, ఎలా ఉండగలుగుతున్నారు అని అడగాలి. స్మృతిలో ఉండటముతో వికర్మలు వినాశనమవుతాయి. ఈ విషయము పూర్తిగా అతీతమైనది, కొత్తది. ఇక్కడ కూర్చున్నప్పుడు నషా ఎక్కి ఉంటుంది. భగవంతుడు ఒక్క నిరాకారుడే, అంతేకానీ శ్రీకృష్ణుడు కాదు అని కూడా అర్థం చేసుకుంటారు. వాస్తవానికి శ్రీకృష్ణుని కోసం, రోలుకు బంధించారు, ఇది-అది చేసారు... అని శాస్త్రాలలో వ్రాశారు. అలాంటివేమీ జరగలేదు. ఇది కూడా వారిని నిందించడము, అవమానించడము వంటిది. శ్రీకృష్ణునిలోనైతే ఎలాంటి అవగుణాలు ఉండేవి కాదు. అల్లరి చేయడము కూడా ఒక అవగుణము కదా. శ్రీకృష్ణుడైతే పూర్తిగా మర్యాదా పురుషోత్తముడు. సర్వ గుణ సంపన్నుడు... అని వారి మహిమను పాడుతారు. గురు బ్రహ్మా, గురు విష్ణు... అని అంటూ ఉంటారు. మాకు గురువులు లేరు, మేము వీరిని గురువుగా లేక ఈశ్వరునిగా భావించము అని చెప్పండి. పతిత-పావనుడైతే ఒక్క నిరాకారుడే కదా. సాకార గురువులెవ్వరూ పతిత-పావనులు కాలేరు. ఈ సమయములో మీరు పరమపిత పరమాత్ముని పూర్తి జీవితకథను తెలుసుకున్నారు. 5 వేల సంవత్సరాలలో శివబాబా ఎటువంటి పాత్రను అభినయిస్తారు అనేది మీరు తండ్రి ద్వారా తెలుసుకున్నారు. నాలెడ్జ్ ఫుల్ అయితే తండ్రియే కదా. సుఖ సాగరుడు, శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు... అనే ఈ మహిమ వారిదే. తండ్రి వద్ద ఖజానా ఉంటే, దానిని తప్పకుండా పిల్లలకు కూడా ఇస్తూ ఉంటారు కదా. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. కర్మాతీత అవస్థను ప్రాప్తి చేసుకునేందుకు, ఈ కర్మేంద్రియాలతో ఎటువంటి పొరపాట్లు చేయకూడదు. పవిత్రముగా ఉండటముతో పాటుగా స్మృతిలో కూడా దృఢముగా అవ్వాలి.

2. సదా పుణ్యాత్ములుగా అయ్యేందుకు తనువు-మనసు-ధనములతో తండ్రిపై బలిహారమవ్వాలి. ఒక్కసారి బలిహారమైనట్లయితే, 21 జన్మలకు పుణ్యాత్ములుగా అయిపోతారు.

వరదానము:-
సహజయోగాన్ని నేచర్ మరియు న్యాచురల్ చేసుకునే ప్రతి సబ్జెక్టులోనూ పర్ఫెక్ట్ భవ

ఎలాగైతే మీరు బాబాకు పిల్లలో, అందులో ఎటువంటి పర్సెంటేజ్ అనేది లేదో, అలా నిరంతర సహజయోగులుగా లేక యోగులుగా అయ్యే స్థితిలో ఇప్పుడు పర్సెంటేజ్ అనేది అంతమైపోవాలి. అది న్యాచురల్ గా (సహజసిద్ధముగా) మరియు నేచర్ గా (స్వభావముగా) అయిపోవాలి. ఏ విధముగా కొందరికి విశేషమైన స్వభావము ఉంటుంది, ఆ స్వభావానికి వశమై, వద్దనుకుంటున్నా కూడా అదే విధముగా వ్యవహరిస్తూ ఉంటారు. అలా ఇది కూడా స్వభావముగా అయిపోవాలి. ఏం చేయను, ఎలా యోగము జోడించను - అనే ఈ విషయాలు అంతమైపోవాలి, అప్పుడు ప్రతి సబ్జెక్టులోనూ పర్ఫెక్ట్ అయిపోతారు. పర్ఫెక్ట్ అనగా ఎఫెక్ట్ (ప్రభావము) మరియు డిఫెక్ట్ (లోపము) నుండి దూరముగా ఉండటము.

స్లోగన్:-
సహనము చేయవలసి వస్తే సంతోషముగా చేయండి, అంతేకానీ తప్పదు అన్నట్లుగా కాదు.

అవ్యక్త ప్రేరణలు - జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి

శక్తిశాలి యోగము అనగా తపన అనే అగ్ని. జ్వాలా రూపపు స్మృతియే భ్రష్టాచారము, అత్యాచారము అనే అగ్నిని సమాప్తము చేస్తుంది మరియు సర్వాత్మలకు సహయోగాన్ని ఇస్తుంది, దాని ద్వారానే అనంతమైన వైరాగ్య వృత్తి ప్రజ్వలితమవుతుంది. స్మృతి అనే అగ్ని ఒకవైపు ఆ అగ్నిని సమాప్తము చేస్తుంది, మరొకవైపు ఆత్మలకు పరమాత్ముని సందేశము, శీతల స్వరూపము యొక్క అనుభూతిని చేయిస్తుంది, దీని ద్వారానే ఆత్మలు పాపాల అగ్ని నుండి విముక్తులవ్వగలరు.