18-01-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా'


‘‘బాప్ దాదా యొక్క అమూల్యమైన మహావాక్యాలు - పితాశ్రీ గారి పుణ్య స్మృతి దివసము నాడు ఉదయము క్లాస్ లో వినిపించేందుకు’’

‘‘మధురమైన పిల్లలూ, జ్ఞాన రత్నాలతో ఒడిని నింపుకుని దానము కూడా చెయ్యాలి, ఎంతగా ఇతరులకు మార్గాన్ని తెలియజేస్తారో అంతగా ఆశీర్వాదాలు లభిస్తాయి’’

ఓం శాంతి. మధురమైన పిల్లలు శివబాబా మనల్ని చదివిస్తున్నారు అన్నది పక్కాగా గుర్తుంచుకోవాలి. శివబాబా పతిత-పావనుడు కూడా, సద్గతిదాత కూడా. సద్గతి అనగా స్వర్గ రాజ్యాన్ని ఇస్తారు. బాబా ఎంతటి మధురమైనవారు! వారు కూర్చుని ఎంత ప్రేమగా పిల్లలను చదివిస్తారు. బాబా, దాదా ద్వారా మనల్ని చదివిస్తారు. బాబా ఎంత మధురమైనవారు, ఎంతగా ప్రేమిస్తారు. వారు ఎటువంటి కష్టమునూ ఇవ్వరు. కేవలము - నన్ను స్మృతి చెయ్యండి మరియు చక్రాన్ని స్మృతి చెయ్యండి అనే అంటారు. తండ్రి స్మృతిలో మనసు పూర్తిగా శీతలమైపోవాలి. ఒక్క బాబా స్మృతియే సతాయిస్తూ ఉండాలి ఎందుకంటే బాబా నుండి ఎంత భారీ వారసత్వము లభిస్తుంది. స్వయాన్ని చూసుకోవాలి - నాకు బాబా పట్ల ఎంత ప్రేమ ఉంది, నాలో దైవీ గుణాలు ఎంతవరకు ఉన్నాయి... ఎందుకంటే పిల్లలైన మీరు ఇప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. ఎంతెంతగా యోగములో ఉంటారో అంతగానే ముళ్ళ నుండి పుష్పాలుగా, సతోప్రధానముగా అవుతూ ఉంటారు. పుష్పాలుగా అయిపోయారంటే ఇక ఇక్కడ ఉండలేరు. స్వర్గమే పుష్పాలతోట. ఎవరైతే చాలా ముళ్ళను పుష్పాలుగా తయారుచేస్తారో, వారినే సత్యమైన సువాసనభరిత పుష్పము అని అంటారు. వారు ఎప్పుడూ ఎవ్వరికీ ముల్లు గుచ్చరు. క్రోధము కూడా పెద్ద ముల్లు. అది చాలామందికి దుఃఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ముళ్ళ ప్రపంచము నుండి తీరానికి వచ్చేసారు, మీరు సంగమములో ఉన్నారు. ఏ విధముగా తోటమాలి పుష్పాలను వేరు చేసి పూలకుండీలో పెడతారో, అలాగే పుష్పాలైన మిమ్మల్ని కూడా ఇప్పుడు సంగమయుగీ పూలకుండీలో వేరుగా పెట్టడము జరిగింది. ఇక తర్వాత మీరు ఫుల్ స్వర్గములోకి వెళ్ళిపోతారు. కలియుగ ముళ్ళు భస్మమైపోతాయి.

పారలౌకిక తండ్రి నుండి మాకు అవినాశీ వారసత్వము లభిస్తుంది అన్నది మధురమైన పిల్లలకు తెలుసు. ఎవరైతే సత్యాతి-సత్యమైన పిల్లలో, ఎవరికైతే బాప్ దాదాపై పూర్తి ప్రేమ ఉందో, వారికి - మేము విశ్వానికి యజమానులుగా అవుతాము అని చాలా సంతోషము ఉంటుంది. అయితే, పురుషార్థము ద్వారానే విశ్వానికి యజమానులుగా అవ్వడము జరుగుతుంది, కేవలం అలా అనటము వలన అవ్వరు. అనన్యులైన పిల్లలెవరైతే ఉన్నారో, వారికి సదా గుర్తుంటుంది - మేము మా కొరకు మళ్ళీ అదే సూర్యవంశీ, చంద్రవంశీ రాజధానిని స్థాపన చేస్తున్నాము అని. తండ్రి అంటారు, మధురమైన పిల్లలూ, ఎంతగా మీరు అనేకుల కళ్యాణము చేస్తారో అంతగా మీకే ప్రతిఫలము లభిస్తుంది. అనేకులకు మార్గాన్ని తెలియజేసినట్లయితే అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి. జ్ఞాన రత్నాలతో ఒడిని నింపుకుని వాటిని దానము చెయ్యాలి. జ్ఞానసాగరుడు మీకు రత్నాలతో పళ్ళాలను నిండుగా నింపి-నింపి ఇస్తారు. ఆ రత్నాలను ఎవరైతే దానము చేస్తారో వారే అందరికీ ప్రియమనిపిస్తారు. పిల్లలకు లోలోపల ఎంత సంతోషము ఉండాలి. వివేకవంతులైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు అంటారు - మేము బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునే తీరుతాము అని. పూర్తిగా అతుక్కుపోతారు. వారికి బాబా పట్ల చాలా ప్రేమ ఉంటుంది ఎందుకంటే ప్రాణ దానము చేసే బాబా లభించారు అన్నది వారికి తెలుసు. జ్ఞానము యొక్క వరదానాన్ని ఎలా ఇస్తారంటే దాని ద్వారా మనము ఎలా ఉన్నవారము ఎలా అయిపోతాము. దివాలా తీసినవారి నుండి సంపన్నులుగా అయిపోతాము. భండారాను అంతగా నింపుతారు. బాబాను ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ప్రేమ ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. సూది శుభ్రముగా ఉన్నప్పుడు అయస్కాంతము వైపుకు ఆకర్షింపబడుతుంది కదా. బాబా స్మృతి ద్వారా తుప్పు వదులుతూ ఉంటుంది. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తుకురాకూడదు.

బాబా అర్థము చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ, ఇప్పుడు నిర్లక్ష్యము చెయ్యకండి. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి, లైట్ హౌస్ లుగా అవ్వండి. స్వదర్శన చక్రధారులుగా అయ్యే ప్రాక్టీస్ బాగా అయినట్లయితే ఇక మీరు జ్ఞానసాగురుని వలె అయిపోతారు. ఏ విధముగా విద్యార్థి చదువుకుని టీచర్ గా అవుతారు కదా. మీ వ్యాపారమే ఇది. అందరినీ స్వదర్శన చక్రధారులుగా తయారుచెయ్యండి, అప్పుడే చక్రవర్తీ రాజా, రాణిగా అవుతారు, అందుకే బాబా సదా పిల్లలను అడుగుతున్నారు - మీరు స్వదర్శన చక్రధారులై కూర్చున్నారా? బాబా కూడా స్వదర్శన చక్రధారి కదా. మధురమైన పిల్లలైన మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళేందుకు బాబా వచ్చారు. పిల్లలైన మీరు లేకపోతే నాకు కూడా ప్రశాంతముగా ఉన్నట్లు అనిపించదు. సమయము వచ్చినప్పుడు కలవరంగా ఉంటుంది, ఇప్పుడిక నేను వెళ్ళాలి అని అనిపిస్తుంది. పిల్లలు చాలా పిలుస్తున్నారు, చాలా దుఃఖితులుగా ఉన్నారు అని జాలి కలుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుండి మీ అంటత మీరే సుఖధామానికి వెళ్ళిపోతారు. అక్కడ నేను మీ సహచరునిగా అవ్వను. మీ అవస్థ అనుసారముగా మీ ఆత్మ వెళ్ళిపోతుంది.

పిల్లలైన మీరు ఎంతగా బాబా స్మృతిలో ఉంటారో, అంతగానే ఇతరులకు అర్థం చేయించినదాని ప్రభావము ఉంటుంది. మీరు ఎక్కువగా మాట్లాడకూడదు. ఆత్మ అభిమానులై కొద్దిగా అర్థం చేయించినా కానీ బాణము తగులుతుంది. బాబా అంటారు - పిల్లలూ, గతం గతః. ఇప్పుడు ముందుగా స్వయాన్ని తీర్చిదిద్దుకోండి. స్వయం స్మృతి చెయ్యకుండా, ఇతరులకు చెప్తూ ఉంటే, ఈ మోసము నడవదు. లోపల మనసు తప్పకుండా తింటూ ఉంటుంది. బాబాపై పూర్తి ప్రేమ లేనట్లయితే శ్రీమతముపై నడవరు. అనంతమైన తండ్రి ఏ విధమైన శిక్షణను ఇస్తారో, దానిని మరెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, ఈ పాత ప్రపంచాన్ని ఇప్పుడు మర్చిపోండి. అంతిమ సమయములోనైతే వీటన్నింటినీ మర్చిపోవలసే ఉంటుంది. బుద్ధి తమ శాంతిధామము మరియు సుఖధామముతో జోడించబడుతుంది. బాబాను స్మృతి చేస్తూ-చేస్తూ బాబా వద్దకు వెళ్ళిపోవాలి. పతిత ఆత్మ అయితే వెళ్ళలేదు. అది ఉన్నదే పావన ఆత్మల ఇల్లు. ఈ శరీరము పంచ తత్వాలతో తయారై ఉంది. ఈ పంచ తత్వాలు ఇక్కడ ఉండేందుకు లాగుతుంటాయి ఎందుకంటే ఆత్మ శరీరాన్ని తన ప్రాపర్టీగా తీసుకున్నట్లు ఉంటుంది, అందుకే శరీరము పట్ల మమకారము ఏర్పడింది. ఇప్పుడు దీని నుండి మమకారాన్ని తొలగించుకుని తమ ఇంటికి వెళ్లాలి. అక్కడైతే ఈ పంచ తత్వాలు లేనే లేవు. సత్యయుగములో కూడా శరీరము యోగబలముతో తయారవుతుంది. సతోప్రధాన ప్రకృతి ఉంటుంది, అందుకే అది లాగదు. అక్కడ దుఃఖము ఉండదు. ఇవి అర్థం చేసుకోవలసిన చాలా సూక్ష్మమైన విషయాలు. ఈ పంచ తత్వాల బలము ఆత్మను లాగుతుంది, అందుకే శరీరాన్ని వదలటానికి మనసు ఒప్పుకోదు. లేదంటే ఇందుకు ఇంకా ఎక్కువ సంతోషపడాలి. పావనముగా అయ్యి శరీరాన్ని ఎలా వదిలేస్తారంటే వెన్న నుండి వెంట్రుకను తీసినంత సులభముగా వదిలేస్తారు. కనుక శరీరము నుండి, అన్ని వస్తువుల నుండి మమకారము పూర్తిగా తొలగించివేయాలి, వీటితో మనకు ఎటువంటి కనెక్షన్ లేదు. మనము బాబా వద్దకు వెళ్తాము అని అనుకోవాలి, అంతే. ఈ ప్రపంచము నుండి మీ బ్యాగ్, బ్యాగేజ్ ను తయారుచేసుకుని ముందుగానే పంపేసారు. అవి తోడుగా అయితే రాలేవు. కేవలము ఆత్మలు వెళ్ళాలి, శరీరాలను కూడా ఇక్కడే వదిలేయాలి. బాబా కొత్త శరీరాన్ని సాక్షాత్కారము చేయించారు. వజ్రాలు, రత్నాలతో పొదగబడిన మహళ్ళు లభిస్తాయి. అటువంటి సుఖధామములోకి వెళ్ళేందుకు ఎంత కృషి చెయ్యాలి. అలసిపోకూడదు. రాత్రింబవళ్ళు చాలా సంపాదన చేసుకోవాలి, అందుకే బాబా అంటున్నారు - నిద్రను జయించే పిల్లలూ, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి మరియు విచార సాగర మంథనము చెయ్యండి. డ్రామా రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకోవడము ద్వారా బుద్ధి పూర్తిగా శీతలమైపోతుంది. మహారథులైన పిల్లలెవరైతే ఉంటారో, వారు ఎప్పుడూ చలించరు. శివబాబాను స్మృతి చేసినట్లయితే వారు సంభాళిస్తారు కూడా.

తండ్రి పిల్లలైన మిమ్మల్ని దుఃఖము నుండి విడిపించి శాంతి దానాన్ని ఇస్తారు. మీరు కూడా శాంతి యొక్క దానము ఇవ్వాలి. మీ ఈ అనంతమైన శాంతి అనగా యోగబలము ఇతరులను కూడా పూర్తిగా శాంతపరుస్తుంది. మీరు బాబా స్మృతిలో ఉంటూ - ఈ ఆత్మ మన కులానికి చెందినదేనా కాదా అన్నదానిని చూడండి. ఒకవేళ ఈ కులానికి చెందిన ఆత్మ అయితే పూర్తిగా శాంతిగా అయిపోతుంది. ఈ కులానికి చెందినవారెవరైతే ఉంటారో, వారికే ఈ విషయాల పట్ల అభిరుచి కలుగుతుంది. పిల్లలు స్మృతి చేస్తే తండ్రి కూడా ప్రేమిస్తారు. ఆత్మను ప్రేమించటము జరుగుతుంది. ఎవరైతే ఎంతో భక్తిని చేసారో వారే ఎక్కువగా చదువుకుంటారు అన్నది కూడా తెలుసు. బాబా పట్ల ఎంత ప్రేమ ఉంది అన్నది వారి ముఖము ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఆత్మ బాబాను చూస్తుంది. బాబా ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు. నేను ఇంత చిన్నని బిందువైన ఆత్మను చదివిస్తున్నాను అని బాబా కూడా భావిస్తారు. మున్ముందు మీకు కూడా ఇటువంటి అవస్థ ఏర్పడుతుంది. సోదరుడినైన నేను సోదరుడిని చదివిస్తున్నాను అని భావిస్తారు. ముఖము అక్కయ్యది అయినా కానీ దృష్టి ఆత్మ వైపుకు వెళ్ళాలి. శరీరముపైకి దృష్టి అస్సలు వెళ్ళకూడదు, ఇందులో చాలా శ్రమ ఉంది. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఇది చాలా ఉన్నతమైన చదువు. తూకము వేస్తే ఈ చదువు వైపు భారీగా ఉంటుంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

అవ్యక్త మహావాక్యాలు -

మహావీరులైన పిల్లల సంగఠన యొక్క విశేషత - ఏకరసమైన, స్థిరమైన స్థితి - 9-12-75

మహావీర్ అనగా విశేషాత్మ. ఇటువంట మహావీర్ విశేషాత్మల యొక్క సంగఠన యొక్క విశేషత వర్తమాన సమయములో ఏముండాలంటే - ఒకే సమయములో అందరిదీ ఏకరసమైన, స్థిరమైన స్థితి ఉండాలి అనగా ఎంత సమయము, ఏ స్థితిలో నిలిచి ఉండాలనుకుంటే, అంత సమయము, ఆ స్థితిలో సంగఠిత రూపములో స్థితులైపోవాలి. సంగఠిత రూపములో అందరి సంకల్పమనే వేలు ఒకటే ఉండాలి. ఎప్పటివరకైతే సంగఠనలో ఈ అభ్యాసము ఉండదో అప్పటివరకు సిద్ధి లభించదు. సంగఠనలో - ఇప్పుడు ఐదు నిమిషాలు కోసం వ్యర్థ సంకల్పాలను పూర్తిగా సమాప్తము చేసి శక్తిశాలి బీజరూప స్థితిలో ఏకరసముగా స్థితులైపోండి అని ఆజ్ఞాపిస్తే, ఆ విధమైన అభ్యాసము ఉందా? అలా కాకుండా కొందరు మననము చేసే స్థితిలో, కొందరు ఆత్మిక సంభాషణ చేస్తున్నట్లు, కొందరు అవ్యక్త స్థితిలో, ఇలా ఉండకూడదు. బీజరూప స్థితిలో స్థితులవ్వాలి అన్నది ఆజ్ఞ, కానీ చేస్తున్నది ఆత్మిక సంభాషణ, అంటే ఆజ్ఞను పాటించనట్లే కదా! ఎప్పుడైతే మొదట వ్యర్థ సంకల్పాలను సమాప్తము చేస్తారో అప్పుడు ఈ అభ్యాసము జరుగుతుంది. అలజడి కలిగేదే వ్యర్థ సంకల్పాల వల్ల. ఈ వ్యర్థ సంకల్పాలను సమాప్తి చేసేందుకు, మీ సంగఠనను శక్తిశాలిగా మరియు ఏకమతముగా తయారుచేసుకునేందుకు ఏ శక్తి కావాలి?

దీని కొరకు ఒకటి - విశ్వాసము, రెండు - ఇముడ్చుకునే శక్తి కావాలి. సంగఠనను కలిపేందుకు దారము - విశ్వాసము. ఎవరైనా ఏదైనా చేసారంటే, ఒకవేళ పొరపాటే చేసినా కూడా, సంగఠన అనుసారముగా లేదా తమ సంస్కారాల అనుసారముగా లేదా సమయమనుసారముగా వారు ఏదైతే చేసారో దానిలో కూడా తప్పకుండా ఏదో భావార్థము ఉంటుంది. సంగఠిత రూపములో ఎక్కడైతే సేవ ఉంటుందో, అక్కడ వారి సంస్కారాలను కూడా దయార్ద్ర హృదయ దృష్టితో చూస్తూ, వారి ఆ సంస్కారాలను ఎదురుగా పెట్టుకోకుండా - ఇందులో కూడా ఏదో కళ్యాణము ఉంటుంది, వారిని కలుపుకుని నడవడములోనే కళ్యాణము ఉంది అని ఇటువంటి విశ్వాసము ఎప్పుడైతే సంగఠనలో ఒకరి పట్ల ఒకరికి ఉంటుందో, అప్పుడే సఫలత లభించగలదు. ముందు నుండే వ్యర్థ సంకల్పాలను నడిపించకూడదు. ఒకవేళ ఎవరైనే ఏదైనా పొరపాటు చేసారనుకోండి, వారు తమ పొరపాటును రియలైజ్ అయినా కూడా, దానిని వారెప్పుడూ వ్యాపింపజేయరు, ఇంకా చెప్పాలంటే దానిని ఇముడ్చుకుంటారు. ఒకవేళ ఇతరులెవరైనా దానిని వ్యాపింపజేసినా మంచిగా అనిపించదు, తప్పుగా భావిస్తారు. అదే విధముగా, ఇతరుల పొరపాటును కూడా తమ పొరపాటుగా భావించి దానిని వ్యాపింపజేయకూడదు. వ్యర్థ సంకల్పాలు నడిపించకూడదు. దానిని కూడా మీలో ఇముడ్చుకోవాలి. అంతగా ఒకరిపై ఒకరికి విశ్వాసము ఉండాలి! స్నేహశక్తితో దానిని సరిచేయాలి. ఏ విధముగా లౌకిక పద్ధతిలో కూడా ఇంటి విషయాలను బయటపెట్టరు, లేదంటే దాని వలన ఆ ఇంటికే నష్టము జరుగుతుంది. అదే విధముగా సంగఠనలో మీతోపాటు ఉండేవారు ఏది చేసినా దానిలో తప్పకుండా రహస్యము ఉంటుంది. ఒకవేళ వారు ఏదైనా పొరపాటే చేసినా కూడా దానిని పరివర్తన చేయాలి. ఈ రెండు రకాల విశ్వాసాలను పెట్టుకుని ఒకరికొకరు సంపర్కములో నడవడము వలన సంగఠనలో సఫలత లభించగలదు, ఈ విషయములో ఇముడ్చుకునే శక్తి ఎక్కువ కావాలి. వ్యర్థ సంకల్పాలను ఇముడ్చుకోవాలి. గడిచిపోయిన సంస్కారాలను ఎప్పుడూ కూడా వర్తమాన సమయముతో పోల్చకండి అనగా గతాన్ని వర్తమానము చేయకండి. ఎప్పుడైతే గతాన్ని వర్తమానముతో పోల్చుతారో లేక కలుపుతారో అప్పుడే సంకల్పాల క్యూ పెద్దదైపోతుంది మరియు ఎప్పటివరకైతే ఈ వ్యర్థ సంకల్పాల క్యూ ఉంటుందో, అప్పటివరకు సంగఠిత రూపములో ఏకరస స్థితి తయారవ్వదు.

ఇతరుల పొరపాటును తమ పొరపాటుగా భావించటము - ఇదే సంగఠనను దృఢముగా చేయటము. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, ఒకరి పట్ల ఒకరికి నమ్మకము ఉన్నప్పుడు. పరివర్తన చేసే విషయములో విశ్వాసము, లేదా కళ్యాణము చేసే విషయములో విశ్వాసము, ఇందుకు ఇముడ్చుకునే శక్తి తప్పకుండా కావాలి. చూసారు మరియు విన్నారు, కానీ దానినంతటినీ పూర్తిగా ఇముడ్చుకుని అదే ఆత్మిక దృష్టితో మరియు కళ్యాణభావనతో ఉండాలి. అపకారులకు ఉపకారము చేయాలి అని అజ్ఞానుల విషయములో చెప్తారు కదా, అదే విధముగా సంగఠనలో కూడా ఒకరి పట్ల ఒకరికి దయా భావన ఉండాలి. ఇప్పుడు దయా భావన తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆత్మిక స్థితి యొక్క అభ్యాసము తక్కువగా ఉంది.

ఇటువంటి శక్తిశాలి సంగఠన ఉండటము ద్వారానే సిద్ధి లభిస్తుంది. ఇప్పుడు మీరు సిద్ధిని ఆహ్వానిస్తున్నారు, కానీ తరువాత మీ ఎదురుగా సిద్ధి స్వయమే వంగుతుంది. ఏ విధముగానైతే సత్యయుగములో ప్రకృతి దాసి అయిపోతుందో, అదే విధముగా సిద్ధి మీ ఎదురుగా స్వయమే వంగుతుంది, సిద్ధి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. శ్రేష్ఠమైన జ్ఞానము ఉన్నప్పుడు, స్థితి కూడా శక్తిశాలిగా ఉన్నప్పుడు సిద్ధి పొందటమనేది ఏమంత పెద్ద విషయము? సదాకాలము ఏకరస స్థితిలో ఉండేవారికి సిద్ధి ప్రాప్తించకపోవడమనేది జరగదు, కానీ ఇందుకొరకు సంగఠన శక్తి కావాలి. ఒకరు ఒకటి చెప్పారు, రెండవవారు దానిని స్వీకరించారు. ఎదుర్కొనే శక్తిని బ్రాహ్మణ పరివారములో ఉపయోగించకూడదు, ఎదుర్కొనే శక్తిని మాయ ఎదురుగా ఉపయోగించాలి. పరివారములో ఎదుర్కొనే శక్తిని ప్రయోగిస్తే సంగఠన శక్తిశాలిగా ఉండదు. ఏ విషయమైనా నచ్చకపోయినా కానీ ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఆ సమయములో ఎవరి సంకల్పాలను లేదా మాటలను ఖండించకూడదు, అందుకే ఇప్పుడు ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయండి.

సంగఠిత రూపములో బ్రాహ్మణ పిల్లలైన మీ భాష కూడా పరస్పరము సంపర్కములో అవ్యక్త భావముతో కూడినదిగా ఉండాలి. ఫరిశ్తాలు లేదా ఆత్మలు ఆత్మలతో మాట్లాడుతున్నారు అన్నట్లుగా ఉండాలి. ఎవరి పొరపాటు గురించైనా విన్నా, దానిని సంకల్పములో కూడా స్వీకరించకూడదు మరియు స్వీకరింపజేయకూడదు. అటువంటి స్థితి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే బాబాకు సంగఠన పట్ల ఏదైతే శుభకామన ఉందో అది ప్రత్యక్షముగా జరుగుతుంది. దాని కొరకు విశేష పురుషార్థము చేయండి మరియు విశేష అనుభవాలను గురించి ఒకరితో ఒకరు పంచుకోండి. సంగఠిత రూపములో విశేషముగా యోగ ప్రోగ్రాములు జరుగుతూ ఉన్నట్లయితే వినాశజ్వాల కూడా తీవ్రతరమవుతుంది. యోగాగ్ని ద్వారా వినాశనమనే అగ్ని ప్రజ్వలితమవుతుంది. అచ్ఛా! ఓం శాంతి.

వరదానము:-
వ్యక్తములో ఉంటూ అవ్యక్త ఫరిశ్తా రూపము యొక్క సాక్షాత్కారాన్ని చేయించే శ్వేత వస్త్రధారీ మరియు శ్వేత ప్రకాశధారీ భవ

ఏ విధముగా ఇప్పుడు నలువైపులా - ఈ శ్వేత వస్త్రధారులు ఎవరు మరియు ఎక్కడి నుండి వచ్చారు అన్న శబ్దము వ్యాపిస్తుందో, అదే విధముగా ఇప్పుడు నలువైపులా ఫరిశ్తా రూపము యొక్క సాక్షాత్కారాన్ని చేయించండి - దీనినే డబల్ సేవా రూపము అని అంటారు. ఏ విధముగా మేఘాలు నలువైపులా వ్యాపిస్తాయో, అదే విధముగా నలువైపులా ఫరిశ్తా రూపములో ప్రకటితమవ్వండి, ఎక్కడ చూసినా ఫరిశ్తాలే కనిపించాలి. కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, శరీరము నుండి డిటాచ్ అయి అంతః వాహక శరీరము ద్వారా అంతటా తిరిగి వచ్చే అభ్యాసులుగా అయినప్పుడు, మనసు శక్తిశాలిగా అయినప్పుడు.

స్లోగన్:-
సర్వ గుణాలు మరియు సర్వ శక్తులకు అధికారులుగా అయ్యేందుకు అజ్ఞాకారులుగా అవ్వండి.

అవ్యక్త ప్రేరణలు - ఈ అవ్యక్త మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవము చేయండి

ఏ విధముగా తండ్రి ఎప్పుడూ స్వతంత్రులో - అదే విధముగా తండ్రి సమానముగా అవ్వండి. బాప్ దాదా ఇప్పుడు పిల్లలను పరతంత్రులుగా ఉండటాన్ని చూడలేరు. ఒకవేళ స్వయాన్నే స్వతంత్రులుగా చేసుకోలేకపోతే, స్వయమే తమ బలహీనతలలోకి పడిపోతూ ఉంటే, ఇక విశ్వ పరివర్తకులుగా ఎలా అవుతారు! ఇప్పుడు - నేను మాస్టర్సర్వశక్తివంతుడిని అనే ఈ స్మృతిని పెంచుకోండి, దీని వలన సహజముగా అన్ని పంజరాల నుండి ముక్తులై ఎగిరే పక్షిలా అయిపోతారు.