19-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 18.01.2011


‘‘బ్రహ్మాబాబా సమానముగా జీవితములో ఉంటూ జీవన్ముక్త స్థితి యొక్క ఆనందాన్ని పొందండి, మన్ జీత్ జగత్ జీత్ గా అయి స్నేహము యొక్క కానుకను ఇవ్వండి’’

ఈ రోజు విశేషముగా బ్రహ్మాబాబా అవ్యక్తమైన స్మృతి దివసము. పిల్లలందరి నయనాలలో బ్రహ్మాబాబా స్నేహము ఇమిడి ఉంది. ఈ రోజు నాలుగు గంటలకన్నా ముందు నుండే పిల్లల స్నేహము వతనానికి చేరుకుంది. బ్రహ్మాబాబాతో మిలనము జరుపుకునేందుకు మరియు తమ హృదయపూర్వక స్నేహానికి గుర్తుగా మాలలు బ్రహ్మాబాబా వద్దకు చేరుకున్నాయి. ప్రతి మాలలోని సుగంధములో పిల్లల స్నేహము ఇమిడి ఉంది. పిల్లలు ప్రతి ఒక్కరి నయనాలు మరియు చిరునవ్వు మనసులోని మాటలను చెప్తున్నాయి. బ్రహ్మాబాబా కూడా ప్రతి ఒక్కరికీ స్నేహానికి రిటర్న్ ను ఇస్తున్నారు. ఇప్పుడు కూడా పిల్లలు ప్రతి ఒక్కరూ నయనాల భాషతో తమ హృదయములోని స్నేహాన్ని అందిస్తున్నారు అనేది బాబా చూస్తున్నారు, ఎందుకంటే ఈ పరమాత్మ స్నేహము పిల్లలు ప్రతి ఒక్కరినీ సహజముగానే బాబాకు చెందినవారిగా చేస్తుంది. ఈ అలౌకిక స్నేహము ‘‘నా బాబా’’ యొక్క అనుభవముతో తమవారిగా చేసుకునేటటువంటిది. ఈ స్నేహము బాబా ఖజానాలకు యజమానులుగా చేస్తుంది ఎందుకంటే పిల్లలు ‘‘నా బాబా’’ అని అన్నారు, ‘‘నా బాబా’’ అని అనడమంటే సర్వ ఖజానాలకు యజమానులుగా అవ్వడము. ఈ స్నేహము దేహ భానాన్ని క్షణములో మరపింపజేసి దేహీ-అభిమానులుగా చేస్తుంది. ఒక్క బాబా తప్ప మరేవీ ఆత్మను ఆకర్షించవు. ఈ రోజుకు ఎంతో గొప్ప మహత్వము ఉంది. ఇది కేవలం స్మృతి దివసమే కాదు, ఇది సమర్థీ దివసము కూడా, ఎందుకంటే ఈ రోజున బాబా విశ్వ సేవ కొరకు స్వయం చేయించేవారిగా అయ్యి పిల్లలను చేసేవారిగా తయారుచేయడానికి తిలకము దిద్దారు. సన్ షోస్ ఫాదర్ (పిల్లలు తండ్రిని ప్రత్యక్షము చేస్తారు) అన్నదానికి చేసేవారిని నిమిత్తము చేసారు. సేవలో సఫలతకు సాధనమేమిటంటే - స్వయం చేయించేవారిగా అయ్యి పిల్లలను చేసేవారిగా చేసారు, ఎందుకంటే సేవలో సఫలతకు సాధనమేమిటంటే - నేను చేసేవాడిని, చేయించేవారు చేయిస్తున్నారు, ఈ స్మృతి మరియు స్థితి చాలా అవసరము ఎందుకంటే 63 జన్మల స్మృతి ‘నేను అనే భావనలోకి’, దేహ-అభిమానములోకి తీసుకువస్తుంది. చేయించేవారు చేయిస్తున్నారు, నేను నిమిత్తముగా చేసేవాడిని, ఈ స్మృతి ద్వారానే స్వయాన్ని నిమిత్తముగా భావించడము వలన దేహాభిమానము సమాప్తమైపోతుంది. అందుకే పిల్లలను చేసేవారిగా చేసారు, స్వయం చేయించేవారిగా అయ్యారు. చేసేవారిగా అవ్వడము ద్వారా స్వతహాగానే నిమిత్తముగా మరియు నిర్మానచిత్తులుగా అవుతారు. ఇప్పుడు కూడా బాప్ దాదా చూసారు - పిల్లలు నిమిత్తముగా అయి సేవ చేస్తారు, నిమిత్తముగా అయి సేవ చేసే సేవాధారుల మస్తకములో సేవకు ప్రతిఫలముగా సితార మెరుస్తూ ఉంది. మెజారిటీ పిల్లల సేవను చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు, అందుకే ఇటువంటి పిల్లలకు విశేషముగా బ్రహ్మాబాబా - వాహ్ పిల్లలు వాహ్! అంటూ అభినందనలు తెలియజేస్తున్నారు.

బ్రహ్మాబాబా విశేషముగా సంతోషిస్తున్నారు కూడా మరియు ఇక ముందు కూడా నిమిత్తముగా అయ్యి సేవను ముందుకు తీసుకువెళ్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు కూడా బ్రహ్మాబాబా పిల్లలకు తమ సమానముగా ఫరిశ్తా స్థితిలో ఉండేందుకు సూచనలను ఇస్తున్నారు. బాప్ దాదా చూసారు - పిల్లలకు అటెన్షన్ ఉంది, బ్రహ్మాబాబా జీవితములో ఉంటూ జీవన్ముక్తిలో ఉండేవారు, ఎంతో బాధ్యత ఉన్నప్పటికీ, ఇంత పెద్ద పరివారాన్ని సంబాళించడము, అందరినీ యోగీ జీవితము కలవారిగా చేయడము, ఇంతటి సేవా బాధ్యతను సంబాళించడము, సేవలో సదా ముందుకు తీసుకువెళ్ళడము, అన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ జీవన్ముక్తి యొక్క ఆనందములో ఉండేవారు, అందుకే భక్తి మార్గములో బ్రహ్మా ఆసనముగా కమల ఆసనాన్ని చూపిస్తారు. జీవన్ముక్తులుగా అయ్యి ఇప్పుడే జీవన్ముక్తి యొక్క ఆనందాన్ని చూసారు మరియు పిల్లలైన మీ అందరినీ కూడా అలానే తయారుచేసారు. ఇప్పుడు కూడా పిల్లలైన మీ అందరికీ ఫరిశ్తాగా అయ్యేందుకు భిన్న-భిన్న యుక్తులను చెప్పి తమ సమానముగా తయారుచేయాలని అనుకుంటున్నారు.

బాప్ దాదా ఏమి చూసారంటే - లక్ష్యము పిల్లలందరిదీ మంచిగా ఉంది. మీ లక్ష్యము ఏమిటి అని ఎవరిని అడిగినా సరే, ఏమంటారు? ఏమంటారో గుర్తుందా? బాబా సమానముగా అవ్వాల్సిందే. మరి బాబా సమానముగా ఏ విషయములో అవుతారు? ఈ జీవితములోనే జీవన్ముక్తి జీవితానికి శ్యాంపుల్ గా అవుతారు. బాప్ దాదా ఏమి చూసారంటే - ఏ హోమ్ వర్కునైతే ఇవ్వడము జరుగుతుందో, దాని పట్ల అటెన్షన్ అయితే పెడతారు, అనుభవం కూడా చేస్తారు, కానీ సదా చేయరు. ఇప్పుడు కూడా ఏ పని అయితే ఇవ్వడము జరిగిందో, దాని రిపోర్టును కొంతమంది పిల్లలు పురుషార్థము చేసి ఒక్కొక్క మాసం అటెన్షన్ ను ఉంచారు. కొన్ని జోన్ల రిపోర్టు ఒక్క మాసం యొక్క రిజల్టులో మంచిగా కూడా వచ్చింది. ఎవరైతే రిపోర్టును పంపించారో, ఏ జోన్ వారైతే పంపించారో, వారికి బాప్ దాదా - వాహ్ పిల్లలూ వాహ్! అంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. కానీ బాప్ దాదా ఇప్పుడు ఏమి కోరుకుంటున్నారు? ఇప్పుడు బాప్ దాదా పిల్లలందరి నుండి ఏమి కోరుకుంటున్నారంటే - ఇప్పుడు అప్పుడప్పుడూ మంచిగా చేస్తున్నారు, కానీ బాప్ దాదా సదా కోరుకుంటున్నారు. యోగిగా కూడా మంచిగా అయ్యారు కానీ సదా యోగిగా చేయాలనుకుంటున్నారు. ఈ రోజుల్లో బాప్ దాదా పిల్లలకు హోమ్ వర్కును కూడా ఇచ్చారు, సదా ఉండటానికి ప్రతి గంట తమపై ఏదో ఒక యుక్తిని ఉంచుకోండి, దాని ద్వారా అప్పుడప్పుడూ అన్నది మారి సదా అన్న పదము రావాలి. ఇప్పుడు బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - మన్ జీతే జగత్ జీత్ (మనసును జయించినవారే జగత్తును జయిస్తారు) అన్న నానుడి ఉంది కదా, దాని అనుసారముగా మనసుకు ఏ సంకల్పాన్ని ఇస్తే అది అదే చేయాలి. ఎందుకని? ఎలా అయితే ఇతర కర్మేంద్రియాలు ఎప్పుడు కావాలంటే అప్పుడే, ఎలా కావాలంటే అలానే చేస్తాయి కదా! అలాగే మనసుకు కూడా ఏది ఆర్డర్ చేస్తే అదే చేయాలి. అభ్యాసము చేస్తున్నారు కానీ అప్పుడప్పుడూ చేయలేకపోతున్నారు కూడా. బాప్ దాదా ఇప్పుడు ఇదే కోరుకుంటున్నారు - మనసును శక్తులు అనే కళ్ళెముతో ఎలా నడిపించాలనుకుంటే అలా నడిపించగలగాలి. మన్ జీతే జగత్ జీత్ అన్న గాయనము ఏదైతే ఉందో, అది ఎవరి గాయనము? పిల్లలైన మీ గాయనమే కదా! ప్రతి కల్పము చేసారు కనుకనే ఈ గాయనము ఉంది. ఎందుకంటే ఎలా అయితే ఇతర కర్మేంద్రియాలను నావి అని అంటారో, అలాగే మనసును కూడా నాది అని అంటారు. నాది అని అనడము అంటే యజమానిగా అవ్వండి. మనసులో ఏ సంకల్పము చేయాలనుకుంటే అది, ఎంత సమయము ఆ సంకల్పము చేయాలనుకుంటే అంత సమయము, మనసు బంధింపబడి ఉంది ఎందుకంటే అది నాది. మరి బాప్ దాదా ఈ స్నేహ దివసము నాడు ఈ హోమ్ వర్కునే ఇవ్వాలని అనుకుంటున్నారు, అదేమిటంటే - ఏ సంకల్పము చేయాలనుకుంటే అదే నడవాలి. ఒకవేళ మీరు శుద్ధ సంకల్పాలు చేయాలనుకుంటే ఆ శుద్ధ సంకల్పాలు వ్యర్థ సంకల్పాలను సమాప్తము చేయాలి. ఒకవేళ యోగము చేయాలి అని అనుకుంటే, ఆ సమయములో సంస్కారాల కారణముగా వ్యర్థ సంకల్పాలు నడిచినా లేక యోగ సిద్ధి లభించకపోయినా కంట్రోల్ లేనట్లే, కానీ ఆ కంట్రోల్ ఉండాలి. ఒకవేళ ఒక గంట యోగము చేయాలనుకుంటే మనసు డిస్టర్బ్ చేయకూడదు. ఆత్మ యజమాని, మనసు యజమాని కాదు. మనసు అయితే ఆత్మకు సహచరుడు వంటిది. కనుక సహచరుడిని ప్రేమతో ఆర్డర్ చేయండి, మన్ జీత్ గా అవ్వండి, ఎందుకంటే - వ్యర్థ సంకల్పాలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయని, వద్దనుకున్నా కూడా వస్తూ ఉంటాయని బాప్ దాదా వద్దకు చాలామంది పిల్లల నుండి సమాచారము వస్తూ ఉంటుంది. మరి వారిని యజమాని అని అనగలమా! మరి బ్రహ్మాబాబాపై స్నేహము ఉంది కదా, కావున బాబా ఈ రోజు ఆ స్నేహములో తమ హృదయములోని ఆశను వినిపిస్తున్నారు - ఇప్పుడు మన్ జీత్ జగత్ జీత్ గా అవ్వాల్సిందే. మరి బ్రహ్మాబాబాకు ఈ స్నేహపూర్వక కానుకను ఇస్తారు కదా! స్నేహానికి గుర్తుగా ఏమి ఇవ్వడము జరిగింది? కానుకను ఇవ్వడము జరుగుతుంది కదా! ఈ రోజు బ్రహ్మాబాబా పిల్లలను ఈ కానుకను ఇవ్వమని కోరుకుంటున్నారు. సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నారా? చేతులెత్తండి. కావున ఇక ఇప్పటినుండి ఎప్పుడు ఆర్డర్ చేసినా, ఈ రోజు నుండి వ్యర్థ సంకల్పాలను రానివ్వకండి, ఇలా చేయగలరా? ఈ రోజు రెండు గంటలు, నాలుగు గంటలు యోగ స్థితిలో కర్మలు కూడా చేయండి, యోగము కూడా చేయండి, చేయగలరా? చేయగలరా, చేస్తారా? సరే, ఇప్పుడిక గడిచిందేదో గడిచిపోయింది, కానీ ఇప్పుడిక ఆర్డర్ చేయండి, ఈ రోజు నుండి వ్యర్థ సంకల్పాలకు ఫుల్ స్టాప్, మరి చేయవలసిందే కదా.

ఈ రోజు యోగములో ఇదే లక్ష్యము పెట్టుకోండి, దాని అనుసారముగానే రోజంతా పురుషార్థము చేయవలసి ఉంటుంది కదా! బాబాపై ఉన్న స్నేహము కారణముగా బాబా ఏది చెప్తే అది చేయాలి. వ్యర్థ సంకల్పాలు సమాప్తము, దీని కోసం యుక్తి ఏమిటంటే - బ్రహ్మాబాబా స్నేహాన్ని హృదయపూర్వకముగా గుర్తు చేసుకోండి. సాకారములో చూసినా, చూడకపోయినా కానీ, బుద్ధిబలము ద్వారా అయితే అందరూ చూసారు కదా! చూసారా లేక చూడలేదా? ఎవరైతే - నేను బాబా ప్రేమను చూసాను, నేను బ్రహ్మాబాబా పాలనను చూసాను అని అంటారో, వారు మరి - దానిపైనే నడుస్తున్నాను అని అంటారా... వారు చేతులెత్తండి. అచ్ఛా! చేతులెత్తి అయితే సంతోషపరిచారు. బాప్ దాదాకు సంతోషముగా ఉంది, ధైర్యమునైతే ఉంచారు కదా. కానీ ఎప్పుడైనా, ఏదైనా శక్తి తగ్గినట్లయితే సదా బాబా సంబంధాలు, ఎన్ని సంబంధాలు ఉన్నాయి - ఒక్కోసారి తండ్రిగా, ఒక్కోసారి కొడుకుగా కూడా అయిపోతారు బాబా. ఒక్కోసారి తండ్రి అయితే, మరోసారి సఖుడిగా కూడా అవుతారు. అందుకే సంబంధాలనైనా గుర్తు చేసుకోండి లేక ప్రాప్తులనైనా గుర్తు చేసుకోండి. ప్రాప్తులు మరియు సంబంధాలు. ఎలా అయితే ఈ రోజు మనస్ఫూర్తిగా గుర్తు చేసుకుంటున్నారు కదా, అలా గుర్తు చేసుకున్నట్లయితే ప్రేమ ఉత్పన్నమవుతుంది. ఈ రోజు కూడా అందరి హృదయాలలో బ్రహ్మాబాబా ప్రేమ గుర్తుకువస్తూ ఉంది కదా! కావున ఎప్పుడైనా ఏదైనా కింద-మీద అయితే, అప్పుడు సంబంధాలను మరియు ప్రాప్తులను గుర్తు చేసుకోండి. బాబా ప్రతి బిడ్డకు సహయోగిగా ఉంటారు, కేవలం మీరు గుర్తు చేసుకోండి. మరి ఈ రోజు ఏమి చేయాలో అర్థమయిందా? మన్ జీత్ జగత్ జీత్ అన్న గాయనము ఏదైతే ఉందో, ఆ స్వరూపాన్ని ధారణ చేయాలి. ఆర్డర్ లో నడిపించండి. ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా వదిలేశారు కదా, కావున మనసు దాని పని అది చేసుకుంటుంది. ఇప్పుడు అటెన్షన్ పెట్టండి. మనసు నా ఆర్డర్ అనుసారముగా నడుచుకోవాలి, అంతేకానీ నేను మనసు చెప్పినట్లు నడుచుకోవడము కాదు. జ్ఞాన విషయాలను స్మరించాలని అనుకుంటారు కానీ వ్యర్థ విషయాలు వచ్చేస్తాయి. అప్పుడు ఏమైంది? మనసు యజమానిగా అయినట్లా లేక మీరు యజమానిగా అయినట్లా? మరి అందరూ ఈ హోమ్ వర్కును అర్థం చేసుకున్నారా! మన్ జీతులుగా అవ్వాలి. మీరు ఏది ఆర్డర్ చేస్తే దానిని స్వీకరిస్తుంది, తప్పకుండా స్వీకరిస్తుంది. కేవలం అటెన్షన్ పెట్టవలసి ఉంటుంది, అంతే. మాతలు మరియు టీచర్లు, వీలవుతుందా? వీలవుతుందా? టీచర్లు చేతులెత్తండి. టీచర్లు చేతులెత్తుతున్నారు. ఒకవేళ వీలవుతుంది అని భావిస్తే చేతులు ఊపండి. మొదటి లైన్ వారైతే ఊపండి. సోదరులు చేతులు ఊపండి. వాహ్! ఇక అలా అయితే బ్రహ్మాబాబాకు స్నేహపు కానుకను ఇచ్చినట్లే, దాని కోసం అభినందనలు, అభినందనలు.

మంచిది, బాప్ దాదా పట్ల ఉన్న స్నేహము ఎంతో సహయోగాన్ని ఇస్తుంది. మనస్ఫూర్తిగా నా బాబా అని అన్నారు. నా బాబా అని అన్నారంటే మరి నేను ఎవరిని? బాబాకు అత్యంత ప్రియమైన బిడ్డను. అందరూ ఎన్ని సార్లు - నా బాబా, నా బాబా అని అంటారు, ఎన్ని సార్లు అంటారు? బాబా వింటారు కదా, అన్నీ నోట్ చేసుకుంటారు. డబుల్ విదేశీయులు కూడా వింటున్నారు కదా. బాప్ దాదా ఏమి చూసారంటే - ఫుల్ సీజన్ లో డబుల్ విదేశీయులు హాజరు అయ్యారు. వారు మధుబన్ లో ప్రతి సమయమూ హాజరు అయ్యారు. ఇప్పుడు కూడా 350 మంది ఉన్నారు. తమ టర్నులో కూడా వస్తారు, అంతేకాక ప్రతి టర్నులో కూడా కొద్ది కొద్దిమంది చొప్పున అనేక ప్రదేశాల నుండి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రిజల్టును బాప్ దాదా కూడా చూస్తూ ఉంటారు మరియు మీరందరూ కూడా సాక్షీగా అయ్యి మీ రిజల్టును చూసుకుంటూ ఉండండి. యజమానిగా అవుతాము అని బాప్ దాదాకు ప్రతిజ్ఞ చేసారు, ఇది గుర్తుంచుకోండి. బాప్ దాదా ఇప్పుడు పిల్లలకు, కనీసం ఒక్కొక్క జోనుకు ఈ కార్యాన్ని ఇవ్వవచ్చు, అదేమిటంటే - ఈ జోన్ ఈ వారము లేక 15 రోజుల రిజల్టు ఇవ్వాలి - వ్యర్థ సంకల్పాలు లేవు, సరే, కానీ మనసుకు ఏ విషయమైతే ఇచ్చారో, అది చేసిందా లేక చేయలేదా? ఇది సమ్మతమేనా టీచర్లు? సమ్మతమేనా? జోనుకు కార్యమును ఇద్దామా? చేతులెత్తండి టీచర్లు.

మహారాష్ట్ర కదా. మరి మహారాష్ట్రకైతే మహా కార్యాన్ని ఇస్తాము కదా. బాప్ దాదాకు ప్రతి జోను పట్ల ప్రేమ ఉంది. అంతేకాక బాబా సదా ఈ నిశ్చయము పెట్టుకుంటారు, బాబా చెప్పిన వెంటనే పిల్లలు చేస్తారు అని. అంతేనా? మహారాష్ట్ర, బాబా ఏదైతే చెప్పారో, అది చేసారా, అంతేనా? మహారాష్ట్ర వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. మూడు వంతుల క్లాసు ఉన్నారు. ప్రతి జోను వారు బాబాకు ఆజ్ఞాకారులే. అందరూ తల ఊపుతున్నారు. నా పిల్లలు ఉన్నదే నిశ్చయబుద్ధి కలవారిగా అని బాబాకు కూడా నిశ్చయముంది.

బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారంటే - ప్రతిరోజూ వినే మహావాక్యాలే మీకు హోమ్ వర్కు. ఒకవేళ రోజూ మురళిలో బాబా ఏదైతే చెప్తున్నారో, దానిని పిల్లలు చేస్తే, వారిని బాబాకు అతి ప్రియమైన పిల్లలు, ఆజ్ఞాకారీ పిల్లలు అని అనడము జరుగుతుంది. ఏమి చేయాలి అన్నది రోజూ మురళి నుండి చదువుకోండి, ఎందుకంటే బాప్ దాదా ఏమి చూసారంటే, మెజారిటీ పిల్లలకు మురళి పట్ల ప్రేమ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ప్రేమ లేకపోయినా కానీ, బాప్ దాదా వద్దకు ఎవరైనా బిడ్డ వచ్చి - బాబా, మీపై నాకు చాలా ప్రేమ ఉంది అని అన్నా కానీ బాబాకు ఎవరి పట్ల ప్రేమ ఉంది? మురళి పట్ల. మురళి కోసం ఎంత దూరము నుండి వస్తారు. అంత దూరము నుండి వచ్చి చదువును చదివించే టీచరు ఎవరైనా ఉన్నారా? మరి బాబా ప్రేమ మురళిపై ఉంటే, ఎవరైతే నా బాబా అని అంటారో, వారి మొదటి ప్రేమ బాబాతో పాటుగా బాబా మురళిపై కూడా ఉండాలి. చూడండి, బ్రహ్మాబాబా ఒక్కరోజు కూడా మురళిని మిస్ చేయలేదు. కొన్ని కారణాల వల్ల బొంబాయి వెళ్ళవలసి వచ్చినా కానీ మురళిని వ్రాసేవారు మరియు మాతేశ్వరి ఆ మురళిని వినిపించేవారు. చివరి రోజు ఆరోగ్యము కొద్దిగా ఢీలా ఉండినది, ఉదయము క్లాసును చేయించలేదు, కానీ సాయంత్రము క్లాస్ చేయించిన తర్వాత అవ్యక్తమయ్యారు. మరి బ్రహ్మాబాబాకు దేనిపై ప్రేమ ఉంది? మురళిపై. ఎవరైతే నాకు బాబాపై ప్రేమ ఉంది అని భావిస్తున్నారో, బాబాకు దేనిపై ప్రేమ ఉన్నదో దానిపై పిల్లలకు కూడా ప్రేమ ఉండాలి కదా! కనుక మురళిని రోజు క్లాసులో వినండి లేక చదవండి. కానీ ఒకవేళ తప్పనిసరి పరిస్థితి ఉంటే, సాకు కాదు కానీ సరైన కారణము ఉంటే, అప్పుడు ఇంకెవరి ద్వారానైనా మురళిని వినండి. ఎవరైతే - మురళి పట్ల అంతటి మహత్వాన్ని ఉంచుతాను అని భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. అచ్ఛా, ఇక్కడైతే అంతా కనిపిస్తూ ఉంది, బాబా వెనుక ఉన్నవారిని కూడా చూస్తున్నారు. అచ్ఛా, చాలా మంచిది. బాబా మధ్యమధ్యలో పేపరు తీసుకుంటారు - ఈ రోజు ఎవరైతే మురళి వినలేదో, వారి గురించి టీచరు వ్రాసి పంపాలి అని. ఇష్టమే కదా. అచ్ఛా. ఈ రోజు బ్రహ్మాబాబా ప్రతి బిడ్డను కలిసి చాలా చాలా స్నేహముతో ప్రతి బిడ్డకు నయనాల ద్వారా స్నేహాన్ని అందిస్తున్నారు. అచ్ఛా!

డబుల్ విదేశీ సోదరీ-సోదరులతో:- విదేశీయులకు సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలు బాగున్నాయి. బాప్ దాదా పిల్లలందరికీ ఇదే చెప్తున్నారు - సేవను బాగా చేయండి ఎందుకంటే సమయము ఎప్పుడైనా మారవచ్చు. మీరు సేవ చేయాలనుకున్నా కానీ చేయలేని సమయము కూడా రానున్నది, అందుకే ఏది చేయాలన్నా అది ఇప్పుడే చేయండి. ఎప్పుడో అని అనకండి, ఇప్పుడే. బాప్ దాదా ఎప్పుడూ చెప్తూ ఉంటారు - రేపటిపై ఎప్పుడూ వదలకండి. ఈ రోజుపై కూడా వదలకండి, ఇప్పుడే. ఎందుకంటే సమయము మరియు పంచ తత్వాలు బాబా వద్దకు వస్తున్నాయి, ఈ దుఃఖము ఎప్పటివరకు ఉంటుందో మాకు చెప్పండి అని అడుగుతున్నాయి! అవి స్వయము దుఃఖితులు అవుతుంటే మరి ఏమి చేస్తాయి? అవి మనుష్యాత్మలను కూడా దుఃఖితులుగా చేస్తాయి కదా. అందుకే ఎవరైతే వచ్చారో వారు ఏమని సంకల్పము చేయాలంటే - ఎలా అయితే బ్రాహ్మణ జీవితము అవసరమో, అలాగే ఇప్పటి సమయమనుసారముగా ప్రతి ఒక్కరికీ సేవ కూడా అవసరమే. చేయండి లేక చేయించండి. ఇకపోతే బాప్ దాదా ఏదైతే హోమ్ వర్కును ఇచ్చారో - మన్ జీత్ జగత్ జీత్ గా అవ్వాల్సిందే, ఇది మీ గాయనమే, దీనిని రిపీట్ చేయాలి. అచ్ఛా!

నలువైపుల నుండి పిల్లల ద్వారా సందేశాలు వచ్చాయి. నలువైపుల నుండి వచ్చిన ప్రేమతో కూడిన మధురాతి మధురమైన భావాలు మరియు రకరకాల మాటలలో చూపించిన స్మృతి అందింది. నలువైపుల నుండి రకరకాల ఉత్తరాలు వచ్చాయి. అన్నిటికీ బాప్ దాదా రెస్పాండ్ అవుతున్నారు. ప్రతి బిడ్డ స్నేహముతో బాబా మనసులో ఇమిడి ఉన్నారు. బాబా మరియు పిల్లల ఈ అవినాశీ స్నేహము అనాది, అవినాశీ అయినది. బాబా మరియు పిల్లల మిలనము సంగమయుగమంతా నిశ్చితమయ్యే ఉంది. అచ్ఛా!

ఇప్పుడు ఏ పిల్లలైతే సమ్ముఖముగా ఉన్నారో లేక దూరముగా ఉండి కూడా చూస్తున్నారో, బాప్ దాదా ఏమి విన్నారంటే, ఇప్పుడైతే నలువైపులా పిల్లలు ప్రతి దేశములో సెంటరుకు కూడా వెళ్ళి చూస్తున్నారు, వింటున్నారు, రాత్రి ఎంత సమయము అయినా కానీ చూస్తున్నారు. ఈ సైన్సు సాధనాలు కూడా మీ కోసమే వెలువడ్డాయి మరియు మీకే లాభము కలుగుతూ ఉంది. ఒకవేళ సైన్సు ద్వారా వినాశనమైనా కానీ అది మీ రాజ్యము కోసమే జరుగుతుంది. నలువైపులా ఉన్న స్నేహీ పిల్లలు విశేషముగా బ్రహ్మాబాబా యొక్క ప్రియస్మృతులను, హృదయపూర్వక అనురాగాన్ని మరియు హృదయపూర్వక ప్రేమను స్వీకరించగలరు.

వరదానము:-
సత్యత మరియు స్వచ్ఛత యొక్క ధారణ ద్వారా సామీప్యతను అనుభవం చేసే సంపూర్ణ మూర్త భవ

అన్ని ధారణలలోకి ముఖ్యమైన ధారణ - సత్యత మరియు స్వచ్ఛత. పరస్పరము ఒకరి పట్ల ఒకరికి హృదయములో పూర్తి స్వచ్ఛత ఉండాలి. ఏ విధముగా స్వచ్ఛమైన వస్తువులో అన్నీ స్పష్టముగా కనిపిస్తాయో, అదే విధముగా ఇతరుల భావనలు, భావ-స్వభావాలు స్పష్టముగా కనిపించాలి. ఎక్కడైతే సత్యత మరియు స్వచ్ఛత ఉంటాయో, అక్కడ సామీప్యత ఉంటుంది. ఏ విధముగా బాప్ దాదాకు సమీపముగా ఉన్నారో అలా పరస్పరములో కూడా హృదయపూర్వకముగా సమీపముగా ఉండాలి. స్వభావాలలోని భిన్నత్వము సమాప్తమైపోవాలి. దాని కొరకు మనసులోని భావాలను మరియు స్వభావాలను కలుపుకోవాలి. ఎప్పుడైతే స్వభావాలలో తేడా కనిపించదో, అప్పుడు సంపూర్ణ మూర్తులు అని అంటారు.

స్లోగన్:-
పాడైపోయినవారిని తీర్చిదిద్దడమే అన్నింటికన్నా పెద్ద సేవ.

అవ్యక్త ప్రేరణలు - జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి

యోగాన్ని జ్వాలా రూపముగా చేసేందుకు సెకెండులో బిందు స్వరూపులుగా అయ్యి మనసు-బుద్ధిని ఏకాగ్రము చేసే అభ్యాసాన్ని పదే-పదే చెయ్యండి. స్టాప్ అని అనగానే సెకెండులో వ్యర్థమైన దేహభానము నుండి మనసు-బుద్ధి ఏకాగ్రమవ్వాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ ను మొత్తము రోజంతటిలో ఉపయోగించండి. శక్తిశాలి బ్రేక్ ద్వారా మనసు-బుద్ధిని కంట్రోల్ చెయ్యండి, మనసు-బుద్ధిని ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ సెకెండులో పెట్టగలగాలి.

విశేష సూచన:- మాసములోని మూడవ ఆదివారము యొక్క యోగాభ్యాసము

ఈ రోజు మాసములోని మూడవ ఆదివారము, సోదరీ-సోదరులందరూ సంగఠిత రూపములో కలిసి సాయంత్రము 6.30 నుండి 7.30 గం.ల వరకు మీ ఫరిశ్తా స్వరూపము ద్వారా భ్రమిస్తున్న దుఃఖిత, అశాంత ఆత్మలకు సుఖ-శాంతుల పవిత్ర కిరణాలను ఇచ్చి వారికి ఆధార దాతలుగా అయి తండ్రి అయిన పరమాత్ముని యొక్క స్మృతిని ఇప్పించే సేవ చేయండి.