20-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - బికారి నుండి రాకుమారునిగా అయ్యేందుకు ఆధారము పవిత్రత, పవిత్రముగా అవ్వడము ద్వారానే పవిత్ర ప్రపంచము యొక్క రాజ్యాధికారము లభిస్తుంది’’

ప్రశ్న:-
ఈ పాఠశాలలోని ఏ పాఠము మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తుంది?

జవాబు:-
మీరు ఈ పాఠశాలలో ప్రతిరోజు ఇదే పాఠాన్ని చదువుతారు, అదేమిటంటే - నేను శరీరాన్ని కాదు, ఆత్మను. ఆత్మాభిమానులుగా అవ్వడముతోనే మీరు మనుష్యుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణునిగా అవుతారు. ఈ సమయములో మనుష్యమాత్రులందరూ పూజారులుగా అనగా పతితులుగా, దేహాభిమానులుగా ఉన్నారు, అందుకే పతిత-పావనుడైన తండ్రిని పిలుస్తూ ఉంటారు.

పాట:-
ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి...

ఓంశాంతి
ఓంశాంతి అని ఎవరన్నారు అనేది పిల్లలకు తెలుసు. ఏ పిల్లలకు? ఓంశాంతి అని ఎవరి ఆత్మ చెప్పింది అనేది ఆత్మలకు తెలుసు. పరమపిత పరమాత్మ చెప్పారు. ఇది మనుష్యాత్మ చెప్పలేదు, పరమపిత పరమాత్మ శివుడు చెప్పారని పిల్లలకు తెలుసు. వారు సర్వులకు తండ్రి, ఉన్నతోన్నతమైనవారు. భారత్ పై మాయ నీడ చాలా విస్తరించి ఉందని ఇప్పుడు పాటలో విన్నారు. చాలా పతితముగా అయిపోయారు, అందుకే - ఓ పతిత-పావనా, పావనముగా తయారుచేయడానికి మళ్ళీ రండి అని పిలుస్తారు. ఆత్మయే తన తండ్రిని పిలుస్తుంది, వారిని భగవంతుడని అంటారు. వారినే పతిత-పావనుడని అంటారు. ఆ ఒక్కరికే మహిమ జరుగుతుంది. వారు ఆత్మలందరికీ అనంతమైన తండ్రి. ఇక్కడ అందరూ పతితముగా అయిపోయారు, అందుకే ఓ పరమపిత పరమాత్మ, అని పిలుస్తారు. వారే జ్ఞాన సాగరుడు కూడా, పతిత-పావనుడు కూడా. వారు తండ్రి కూడా, శిక్షకుడు కూడా ఎందుకంటే వారు జ్ఞాన సాగరుడు కూడా, వరల్డ్ అథారిటి కూడా. వారు వేదాలు, శాస్త్రాలు, గ్రంథాలు, అన్నీ తెలిసినవారు కూడా. వారినే నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. కనుక ఈ సమయములో అందరూ పారలౌకిక తండ్రిని పిలుస్తారు ఎందుకంటే అందరూ దుఃఖితులుగా ఉన్నారు. వారిని గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. వారికి పేరు కూడా ఉండాలి కదా. వారిని శివబాబా అనే పేరుతో పిలుస్తారు. వారే ఉన్నతోన్నతమైన జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, శాంతి సాగరుడు. మనుష్యాత్మ తన తండ్రిని మహిమ చేస్తుంది. ఉన్నతోన్నతమైన ఆత్మ ఎవరిది? పరమపిత పరమాత్మునిది. వారు పరమ్ (ఉన్నతమైనవారు). పతిత మనుష్యులు వారిని స్మృతి చేస్తారు. సత్యయుగములో పావన భారత్ ఉన్నప్పుడు, దేవీ-దేవతల రాజ్యము ఉన్నప్పుడు పతితులెవ్వరూ ఉండేవారు కాదు. ఇది తమోప్రధాన ప్రపంచము అనగా ఈ ప్రపంచములో ఉన్న మనుష్యులందరూ పాపాత్ములు. ఇదే భారత్ పావనముగా ఉండేది, ఇదే భారత్ పతితముగా అయిపోయింది. ఇక్కడ కలియుగములో అందరూ పతితముగా ఉన్నారు. జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడైన పరమపిత పరమాత్మ పరంధామము నుండి వచ్చి మనల్ని బ్రహ్మా ద్వారా చదివిస్తున్నారని మీకు తెలుసు. తప్పకుండా వారికి శరీరమైతే కావాలి కదా. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. అథారిటీ అయిన జ్ఞాన సాగరునికే అంతా తెలుసు. భారత్ లో విష్ణు నాభి నుండి బ్రహ్మా వెలువడినట్లుగా చిత్రము కూడా చూపిస్తారు, బ్రహ్మా చేతిలో శాస్త్రాలను చూపిస్తారు. ఇప్పుడు విష్ణువేమీ అన్ని శాస్త్రాల సారాన్ని వినిపించరు. జ్ఞాన సాగరుడైన పరమపిత పరమాత్మ, బ్రహ్మా ద్వారా అన్ని శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. బ్రహ్మా-విష్ణు-శంకరులకు కూడా వారే రచయిత. బ్రహ్మాను లేక విష్ణువును జ్ఞాన సాగరుడని అనరు. ఇక శంకరుని విషయాన్ని అయితే వదిలేయండి. ఇప్పుడు జ్ఞాన సాగరుడు ఎవరు? నిరాకారుడైన ఉన్నతోన్నతమైన పరమాత్మయే పతిత-పావనుడు. ఈ మహిమ ఆ పరమపిత పరమాత్మునిది. ఇక్కడ కూడా ఆత్మకే మహిమ జరుగుతుంది. ఆత్మయే శరీరము ద్వారా - నేను ప్రెసిడెంటును, నేను బ్యారిస్టరును, నేను ఫలానా మినిస్టరును అని అంటుంది. ఆత్మయే పదవి తీసుకుంటుంది. నేను ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటానని ఆత్మ శరీరము ద్వారా అంటుంది. ఈ సమయములో తండ్రి వచ్చినప్పుడు - పిల్లలూ, ఆత్మాభిమానులుగా అవ్వండి అని అంటారు. మీకు ఈ పాఠాన్ని నేర్పించేందుకే మీ తండ్రినైన నేను వచ్చాను. ఇది మనుష్యుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అయ్యే పాఠశాల. ఓ పరమపిత పరమాత్మ, ఇప్పుడు నిరాకారీ ప్రపంచము నుండి సాకారీ ప్రపంచములోకి రండి, రూపాన్ని మార్చుకుని రండి అని ఆత్మలందరూ తండ్రిని పిలుస్తారు. నిరాకారీ ఆత్మలైన మీరు శరీరములోకి వచ్చినప్పుడు గర్భములో ప్రవేశిస్తారు, పునర్జన్మలు తీసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు 84 జన్మలు గర్భము ద్వారానే తీసుకున్నారు. ఒక శరీరాన్ని వదిలి మళ్ళీ గర్భములోకి వెళ్తారు, ఇలా 84 జన్మలు తీసుకుంటారు. నేనైతే గర్భములో ప్రవేశించను. భారతవాసులు వాస్తవానికి దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు. తర్వాత మెట్లు కిందకు దిగుతూ వచ్చారు, క్షత్రియ వర్ణములోకి, తర్వాత వైశ్య, శూద్ర వర్ణాలలోకి వస్తూ కళలు తగ్గిపోతూ ఉంటాయి. భారత్ 16 కళల సంపూర్ణముగా ఉండేది, తర్వాత 14 కళలు కలదిగా అయ్యింది. భారతవాసులకు తమ జన్మల గురించి తెలియదు. 84 జన్మలను భారతవాసులే తీసుకుంటారు. ఇంకే ధర్మము వారు 84 జన్మలు తీసుకోరు. మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యారు, ఇది జ్ఞానము యొక్క విషయము. స్వదర్శన చక్రధారులుగా అవ్వడముతో మీరు స్వర్గానికి చక్రవర్తి మహారాజులుగా అవుతారు. మనము పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు ఇక్కడకు వచ్చామని మీకు మంచి రీతిలో తెలుసు. ఇది ఉన్నదే పతిత ప్రపంచము. పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత అయితే ఒక్క తండ్రి మాత్రమే. అందరూ వారినే పిలుస్తారు. తండ్రిని స్మృతి చేస్తారు, శ్రీకృష్ణుడిని కాదు. శ్రీకృష్ణుడు గీతను వినిపించలేదు. గీత సర్వశాస్త్రమయి శిరోమణి. భారత్ యొక్క గీత ఏ ధర్మానికి చెందిన శాస్త్రము? ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందిన శాస్త్రము. గీతను ఎవరు వినిపించారు? రాజయోగాన్ని ఎవరు నేర్పించారు? పరమపిత పరమాత్మ పతిత-పావనుడైన తండ్రి నేర్పించారు. నిరాకారిగా ఉండే మీ ఆత్మ ఇప్పుడు ఈ సాకార శరీరాన్ని ధారణ చేసింది. సాకార మనుష్యులను ఎప్పుడూ భగవంతుడని అనరు. సత్యయుగములో లక్ష్మీ-నారాయణులు ఉంటారు కానీ వారిని కూడా భగవంతుడని అనరు. ఇది కేవలం ఒక టైటిల్ లా వారికి ఇవ్వడము జరుగుతుంది. నియమానుసారముగా భగవంతుడు ఒక్కరే. రచయిత ఒక్కరే. ఇకపోతే, లక్ష్మీ-నారాయణులు దేవతలు. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయము. అప్పుడు ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది, వారిని మహారాజు-మహారాణి అని అనేవారు. భగవంతుడు మహారాజుగా అవ్వరు. వారు తండ్రే, వారు వచ్చి భారతవాసులను ఇటువంటి దేవీ-దేవతలుగా తయారుచేస్తారు. ఇప్పుడైతే దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు ఎవరూ లేరు. ఇక్కడున్న వారిని రావణ సాంప్రదాయులు అని అంటారు ఎందుకంటే ఇది రావణ రాజ్యము. రావణుడిని ప్రతి సంవత్సరము కాలుస్తూ ఉంటారు ఎందుకంటే అతను పాత శత్రువు, కానీ భారతవాసులకు అతని గురించి తెలియదు. రావణుడు ఎవరు, రావణుడికి 10 తలలు ఎందుకు చూపించారు అన్నదాని గురించి శాస్త్రాలలో కూడా వర్ణణ లేదు. ఈ విషయాలను మంచి రీతిలో అర్థం చేసుకోవాలి. మనుష్యులైతే పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. ఈ లక్ష్మీ-నారాయణులు మొదలైనవారిని పారసబుద్ధి కలవారని అంటారు. పారసనాథుడు, పారసనాథిని యొక్క రాజ్యముండేది. అక్కడ యథా రాజా రాణి, తథా ప్రజ ఉండేవారు. భారత్ వంటి సుఖధామముగా ఇంకే ఖండము ఉండదు. భారత్ స్వర్గముగా ఉన్నప్పుడు, ఎటువంటి అనారోగ్యము, దుఃఖము, రోగము ఉండేవి కావు. సంపూర్ణ సుఖముండేది. ఈశ్వరుని మహిమ అపారమైనదని అంటూ ఉంటారు. అలానే భారత్ మహిమ కూడా అపారమైనది. మొత్తమంతా పవిత్రత పైనే ఆధారపడి ఉంది. పిలవడము కూడా అందరూ పతితముగా ఉన్నాము అనే పిలుస్తూ ఉంటారు. శాంతి లేదు, సంపద కూడా లేదు. భారతవాసులైన మనము సూర్యవంశీ దేవీ-దేవతలుగా ఉండేవారము, తర్వాత నెమ్మది-నెమ్మదిగా పతితముగా అయ్యామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. దీనిని మృత్యులోకమని అంటారు. దీనికి నిప్పు అంటుకోనున్నది. ఇది శివ జ్ఞాన యజ్ఞము, దీనిని రుద్ర జ్ఞాన యజ్ఞమని కూడా అంటారు. మనుష్యులు పేర్లు అయితే ఎన్నో పెడతారు. శివుని మూర్తిని ఎక్కడ చూసినా, అక్కడ ఎన్నో రకరకాల పేర్లు పెట్టేస్తారు. ఒక్కరికే అనేక పేర్లతో మందిరాలు నిర్మిస్తారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - జ్ఞానము, భక్తి, వైరాగ్యము. ఇప్పుడు భక్తి పూర్తవుతుంది, మీకు భక్తి పట్ల వైరాగ్యము కలుగుతుంది అనగా ఈ పాత ప్రపంచము పట్ల వైరాగ్యము కలుగుతుంది. ఈ పాత ప్రపంచము వినాశనమవ్వనున్నది.

బాబా, మేము పతితము నుండి పావనముగా ఎలా అవ్వాలి అని పిల్లలు అడుగుతారు. కొంతమంది కొత్తవారు వస్తారు, వారిని లోపలికి అనుమతించడము జరగదు. ఎలాగైతే ఎవరైనా కొత్తవారు వెళ్ళి కాలేజిలో కూర్చున్నట్లయితే, ఏమీ అర్థం చేసుకోలేరు. మనుష్యుల నుండి దేవతలుగా ఎలా తయారవుతున్నారు అనేది ఇంకెవరికీ తెలియనే తెలియదు. పతితముగా ఉన్న మనుష్యులే పావనముగా అవుతారు. ఈ సమయములో భారత్ కూడా బికారిగా ఉంది. సత్యయుగములో భారత్ రాకుమారునిలా ఉండేది. శ్రీకృష్ణుడు సత్యయుగము యొక్క మొదటి నంబర్ రాకుమారుడు. వారిలో అన్ని గుణాలు ఉన్నాయి. రాజ్యము లక్ష్మీ-నారాయణులది అని అంటారు. శ్రీకృష్ణుడైతే రాకుమారునిగా ఉండేవారు, రాధ రాకుమారిగా ఉండేవారు. సర్వగుణ సంపన్నుడు, 16 కళల సంపూర్ణుడు... అని రాకుమారుడైన శ్రీకృష్ణుని గురించే మహిమ చేయడము జరుగుతుంది. వారు గీతనేమీ వినిపించలేదు. వారు సత్యయుగము యొక్క రాకుమారుడు. శ్రీకృష్ణుడు పతిత మనుష్యులను పావనముగా చేయడానికి గీతా పాఠాన్ని వినిపించడమనేది జరగదు. అవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలు. శాస్త్రాలకు ఎంత మహిమ ఉంది. సత్యయుగములో భక్తి మార్గపు శాస్త్రాలు, చిత్రాలు మొదలైనవేవీ ఉండవు. అక్కడ 21 జన్మల కొరకు జ్ఞానము యొక్క ప్రారబ్ధము ఉంటుంది. మీరు మళ్ళీ సత్యయుగ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు. భారతవాసులు 5 వేల సంవత్సరాల క్రితం సత్యయుగములో విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఆ సమయములో వేరే పార్టిషన్లు మొదలైనవేవీ ఉండేవి కాదు. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయము. ఇప్పుడిది కలియుగము యొక్క అంతిమము కదా. వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. భగవంతుడు పతిత కలియుగాన్ని పావన సత్యయుగముగా తయారుచేయడానికి ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచించారు కనుక తప్పకుండా పతిత ప్రపంచము యొక్క వినాశనము జరుగుతుంది. బ్రహ్మా ద్వారా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క స్థాపన అని అంటూ ఉంటారు, అది ఇప్పుడు శివబాబా బ్రహ్మా ద్వారా చేయిస్తున్నారు. మీరు ఇప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా స్థాపన చేయిస్తారని అంటూ ఉంటారు కూడా. వారు ప్రజాపిత, అందరూ వారి సంతానము. తప్పకుండా బ్రహ్మా ద్వారానే స్వర్గ స్థాపన జరిగింది. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం కూడా, మీకు ఈ రాజయోగాన్ని నేర్పించడానికి నేను సంగమములో వచ్చాను. శ్రీకృష్ణుడు కాదు, నేను వచ్చాను. శ్రీకృష్ణుడు పతిత ప్రపంచములోకి రాలేరు. తండ్రియే వస్తారు. వారే సర్వుల సద్గతిదాత. మనుష్యులు మనుష్యులకు సద్గతిని ఇవ్వలేరు. స్మృతి కూడా అందరూ ఒక్కరినే చేస్తారు. పరమపిత పరమాత్మ ఎక్కడ ఉంటారు? వారు పరంధామములో ఉంటారని పిల్లలైన మీకు తెలుసు. అది బ్రహ్మ మహాతత్వము. అక్కడ ఆత్మలు పవిత్రముగా ఉంటాయి, మహాత్ముల వలె ఉంటాయి. ఇక్కడ కూడా మహాన్ ఆత్మ, పతితాత్మ అని అంటారు కదా. వాస్తవానికి ఇక్కడ మహాన్ ఆత్మలు ఒక్కరు కూడా లేరు. ఆత్మయే పావనముగా, సతోప్రధానముగా అవ్వాలి, అది కూడా జ్ఞాన-యోగాల ద్వారా, నీటి ద్వారా కాదు. ఆత్మయే పతితముగా అయ్యింది. ఆత్మలోనే మాలిన్యము చేరుతుంది. ఆత్మయే బంగారములా, వెండిలా, రాగిలా, ఇనుములా అవుతుంది. ఇప్పుడు పతితముగా ఉన్న ఆత్మలను పావనముగా ఎవరు తయారుచేస్తారు! పరమపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ తయారుచేయలేరు. తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తున్నారు - నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా పతితము నుండి పావనముగా అవుతారు. ఇందులోనే శ్రమ ఉంది. ఈ చక్రము ఎలా తిరుగుతుంది, మనము 84 జన్మలు ఎలా తీసుకుంటాము, సత్యయుగములో ఎంత సమయము రాజ్యము నడుస్తుంది, తర్వాత రావణుడు ఎలా వస్తాడు అనే జ్ఞానమంతా బుద్ధిలో ఉంది. రావణుడు అంటే ఎవరు అనేది కూడా ఎవరికీ తెలియదు. ఎప్పటినుండి రావణుడిని కాలుస్తూ వస్తున్నారు అనేది కూడా ఎవరికీ తెలియదు. ప్రతి సంవత్సరము కాలుస్తారు. సత్యయుగములోనైతే కాల్చరు. ఇప్పుడు ఉన్నదే రావణ రాజ్యము. రామ రాజ్యాన్ని అయితే ఎవ్వరూ స్థాపన చేయలేరు, ఇది కేవలం తండ్రి పని మాత్రమే. పతిత మనుష్యులు చేయలేరు. వారందరూ వినాశనమైపోతారు. పతిత ప్రపంచమే వినాశనమవ్వనున్నది. సత్యయుగములో ఒక్కరూ కూడా - ఓ పతిత-పావనా రండి అని పిలవరు. అది పావన ప్రపంచము కదా. ఈ లక్ష్మీ-నారాయణులను ఇలా స్వర్గానికి యజమానులుగా ఎవరు తయారుచేసారు, తర్వాత వీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారు అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారే 84 జన్మలు తీసుకున్నారు. వారే ఈ సమయములో శూద్ర వంశీయులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వంశీయులుగా అవుతారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు పిలక వంటివారు. బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణ కుల భూషణులే ఉన్నతోన్నతమైనవారు, పిలకవంటి వారు. ఇప్పుడు మీరు శివబాబాకు పిల్లలు కూడా, మనవలు, మనవరాళ్ళు కూడా. మీరు శివవంశీయులు మరియు బ్రహ్మాకుమార-కుమారీలు. వారసత్వము తాతగారి నుండి లభిస్తుంది. తండ్రి అంటారు - నన్ను నిరంతరము స్మృతి చేయండి, పావనముగా అయినట్లయితే మీరు నా వద్దకు ముక్తిధామములోకి వచ్చేస్తారు. ఎవరైతే కల్పక్రితం ఈ విషయాలను అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు. అటువంటివారు వేల సంఖ్యలో ఉన్నారు. ఎంతమంది బి.కె.లు ఉన్నారు అని కొంతమంది అడుగుతారు. వేల సంఖ్యలో ఉన్నారని చెప్పండి. ఈ దైవీ వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క అంటు కట్టబడుతుంది ఎందుకంటే దేవతా ధర్మము ఇప్పుడు లేదు. అందరూ తమను తాము హిందువులమని చెప్పుకుంటూ ఉంటారు. ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. మళ్ళీ అందరూ తిరిగి వచ్చేస్తారు, వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖము యొక్క వారసత్వాన్ని పొందేందుకు అనగా మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పతితము నుండి పావనముగా అయ్యేందుకు జ్ఞానము మరియు యోగములో దృఢముగా ఉండాలి. ఆత్మలో ఏదైతే మాలిన్యము చేరిందో, దానిని స్మృతి యొక్క కృషితో తొలగించుకోవాలి.

2. బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులైన మేము పిలక వంటి వారము, ఈ నషాలో ఉండాలి. బ్రాహ్మణులే వారసత్వానికి అధికారులు ఎందుకంటే వారు శివబాబాకు మనవలు.

వరదానము:-
తమ శక్తిశాలి వృత్తి ద్వారా పతిత వాయుమండలాన్ని పరివర్తన చేసే మాస్టర్ పతిత-పావని భవ

ఎటువంటి వాయుమండలము ఉన్నా కానీ స్వయము యొక్క శక్తిశాలి వృత్తి, వాయుమండలాన్ని పరివర్తన చేయగలదు. వాయుమండలము వికారీగా ఉన్నా కానీ స్వయము యొక్క వృత్తి నిర్వికారిగా ఉండాలి. ఎవరైతే పతితులను పావనముగా తయారుచేస్తారో, వారు పతిత వాయుమండలానికి వశీభూతులు అవ్వలేరు. మాస్టర్ పతిత-పావనులుగా అయి స్వయము యొక్క శక్తిశాలి వృత్తి ద్వారా అపవిత్రమైన లేక బలహీనమైన వాయుమండలాన్ని తొలగించండి, అంతేకానీ దానిని వర్ణన చేసి వాయుమండలాన్ని తయారుచేయకండి. బలహీనమైన లేక పతిత వాయుమండలాన్ని వర్ణన చేయడము కూడా పాపమే.

స్లోగన్:-
ఇప్పుడు ధరణిలో పరమాత్మ పరిచయమనే బీజాన్ని వేసినట్లయితే ప్రత్యక్షత జరుగుతుంది.

అవ్యక్త ప్రేరణలు - జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి

యోగము అనగా శాంతి శక్తి. ఈ శాంతి శక్తి చాలా సహజముగా స్వయాన్ని మరియు ఇతరులను పరివర్తన చేస్తుంది, దీని ద్వారా వ్యక్తులు కూడా పరివర్తన అవుతారు మరియు ప్రకృతి కూడా పరివర్తన అవుతుంది. వ్యక్తులకైతే నోటి ద్వారా కోర్సు చేయిస్తారు కానీ ప్రకృతిని పరివర్తన చేయడానికి శాంతి శక్తి అనగా యోగబలమే కావాలి. యోగములో ఎప్పుడైతే ఇతర సంకల్పాలన్నీ శాంతిస్తాయో, ‘‘బాబా మరియు నేను’’ అన్న ఈ ఒక్క సంకల్పమే ఉంటుందో, దీనినే శక్తిశాలి యోగము అని అంటారు. బాబా మిలనము యొక్క అనుభూతి తప్ప మిగిలిన సంకల్పాలన్నీ ఇమిడిపోవాలి, అప్పుడు జ్వాలా రూపపు స్మృతి అని అంటారు, దాని ద్వారా పరివర్తన జరుగుతుంది.