21-02-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు తండ్రి వద్దకు నిద్రించి ఉన్న మీ భాగ్యాన్ని మేలుకొలుపుకునేందుకు వచ్చారు, భాగ్యము మేలుకోవడము అనగా విశ్వానికి యజమానులుగా అవ్వడము’’

ప్రశ్న:-
ఏ ఔషధము పిల్లలైన మిమ్మల్ని తండ్రి సమానముగా వివేకవంతులుగా చేస్తుంది?

జవాబు:-
ఈ చదువు పిల్లలైన మీ బుద్ధికి ఔషధము వంటిది. ఎవరైతే ప్రతిరోజు చదువుకుంటారో అనగా ఈ ఔషధాన్ని తీసుకుంటారో, వారి బుద్ధి పారసముగా అవుతుంది. పారసనాథుడైన తండ్రి బుద్ధిశాలుల బుద్ధి వంటివారు, వారు మిమ్మల్ని తమ సమానముగా పారసబుద్ధి కలవారిగా తయారుచేస్తారు.

పాట:-
భాగ్యాన్ని మేలుకొలుపుకుని వచ్చాను...

ఓంశాంతి
పాటలోని లైనును విన్నప్పుడు కూడా మధురాతి మధురమైన పిల్లలకు రోమాలు నిక్కబొడుచుకోవాలి. వాస్తవానికి ఇది సాధారణమైన పాటే కానీ దీని సారము ఇంకెవ్వరికీ తెలియదు. తండ్రియే వచ్చి పాటల అర్థాన్ని, శాస్త్రాలు మొదలైనవాటి అర్థాలను అర్థం చేయిస్తారు. కలియుగములో అందరి భాగ్యము నిద్రించి ఉందని, సత్యయుగములో అందరి భాగ్యము మేల్కొని ఉందని ఇది కూడా మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. నిద్రించి ఉన్న భాగ్యాన్ని మేలుకొలిపేవారు మరియు శ్రీమతాన్ని ఇచ్చేవారు మరియు పురుషార్థము చేయించేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారే కూర్చుని పిల్లల భాగ్యాన్ని మేలుకొలుపుతారు. పిల్లలు జన్మించగానే వారి భాగ్యము మేల్కొంటుంది. పిల్లలు జన్మించగానే, మేము వారసులమని వారికి తెలిసిపోతుంది. అదే విధముగా, ఇది అనంతమైన విషయము. కల్ప-కల్పము మా భాగ్యము మేల్కొంటుంది, మళ్ళీ నిద్రిస్తుంది అని పిల్లలకు తెలుసు. పావనముగా అయినప్పుడు భాగ్యము మేల్కొంటుంది. పావన గృహస్థ ఆశ్రమమని అంటారు. ఆశ్రమము అనే పదము పవిత్రమైనది. పవిత్ర గృహస్థ ఆశ్రమము ఉంటుంది, దీనికి విరుద్ధముగా అపవిత్రమైన పతిత గృహస్థ ధర్మము ఉంటుంది. దీనిని ఆశ్రమమని అనరు. గృహస్థ ధర్మమైతే అందరికీ ఉంటుంది. జంతువులలో కూడా ఉంటుంది. అందరూ పిల్లలకు జన్మనిస్తారు. జంతువులు విషయములో కూడా అవి గృహస్థ ధర్మములో ఉన్నాయని అంటారు. మేము స్వర్గములో పవిత్ర గృహస్థ ఆశ్రమములో ఉండేవారమని, దేవీ-దేవతలుగా ఉండేవారమని ఇప్పుడు పిల్లలకు తెలుసు. సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు... అని వారి మహిమను కూడా పాడుతారు. మీరు స్వయం కూడా పాడేవారు. మేము మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతున్నామని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మనుష్యుల నుండి దేవతలుగా మార్చడానికి భగవంతుడికి ఎంతో సమయము పట్టదు అన్న గాయనము కూడా ఉంది. బ్రహ్మా-విష్ణు-శంకరులను కూడా దేవతలని అంటారు. బ్రహ్మా దేవతాయ నమః అని అంటారు, కానీ శివ పరమాత్మాయ నమః అని అంటారు. ఇప్పుడు దాని అర్థం కూడా మీకు తెలుసు. వారైతే కేవలం అంధవిశ్వాసముతో అంటారు. ఇప్పుడు, శంకర దేవతాయ నమః అని అంటారు, కానీ శివుని విషయములో శివ పరమాత్మాయ నమః అని అంటారు, అంటే తేడా ఉంది కదా. వారు దేవత అయినట్లు, వీరు పరమాత్మ అయినట్లు. శివుడిని మరియు శంకరుడిని ఒకరే అని అనలేరు. మనము నిజంగానే రాతిబుద్ధి కలవారిగా ఉండేవారమని, ఇప్పుడు పారసబుద్ధి కలవారిగా అవుతున్నామని మీకు తెలుసు. దేవతలనైతే రాతిబుద్ధి కలవారని అనరు. మళ్ళీ డ్రామానుసారముగా రావణ రాజ్యములో మెట్లు దిగాల్సి ఉంటుంది, పారసబుద్ధి నుండి రాతిబుద్ధి కలవారిగా అవ్వాల్సి ఉంటుంది. అందరికంటే వివేకవంతులైతే ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు మీ బుద్ధిలో శక్తి లేదు. అటువంటివారిని తండ్రి కూర్చుని పారసబుద్ధి కలవారిగా తయారుచేస్తారు. మీరు ఇక్కడకు పారసబుద్ధి కలవారిగా తయారయ్యేందుకు వచ్చారు. పారసనాథుని మందిరాలు కూడా ఉన్నాయి. అక్కడ మేళాలు జరుగుతాయి. కానీ పారసనాథుడు ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. వాస్తవానికి పారసముగా తయారుచేసేవారు తండ్రి మాత్రమే. వారు బుద్ధిశాలుల బుద్ధి వంటివారు. ఈ జ్ఞానము పిల్లలైన మీ బుద్ధికి ఔషధము వంటిది, దీనితో బుద్ధి ఎంతగా మారుతుంది. ఈ ప్రపంచము ముళ్ళ అడవి. ఒకరికొకరు ఎంత దుఃఖాన్ని ఇచ్చుకుంటారు. ఇప్పుడు ఉన్నది తమోప్రధాన రౌరవ నరకము. గరుడ పురాణములోనైతే చాలా ఆసక్తికరమైన విషయాలను వ్రాసేశారు.

ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధికి ఔషధము లభిస్తుంది. అనంతమైన తండ్రి ఔషధాన్ని ఇస్తున్నారు. ఇది చదువు. దీనిని జ్ఞానామృతమని కూడా అంటారు. ఇది నీరు మొదలైనవాటి విషయమేమీ కాదు. ఈ రోజుల్లో అన్ని వస్తువులను అమృతమని అనేస్తున్నారు. గంగా జలాన్ని కూడా అమృతమని అంటారు. దేవతల పాదాలను కడిగి ఆ నీటిని పెట్టుకుంటారు, దానిని అమృతమని అంటారు. ఇప్పుడిది కూడా బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయము కదా. ఆ దోసిలి నీరు అమృతమా లేక పతిత-పావని అయిన గంగా జలము అమృతమా? వారు ఏదైతే దోసిలితో నీరు ఇస్తారో, అది పతితులను పావనముగా చేస్తుందని అనరు, గంగా జలాన్ని పతిత-పావని అని అంటారు. మనుష్యులు మరణించేటప్పుడు గంగా జలము నోటిలో ఉండాలని అంటారు. అర్జునుడు బాణము వేసి అమృత జలాన్ని తాగించినట్లుగా చూపిస్తారు. పిల్లలైన మీరు బాణాలు మొదలైనవేవీ వేయలేదు. బాణాలతో యుద్ధము చేసే గ్రామము ఒకటి ఉంది. అక్కడి రాజును ఈశ్వరుని అవతారమని అంటారు. కానీ ఎవ్వరూ కూడా ఈశ్వరుని అవతారముగా అవ్వలేరు. వాస్తవానికి సర్వుల సద్గతిదాత అయిన సత్యాతి-సత్యమైన సద్గురువైతే ఒక్కరే. వారు ఆత్మలందరినీ తమతో పాటు తీసుకువెళ్తారు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ తిరిగి తీసుకువెళ్ళలేరు. బ్రహ్మతత్వములో లీనమయ్యే విషయము కూడా లేదు. ఈ నాటకము తయారై ఉంది. సృష్టి చక్రము అనాదిగా తిరుగుతూనే ఉంటుంది. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు ఎలా రిపీట్ అవుతాయి అనేది ఇప్పుడు మీకు తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. మనుష్యులు అనగా ఆత్మలు ఆ తండ్రిని ఓ గాడ్ ఫాదర్ అని స్మృతి కూడా చేస్తారు కానీ వారికి ఆ రచయిత అయిన తండ్రి గురించి కూడా తెలియదు. హద్దు తండ్రిని ఎప్పుడూ గాడ్ ఫాదర్ అని అనరు. గాడ్ ఫాదర్ అనే పదాన్ని చాలా గౌరవపూర్వకముగా ఉపయోగిస్తారు. పతిత-పావనుడు, దుఃఖహర్త-సుఖకర్త అని వారి కోసమే పాడుతారు. ఒకవైపు, వారు దుఃఖహర్త-సుఖకర్త అని అంటారు, కానీ ఎప్పుడైనా దుఃఖము కలిగినప్పుడు లేక బిడ్డ మరణించినప్పుడు, ఈశ్వరుడే సుఖ-దుఃఖాలను ఇస్తారని అంటారు. ఈశ్వరుడు నా బిడ్డను తీసుకువెళ్ళిపోయారు, వారేమిటి ఇలా చేసారు అని అంటారు. ఒకవైపు మహిమ చేస్తారు, కానీ ఏదైనా జరిగినప్పుడు ఈశ్వరుడిని నిందిస్తారు. ఈశ్వరుడే బిడ్డను ఇచ్చారని అంటారు కూడా, మరి అటువంటప్పుడు వారు తిరిగి తీసుకుంటే మీరు ఎందుకు ఏడుస్తారు? బిడ్డ ఈశ్వరుని వద్దకే వెళ్ళాడు కదా. సత్యయుగములో ఎప్పుడూ ఎవరూ ఏడవరు. ఏడవవలసిన అవసరమేమీ లేదని తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మ తన లెక్కాచారము బట్టి వెళ్ళి మరొక పాత్రను అభినయించాలి. జ్ఞానము లేని కారణముగా మనుష్యులు ఎంతగా ఏడుస్తారు, పిచ్చివారిలా అయిపోతారు. ఇక్కడైతే తండ్రి అర్థం చేయిస్తున్నారు - తల్లి మరణించినా హల్వా తినాలి... నష్టోమోహులుగా అవ్వాలి. మాకైతే ఒకే ఒక్క అనంతమైన తండ్రి ఉన్నారు, ఇంకెవ్వరూ లేరు. పిల్లల అవస్థ ఈ విధముగా ఉండాలి. మోహజీత్ రాజు కథను కూడా విన్నారు కదా. అవన్నీ కల్పితమైన కథలు. సత్యయుగములో ఎప్పుడూ దుఃఖపు విషయమేమీ ఉండదు. అలాగే ఎప్పుడూ అకాలమృత్యువు ఉండదు.

మనము ఇప్పుడు మృత్యువుపై విజయాన్ని పొందుతామని పిల్లలైన మీకు తెలుసు, తండ్రిని మహాకాలుడని కూడా అంటారు. కాలుడికే కాలుడు అయిన వారు మీరు మృత్యువుపై విజయాన్ని పొందేలా చేస్తారు అనగా మృత్యువు మిమ్మల్ని ఎప్పుడూ కబళించదు. మృత్యువు ఆత్మనైతే కబళించలేదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది, దానినే మృత్యువు కబళించడము అని అంటారు. అంతేకానీ మృత్యువనేది ఒక వస్తువేమీ కాదు. మనుష్యులు మహిమను పాడుతూ ఉంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. అచ్యుతమ్, కేశవమ్... అని పాడుతారు కానీ అర్థమేమీ అర్థం చేసుకోరు. మనుష్యులు పూర్తిగా తెలివిహీనులైపోయారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ 5 వికారాలు మీ బుద్ధిని ఎంతగా పాడుచేసేస్తాయి. ఎంతమంది మనుష్యులు బద్రీనాథ్ మొదలైన స్థానాలకు వెళ్తారు. ఈ రోజు 2 లక్షల మంది వెళ్ళారు, 4 లక్షల మంది వెళ్ళారు... అని అంటారు. పెద్ద-పెద్ద ఆఫీసర్లు కూడా తీర్థయాత్రలకు వెళ్తారు. మీరు వెళ్ళరు కావున ఈ బి.కె.లు నాస్తికులు ఎందుకంటే వీరు భక్తి చేయరు అని అంటారు. కానీ మీరంటారు, ఎవరికైతే భగవంతుడి గురించి తెలియదో వారు నాస్తికులు. తండ్రి గురించైతే ఎవరికీ తెలియదు, అందుకే దీనిని అనాథల ప్రపంచమని అంటారు. పరస్పరము ఎంతగా కొట్లాడుకుంటూ, గొడవపడుతూ ఉంటారు. ఈ ప్రపంచమంతా బాబా ఇల్లే కదా. తండ్రి మొత్తం ప్రపంచములోని పిల్లలను పతితుల నుండి పావనులుగా చేయడానికి వస్తారు. అర్ధకల్పము తప్పకుండా పవిత్ర ప్రపంచముండేది కదా. రాముని రాజ్యములో ప్రజలు కూడా షావుకారులే మరియు ఆ నగరములో అందరూ దాతలే కాబట్టి ధర్మానికి సదా ఉపకారము జరుగుతుంది... అని పాడుతారు కూడా. అక్కడ అధర్మము ఎలా ఉండగలదు. అక్కడ పులి-మేక కలిసి నీరు తాగుతాయని అంటారు కూడా, మరి అటువంటప్పుడు అక్కడకు రావణుడు మొదలైనవారు ఎక్కడ నుండి వచ్చినట్లు? ఏమీ అర్థం చేసుకోరు. బయటివారైతే ఇటువంటి విషయాలను విని నవ్వుకుంటారు.

ఇప్పుడు జ్ఞానసాగరుడైన తండ్రి వచ్చి మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇది పతిత ప్రపంచము కదా. ఇప్పుడు ప్రేరణ ద్వారా పతితులను పావనముగా చేస్తారా ఏమిటి? ఓ పతిత-పావనా రండి, వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని పిలుస్తారు, అంటే వారు తప్పకుండా భారత్ లోనే వచ్చారు. జ్ఞానసాగరుడినైన నేను వచ్చానని ఇప్పుడు కూడా అంటారు. శివబాబాలోనే మొత్తం జ్ఞానమంతా ఉందని పిల్లలైన మీకు తెలుసు, ఆ తండ్రియే కూర్చుని పిల్లలకు ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తారు. శాస్త్రాలలో ఉన్నవన్నీ కల్పితమైన కథలు. వ్యాస భగవానుడు శాస్త్రాలను తయారుచేసారని వారి పేరు తీసుకుంటారు. ఇప్పుడు ఆ వ్యాసుడు భక్తి మార్గానికి చెందినవారు. వీరు వ్యాసదేవుడు, వీరి పిల్లలైన మీరు సుఖదేవులు. ఇప్పుడు మీరు సుఖదేవతలుగా అవుతారు. మీరు వ్యాసుడి నుండి, శివాచార్యుడి నుండి సుఖపు వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మీరు వ్యాసుని పిల్లలు. కానీ మనుష్యులు తికమక పడకూడదని శివుని పిల్లలు అని అనడము జరుగుతుంది. వారి అసలు పేరు శివ. ఇప్పుడు తండ్రి అంటారు - ఏ దేహధారినీ చూడకండి, శివబాబా మీ సమ్ముఖములో కూర్చుని ఉన్నారు. ఆత్మను తెలుసుకోవడము జరుగుతుంది, పరమాత్మను కూడా తెలుసుకోవడము జరుగుతుంది. వారు పరమపిత పరమాత్మ శివుడు. వారే వచ్చి పతితము నుండి పావనముగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తారు. నేను ఆత్మలైన మీకు తండ్రినని వారు అంటారు. ఆత్మను రియలైజ్ అవ్వడము జరుగుతుంది, దానిని చూడడము జరగదు. ఇప్పుడు మీరు మీ ఆత్మను రియలైజ్ అయ్యారా అని తండ్రి అడుగుతున్నారు. ఇంత చిన్నని ఆత్మలో ఒక రికార్డు వలె అవినాశీ పాత్ర నిశ్చితమై ఉంది.

ఆత్మలమైన మనమే శరీరాన్ని ధారణ చేస్తామని మీకు తెలుసు. మొదట మీరు దేహాభిమానులుగా ఉండేవారు, ఇప్పుడు దేహీ-అభిమానులుగా అయ్యారు. ఆత్మలమైన మనము 84 జన్మలను తీసుకుంటామని మీకు తెలుసు. దానికి అంతము ఉండదు. ఈ డ్రామా ఎప్పటినుండి మొదలైందని కొందరు అడుగుతారు, కానీ ఇది అనాది డ్రామా, ఇది ఎప్పటికీ వినాశనమవ్వదు. దీనిని తయారై, తయారుచేయబడిన అవినాశీ వరల్డ్ డ్రామా అని అంటారు. ఏ విధముగా చదువురాని పిల్లలను చదివిస్తారో, అలా తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మే శరీరములో ఉంటుంది. ఇది రాతిబుద్ధి కలవారికి భోజనము వంటిది, బుద్ధికి అవగాహన లభిస్తుంది. పిల్లలైన మీ కోసం బాబా చిత్రాలను తయారుచేయించారు. ఇది చాలా సహజము. వీరు త్రిమూర్తి బ్రహ్మా-విష్ణు-శంకరులు. ఇప్పుడు బ్రహ్మాను కూడా త్రిమూర్తి అని ఎందుకంటారు? దేవ-దేవ మహాదేవ అని అంటారు. ఒకరిపై మరొకరిని ఉంచుతారు కానీ అర్థమేమీ తెలియదు. బ్రహ్మా ఇప్పుడు దేవత ఎలా అవ్వగలరు. ప్రజాపిత బ్రహ్మా అయితే ఇక్కడ ఉండాలి. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. తండ్రి అంటారు, నేను ఈ శరీరములో ప్రవేశించి ఇతని ద్వారా మీకు అర్థం చేయిస్తాను. వీరిని నా వానిగా చేసుకుంటాను. వీరి అనేక జన్మల అంతిమములో వస్తాను. వీరు కూడా 5 వికారాలను సన్యసిస్తారు. సన్యసించేవారిని యోగి, ఋషి అని అంటారు. ఇప్పుడు మీరు రాజఋషులుగా అయ్యారు. మీరు 5 వికారాలను సన్యసించారు కావున పేరు మారుతుంది. మీరు రాజయోగులుగా అవుతారు. మీరు ప్రతిజ్ఞ చేస్తారు. ఆ సన్యాసులైతే ఇళ్ళు-వాకిళ్ళను వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడైతే స్త్రీ-పురుషులు ఇరువురూ కలిసి ఉంటారు, మేము ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళము అని ప్రతిజ్ఞ చేస్తారు. ముఖ్యమైనది వికారాల విషయమే.

శివబాబా రచయిత అని పిల్లలైన మీకు తెలుసు. వారు కొత్త రచనను రచిస్తారు. వారు బీజరూపుడు, సత్ చిత్ ఆనందసాగరుడు, జ్ఞానసాగరుడు. స్థాపన, వినాశనము, పాలన ఎలా చేస్తారు అనేది తండ్రికి తెలుసు, మనుష్యులకు తెలియదు. బి.కె.లైన మీరు ప్రపంచాన్ని వినాశనము చేస్తారని ఆ మనుష్యులు వెంటనే అనేస్తారు. అచ్ఛా, మీ నోటిలో గులాబ్. వీరు వినాశనానికి నిమిత్తమయ్యారు, వీరు శాస్త్రాలను గాని, భక్తిని గాని, గురువులను గాని నమ్మరు, కేవలం వారి దాదాను మాత్రమే నమ్ముతారని అంటారు. కానీ తండ్రి స్వయమే అంటారు - ఇది పతిత శరీరము, నేను వీరిలో ప్రవేశించాను. పతిత ప్రపంచములోనైతే పావనమైనవారు ఎవరూ ఉండరు. మనుష్యులు ఏవైతే చెప్పుడు మాటలను వింటారో, అవే మాట్లాడుతారు. ఇటువంటి చెప్పుడు మాటల ద్వారానే భారత్ దుర్గతిని పొందింది, అప్పుడు తండ్రి వచ్చి సత్యాన్ని వినిపించి అందరికీ సద్గతినిస్తారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి నుండి సుఖ వారసత్వాన్ని తీసుకుని సుఖాన్ని ఇచ్చే దేవతగా అవ్వాలి. అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. రాజఋషులుగా అయ్యేందుకు అన్ని వికారాలను సన్యసించాలి.

2. చదువే సత్యమైన ఔషధము. సద్గతి కోసం చెప్పుడు మాటలను వదిలి శ్రీమతముపై నడవాలి. ఒక్క తండ్రి నుండే వినాలి. మోహజీతులుగా అవ్వాలి.

వరదానము:-
తమ వాస్తవిక సంస్కారాలను ఇమర్జ్ చేసుకుని సదా హర్షితముగా ఉండే జ్ఞాన స్వరూప భవ

ఏ పిల్లలైతే జ్ఞానాన్ని స్మరణ చేస్తూ దాని స్వరూపముగా అవుతారో వారు సదా హర్షితముగా ఉంటారు. సదా హర్షితముగా ఉండడము - ఇదే బ్రాహ్మణ జీవితము యొక్క వాస్తవిక సంస్కారము. దివ్య గుణాలు మనకు చెందినవి, అవగుణాలు మాయకు చెందినవి, అవగుణాలు సాంగత్య దోషము కారణముగా వచ్చేసాయి. ఇప్పుడు వాటి నుండి వెనక్కి తిరగండి మరియు మీ సర్వశక్తివంతమైన స్థితిలో ఉండండి, అప్పుడు సదా హర్షితముగా ఉంటారు. ఏ ఆసురీ సంస్కారము లేక వ్యర్థ సంస్కారము మీ ఎదురుగా వచ్చేందుకు ధైర్యము కూడా చేయలేదు.

స్లోగన్:-
సంపూర్ణత యొక్క లక్ష్యాన్ని ఎదురుగా పెట్టుకున్నట్లయితే సంకల్పములో కూడా ఎటువంటి ఆకర్షణా ఆకర్షించలేదు.

అవ్యక్త సూచనలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి

ఏకత కొరకు ఒక ఆత్మిక తాయెత్తును సదా మీ వద్ద ఉంచుకోండి, అదేమిటంటే - గౌరవాన్ని ఇవ్వటమే గౌరవాన్ని తీసుకోవటము. ఈ గౌరవము యొక్క రికార్డు సఫలత యొక్క అవినాశీ రికార్డుగా అయిపోతుంది. నోటిపై ఒకటే సఫలతా మంత్రము ఉండాలి - ‘‘మొదట మీరు’’. ఈ మహామంత్రము మనసులో పక్కాగా ఉండాలి. యథార్థ రూపములో ‘‘ముందు నేను’’ అన్నదానిని తొలగించి ఇతరులను ముందుకు తీసుకువెళ్ళడమే స్వయము ముందుకు వెళ్ళడము అని భావిస్తూ ఈ మహామంత్రాన్ని ముందుకు తీసుకువెళ్తూ సఫలతను పొందుతూ ఉండండి, ఈ మంత్రము మరియు తాయెత్తు సదా తోడుగా ఉన్నట్లయితే ప్రత్యక్షత యొక్క ఢంకా మ్రోగుతుంది.