21-05-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - శ్రీమతముపై నడుస్తూ అందరికీ సుఖాన్ని ఇవ్వండి, ఆసురీ మతముపై దుఃఖాన్ని ఇస్తూ వచ్చారు, ఇప్పుడు సుఖము ఇవ్వండి, సుఖము తీసుకోండి’’

ప్రశ్న:-
వివేకవంతులైన పిల్లలు ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్న కారణముగా ఉన్నత పదవిని పొందే పురుషార్థము చేస్తారు?

జవాబు:-
ఇది సుఖ-దుఃఖాల ఆట, గెలుపు-ఓటముల ఆట అని వారు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అర్ధకల్పము సుఖపు ఆట నడవనున్నది. అక్కడ ఏ రకమైన దుఃఖము ఉండదు. ఇప్పుడు కొత్త రాజధాని రానున్నది, దాని కోసం తండ్రి తమ పరంధామాన్ని వదిలి పిల్లలైన మనల్ని చదివించడానికి వచ్చారు, ఇప్పుడు పురుషార్థము చేసి ఉన్నత పదవిని పొందాల్సిందే.

పాట:-
ప్రపంచము మారినా మేము మారము...

ఓంశాంతి
మధురాతి మధురమైన పిల్లలు అర్థాన్ని అర్థం చేసుకున్నారు. ఇక్కడ ప్రమాణము చేయవలసిన అవసరమేమీ లేదు. ఇక్కడ ఆత్మకు ఆ అవగాహన ఉండాలి. ఆత్మ తమోప్రధానమైన కారణముగా పూర్తిగా తెలివిహీనముగా అయిపోయింది. మేము ఎంత తెలివిహీనులుగా ఉండేవారము, ఇప్పుడు ఎంత వివేకవంతులుగా అయ్యాము - అని పిల్లలకు తెలుసు. వేరే సత్సంగాలు మొదలైన చోట్ల ఈ విషయాలు ఉండవు. వారు శాస్త్రాలు, రామాయణము మొదలైనవి చదువుతుంటారు. ఒక చెవితో వింటారు, మరొక చెవి నుండి వెళ్ళిపోతుంది. ఏ ప్రాప్తి ఉండదు. యజ్ఞ-తపాదులు, దాన-పుణ్యాలు మొదలైనవి చాలా చేస్తారు, ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. కానీ ప్రాప్తి ఏమీ ఉండదు. ఈ ప్రపంచములో ఎవరికీ సుఖము లేదు. ఇప్పుడు తండ్రి పూర్తి వివేకాన్ని ఇస్తారు. అందరికీ సుఖ-శాంతులను ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. మనుష్యులు పూర్తిగా ఘోర అంధకారములో ఉన్నారు. ఓ దుఃఖహర్త, సుఖకర్త, సద్గతిదాత అని భక్తి మార్గము వారు కూడా స్మృతి చేస్తూ ఉంటారు. ప్రపంచములో ఏమి జరుగుతుందో చూడండి. అందరికీ దుఃఖము కలుగుతూనే ఉంటుంది. మనుష్యమాత్రులెవరైతే ఉన్నారో, ఎవరికీ కూడా తండ్రి ఎవరు, తండ్రి నుండి ఏం వారసత్వము లభిస్తుంది అనేది తెలియదు. వారికి అనంతమైన తండ్రి గురించి తెలియనే తెలియదు. శాంతి కోసం ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. ఇప్పుడు, మనసుకు శాంతి కావాలి అని ఎవరు అన్నారు? ఆత్మ అంటుంది. ఇది కూడా మనుష్యులకు తెలియదు. దేహాభిమానము ఉంది కదా. సాధు-సత్పురుషులు మొదలైనవారంతా దుఃఖితులుగా ఉన్నారు, అందరూ శాంతిని కోరుకుంటారు. అనారోగ్యము మొదలైన సమస్యలు సాధు-సత్పురుషులకు కూడా వస్తాయి. ఏక్సిడెంట్లు జరుగుతాయి. ప్రపంచములో దుఃఖము తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. తండ్రి అర్థం చేయించారు - డ్రామాలో కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము, సుఖము మరియు దుఃఖము యొక్క ఆట తయారై ఉంది. తండ్రి మీ బుద్ధి తాళాన్ని తెరిచారు, మిగిలిన మనుష్యమాత్రులందరి బుద్ధికి గోద్రేజ్ తాళం వేయబడి ఉంది, పూర్తిగా తమోప్రధాన బుద్ధి కలవారిగా ఉన్నారు. పిల్లలైన మీకు నంబరువారు పురుషార్థమనుసారముగా తెలుసు. అనంతమైన తండ్రి లభించారు, వారు మనకు ఈ ఆట ఎలా తయారై ఉంది అని సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని వినిపిస్తున్నారు. సుఖము ఉన్నప్పుడు దుఃఖము అన్న మాటే ఉండదు. మనము తండ్రి నుండి సుఖము, శాంతి, సంపదల వారసత్వాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. సత్యయుగము నుండి మొదలుకుని త్రేతా అంతిమము వరకు ఏ దుఃఖము ఉండదు. ఇప్పుడు మీరు ప్రకాశములో ఉన్నారు. మీ రాజధానిలో ఒకరికంటే ఒకరు ఉన్నత పదవిని పొందాలని మీరు పురుషార్థము చేస్తున్నారు. ఇది అనంతమైన స్కూల్. అనంతమైన తండ్రి చదివిస్తున్నారు. వారు మన అత్యంత ప్రియమైన తండ్రి అని, వారికి అపారమైన మహిమ ఉందని మీకు తెలుసు. ఆ ఉన్నతోన్నతమైన తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు. మిగిలిన మనుష్యమాత్రులందరూ ఆసురీ మతముపై ఒకరికొకరు దుఃఖమే ఇచ్చుకుంటారు. మీరు శ్రీమతమనుసారముగా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ఈ డ్రామాలో మనము పాత్రధారులము, ఇది ఎవరికీ తెలియదు. ఈ డ్రామాలో భారతవాసులకే ఆల్రౌండ్ పాత్ర ఉందని పిల్లలైన మీరు ఇప్పుడు భావిస్తున్నారు. ఇంతకుముందైతే మీకు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడైతే మూలవతనము నుండి మొదలుకుని సూక్ష్మవతనము, స్థూలవతనము, అన్నింటినీ మీరు తెలుసుకున్నారు. మీకు సత్యమైన జ్ఞానముంది. పరమపిత పరమాత్మ మనల్ని వీరి ద్వారా చదివిస్తున్నారు. బాబా మనకు మూడు లోకాల జ్ఞానమంతటినీ ఇస్తున్నారు. ఇది ముళ్ళ అడవి. ఇప్పుడు మనము ముళ్ళ నుండి పుష్పాలుగా అనగా మనుష్యుల నుండి దేవతలుగా అవుతామని పిల్లలకు తెలుసు. ఇక్కడైతే చిన్న-పెద్ద అందరూ దుఃఖాన్ని ఇస్తారు. గర్భములో పిల్లలు తల్లికి దుఃఖము ఇస్తారు. ఇది చాలా ఛీ-ఛీ పాత ప్రపంచము. ఈ సృష్టి చక్రము గురించి ఎవరికీ తెలియదు. మనము ఎక్కడి నుండి వచ్చాము, ఎన్ని జన్మలు తీసుకున్నాము, మళ్లీ ఎక్కడికి వెళ్ళాలి?... ఏమీ తెలియదు. అనంతమైన తండ్రి అనగా సీతలందరికీ ఒకే రాముడు, ఆ నిరాకారుడు. మీరందరూ సీతలు. తండ్రి వరుడు. మీరంతా ఆ ఒక్క ప్రియునికి ప్రేయసులు, భక్తురాళ్ళు. సీతలు ఎవరైతే ఉన్నారో, అందరూ రావణుడి జైలులో చిక్కుకుని శోకవాటికలోకి వచ్చారు. మొత్తము ప్రపంచములోని మనుష్యమాత్రులందరూ ఒక్క భగవంతుడిని స్మృతి చేస్తారు. భక్తుల రక్షకుడు అని భగవంతుడిని అంటారు. మీరంతా ఇప్పుడు బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులు. మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారని బ్రాహ్మణులకు తెలుసు. బాబా నుండి తప్పకుండా వారసత్వము లభిస్తుంది. శివబాబా స్వర్గ రచయిత. స్వర్గము అనండి లేదా దైవీ రాజధాని అని అనండి - ఇది స్వర్గ రాజధాని కదా. లక్ష్మీ-నారాయణులు స్వర్గానికి యజమానులు. ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఇక్కడ సత్యయుగము ఉన్నప్పుడు లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది. ఇప్పుడిది కలియుగము. మనుష్యులకు పాపం ఘోర అంధకారములో ఉన్న కారణముగా, ఇప్పుడిది కలియుగ అంతిమమని, వినాశనము ఎదురుగా నిలబడి ఉందని అసలేమీ తెలియదు. సీతలైన మీ అందరి సద్గతిదాత ఒక్క రాముడే. సీతలందరూ దుర్గతిలో ఉన్నారు, కానీ మేము దుర్గతిలో ఉన్నామని ఎవరూ అర్థం చేసుకోరు. తమ షావుకారుతనము యొక్క నషా ఉంటుంది. మాకు ఇన్ని ఇళ్ళు ఉన్నాయని, ఇంత ధనముందని, ఇన్ని మహళ్ళు ఉన్నాయని అనుకుంటారు, కానీ ఈ దుఃఖపు ప్రపంచము ఇప్పుడు పరివర్తన అవ్వనున్నదని, మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని, అంతా మట్టిలో కలిసిపోనున్నదని ఎవరికీ తెలియదు. ఈ పాత ప్రపంచములో ఏదైతే చూస్తున్నారో, ఇదంతా వినాశనమైపోతుంది. వినాశనము కోసం పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది అదే మహాభారత యుద్ధము. వారే గీతా భగవానుడు. కానీ తండ్రి జీవిత చరిత్రలో కొడుకు పేరును వేసేశారు. ఇప్పుడు శివబాబా మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. భగవంతుని పేరును మాయము చేయడమే అతి పెద్ద పొరపాటు.

మనల్ని మనుష్యమాత్రులు కానీ, సాధు-సత్పురుషులు కానీ చదివించడము లేదు, శివబాబా మనల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. వారు తండ్రి కూడా, టీచరు కూడా, సద్గురువు కూడా. అంతా వారే. ఇదైతే మర్చిపోకూడదు కదా. తండ్రి అంటారు - నాకు అందరూ పిల్లలే కానీ అందరినీ అయితే నేను చదివించను. తండ్రి అంటారు - నేను భారతవాసులకు మళ్ళీ రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను. భారతవాసులు స్వర్గవాసులుగా ఉండేవారు, వజ్ర సమానముగా ఉండేవారు, ఇప్పుడు గవ్వ సమానముగా అయిపోయారు. ఇంటిలో ఎంత అశాంతి ఉంది. బాబా, మాకు కోపం వస్తుంది, పిల్లలను కొట్టవలసి వస్తుందని అంటారు. మేము 5 వికారాలను శివబాబాకు దానమిచ్చేసాము, మళ్ళీ మేము ఇలా ఎందుకు చేస్తున్నాము, భయమేస్తుంది అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ సమయములో అందరికీ 5 వికారాల గ్రహణము పట్టి ఉంది, దేహాభిమానమనే భూతము రావడముతో మిగిలిన భూతాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - దేహీ-అభిమానులుగా అవ్వండి. ఇప్పుడు మీకు వివేకము లభించింది. సత్యయుగములో కూడా మనము ఆత్మాభిమానులుగా ఉండేవారము. ఆత్మ యొక్క ఈ శరీరము ఇప్పుడు పాతదిగా అయ్యింది, ఆయుష్షు పూర్తయ్యింది, అందుకే ఈ శరీరాన్ని వదిలి ఇప్పుడు కొత్తది తీసుకోవాలి అని భావిస్తారు. (సర్పము యొక్క ఉదాహరణ) సర్పానికి ఒక కుబుసము పాతదైతే, మళ్ళీ మరొక కొత్తది తీసుకుంటుంది. ఇది సత్యయుగానికి సంబంధించిన ఉదాహరణ. అక్కడ మీరు శరీరాన్ని ఎలా వదలుతారంటే, దుఃఖపడే విషయమేమీ ఉండదు. ఇక్కడ ఎంత దుఃఖము ఉంటుంది. ఏడ్వడం, పెడబొబ్బలు పెట్టడము చేస్తారు. ఇది పాత చర్మమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ కొత్త శరీరమేమీ లభించదు. ఇది అంతిమ పాత చెప్పు. ఇప్పుడు మీరు దీనితో విసిగిపోయారు. అక్కడైతే సంతోషముగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. ఈ విషయాలను కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఇక్కడకు ఎంతమంది కొత్తవారు వస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. రెండు-నాలుగు రోజులు ఇక్కడ నుండి అర్థం చేసుకుని వెళ్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మంచి రీతిలో విని, సంతోషము కలిగినట్లయితే ప్రజల్లోకి వస్తారు. ప్రజలు కూడా చాలా మంది తయారవ్వాలి కదా. ఇది ఈశ్వరుని గడప మరియు ఇల్లు, మీరు ఈశ్వరుని ఇంటిలో కూర్చుని ఉన్నారు. పరమపిత వారి పరంధామాన్ని వదిలి ఇక్కడ సాధారణ తనువులోకి వచ్చి కూర్చున్నారు. అక్కడైతే తండ్రి వద్ద ఆత్మలు ఉంటారు. ఇక్కడ సంగమములో పతితులను పావనముగా చేయడానికి బాబా స్వయంగా వచ్చారు. వారిని నిరాకార శివుడనే అంటారు. నిరాకార బాబాను ఆత్మలు - ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. మనుష్యులు అర్థాన్ని తెలుసుకోకుండా - ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. ఈ లక్ష్మీ-నారాయణులను కూడా యూరోపియన్లు భగవతి-భగవానులని అంటారు. వీరిని ఈ విధముగా ఎవరు తయారుచేసారు? మీరు సర్వ గుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులని ఈ దేవతలను అంటారు, తర్వాత స్వయాన్ని ఏమని అనుకుంటారు? వీరు కూడా మనుష్యులేనని, భారత్ లోనే రాజ్యము చేసి వెళ్ళారని తెలియదు. వారి ముందుకు వెళ్ళి మహిమను పాడుతారు. స్వయాన్ని నీచులము, పాపులము అని అనుకుంటూ ఉంటారు. శ్రీకృష్ణుని మందిరాలకు కూడా వెళ్ళి మహిమ చేస్తారు. శివుడిని ఇలా మహిమ చేయరు. వారి మహిమ వేరు. చాలావరకు శివుని వద్దకు వెళ్ళినప్పుడు జోలెను నింపండి అని అంటారు. మరోవైపు వారు భంగు తాగేవారని, ఉమ్మెత్త పువ్వులను తినేవారని అంటారు. అరే, అక్కడ భంగు, ఉమ్మెత్త పువ్వులు ఎక్కడ నుండి వచ్చాయి? ఏమీ తెలివి లేదు. పతి కావాలి, ఇది కావాలి... అని అడుగుతూ ఉంటారు. దీపావళి నాడు కూడా లక్ష్మిని ఆహ్వానిస్తారు. కానీ లక్ష్మీ ఎవరు అనేది ఎవరికీ తెలియదు. 8-10 భుజాలు ఎక్కడైనా ఉంటాయా? ఈ చతుర్భుజ రూపాన్ని చూపిస్తారు ఎందుకంటే అది ప్రవృత్తి మార్గము. వారికి విష్ణువు అన్న పేరును పెట్టారు. లక్ష్మీ-నారాయణులైతే సత్యయుగములో ఉంటారు. విష్ణువు యొక్క రెండు రూపాలైన లక్ష్మీ-నారాయణుల ద్వారా పాలన జరుగుతుందని మనుష్యులకు తెలియదు. చిత్రాలలో లక్ష్మికి 4 భుజాలను చూపిస్తారు. 4 భుజాలు ఉన్నవారికి పిల్లలు కలిగితే, వారికి కూడా 4 భుజాలు ఉండాలి. ఏమీ అర్థం చేసుకోరు. బాబా ఎప్పటివరకైతే రాలేదో, అప్పటివరకు మాకు కూడా ఏమీ తెలిసేది కాదు - అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మొత్తము విశ్వము యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. తండ్రి వచ్చి పతిత ప్రపంచాన్ని పావనముగా తయారుచేస్తారు. ఓ పతిత-పావనా రండి, అని పిలుస్తారు కూడా. ఇప్పుడు పరమాత్మ ఎలా వస్తారు? వచ్చి పతితులను పావనముగా ఎలా తయారుచేస్తారు? తండ్రి అంటారు - 5 వేల సంవత్సరాల క్రితం నేను దైవీ స్వరాజ్యాన్ని తయారుచేసాను, తర్వాత మీరు 84 జన్మలను ఎలా తీసుకున్నారు? ఈ వివేకము ఇంతకుముందు మీ బుద్ధిలో అసలు ఉండేది కాదు. ఈ బ్రహ్మాకు కూడా తెలియదు. రాధా-కృష్ణులు, లక్ష్మీ-నారాయణుల పూజలు చేస్తూ ఉండేవారు కానీ, రాధా-కృష్ణులే స్వయంవరము తర్వాత లక్ష్మీ-నారాయణులుగా అయ్యారని కూడా తెలియదు, అందుకే ప్రిన్సెస్ రాధే, ప్రిన్స్ కృష్ణ (రాకుమారి రాధ, రాకుమారుడు శ్రీకృష్ణుడు) అని అనడము జరుగుతుంది. స్వయంవరము తర్వాత మహారాజు-మహారాణిగా అవుతారు. ఇలా ఎవరైతే స్వయంగా తయారవుతున్నారో, వారికి కూడా ఇంతకుముందు తెలియదు. కొందరికి సాక్షాత్కారాలు కూడా కలుగుతాయి కానీ ఏమీ అర్థం చేసుకోరు. అయినప్పటికీ, అల్పకాలికముగా భక్తుల భావనలను పూర్తి చేయడానికి నేను సాక్షాత్కారాలను చేయిస్తాను. ఇక్కడైతే ధ్యానము-సాక్షాత్కారాల విషయమే లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, సాక్షాత్కారాలలో మాయ ప్రవేశించినట్లయితే మీరు పద భ్రష్టులుగా అవుతారు. మాకు శివబాబా సాక్షాత్కారము జరగాలని చాలామంది అంటారు. అరే, మీకు అర్థం చేయించడము జరుగుతుంది - మిణుగురు పురుగు ఎంత చిన్నగా ఉంటుంది, దానిని కళ్ళతో చూడవచ్చు. ఆత్మ అయితే దాని కన్నా చిన్న బిందువు. ఆత్మ ఎలా ఉంటుందో, పరమాత్ముని రూపము కూడా అలాగే ఉంటుంది. సాక్షాత్కారము జరిగినా సరే, ఆ చిన్న బిందువు యొక్క సాక్షాత్కారమే జరుగుతుంది. ఇది భృకుటి మధ్యలో ఉండే చిన్న బిందువు. ఆత్మ సాక్షాత్కారము జరిగినా సరే, ఏమీ అర్థం చేసుకోలేరు.

ఇప్పుడు మనము శివబాబా సంతానమని పిల్లలైన మీకు తెలుసు. బ్రహ్మాకుమార-కుమారీలందరూ శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఇదే మన లక్ష్యము-ఉద్దేశ్యము. మీరు విద్యార్థులు కదా. తండ్రి నుండి సహజ రాజయోగాన్ని నేర్చుకునేందుకు వచ్చామని మీరు అంటారు. ఇది మీ లక్ష్యము-ఉద్దేశ్యము. ఇది పిల్లలు మర్చిపోకూడదు. భక్తి మార్గములో భక్తులు దేవతల చిత్రాలను తమతో పాటు పెట్టుకుంటారు. అలా మీరు ఈ త్రిమూర్తి చిత్రాన్ని పాకెట్ లో పెట్టుకోవాలి. ఈ శివబాబా ద్వారా మనము ఈ లక్ష్మీ-నారాయణుల వలె అవుతున్నాము. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శివబాబాకు వికారాల దానమును ఇచ్చి, మళ్ళీ ఎప్పుడూ తిరిగి తీసుకోకూడదు. దేహాభిమానమనే భూతము నుండి రక్షించుకోవాలి. ఈ భూతము ద్వారా అన్ని భూతాలు వచ్చేస్తాయి, అందుకే ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసము చేయాలి.

2. ధ్యానము, సాక్షాత్కారాల ఆశను పెట్టుకోకూడదు. లక్ష్యము-ఉద్దేశ్యాన్ని ఎదురుగా పెట్టుకుని పురుషార్థము చేయాలి. శ్రీమతముపై అందరికీ సుఖాన్ని ఇవ్వాలి.

వరదానము:-
చేయించేవారి స్మృతితో సేవలో సదా నిర్మాణ కార్యము చేసే కర్మయోగీ భవ

ఏ కర్మనైనా కర్మయోగీ స్థితిలోకి పరివర్తన చేయండి, కేవలం కర్మలు చేసేవారు కాదు, మీరు కర్మయోగులు. కర్మ అనగా వ్యవహారము మరియు యోగము అనగా పరమార్థము, రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. శరీర నిర్వహణ వెనుక ఆత్మ నిర్వహణను మర్చిపోకూడదు. ఏ కర్మ చేసినా అది ఈశ్వరీయ సేవార్థము ఉండాలి. దీని కొరకు సేవలలో - నేను నిమిత్తమాత్రము అనే మంత్రాన్ని మరియు చేసేవాడిని అన్న స్మృతి యొక్క సంకల్పము సదా గుర్తుండాలి. చేయించేవారిని మర్చిపోకూడదు, అప్పుడు సేవలలో నిర్మాణమే నిర్మాణము చేస్తూ ఉంటారు.

స్లోగన్:-
సేవ మరియు సంబంధ-సంపర్కాలలో విఘ్నాలు కలగడానికి కారణము - పాత సంస్కారాలు, ఆ సంస్కారాల పట్ల వైరాగ్యము కలిగి ఉండాలి.

అవ్యక్త ప్రేరణలు - ‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చేయండి’’

అన్నింటికన్నా శ్రేష్ఠ సింహాసనమైన బాప్ దాదా హృదయ సింహాసనాధికారులుగా అవ్వాలి. కానీ ఈ సింహాసనముపై కూర్చునే ముందు అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితి అనే సింహాసనము కావాలి. ఎప్పుడైతే అకాల సింహాసనాధికారులుగా అయ్యే అభ్యాసము ఉంటుందో అప్పుడే ఏకరస స్థితి అనే సింహాసనముపై స్థితులవ్వగలరు. ఆ తపస్వీలు ఎలా అయితే సదా ఆసనముపై కూర్చుని ఉంటారో, అలా మీరు మీ ఏకరస ఆత్మ యొక్క స్థితి అనే ఆసనముపై విరాజమానమై ఉండండి. ఈ ఆసనాన్ని వదలకండి, అప్పుడు సింహాసనము లభిస్తుంది.