21-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇప్పటివరకు మీరు చెప్పుడు మాటల అనుసారముగా నడుచుకుంటూ వచ్చారు, ఇప్పుడు తండ్రి మీకు డైరెక్టుగా వినిపించి తమ సమానముగా నాలెడ్జ్ ఫుల్ గా తయారుచేస్తారు’’

ప్రశ్న:-
మంచి పురుషార్థీ పిల్లల గుర్తులేమిటి మరియు వారి అవస్థకు కల గాయనమేమిటి?

జవాబు:-
మంచి పురుషార్థీ పిల్లలు - తల్లి, తండ్రిని పూర్తిగా అనుసరిస్తారు. తమ జీవితముపై తామే దయ చూపించుకుంటారు. పూర్తి అటెన్షన్ పెడతారు. కొద్ది సమయాన్ని అయినా తీసి తండ్రి స్మృతిలో తప్పకుండా కూర్చుంటారు. అచంచలమైన అవస్థ, స్థిరమైన అవస్థ అని వారి అవస్థకే గాయనముంది. వారినే మహావీరులని అంటారు.

పాట:-
భోళానాథుని కన్నా అతీతమైనవారు లేరు...

ఓంశాంతి
భక్తి మార్గములో ప్రపంచము కేవలం పాడుతుంది. భక్తి మార్గములో మనము కూడా పాడేవారమని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆ భోళానాథుడే సమ్ముఖముగా ఉన్నారు. భోళానాథుడు అనే పదము భక్తి మార్గానికి సంబంధించినది. జ్ఞాన మార్గము యొక్క పదము శివబాబా. అనాదిగా తయారై, తయారుచేయబడిన డ్రామా ప్లాన్ అనుసారముగా ఇప్పుడు సంగమయుగములో తండ్రి వచ్చి మన చేత ఈ పురుషార్థము చేయించాల్సిందేనని మీరు అర్థం చేసుకున్నారు. కల్ప-కల్పము పురుషార్థము చేయిస్తూ వచ్చారు. పిల్లలైన మీరు ఎంత సమయము భక్తి చేసారు అనేది కూడా ఋజువు చేసి తెలియజేస్తారు. ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభించారో, వారే వచ్చి జ్ఞానాన్ని తీసుకుంటారు మరియు సూర్యవంశీయులుగా అవుతారు. సత్యయుగములో కేవలం లక్ష్మీ-నారాయణులు మాత్రమే రావడము కాదు కదా, వారి రాజ్యము కూడా ఉంటుంది కదా. దానిని దైవీ వర్ణమని అంటారు. భారత్ లో దైవీ వర్ణముండేది. ఇప్పుడు ఆసురీ వర్ణముంది. ఇది సంగమము. ఇప్పుడు ఆసురీ వర్ణము నుండి దైవీ వర్ణములోకి వెళ్ళాలి. తప్పకుండా వర్ణన చేయబడిన ఆ మహాభారత యుద్ధము కూడా ఇదే. కేవలం శివుని పేరుకు బదులుగా శ్రీకృష్ణుని పేరును వేసేశారు. కేవలం గీత ఖండితమవ్వడముతో అన్ని శాస్త్రాలు ఖండితమైపోతాయి. ముఖ్యమైన విషయము గీతకు సంబంధించినదే. గీతా పాఠశాలలు మరియు గీతా భవనాలు ఎన్ని ఉన్నాయి! గీతా పాఠశాల అనగా గీతా జ్ఞానాన్ని వినే పాఠశాల. స్వయంగా గీతను వినిపించినవారు ఇప్పుడు లేరు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్తారో, వారి గురించి తర్వాత మాట్లాడుకుంటారు. పిల్లలకైతే ప్రతిరోజు తండ్రి చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు. బాబా ప్రేమ సాగరుడని, అందరికీ ప్రేమగా నేర్పిస్తారని పిల్లలకు తెలుసు. బాబా ఎప్పుడూ కోప్పడరు, సదా ప్రేమగా అర్థం చేయిస్తారు. పిల్లలూ, మీరు సతోప్రధానముగా ఉండేవారు, తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. వాస్తవానికి భారతవాసులైన మీరే దేవీ-దేవతా ధర్మానికి చెందినవారని కూడా తెలియజేస్తారు. మొట్టమొదటగా వారసత్వాన్ని తీసుకోవడానికి ఎవరు వస్తారు? ఎవరైతే కల్పక్రితం తీసుకున్నారో వారే వస్తారు, వారే అంటారు - బాబా, మీరు తప్ప మాకు సహాయకులు ఇంకెవరూ లేరు. ఎప్పుడైతే సంగమయుగము ఉంటుందో, అప్పుడే తండ్రి క్షమిస్తారు కూడా. రావణ రాజ్యము మరియు రామ రాజ్యము ఇక్కడే ఉంటాయనైతే పిల్లలకు తెలుసు. ఇది రావణ రాజ్యము కావుననే రామ రాజ్యాన్ని కోరుకుంటారు. మీరు ఎప్పుడైతే శివబాబా అని అంటారో, అప్పుడు బుద్ధి నిరాకారుని వైపుకే వెళ్తుంది. నిరాకారుడే గుర్తుకువస్తారు. ఆత్మయే తండ్రిని పిలుస్తుంది. పరమాత్మ అలా కూర్చుని వింటారని కూడా కాదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - డ్రామా ప్లాన్ అనుసారముగా పతితులను పావనముగా చేయడానికని నేను శరీరములోకి వస్తాను, అంతేకానీ మీ పిలుపులు విని వస్తానని కాదు. భక్తి ఎప్పుడైతే పూర్తవుతుందో, అప్పుడు నేను రావాల్సిందే. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఆ సమయము వస్తుంది, అప్పుడు పిల్లలు పిలవడము ప్రారంభిస్తారు. వారు ఎప్పుడు వస్తారు అనేది ఎక్కడా వ్రాయబడిలేదు. వారు కల్పము ఆయువును తప్పుగా వ్రాసేశారు. ఈ చిత్రాలు ప్రతి ఇంటిలోనూ ఉండాలి. వాటిని రోజూ చూస్తూ - వీరు బాబా, వీరు దాదా, ఇది వారసత్వము అని గుర్తు చేసుకోవాలి. తండ్రి అంటారు, పిల్లలూ, సతోప్రధానముగా అయ్యేందుకు నన్ను స్మృతి చేసినట్లయితే మాలిన్యము తొలగిపోతుంది. ఈ యుక్తిని తండ్రియే అర్థం చేయిస్తారు. నేను కూడా పురుషార్థము చేస్తాను అని ఈ తండ్రి కూడా అంటారు. పిల్లలు ఒకరినొకరు సావధానపరచుకుంటూ ఉన్నతిని పొందాలి. ఈ చిత్రాల వివరణ చాలా బాగుంది. శివబాబా బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తున్నారు. మహాభారీ మహాభారత యుద్ధము ఎదురుగా నిలబడి ఉంది. ఈ అనేక ధర్మాలన్నీ వినాశనమవుతాయి, దాని కోసం యుద్ధము తప్పకుండా కావాలి. ఈ విషయాలను పిల్లలు మర్చిపోకూడదు. తప్పకుండా ఇప్పుడు కలియుగము ఘోర అంధకారములో ఉంది. ఎంతమంది మనుష్యులు ఉన్నారు, తప్పకుండా వినాశనము జరగాల్సిందే. సత్యయుగములో ఒకే ధర్మముంటుంది. తప్పకుండా 84 జన్మల చక్రములో కూడా వారే తిరిగారు. ఇదైతే సహజము. ఇకపోతే, ఈ మిగిలిన ధర్మాలన్నింటి వినాశనము తప్పకుండా జరుగుతుంది. ఏక ధర్మ స్థాపన తప్పకుండా జరుగుతూ ఉంది. సర్వుల సద్గతిదాత తండ్రి. తండ్రి నుండే పిల్లలకు వారసత్వము లభిస్తుంది. మేము ఈ చదువునేదైతే చదువుతున్నామో, ఇది భవిష్య 21 జన్మల కోసం చదువుతున్నామని పిల్లలకు తెలుసు. భగవానువాచ - నేను మిమ్మల్ని చదివించి 21 జన్మల కోసం స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను. సూర్యవంశీయుల, చంద్రవంశీయుల వంశావళులు తప్పకుండా స్థాపనవుతున్నాయి. ఎవరెంత పురుషార్థము చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు, అందుకే శివబాబా అంటారు - ఈ తల్లి-తండ్రిని ఫాలో చేయండి. వారిని మీరు సూక్ష్మవతనము, వైకుంఠములో కూడా చూస్తారు. మేము కూడా మహారాజు-మహారాణులుగా అవుతామని స్వయాన్ని కూడా చూసుకుంటారు. వైకుంఠము యొక్క సాక్షాత్కారము కూడా జరుగుతుంది. తప్పకుండా భారత్ వైకుంఠముగా ఉండేదని, శ్రీకృష్ణపురిగా ఉండేదని కూడా నమ్ముతారు. నేడు కంసపురిగా ఉంది, రేపు కృష్ణపురిగా ఉంటుంది. రాత్రి పరివర్తనై పగలుగా అవ్వనున్నది. అర్ధకల్పము అనంతమైన పగలు మరియు అర్ధకల్పము అనంతమైన రాత్రి ఉంటాయి. అంధకారములో ఎదురుదెబ్బలే తింటూ ఉంటారు. బ్రహ్మా యొక్క రాత్రి అనగా బ్రాహ్మణుల రాత్రి. తర్వాత మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. సత్యయుగములో బ్రాహ్మణులు ఉండరు, దేవతలు ఉంటారు.

భారత్ పవిత్రమైన రాజస్థాన్ గా ఉండేదని, తర్వాత అపవిత్రమైన రాజస్థాన్ గా తయారయ్యిందని కూడా పిల్లలకు తెలుసు. భారత్ సదా రాజస్థాన్ గానే ఉన్నది. ఇక్కడ రాజ్యమనేది కొనసాగుతూనే వస్తుంది, మిగిలిన ధర్మాలలో రాజ్యము అనేది ప్రారంభము నుండే ఉండదు. భగవంతుడే రాజ్యాన్ని స్థాపన చేస్తారు. భగవంతుడే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. వారు నిరాకారుడు, జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు... బాబా నుండి మనకు వారసత్వము లభిస్తూ ఉందని మీకు తెలుసు. తప్పకుండా మన పురుషార్థములోనే ఆలస్యము జరుగుతుంది. ఎవరెంత పురుషార్థము చేస్తారో, అంతగా మార్గాన్ని తెలియజేస్తారు. తండ్రి అంటారు - తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితము నుండి పావనముగా అయి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు, ఇది ఎంత సహజము. ఒకవేళ లౌకిక తల్లిదండ్రులు జ్ఞానములో ఉంటే పిల్లలను కూడా తమ సమానముగా తయారుచేయవలసి ఉంటుంది. తల్లిదండ్రులు సత్యమైన సంపాదనను చేసుకుంటున్నారంటే పిల్లల చేత కూడా సత్యమైన సంపాదనను చేయించాలి. కొందరు పిల్లలు మంచిగా ఉంటారు. మేము ఆత్మిక చదువును చదువుకుని, ఇంటింటికి ఈ సందేశాన్ని ఇస్తూ ఉంటామని అంటారు. తండ్రి కూడా అంటారు - సందేశకుడిని మరియు మెసెంజర్ ను నేనే. నేను మీకు - ఇంటికి వెళ్ళండి అనే మెసేజ్ ను ఇస్తున్నాను. వేరే ధర్మ స్థాపకులైతే వచ్చి కేవలం తమ-తమ ధర్మాలను స్థాపన చేస్తారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అని నేను అందరికీ సందేశాన్ని ఇస్తాను. ఈ ప్రపంచము ఇప్పుడు నివసించేందుకు ఇక యోగ్యముగా లేదు. నన్ను స్మృతి చేసినట్లయితే పావనముగా అయిపోతారు. మీరు పావనముగా ఉండేవారు, తర్వాత రావణుడు పతితముగా తయారుచేశాడు. నేను మళ్ళీ పావనముగా తయారుచేయడానికి వచ్చాను. ఇంకా కొద్ది సమయములోనే ఈ బాంబులు మొదలైనవి పడినప్పుడు, ఇది అదే మహాభారత యుద్ధమని అర్థం చేసుకుంటారు. కావున తప్పకుండా భగవంతుడు కూడా ఉంటారు. కానీ వారు గీతా భగవానుడు శ్రీకృష్ణుడని భావిస్తారు. ఇది ఎంత పెద్ద తికమక. తికమకపడి ఉండకపోతే భగవంతుడికి రావాల్సిన అవసరమేముంది. భక్తి మార్గాన్ని తికమక దారుల ఆట అని అనడము జరుగుతుంది. ఇప్పుడు తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే అన్ని పొరపాట్లు సమాప్తమైపోతాయి. ఇంతకుముందు స్వయాన్ని దేహముగా భావించేవారు. ఇప్పుడు స్వయాన్ని దేహీగా భావిస్తున్నారు. పిల్లలూ, దేహీ-అభిమానులుగా అవ్వండి అనే అటెన్షన్ ను తండ్రియే ఇస్తారు. ఇక్కడ మీరు తండ్రి సమ్ముఖములో కూర్చున్నారు. అక్కడ సెంటర్లలో కుమార్తెలు కూర్చుని, శివబాబా ఇలా చెప్తున్నారని అర్థం చేయిస్తారు. ఇక్కడైతే డైరెక్టుగా తండ్రి అంటారు, నేను కూర్చుని ఆత్మలతో మాట్లాడతాను అని. బాబా వీరి ద్వారా మనకు అర్థం చేయిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇది పెద్ద కళ్యాణకారీ మేళా. తండ్రి అంటారు, నిరంతరము నన్ను స్మృతి చేయండి. బాబా నుండి మనము స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రిని మరియు స్వర్గాన్ని స్మృతి చేయాలి. ఎలాంటి వికర్మలు చేయకూడదు. ఒకవేళ వికర్మలు చేసినట్లయితే, అవి 100 రెట్లు అయిపోతాయి. వికర్మలు చేయించేది మాయ, దానిపై విజయము పొందాలి, అందుకే మహావీరుడైన హనుమంతుని కథ ఉంది. మీరు మహావీరులైన హనుమంతులు కదా. మనమైతే బాబాకు చెందినవారిగా అయిపోయాము. మనము మాయతో ఓడిపోలేము. కావున, తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ సతోప్రధానముగా, వికర్మాజీతులుగా అవుతాము. అలా అవ్వకపోతే మన పదవిని పోగొట్టుకుంటాము. పురుషార్థీ పిల్లలు ఎవరైతే ఉంటారో, వారు తమ జీవితముపై తామే దయ చూపించుకుంటారు. ఏమి జరిగినా సరే, స్మృతియాత్రలో ఉంటారు, అచంచలముగా, స్థిరముగా ఉంటారు. వినాశనమైతే జరగాల్సిందే. అందరి పెదనాన్నలు, చిన్నాన్నలు, మామయ్యలు, గురువులు, సాధువులు మొదలైనవారంతా సమాప్తమైపోతారు. నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తానని సద్గురువు అంటారు. మనుష్యులైతే పూర్తిగా అంధకారములో ఉన్నారు. శివబాబా మనల్ని తమతో పాటు తీసుకువెళ్తారని మీకు తెలుసు. కాలుడు కబళించాడని అంటారు కదా. కానీ నేనైతే మిమ్మల్ని శాంతిధామానికి తీసుకువెళ్తాను. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. కాలుడు తీసుకువెళ్ళడు, ఆత్మ వదిలి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నేను స్వయముగా వచ్చాను మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళేందుకు. బాబా ఏమైనా హతమార్చడానికి వచ్చారా? లేదు. మీరు పాత శరీరాన్ని వదలాలి. ఆత్మ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి. ఇప్పుడు 5 తత్వాలు కూడా తమోప్రధానముగా ఉన్నాయి, కావున శరీరాలు కూడా అదే విధముగా తయారవుతాయి. అక్కడ సతోప్రధాన తత్వాలతో మీ శరీరాలు కూడా సుందరముగా తయారవుతాయి.

తండ్రి అంటారు - నేను మళ్ళీ సత్యయుగీ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. మీరే 84 జన్మలను అనుభవించారు. మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు, మిగిలినవారెవరూ తమ ధర్మాన్ని మర్చిపోలేదు. వాస్తవానికి దేవీ-దేవతా ధర్మానికి చెందిన మనము అంత ఉన్నతమైనవారి నుండి ఇంత నీచమైనవారిగా ఎలా అయ్యాము అనేది ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి కూర్చుని కల్ప-కల్పము మీకే అర్థం చేయిస్తారు. మీరు మళ్ళీ ఇతరులకు అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు 84 జన్మల చక్రము పూర్తవుతుంది, వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు స్వయాన్ని యోగ్యులుగా తయారుచేసుకోవాలి. స్మృతి ద్వారానే యోగ్యులుగా తయారవ్వాలి. ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయండి. బాబా, మీరు ఎలా వస్తారు, మీరు సమ్ముఖముగా ఎలా మాట్లాడుతున్నారు, ఇది ఎంత అద్భుతము. అవన్నీ భక్తి మార్గములో విన్న మాటలు. ఇప్పుడైతే ఆత్మలైన మాకు తండ్రి అయిన మీరు లభించారు, ఆత్మకు తండ్రి లభించినప్పుడు ఆ ప్రేమలో వచ్చి కలుసుకుంటారు. పిల్లలు తండ్రిని చాలా ప్రేమగా కలుస్తారు. ఇక్కడైతే ఆ నిరాకార తండ్రి గుప్తముగా ఉన్నారు, అందుకే తండ్రి ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు - వారిని కలిసినప్పుడు శివబాబాను స్మృతి చేస్తూ కలవండి అని. మనుష్యులకైతే ఏమీ తెలియదు. మీలో కూడా ఎవరికైతే తెలుసో, వారు నా వారిగా అయ్యి మళ్ళీ మర్చిపోతారు. దేహాభిమానములోకి వచ్చేస్తారు. బాబా, నేను మీ వాడిగా అయిపోయాను అని ప్రతిజ్ఞను కూడా చేస్తారు. మేల్ అయినా, ఫిమేల్ అయినా, ఇరువురి ఆత్మ ఇలా చెప్తుంది. కానీ శరీరములో ఉన్నప్పుడు - మీ వాడిగా అయ్యానని పురుషుడు అంటారు, మీ దానిగా అయ్యానని స్త్రీ అంటుంది. బాబా, మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము, పూర్తిగా స్మృతి చేస్తాము అని అంటారు. స్మృతి లేకుండా తుప్పు వదలదు, తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వలేరు. సత్యయుగములో మీకు అఖండమైన, స్థిరమైన, సుఖ-శాంతులు, సంపద కల రాజ్యము 21 జన్మలకు లభిస్తుంది. స్వర్గ రచయిత అయిన తండ్రి తప్పకుండా తమ వారసత్వాన్ని ఇస్తారు. దూరంగా బ్రహ్మతత్వములో నివసించే పరమపిత పరమాత్ముని కోసం చింత ఉండేదని గానము కూడా చేస్తారు. వారు ఒక్కసారి మాత్రమే వస్తారు. ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. చాలా మంది అర్థమే చేసుకోరు, మున్ముందు కొద్దిగా పెద్ద యుద్ధము మొదలైనప్పుడు కళ్ళు తెరుచుకుంటాయి. వాస్తవానికి ఈ యజ్ఞము రచించబడింది. ఇది యుద్ధము కూడా. ఈ యజ్ఞము గురించి ఎవరికీ తెలియనే తెలియదు. రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని వినాశనము కోసమే రచించడము జరిగింది. మనుష్యులేమో వినాశనము జరగకూడదు, శాంతి ఏర్పడాలని యజ్ఞాలను రచిస్తారు. ఈ యజ్ఞాన్ని మళ్ళీ కూడా రచిస్తారు. వినాశనమైన తర్వాత ఏమి జరుగుతుందనేది వారికి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు మొత్తం విశ్వము యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. అందరి అనంతమైన జన్మ కథ గురించి తెలుసు. పరమపిత పరమాత్ముని జీవిత కథను మేము చెప్తాము అని అనేవారు ఎవరూ లేరు. పరమాత్మనే అందరూ పిలుస్తారు కదా. వారిని ఘడియ-ఘడియ స్మృతి చేస్తారు. భగవంతుడు ఈ బిడ్డను ఇచ్చారు, ఇది చేసారు అని అంటారు కదా. ఇది ఎవరి వస్తువో, వారే తీసేసుకున్నారు అని కొందరు భావిస్తారు. ఇలాంటి వివేకవంతులైన వ్యక్తులు కూడా కొందరు ఉంటారు. అనేక రకాల మనుష్యులు ఉన్నారు. ఇప్పుడు మీకు తండ్రి లభించారు కావున వారినే స్మృతి చేయాలి. స్మృతితోనే సంపాదన జరుగుతుంది. మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతారు. మీరు సత్యయుగము నుండి మొదలుకొని కలియుగ అంతిమము వరకు పూర్తి చక్రాన్ని తెలుసుకున్నారు. తండ్రి బుద్ధిలో ఎలాగైతే ఉందో, మీ బుద్ధిలో కూడా అలాగే ఉంది, అందుకే వారిని జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. ఇప్పుడు మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. పిల్లలైన మీరు అచంచలముగా, స్థిరముగా ఉండాలి. మాయ పదే-పదే వచ్చి కదిలించకూడదు. ముట్టుకుంటే ముడుచుకుపోయేవారిగా అవ్వకూడదు. తండ్రిని స్మృతి చేయకపోతే వాడిపోతారు. తండ్రిని స్మృతి చేసే పురుషార్థాన్ని మీరు చేస్తున్నారు. సమయము సమీపముగా వచ్చినప్పుడు, ఇక మా పురుషార్థము ఇప్పుడు పూర్తయ్యింది, అంతిమ సమయము వచ్చేసిందని మీరు గమనిస్తారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆత్మిక చదువును చదువుకుని, సత్యమైన సంపాదనను చేసుకోవాలి మరియు చేయించాలి. ఇంటికి వెళ్ళాలనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు ఎటువంటి వికర్మలు చేయకూడదు.

2. ఉదయాన్నే లేచి ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. చిన్న-చిన్న విషయాలలో ముట్టుకుంటే ముడుచుకుపోయేవారిగా అవ్వకూడదు. అవస్థను అచంచలముగా, స్థిరముగా తయారుచేసుకోవాలి.

వరదానము:-
జ్ఞానము యొక్క లైట్-మైట్ (ప్రకాశము మరియు శక్తి) ద్వారా తమ భాగ్యాన్ని మేలుకొలుపుకునే సదా సఫలతామూర్త భవ

ఏ పిల్లలైతే జ్ఞానము యొక్క లైట్-మైట్ ద్వారా ఆదిమధ్యాంతాలను తెలుసుకుని పురుషార్థము చేస్తారో, వారికి సఫలత తప్పకుండా ప్రాప్తిస్తుంది. సఫలత ప్రాప్తించడము కూడా భాగ్యానికి గుర్తు. నాలెడ్జ్ ఫుల్ గా (జ్ఞాన సంపన్నులుగా) అవ్వడమే భాగ్యాన్ని మేలుకొలుపుకునేందుకు సాధనము. జ్ఞానము అంటే కేవలం రచయిత మరియు రచనల జ్ఞానమే కాదు, కానీ నాలెడ్జ్ ఫుల్ అనగా ప్రతి సంకల్పము, ప్రతి మాట మరియు ప్రతి కర్మలో జ్ఞాన స్వరూపులుగా ఉండాలి, అప్పుడు సఫలతామూర్తులుగా అవుతారు. ఒకవేళ పురుషార్థము యథార్థముగా ఉన్నా కూడా సఫలత కనిపించడము లేదంటే - దానిని అసఫలతగా భావించకూడదు, దానిని పరిపక్వతకు సాధనముగా భావించాలి.

స్లోగన్:-
అతీతముగా అయి కర్మేంద్రియాలతో కర్మలు చేయించినట్లయితే కర్మాతీత స్థితిని సహజముగా అనుభవం చేయగలుగుతారు.

అవ్యక్త ప్రేరణలు - జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి

యోగములో కూర్చున్నప్పుడు ఇముడ్చుకునే శక్తిని సెకండులో ఉపయోగించండి. సేవకు సంబంధించిన సంకల్పాలు కూడా ఇమిడిపోవాలి. ఎంతటి శక్తి ఉండాలంటే స్టాప్ అని అనగానే స్టాప్ అయిపోవాలి. ఫుల్ బ్రేక్ పడాలి, లూజ్ బ్రేక్ కాదు. ఒకవేళ ఒక్క సెకెండుకు బదులుగా ఎక్కువ సమయము పట్టినట్లయితే ఇముడ్చుకునే శక్తి బలహీనముగా ఉంది అని అంటారు.