21-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇప్పుడు ఈశ్వరీయ సేవలో ఉన్నారు, మీరు అందరికీ సుఖపు మార్గాన్ని తెలియజేయాలి, స్కాలర్షిప్ తీసుకునే పురుషార్థము చేయాలి’’

ప్రశ్న:-
పిల్లలైన మీ బుద్ధిలో జ్ఞాన ధారణ బాగా జరిగినప్పుడు ఏ భయము తొలగిపోతుంది?

జవాబు:-
గురువు మాకు శాపాన్ని ఇస్తారేమో అనే భయమేదైతే భక్తిలో ఉంటుందో, ఆ భయము జ్ఞానములోకి రావడముతో, జ్ఞానాన్ని ధారణ చేయడముతో తొలగిపోతుంది, ఎందుకంటే జ్ఞాన మార్గములో ఎవ్వరూ శాపాన్ని ఇవ్వలేరు. రావణుడు శాపాన్ని ఇస్తాడు, తండ్రి వారసత్వాన్ని ఇస్తారు. రిద్ధి-సిద్ధి (మంత్ర-తంత్రాలు) నేర్చుకునేవారు విసిగించేటటువంటి, దుఃఖమునిచ్చేటటువంటి పనులు చేస్తారు, జ్ఞాన మార్గములోనైతే పిల్లలైన మీరు అందరికీ సుఖాన్ని ఇస్తారు.

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీరందరూ మొట్టమొదట ఆత్మలు. ఈ నిశ్చయము పక్కాగా ఉంచుకోవాలి. ఆత్మలమైన మనము ఇక్కడ శరీరాలు తీసుకుని పాత్రను అభినయించేందుకు పరంధామము నుండి వస్తామని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మయే పాత్రను అభినయిస్తుంది. మనుష్యులైతే శరీరమే పాత్రను అభినయిస్తుందని భావిస్తారు. ఇది అన్నింటికన్నా పెద్ద పొరపాటు. దీని కారణముగా ఆత్మ గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ రాకపోకలలో ఆత్మలైన మేము వస్తూ-వెళ్తూ ఉంటాము అన్న విషయాన్ని మర్చిపోతారు, అందుకే తండ్రియే వచ్చి ఆత్మాభిమానులుగా తయారుచేయవలసి ఉంటుంది. ఈ విషయము కూడా ఎవ్వరికీ తెలియదు. ఆత్మ తన పాత్రను ఎలా అభినయిస్తుంది అనేది తండ్రే అర్థం చేయిస్తారు. మనుష్యులు ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు, తక్కువలో తక్కువ 1-2 జన్మలు తీసుకుంటారు. ఆత్మ పునర్జన్మలనైతే తీసుకుంటూనే ఉండాలి. ఎక్కువ జన్మలు తీసుకునేవారు ఎక్కువ పునర్జన్మలు తీసుకుంటారని, తక్కువ జన్మలు తీసుకునేవారు తక్కువ పునర్జన్మలను తీసుకుంటారని దీనితో ఋజువవుతుంది. ఏ విధముగా నాటకములో కొందరికి ప్రారంభము నుండి చివరి వరకు పాత్ర ఉంటుంది, మరికొందరి పాత్ర తక్కువగా ఉంటుంది. ఇది మనుష్యులెవ్వరికీ తెలియదు. ఆత్మకు స్వయము గురించే తెలియనప్పుడు, ఇక తండ్రి గురించి ఎలా తెలుస్తుంది. ఇది ఆత్మకు సంబంధించిన విషయము కదా. తండ్రి అనగా ఆత్మలకు తండ్రి. శ్రీకృష్ణుడైతే ఆత్మలకు తండ్రి కాదు. శ్రీకృష్ణుడిని నిరాకారుడని అనరు. అతడిని సాకారములోనే గుర్తించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ ఉంటుంది. ప్రతి ఆత్మలోనూ పాత్ర అయితే నిశ్చితమై ఉంది. ఈ విషయాలను అర్థం చేయించగలిగేవారు మీలో కూడా నంబరువారు పురుషార్థమనుసారముగానే ఉన్నారు. ఆత్మలమైన మనము 84 జన్మలను ఏ విధముగా తీసుకున్నాము అన్నది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అంతేకానీ ఆత్మయే పరమాత్మ అని కాదు. అలా కాదు. ఆత్మలమైన మనము మొదట దేవతలుగా అవుతామని తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు పతితముగా, తమోప్రధానముగా ఉన్నారు, మళ్ళీ సతోప్రధానముగా, పావనముగా అవ్వాలి. సృష్టి పాతదిగా అయినప్పుడే తండ్రి వస్తారు. తండ్రి వచ్చి పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారుచేస్తారు. కొత్త సృష్టిని స్థాపన చేస్తారు. కొత్త ప్రపంచములో ఉన్నది ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము. వారే ఇంతకుముందు కలియుగీ శూద్ర ధర్మము వారిగా ఉండేవారు. ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మాకు ముఖవంశావళిగా అయ్యి బ్రాహ్మణులుగా అయ్యారు, బ్రాహ్మణ కులములోకి వస్తారు. బ్రాహ్మణ కులము వారి వంశము ఉండదు. బ్రాహ్మణ కులము వారు రాజ్యమేమీ చేయరు. ఈ సమయములో భారత్ లో బ్రాహ్మణ కులము వారూ రాజ్యము చేయరు, శూద్ర కులము వారూ రాజ్యము చేయరు. ఇరువురికీ రాజ్యము లేదు. కానీ ప్రజల పై ప్రజల రాజ్యమైతే నడుస్తుంది. బ్రాహ్మణులైన మీకు ఏ రాజ్యము లేదు. విద్యార్థులైన మీరు చదువుకుంటున్నారు. ఈ 84 జన్మల చక్రమెలా తిరుగుతుంది అనేది తండ్రి మీకే అర్థం చేయిస్తారు. సత్యయుగము, త్రేతాయుగము... ఆ తర్వాత సంగమయుగము ఉంటుంది. ఈ సంగమయుగానికి ఉన్న మహిమ వేరే ఏ యుగానికీ లేదు. ఇది పురుషోత్తమ సంగమయుగము. సత్యయుగము నుండి త్రేతాలోకి వస్తారు, రెండు కళలు తగ్గిపోతాయి, ఇక వారిని ఏమని మహిమ చేస్తారు! కింద పడిపోయేవారి మహిమ జరగదు. కలియుగాన్ని పాత ప్రపంచమని అంటారు. ఇప్పుడు కొత్త ప్రపంచము స్థాపన అవ్వనున్నది, అక్కడ దేవీ-దేవతల రాజ్యము ఉంటుంది. వారు పురుషోత్తములుగా ఉండేవారు. ఆ తర్వాత కళలు తగ్గిపోతూ, తగ్గిపోతూ కనిష్ఠులుగా, శూద్ర బుద్ధి కలవారిగా అవుతారు. వారిని రాతి బుద్ధి కలవారని కూడా అంటారు. ఎవరినైతే పూజిస్తున్నారో, వారి జీవిత కథను కూడా తెలుసుకోలేనంత రాతి బుద్ధి కలవారిగా తయారవుతారు. పిల్లలకు తమ తండ్రి జీవితము గురించి తెలియకపోతే వారసత్వము ఎలా లభిస్తుంది? ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి జీవితము గురించి తెలుసు. వారి నుండి మీకు వారసత్వము లభిస్తూ ఉంది. మీరు అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. నీవే తల్లి-తండ్రి... అని అంటున్నారంటే తప్పకుండా తండ్రి వచ్చి ఉంటారు, అప్పుడే అపారమైన సుఖాన్ని ఇచ్చి ఉంటారు కదా. తండ్రి అంటారు - నేను వచ్చాను, పిల్లలైన మీకు అపారమైన సుఖాన్ని ఇస్తాను. పిల్లల బుద్ధిలో ఈ జ్ఞానము బాగా నిలిచి ఉండాలి, అందుకే మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. మీకు ఇప్పుడు జ్ఞానమనే మూడవ నేత్రము లభించింది. మనమే దేవతలుగా అవుతామని మీకు తెలుసు. ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. కలియుగీ బ్రాహ్మణులు కూడా ఉన్నారు కదా. ఆ బ్రాహ్మణులకు వారి ధర్మము లేక కులము ఎప్పుడు స్థాపనయ్యింది అనేది తెలియదు, ఎందుకంటే వారు కలియుగములోని వారు. మీరు ఇప్పుడు డైరెక్టుగా ప్రజాపిత బ్రహ్మాకు సంతానముగా అయ్యారు మరియు మీరు అందరికంటే ఉన్నత శ్రేణికి చెందినవారు. తండ్రి కూర్చుని మిమ్మల్ని చదివించే సేవను, సంభాళించే సేవను మరియు అలంకరించే సేవను చేస్తారు. మీరు కూడా ఈశ్వరీయ సేవలోనే ఉన్నారు. గాడ్ ఫాదర్ కూడా అంటారు - నేను పిల్లలందరికీ సేవ చేసేందుకు వచ్చాను, నేను పిల్లలకు సుఖాన్ని ఇచ్చే మార్గాన్ని తెలియజేయాలి. ఇప్పుడు ఇంటికి పదండి అని తండ్రి అంటున్నారు. మనుష్యులు భక్తి కూడా ముక్తి కోసమనే చేస్తారు. తప్పకుండా జీవితములో బంధనము ఉంది. తండ్రి వచ్చి ఈ దుఃఖాల నుండి విడిపిస్తారు. అయ్యో-అయ్యో అని అంటారని పిల్లలైన మీకు తెలుసు. హాహాకారాల తర్వాత జయజయకారాలు జరుగుతాయి. ప్రాకృతిక వైపరీత్యాలు మొదలైనవి వచ్చినప్పుడు ఎంతగా అయ్యో-అయ్యో అని అంటూ రోదిస్తారు అన్నది ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మరొకవైపు యూరోప్ వాసులైన యాదవులు కూడా ఉన్నారు, యూరోప్ వాసులను యాదవులని అంటారని తండ్రి అర్థం చేయించారు. కడుపు నుండి ముసలము వెలువడి శాపము ఇచ్చినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు శాపము మొదలైనవాటి మాటే లేదు. ఇది డ్రామా. తండ్రి వారసత్వాన్ని ఇస్తారు, రావణుడు శాపాన్ని ఇస్తాడు. ఇది ఒక ఆటగా తయారుచేయబడి ఉంది. ఇకపోతే శాపము ఇచ్చే మనుష్యులు వేరే ఉంటారు. ఆ శాపాన్ని తొలగించేవారు కూడా ఉంటారు. గురువులు మొదలైనవారు ఎక్కడ శపిస్తారో అని మనుష్యులు భయపడతారు. వాస్తవానికి జ్ఞాన మార్గములో ఎవ్వరూ శాపము ఇవ్వలేరు. జ్ఞాన మార్గము మరియు భక్తి మార్గములో శాపము అనే మాటే లేదు. ఎవరైతే మంత్ర-తంత్రాలు మొదలైనవి నేర్చుకుంటారో, వారు శాపాలిస్తారు, మనుష్యులకు చాలా దుఃఖాన్ని కలుగజేస్తారు, ధనము కూడా చాలా సంపాదిస్తారు. భక్తులు ఇటువంటి పనులు చేయరు.

సంగమము అన్న పదముతోపాటు పురుషోత్తమ అన్న పదాన్ని తప్పకుండా వ్రాయండి అని కూడా బాబా అర్థం చేయించారు. త్రిమూర్తి అనే పదము కూడా తప్పకుండా వ్రాయాలి మరియు ప్రజాపిత అనే పదము కూడా అవసరము, ఎందుకంటే బ్రహ్మా అన్న పేరు కూడా చాలామందికి ఉంటుంది. ప్రజాపిత అనే పదము వ్రాసినప్పుడు వారు సాకారములో ప్రజాపిత అని అర్థం చేసుకోగలరు. కేవలం బ్రహ్మా అని వ్రాస్తే సూక్ష్మవతన నివాసి అని భావిస్తారు. బ్రహ్మా-విష్ణు-శంకరులను భగవంతుడని అనేస్తారు. ప్రజాపిత అని అంటే ప్రజాపిత ఇక్కడే ఉన్నారని అర్థం చేయించవచ్చు. వారు సూక్ష్మవతనములో ఎలా ఉండగలరు. బ్రహ్మా నాభి నుండి విష్ణువు వెలువడినట్లుగా చూపిస్తారు. పిల్లలైన మీకు కూడా జ్ఞానము లభించింది. నాభి మొదలైనవాటి విషయమేమీ లేదు. బ్రహ్మా విష్ణువుగా, విష్ణువు బ్రహ్మాగా ఎలా అవుతారు అని, పూర్తి చక్రమంతటి జ్ఞానాన్ని మీరు ఈ చిత్రాల ద్వారా అర్థం చేయించవచ్చు. చిత్రాలు లేకుండా అర్థం చేయించాలంటే శ్రమ అనిపిస్తుంది. బ్రహ్మాయే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మాగా అవుతారు. లక్ష్మీ-నారాయణులు 84 జన్మల చక్రములో తిరిగి మళ్ళీ బ్రహ్మా-సరస్వతులుగా అవుతారు. బాబా మొదటి నుండే పేర్లు పెట్టారు, భట్టీ ప్రారంభమైనప్పుడు పేర్లు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఎంతమంది వెళ్ళిపోయారు, అందుకే బ్రాహ్మణుల మాల తయారవ్వదు అని అర్థం చేయించారు ఎందుకంటే బ్రాహ్మణులు పురుషార్థులు. ఒక్కోసారి కిందకు, ఒక్కోసారి పైకి అవుతూ ఉంటారు. గ్రహచారము కూర్చుంటుంది. బాబా అయితే రత్నాల వ్యాపారిగా ఉండేవారు. ముత్యాలు మొదలైనవాటి మాల ఎలా తయారవుతుంది అన్న విషయములో వీరు అనుభవజ్ఞులు. బ్రాహ్మణుల మాల చివరిలో తయారవుతుంది. బ్రాహ్మణులైన మనమే దైవీ గుణాలను ధారణ చేసి దేవతలుగా అవుతాము. మళ్ళీ మెట్లు దిగవలసిందే. లేకపోతే 84 జన్మలు ఎలా తీసుకుంటారు? 84 జన్మల లెక్కతో దీనిని లెక్కించగలము. మీ అర్ధ సమయము పూర్తయిన తర్వాత ఇతర ధర్మాల వారు కలుస్తూ ఉంటారు. మాలను తయారుచేయడములో చాలా శ్రమ ఉంటుంది. ముత్యాలను కదలకుండా ఉండే విధముగా చాలా జాగ్రత్తగా టేబుల్ పై పెడతారు. ఆ తర్వాత సూదితో దారములో కుడతారు. ఎక్కడైనా సరిగ్గా తయారవ్వకపోతే మళ్ళీ మాలను తెంచవలసి ఉంటుంది. ఇదైతే చాలా పెద్ద మాల. మనము కొత్త ప్రపంచము కొరకు చదువుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. బాబా అర్థం చేయించారు - మనము శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుంచి దేవతలుగా ఎలా అవుతామో వచ్చి అర్థం చేసుకోండి అని ఇటువంటి స్లోగన్లు తయారుచేయండి. ఈ చక్రాన్ని తెలుసుకోవడము ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు, స్వర్గాధిపతులుగా అవుతారు. ఇటువంటి స్లోగన్లను తయారుచేసి పిల్లలకు నేర్పించాలి. బాబా యుక్తులైతే ఎన్నో చెప్తుంటారు. వాస్తవానికి మీకు ఎంతో విలువ ఉంది. మీకు హీరో-హీరోయిన్ పాత్ర లభిస్తుంది. మీరు వజ్రము వలె అవుతారు, మళ్ళీ 84 జన్మల చక్రములోకి వచ్చి గవ్వ సమానముగా అవుతారు. ఇప్పుడు వజ్ర సమానమైన జన్మ లభించిన తర్వాత కూడా గవ్వల వెనుక ఎందుకు పడతారు. అలాగని ఇళ్ళు-వాకిళ్ళను వదలమని కూడా కాదు. బాబా అయితే అంటారు, గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానముగా పవిత్రంగా ఉండండి మరియు సృష్టి చక్ర జ్ఞానాన్ని తెలుసుకుని, దైవీ గుణాలను కూడా ధారణ చేయండి, అప్పుడు మీరు వజ్ర సమానముగా అవుతారు. తప్పకుండా భారత్ 5 వేల సంవత్సరాల క్రితము వజ్ర సమానముగా ఉండేది. ఇది లక్ష్యము-ఉద్దేశ్యము. ఈ చిత్రాన్ని (లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని) చాలా గౌరవించాలి. పిల్లలైన మీరు ప్రదర్శనీలు, మ్యూజియంలలో చాలా సేవ చేయాలి. విహంగ మార్గపు సేవ చేయకుండా మీరు ప్రజలనెలా తయారుచేస్తారు? ఈ జ్ఞానాన్ని అనేకులు విన్నా కానీ ఉన్నతమైన పదవిని ఎవరో అరుదుగా మాత్రమే పొందుతారు. వారి గురించే కోట్లలో ఏ ఒక్కరో అని అంటారు. స్కాలర్షిప్ కూడా కొంతమందే తీసుకుంటారు కదా. 40-50 మంది విద్యార్థులు స్కూల్లో ఉన్నప్పటికీ, వారిలో ఏ ఒక్కరో అరుదుగా స్కాలర్షిప్ తీసుకుంటారు, ఎవరైనా కొద్దిమంది ప్లస్ లోకి వస్తే వారికి కూడా ఇస్తారు. ఇది కూడా అటువంటిదే. ప్లస్ లో చాలామంది ఉన్నారు. 8 రత్నాలు ఉన్నారు, వారు కూడా నంబరువారుగానే ఉన్నారు కదా. వారు మొట్టమొదట రాజ్య సింహాసనముపై కూర్చుంటారు. ఆ తర్వాత కళలు తగ్గిపోతూ ఉంటాయి. లక్ష్మీ-నారాయణుల చిత్రము నంబర్ వన్ చిత్రము. వారి వంశము కూడా నడుస్తుంది కానీ లక్ష్మీ-నారాయణుల చిత్రాన్నే చూపించారు. చిత్రాలైతే మారుతూ ఉంటాయని ఇక్కడ మీకు తెలుసు. ఆ చిత్రాలను చూపించడం వలన లాభమేమిటి. నామ, రూప, దేశ, కాలాలన్నీ మారిపోతాయి.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. కల్పక్రితము కూడా తండ్రి అర్థం చేయించారు. అలాగని, శ్రీకృష్ణుడు గోప-గోపికలకు వినిపించారని కాదు. శ్రీకృష్ణునికి గోప-గోపికలు ఉండరు, అలాగే వారికి జ్ఞానాన్ని నేర్పించడం కూడా జరగదు, శ్రీకృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. అక్కడ రాజయోగాన్ని ఎలా నేర్పిస్తారు లేదా పతితులను పావనముగా ఎలా చేస్తారు. ఇప్పుడు మీరు మీ తండ్రిని స్మృతి చేయండి. ఈ తండ్రే టీచరు కూడా. టీచరును విద్యార్థి ఎప్పుడూ మర్చిపోలేరు. తండ్రిని పిల్లలు మర్చిపోలేరు, గురువును కూడా మర్చిపోలేరు. తండ్రి అయితే జన్మించినప్పటి నుండే ఉంటారు. టీచర్ 5 సంవత్సరాల తర్వాత లభిస్తారు. ఆ తర్వాత గురువు వానప్రస్థములో లభిస్తారు. జన్మించినప్పటి నుండే గురువులను ఆశ్రయించడం వలన లాభమేమీ లేదు. గురువు ఒడిని తీసుకుని కూడా ఒకవేళ మరుసటి రోజే మరణిస్తే, అప్పుడు గురువేమి చేస్తారు? సద్గురువు లేకుండా గతిని పొందలేరని అంటూ ఉంటారు కూడా. సద్గురువు అన్న పదాన్ని పక్కనపెట్టి వారు కేవలం గురువు అని అంటారు. గురువులైతే అనేకమంది ఉన్నారు. బాబా అంటారు - పిల్లలూ, మీరు ఏ దేహధారినీ గురువుగా చేసుకోవలసిన అవసరము లేదు, మీరు ఎవ్వరినీ ఏదీ అడగకూడదు. యాచించడం కంటే మరణించడం మేలు అని అంటారు. మేము మా ధనాన్ని ఏ విధముగా ట్రాన్స్ఫర్ చేయాలని అందరికీ చింత ఉంటుంది. వారు మరుసటి జన్మ కొరకు ఈశ్వరార్థము దాన-పుణ్యాలు చేస్తారు కావున దానికి ఫలితము ఈ పాత ప్రపంచములోనే అల్పకాలము కోసం లభిస్తుంది. ఇక్కడ మీదంతా కొత్త ప్రపంచములోకి మరియు రాబోయే 21 జన్మల కొరకు ట్రాన్స్ఫర్ అవుతుంది. తనువు-మనస్సు-ధనములను ప్రభువు ముందు అర్పణ చేయాలి. అయితే వారొచ్చినప్పుడు మాత్రమే అర్పణ చేస్తారు కదా. ప్రభువు గురించి ఎవ్వరికీ తెలియదు కావున గురువును పట్టుకుంటారు. ధనము మొదలైనవి గురువుల ఎదురుగా అర్పిస్తారు. వారసులు లేకపోతే అంతా గురువులకే ఇచ్చేస్తారు. ఈ రోజుల్లో నియమానుసారముగా ఈశ్వరార్థము కూడా ఎవ్వరూ ఇవ్వడము లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను పేదల పెన్నిధిని, అందుకే నేను రావడము కూడా భారత్ లోనే వస్తాను. నేను వచ్చి మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తాను. డైరెక్ట్ కు మరియు ఇన్ డైరెక్ట్ కు ఎంత వ్యత్యాసము ఉంది. వారికేమీ తెలియదు. కేవలం ఈశ్వరార్పణము చేస్తున్నామని అంటారు. అదంతా తెలివితక్కువతనమే. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానము లభించడం వలన మీరు తెలివితక్కువవారి నుండి తెలివైనవారిగా అయ్యారు. తండ్రి అయితే అద్భుతము చేస్తారు అని బుద్ధిలో జ్ఞానము ఉంది. తప్పకుండా అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వమే లభించాలి. కేవలం దాదా ద్వారా మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. దాదా కూడా వారి నుండే వారసత్వాన్ని తీసుకుంటున్నారు. వారసత్వాన్ని ఇచ్చేది వారొక్కరే, వారినే స్మృతి చేయాలి. తండ్రి అంటారు - పిల్లలూ, నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో వస్తాను, ఇతనిలోకి ప్రవేశించి ఇతడిని కూడా పావనముగా చేస్తాను, ఆ తర్వాత ఇతను ఫరిశ్తాగా అవుతారు. బ్యాడ్జ్ పై మీరు చాలా సేవ చేయవచ్చు. మీ బ్యాడ్జ్ లన్నీ అర్థ సహితముగా ఉన్నాయి. ఇవి ప్రాణదానాన్ని ఇచ్చే చిత్రాలు. వీటి విలువ గురించి ఎవ్వరికీ తెలియదు. బాబాకు ఎప్పుడూ పెద్ద వస్తువులంటే ఇష్టమనిపిస్తుంది, దూరము నుండే ఎవరైనా చదవగలిగేలా ఉండాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు డైరెక్టుగా మీ తనువు, మనసు, ధనములను ఈశ్వరుని ఎదుట అర్పణ చేయడములో తెలివైనవారిగా అవ్వాలి. తమ సర్వస్వాన్ని 21 జన్మల కోసం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.

2. ఏ విధముగా తండ్రి చదివించే, సంభాళించే మరియు అలంకరించే సేవను చేస్తారో, అలా తండ్రి సమానముగా సేవ చేయాలి. జీవన బంధనము నుండి బయటకు తీసి అందరినీ జీవన్ముక్తిలోకి తీసుకువెళ్ళాలి.

వరదానము:-
జ్ఞాన కలశాన్ని ధారణ చేసి దాహముతో ఉన్నవారి దాహాన్ని తీర్చే అమృత కలశధారీ భవ

ఇప్పుడు మెజారిటీ ఆత్మలు - ప్రకృతి యొక్క అల్పకాలికమైన సాధనాలతో, ఆత్మిక శాంతిని పొందడము కోసమని తయారై ఉన్న అల్పజ్ఞ స్థానాలతో, పరమాత్మునితో మిలనము జరిపిస్తామని చెప్పే కాంట్రాక్టరులతో అలిసిపోయారు, నిరాశకు లోనై ఉన్నారు. సత్యము ఇంకేదో ఉంది అని భావిస్తున్నారు. ప్రాప్తి కోసము దాహముతో ఉన్నారు. ఇటువంటి దాహముతో ఉన్న ఆత్మలను ఆత్మిక పరిచయము, పరమాత్మ పరిచయము యొక్క యథార్థమైన బిందువులు కూడా తృప్త ఆత్మలుగా చేస్తాయి. అందుకే జ్ఞాన కలశాన్ని ధారణ చేసి దాహముతో ఉన్నవారి దాహాన్ని తీర్చండి. అమృత కలశము సదా మీతోపాటు ఉండాలి. అమరులుగా అవ్వండి మరియు అమరులుగా తయారుచేయండి.

స్లోగన్:-
ఎడ్జెస్ట్ అయ్యే కళను లక్ష్యముగా చేసుకున్నట్లయితే సహజముగా సంపూర్ణము అయిపోతారు.

అవ్యక్త సూచనలు - అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి

అశరీరిగా అయ్యేందుకు సర్దుబాటు శక్తి చాలా అవసరము. తమ దేహాభిమానపు సంకల్పాలను, దేహ ప్రపంచపు పరిస్థితులకు సంబంధించిన సంకల్పాలను సర్దిపెట్టాలి. ఇంటికి వెళ్ళాలి అన్న సంకల్పము తప్ప ఇతర ఏ సంకల్పాల విస్తారము ఉండకూడదు. ఇప్పుడిక మన ఇంటికి వెళ్ళబోతున్నాము అన్న ఈ సంకల్పమే ఉండాలి, అంతే. ఇలా అనుభవము చెయ్యండి - ఆత్మనైన నేను ఈ ఆకాశ తత్వము కంటే కూడా పైకి ఎగురుతూ వెళ్తున్నాను, దీని కొరకు ఇప్పటినుండే అకాల (భృకుటి) సింహాసనాధికారులుగా అయ్యే అభ్యాసాన్ని పెంచండి.