22-02-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 05.02.2009


‘‘సేవ చేస్తూ డబుల్ లైట్ స్థితి ద్వారా ఫరిశ్తాతనపు అవస్థలో ఉండండి, అశరీరిగా అయ్యే అభ్యాసము చేయండి’’

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లల యొక్క మూడు రూపాలను చూస్తున్నారు - ఏ విధముగా తండ్రి యొక్క మూడు రూపాలు తెలుసో, అదే విధముగా పిల్లలవి కూడా మూడు రూపాలను చూస్తున్నారు. అవి ఈ సంగమయుగము యొక్క లక్ష్యము మరియు లక్షణాలు, మొదటి స్వరూపము బ్రాహ్మణ స్వరూపము, రెండవది ఫరిశ్తా స్వరూపము, మూడవది దేవతా స్వరూపము. బ్రాహ్మణ్ సో ఫరిశ్తా, ఫరిశ్తా సో దేవతా. వర్తమాన సమయములో ఇప్పుడు విశేషముగా ఏ లక్ష్యము ఎదురుగా ఉంటుంది? ఎందుకంటే ఫరిశ్తాగా అవ్వకుండా దేవతగా అవ్వలేరు. వర్తమాన సమయమనుసారముగా మరియు స్వయము యొక్క పురుషార్థమనుసారముగా ఇప్పుడు లక్ష్యము ఫరిశ్తాగా అవ్వటము. సంగమయుగము యొక్క సంపన్న స్వరూపము ఫరిశ్తా సో దేవతగా అవ్వటము. ఫరిశ్తా యొక్క నిర్వచనము గురించి తెలుసు కూడా. ఫరిశ్తా అనగా పాత ప్రపంచపు సంబంధాలు, సంస్కారాలు, సంకల్పాల నుండి తేలికగా ఉండటము. పాత సంస్కారాలన్నిటి నుండి తేలికగా ఉండాలి. కేవలం మీ స్వభావము, సంస్కారాలు, ప్రపంచము నుండి తేలికగా అవ్వడము కాదు, ఫరిశ్తా అంటే సర్వుల సంబంధములోకి వస్తూ సర్వుల స్వభావ-సంస్కారాల విషయములో కూడా తేలికదనము కలిగి ఉండాలి. ఈ తేలికదనానికి గుర్తేమిటి? అటువంటి ఫరిశ్తా ఆత్మలు సర్వులకు ప్రియముగా ఉంటారు. ఏ కొందరికో ప్రియమైనవారిగా ఉండటము కాదు, వారు సర్వులకు ప్రియముగా ఉంటారు. ఎలా అయితే బ్రహ్మాబాబాను ప్రతి ఒక్కరూ ‘నా వారు’ అని భావిస్తారో, ‘నా బాబా’ అని అంటారో, అలాగే ఫరిశ్తా అనగా సర్వులకు ప్రియమైనవారు. కొంతమంది పిల్లలు బ్రహ్మాబాబా అయితే బ్రహ్మాయే కదా అని ఆనుకుంటారు, కానీ మీరందరూ మీ సమానముగా బ్రాహ్మణ ఆత్మలలో చూసారు, మీ అందరి ప్రియమైన దాదిని చూసారు, వారిని అందరూ ప్రేమతో ‘నా దాదీ’ అని అనుభవము చేస్తూ ఉండేవారు. అన్ని వైపులా అందరి స్వభావ-సంస్కారాలు ఉంటూ, ఈ పాత ప్రపంచములో ఉంటూ అతీతముగా మరియు ప్రియముగా ఉన్నారు, అందరూ అధికారముతో మా దాదీ అని అంటారు. ఇందుకు కారణమేమిటి? స్వయము స్వభావ-సంస్కారాల నుండి తేలికగా ఉండేవారు. అందరికీ ‘దాదీ నా వారు’ అని అనుభవము చేయించారు. ఉదాహరణగా నిలిచారు. జగదాంబను కూడా చూసారు కానీ కొంతమంది వారైతే జగదాంబ కదా అని అనుకుంటారు. కానీ దాదీ మీ బ్రాహ్మణ పరివారములో మీతో పాటు ఉన్నవారు కదా. దాదీ నుండి పురుషార్థము గురించి విన్నా లేక వారిని అడిగినా, వారి నోటి నుండి సదా ఒకే మాట వచ్చేది - ఇప్పుడు కర్మాతీతముగా అవ్వాలి. కర్మాతీతముగా అవ్వాలనే తపనలో ఇతరులకు కూడా ఇదే మాటను పదే-పదే గుర్తు చేయిస్తూ ఉండేవారు. కనుక బ్రాహ్మణులు ప్రతి ఒక్కరి యొక్క లక్ష్యము మరియు లక్షణాలు ఇప్పుడు విశేషముగా ఇవే ఉండాలి, ఉన్నాయి కూడా, కానీ నంబరువారుగా ఉన్నాయి. ఇప్పుడు ఫరిశ్తాగా అవ్వాల్సిందే అన్న ఈ తపనయే ఉండాలి. ఫరిశ్తా అనగా ఈ దేహము, సాకార దేహము నుండి అతీతముగా, సదా లైట్ యొక్క దేహధారిగా ఉండటము. ఫరిశ్తా అనగా ఈ కర్మేంద్రియాలకు రాజు.

బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు, మొత్తము సృష్టి చక్రములో ఒక్క బాప్ దాదా మాత్రమే - నా ఒక్కొక్క బిడ్డ రాజా బిడ్డ అని, స్వరాజ్యాధికారి అని గర్వముతో చెప్తారు. ఫరిశ్తా అనగా స్వరాజ్యాధికారి. అటువంటి స్వరాజ్యాధికారి ఆత్మ, ప్రకాశ స్వరూపధారి. ఎవరైనా ఇటువంటి ప్రకాశపు, డబుల్ తేలికతనపు స్థితిలో స్థితి అయి ఎవరినైనా కలిస్తే వారి మస్తకములో ఆత్మ జ్యోతి యొక్క భానము నడుస్తూ-తిరుగుతూ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ తీవ్ర పురుషార్థము యొక్క లక్ష్యాన్ని మరియు లక్షణాలను సదా ఇమర్జ్ రూపములో ఉంచుకోండి. బ్రహ్మాబాబాలో చూసారు కదా, బాబాను ఎవరైనా కలిసినప్పుడు, దృష్టి తీసుకున్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమి కనిపించేది? అంతిమ సమయములో ఎలా అనుభవము చేసారంటే, బ్రహ్మాబాబా మాట్లాడుతూ మాట్లాడుతూ కూడా మధురమైన అశరీరి స్థితిలో స్థితి అయ్యేవారు. ఎంతటి సేవా సమాచారము ఉన్నప్పటికీ ఇతరులకు కూడా క్షణములో అశరీరి స్థితిని అనుభవము చేయిస్తూ వచ్చారు. అంతేకాక ఏ మురళీనైనా చెక్ చేయండి, పదే-పదే నేను అశరీరి ఆత్మను అని చెప్తూ ఆత్మ పాఠాన్ని ఒకే మురళిలో ఎన్ని సార్లు గుర్తు చేయిస్తూ ఉండేవారు! ఇప్పుడు సమయమనుసారంగా చిన్న-చిన్న విస్తారము యొక్క విషయాలు, స్వభావ-సంస్కారాల విషయాలు అశరీరి అవస్థ నుండి దూరము చేసేస్తాయి. ఇప్పుడు ఇందులో పరివర్తన కావాలి.

బాప్ దాదా ఏమి చూసారంటే, సేవలో ఫలితము బాగుంటుంది, సేవ కొరకు మెజారిటీలో ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి, ప్లాన్లు కూడా తయారుచేస్తూ ఉంటారు, సందేశము ఇవ్వడము కూడా అవసరమే. బాప్ దాదా ఈ రోజు కూడా భిన్న-భిన్న వర్గాలు, భిన్న-భిన్న స్థానాలకు సంబంధించిన సేవలలో మంచి రిజల్టును చూసారు, కానీ సేవతో పాటు అశరీరి స్థితి యొక్క వాయుమండలము ఉంటే తక్కువ శ్రమతో అధిక ప్రభావాన్ని కలిగిస్తుంది. విన్నది బాగానే అనిపిస్తుంది, కానీ వాయుమండలము ద్వారా, అశరీరి స్థితి యొక్క దృష్టి ద్వారా అనుభవము పొందుతారు మరియు ఆ అనుభవాన్ని మర్చిపోలేరు. కనుక ఫరిశ్తాతనము యొక్క సాధనను ఇప్పుడు సేవలో విశేషముగా ఎడిషన్ చేయండి (కలపండి). శాంతి, సంతోషము, సుఖము, ఆత్మిక ప్రేమ - ఏదో ఒకదానిని అనుభవము చేయించండి. నడవడికలో ప్రీతి, ప్రేమ ద్వారా మరియు సంబంధము పరంగా, పరివారము పరంగా ఏ ఆతిథ్యమునైతే ఇస్తారో దాని ద్వారా, వారు అనుభవము చేసి వెళ్తారు, కానీ అతీంద్రియ సుఖము యొక్క ఫీలింగ్ ను, శాంతి యొక్క ఆత్మిక నషాను ఇప్పుడు వాయుమండలము ద్వారా, వైబ్రేషన్ల ద్వారా అనుభవము చేయించాలని విశేషముగా అటెన్షన్ లో పెట్టుకోండి. విశేషముగా అనుభవము చేయించండి, ఏదో ఒక అనుభవమును చేయించండి. వచ్చినవారు ఇక్కడి సిస్టమ్ ను (వ్యవస్థను) చూసి ప్రభావితులై వేళ్తారు కదా, పరివార ప్రేమను చూపించే ఇటువంటి సిస్టమ్ మరెక్కడా కనిపించదు అని అంటారు. అలాగే ఇప్పుడు ఏదో ఒక శక్తి, ఏదో ఒక ప్రాప్తి యొక్క అనుభవము చేసి వెళ్ళాలి. ఇప్పుడు 70-72 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. ఇంత సమయము యొక్క రిజల్టు ఏమి చూసారు! శ్రమ చేసారు, కానీ ఇప్పటివరకు బ్రహ్మాకుమారీలు కార్యము చేస్తున్నారు, బ్రహ్మాకుమారీల జ్ఞానము బాగుంది అని అంటారు. కానీ వీరికి ఇచ్చేవారు ఎవరు, నడిపించేవారు ఎవరు! సోర్స్ ఎవరు! మీ అందరి నుండి ‘బాబా’ అన్న పదాన్ని విని ‘వీరి బాబా’ అని అంటున్నారే కానీ ‘నా బాబా కూడా వారే’ అనేది రావాలి. తండ్రి ప్రత్యక్షత ఇప్పుడు గుప్త రూపములో ఉంది. బాబా-బాబా అని అంటారు కానీ నా బాబా, నేను బాబా వాడిని, బాబా నా వారు అనేది కోట్లలో కొందరి నోటి నుండి మాత్రమే వెలువడుతుంది.

మరి సంగమయుగము యొక్క లక్ష్యమేమిటి? ఆత్మలైన మనందరి తండ్రి వచ్చేసారు. వారసత్వమైతే తండ్రి నుండి లభిస్తుంది కదా! ఆ ప్రభావము ఫరిశ్తా అవస్థ ద్వారా వాయుమండలములో వ్యాపిస్తుంది. వీరి దృష్టి నుండి ప్రకాశము లభిస్తుంది, వీరి దృష్టిలో ఆత్మికత యొక్క ప్రకాశము కనిపిస్తుంది అన్నట్లు ఉండాలి. ఇప్పుడు తీవ్ర పురుషార్థము కొరకు ఇదే లక్ష్యము పెట్టుకోండి - నేను డబుల్ లైట్ ఫరిశ్తాను, నడుస్తూ-తిరుగుతూ ఫరిశ్తా స్వరూపము యొక్క అనుభూతిని పెంచండి. అశరీరి స్థితి యొక్క అనుభవాన్ని పెంచండి. క్షణములో ఏ సంకల్పములనైనా సమాప్తము చేయడములో, స్వభావ సంస్కారాలలో డబుల్ లైట్ గా ఉండాలి. కొంతమంది పిల్లలు ఏమంటారంటే - మేమైతే తేలికగానే ఉంటాము కానీ మా గురించి ఇతరులకు తెలియదు అని. కానీ అటువంటి డబుల్ లైట్ ఫరిశ్తాగా ఉంటే, డబుల్ లైట్ గా ఉన్నవారి లైట్ దాగి ఉండగలదా? చిన్న స్థూలమైన లైట్ అయినా, టార్చిలైట్ అయినా, అగ్గిపుల్ల అయినా గాని, లైట్ ఎక్కడ వెలిగినా అది దాగదు. మరి ఇదైతే ఆత్మిక లైట్, మీ వాయుమండలము ద్వారా ‘వీరెవరు’ అనేది వారికి అనుభవము చేయించండి! జగదాంబ గాని, దాదీ గాని, నా గురించి ఇతరులకు తెలియదు అని అనలేదు. తమ వాయుమండలము ద్వారా సర్వులకు ప్రియముగా ఉండేవారు. అందుకే దాదీ ఉదాహరణను ఇచ్చాము, ఎందుకంటే బ్రహ్మాబాబా గురించి కూడా బ్రహ్మాబాబాలోనైతే శివబాబా ఉండేవారు కదా అనుకుంటారు. ఇక శివబాబా గురించైతే వారు ఎలాగూ నిరాకారుడే, వారు అతీతుడు మరియు నిరాకారుడు, మేమైతే స్థూల శరీరధారులము, ఇంత పెద్ద సంగఠనలో ఉంటున్నాము, ప్రతి ఒక్కరి సంస్కారాల మధ్యలో ఉంటున్నాము అనుకుంటారు. సంస్కారాలను కలుపుకోవటము అనగా ఫరిశ్తాగా అవ్వటము. సంస్కారాలను చూసి కొందరు పిల్లలు నిరాశకు కూడా లోనవుతారు. బాబా చాలా మంచివారు, బ్రహ్మాబాబా చాలా మంచివారు, జ్ఞానము చాలా బాగుంది, ప్రాప్తులు చాలా బాగున్నాయి, కానీ స్వభావ-సంస్కారాలను కలుపుకోవడము అనగా సర్వులకు ప్రియముగా అవ్వడము. కొంతమందికి మాత్రమే ప్రియముగా అవ్వడము కాదు, ఎందుకంటే కొందరు పిల్లలేమంటారంటే, కొంతమంది పట్ల విశేషతలను చూసి కూడా ప్రేమ కలుగుతుంది అని. ఫలానావారి భాషణ చాలా బాగుంటుంది, ఫలానావారిలో ఫలానా విశేషత చాలా బాగుంది, వాణి చాలా బాగుంది అని అంటారు. ఫరిశ్తాగా అవ్వటములో ఇది విఘ్నము అవుతుంది. వారిని మీకు ప్రియమైనవారిగా చేసుకోండి, కానీ ఆత్మనైన నేను అతీతముగా ఉన్నాను - అతీతమైన స్థితిలో ఉంటూ ప్రియమైనవారిగా చేసుకోండి. విశేషత ఆధారముగా ప్రియమైనవారిగా చేసుకోవడము కాదు. ఫలానావారిలోని ఆ గుణము నాకు చాలా బాగా అనిపిస్తుంది అని అంటారు కదా, దానిని ధారణ చేస్తే చేయండి కానీ కేవలం దాని కారణముగానే ప్రియముగా అవ్వడమంటే అది తప్పు. ఫరిశ్తా సర్వులకు ప్రియముగా ఉంటారు. ప్రతి ఒక్కరూ ‘నా వారు’ అని చెప్పాలి. ‘నా వారు’ అన్నది అనుభవమవ్వాలి. ఇటువంటి ఫరిశ్తా అవస్థను చేరుకోవడములో రెండు విషయాలు విఘ్నాలు కలిగిస్తాయి. ఒకటి, దేహ భానము, ఇది సహజముగానే అందరికీ అనుభవముంది, 63 జన్మల దేహ భానము మళ్ళీ మళ్ళీ ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ఇక రెండవది, దేహాభిమానము. దేహ భానము మరియు దేహాభిమానము. జ్ఞానములో ఎంతెంతగా ముందుకు వెళ్తారో అంతే స్వయము పట్ల కూడా అప్పుడప్పుడు దేహాభిమానము వచ్చేస్తుంది, ఆ అభిమానము కింద పడవేస్తుంది. దేహాభిమానము ఏ రూపములో వస్తుంది? ఏదైనా విశేషత ఉంటుంది కదా, ఆ విశేషత కారణముగా అభిమానము ఉంటుంది, నేనేమైనా తక్కువనా, నా భాషణ అందరికీ నచ్చుతుంది, నా సేవ యొక్క ప్రభావము పడుతుంది. అలాగే ఏదో ఒక కళ, నేను బాగా హ్యాండ్లింగ్ చేస్తాను, నేను కోర్స్ బాగా చేయిస్తాను. జ్ఞానములో ముందుకు వెళ్ళేటప్పుడు, సేవలో ముందుకు వెళ్ళేటప్పుడు, ఈ అభిమానము స్వయము పట్ల కూడా వస్తుంది మరియు ఇతరుల గుణాలు లేక కళలు లేక విశేషతల పట్ల కూడా ప్రేమ కలుగుతుంది. కానీ ఏం గుర్తుకొస్తుంది? దేహభానమే గుర్తుకొస్తుంది కదా! ఫలానావారి బుద్ధి చాలా మంచిది, నా హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది, ఈ అభిమానము సేవలో లేదా పురుషార్థములో ముందుకు వెళ్ళేవారికి అభిమానము రూపములో వస్తుంది. కనుక ఇది కూడా చెక్ చేసుకోవాలి. అభిమానము ఉన్నవారికి అభిమానము ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవడానికి సాధనము ఏమిటంటే - అభిమానము ఉన్నవారిని కొద్దిగా అయినా అవమానపరచినా, వారి ఆలోచనలను, వారి సలహాలను, వారిలోని కళలను, వారి హ్యాండ్లింగ్ చేసే విధానాన్ని, ఎందులోనైనా అవమానము చాలా త్వరగా ఫీల్ అవుతారు. మరియు అవమానము ఫీల్ అయ్యారంటే, దానికి మరింత సూక్ష్మ గుర్తు ఏమిటంటే, క్రోధము యొక్క అంశమైన ఆవేశము ఉత్పన్నమవుతుంది. అది ఫరిశ్తాగా అవ్వనివ్వదు. వర్తమాన సమయమనుసారముగా బాప్ దాదా మళ్ళీ సూచనను ఇస్తున్నారు - మీ సంగమయుగ చివరి స్వరూపమైన ఫరిశ్తా స్వరూపాన్ని ఇప్పుడు జీవితములో ప్రత్యక్షము చేయండి, సాకారములోకి తీసుకురండి. ఫరిశ్తాగా అవ్వటము ద్వారా అశరీరిగా అవ్వటము చాలా సహజమైపోతుంది. మీ చెకింగ్ చేసుకోండి, మీ విశేషత పట్ల గాని లేక ఎవరిదైనా విశేషత పట్ల గాని సూక్ష్మరూపములో కూడా ఎటువంటి మోహము లేక అభిమానము అయితే లేదు కదా? కొందరి పిల్లల అవస్థ ఎలా ఉంటుందంటే, చిన్న విషయము జరిగినా కానీ స్థితి తలకిందులైపోతుంది. మనసు మరియు ముఖము సంతోషముగా ఉండటానికి బదులుగా చింతన చేసే ముఖమున్నా ఉంటుంది లేక చింత కలిగిన ముఖమన్నా ఉంటుంది, అంతేకాక నడుస్తూ-నడుస్తూ దుఃఖానికి మరియు నిరాశకు కూడా లోనవుతారు. మనసు సంతోషముగా ఉండేందుకు బదులుగా దుఃఖానికి మరియు నిరాశకు లోనవుతారు. మరి అర్థమయిందా? ఇప్పుడు మీ సంగమయుగము యొక్క ఆఖరి స్టేజ్ అయిన ఫరిశ్తాతనపు సంస్కారాలను ఇమర్జ్ చేసుకోండి. బ్రహ్మాబాబాను చూసారు కదా, మరి ఫాలో ఫాదర్ చేయాలి కదా. మాట్లాడుతూ, మాట్లాడుతూ చివరిలో చాలామంది పిల్లలకు అనుభవము ఉంది. సమాచారము వినిపించాలని వచ్చేవారు కానీ సమాచారానికి అతీతముగా, శబ్దానికి అతీతమైన స్థితి అనుభవం చేయడాన్ని గమనించారు. అనేక విషయాల సమాచారాన్ని వినిపించాలని, ఇది చెప్పాలి, అది చెప్పాలి, ఇది అడగాలి అని ఎన్నో ప్లాన్ చేసుకుని వచ్చేవారు కానీ ఎదురుగా రాగానే ఏమి చెప్పాలనుకున్నారో అదే మర్చిపోయేవారు. ఇది ఫరిశ్తా అవస్థ. మరి ఈ రోజు ఏ పాఠాన్ని పక్కా చేసుకున్నారు? నేను ఎవరిని? ఫరిశ్తాను. ఇతర విషయాల నుండి, ఇతరుల విశేషతల నుండి, స్వయము యొక్క విశేషతల నుండి, దేహాభిమానము నుండి అతీతముగా డబుల్ లైట్ ఫరిశ్తా, ఎందుకంటే ఫరిశ్తాగా అవ్వకుండా దేవతా అనే ఉన్నతమైన పదవి లభించదు. సత్యయుగములోకైతే వచ్చేస్తారు ఎందుకంటే పిల్లలుగా అయితే అయ్యారు, వారసత్వమైతే లభిస్తుంది, కానీ శ్రేష్ఠ పదవి లభించదు. సదా కలిసి ఉంటాము, కలిసి రాజ్యము చేస్తాము అని ప్రతిజ్ఞ చేసారు కదా. సింహాసనముపై కూర్చోకపోయినా సరే రాజ్యాధికారులుగా అవ్వాలి, అక్కడి రాజ్యసభను చూసారు కదా. రాజ్యసభకు ఎవరెవరు అధికారులో వారు తిలకధారిగా మరియు కిరీటధారిగా ఉంటారు. రాజ్య తిలకము, రాజ్యానికి గుర్తు కిరీటము. కనుక బహుకాలము యొక్క స్వరాజ్యాధికారిగా ఉండాలి, మధ్యమధ్యలో కాదు. బహుకాలపు స్వరాజ్యాధికారి సింహాసనముపై కూర్చోకపోయినా కానీ రాయల్ ఫ్యామిలీకి అధికారులుగా అవుతారు. అచ్ఛా!

అచ్ఛా, ఈ రోజు మొదటిసారి వచ్చినవారు లేవండి. అచ్ఛా, మూడు వంతుల సభ లేచి నిలబడ్డారు. అచ్ఛా, ఎవరెవరైతే మొదటిసారి వచ్చారో వారందరికీ బాబాతో సాకారములో కలుస్తున్నందుకు మొదటి జన్మదిన శుభాకాంక్షలు. బాప్ దాదా వచ్చిన పిల్లలందరికీ ఇదే వరదానమిస్తున్నారు - మీరు రావడము టూ లేట్ సమయములో వచ్చారు కానీ కొత్తగా వచ్చి ఉన్న పిల్లల పట్ల ఒక విశేష వరదానముంది, అదేమిటంటే - ఎప్పుడూ కూడా, మేము ముందుకు ఎలా వెళ్ళగలము అన్న సంకల్పము చేయకండి. టూ లేట్ ఇక మీదట వచ్చేవారికి. మీరు లేట్ గా వచ్చారే కానీ టూ లేట్ లో రాలేదు మరియు ఇప్పుడు మీ అందరి పట్ల విశేషముగా బాప్ దాదా మరియు నిమిత్తమై ఉన్న బ్రాహ్మణ పరివారపు సోదరీ-సోదరులకు విశేషముగా ఏ సహయోగ భావన ఉందంటే, మీరు ఈ కొద్ది సమయము ఒక్కొక్క సెకండును సఫలము చేసుకోవాలి, ఎందుకంటే తక్కువ సమయములో ఎక్కువ పొందాలి, ఒక సెకండ్ ను కూడా వ్యర్థముగా పోగొట్టుకోవద్దు. కర్మయోగులై నడుచుకోండి, కర్మను విడిచిపెట్టకూడదు కానీ కర్మలో యోగాన్ని జోడిస్తూ కర్మ మరియు యోగము యొక్క బ్యాలెన్స్ ఉంచాలి. బ్యాలెన్స్ ఉంచేవారికి అదనముగా బ్లెస్సింగ్స్ (ఆశీర్వాదాలు) లభిస్తాయి. కావున ఎవరైతే లేట్ గా వచ్చారో, మీకు ఛాన్స్ ఉంది, టూ లేట్ అన్నది ఇక మున్ముందు రానున్నది. కొద్ది సమయములోనే చాలా పురుషార్థము చేయవచ్చు. బాప్ దాదా వరదానము ఇస్తున్నారు - (హిమ్మతే బచ్చే మదదే బాప్) పిల్లలు ధైర్యముంచితే తండ్రి సహాయము ఉండనే ఉంటుంది.

నలువైపులా ఉన్న పిల్లలందరికీ బాప్ దాదా యొక్క హృదయపూర్వక ఆశీర్వాదాలు, పదమాల రెట్లు అభినందనలను మరియు శుభాకాంక్షలను ఇస్తున్నారు మరియు వచ్చినవారు మరియు ఎవరైతే ఉత్తరాలు, ఈ-మెయిల్స్ పంపారో అవి సెకండ్ కంటే కూడా తక్కువ సమయములో బాప్ దాదా వద్దకు చేరుకుంటాయి. వారికి కూడా మరియు బాప్ దాదా కొరకై తపిస్తున్న ఆత్మలకు, బంధనములో ఉన్న కుమార్తెలు ఎవరైతే దెబ్బలను కూడా కంఠహారముగా చేసుకుంటున్నారో, అటువంటి ఆత్మలకు కూడా ప్రియస్మృతులు మరియు కొత్త-కొత్త స్నేహీ ఆత్మలెవరైతే ఇప్పుడు వెలువడుతున్నారో, వారు తక్కువగా ఉన్నారు. స్నేహీ మరియు సహయోగీ, డబుల్ ఉండాలి. నలువైపులా ఉన్న యువతకు, వృద్ధులకు, పిల్లలకు, మాతలకు, పాండవులకు, అందరికీ అభినందనలు. అచ్ఛా!

వరదానము:-
సాకార మరియు నిరాకార తండ్రి యొక్క తోడు ద్వారా ప్రతి సంకల్పములోనూ విజయులుగా అయ్యే సదా సఫలతామూర్త భవ

ఏ విధముగా నిరాకార ఆత్మ మరియు సాకార శరీరము, రెండింటి సంబంధముతో ప్రతి కార్యాన్ని చేయగలుగుతారో, అదే విధముగా నిరాకార తండ్రి మరియు సాకార తండ్రి ఇరువురినీ తోడుగా మరియు ఎదురుగా ఉంచుకుంటూ ప్రతి కర్మను మరియు సంకల్పాన్ని చేయండి, అప్పుడు సఫలతామూర్తులుగా అవుతారు ఎందుకంటే ఎప్పుడైతే బాప్ దాదా సమ్ముఖముగా ఉంటారో అప్పుడు తప్పకుండా వారితో వెరిఫై చేయించుకుని నిశ్చయముతో మరియు నిర్భయతతో చేస్తారు. దీని ద్వారా సమయము మరియు సంకల్పాలు పొదుపు అవుతాయి. ఏదీ వ్యర్థముగా పోదు, ప్రతి కర్మ స్వతహాగా సఫలమవుతుంది.

స్లోగన్:-
ఆత్మిక స్నేహము సంపద కన్నా కూడా అధికముగా విలువైనది, అందుకే మాస్టర్ స్నేహ సాగరులుగా అవ్వండి

అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి

ధర్మ సత్తా కలవారి ఎదురుగా పవిత్రతా శక్తిని నిరూపించండి మరియు రాజ్య సత్తా కలవారి ఎదురుగా ఏకతా శక్తిని నిరూపించండి. ఈ రెండు శక్తులను నిరూపించటము ద్వారా ఈశ్వరీయ సత్తా యొక్క జెండా చాలా సహజముగా ఎగురుతుంది. ఇప్పుడు ఈ రెండింటి పట్ల విశేషమైన అటెన్షన్ ఉండాలి. ఎంతెంతగా మీరు పవిత్రతా మరియు ఏకతా శక్తితో వారి సమీప సంపర్కములోకి వస్తూ ఉంటారో, అంతగా వారు స్వయమే మీ వర్ణన చెయ్యటం మొదలుపెడతారు.