22-04-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు తండ్రి స్మృతిలో ఏక్యురేట్ గా ఉన్నట్లయితే మీ ముఖము సదా ప్రకాశిస్తూ సంతోషముగా ఉంటుంది’’

ప్రశ్న:-
స్మృతిలో కూర్చునే విధి ఏమిటి మరియు దాని ద్వారా కలిగే లాభాలేమిటి?

జవాబు:-
స్మృతిలో కూర్చున్నప్పుడు బుద్ధి ద్వారా వ్యాపార-వ్యవహారాలు మొదలైన పంచాయితీలన్నింటినీ మరచి స్వయాన్ని దేహీ (ఆత్మ) గా భావించండి. దేహము మరియు దేహపు సంబంధాల వల చాలా పెద్దది, ఆ వలను మింగేసి దేహాభిమానము నుండి అతీతులుగా అవ్వండి అనగా మీరు మరణిస్తే, మీకు సంబంధించినంత వరకు ఈ ప్రపంచము మరణించినట్లే. జీవిస్తూనే అంతటినీ మరచి ఒక్క తండ్రి స్మృతియే ఉండాలి, ఇది అశరీరి అవస్థ, దీనితో ఆత్మకు పట్టిన తుప్పు వదిలిపోతూ ఉంటుంది.

పాట:-
రాత్రి ప్రయాణీకుడా...

ఓంశాంతి
పిల్లలు స్మృతియాత్రలో కూర్చున్నారు, దీనినే యోగములో కూర్చోవడము లేదా శాంతిలో కూర్చోవడమని అంటారు. కేవలం శాంతిలో కూర్చోవడమే కాదు, ఏదో చేస్తున్నారు, స్వధర్మములో స్థితులై ఉన్నారు, అంతేకాక యాత్రలో కూడా ఉన్నారు. ఈ యాత్రను నేర్పించే తండ్రి తనతో పాటు తీసుకువెళ్తారు కూడా. వారు దైహిక బ్రాహ్మణులు, వారు తమతో పాటు తీసుకువెళ్తారు. మీరు ఆత్మిక బ్రాహ్మణులు, బ్రాహ్మణుల వర్ణము లేదా కులమని అంటారు. ఇప్పుడు పిల్లలు స్మృతియాత్రలో కూర్చున్నారు, ఇతర సత్సంగాలలో కూర్చున్నప్పుడు, గురువుగారు వచ్చి ప్రవచనము వినిపిస్తారు అని గురువుగారు గుర్తుకువస్తారు. గురువు వచ్చి ప్రవచనాన్ని వినిపిస్తారు. అదంతా భక్తి మార్గము. ఇది స్మృతియాత్ర, దీని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. మీరు తుప్పును తొలగించుకునేందుకు స్మృతిలో కూర్చుంటారు. స్మృతి ద్వారా తుప్పు తొలగుతుందని తండ్రి డైరెక్షన్ ఉంది ఎందుకంటే పతిత-పావనుడిని నేనే. ఎవరో స్మృతి చేయడము వలన నేను రాను. నేను రావడము కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. పతిత ప్రపంచము మారి పావన ప్రపంచముగా అవ్వనున్నప్పుడు, కనుమరుగైపోయిన ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని మళ్ళీ బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారు. ఒక్క సెకెండులో బ్రహ్మా నుండి విష్ణువుగా అవుతారని ఈ బ్రహ్మాను గురించే అర్థం చేయించారు. మళ్ళీ విష్ణువు నుండి బ్రహ్మాగా అవ్వడానికి 5 వేల సంవత్సరాలు పడుతుంది. ఇవి కూడా బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇంతకుముందు శూద్రులుగా ఉన్న మీరు ఇప్పుడు బ్రాహ్మణ వర్ణములోకి వచ్చారు. మీరు బ్రాహ్మణులుగా అయినప్పుడు మాలిన్యాన్ని తొలగించేందుకని, శివబాబా బ్రహ్మా ద్వారా మీకు ఈ స్మృతియాత్రను నేర్పిస్తారు. ఈ రచన యొక్క చక్రము ఎలా తిరుగుతుంది అనేదైతే మీరు అర్థం చేసుకున్నారు. దీనికి సమయమేమీ పట్టదు. వాస్తవానికి ఇప్పుడిది కలియుగము. ఇప్పుడింకా ఇది కలియుగము యొక్క ఆది సమయమని వారంటారు, కానీ తండ్రి అంటారు, ఇది కలియుగము యొక్క అంతిమము, ఘోర అంధకారముంది. తండ్రి అంటారు, మీకు ఈ వేద-శాస్త్రాల సారాన్ని అంతా అర్థం చేయిస్తాను.

పిల్లలైన మీరు ఉదయము ఇక్కడ కూర్చున్నప్పుడు స్మృతిలో కూర్చోవలసి ఉంటుంది. లేకపోతే మాయ తుఫానులు వస్తాయి. వ్యాపార-వ్యవహారాల వైపుకు బుద్ధియోగము వెళ్ళిపోతుంది. ఇవన్నీ బయటి పంచాయితీలు కదా. సాలెపురుగు ఎంతటి వలను అల్లుతుంది, ఆ వలనంతా మింగేస్తుంది కూడా. అలాగే దేహానికి సంబంధించి ఎంతటి ప్రపంచము ఉంది. పెదనాన్న, చిన్నాన్న, మామయ్య, గురువులు మొదలైనవారు... ఇలా ఎన్ని వలలు కనిపిస్తూ ఉంటాయి. దేహ సహితముగా వాటన్నింటినీ మింగేయాలి. కేవలం దేహీగా మాత్రమే అవ్వాలి. మనుష్యులు శరీరాన్ని వదిలినప్పుడు అంతా మర్చిపోతారు. మీరు మరణిస్తే, మీకు సంబంధించినంత వరకు ఈ ప్రపంచము మరణించినట్లే. ఈ ప్రపంచము సమాప్తమవ్వనున్నదని బుద్ధిలో జ్ఞానముంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఎవరి నోరు అయితే తెరుచుకోదో, వారు కేవలం స్మృతి చేయండి. వీరు (బ్రహ్మా) ఏ విధముగా తండ్రిని స్మృతి చేస్తారు. కన్య తన పతిని స్మృతి చేస్తుంది ఎందుకంటే ఆమెకు పతి, పరమేశ్వరుడు అవుతారు, అందుకే తన తండ్రి నుండి బుద్ధి తొలగి పతి వైపుకు వెళ్ళిపోతుంది. వీరైతే పతులకే పతి, వరుడు కదా. మీరందరూ వధువులు, అందరూ భగవంతునికి భక్తిని చేస్తారు. భక్తురాళ్ళందరూ రావణుడి నిఘాలో ఖైదీగా ఉన్నారు కనుక తండ్రికి తప్పకుండా దయ కలుగుతుంది కదా. తండ్రి దయార్ద్ర హృదయుడు, వారిని మాత్రమే దయార్ద్ర హృదయుడని అంటారు. ఈ సమయములో గురువులైతే అనేక రకాలవారు ఉన్నారు. ఎవరైనా ఏమైనా శిక్షణ ఇస్తే, వారిని గురువని అనేస్తారు. ఇక్కడైతే తండ్రి ప్రాక్టికల్ గా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఈ రాజయోగాన్ని నేర్పించడము పరమాత్మకు తప్ప ఇంకెవ్వరికీ రానే రాదు. పరమాత్మయే వచ్చి రాజయోగాన్ని నేర్పించారు, ఇక తర్వాత దాని ద్వారా ఏమి జరిగింది అనేది ఎవరికీ తెలియదు. గీతలోని ఉదాహరణలనైతే చాలామంది చెప్తారు, చిన్న కుమారీలు కూడా గీతను కంఠస్థము చేస్తారు, అప్పుడు ఎంతోకొంత మహిమ జరుగుతుంది. గీత అనేదేమీ మాయమైపోలేదు. గీతకు చాలా మహిమ ఉంది. గీతా జ్ఞానము ద్వారానే తండ్రి మొత్తము ప్రపంచమంతటినీ పునరుజ్జీవింపజేస్తారు, మీ శరీరాలను కల్పతరువులా అనగా కల్పవృక్షములా అమరముగా చేస్తారు.

పిల్లలైన మీరు తండ్రి స్మృతిలో ఉంటారు, మీరు తండ్రిని ఆహ్వానించరు. మీరు తండ్రి స్మృతిలో ఉంటూ మీ ఉన్నతిని చేసుకుంటున్నారు. మేము శివబాబా స్మృతిలోనే భోజనము తింటాము అనగా శివబాబాతో పాటు తింటాము అని తండ్రి డైరెక్షన్ పై నడుచుకునే అభిరుచి కూడా ఉండాలి. ఆఫీసులో కూడా ఎంతోకొంత సమయము లభిస్తుంది. కుర్చీలో కూర్చున్నప్పుడు, స్మృతిలో కూర్చుండిపోతామని పిల్లలు బాబాకు వ్రాస్తారు. ఆఫీసర్ వచ్చి చూసినప్పుడు, అతనికి వారు కూర్చుని ఉండగానే మాయమైపోయినట్లుగా కనిపిస్తారు ఎందుకంటే వారు అశరీరిగా అయిపోతారు. కొంతమంది కళ్ళు మూసుకుంటాయి, కొంతమంది కళ్ళు తెరిచి ఉంటాయి, కొంతమంది ఎలా కూర్చుని ఉంటారంటే, అసలు వారు ఏమీ చూడనట్లుగానే కూర్చుని ఉంటారు, అక్కడి నుండి మాయమైపోయినట్లుగా ఉంటారు. ఈ విధముగా జరుగుతూ ఉంటుంది. బాబా వారి బుద్ధి తాడును లాగారు (ఆకర్షించారు), మరియు వారు ఆనందముగా కూర్చుండిపోయారు. వారిని, మీకు ఏమయింది అని అడుగుతారు. మేము తండ్రి స్మృతిలో కూర్చుని ఉన్నామని అంటారు. మేము బాబా వద్దకు వెళ్ళాలి అని బుద్ధిలో ఉంటుంది. తండ్రి అంటారు - ఆత్మాభిమానులుగా అవ్వడముతో మీరు నా వద్దకు వచ్చేస్తారు, పవిత్రముగా అవ్వకుండా అక్కడికి వెళ్ళలేరు. ఇప్పుడు పవిత్రముగా ఎలా అవ్వాలి? అది తండ్రియే చెప్పగలరు, మనుష్యులు చెప్పలేరు. మీరు ఎంతోకొంత అర్థం చేసుకుని ఉంటే ఇతరుల కళ్యాణము కూడా చేస్తారు. మీరు ఇతరుల కళ్యాణము చేసే మరియు తండ్రి పరిచయాన్ని ఇచ్చే పురుషార్థము తప్పకుండా చేయాలి. భక్తి మార్గములో కూడా ఓ గాడ్ ఫాదర్ అని అంటూ స్మృతి చేస్తారు. గాడ్ ఫాదర్, దయ చూపించండి. ఇలా పిలవడమనేది ఒక అలవాటుగా అయిపోయింది. తండ్రి పిల్లలైన మిమ్మల్ని తన సమానముగా కళ్యాణకారులుగా తయారుచేస్తారు. మాయ అందరినీ ఎంత తెలివితక్కువవారిగా చేసింది. లౌకిక తండ్రి కూడా పిల్లల నడవడిక బాగా లేకపోవడాన్ని చూస్తే ఇలా అంటారు - నీవు తెలివితక్కువవాడివి, ఒక్క సంవత్సరములో తండ్రి ఆస్తినంతా పోగొట్టేస్తావు అని. అలాగే అనంతమైన తండ్రి కూడా అంటారు - నేను మిమ్మల్ని ఎలా తయారుచేసాను, ఇప్పుడు మీ నడవడికను చూసుకోండి. ఇది ఎంత అద్భుతమైన ఆట అనేది పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. భారత్ యొక్క పతనము ఎంతగా జరుగుతుంది. భారతవాసుల పతనము జరుగుతుంది. మేము పడిపోయామని, మేము కలియుగీ తమోప్రధానులుగా అయ్యామని వారు స్వయము గురించి ఇలా అనుకోరు. భారత్ స్వర్గముగా ఉండేది అనగా మనుష్యులు స్వర్గవాసులుగా ఉండేవారు, ఆ మనుష్యులే ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు. ఈ జ్ఞానము ఎవ్వరిలోనూ లేదు. ఇంతకుముందు ఈ బాబాకు కూడా ఇదంతా తెలియదు. ఇప్పుడు బుద్ధిలో చమత్కారము జరిగింది. 84 జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ మెట్లు అయితే తప్పకుండా దిగవలసి ఉంటుంది, పైకి ఎక్కే ఆస్కారమే లేదు. దిగుతూ-దిగుతూ పతితముగా అవ్వాల్సిందే. ఈ విషయము ఎవరి బుద్ధిలోనూ లేదు. తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయించారు, మీరు తిరిగి భారతవాసులకు ఇలా అర్థం చేయిస్తారు - మీరు స్వర్గవాసులుగా ఉండేవారు, ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు, 84 జన్మలు కూడా మీరే తీసుకున్నారు అని. పునర్జన్మలనైతే నమ్ముతారు కదా. కావున తప్పకుండా కిందకు దిగాలి. ఎన్ని పునర్జన్మలను తీసుకున్నారు అనేది కూడా తండ్రి అర్థం చేయించారు. మేము పావన దేవీ-దేవతలుగా ఉండేవారమని, మళ్ళీ రావణుడు పతితముగా చేశాడని ఈ సమయములో మీరు ఫీల్ అవుతారు. శూద్రుల నుండి దేవతలుగా తయారుచేసేందుకు తండ్రి వచ్చి చదివించాల్సి ఉంటుంది. తండ్రిని ముక్తిదాత, మార్గదర్శకుడు అని అంటారు కానీ వారికి అర్థం తెలియదు. చూడండి, ఎలా ఉన్నవారు ఎలా తయారయ్యారు అని అందరికీ తెలిసేటువంటి సమయము ఇప్పుడు త్వరలో రాబోతుంది! డ్రామా ఎలా తయారుచేయబడి ఉంది, మేము లక్ష్మీ-నారాయణుల వలె అవ్వగలమని ఎవరికీ స్వప్నములో కూడా ఉండేది కాదు. తండ్రి ఎంతగా గుర్తు తెప్పిస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలంటే శ్రీమతముపై నడవాలి. స్మృతియాత్రను ప్రాక్టీస్ చేయాలి. క్రిస్టియన్ ఫాదర్లు వాకింగ్ కు వెళ్ళినప్పుడు ఎంత సైలెన్సులో వెళ్తారో మీకు తెలుసు. వారు క్రైస్టు స్మృతిలో ఉంటారు. వారికి క్రైస్టు పట్ల ప్రేమ ఉంటుంది. ఆత్మిక పండాలైన మీకు పరమ ప్రియమైన పరమపిత పరమాత్మతో ప్రీతి బుద్ధి ఉంది. నంబరువారు పురుషార్థమనుసారముగా, కల్పక్రితం వలె రాజధాని తప్పకుండా స్థాపనవుతుంది, ఎంతగా పురుషార్థము చేసి శ్రీమతముపై నడుస్తే, అంతగా పొందుతారని పిల్లలకు తెలుసు. తండ్రి అయితే చాలా మంచి-మంచి డైరెక్షన్లను ఇస్తారు. అయినా కానీ గ్రహచారము ఎలా కూర్చుంటుందంటే ఇక శ్రీమతముపై అసలు నడవనే నడవరు. శ్రీమతముపై నడవడములోనే విజయముందని మీకు తెలుసు. నిశ్చయములోనే విజయము ఉంది. తండ్రి అంటారు, మీరు నా మతముపై నడవండి, ఈ బ్రహ్మా మతాన్ని ఇస్తున్నారని ఎందుకు అనుకుంటున్నారు. ఎప్పుడూ కూడా శివబాబాయే సలహా ఇస్తున్నారని భావించండి. వారైతే సేవ కోసమే మతాన్ని ఇస్తారు. కొంతమంది, బాబా, ఈ వ్యాపారము చేయనా అని అడుగుతారు. బాబా ఈ విషయాల కోసం మతాన్ని ఇవ్వరు. తండ్రి అంటారు, నేను పతితులను పావనముగా తయారుచేసే యుక్తులను తెలిపేందుకు వచ్చాను, అంతేకానీ ఈ విషయాల కోసం కాదు. ఓ పతిత-పావనా, మీరు వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అనే నన్ను పిలుస్తారు కూడా. కనుక నేను చాలా సహజమైన ఆ యుక్తిని తెలియజేస్తాను. మీ పేరే గుప్త సైన్యము. వారేమో ఆయుధాలు, బాణాలు మొదలైనవి చూపించారు. కానీ ఇందులో బాణాలు మొదలైనవాటి విషయమేమీ లేదు. ఇదంతా భక్తి మార్గము.

తండ్రి వచ్చి సత్యమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు - దీని ద్వారా మీరు అర్ధకల్పము కొరకు సత్యఖండములోకి వెళ్ళిపోతారు. అక్కడ అసలు వేరే ఖండమేదీ ఉండదు. ఇది ఎవరికైనా అర్థం చేయించినా సరే ఒప్పుకోరు, కేవలం భారత్ మాత్రమే ఉండడము అనేది ఎలా సాధ్యమని అంటారు. క్రైస్టుకు 3 వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గముగా ఉండేది కదా, అప్పుడు వేరే ధర్మాలేవీ ఉండేవి కావు. ఆ తర్వాత వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు కేవలం మీ తండ్రిని, మీ ధర్మాన్ని, కర్మను మర్చిపోయారు. స్వయాన్ని దేవీ-దేవతా ధర్మమువారిగా భావించినట్లయితే, అశుద్ధమైన పదార్థాలు మొదలైనవేవీ తినరు. కానీ తింటున్నారు - ఎందుకంటే ఆ గుణాలు లేవు, అందుకే స్వయాన్ని హిందువులని చెప్పుకుంటారు. లేదంటే, మా పెద్దవారు ఇంత పవిత్రముగా ఉండేవారు కానీ మేము ఇంత పతితముగా అయ్యామని సిగ్గుగా అనిపించాలి. కానీ తమ ధర్మాన్ని మర్చిపోయారు. ఇప్పుడు మీరు డ్రామా ఆదిమధ్యాంతాలను మంచి రీతిలో అర్థం చేసుకున్నారు. వేరే విషయము ఏదైనా ఉంటే, బాబా ఇంకా ఈ పాయింట్లు తెలపలేదని మీరు చెప్పవచ్చు, అంతే, లేకపోతే అనవసరంగా తికమకపడిపోతారు. మేము ఇంకా చదువుకుంటూ ఉన్నామని చెప్పండి. ఇప్పుడే అంతా తెలిసిపోయినట్లయితే ఇక వినాశనమైపోతుంది, కానీ అలా జరగదు. ఇప్పుడు ఇంకా సమయము మిగిలి ఉంది. మనము చదువుకుంటున్నాము. అంతిమములో సంపూర్ణ పవిత్రముగా అయిపోతాము. నంబరువారు పురుషార్థానుసారముగా తుప్పు వదలుతూ ఉంటుంది, అప్పుడు సతోప్రధానముగా అయిపోతారు. అప్పుడిక ఈ పతిత ప్రపంచము వినాశనమైపోతుంది. పరమాత్మ తప్పకుండా ఎక్కడో వచ్చి ఉన్నారు కానీ గుప్తముగా ఉన్నారని ఈ రోజుల్లో అంటూ ఉంటారు కూడా. వాస్తవానికిది వినాశన సమయమే కదా. తండ్రియే ముక్తిదాత, మార్గదర్శకుడు, వారే అందరినీ తిరిగి తీసుకువెళ్తారు, అందరూ దోమల వలె మరణిస్తారు. అందరూ స్మృతిలో ఒకేలా కూర్చోరని కూడా మీకు తెలుసు. కొంతమందిది ఏక్యురేట్ యోగము ఉంటుంది, కొంతమందిది అరగంట, కొంతమందిది 15 నిముషాలు ఉంటుంది, కొంతమందైతే ఒక్క నిముషము కూడా స్మృతిలో ఉండరు. కొంతమంది, మేము పూర్తి సమయమంతా తండ్రి స్మృతిలోనే ఉంటామని అంటారు, అలా ఉంటే తప్పకుండా వారి ముఖము సంతోషముగా, ప్రకాశిస్తూ ఉంటుంది. అతీంద్రియ సుఖము అటువంటి పిల్లలకే ఉంటుంది. వారి బుద్ధి ఎక్కడా భ్రమించదు. వారు సుఖము ఫీల్ అవుతూ ఉంటారు. ఒక్క ప్రియుని స్మృతిలో కూర్చున్నట్లయితే ఎంతగా తుప్పు తొలగిపోతుందని బుద్ధి కూడా చెప్తుంది. ఇక తర్వాత అలవాటైపోతుంది. స్మృతియాత్ర ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా అవుతున్నారు. చక్రము కూడా గుర్తుకు వచ్చేస్తుంది. కేవలం స్మృతిలో ఉండడములోనే శ్రమ ఉంది. బుద్ధిలో చక్రము కూడా తిరుగుతూ ఉంటుంది.

ఇప్పుడు మీరు మాస్టర్ బీజరూపులుగా అవుతారు. స్మృతితో పాటు స్వదర్శన చక్రాన్ని కూడా తిప్పాలి. భారతవాసులైన మీరు లైట్ హౌస్ లు. స్పిరిచ్యుల్ లైట్ హౌస్ లైన మీరు అందరికీ ఇంటికి మార్గాన్ని తెలియజేస్తారు. ఇది కూడా అర్థం చేయించవలసి ఉంటుంది కదా. మీరు ముక్తి, జీవన్ముక్తుల మార్గాన్ని తెలియజేస్తారు, అందుకే మీరు స్పిరిచ్యుల్ లైట్ హౌస్ లు. మీ స్వదర్శన చక్రము తిరుగుతూ ఉంటుంది. పేరు వ్రాయాలి అంటే దాని గురించి అర్థం చేయించవలసి ఉంటుంది కూడా. బాబా అర్థం చేయిస్తూ ఉంటారు, మీరు సమ్ముఖములో కూర్చుని ఉన్నారు. ఎవరైతే ప్రియునితో ఉంటారో, వారి కోసం సమ్ముఖములో (జ్ఞాన) వర్షము కురుస్తుంది. అన్నింటికన్నా ఎక్కువ ఆనందము సమ్ముఖములో కలుగుతుంది. ఆ తర్వాత రెండవ నంబరు - టేప్ ద్వారా వినడము, మూడవ నంబరు - మురళీ. శివబాబా బ్రహ్మా ద్వారా అంతా అర్థం చేయిస్తారు. వీరికి (బ్రహ్మా) కూడా తెలుసు కదా. అయినా మీరు శివబాబా చెప్తున్నారనే భావించండి, ఇది అర్థం చేసుకోని కారణముగా ఎంతగానో ఆజ్ఞను ఉల్లంఘిస్తారు. శివబాబా ఏదైతే చెప్తారో, అది కళ్యాణకారిగానే ఉంటుంది. ఒకవేళ అకళ్యాణము జరిగినా, అది కూడా కళ్యాణ రూపములోకి మారిపోతుంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ఇచ్చే ప్రతి డైరెక్షన్ ను అనుసరిస్తూ తమ ఉన్నతిని చేసుకోవాలి. ఒక్క తండ్రితో సత్యాతి-సత్యమైన ప్రీతిని ఉంచుకోవాలి. స్మృతిలోనే భోజనాన్ని తయారుచేయాలి మరియు తినాలి.

2. స్పిరిచ్యుల్ లైట్ హౌస్ లుగా అయి అందరికీ ముక్తి-జీవన్ముక్తుల మార్గాన్ని తెలియజేయాలి. తండ్రి సమానముగా కళ్యాణకారులుగా తప్పకుండా అవ్వాలి.

వరదానము:-
ఈశ్వరీయ నషాలో స్థితులై ప్రతి కర్మను రాయల్ గా చేసే సర్వ చింతల నుండి ముక్త భవ

సదా ఇదే ఈశ్వరీయ నషాలో ఉండండి - ‘నేను బాప్ దాదా కంటి వెలుగును’, కావున నా నయనాలలో లేక దృష్టిలో ఇంకే వస్తువు ఇమిడి ఉండలేదు. ఈ నషాలో ఉన్నట్లయితే రకరకాల చింతలు స్వతహాగా సమాప్తమైపోతాయి. ఏ రకమైన ఫిర్యాదు ఉండదు. ఎవరు ఎంతగా తమ ఉన్నతమైన నషాలో స్థితులై ఉంటారో, వారికి గౌరవము కూడా స్వతహాగా ప్రాప్తిస్తుంది మరియు వారి ప్రతి కర్మ రాయల్ గా ఉంటుంది.

స్లోగన్:-
ఎవరైతే తమ సర్వస్వాన్ని తండ్రికి అర్పిస్తారో, వారే ట్రస్టీలు.

అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’

మీ ప్రతి మాటలో మధురత, సంతుష్టత మరియు సరళతతో కూడిన నవీనత ఉండాలి. బ్రాహ్మణ ఆత్మల మాటలు సాధారణ మాటలుగా ఉండకూడదు. ఇదే మహానత మరియు ఇదే నవీనత. మధురమైన మాటలు, మధురమైన సంస్కారాలు, మధురమైన స్వభావము ద్వారా ఇతరుల నోటిని కూడా తీపి చేస్తూ ఉండండి. ‘‘సదా అలసిపోనివారిగా కండి మరియు మధురమైనవారిగా కండి’’ అన్న వరదానాలతో ముందుకు వెళ్తూ, ఎగురుతూ ఉండండి.