22-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ చదువు యొక్క పునాది పవిత్రత, పవిత్రత ఉంటేనే యోగములో పదును, శక్తి నిండగలదు, యోగములో పదును ఉన్నట్లయితే వాణిలో శక్తి ఉంటుంది’’

ప్రశ్న:-
పిల్లలైన మీరు ఇప్పుడు ఏ ప్రయత్నాన్ని పూర్తిగా చేయాలి?

జవాబు:-
శిరస్సుపై వికర్మల భారమేదైతే ఉందో దానిని దించుకునేందుకు పూర్తిగా ప్రయత్నము చేయాలి. తండ్రికి చెందినవారిగా అయి ఏవైనా వికర్మలు చేసినట్లయితే చాలా గట్టిగా పడిపోతారు. బి.కె.లను ఒకవేళ నిందింపజేసినట్లయితే లేక వారికి ఏదైనా కష్టము కలిగించినట్లయితే చాలా పాపమవుతుంది. ఇక ఆ తర్వాత జ్ఞానాన్ని వినడం, వినిపించడం వలన ఎటువంటి లాభమూ ఉండదు.

ఓంశాంతి
మీరు పతితము నుండి పావనముగా అయి పావన ప్రపంచానికి అధిపతులుగా ఎలా అవ్వగలరు అనేది ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు! పావన ప్రపంచాన్ని స్వర్గము లేక విష్ణుపురి లేక లక్ష్మీ-నారాయణుల రాజ్యము అని అంటారు. విష్ణువు అనగా లక్ష్మీ-నారాయణుల కంబైన్డ్ చిత్రాన్ని ఆ విధంగా తయారుచేసారు, అందుకే అర్థం చేయించడం జరుగుతుంది. కానీ విష్ణువును పూజించేటప్పుడు వారు ఎవరు అన్నది అర్థం చేసుకోలేరు. మహాలక్ష్మిని పూజిస్తారు కానీ ఆమె ఎవరు అన్నది అర్థం చేసుకోరు. బాబా ఇప్పుడు పిల్లలైన మీకు భిన్న-భిన్న రీతులలో అర్థం చేయిస్తారు. బాగా ధారణ చేయండి. కొందరి బుద్ధిలో ఏముంటుందంటే - పరమాత్మకైతే అన్నీ తెలుసు, మనం మంచి లేక చెడు పనులు ఏవైతే చేస్తామో అవన్నీ వారికి తెలుసు అని ఉంటుంది. ఇప్పుడు దీనిని అంధ విశ్వాసముతో కూడిన భావము అని అంటారు. భగవంతుడికి ఈ విషయాల గురించి తెలియనే తెలియదు. భగవంతుడు పతితులను పావనముగా తయారుచేస్తారు అని పిల్లలైన మీకు తెలుసు. వారు పావనముగా తయారుచేసి స్వర్గానికి అధిపతులుగా తయారుచేస్తారు. ఆపై ఎవరైతే బాగా చదువుతారో వారు ఉన్నత పదవిని పొందుతారు. అంతేకానీ తండ్రికి అందరి హృదయాలలో ఏముందో తెలుసు అని భావించకండి, దీనిని అవివేకము అని అంటారు. మనుష్యులు ఏ కర్మలైతే చేస్తారో వాటి మంచి లేక చెడు ప్రభావము అనేది డ్రామా అనుసారముగా వారికి లభించి తీరుతుంది. ఇందులో తండ్రికి సంబంధమేమీ లేదు. బాబాకైతే అన్నీ తెలుసు అని ఎప్పుడూ ఇలా ఆలోచించకండి. ఎంతోమంది వికారాల్లోకి వెళ్తూ పాపాలు చేస్తూ ఉంటారు, మళ్ళీ ఇక్కడకు లేక సెంటర్లకు వచ్చేస్తారు. బాబాకైతే తెలుసు అని భావిస్తారు. కానీ బాబా అంటారు, నేను అసలు ఈ పనులేవీ చేయను. జానీజాననహార్ (అన్నీ తెలిసినవారు) అన్న పదము కూడా తప్పే. మీరు వచ్చి పతితుల నుండి పావనులుగా తయారుచేయండి, స్వర్గాధిపతులుగా తయారుచేయండి అని మీరు తండ్రిని పిలుస్తారు, ఎందుకంటే జన్మ-జన్మాంతరాల పాపాలు శిరస్సుపై ఎంతగానో ఉన్నాయి, అలాగే ఈ జన్మలో చేసినవి కూడా ఉన్నాయి. ఈ జన్మలోని పాపాలను వినిపిస్తారు కూడా. చాలామంది ఎటువంటి పాపాలను చేసారంటే, పావనముగా అవ్వడం చాలా కష్టమనిపిస్తుంది. ముఖ్యమైన విషయము పావనముగా అవ్వడము. చదువైతే చాలా సహజమైనది, కానీ వికర్మల భారము ఎలా దిగాలి అన్నదాని కోసం ప్రయత్నము చేయాలి. ఇలా ఎంతోమంది ఉన్నారు, ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు, ఎంతో డిస్సర్వీస్ చేస్తారు. బి.కె. ఆశ్రమాలకు కష్టాలను కలిగించేందుకు ప్రయత్నిస్తారు. దానికి వారికి ఎంతో పాపము కలుగుతుంది. ఆ పాపాలు మొదలైనవేవీ జ్ఞానమును ఇవ్వడం ద్వారా అంతమవ్వవు. పాపాలు యోగము ద్వారానే అంతమవుతాయి. మొదటైతే యోగము విషయములో పూర్తి పురుషార్థము చేయాలి, అప్పుడే ఎవరికైనా బాణము కూడా తగలగలదు. మొదట పవిత్రముగా అవ్వాలి, యోగము ఉండాలి, అప్పుడే వాణిలో కూడా పదును, శక్తి నిండుతుంది. లేదంటే ఎవరికి ఎంతగా అర్థం చేయించినా కానీ అది ఎవరి బుద్ధిలోకి ఎక్కదు, బాణము తగలదు. జన్మ-జన్మాంతరాల పాపాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏ పాపాలైతే చేస్తారో అవి జన్మ-జన్మాంతరాల పాపాల కన్నా కూడా ఎక్కువైపోతాయి, అందుకే సద్గురువుకు నింద తీసుకువచ్చేవారు ఉన్నత స్థానాన్ని, ఉన్నత పదవిని పొందలేరు అన్న గాయనము ఉంది. వీరు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సద్గురువు. తండ్రి అంటారు, బి.కె.లను నిందింపజేసేవారికి కూడా పాప భారము చాలా ఎక్కువగా ఉంటుంది. మొదట స్వయమైతే పావనముగా అవ్వండి. ఎవరికైనా అర్థం చేయించేందుకు ఎంతో అభిరుచి కలిగి ఉంటారు కానీ యోగము పైస అంత కూడా లేదు, దాని వల్ల లాభమేమిటి? తండ్రి అంటారు, స్మృతి ద్వారా పావనముగా అవ్వడమే ముఖ్యమైన విషయము. పావనముగా అవ్వడం కోసమనే పిలుస్తారు. భక్తి మార్గములో - ఎదురుదెబ్బలు తినడం, అనవసరమైన శబ్దము చేయడమనేది ఒక అలవాటుగా అయిపోయింది. ప్రార్థన చేస్తారు కానీ భగవంతునికి చెవులు ఎక్కడ ఉన్నాయి? చెవులు లేకుండా, నోరు లేకుండా ఎలా వినగలరు, మాట్లాడగలరు? వారు అవ్యక్తుడు. అదంతా అంధవిశ్వాసము.

మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పాపాలు నశిస్తాయి. ఫలానావారు బాగా స్మృతి చేస్తున్నారు, ఫలానావారు తక్కువగా చేస్తున్నారు అన్నది తండ్రికి తెలుసు కదా అని అనుకోకూడదు, ఈ విషయాలలో తమ చార్టును తామే చూసుకోవాలి. స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయని తండ్రి అన్నారు. మీరు ఎంత స్మృతి చేస్తున్నారు అని బాబా కూడా మిమ్మల్నే అడుగుతారు. నడవడిక ద్వారా కూడా తెలుస్తుంది. స్మృతి లేకుండా పాపాలు అంతమవ్వవు. ఎవరికైనా జ్ఞానము వినిపించడం వలన వారి పాపాలు లేక మీ పాపాలు ఏమీ అంతమవ్వవు. అలా జరగదు. ఎప్పుడైతే స్వయం స్మృతి చేస్తారో అప్పుడే పాపాలు అంతమవుతాయి. ముఖ్యమైన విషయము పావనముగా అవ్వడము. తండ్రి అంటారు, నాకు చెందినవారిగా అయ్యాక ఇంకెటువంటి పాపాలూ చేయకండి, లేదంటే చాలా గట్టిగా పడిపోతారు. ఇక అప్పుడు మేము మంచి పదవిని పొందగలము అన్న ఆశను కూడా పెట్టుకోకూడదు. ప్రదర్శినీలో కూడా అనేకమందికి తెలియజేస్తే, ఇక మేము ఎంతో సేవ చేసాము అని సంతోషపడిపోతారు. కానీ తండ్రి అంటారు, మొదట మీరైతే పావనముగా అవ్వండి, తండ్రిని స్మృతి చేయండి. స్మృతిలో ఎంతోమంది ఫెయిల్ అవుతారు. జ్ఞానమైతే చాలా సహజము, కేవలం 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి. ఆ చదువులో ఎంతగా లెక్కలు చదువుతారు, ఎంతగా కష్టపడతారు. కానీ సంపాదించేది ఏమిటి? చదువుతూ, చదువుతూ మరణిస్తే చదువు సమాప్తము. పిల్లలైన మీరు ఎంతగా స్మృతిలో ఉంటారో, అంతగా ధారణ జరుగుతుంది. పవిత్రముగా అవ్వకపోతే, పాపాలను అంతము చేసుకోకపోతే ఎన్నో శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. మా స్మృతి అయితే బాబా వరకు తప్పకుండా చేరుకుంటుందని కాదు. బాబా ఏం చేస్తారు! మీరు స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అవుతారు, అందులో బాబా ఏం చేస్తారు, ఏమని అభినందిస్తారు? చాలామంది పిల్లలు ఏమంటూ ఉంటారంటే - మేమైతే సదా తండ్రిని స్మృతి చేస్తూనే ఉంటాము, వారు తప్ప మాకు అసలు ఇంకెవరు ఉన్నారని? అది కూడా ప్రగల్భాలు పలకడమే. స్మృతిలోనైతే ఎంతో శ్రమ ఉంది. తాము స్మృతి చేస్తున్నారా లేదా అనేది కూడా అర్థం చేసుకోలేరు. మేమైతే స్మృతి చేస్తూనే ఉంటాము అని తెలియనితనముతో అనేస్తారు. శ్రమించకుండా ఎవరూ విశ్వాధిపతులుగా అవ్వలేరు. ఉన్నత పదవిని పొందలేరు. స్మృతి యొక్క పదును, శక్తి ఎప్పుడైతే నిండుతుందో అప్పుడు సేవ చేయగలుగుతారు, అప్పుడు ఎంత సేవ చేసి ప్రజలను తయారుచేసారో చూడాలి. లెక్క కావాలి కదా. మనం ఎంతమందిని మన సమానముగా తయారుచేస్తాము. ప్రజలను తయారుచేయవలసి ఉంటుంది కదా, అప్పుడే రాజ్య పదవిని పొందగలుగుతారు. ఇప్పుడైతే అదేమీ లేదు. యోగములో ఉంటూ పదును నింపితే, అప్పుడు ఎవరికైనా బాణము తగలగలదు. చివరిలో భీష్మ పితామహులు, ద్రోణాచార్యులు మొదలైనవారికి జ్ఞానాన్ని ఇచ్చారు అని శాస్త్రాలలో కూడా ఉంది కదా. ఎప్పుడైతే మీ పతితత్వము తొలగి ఆత్మ సతోప్రధానత వరకూ చేరుకుంటుందో, అప్పుడు పదును నిండుతుంది కావున వెంటనే బాణము తగులుతుంది. బాబాకైతే అన్నీ తెలుసు అని ఎప్పుడూ ఇలా ఆలోచించకండి. బాబా అన్నీ తెలుసుకోవలసిన అవసరమేముంది? ఎవరు చేస్తే వారు పొందుతారు. బాబా సాక్షీగా అయి చూస్తూ ఉంటారు. మేము ఫలానా స్థానానికి వెళ్ళి సేవ చేసాము అని బాబాకు వ్రాస్తారు. కానీ బాబా అడుగుతారు, ముందుగా నీవు స్మృతియాత్రలో తత్పరమై ఉన్నావా? ఇతర సాంగత్యాలను వదిలి ఒక్క తండ్రితో సాంగత్యాన్ని జోడించండి, ఇదే మొట్టమొదటి విషయము. దేహీ-అభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. ఇంట్లో ఉంటూ కూడా - ఇది పాత ప్రపంచము, పాత దేహము అని భావించాలి. ఇవన్నీ అంతమవ్వనున్నాయి. మనకు బాబా మరియు వారసత్వముతోనే పని ఉంది. గృహస్థ వ్యవహారములో ఉండకండి, ఎవరితోనూ మాట్లాడకండి అని బాబా ఇలా అనరు. వివాహాలకు వెళ్ళవచ్చా అని బాబాను అడుగుతారు. బాబా అంటారు, వెళ్తే వెళ్ళండి. అక్కడకు వెళ్ళి కూడా సేవను చేయండి. బుద్ధి యోగము శివబాబాతో ఉండాలి. జన్మ-జన్మాంతరాల వికర్మలు స్మృతి బలము ద్వారానే భస్మమవుతాయి. ఇక్కడ కూడా ఒకవేళ వికర్మలు చేసినట్లయితే ఎన్నో శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. పావనముగా అవుతూ, అవుతూ వికారాలలో పడిపోతే మరణిస్తారు. పూర్తిగా ముక్కలు, ముక్కలుగా అయిపోతారు. శ్రీమతముపై నడవకుండా ఎంతో నష్టపరుస్తారు. అడుగడుగులోనూ శ్రీమతము ఉండాలి. ఎటువంటి పాపాలు చేస్తారంటే వాటి వల్ల అసలు యోగమే కుదరదు, స్మృతి చేయలేకపోతారు, అప్పుడు ఎవరి దగ్గరకైనా వెళ్ళి - భగవంతుడు వచ్చారు, వారి నుండి వారసత్వాన్ని తీసుకోండి అని చెప్తే వారు అంగీకరించరు, బాణము తగలదు. బాబా అన్నారు - భక్తులకు జ్ఞానము వినిపించండి, వ్యర్థముగా ఎవరికీ ఇవ్వకండి లేదంటే ఇంకా నిందింపజేస్తారు.

కొంతమంది పిల్లలు బాబాను అడుగుతారు - బాబా, మాకు దానము చేసే అలవాటు ఉంది, ఇప్పుడిక జ్ఞానములోకి వచ్చేసాము, మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? బాబా సలహా ఇస్తారు - పిల్లలూ, పేదలకు దానము ఇచ్చేవారైతే ఎంతోమంది ఉన్నారు, పేదలేమీ ఆకలితో చనిపోరు, ఫకీరుల వద్ద చాలా ధనము పడి ఉంటుంది, అందుకే ఈ విషయాలన్నింటి నుండి మీ బుద్ధి తొలగిపోవాలి. దానము మొదలైనవి చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఇక చెప్పడానికి వీలులేనటువంటి పనులు చేస్తారు, దాని వల్ల వారి శిరస్సుపై భారము పెరిగిపోతూ ఉంటుంది అన్నది అర్థం చేసుకోరు. జ్ఞాన మార్గము అనేది నవ్వులాట మార్గము కాదు. తండ్రితోపాటు ధర్మరాజు కూడా ఉన్నారు. ధర్మరాజు నుండి పెద్ద-పెద్ద దండనలను తినవలసి ఉంటుంది. ఎప్పుడైతే చివరిలో ధర్మరాజు మన ఖాతాను చూస్తారో అప్పుడు తెలుస్తుంది అని అంటారు కదా. జన్మ-జన్మాంతరాల శిక్షలను అనుభవించడములో పెద్ద సమయమేమీ పట్టదు. బాబా కాశీలోని కత్తుల బావిలోకి దూకే ఉదాహరణను కూడా అర్థం చేయించారు. అది భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. మనుష్యులను కూడా బలి ఇస్తారు, ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకోవాలి, అంతేకానీ అసలు ఈ డ్రామాను ఎందుకు తయారుచేసారు, అసలు ఈ చక్రములోకి ఎందుకు తీసుకువచ్చారు అని భావించడం కాదు. చక్రములోకి అయితే వస్తూనే ఉంటారు. ఇది అనాది డ్రామా కదా. చక్రములోకి రాకపోతే ఇక ప్రపంచమే ఉండదు. మోక్షమనేది ఉండదు. ముఖ్యమైనవారికి కూడా మోక్షము లభించజాలదు. 5,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాగే చక్రములో తిరుగుతారు. ఇది డ్రామా కదా. కేవలం ఎవరికైనా అర్థం చేయించినంత మాత్రాన లేక వాణిని వినిపించినంతమాత్రాన పదవి లభించదు. మొదటైతే పతితుల నుండి పావనులుగా అవ్వాలి. బాబాకైతే అన్నీ తెలుసు అని భావించడం కాదు. బాబా తెలుసుకుని కూడా ఏం చేస్తారు. మొదటైతే మీ ఆత్మ తెలుసుకుంటుంది. శ్రీమతముపై నేను ఏం చేస్తున్నాను, ఎంతవరకు బాబాను స్మృతి చేస్తున్నాను అనేది తెలుసుకుంటుంది. అంతేకానీ బాబా ఇక్కడ కూర్చుని తెలుసుకోవడములో లాభమేముంది? మీరు ఏదైతే చేస్తారో దానిని మీరే పొందుతారు. బాబా మీ నడవడిక మరియు సేవ ద్వారా - ఈ బిడ్డ మంచి సేవను చేస్తున్నారా లేదా అన్నది తెలుసుకోగలరు. ఫలానావారు బాబాకు చెందినవారిగా అయి ఎన్నో వికర్మలను చేసారు, కావున వారి మురళిలో పదును, శక్తి నిండదు. ఈ జ్ఞానము ఖడ్గము వంటిది. అందులో స్మృతి బలము యొక్క పదును ఉండాలి. యోగబలముతో మీరు విశ్వముపై విజయము పొందుతారు. ఇకపోతే జ్ఞానము ద్వారా కొత్త ప్రపంచములో ఉన్నత పదవిని పొందుతారు. మొదటైతే పవిత్రముగా అవ్వాలి, పవిత్రముగా అవ్వకుండా ఉన్నత పదవి లభించదు. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకే ఇక్కడకు వస్తారు. పతితులు నరుని నుండి నారాయణునిగా అవ్వరు. పావనులుగా అయ్యే పూర్తి యుక్తి కావాలి. అనన్యులైన పిల్లలు ఎవరైతే సెంటర్లను సంభాళిస్తారో, వారు కూడా బాగా కష్టపడవలసి ఉంటుంది. వారు అంతగా కష్టపడరు, అందుకే ఆ పదును నిండదు, బాణము తగలదు, స్మృతియాత్ర ఎక్కడ ఉంది! కేవలం ప్రదర్శినీలలో ఎంతోమందికి అర్థం చేయిస్తూ ఉంటారు. కానీ మొదట స్మృతి ద్వారా పవిత్రముగా అవ్వాలి, ఆ తర్వాత జ్ఞానము. పావనులుగా అయినట్లయితే జ్ఞాన ధారణ జరుగుతుంది. పతితులకు ధారణ జరగదు. ముఖ్యమైన సబ్జెక్ట్ స్మృతి. ఆ చదువుల్లో కూడా సబ్జెక్టులు ఉంటాయి కదా. మీ వద్ద కూడా బి.కె.లుగా అవుతారు కానీ బ్రహ్మాకుమార, కుమారీలుగా, సోదర, సోదరీలుగా అవ్వడమనేది అంత సులువైన విషయమేమీ కాదు. కేవలం నామమాత్రముగా అలా అవ్వకూడదు. దేవతలుగా అయ్యేందుకు మొదట పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. ఆ తర్వాత చదువు. కేవలం చదువు ఉండి, పవిత్రముగా అవ్వకపోతే ఉన్నత పదవిని పొందలేరు. ఆత్మ పవిత్రముగా ఉండాలి. పవిత్రముగా ఉంటేనే పవిత్ర ప్రపంచములో ఉన్నత పదవిని పొందగలరు. పవిత్రతా విషయానికే బాబా ప్రాధాన్యతను ఇస్తారు. పవిత్రత లేకుండా ఎవరికీ జ్ఞానాన్ని ఇవ్వలేరు. కానీ బాబా అయితే ఏమీ చూడరు. వారు స్వయం కూర్చున్నారు కదా. అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. భక్తి మార్గములో భావనకు ప్రతిఫలము లభిస్తుంది. అది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. శరీరము లేకుండా తండ్రి ఎలా మాట్లాడగలరు? ఎలా వినగలరు? ఆత్మకు శరీరము ఉంది కావున వింటుంది, మాట్లాడుతుంది. బాబా అంటారు, నాకు ఇంద్రియాలే లేవు, మరి నేను ఎలా వినగలను, ఎలా తెలుసుకోగలను? ఏమని భావిస్తారంటే - మేము వికారాలలోకి వెళ్తున్నాము అని బాబాకు తెలుసు, ఒకవేళ వారికి తెలియదు అంటే మేము వారిని భగవంతునిగానే భావించము! అలాంటివారు కూడా ఎందరో ఉంటారు. తండ్రి అంటారు, నేను మీకు పావనులుగా అయ్యే మార్గాన్ని తెలియజేసేందుకు వచ్చాను. నేను సాక్షీగా అయి చూస్తాను. పిల్లల నడవడిక ద్వారా - వీరు కుపుత్రులా లేక సుపుత్రులా అన్నది తెలిసిపోతుంది. సేవ యొక్క ఋజువు కూడా కావాలి కదా. ఎవరైతే చేస్తారో వారే పొందుతారు అన్నది కూడా తెలుసు. శ్రీమతముపై నడిచినట్లయితే శ్రేష్ఠముగా అవుతారు, నడవకపోతే స్వయమే అశుద్ధముగా అయి పడిపోతారు. ఏదైనా విషయము ఉంటే స్పష్టముగా అడగండి. ఇందులో అంధ విశ్వాసము యొక్క విషయమేమీ లేదు. బాబా కేవలం ఏమంటారంటే - స్మృతి యొక్క పదును లేకపోతే పావనులుగా ఎలా అవ్వగలరు. ఈ జన్మలో కూడా ఇక చెప్పడానికి వీల్లేని విధమైన పాపాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రపంచమే పాపాత్ముల ప్రపంచము, సత్యయుగము పుణ్యాత్ముల ప్రపంచము. ఇది సంగమము. కొందరు మందబుద్ధి కలవారు ఉంటారు, వారు ధారణ చేయలేకపోతారు, బాబాను స్మృతి చేయలేకపోతారు. ఆ తర్వాత టూ లేట్ అయిపోతుంది, ఈ అడవికి మంటలు అంటుకుంటాయి, ఇక అప్పుడు యోగములో కూడా ఉండలేరు. ఆ సమయములో అయితే హాహాకారాలు జరుగుతాయి. దుఃఖపు పర్వతాలు ఎన్నో పడనున్నాయి. ఇదే చింత ఉండాలి - మేము మా రాజ్య భాగ్యాన్ని తండ్రి నుండి తీసుకోవాలి అని. దేహాభిమానాన్ని వదిలి సేవలో నిమగ్నమైపోవాలి. కళ్యాణకారులుగా అవ్వాలి. ధనాన్ని వ్యర్థముగా పోగొట్టకూడదు. ఎవరైతే అర్హులుగానే ఉండరో అటువంటి పతితులకు ఎప్పుడూ దానము ఇవ్వకూడదు, లేదంటే ఆ పాపము దానమిచ్చేవారిపైకి కూడా వచ్చేస్తుంది. భగవంతుడు వచ్చారు అని దండోరా మ్రోగించడం కాదు. ఇలా తమను తాము భగవంతులు అని పిలుచుకునేవారు భారత్ లో ఎందరో ఉన్నారు. అలా ఎవరూ అంగీకరించరు. ఇది మీకే తెలుసు, మీకు ప్రకాశము లభించింది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. చదువుతోపాటు పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. అర్హులుగా మరియు సుపుత్రులుగా అయి సేవా ఋజువును ఇవ్వాలి. శ్రీమతముపై స్వయాన్ని శ్రేష్ఠముగా తయారుచేసుకోవాలి.

2. స్థూల ధనాన్ని కూడా వ్యర్థముగా పోగొట్టుకోకూడదు. పతితులకు దానము ఇవ్వకూడదు. జ్ఞాన ధనాన్ని కూడా పాత్రులను చూసి ఇవ్వాలి.

వరదానము:-
పాత సంస్కారాలను అగ్ని సంస్కారము చేసే సత్యమైన మరజీవా భవ

మరణించిన తర్వాత శరీరానికి అంతిమ సంస్కారము చేసినప్పుడు ఏ విధంగా నామ-రూపాలు సమాప్తమైపోతాయో, అదే విధంగా పిల్లలైన మీరు ఎప్పుడైతే మరజీవులుగా అవుతారో అప్పుడు శరీరమైతే అదే ఉంటుంది కానీ పాత సంస్కారాలు, స్మృతులు మరియు స్వభావాల యొక్క అంతిమ సంస్కారము చేస్తారు. అంతిమ సంస్కారము చెయ్యబడిన మనిషి మళ్ళీ ఎదురుగా వచ్చినట్లయితే వారిని భూతము అని అంటారు. అలాగే ఇక్కడ కూడా ఒకవేళ అంతిమ సంస్కారము చెయ్యబడిన సంస్కారము ఏదైనా జాగృతమైనట్లయితే అది కూడా మాయా భూతమే. ఈ భూతాలను పారద్రోలండి, వాటి వర్ణనను కూడా చెయ్యకండి.

స్లోగన్:-
కర్మభోగాన్ని వర్ణించేందుకు బదులుగా కర్మయోగపు స్థితిని వర్ణన చేస్తూ ఉండండి.

అవ్యక్త సూచనలు - సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి

రాజు తాను స్వయంగా ఏ పనినీ చెయ్యరు కానీ చేయిస్తారు. రాజ్య కార్యవ్యవహారాలు చేసేవారు వేరే ఉంటారు. ఒకవేళ రాజ్య కార్యవ్యవహారాలు సరిగ్గా జరగకపోతే రాజ్యము కింద-మీద అయిపోతుంది. అలాగే ఆత్మ కూడా చేయించేటటువంటిది, చేసేది ఈ విశేషమైన త్రిమూర్తి శక్తులు (మనసు, బుద్ధి మరియు సంస్కారాలు). ముందు వీటిపై రూలింగ్ పవర్ ఉన్నట్లయితే ఈ సాకార కర్మేంద్రియాలు స్వతహాగానే సరైన మార్గములో నడుస్తాయి.