22-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - అందరికీ ఈ శుభవార్తను వినిపించండి -
ఇప్పుడు దైవీ రాజ్యము స్థాపన అవుతోంది, నిర్వికారీ ప్రపంచము ఏర్పడినప్పుడు
మిగిలినవన్నీ వినాశనమైపోతాయి’’
ప్రశ్న:-
రావణుడి
శాపము ఎప్పుడు కలుగుతుంది, శాపగ్రస్తులుగా అయినవారి గుర్తులేమిటి?
జవాబు:-
ఎప్పుడైతే మీరు
దేహాభిమానులుగా అవుతారో, అప్పుడు రావణుడి శాపము కలుగుతుంది. శాపగ్రస్తులైన ఆత్మలు
నిరుపేదలుగా, వికారులుగా అవుతూ ఉంటారు, కిందకు దిగజారిపోతూ ఉంటారు. ఇప్పుడు తండ్రి
ద్వారా వారసత్వాన్ని తీసుకునేందుకు దేహీ-అభిమానులుగా అవ్వాలి. తమ దృష్టి-వృత్తిని
పావనముగా చేసుకోవాలి.
ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు 84 జన్మల కథను వినిపిస్తున్నారు. అందరూ 84
జన్మలు తీసుకోరని అయితే అర్థం చేసుకున్నారు. మీరే మొట్టమొదట సత్యయుగ ఆదిలో పూజ్య
దేవీ-దేవతలుగా ఉండేవారు. భారత్ లో మొదట పూజ్య దేవీ-దేవతా ధర్మానికి చెందినవారి
రాజ్యమే ఉండేది. లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది కావున తప్పకుండా వారి వంశము
ఉంటుంది. రాజ్య వంశానికి చెందిన మిత్ర-సంబంధీకులు కూడా ఉంటారు, ప్రజలు కూడా ఉంటారు.
ఇది ఒక కథలాంటిది. 5 వేల సంవత్సరాల క్రితము కూడా వీరి రాజ్యముండేది - ఇది గుర్తు
చేసుకుంటారు. భారత్ లో ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము వారి రాజ్యముండేది. ఈ విషయాలను
అనంతమైన తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, వారినే నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. దేనికి
సంబంధించిన నాలెడ్జ్? వారు అందరిలో ఏముంది అనేదాని గురించి, అలానే కర్మ-వికర్మల
గురించి తెలిసినవారని మనుష్యులు భావిస్తారు. కానీ ఇప్పుడు తండ్రి అర్థము
చేయిస్తున్నారు - ప్రతి ఒక్క ఆత్మకు తమ-తమ పాత్ర లభించి ఉంది. ఆత్మలందరూ తమ
పరంధామములో ఉంటారు. వారిలో మొత్తము పాత్ర అంతా నిండి ఉంది. కర్మక్షేత్రములోకి వెళ్ళి
తమ పాత్రను అభినయించేందుకు రెడీగా కూర్చున్నారు. ఆత్మలమైన మనమే అన్నీ చేస్తామని కూడా
మీరు అర్థం చేసుకున్నారు. ఇది పుల్లగా ఉంది, ఇది ఉప్పగా ఉంది అని ఆత్మయే చెప్తుంది.
మనము ఇప్పుడు వికారీ పాపాత్ములము అని, ఆసురీ స్వభావము ఉంది అని ఆత్మయే అర్థం
చేసుకుంటుంది. ఆత్మయే ఇక్కడ కర్మక్షేత్రములో శరీరాన్ని తీసుకుని పాత్రనంతా
అభినయిస్తుంది. కావున ఇది నిశ్చయము చేసుకోవాలి కదా. ఆత్మనైన నేనే అన్నీ చేస్తాను.
ఇప్పుడు తండ్రిని కలుసుకున్నాము, మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత కలుస్తాము.
పూజ్యులుగా మరియు పూజారులుగా, పావనులుగా మరియు పతితులుగా అవుతూ వచ్చామని కూడా అర్థము
చేసుకున్నారు. పూజ్యులు ఉన్నప్పుడు పతితులెవ్వరూ ఉండరు. పూజారులు ఉన్నప్పుడు
పావనమైనవారెవ్వరూ ఉండరు. సత్యయుగములో ఉన్నది పావనమైన పూజ్యులు మాత్రమే. ద్వాపరము
నుండి రావణ రాజ్యము ప్రారంభమైనప్పుడు అందరూ పతితులుగా, పూజారులుగా అవుతారు. శివబాబా
అంటారు - చూడండి, శంకరాచార్యులు కూడా నా పూజారియే. వారు నన్నే పూజిస్తారు కదా.
శివుని చిత్రము కొందరి వద్ద వజ్రాలది, కొందరి వద్ద బంగారముది, కొందరి వద్ద వెండిది
ఉంటుంది. ఇప్పుడు పూజించే పూజారిని, పూజ్యుడు అని అనలేరు. ఈ సమయములో మొత్తం
ప్రపంచములో పూజ్యులు ఒక్కరు కూడా ఉండరు. పూజ్యులు పవిత్రముగా ఉంటారు, తర్వాత
అపవిత్రముగా అవుతారు. కొత్త ప్రపంచములో పవిత్రమైనవారు ఉంటారు. పవిత్రమైనవారే
పూజింపబడతారు. కుమారీ పవిత్రముగా ఉన్నప్పుడు పూజకు యోగ్యముగా ఉంటారు, అపవిత్రముగా
అయిన తర్వాత అందరి ఎదురుగా తల వంచవలసి ఉంటుంది. పూజా సామాగ్రి ఎంత ఉంది. ఎక్కడైనా
ప్రదర్శనీలు, మ్యూజియంలు మొదలైనవి తెరిచినప్పుడు, పైన త్రిమూర్తి శివుడు తప్పకుండా
ఉండాలి. కింద లక్ష్యము-ఉద్దేశ్యము అయిన ఈ లక్ష్మీ-నారాయణులు ఉండాలి. మనము ఈ పూజ్య
దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నాము. అక్కడ వేరే ధర్మమేదీ ఉండదు. ఇది మీరు
అర్థము చేయించవచ్చు. ప్రదర్శనీలలోనైతే భాషణ వంటివి చేయలేరు. అర్థము చేయించేందుకు
వేరే ఏర్పాటు చేయవలసి ఉంటుంది. మనము భారతవాసులకు శుభవార్తను వినిపిస్తున్నాము - ఇదే
ముఖ్యమైన విషయము. మనము ఈ రాజ్య స్థాపన చేస్తున్నాము. దైవీ రాజ్యము ఉండేది, ఇప్పుడు
అది లేదు, మళ్ళీ దీని స్థాపన జరుగుతుంది, మిగిలినవన్నీ వినాశనమైపోతాయి. సత్యయుగములో
ఈ ఒక్క ధర్మము ఉన్నప్పుడు అనేక ధర్మాలు ఉండేవి కావు. ఇప్పుడు ఆ అనేక ధర్మాలు కలిసి
ఒక్కటిగా అవ్వడమనేది జరగదు. ఆ ధర్మాలు ఒక దాని వెనుక ఒకటి వస్తాయి మరియు వృద్ధిని
పొందుతూ ఉంటాయి. మొట్టమొదటి ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము కనుమరుగైపోయింది. స్వయాన్ని
దేవీ-దేవతా ధర్మానికి చెందినవారమని చెప్పుకునేవారు ఎవ్వరూ లేరు. దీనిని వికారీ
ప్రపంచమని అంటారు. మీరు ఈ విధముగా చెప్పవచ్చు - శివబాబా నిర్వికారీ ప్రపంచాన్ని
స్థాపన చేస్తున్నారని మేము మీకు శుభవార్తను వినిపిస్తున్నాము. మనము ప్రజాపిత
బ్రహ్మాకు సంతానమైన బ్రహ్మాకుమార-కుమారీలము కదా. మొట్టమొదటైతే మనము సోదరులము, ఆ
తర్వాత రచన జరిగినప్పుడు తప్పకుండా సోదరీ-సోదరులుగా అవుతాము. బాబా, మేము మీ పిల్లలము
అని అందరూ అంటారు కావున సోదరీ-సోదరులకు పరస్పరములో వికారీ దృష్టి ఉండకూడదు. ఈ అంతిమ
జన్మ పవిత్రముగా అవ్వాలి, అప్పుడే పవిత్ర విశ్వానికి యజమానులుగా అవ్వగలము.
గతి-సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమేనని మీకు తెలుసు. పాత ప్రపంచము మారి తప్పకుండా
కొత్త ప్రపంచము స్థాపన అవ్వనున్నది. అది భగవంతుడే చేస్తారు. ఇప్పుడు వారు కొత్త
ప్రపంచాన్ని ఏ విధముగా రచిస్తారు అనేది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు పాత
ప్రపంచము కూడా ఉంది, ఇదేమీ సమాప్తము అవ్వలేదు. చిత్రాలలో కూడా బ్రహ్మా ద్వారా
స్థాపన అని ఉంది. ఇది వీరి అనేక జన్మల అంతిమ జన్మ. బ్రహ్మాకు జోడి లేరు, బ్రహ్మాను
దత్తత తీసుకుంటారు. అర్థము చేయించేందుకు మంచి యుక్తి కావాలి. శివబాబా బ్రహ్మాలో
ప్రవేశించి మనల్ని తమవారిగా చేసుకుంటారు. శరీరములో ప్రవేశించినప్పుడే - ఓ ఆత్మా,
నీవు నా సంతానము అని చెప్పగలరు. ఆత్మలైతే ముందు నుండే ఉంటాయి, ఆ తర్వాత బ్రహ్మా
ద్వారా సృష్టి రచించినప్పుడు తప్పకుండా బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలు అవుతారు కదా,
అప్పుడు సోదరీ-సోదరులుగా అవుతారు. వేరే దృష్టి తొలగిపోతుంది. మనము శివబాబా నుండి
పావనముగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటాము. రావణుడి నుండి మనకు శాపము లభిస్తుంది.
ఇప్పుడు మనము దేహీ-అభిమానులుగా అయినట్లయితే తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది.
దేహాభిమానులుగా అయినట్లయితే రావణుడి శాపము లభిస్తుంది. శాపము లభించడముతో కిందకు
దిగిపోతూ ఉంటారు. ఇప్పుడు భారత్ శాపగ్రస్తముగా ఉంది కదా. భారత్ ను ఇంత నిరుపేదగా,
వికారీగా ఎవరు చేశారు? ఎవరిదో అయితే శాపము కదా. ఇది రావణుడి రూపీ మాయా శాపము. ప్రతి
సంవత్సరము రావణుడిని కాలుస్తారు కావున తప్పకుండా అతను శత్రువే కదా. ధర్మములోనే శక్తి
ఉంటుంది. ఇప్పుడు మనము దేవతా ధర్మానికి చెందినవారిగా అవుతాము. కొత్త ధర్మాన్ని
స్థాపన చేయటానికి బాబా నిమిత్తముగా ఉన్నారు. ఎంత శక్తివంతమైన ధర్మాన్ని స్థాపన
చేస్తారు. మనము బాబా నుండి శక్తి తీసుకుంటాము, పూర్తి విశ్వముపై విజయము పొందుతాము.
స్మృతియాత్ర ద్వారానే శక్తి లభిస్తుంది మరియు వికర్మలు వినాశనమవుతాయి. కావున వారికి
ఒక ఆశను కలిగించేందుకు ఇలా వ్రాయాలి - మేము శుభవార్తను వినిపిస్తున్నాము. ఇప్పుడు ఈ
ధర్మ స్థాపన జరుగుతోంది, దీనినే హెవెన్, స్వర్గము అని అంటారు. ఇలా పెద్ద-పెద్ద
అక్షరాలలో వ్రాయండి. బాబా సలహా ఇస్తున్నారు - అన్నిటికన్నా ముఖ్యమైనది ఇదే. ఇప్పుడు
ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క స్థాపన జరుగుతోంది. ప్రజాపిత బ్రహ్మా కూడా
కూర్చుని ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మాకుమార-కుమారీలమైన మనము శ్రీమతము ఆధారముగా ఈ
కార్యము చేస్తున్నాము. ఇది బ్రహ్మా మతము కాదు, శ్రీమతము అంటేనే పరమపిత పరమాత్మ
శివునిది, వారు అందరికీ తండ్రి. తండ్రియే ఏక ధర్మ స్థాపనను, అనేక ధర్మాల వినాశనాన్ని
చేస్తారు. రాజయోగాన్ని నేర్చుకుని ఈ విధముగా తయారవుతారు. మనము కూడా ఇలా
తయారవుతున్నాము. మనము అనంతమైన సన్యాసము చేసాము ఎందుకంటే ఈ పాత ప్రపంచము
భస్మమైపోనున్నదని మనకు తెలుసు. హద్దు తండ్రి కొత్త ఇల్లు కట్టినప్పుడు పాతదానిపై
మమకారము తొలగిపోతుంది. తండ్రి అంటారు, ఈ పాత ప్రపంచము సమాప్తము అవ్వనున్నది. ఇప్పుడు
మీ కోసం కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాను. మీరు కొత్త ప్రపంచము కోసమే
చదువుకుంటున్నారు. అనేక ధర్మాల వినాశనము, ఏక ధర్మ స్థాపన సంగమములోనే జరుగుతుంది.
యుద్ధము జరుగుతుంది, ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. సత్యయుగములో వీరి రాజ్యము
ఉన్నప్పుడు ఇంకే ధర్మము ఉండేది కాదు. మిగిలినవారంతా ఎక్కడ ఉండేవారు? ఈ జ్ఞానాన్ని
బుద్ధిలో ఉంచుకోవాలి. అలాగని ఈ జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకున్నప్పుడు నేను వేరే
పనులేవీ చేయను అని కాదు, నాకు ఎన్ని ఆలోచనలు ఉంటాయి. ఉత్తరాలు వ్రాయడము, చదవడము,
ఇళ్ళ గురించి ఆలోచించడము, ఇవన్నీ చేస్తాను, అయినా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటాను.
తండ్రిని స్మృతి చేయకపోతే వికర్మలు ఎలా వినాశనమవుతాయి.
ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానము లభించింది, మీరు అర్ధకల్పము కొరకు పూజ్యులుగా
అవుతున్నారు. అర్ధకల్పము పూజారులుగా, తమోప్రధానముగా ఉంటారు, ఆ తర్వాత అర్ధకల్పము
పూజ్యులుగా, సతోప్రధానముగా ఉంటారు. ఆత్మ పరమపిత పరమాత్మునితో యోగము జోడించడం
ద్వారానే పారసముగా తయారవుతుంది. స్మృతి చేస్తూ-చేస్తూ ఇనుప యుగము నుండి బంగారు
యుగములోకి వెళ్ళిపోతుంది. పతిత-పావనా అని ఒక్కరినే అంటారు. మున్ముందు మీ శబ్దము
వెలువడుతుంది. ఇది అన్ని ధర్మాల కోసము ఉన్నది. మీరు అంటారు కూడా - తండ్రి
చెప్తున్నారు, పతిత-పావనుడిని నేనే, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా
అవుతారు, మిగిలిన వారందరూ లెక్కాచారాలను సమాప్తము చేసుకుని వెళ్తారు. ఏ విషయములోనైనా
తికమకపడితే అడగవచ్చు. సత్యయుగములో కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఇప్పుడైతే అనేక
ధర్మాలు ఉన్నాయి. తప్పకుండా లెక్కాచారాలను సమాప్తము చేసుకుని, ఎలా ఉండేవారమో, మళ్ళీ
అలాగే అవుతాము. వివరాలలోకి ఎందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ వచ్చి తమ-తమ పాత్రను
అభినయిస్తారని తెలుసు. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి ఎందుకంటే వీళ్ళందరూ
సత్యయుగములో లేనే లేరు. ఏక ధర్మ స్థాపనను, అనేక ధర్మాల వినాశనాన్ని చేసేందుకే తండ్రి
వస్తారు. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది, మళ్ళీ సత్యయుగము తప్పకుండా
వస్తుంది, చక్రము తప్పకుండా తిరుగుతుంది. టూ మచ్ ఆలోచనలలోకి వెళ్ళకండి, ముఖ్యమైన
విషయమేమిటంటే మనము సతోప్రధానముగా అయితే ఉన్నత పదవిని పొందుతాము. కుమారీలైతే ఇందులో
నిమగ్నమైపోవాలి, కుమారీల సంపాదనను తల్లిదండ్రులు తినరు. కానీ ఈ రోజుల్లో ఆకలి
కలవారిగా (లోభము కలవారిగా) అయిపోయిన కారణముగా కుమారీలు కూడా సంపాదించవలసి వస్తుంది.
ఇప్పుడు పవిత్రముగా అయి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలని మీరు భావిస్తారు.
మనము రాజయోగులము, తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి.
ఇప్పుడు మీరు పాండవ సైన్యానికి చెందినవారిగా అయ్యారు. మీ సేవ చేసుకుంటూ కూడా -
మేము వెళ్ళి అందరికీ మార్గాన్ని తెలియజేయాలి అన్న ఆలోచనను ఉంచుకోవాలి. ఎంత చేస్తే,
అంత ఉన్నత పదవిని పొందుతారు. ఈ పరిస్థితిలో చనిపోతే నాకు ఏం పదవి లభిస్తుంది అని
బాబాను అడగవచ్చు. బాబా వెంటనే చెప్పేస్తారు. సేవ చేయడము లేదు, అందుకే సాధారణ
ఇంటిలోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు, మళ్ళీ వచ్చి జ్ఞానాన్ని తీసుకోవడమంటే అది కష్టము,
ఎందుకంటే చిన్న పిల్లలు అంతగా జ్ఞానాన్ని అర్థము చేసుకోలేరు. ఒకవేళ 2-3 సంవత్సరాలే
మిగిలి ఉంటే ఇంకేమి చదువుకోగలరు? బాబా చెప్పేస్తారు - నీవు ఏదైనా క్షత్రియ కులములోకి
వెళ్ళి జన్మ తీసుకుంటావు, మహా అయితే చివరిలో రెండు కిరీటాలు లభిస్తాయి, పూర్తి
స్వర్గ సుఖాన్ని పొందలేరు. ఎవరైతే పూర్తిగా సేవ చేస్తారో, చదువుకుంటారో, వారే పూర్తి
సుఖాన్ని పొందుతారు. నంబరువారు పురుషార్థానుసారముగా పొందుతారు. ఇదే చింత
పెట్టుకోవాలి - ఇప్పుడు తయారవ్వకపోతే ఇక కల్ప-కల్పము తయారవ్వరు. తాము ఎన్ని
మార్కులతో పాస్ అవుతారు అన్న విషయములో ప్రతి ఒక్కరూ స్వయాన్ని గురించి తెలుసుకోగలరు.
అందరికీ తెలిసిపోతుంది, అప్పుడిక విధి ఇలా నిశ్చితమై ఉందని అనుకుంటారు. లోలోపల
దుఃఖము కలుగుతుంది కదా! కూర్చుని-కూర్చునే మాకు ఏమైపోయింది అని అనిపిస్తుంది.
కూర్చుని-కూర్చునే మనుష్యులు మరణిస్తారు కూడా, అందుకే తండ్రి అంటారు - సోమరులుగా
అవ్వకండి. పురుషార్థము చేసి పతితము నుండి పావనముగా అవుతూ ఉండండి, మార్గము
తెలియజేస్తూ ఉండండి. మిత్ర-సంబంధీకులు మొదలైనవారెవరైనా ఉంటే, వారిపై దయ కలగాలి. వీరు
వికారాలు లేకుండా, అశుద్ధమైనవి తినకుండా ఉండలేరని మీరు చూసినా కూడా, వారికి అర్థము
చేయిస్తూ ఉండాలి. ఒకవేళ స్వీకరించకపోతే, వీరు మన కులము వారు కాదని భావించండి.
ప్రయత్నము చేసి పుట్టినిల్లు మరియు అత్తవారి ఇల్లు యొక్క కళ్యాణము చేయాలి. వీరు మాతో
మాట్లాడడమే లేదు, ముఖము తిప్పేసుకున్నారు అని ఈ విధముగా అనిపించేలా కూడా మీ నడవడిక
ఉండకూడదు. అలా కాదు. అందరితోనూ కలుపుగోలుగా ఉండాలి. మనము వారి కళ్యాణము కూడా చేయాలి.
చాలా దయార్ద్ర హృదయులుగా అవ్వాలి. మనము సుఖము వైపు వెళ్తున్నాము కావున ఇతరులకు కూడా
మార్గాన్ని తెలియజేయాలి. అంధులకు చేతికర్ర మీరే కదా. అంధులకు నీవు చేతికర్ర అని
పాడుతారు. అందరికీ నేత్రాలు ఉన్నా కూడా ఈ విధముగా పిలుస్తారు ఎందుకంటే జ్ఞానమనే
మూడవ నేత్రము లేదు. సుఖ-శాంతుల మార్గాన్ని తెలియజేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇది
పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు ఉంది. ఇంతకుముందు ఇలా అనుకునేవారు కాదు. భక్తి
మార్గములో ఎన్ని మంత్రాలను జపిస్తారు. రామ-రామ అని అంటూ చేపలకు తినిపిస్తారు, చీమలకు
తినిపిస్తారు. ఇప్పుడు జ్ఞాన మార్గములోనైతే ఏమీ చేయవలసిన అవసరము లేదు. పక్ష్యులైతే
లెక్కలేనన్ని మరణిస్తాయి. ఒక్కసారి తుఫాను వచ్చిందంటే ఎన్నో మరణిస్తాయి. ప్రకృతి
వైపరీత్యాలైతే ఇప్పుడు చాలా తీవ్రతతో వస్తాయి. ఈ రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయి. ఇదంతా
వినాశనము అవ్వవలసిందే. ఇప్పుడు మేము స్వర్గములోకి వెళ్తాము అని లోపల అనిపిస్తుంది.
అక్కడ మన ఫస్ట్ క్లాస్ మహళ్ళను నిర్మిస్తాము. కల్పక్రితము తయారుచేసినట్లే
తయారుచేస్తాము. కల్పక్రితము ఏవైతే తయారుచేసి ఉంటారో, మళ్ళీ అవే తయారుచేస్తారు. ఆ
సమయానికి ఆ బుద్ధి వచ్చేస్తుంది. వాటి గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచించడము, దీని
బదులు తండ్రి స్మృతిలో ఉండండి. స్మృతియాత్రను మర్చిపోకండి. మహళ్ళు అయితే
కల్పక్రితములానే తయారవుతాయి. కానీ ఇప్పుడు స్మృతియాత్రలో తోడును నిర్వర్తించాలి
మరియు మనకు తండ్రి, టీచర్, సద్గురువు లభించారని చాలా సంతోషములో ఉండాలి. ఈ
సంతోషములోనైతే రోమాలు నిక్కబొడుచుకోవాలి. మనము వచ్చిందే అమరపురికి యజమానులుగా
తయారవ్వడానికి అని మీకు తెలుసు. ఈ సంతోషము స్థిరముగా ఉండాలి. ఇక్కడ ఉన్నప్పుడే మళ్ళీ
21 జన్మలకు అది స్థిరముగా ఉంటుంది. అనేకులకు స్మృతిని కలిగిస్తూ ఉన్నట్లయితే మీకు
కూడా స్మృతి పెరుగుతుంది. ఇక తర్వాత అలవాటైపోతుంది. ఈ అపవిత్ర ప్రపంచానికి నిప్పు
అంటుకుంటుందని మీకు తెలుసు. ఇంతటి ప్రపంచమంతా సమాప్తమవుతుంది అనే ఆలోచన
బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఉంది. సత్యయుగములో ఇవేమీ తెలియవు. ఇప్పుడిది అంతిమము,
మీరు స్మృతి కోసం పురుషార్థము చేస్తున్నారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పతితము నుండి పావనముగా అయ్యే పురుషార్థములో సోమరులుగా అవ్వకూడదు.
మిత్ర-సంబంధీకులు మొదలైనవారు ఎవరున్నా, వారిపై దయ ఉంచి అర్థము చేయించాలి,
వదిలేయకూడదు.
2. వీరు ముఖము తిప్పేసుకున్నారే అని ఎవరైనా అనే విధముగా మీ నడవడిక ఉండకూడదు.
దయార్ద్ర హృదయులుగా అయి అందరి కళ్యాణము చేయాలి, మిగిలిన ఆలోచనలన్నీ వదిలి ఒక్క
తండ్రి స్మృతిలో ఉండాలి.
వరదానము:-
సత్యత, స్వచ్ఛత మరియు నిర్భయత యొక్క ఆధారముతో ప్రత్యక్షత చేసే
రమతా యోగీ భవ
పరమాత్మ ప్రత్యక్షతకు ఆధారము సత్యత మరియు సత్యతకు ఆధారము
స్వచ్ఛత మరియు నిర్భయత. ఒకవేళ ఏ విధమైన అస్వచ్ఛత ఉన్నా అనగా సత్యత మరియు శుభ్రత
యొక్క లోటు ఉన్నా లేక తమ తమోగుణ సంస్కారాలపై విజయులుగా అవ్వడములో భయమున్నా,
సంస్కారాలను కలుపుకోవడములో భయమున్నా లేక విశ్వ సేవా క్షేత్రములో తమ సిద్ధాంతాలను
నిరూపించడములో భయమున్నా, ప్రత్యక్షత జరగదు. అందుకే సత్యతను మరియు నిర్భయతను ధారణ
చేసి ఒకే ధ్యాసలో ఆనందముగా నిమగ్నమై ఉండే రమతా యోగులుగా, సహజ రాజయోగులుగా అవ్వండి,
అప్పుడు సహజముగానే అంతిమ ప్రత్యక్షత జరుగుతుంది.
స్లోగన్:-
అనంతమైన దృష్టి, వృత్తియే ఐక్యతకు ఆధారము, అందుకే హద్దులలోకి రాకండి.
అవ్యక్త సూచనలు -
అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి
అశరీరిగా అవ్వటమనేది
వైర్ లెస్ సెట్ వంటిది. వైస్ లెస్ గా అవ్వటమే వైర్ లెస్ సెట్ కు సెట్టింగ్.
అంశములో అంశమాత్రపు వికారము ఉన్నా కానీ అది వైర్ లెస్ సెట్ ను పాడు చేసేస్తుంది,
అందుకే ఇప్పుడు కర్మ బంధనాలు కలవారి నుండి కర్మయోగులుగా అవ్వండి. అనేక బంధనాల నుండి
విముక్తులై ఒక్క బాబా సంబంధములో ఉన్నట్లుగా భావించినట్లయితే సదా ఎవర్రెడీగా ఉంటారు.
చెక్ చేసుకోండి - లోపల ఎటువంటి వికారము దాగి లేదు కదా?
| | | |