23-02-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ సంగమయుగము ఎక్కే కళ యొక్క యుగము, ఇందులో అందరి మేలు జరుగుతుంది, అందుకే మీ ఎక్కే కళ వలన అందరికీ మేలు జరుగుతుందని అంటారు’’

ప్రశ్న:-
బాబా బ్రాహ్మణ పిల్లలందరికీ చాలా చాలా అభినందనలను తెలియజేస్తారు - ఎందుకు?

జవాబు:-
ఎందుకంటే బాబా అంటారు - నా పిల్లలైన మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. మీరు ఇప్పుడు రావణుడి సంకెళ్ళ నుండి విడుదలవుతారు, మీరు స్వర్గ రాజ్యాన్ని పొందుతారు, పాస్ విత్ ఆనర్ గా అవుతారు, నేను అవ్వను, అందుకే బాబా మీకు చాలా-చాలా అభినందనలను తెలియజేస్తారు. ఆత్మలైన మీరు గాలిపటాలు, మీ దారాలు నా చేతిలో ఉన్నాయి. నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను.

పాట:-
చివరికి నేటికి ఆ రోజు రానే వచ్చింది...

ఓంశాంతి
ఈ అమరకథను ఎవరు వినిపిస్తున్నారు? అమరకథ అనండి, సత్యనారాయణ కథ అనండి లేదా మూడవ నేత్రము కథ అనండి - మూడూ ముఖ్యమైనవే. ఇప్పుడు మీరు ఎవరి ఎదురుగా కూర్చున్నారు మరియు ఎవరు మీకు వినిపిస్తున్నారు? సత్సంగాలకైతే వీరు (బ్రహ్మా) కూడా చాలా వెళ్ళారు. అక్కడైతే అందరూ మనుష్యులే కనిపిస్తారు. ఫలానా సన్యాసి కథను వినిపిస్తారని అంటారు. శివానందుడు వినిపిస్తారని అంటారు. భారత్ లోనైతే ఎన్నో సత్సంగాలు ఉన్నాయి. ప్రతి వీధిలోనూ సత్సంగముంది. మాతలు కూడా పుస్తకాలు తీసుకుని, కూర్చుని సత్సంగాలు జరుపుతూ ఉంటారు. అయితే అక్కడ మనుష్యులను చూడవలసి వస్తుంది, కానీ ఇక్కడైతే ఇది అద్భుతమైన విషయము. మీ బుద్ధిలో ఎవరు ఉన్నారు? పరమాత్మ. ఇప్పుడు బాబా మన ఎదురుగా వచ్చి ఉన్నారని, నిరాకార బాబా మనల్ని చదివిస్తున్నారని మీరంటారు. ఆ ఈశ్వరుడైతే నామ-రూపాలకు అతీతమైనవారని మనుష్యులు అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నామ-రూపాలకు అతీతమైన వస్తువేదీ లేదు. ఇక్కడ సాకార మనుష్యులెవ్వరూ చదివించడము లేదని పిల్లలైన మీకు తెలుసు, ఇకపోతే మొత్తం ప్రపంచములో మీరు ఎక్కడికి వెళ్ళినా సాకారములో ఉన్నవారే చదివిస్తారు. ఇక్కడైతే సుప్రీమ్ తండ్రి ఉన్నారు, వారిని నిరాకార గాడ్ ఫాదర్ అని అంటారు, ఆ నిరాకారుడు సాకారునిలో కూర్చుని చదివిస్తారు. ఇది పూర్తిగా కొత్త విషయము. ఫలానా పండితుడు, ఫలానా గురువు అని మీరు జన్మజన్మలుగా వింటూ వచ్చారు. ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. భారత్ అయితే చాలా పెద్దది. ఇక్కడ ఏమి నేర్పించినా, అర్థం చేయించినా, అది మనుష్యులే నేర్పిస్తారు. మనుష్యులే శిష్యులుగా అయ్యారు. అనేక రకాల మనుష్యులు ఉన్నారు. ఫలానావారు వినిపిస్తున్నారని అంటారు. ఎప్పుడూ శరీరము పేరునే తీసుకోవడము జరుగుతుంది. భక్తి మార్గములో - ఓ పతిత పావనా రండి అని నిరాకారుడినే పిలుస్తారు. వారే వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తారు. కల్ప-కల్పము మొత్తం ప్రపంచము పతితముగా అయిపోతుంది, దానిని పావనముగా తయారుచేసేవారు ఒక్క నిరాకార తండ్రి మాత్రమే. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు, మీలో కూడా కొంతమంది పిల్లలు కచ్చాగా (అపరిపక్వముగా) ఉన్నారు, కొంతమంది పక్కాగా (పరిపక్వముగా) ఉన్నారు ఎందుకంటే అర్ధకల్పము మీరు దేహాభిమానులుగా అయ్యారు. ఇప్పుడు దేహీ-అభిమానులుగా ఈ జన్మలో అవ్వాలి. మీ దేహములో ఉండే ఆత్మకు పరమాత్మ కూర్చుని అర్థం చేయిస్తారు. ఆత్మయే సంస్కారాలను తీసుకువెళ్తుంది. నేను ఫలానాను అని ఆత్మ ఇంద్రియాల ద్వారా చెప్తుంది, కానీ ఆత్మాభిమానులుగా అయితే ఎవరూ లేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ భారత్ లో ఎవరైతే సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా ఉండేవారో, వారే ఈ సమయములో వచ్చి బ్రాహ్మణులుగా అవుతారు, ఆ తర్వాత దేవతలుగా అవుతారు. మనుష్యులకు దేహాభిమానులుగా ఉండే అలవాటు ఉంది, దేహీ-అభిమానులుగా ఉండడము మర్చిపోతారు, అందుకే తండ్రి ఘడియ-ఘడియ చెప్తారు - దేహీ-అభిమానులుగా అవ్వండి. ఆత్మయే రకరకాల వస్త్రాలను (శరీరాలను) ధరించి పాత్రను అభినయిస్తుంది. ఇవి ఆత్మకు ఇంద్రియాలు. ఇప్పుడు తండ్రి పిల్లలకు మన్మనాభవ అని చెప్తున్నారు. అయితే, కేవలం గీతను చదవడము వలన రాజ్య భాగ్యము ఏమీ లభించదు. మిమ్మల్ని ఈ సమయములో త్రికాలదర్శులుగా తయారుచేయడము జరుగుతుంది. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. శ్రీకృష్ణుడైతే సత్యయుగ రాకుమారుడు. సూర్యవంశీ దేవతలుగా ఎవరైతే ఉండేవారో, వారిలో జ్ఞానమేమీ ఉండేది కాదు. జ్ఞానము కనుమరుగైపోతుంది. జ్ఞానము అనేది సద్గతి కోసమే ఉన్నది. సత్యయుగములో ఎవరూ దుర్గతిలో ఉండనే ఉండరు. అది సత్యయుగము. ఇప్పుడిది కలియుగము. భారత్ లో మొదట సూర్యవంశీయులు 8 జన్మలు తీసుకుంటారు, ఆ తర్వాత చంద్రవంశీయులు 12 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు మీ ఈ ఒక్క జన్మ అన్నింటికన్నా మంచి జన్మ. మీరు ప్రజాపిత బ్రహ్మా ముఖవంశావళి. ఇది సర్వోత్తమమైన ధర్మము. దేవతా ధర్మాన్ని సర్వోత్తమమైన ధర్మమని అనరు. బ్రాహ్మణ ధర్మము అన్నింటికన్నా ఉన్నతమైనది. దేవతలైతే ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు.

ఈ రోజుల్లో చాలామంది సోషల్ వర్కర్లు ఉన్నారు. మీది ఆత్మిక సేవ. అది దైహిక సేవ చేయడము. ఆత్మిక సేవ ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. పూర్వము ఈ సోషల్ వర్కర్లు మొదలైనవారు ఉండేవారు కాదు. రాజా-రాణులు రాజ్యము చేసేవారు. సత్యయుగములో దేవీ-దేవతలు ఉండేవారు. మీరే పూజ్యులుగా ఉండేవారు, తర్వాత పూజారులుగా అయ్యారు. లక్ష్మీ-నారాయణులు ద్వాపరములో వామ మార్గములోకి వెళ్ళినప్పుడు మందిరాలను నిర్మిస్తారు. మొట్టమొదట శివుని మందిరాన్ని నిర్మిస్తారు. వారు సర్వుల సద్గతిదాత కనుక తప్పకుండా వారికి పూజ జరగాలి. శివబాబాయే ఆత్మలను నిర్వికారిగా తయారుచేసారు కదా. ఆ తర్వాత దేవతల పూజ జరుగుతుంది. మీరే పూజ్యులుగా ఉండేవారు, తర్వాత మీరే పూజారులుగా అయ్యారు. బాబా అర్థం చేయించారు, చక్రాన్ని స్మృతి చేస్తూ ఉండండి. మెట్లు దిగుతూ-దిగుతూ పూర్తిగా నేలపైకి వచ్చి పడ్డారు. ఇప్పుడు మీది ఎక్కే కళ. మీ ఎక్కే కళ వలన అందరి మేలు జరుగుతుందని అంటారు. మొత్తం ప్రపంచములోని మనుష్యమాత్రులను ఇప్పుడు ఎక్కే కళలోకి తీసుకువెళ్తాను. పతిత-పావనుడు వచ్చి అందరినీ పావనముగా తయారుచేస్తారు. సత్యయుగము ఉన్నప్పుడు ఎక్కే కళ ఉండేది, ఆ సమయములో మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామములో ఉండేవి.

తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, నా జన్మ భారత్ లోనే జరుగుతుంది. శివబాబా వచ్చారని అంటూ ఉంటారు. ఇప్పుడు వారు మళ్ళీ వచ్చారు. దీనిని రాజస్వ అశ్వమేధ అవినాశీ రుద్ర జ్ఞాన యజ్ఞమని అంటారు. స్వరాజ్యాన్ని పొందేందుకు యజ్ఞము రచించబడింది. అప్పుడు కూడా విఘ్నాలు కలిగాయి, ఇప్పుడు కూడా కలుగుతున్నాయి. మాతలపై అత్యాచారాలు జరుగుతాయి. బాబా, వీరు మమ్మల్ని వివస్త్రగా చేస్తున్నారు, వీరు మమ్మల్ని వదిలిపెట్టడము లేదు, బాబా, మమ్మల్ని రక్షించండి అని అంటారు. ద్రౌపది రక్షణ జరిగినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు మీరు 21 జన్మల కోసం అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. స్మృతియాత్రలో ఉంటూ స్వయాన్ని పవిత్రముగా తయారుచేసుకుంటారు. మళ్ళీ వికారాలలోకి వెళ్ళినట్లయితే ఇక సమాప్తమైపోతారు, పూర్తిగా పడిపోతారు, అందుకే బాబా అంటారు, పవిత్రముగా తప్పకుండా ఉండాలి. ఎవరైతే కల్పక్రితము పవిత్రముగా అయ్యారో, వారే పవిత్రత యొక్క ప్రతిజ్ఞను చేస్తారు, ఇక తర్వాత కొంతమంది పవిత్రముగా ఉండగలరు, కొంతమంది ఉండలేరు. ముఖ్యమైన విషయము స్మృతికి సంబంధించినది. స్మృతి చేస్తూ, పవిత్రముగా ఉంటూ, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉన్నట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. విష్ణువు యొక్క రెండు రూపాలు రాజ్యము చేస్తారు కదా. కానీ విష్ణువుకు ఏవైతే శంఖ-చక్రాలను చూపించారో, అవి దేవతలకు ఉండేవి కావు. అవి లక్ష్మీ-నారాయణులకు కూడా ఉండేవి కావు. విష్ణువైతే సూక్ష్మవతనములో ఉంటారు, వారికి చక్రము యొక్క జ్ఞానము అవసరము లేదు. అక్కడ మూవీ (సైగల భాష) నడుస్తుంది. మనము శాంతిధామ నివాసులమని ఇప్పుడు మీకు తెలుసు. అది నిరాకారీ ప్రపంచము. ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటి అనేది కూడా మనుష్యమాత్రులకు తెలియదు. ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు. ఆత్మ ఒక ప్రకాశించే నక్షత్రమని, అది భృకుటి మధ్యలో ఉంటుందని అంటారు. ఈ కనులతో ఆత్మను చూడలేరు. గాజు పెట్టె మొదలైనవాటిలో శరీరాన్ని బంధించి ఆత్మ బయటకు ఎలా వస్తుంది అనేది చూడాలని, ఎవరు ఎంతగా ప్రయత్నించినా సరే చూడలేరు. ప్రయత్నము చేస్తారు కానీ ఆత్మ అంటే ఏమిటి, అది ఎలా బయటకు వస్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు. ఇకపోతే ఆత్మ నక్షత్రము వలె ఉంటుందని మాత్రం అంటారు. దివ్యదృష్టి లేకుండా దానిని చూడలేరు. భక్తి మార్గములో చాలామందికి సాక్షాత్కారాలు జరుగుతాయి. అర్జునుడికి అఖండ జ్యోతి సాక్షాత్కారమైనట్లుగా, నేను సహించలేను అని అర్జునుడు అన్నట్లుగా వ్రాసి ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, అంత తేజోమయముగా ఉండటము అనేమీ కాదు. ఆత్మ వచ్చి శరీరములోకి ప్రవేశించినప్పుడు మీకు తెలియదు కదా. బాబా ఎలా ప్రవేశించి మాట్లాడుతారు అనేది ఇప్పుడు మీకు కూడా తెలుసు. ఆత్మయే వచ్చి మాట్లాడుతుంది. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది, ఇందులో ఎవ్వరి శక్తి యొక్క విషయము లేదు. ఆత్మ ఏమీ శరీరాన్ని వదిలి వెళ్ళదు. ఇది సాక్షాత్కారము యొక్క విషయము. ఇది అద్భుతమైన విషయము కదా. తండ్రి అంటారు, నేను కూడా సాధారణ తనువులోకి వస్తాను. ఆత్మనే పిలుస్తారు కదా. పూర్వము ఆత్మలను పిలిచి వారిని అడిగేవారు కూడా. ఇప్పుడైతే తమోప్రధానమైపోయారు కదా. నేను వెళ్ళి పతితులను పావనముగా తయారుచేయాలి అనే తండ్రి వస్తారు. 84 జన్మలు అని అంటారు కూడా. ఎవరైతే మొదట వచ్చారో, వారే తప్పకుండా 84 జన్మలను తీసుకుని ఉంటారని అర్థం చేసుకోవాలి. వారైతే లక్షల సంవత్సరాలని అనేస్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను మిమ్మల్ని స్వర్గములోకి పంపించాను, మీరే వెళ్ళి రాజ్యము చేసారు, భారతవాసులైన మిమ్మల్ని స్వర్గములోకి పంపించాను, సంగమయుగములో రాజయోగాన్ని నేర్పించాను. తండ్రి అంటారు, నేను కల్పము యొక్క సంగమయుగములో వస్తాను. గీతలో యుగే, యుగే అనే మాట వ్రాసారు.

మనము మెట్లను ఎలా దిగుతాము, మళ్ళీ ఎలా ఎక్కుతాము అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఎక్కే కళ, ఆ తర్వాత దిగే కళ. ఇప్పుడు ఈ సంగమయుగము సర్వుల ఎక్కే కళ యొక్క యుగము. అందరూ ఎక్కుతారు. అందరూ పైకి వెళ్ళిపోతారు, ఆ తర్వాత మీరు స్వర్గములో పాత్రను అభినయించేందుకు వస్తారు. సత్యయుగములో వేరే ధర్మమేదీ ఉండేది కాదు. దానిని నిర్వికారీ ప్రపంచమని అంటారు. ఆ తర్వాత దేవీ-దేవతలు వామ మార్గములోకి వెళ్ళి అందరూ వికారులుగా అవ్వడము మొదలుపెడతారు, యథా రాజా-రాణి తథా ప్రజ అందరూ వికారులుగా అయిపోతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఓ భారతవాసులారా, మీరు నిర్వికారీ ప్రపంచములో ఉండేవారు. ఇప్పుడిది వికారీ ప్రపంచము. అనేక ధర్మాలు ఉన్నాయి కానీ ఒక్క దేవీ-దేవతా ధర్మము మాత్రము లేదు. తప్పకుండా దేవతా ధర్మము లేనప్పుడే మళ్ళీ స్థాపన జరుగుతుంది. తండ్రి అంటారు, నేను బ్రహ్మా ద్వారా వచ్చి ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. ఇక్కడే చేస్తారు కదా. సూక్ష్మవతనములోనైతే చేయరు కదా. బ్రహ్మా ద్వారా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క రచనను రచిస్తారని వ్రాసి ఉంది. మిమ్మల్ని ఈ సమయములో పావనమైనవారని అనరు. మీరు పావనముగా అవుతున్నారు. సమయమైతే పడుతుంది కదా. పతితుల నుండి పావనులుగా ఎలా అవ్వాలి, ఇది ఏ శాస్త్రములోనూ లేదు. వాస్తవానికి మహిమ అయితే ఒక్క తండ్రిది మాత్రమే. ఆ తండ్రిని మర్చిపోయిన కారణముగానే అనాథలుగా అయిపోయారు. కొట్లాడుకుంటూ ఉంటారు. అందరూ కలిసిపోయి ఒక్కటిగా ఎలా అవ్వాలని అడుగుతూ ఉంటారు. వారు పరస్పరము సోదరులు కదా. బాబా అయితే అనుభవజ్ఞులు. వీరు భక్తి కూడా పూర్తిగా చేసారు. అందరికన్నా ఎక్కువమంది గురువులను ఆశ్రయించారు. ఇప్పుడు తండ్రి అంటారు, వారందరినీ వదిలేయండి, ఇప్పుడు నేను మీకు లభించాను. సర్వుల సద్గతిదాత ఒక్కరే, వారిని సత్ శ్రీ అకాల్ అని అంటారు కదా. కానీ అర్థం తెలియదు. చదవడమైతే చాలా చదువుతూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు అందరూ పతితముగా ఉన్నారు, ఆ తర్వాత పావన ప్రపంచము తయారవుతుంది. భారత్ యే అవినాశీ అయినది. ఇది ఎవ్వరికీ తెలియదు. భారత్ ఎప్పుడూ వినాశనమవ్వదు, అలాగే ప్రళయము ఎప్పుడూ జరగదు. సాగరములో రావి ఆకుపై శ్రీకృష్ణుడు వచ్చినట్లుగా చూపిస్తారు కదా - కానీ రావి ఆకుపైనైతే బాలుడు రాలేడు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు గర్భము నుండి చాలా విశ్రాంతిగా జన్మ తీసుకుంటారు. అక్కడ గర్భ మహల్ అని అంటారు. ఇక్కడ గర్భ జైలు ఉంది. సత్యయుగములో గర్భ మహల్ ఉంటుంది. ఈ తనువును వదిలి మరొకటి తీసుకోవాలని ఆత్మకు ముందే సాక్షాత్కారమవుతుంది. అక్కడ ఆత్మాభిమానులుగా ఉంటారు. మనుష్యులకు రచయిత గురించి గాని, రచన ఆదిమధ్యాంతాల గురించి గాని తెలియదు. తండ్రి జ్ఞానసాగరుడు అని ఇప్పుడు మీకు తెలుసు. మీరు మాస్టర్ సాగరులు. మాతలైన మీరు నదులు మరియు ఈ గోపులు జ్ఞాన మానస సరోవరాలు. వారు జ్ఞాన నదులు. వీరు సరోవరాలు. ప్రవృత్తి మార్గము కావాలి కదా. మీది పవిత్ర గృహస్థ ఆశ్రమముగా ఉండేది. ఇప్పుడు పతితముగా ఉంది. తండ్రి అంటారు, నేను ఒక ఆత్మను అన్నది సదా గుర్తుంచుకోండి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఏ దేహధారినీ గుర్తు చేయకండి అని బాబా ఆజ్ఞాపించారు. ఈ కనులతో ఏదైతే చూస్తున్నారో, అదంతా సమాప్తమవ్వనున్నది, అందుకే తండ్రి అంటారు - మన్మనాభవ, మధ్యాజీభవ. ఈ శ్మశానవాటికను మర్చిపోతూ వెళ్ళండి. మాయా తుఫానులైతే చాలా వస్తాయి, వాటికి భయపడకూడదు. చాలా తుఫానులు వస్తాయి కానీ కర్మేంద్రియాలతో కర్మలు చేయకూడదు. మీరు తండ్రిని మర్చిపోయినప్పుడే తుఫానులు వస్తాయి. ఈ స్మృతియాత్ర ఒక్కసారే ఉంటుంది. అవి మృత్యులోక యాత్రలు, ఇది అమరలోక యాత్ర. ఇప్పుడు తండ్రి అంటారు, ఏ దేహధారినీ స్మృతి చేయకండి.

పిల్లలు శివజయంతికి ఎన్ని టెలిగ్రాములు పంపిస్తారు. తతత్వమ్ అని తండ్రి అంటారు. పిల్లలైన మీకు కూడా తండ్రి అభినందనలు తెలియజేస్తున్నారు. వాస్తవానికి మీకే అభినందనలు ఎందుకంటే మనుష్యుల నుండి దేవతలుగా మీరే అవుతారు. ఇక ఎవరైతే పాస్ విత్ ఆనర్ అవుతారో, వారికి ఎక్కువ మార్కులు లభిస్తాయి మరియు మంచి నంబరు లభిస్తుంది. ఇప్పుడు మీరు రావణుడి సంకెళ్ళ నుండి విడుదలవుతారని తండ్రి మీకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఆత్మలందరూ గాలిపటాల వంటివారు. అందరి దారాలు తండ్రి చేతిలో ఉన్నాయి. వారు అందరినీ తీసుకువెళ్తారు. వారు సర్వుల సద్గతిదాత. కానీ మీరు స్వర్గ రాజ్యాన్ని పొందేందుకు పురుషార్థము చేస్తున్నారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పాస్ విత్ ఆనర్ గా అయ్యేందుకు ఒక్క తండ్రిని స్మృతి చేయాలి, ఏ దేహధారినీ స్మృతి చేయకూడదు. ఈ కళ్ళకు ఏదైతే కనిపిస్తుందో, దానిని చూస్తూ కూడా చూడకూడదు.

2. మనము అమరలోక యాత్రకు వెళ్తున్నాము, అందుకే మృత్యులోకానికి సంబంధించినది ఏదీ గుర్తుకు రాకూడదు, ఈ కర్మేంద్రియాలతో ఏ వికర్మ జరగకూడదు, ఈ అటెన్షన్ పెట్టాలి.

వరదానము:-
తమ శిక్షణా స్వరూపము ద్వారా శిక్షణను ఇచ్చే శిక్షణా సంపన్నమైన యోగ్య శిక్షక భవ

ఎవరైతే తమ శిక్షణా స్వరూపము ద్వారా శిక్షణను ఇస్తారో వారిని యోగ్య శిక్షకులు అని అంటారు. వారి స్వరూపమే శిక్షణా సంపన్నముగా ఉంటుంది. వారి చూడడము, నడవడము కూడా ఎవరికైనా శిక్షణను ఇస్తుంది. ఏ విధముగా సాకార రూపములో అడుగడుగునా ప్రతి కర్మను శిక్షకుని రూపములో ప్రత్యక్షముగా చూసారు, వాటిని మరో మాటలో చరిత్ర అని అంటారు. ఎవరికైనా వాణి ద్వారా శిక్షణను ఇవ్వడము సామాన్యమైన విషయమే కానీ అందరూ అనుభవము కోరుకుంటారు. కావున మీ శ్రేష్ఠ కర్మలు, శ్రేష్ఠ సంకల్పాల శక్తి ద్వారా అనుభవము చేయించండి.

స్లోగన్:-
సంకల్పాల సిద్ధిని పొందేందుకు ఆత్మ శక్తితో ఎగురుతూ ముందుకు వెళ్ళండి.

అవ్యక్త సూచనలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి

సంగఠనను ఏకతా సూత్రములో బంధించేందుకు వాణి శక్తి పట్ల విశేషమైన అటెన్షన్ పెట్టండి. వాణి సదా నిర్మలముగా ఉండాలి, తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి మరియు మధురముగా మాట్లాడండి. గౌరవప్రదమైన మాటలే మాట్లాడండి. ఇప్పటివరకు సాధారణమైన మాటలు ఎక్కువగా ఉన్నాయి. ‘అలౌకిక మాటలు ఉండాలి, ఫరిశ్తాల వంటి మాటలు ఉండాలి’, ప్రతి మాట మధురముగా ఉండాలి. ఇప్పుడు ఈ విషయాన్ని అండర్ లైన్ చేయండి, అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది.