23-05-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మిమ్మల్ని ఈ తీరము నుండి ఆవలి తీరానికి తీసుకువెళ్ళేందుకు మీకు నావికుడు లభించారు, మీ పాదాలు ఇప్పుడు ఈ పాత ప్రపంచములో లేవు, మీ లంగరు ఎత్తివేయబడింది’’

ప్రశ్న:-
ఇంద్రజాలికుడైన తండ్రి యొక్క అద్భుతమైన ఇంద్రజాలము ఏమిటి, అది ఇంకెవ్వరూ చేయలేరు?

జవాబు:-
గవ్వతుల్యమైన ఆత్మను వజ్రతుల్యముగా తయారుచేయడము, తోట యజమానిగా అయి ముళ్ళను పుష్పాలుగా తయారుచేయడము - ఇది చాలా అద్భుతమైన ఇంద్రజాలము, దీనిని ఇంద్రజాలికుడైన తండ్రి ఒక్కరే చేస్తారు, ఇంకెవ్వరూ చేయలేరు. మనుష్యులు ధనం సంపాదించుకోవడం కోసం ఇంద్రజాలికునిగా పిలిపించుకుంటారు కానీ వారు తండ్రి వంటి ఇంద్రజాలమును చేయలేరు.

ఓంశాంతి
మొత్తం సృష్టి చక్రములో లేక డ్రామాలో తండ్రి ఒకేసారి వస్తారు. ఇంకే సత్సంగాలు మొదలైనవాటిలో ఇలా భావించరు. అక్కడ కథను వినిపించేవారు తండ్రి కారు, అలాగే వినేవారు వారి పిల్లలూ కారు. వాస్తవానికి వారు ఫాలోవర్స్ (అనుచరులు) కూడా కారు. ఇక్కడైతే మీరు పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా మరియు ఫాలోవర్స్ కూడా. తండ్రి పిల్లలను తమతో పాటు తీసుకువెళ్తారు. బాబా వెళ్తే మరి పిల్లలు కూడా ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి తమ పుష్పాల ప్రపంచములోకి వెళ్ళి రాజ్యము చేస్తారు. ఇది పిల్లలైన మీ బుద్ధిలోకి రావాలి. ఈ శరీరములో ఉండే ఆత్మ చాలా సంతోషిస్తుంది. మీ ఆత్మ ఎంతో సంతోషించాలి. అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారు, వారు అందరికీ తండ్రి, ఈ వివేకము కూడా కేవలం పిల్లలైన మీకే ఉంది. మిగిలిన ప్రపంచమంతటిలోనైతే అందరూ అవివేకులుగానే ఉన్నారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, రావణుడు మిమ్మల్ని ఎంత అవివేకులుగా చేసేశాడు. తండ్రి వచ్చి వివేకవంతులుగా తయారుచేస్తారు. మొత్తం విశ్వమంతటిపైనా రాజ్యము చేసేందుకు యోగ్యులుగా, అంతటి వివేకవంతులుగా తయారుచేస్తారు. ఎప్పుడైతే భగవంతుడు వచ్చి చదివిస్తారో, ఈ విద్యార్థి జీవితము కూడా ఆ సమయములోనే, ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ఇదంతా మీ బుద్ధిలో ఉంది, ఇకపోతే ఎవరైతే తమ వ్యాపార-వ్యవహారాలు మొదలైనవాటిలో ఎంతగానో చిక్కుకుని ఉంటారో, వారి బుద్ధిలోకి ఎప్పుడూ భగవంతుడు చదివిస్తున్నారు అన్నది రాదు. వారికైతే తమ వ్యాపారాలు మొదలైనవే గుర్తుంటాయి. కనుక భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు అన్నది పిల్లలైన మీకు తెలుసు కావున మీరు ఎంత హర్షితముగా ఉండాలి. మిగిలినవారంతా సాధారణమైనవారికి పిల్లలు, మీరైతే భగవంతుని పిల్లలుగా అయ్యారు, కావున పిల్లలైన మీకు అపారమైన సంతోషము ఉండాలి. కొందరైతే చాలా హర్షితముగా ఉంటారు. కానీ కొందరైతే - బాబా, మేము మురళి వినిపించలేకపోతున్నాము, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది... అని అంటారు. అరే, మురళి వినిపించడము కష్టమేమీ కాదు. భక్తి మార్గములో సాధు-సన్యాసులు మొదలైనవారిని - మేము ఈశ్వరుడిని ఎలా కలుసుకోవాలి అని అడుగుతారు, కానీ వారికి అది తెలియదు. కేవలం వేలుతో పైకి చూపిస్తూ, భగవంతుడిని స్మృతి చేయండి అని చెప్తారు, దానికే వాళ్ళు సంతోషపడిపోతారు. కానీ అతను ఎవరు అన్నది ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. తమ తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ డ్రామాయే అలా తయారుచేయబడి ఉంది, మళ్ళీ కూడా మర్చిపోతారు. అలాగని మీలో కూడా అందరికీ తండ్రి గురించి మరియు రచన గురించి తెలుసు అని కాదు. కొన్నిచోట్ల ఎటువంటి నడవడిక నడుచుకుంటారంటే, ఇక చెప్పడానికి వీలు లేనట్లుగా ఉంటుంది. ఆ నషాయే ఎగిరిపోతుంది. ఇప్పుడు పిల్లలైన మీ పాదాలు పాత ప్రపంచములో లేనట్లే ఉన్నాయి. కలియుగీ ప్రపంచము నుండి ఇప్పుడు పాదాలు పైకి లేచాయి అని మీకు తెలుసు, నావ యొక్క లంగరు ఎత్తివేయబడింది. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము, తండ్రి మనల్ని ఎక్కడకు తీసుకువెళ్తారు అన్నది బుద్ధిలో ఉంది, ఎందుకంటే తండ్రి నావికుడు కూడా, అలాగే తోట యజమాని కూడా. వారు ముళ్ళను పుష్పాలుగా తయారుచేస్తారు. ముళ్ళను పుష్పాలుగా తయారుచేసే వారివంటి తోట యజమాని ఇంకెవ్వరూ లేరు. ఈ ఇంద్రజాలమేమైనా తక్కువదా. వారు గవ్వతుల్యమైన ఆత్మను వజ్రతుల్యముగా తయారుచేస్తారు. ఈ రోజుల్లో ఇంద్రజాలికులు ఎందరో వెలువడ్డారు, ఇది మోసము చేసేవారి ప్రపంచము. తండ్రి సద్గురువు. సద్గురువు అకాలుడు అని అంటారు కూడా. ఎంతో నషాతో అలా అంటారు. సద్గురువు ఒక్కరే, సర్వుల సద్గతిదాత ఒక్కరే అని స్వయమే అంటున్నప్పుడు మరి స్వయాన్ని గురువుగా ఎందుకు చెప్పుకోవాలి? వాళ్ళు అర్థం చేసుకోరు, అలాగే మనుష్యులు ఏమీ అర్థం చేసుకోరు. అసలు ఈ పాత ప్రపంచములో ఏముందని? బాబా కొత్త ఇంటిని తయారుచేస్తున్నారని పిల్లలకు తెలిసినప్పుడు కొత్త ఇంటిని ద్వేషిస్తూ, పాత ఇంటిపై ప్రీతిని పెట్టుకునేవారు ఎవరు ఉంటారు. బుద్ధిలో కొత్త ఇల్లే గుర్తుంటుంది. మీరు అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు కావున మీకు స్మృతి ఉండాలి - తండ్రి మన కొరకు కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తున్నారు అని. మనం ఆ కొత్త ప్రపంచములోకి వెళ్తాము. ఆ కొత్త ప్రపంచానికి అనేక పేర్లు ఉన్నాయి - సత్యయుగము, హెవెన్, ప్యారడైజ్, వైకుంఠము మొదలైనవి... మీ బుద్ధి ఇప్పుడు పాత ప్రపంచము నుండి తొలగిపోయింది, ఎందుకంటే పాత ప్రపంచములో దుఃఖమే దుఃఖము ఉంది. దీని పేరే నరకము, ముళ్ళ అడవి, రౌరవ నరకము, కంసపురి. దీని అర్థము కూడా ఎవ్వరికీ తెలియదు. అంతా రాతిబుద్ధి కలవారు కదా. భారత్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. తండ్రి అంటారు, ఈ సమయములో అందరూ రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. సత్యయుగములో యథా రాజా రాణి తథా ప్రజ అందరూ పారస బుద్ధి కలవారు. ఇక్కడైతే అంతా ప్రజలపై ప్రజల రాజ్యము, అందుకే అందరివీ స్టాంపులు తయారుచేస్తూ ఉంటారు.

పిల్లలైన మీ బుద్ధిలో ఇది గుర్తుండాలి. ఉన్నతోన్నతమైనవారు తండ్రి. ఆ తర్వాత రెండవ నంబరులో ఉన్నతమైనవారు ఎవరు? బ్రహ్మా, విష్ణు, శంకరులది ఎటువంటి గొప్పతనమూ లేదు. శంకరుని విషయములో వస్త్రధారణ మొదలైనవాటిని ఎలా చేసేశారు. అతను భంగు తాగుతారని, ఉమ్మెత్త తింటారని చెప్తారు, ఇది అవమానపర్చడమే కదా. వాస్తవానికి ఈ విషయాలేవీ ఉండవు. వీరు తమ ధర్మాన్నే మర్చిపోయారు. తమ దేవతల గురించి ఏమేమి చెప్తూ ఉంటారు, ఎంతగా అవమానపరుస్తారు! అందుకే తండ్రి అంటారు, నన్నూ అవమానపరిచారు, అలాగే శంకరుడిని, బ్రహ్మానూ కూడా అవమానపరిచారు. విష్ణువును అవమానపర్చడము జరగదు. వాస్తవానికి గుప్తముగా అతడిని కూడా అవమానపరుస్తారు ఎందుకంటే విష్ణువే రాధ-కృష్ణులు. ఇప్పుడు కృష్ణుడు చిన్న పిల్లవాడు కావున తాను మహాత్ముని కంటే ఉన్నతునిగా మహిమ చేయబడతారు. ఈ బ్రహ్మా అయితే తర్వాత సన్యసిస్తారు, కానీ అతడైతే చిన్న పిల్లవాడు, ముందే పవిత్రుడు, అసలు అతడికి పాపము మొదలైనవాటి గురించి తెలియదు. ఉన్నతోన్నతమైనవారు శివబాబా. పాపం మనుష్యులకు ప్రజాపిత బ్రహ్మా ఎక్కడ ఉండాలి అన్నది తెలియదు. ప్రజాపిత బ్రహ్మాను శరీరధారిగానే చూపిస్తారు. అజ్మేర్ లో వారి మందిరము ఉంది. బ్రహ్మాకు మీసము, గడ్డము చూపిస్తారు, శంకరునికి, విష్ణువుకు చూపించరు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము. ప్రజాపిత బ్రహ్మా సూక్ష్మవతనములో ఎలా ఉంటారు! వారు ఇక్కడ ఉండాలి. ఈ సమయములో బ్రహ్మాకు ఎంతమంది సంతానము? ప్రజాపిత బ్రహ్మాకుమార, కుమారీలు ఎంతోమంది ఉన్నారు అని వ్రాసి ఉంది, కావున తప్పకుండా ప్రజాపిత బ్రహ్మా ఉంటారు. వారు చైతన్యమైనవారు కావున తప్పకుండా ఏదో ఒకటి చేస్తారు కదా. ప్రజాపిత బ్రహ్మా కేవలం పిల్లలకు జన్మనివ్వడం మాత్రమేనా లేక ఇంకేమైనా కూడా చేస్తారా. ఆదిదేవ్ బ్రహ్మా మరియు ఆదిదేవి సరస్వతి అని అంటారు కానీ వారి పాత్ర ఏమిటి అనేది ఎవ్వరికీ తెలియదు. వారు రచయిత అయినట్లయితే తప్పకుండా ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళి ఉంటారు. తప్పకుండా బ్రాహ్మణులను శివబాబా దత్తత తీసుకుని ఉంటారు, లేకపోతే బ్రహ్మా ఎక్కడి నుండి వస్తారు? ఇవి కొత్త విషయాలు కదా. ఎప్పటివరకైతే తండ్రి రారో అప్పటివరకూ వీటి గురించి ఎవ్వరూ తెలుసుకోలేరు. ఎవరికి ఏ పాత్ర ఉంటే వారు అదే అభినయిస్తారు. బుద్ధుడు ఏ పాత్రను అభినయించారు, ఎప్పుడు వచ్చారు, వచ్చి ఏం చేసారు - ఇది ఎవ్వరికీ తెలియదు. మీకు ఇప్పుడు తెలుసు. అతనేమైనా గురువా, టీచరా, తండ్రా? కాదు. వారు సద్గతినైతే ఇవ్వలేరు. వారు కేవలం తన ధర్మానికి మాత్రమే రచయిత, అంతేకానీ గురువు కాదు. తండ్రి పిల్లలను రచిస్తారు, తర్వాత చదివిస్తారు. ఇక్కడ తండ్రి, టీచర్ మరియు గురువు, ముగ్గురూ వీరే. కావున మీరు వీళ్ళను చదివించండి అని ఇంకెవ్వరికీ చెప్పరు. ఈ జ్ఞానము ఇంకెవ్వరి వద్దా లేదు. అనంతమైన తండ్రియే జ్ఞానసాగరుడు. కావున తప్పకుండా వారు జ్ఞానము వినిపిస్తారు. తండ్రియే స్వర్గ రాజ్యభాగాన్ని ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు. తండ్రి అంటారు, మీరు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారు. పిల్లలకు లోలోపల సంతోషము ఉంది - ఎవరినైతే మొత్తం ప్రపంచమంతా వెతుకుతుందో వారు మాకు లభించారు. బాబా అంటారు - పిల్లలూ, మీరు 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. పిల్లలు అంటారు - అవును బాబా, మేము మిమ్మల్ని అనేక సార్లు కలిసాము. మిమ్మల్ని ఎవరు ఎంత కొట్టినా చేసినా, లోలోపల అయితే ఈ సంతోషము ఉంది కదా. శివబాబాను కలుసుకున్న ఆ స్మృతి అయితే ఉంది కదా. స్మృతి ద్వారానే ఎన్ని పాపాలు కట్ అవుతాయి. అబలలకు, బంధనములో ఉన్నవారికైతే పాపాలు ఇంకా ఎక్కువగా కట్ అవుతాయి, ఎందుకంటే వారు శివబాబాను ఎక్కువగా స్మృతి చేస్తారు. అత్యాచారాలు జరిగితే బుద్ధి శివబాబా వైపుకు వెళ్ళిపోతుంది. శివబాబా, రక్షించండి అని అంటారు. స్మృతి చేయడం మంచిదే కదా. రోజూ దెబ్బలు తిన్నా సరే, అప్పుడు శివబాబాను స్మృతి చేస్తారు కదా, కావున అందులో లాభమే ఉంది. కావున అటువంటి దెబ్బలపై బలిహారమైపోవాలి. దెబ్బలు పడుతున్న ఆ సమయములో స్మృతి చేస్తారు. గంగాజలం నోటిలో ఉండాలి, గంగాతీరం ఉండాలి, అప్పుడు తనువు నుండి ప్రాణం పోవాలి అని అంటారు. మీకు దెబ్బలు పడినప్పుడు బుద్ధిలో పరమాత్మ మరియు వారసత్వము గుర్తుండాలి. అంతే. బాబా అని అన్నట్లయితే వారసత్వము తప్పకుండా గుర్తుకువస్తుంది. బాబా అని అన్నప్పుడు వారసత్వము గుర్తుకురాని వారు ఇంకెవ్వరూ ఉండరు. తండ్రితో పాటు ఆస్తి తప్పకుండా గుర్తుకువస్తుంది. మీకు కూడా శివబాబాతోపాటు వారసత్వము తప్పకుండా గుర్తుకువస్తుంది. వారైతే మీకు విషం కోసం (వికారాల కోసం) దెబ్బలు కొట్టి శివబాబాను గుర్తు తెప్పిస్తారు. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు, పాపాలు కట్ అయిపోతాయి. ఇది కూడా డ్రామాలో మీ కొరకు గుప్త కళ్యాణమే. ఏ విధముగా యుద్ధము కళ్యాణకారి అని అంటారో, అలా ఈ దెబ్బలు కూడా మంచి కొరకే కదా.

ఈ రోజుల్లో పిల్లలు ప్రదర్శినీ మరియు మేళా సేవల పట్ల ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. నవ నిర్మాణ ప్రదర్శినీ అన్న పేరుతో పాటు గేట్ వే టు హెవెన్ అన్న పేరు వ్రాయండి. రెండు పేర్లూ ఉండాలి. కొత్త ప్రపంచము ఎలా స్థాపన అవుతుంది అన్నదాని ఎగ్జిబిషన్ ఉన్నట్లయితే అది విని మనుష్యులకు సంతోషము కలుగుతుంది. కొత్త ప్రపంచము ఎలా స్థాపన అవుతుంది, దాని కోసం ఈ చిత్రాలను తయారుచేసారు, వచ్చి చూడండి అని చెప్పండి. గేట్ వే టూ న్యూ వరల్డ్ - ఈ పదాలు కూడా బాగానే ఉంటాయి. ఈ యుద్ధము ఏదైతే జరగబోతుందో, దాని ద్వారా ద్వారాలు తెరుచుకుంటాయి. భగవంతుడు వచ్చారని, వచ్చి రాజయోగాన్ని నేర్పించారని గీతలో కూడా ఉంది. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసారంటే తప్పకుండా కొత్త ప్రపంచము స్థాపన అయ్యి ఉంటుంది. చంద్రుని పైకి వెళ్ళేందుకు మనుష్యులు ఎంతగానో ప్రయత్నిస్తారు. అక్కడ అంతా నేల ప్రదేశమే కనిపిస్తుంది, మనుష్యులెవ్వరూ కనిపించరు అని ఇంత మాత్రమే అక్కడ గురించి చెప్తారు. ఇక దానిలో లాభమేముంది! ఇప్పుడు మీరు రియల్ సైలెన్స్ లోకి వెళ్తారు కదా. అశరీరిగా అవుతారు. అది సైలెన్స్ ప్రపంచము. మీరు మృత్యువు కోరుకుంటారు, శరీరము వదిలి వెళ్ళాలనుకుంటారు. మీరు వచ్చి మీతోపాటు ముక్తి-జీవన్ముక్తులలోకి తీసుకువెళ్ళండి అని తండ్రిని కూడా మృత్యువు కొరకే పిలుస్తారు. కానీ పతిత-పావనుడు వచ్చారంటే అది మనము కాలుడికే కాలుడిని పిలిచినట్లే అవుతుంది అని అర్థం చేసుకోరు. బాబా వచ్చారని, వారు ఇంటికి పదండి అని అంటున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మరియు మనం ఇంటికి వెళ్తాము. బుద్ధి పని చేస్తుంది కదా. తమ బుద్ధి వ్యాపార-వ్యవహారాలు మొదలైనవాటి వైపుకు పరిగెత్తుతున్న పిల్లలు ఇక్కడ చాలామంది ఉంటారు. ఫలానావారు అనారోగ్యముగా ఉన్నారు, ఏమి జరిగి ఉంటుందో... ఇలా అనేక రకాల సంకల్పాలు వచ్చేస్తాయి. తండ్రి అంటారు, మీరు ఇక్కడ కూర్చున్నారు, ఆత్మ బుద్ధి తండ్రి మరియు వారసత్వము వైపు ఉండాలి. ఆత్మయే స్మృతి చేస్తుంది కదా. ఒకవేళ ఎవరి కుమారుడైనా లండన్ లో ఉంటే, అతను అనారోగ్యంగా ఉన్నాడని సమాచారము వస్తే, వెంటనే బుద్ధి అటువైపుకు వెళ్ళిపోతుంది. ఇక జ్ఞానము బుద్ధిలో కూర్చోలేదు. ఇక్కడ కూర్చున్నా బుద్ధిలో అతనే గుర్తుకువస్తూ ఉంటాడు. ఒకవేళ ఎవరి పతి అయినా అనారోగ్యముపాలైతే, పత్నికి లోలోపల అల్లకల్లోలంగా ఉంటుంది. బుద్ధి అయితే అటువైపుకు వెళ్తుంది కదా. అలా మీరు కూడా ఇక్కడ కూర్చుంటూ, అన్నీ చేస్తూ, శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి. అలా చేసినా అహో సౌభాగ్యమే. ఏ విధంగా వారు పతిని లేక గురువును స్మృతి చేస్తారో, అలా మీరు తండ్రిని స్మృతి చేయండి. మీరు మీ ఒక్క నిముషాన్ని కూడా వ్యర్థం చేయకూడదు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా సేవ చేసేటప్పుడు కూడా తండ్రియే గుర్తుకువస్తారు. నా భక్తులకు అర్థం చేయించండి అని బాబా అన్నారు. ఇలా ఎవరు అన్నారు? శివబాబా. శ్రీకృష్ణుని భక్తులకు ఏమి అర్థం చేయిస్తారు? వారికి - శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు అని చెప్తే వారు ఒప్పుకుంటారా? రచయిత అయితే భగవంతుడైన తండ్రియే, అంతేకానీ శ్రీకృష్ణుడు కాదు. పరమపిత పరమాత్మయే పాత ప్రపంచాన్ని కొత్తగా చేస్తున్నారు, దీనిని ఒప్పుకుంటారు కూడా. కొత్తదే పాతదిగా, పాతదే మళ్ళీ కొత్తదిగా అవుతుంది. కేవలం ఎక్కువ సమయమని అని చెప్పడం వలన మనుష్యులు ఘోర అంధకారములో ఉన్నారు. మీ కొరకైతే ఇప్పుడు అరచేతిపై వైకుంఠముంది. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని ఆ స్వర్గానికి అధిపతులుగా తయారుచేయడానికి వచ్చాను, మరి అలా అవుతారా? వాహ్, ఎందుకు అవ్వము! అచ్ఛా, మరి నన్ను స్మృతి చేయండి, పవిత్రముగా అవ్వండి. స్మృతి ద్వారానే పాపాలు భస్మమవుతాయి. వికర్మల భారము ఆత్మపైనే ఉంది, అంతేకానీ శరీరముపై కాదు అని పిల్లలైన మీకు తెలుసు. ఒకవేళ శరీరముపై పాప భారము ఉన్నట్లయితే శరీరాన్ని కాల్చినప్పుడు దానితోపాటుగా పాపాలు కూడా కాలిపోతాయి. ఆత్మ అయితే అవినాశీ, అందులో కేవలం మలినాలు కలుస్తాయి. వాటిని తొలగించేందుకు తండ్రి ఒకే యుక్తిని తెలియజేస్తున్నారు - స్మృతి చేయండి. పతితము నుండి పావనముగా తయారయ్యే యుక్తి ఎంత బాగుంది. మందిరాలు నిర్మించేవారు, శివుని పూజను చేసేవారు కూడా భక్తులే కదా. పూజారిని ఎప్పుడూ పూజ్యుడు అని అనలేము. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎవరినైతే మొత్తం ప్రపంచమంతా వెతుకుతుందో, ఆ బాబా మనకు లభించారు - ఈ సంతోషములోనే ఉండాలి. స్మృతి ద్వారానే పాపాలు కట్ అవుతాయి, అందుకే ఎట్టి పరిస్థితులోనైనా తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. మీ సమయములో ఒక్క నిమిషాన్ని కూడా వ్యర్థం చేయకూడదు.

2. ఈ పాత ప్రపంచము నుండి బుద్ధి లంగరును ఎత్తివేయాలి, బాబా మన కొరకు కొత్త ఇంటిని తయారుచేస్తున్నారు, ఇది రౌరవ నరకము, కంసపురి, మనం వైకుంఠపురిలోకి వెళ్తాము - సదా ఈ స్మృతిలో ఉండాలి.

వరదానము:-
విహంగ మార్గపు సేవ ద్వారా విశ్వ పరివర్తనా కార్యాన్ని సంపన్నము చేసే సత్యమైన సేవాధారీ భవ

విహంగ మార్గపు సేవ చేసేందుకు సంగఠిత రూపములో ‘‘రూప్ మరియు బసంత్ (యోగ స్వరూపము మరియు జ్ఞాన స్వరూపము)’’ - ఈ రెండు విషయాల బ్యాలెన్సు కావాలి. ఏ విధంగా బసంత్ రూపముతో (జ్ఞాన స్వరూపముతో) ఒకే సమయములో అనేక ఆత్మలకు సందేశము ఇచ్చే కార్యము చేస్తారో, అలాగే రూప్ అనగా స్మృతి బలము ద్వారా, శ్రేష్ఠ సంకల్పాల బలము ద్వారా విహంగ మార్గపు సేవ చేయండి. దీని ఇన్వెన్షన్ ను కూడా కనుగొనండి, అలాగే సంగఠిత రూపములో దృఢ సంకల్పముతో పాత సంస్కారాలు, స్వభావము మరియు పాత నడవడిక అనే నువ్వులు-యవలను యజ్ఞములో స్వాహా చేయండి, అప్పుడు విశ్వ పరివర్తనా కార్యము సంపన్నమవుతుంది మరియు యజ్ఞము యొక్క సమాప్తి జరుగుతుంది.

స్లోగన్:-
బాలకులు మరియు యజమానులుగా ఉండే బ్యాలెన్స్ తో ప్లాన్ ను ప్రాక్టికల్ లోకి తీసుకురండి.

అవ్యక్త సూచనలు - ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి

ఈ ఈశ్వరీయ సేవలో అతి పెద్ద పుణ్యము - పవిత్రత యొక్క దానం ఇవ్వటము. పవిత్రముగా అవ్వటము మరియు ఇతరులను తయారుచెయ్యటమే పుణ్య ఆత్మగా అవ్వటము, ఎందుకంటే ఏ ఆత్మనైనా ఆత్మహత్య అనే మహాపాపము నుండి విడిపిస్తారు. అపవిత్రత అనేది ఆత్మహత్య వంటిది. పవిత్రత ప్రాణదానము వంటిది. ఎవరి దుఃఖాన్ని అయినా తీసుకుని సుఖాన్ని ఇవ్వటము, ఇదే అన్నింటికన్నా అతి పెద్ద పుణ్య కార్యము. ఇటువంటి పుణ్యము చేస్తూ-చేస్తూ పుణ్యాత్మగా అయిపోతారు.