23-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు తండ్రి సమానముగా
సత్యాతి-సత్యమైన సందేశకులుగా అనగా మెసెంజర్లుగా అవ్వాలి, అందరికీ ఇంటికి వెళ్ళాలనే
సందేశాన్ని ఇవ్వాలి’’
ప్రశ్న:-
ఈ రోజుల్లో
మనుష్యుల బుద్ధి రోజంతా ఎటువైపు భ్రమిస్తూ ఉంటుంది?
జవాబు:-
ఫ్యాషన్ల వైపు.
మనుష్యులను ఆకర్షించేందుకు అనేక రకాల ఫ్యాషన్లు చేసుకుంటారు. ఈ ఫ్యాషన్లను సినిమాల
నుండే నేర్చుకున్నారు. పార్వతి దేవి కూడా ఇలా ఫ్యాషన్ చేసుకునేవారని, కేశాలంకరణ
మొదలైనవి చేసుకునేవారని భావిస్తారు. బాబా అంటారు - పిల్లలైన మీరు ఈ పతిత ప్రపంచములో
ఫ్యాషన్లు చేసుకోకూడదు. నేను మిమ్మల్ని ఎటువంటి ప్రపంచములోకి తీసుకువెళ్తానంటే
అక్కడ సహజ సౌందర్యము ఉంటుంది, ఫ్యాషన్ల అవసరముండదు.
పాట:-
నీవే తల్లివి,
తండ్రివి...
ఓంశాంతి
పిల్లలు పాటను
విన్నారు. మహిమను పాడేటప్పుడు బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. మీరే నావికుడు,
పతిత-పావనుడు మరియు సత్యాతి-సత్యమైన మెసెంజర్ అని ఆత్మయే తండ్రి గురించి అంటుంది.
తండ్రి వచ్చి ఆత్మలకు మెసేజ్ ఇస్తారు మరియు ఎవరినైతే అక్కడ మెసెంజర్లు లేక
సందేశకులని అంటారో, వారిలో కొంతమంది చిన్నవారిగా, కొంతమంది పెద్దవారిగా ఉంటారు.
వాస్తవానికి వారు మెసేజ్ ను లేక సందేశాన్ని ఇవ్వరు, వారికి అసత్యపు మహిమను చేస్తారు.
ఒక్కరికి తప్ప ఈ మనుష్య సృష్టిలో ఇంకెవ్వరికీ మహిమ లేదని పిల్లలు అర్థం చేసుకున్నారు.
అందరికన్నా ఎక్కువ మహిమ ఈ లక్ష్మీ-నారాయణులది, ఎందుకంటే వారు కొత్త ప్రపంచానికి
యజమానులు. ఇది కూడా భారతవాసులకు తెలుసు. ప్రపంచములోని వారికి భారత్ ప్రాచీన దేశమని
మాత్రమే తెలుసు. భారత్ లోనే దేవీ-దేవతల రాజ్యము ఉండేది. శ్రీకృష్ణుడిని కూడా దేవత
అని అంటారు. భారతవాసులు వారిని భగవాన్-భగవతి అని అంటారు. కానీ ఆ భగవాన్-భగవతీలు
సత్యయుగములో రాజ్యము చేస్తారని ఎవరికీ తెలియదు. భగవంతుడు దేవీ-దేవతల రాజ్యాన్ని
స్థాపన చేసారు. మేము భగవంతుని పిల్లలము కనుక మేము కూడా భగవాన్-భగవతిగా ఉండాలని
బుద్ధి కూడా చెప్తుంది. అందరూ ఒక్కరి సంతానమే కదా. కానీ వారిని భగవాన్-భగవతి అని
అనలేము. వారిని దేవీ-దేవతలని అంటారు. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం
చేయిస్తారు. భారతవాసులైన మేము ముందు కొత్త ప్రపంచములో ఉండేవారమని భారతవాసులు అంటారు.
కొత్త ప్రపంచాన్ని అయితే అందరూ కోరుకుంటారు. బాపూజీ కూడా కొత్త ప్రపంచాన్ని, కొత్త
రామ రాజ్యాన్ని కోరుకునేవారు. కానీ రామ రాజ్యమంటే అర్థమేమిటి అనేది ఏ మాత్రం తెలియదు.
ఈ రోజుల్లో మనుష్యులకు ఎంత అహంకారము ఉంది. కలియుగములో రాతిబుద్ధి కలవారు,
సత్యయుగములో పారసబుద్ధి కలవారు ఉంటారు. కానీ ఈ జ్ఞానము ఎవ్వరికీ లేదు. భారత్ యే
సత్యయుగములో పారసబుద్ధి కలదిగా ఉండేది, ఇప్పుడు భారత్ కలియుగములో రాతిబుద్ధి కలదిగా
ఉంది. మనుష్యులైతే దీనినే స్వర్గమని భావిస్తారు. స్వర్గములో విమానాలు ఉండేవి,
పెద్ద-పెద్ద మహళ్ళు ఉండేవి అని అంటారు. అవన్నీ ఇప్పుడు ఉన్నాయి. సైన్స్ ఎంత వృద్ధి
చెందింది, ఎంత సుఖముంది, ఫ్యాషన్లు మొదలైనవి ఎన్ని ఉన్నాయి. బుద్ధి రోజంతా ఫ్యాషన్ల
వెనుకే ఉంటుంది. కృత్రిమ సౌందర్యము కోసం కేశాలంకరణ మొదలైన అలంకరణలు ఎలా చేసుకుంటారు!
ఎంత ఖర్చు చేస్తారు. ఈ ఫ్యాషన్లన్నీ సినిమాల నుండి వచ్చాయి. మేము పార్వతి దేవి వలె
కేశాలంకరణ మొదలైనవి చేసుకుంటున్నామని భావిస్తారు. ఇవన్నీ ఆకర్షించేందుకే చేసుకుంటారు.
ఇంతకుముందు పార్శీ స్త్రీలు ఎవరూ వారిని చూసి ఆకర్షితులవ్వకూడదని ముఖముపై నల్లటి
ముసుగు ధరించేవారు. దీనిని పతిత ప్రపంచమని అంటారు.
నీవే తల్లివి,
తండ్రివి నీవే... అని పాడుతారు. కానీ ఇలా ఎవరిని పిలవాలి? తల్లి-తండ్రి ఎవరు - ఇది
కూడా తెలియదు. తల్లి-తండ్రి తప్పకుండా వారసత్వాన్ని ఇచ్చి ఉంటారు. తండ్రి పిల్లలైన
మీకు సుఖ వారసత్వాన్ని ఇచ్చారు. బాబా, మేమైతే మీ నుండి తప్ప ఇంకెవ్వరి నుండి వినమని
అంటారు కూడా. శివబాబా మహిమ గాయనము చేయడము జరుగుతుందని ఇప్పుడు మీకు తెలుసు. బ్రహ్మా
ఆత్మ కూడా స్వయంగా అంటుంది - నేనే పావనముగా ఉండేవాడిని, ఇప్పుడు పతితముగా అయ్యాను.
బ్రహ్మా పిల్లలు కూడా ఇలాగే అంటారు - బ్రహ్మాకుమార-కుమారీలైన మేమే దేవీ-దేవతలుగా
ఉండేవారము, తర్వాత 84 జన్మల అంతిమములో పతితముగా అయ్యాము. ఎవరైతే నంబర్ వన్ పావనముగా
ఉండేవారో, వారే నంబరువన్ పతితముగా అయ్యారు. తండ్రి ఎలా ఉంటారో, పిల్లలు కూడా అలాగే
ఉంటారు. స్వయంగా వీరు కూడా అంటారు, శివబాబా కూడా అంటారు - నేను వీరి అనేక జన్మల
అంతిమములో వస్తాను. వీరు పూజ్యులుగా ఉన్న లక్ష్మీ-నారాయణుల వంశములో మొదటి నంబరులో
ఉండేవారు. ఇప్పుడిది సంగమము, మీరు కలియుగములో ఉండేవారు, ఇప్పుడు సంగమయుగము వారిగా
అయ్యారు. తండ్రి సంగమములోనే వస్తారు. డ్రామానుసారముగా పిల్లల సంఖ్య కూడా వృద్ధి
చెందుతుంది. ఇప్పుడు పిల్లలకు జ్ఞానమైతే లభించింది. మనమే దేవతలుగా ఉండేవారము,
తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యాము. మొత్తము చక్రము గురించి మీకు
మంచి రీతిలో తెలుసు. ఇది చాలా సహజము. మనమే 84 జన్మలు తీసుకున్నాము. కొంతమంది
బుద్ధిలో ఈ విషయము కూడా కూర్చోదు. విద్యార్థుల్లో నంబరువారుగా అయితే ఉంటారు. కుడి
నుండి ప్రారంభిస్తారు - ఫస్ట్ క్లాస్, సెకెండ్ క్లాస్, థర్డ్ క్లాస్. కుమార్తెలు
స్వయం కూడా అంటారు - మాది థర్డ్ క్లాస్ బుద్ధి, మేము ఎవరికీ అర్థం చేయించలేము, అర్థం
చేయించాలని మనసులోనైతే చాలా అనిపిస్తుంది కానీ మాట్లాడలేమని అంటారు. బాబా ఏమి
చేయగలరు? ఇది మీ కర్మల లెక్కాచారము. ఇప్పుడు తండ్రి అంటారు - నేను మీకు
కర్మ-అకర్మ-వికర్మల గతుల జ్ఞానాన్ని వినిపిస్తాను. కర్మలు చేయాలి, ఇదైతే పిల్లలైన
మీకు తెలుసు. థర్డ్ క్లాస్ బుద్ధి కలవారు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. ఇది ఉన్నదే
రావణ రాజ్యము, కానీ ఈ విషయము ఎవరికీ తెలియదు. రావణ రాజ్యములో మనుష్యులు వికర్మలే
చేస్తారు కనుక కిందకు దిగజారిపోతూనే ఉంటారు. దుఃఖపు ప్రపంచములోనే గురువులను
ఆశ్రయించడము జరుగుతుంది. సద్గతి కోసమే గురువులను ఆశ్రయిస్తారు, వారు ముక్తిలోకి
తీసుకువెళ్తారని భావిస్తారు. అది నిర్వాణధామము - వాణి నుండి అతీతమైన స్థానము.
మనుష్యులు స్వయాన్ని వానప్రస్థులని చెప్పుకుంటారు. అలా పేరుకు మాత్రమే అంటారు.
వానప్రస్థుల సభ కూడా ఉంటుంది. ఆస్తి మొదలైనవన్నీ పిల్లలకు ఇచ్చేసి గురువుల వద్దకు
వెళ్ళి కూర్చుంటారు. ఆహార పానీయాలు మొదలైనవైతే తప్పకుండా తమ పిల్లలే ఇస్తారు. కానీ
వానప్రస్థము యొక్క అర్థం ఎవరికీ తెలియదు. మేమైతే నిర్వాణధామానికి వెళ్ళాలి, మా
ఇంటికి వెళ్ళాలి అని ఎవరి బుద్ధిలోకి రాదు. దానిని ఇల్లు అని కూడా అర్థం చేసుకోరు.
వారు ఏమని భావిస్తారంటే - జ్యోతి జ్యోతిలో కలిసిపోతుంది అని. నిర్వాణధామమైతే
నివసించే స్థానము. పూర్వము 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థము స్వీకరించేవారు. అది ఒక
నియమము వలె ఉండేది. ఇప్పటికీ అలా చేస్తారు. వాణి నుండి అతీతముగానైతే ఎవరూ వెళ్ళలేరని
ఇప్పుడు మీరు అర్థం చేయించగలరు. అందుకే, ఓ పతిత-పావన బాబా రండి, మమ్మల్ని పావనముగా
తయారుచేసి ఇంటికి తీసుకువెళ్ళండి అని తండ్రినే పిలుస్తారు. ముక్తిధామము ఆత్మల ఇల్లు.
పిల్లలైన మీకు - సత్యయుగములో ఎవరుంటారు, అక్కడ వృద్ధి ఎలా జరుగుతుంది అని సత్యయుగము
గురించి కూడా అర్థం చేయించారు. జనాభా సంఖ్య గురించి కూడా ఎవరికీ తెలియదు. రామ
రాజ్యములో జనాభా సంఖ్య ఎంత ఉంటుంది, పిల్లలు ఎలా జన్మిస్తారు అనేదేమీ అర్థం చేసుకోరు.
ఈ డ్రామా చక్రము గురించి అర్థం చేయించగలిగే విద్వాంసులు గాని, ఆచార్యులు గాని,
పండితులు గాని ఎవరూ లేరు. 84 లక్షల జన్మల చక్రము ఎలా ఉంటుంది! ఇవి ఎన్ని అసత్యమైన
విషయాలు. దారము పూర్తిగా చిక్కులు పడి ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - తండ్రి
కర్మ-అకర్మ-వికర్మల రహస్యాలన్నింటినీ అర్థం చేయించారని మీకిప్పుడు తెలుసు.
సత్యయుగములో మీ కర్మలు అకర్మలుగా ఉంటాయి. అక్కడ చెడు కర్మలేవీ జరగవు. అందుకే కర్మలు
అకర్మలుగా ఉంటాయి. ఇక్కడ మనుష్యులు ఏ కర్మలు చేసినా, అవి వికర్మలుగా అవుతాయి.
ఇప్పుడు పిల్లలైన మీకు
తెలుసు - చిన్న అయినా, పెద్ద అయినా, మనందరిదీ, మొత్తం ప్రపంచానిదీ వానప్రస్థ అవస్థ.
అందరూ వాణి నుండి అతీతముగా వెళ్ళనున్నారు. ఓ పతిత-పావనా రండి, వచ్చి మమ్మల్ని
పతితుల నుండి పావనముగా చేయండి అని అంటారు. కానీ ఎప్పటివరకైతే పావనమైన కొత్త ప్రపంచము
ఉండదో, అప్పటివరకు ఇక్కడ పతిత ప్రపంచములో పావనమైనవారు ఎవరూ ఉండలేరు. ఈ పతిత
ప్రపంచమంతా సమాప్తమవ్వనున్నది. మనము మళ్ళీ కొత్త ప్రపంచములోకి వెళ్ళాలని మీకు తెలుసు.
ఎలా వెళ్తారు అనే జ్ఞానమంతా మీకు ఉంది. ఇది కొత్త ప్రపంచమైన అమరలోకము లేక పావన
ప్రపంచము కోసం కొత్త జ్ఞానము. ఇప్పుడు మీరు సంగమములో కూర్చున్నారు. బ్రాహ్మణులుగా
లేని ఇతర మనుష్యులందరూ కలియుగములో ఉన్నారని కూడా మీకు తెలుసు. మనమంతా సంగమములో
ఉన్నాము, సత్యయుగములోకి వెళ్తున్నాము, తప్పకుండా ఇది సంగమయుగము. అది స్వర్గము.
దానిని సంగమము అని అనరు. ఇప్పుడిది సంగమము. ఈ సంగమయుగము అన్నింటికన్నా చిన్నది.
దీనిని లీప్ యుగమని అంటారు. ఇందులో మనుష్యులు పాపాత్ముల నుండి ధర్మాత్ములుగా అవుతారు.
అందుకే దీనిని ధర్మ యుగము అని అంటారు. కలియుగములో మనుష్యులందరూ అధర్మయుక్తముగా
ఉంటారు. అక్కడైతే అందరూ ధర్మాత్ములుగా ఉంటారు. భక్తి మార్గము యొక్క ప్రభావము ఎంత
ఎక్కువగా ఉంది. రాతితో మూర్తులను తయారుచేస్తారు, వాటిని చూడటముతోనే మనసు
సంతోషిస్తుంది. అది రాతి పూజ. శివుని మందిరాలలో పూజ చేయడానికని ఎంత దూర-దూరాలకు వరకు
వెళ్తారు. శివుని చిత్రాన్ని అయితే ఇంటిలో కూడా పెట్టుకోవచ్చు. మరి అంత దూర-దూరాల
వరకు ఎందుకు భ్రమించాలి. ఈ జ్ఞానము ఇప్పుడు బుద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు మీ కళ్ళు
తెరుచుకున్నాయి, బుద్ధి ద్వారము తెరుచుకుంది. తండ్రి జ్ఞానాన్ని ఇచ్చారు. పరమపిత
పరమాత్మ ఈ మనుష్య సృష్టికి బీజ రూపుడు, జ్ఞాన సాగరుడు, నాలెడ్జ్ ఫుల్. ఆత్మ కూడా ఈ
జ్ఞానాన్ని ధారణ చేస్తుంది. ఆత్మయే ప్రెసిడెంట్ మొదలైనవారిగా అవుతుంది. మనుష్యులైతే
దేహాభిమానులుగా ఉన్న కారణముగా దేహమునే మహిమ చేస్తూ ఉంటారు. ఆత్మయే అంతా చేస్తుందని
ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మలైన మీరు 84 జన్మల చక్రములో తిరిగి, పూర్తిగా
దుర్గతి పాలయ్యారు. ఇప్పుడు ఆత్మలమైన మనము తండ్రిని గుర్తించాము. తండ్రి నుండి
వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఆత్మ అయితే శరీరాన్ని తప్పకుండా ధారణ చేయవలసి ఉంటుంది.
శరీరము లేకుండా ఆత్మలు ఎలా మాట్లాడతాయి! ఎలా వింటాయి! తండ్రి అంటారు - నేను
నిరాకారుడిని, నేను కూడా శరీరాన్ని ఆధారముగా తీసుకుంటాను. శివబాబా ఈ బ్రహ్మా తనువు
ద్వారా మనకు వినిపిస్తున్నారని మీకు తెలుసు. ఈ విషయాలను బ్రహ్మాకుమార-కుమారీలైన మీరు
మాత్రమే అర్థం చేయిస్తారు. మీకు ఇప్పుడు జ్ఞానము లభించింది. బ్రహ్మా ద్వారా ఆది
సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. ఆ తండ్రియే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు,
ఇందులో తికమకపడే విషయమేమీ లేదు. శివబాబా మనకు అర్థం చేయిస్తారు, మనము మళ్ళీ ఇతరులకు
అర్థం చేయిస్తాము. మనకు కూడా వినిపించేవారు శివబాబాయే. మేము పతితుల నుండి పావనముగా
అవుతున్నామని ఇప్పుడు మీరంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇది ఉన్నదే పతిత
ప్రపంచము. ఇది రావణ రాజ్యము కదా. రావణుడు పాపాత్ములుగా చేస్తాడు. ఇది ఇంకెవ్వరికీ
తెలియదు. రావణుడి దిష్టి బొమ్మను కాలుస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. సీతను రావణుడు
తీసుకువెళ్ళాడని, అది-ఇది చేసాడని... ఇలా ఎన్ని కథలను కూర్చుని వ్రాశారు. వాటిని
కూర్చుని వింటున్నప్పుడు ఏడుస్తూ ఉంటారు. అవన్నీ కల్పితమైన కథలు. బాబా మనల్ని
వికర్మాజీతులుగా తయారుచేయడానికి అర్థం చేయిస్తారు. నన్నొక్కరినే స్మృతి చేయండి,
బుద్ధిని ఇంకెక్కడా జోడింపజేయకండి అని అంటారు. మనకు శివబాబా తమ పరిచయాన్ని ఇచ్చారు.
పతిత-పావనుడైన తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. మనల్ని స్వర్గానికి యజమానులుగా
తయారుచేస్తున్న బాబా ఎంత మధురమైనవారు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అచ్ఛా!
మధురాతి మధురమైన
సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక
పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. కర్మ, అకర్మ మరియు వికర్మల గతిని తెలుసుకుని శ్రేష్ఠ కర్మలు చేయాలి. జ్ఞాన
దానము చేసి ధర్మాత్ములుగా అవ్వాలి.
2. ఇది వానప్రస్థ అవస్థ - ఈ అంతిమ ఘడియలలో పావనముగా అయి పావన ప్రపంచములోకి
వెళ్ళాలి. పావనముగా అవ్వాలనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి.
వరదానము:-
పాస్ విత్ ఆనర్ గా అయ్యేందుకు సర్వుల ద్వారా సంతుష్టత అనే
పాస్ పోర్టును ప్రాప్తి చేసుకునే సంతుష్టమణి భవ
ఏ పిల్లలైతే తమతో తాము, తమ పురుషార్థముతో మరియు తమ సేవతో,
అలాగే బ్రాహ్మణ పరివారపు సంపర్కములో సదా సంతుష్టముగా ఉంటారో, వారినే సంతుష్టమణులు
అని అంటారు. సర్వాత్మల సంపర్కములో స్వయాన్ని సంతుష్టముగా ఉంచుకోవడములో మరియు
సర్వులను సంతుష్టపర్చడములో ఎవరైతే విజయులుగా అవుతారో, వారే విజయమాలలోకి వస్తారు.
పాస్ విత్ ఆనర్ గా అయ్యేందుకు సర్వుల ద్వారా సంతుష్టత అనే పాస్ పోర్టు లభించాలి. ఈ
పాస్ పోర్టును తీసుకునేందుకు కేవలం సహనశక్తిని మరియు ఇముడ్చుకునే శక్తిని ధారణ
చేయండి.
స్లోగన్:-
దయార్ద్ర
హృదయులుగా అయి సేవ ద్వారా నిరాశలో ఉన్న మరియు అలిసిపోయిన ఆత్మలకు ఆధారాన్ని
అందించండి.
అవ్యక్త ప్రేరణలు -
జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి
శక్తిశాలి స్మృతి
కొరకు సత్యమైన హృదయము యొక్క ప్రేమ కావాలి. సత్యమైన హృదయము కలవారు సెకండులో బిందువుగా
అయ్యి బిందు స్వరూపుడైన తండ్రిని స్మృతి చేయగలరు. సత్యమైన హృదయము కలవారు సత్యమైన
సాహెబ్ ను సంతోషపరిచిన కారణముగా, బాబా యొక్క విశేషమైన ఆశీర్వాదాలను ప్రాప్తి
చేసుకుంటారు, తద్వారా సహజముగానే ఒకే సంకల్పములో స్థితులై జ్వాలా రూపపు స్మృతిని
అనుభవము చేయగలరు, శక్తిశాలి వైబ్రేషన్లను వ్యాపింపజేయగలరు. సత్యతా శక్తి కారణముగా
బుద్ధి కూడా సమయానికి యుక్తియుక్తముగా, యథార్థ కార్యాన్ని చేయిస్తుంది, ఎటువంటి
తప్పుడు కార్యము జరగదు.