23-11-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - సంగమయుగములో మీకు తండ్రి ద్వారా మంచి
బుద్ధి మరియు శ్రేష్ఠ మతము లభిస్తుంది, దీని ద్వారా మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా
తయారవుతారు’’
ప్రశ్న:-
పిల్లలైన మీరు
ఏ నషాలో ఉన్నట్లయితే నడవడిక చాలా రాయల్ గా తయారవుతుంది?
జవాబు:-
మీకు జ్ఞానము
యొక్క నషా ఎక్కి ఉండాలి. ఓహో! మేము భగవంతుని సమ్ముఖములో కూర్చుని ఉన్నాము. మేము
ఇక్కడి నుండి వెళ్తాము, వెళ్ళి విశ్వానికి యజమానులుగా, కిరీటధారీ రాకుమారులుగా
అవుతాము. ఇటువంటి నషా ఉన్నప్పుడు నడవడిక స్వతహాగా రాయల్ గా తయారవుతుంది, నోటి నుండి
చాలా మధురమైన మాటలు వెలువడతాయి, పరస్పరములో చాలా ప్రేమ ఉంటుంది.
పాట:-
సభలో జ్యోతి
వెలిగింది...
ఓంశాంతి
మధురాతి
మధురమైన పిల్లలు, ఆత్మిక పిల్లలు ఇక్కడకు వచ్చి బ్రాహ్మణులుగా అయి, ఆత్మిక తండ్రి
ద్వారా - మేము సంగమయుగీ బ్రాహ్మణులము అన్న విషయాన్ని తప్పకుండా అర్థం చేసుకున్నారు.
తండ్రి మన బుద్ధి తాళాన్ని తెరిచారు. ఇది సంగమయుగమని ఇప్పుడు మనం అర్థం చేసుకుంటాము.
మనుష్యులెవరైతే పతితులుగా, భ్రష్టాచారులుగా ఉన్నారో, వారు తిరిగి పావనముగా అయి
భవిష్యత్తులో పావనులుగా, శ్రేష్ఠాచారులుగా, పురుషోత్తములుగా పిలవబడతారు. ఈ
లక్ష్మీ-నారాయణులు ఎప్పుడో ఒకప్పుడు పురుషార్థము చేసి పురుషోత్తములుగా అయ్యారు కదా.
వీరి చరిత్ర తప్పకుండా కావాలి. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఎప్పుడు స్థాపన అయ్యింది?
కలియుగములోనూ అవ్వలేదు, సత్యయుగములోనూ అవ్వలేదు. స్వర్గ స్థాపన సంగమములో జరుగుతుంది.
ఇంత విస్తారములోకి ఎవ్వరూ వెళ్ళరు. ఇది సంగమయుగమని మీకు తెలుసు. కలియుగము తర్వాత
కొత్త ప్రపంచమైన సత్యయుగము వస్తుంది, కనుక తప్పకుండా సంగమయుగము కూడా ఉంటుంది.
తర్వాత కొత్త ప్రపంచములో కొత్త రాజ్యము ఉంటుంది. బుద్ధి నడవాలి. తండ్రి ద్వారా మనకు
మంచి బుద్ధి మరియు శ్రీమతము లభిస్తూ ఉందని మీకు తెలుసు. ఓ ఈశ్వరా, వీరికి సదా సుమతము
అనగా మంచి మతాన్ని ఇవ్వండి అని అంటారు. వారు మొత్తం ప్రపంచమంతటికీ తండ్రి. వారు
అందరికీ మంచి మతాన్ని ఇచ్చేవారు. సంగమయుగములోకి వచ్చి తమ పిల్లలకు మంచి మతాన్ని
ఇస్తారు. వారి గురించే పాండవ సాంప్రదాయము, దైవీ సాంప్రదాయమని శాస్త్రాలలో వ్రాయబడి
ఉంది. బ్రాహ్మణ సాంప్రదాయము మరియు దైవీ సాంప్రదాయము గురించి కూడా ఎవ్వరూ అర్థం
చేసుకోలేరు. బ్రహ్మా ద్వారానే బ్రాహ్మణ సాంప్రదాయము వారు తయారవ్వగలరు. పరమపిత
పరమాత్మయే బ్రహ్మా ద్వారా ఈ రచనను రచిస్తారు. ప్రజాపిత ఉన్నారు కనుకనే ఇంతమంది
బ్రహ్మాకుమారులు-బ్రహ్మాకుమారీలు ఉన్నారు. ఎవరైనా వచ్చి బ్రాహ్మణులైన మీ ద్వారా
జ్ఞానాన్ని తీసుకోనంతవరకు సద్గతి ఎలా లభించగలదు. మీ వద్దకు చాలామంది వస్తారు.
సన్యాసులు కూడా వస్తారు, ఇతర ధర్మాల వారు కూడా వస్తారు, తండ్రి నుండి వారసత్వాన్ని
తీసుకోవడానికి. స్వర్గములో వారి పాత్ర లేదు కానీ తండ్రి వచ్చారు అనే సందేశాన్ని
అందరికీ ఇవ్వాలి. ఈ సమయములో ‘హిందువులు’ అని పిలవబడేవారెవ్వరికీ దేవీ-దేవతా ధర్మము
గురించి తెలియనే తెలియదు. ఎవరైతే ముందు సతోప్రధానముగా ఉండేవారో, వారే తర్వాత తమోలోకి
వచ్చిన కారణముగా స్వయాన్ని దేవీ-దేవతలుగా పిలుచుకోలేరు.
పిల్లలైన మీకు
తెలుసు - రావణ రాజ్యము కూడా ఇక్కడే ఉంటుంది మరియు పరమపిత పరమాత్మ, ఎవరినైతే రామ అని
కూడా అంటారో, వారి జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. పతిత-పావన సీతా రామ అని పాడుతారు
కూడా. కానీ పతితముగా ఎవరు తయారుచేసారు, రావణుడు ఎవరు, పతిత-పావనుడైన తండ్రిని ఎందుకు
పిలుస్తారు? ఇది ఎవ్వరికీ తెలియదు. మనలో ఏవైతే 5 వికారాలు ఉన్నాయో, అవే రావణుడు
అన్న విషయాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఎవరిలోనైతే 5 వికారాలు లేవో, వారు రాముని
సాంప్రదాయానికి చెందినవారు. ఇప్పుడు రామ రాజ్యము లేదు, అందుకే అందరూ కొత్త ప్రపంచము,
కొత్త పవిత్ర రాజ్యము కావాలని కోరుకుంటారు. ‘రామ’ అని శివబాబాను అంటారు, కానీ వారు
రాముడిని పరమాత్మగా భావించారు, అందుకే శివబాబాను మర్చిపోయారు. రామ రాజ్యమని
దేనినంటారో మీరు అర్థం చేయించవచ్చు. రాముడి సీత అపహరించబడినట్లుగా శాస్త్రాలలో
వ్రాశారు, ఈ విధముగా ఒక రాజు యొక్క రాణిని ఎవరైనా అపహరించి తీసుకువెళ్ళడమనేది
జరగగలదా. శాస్త్రాలు కూడా అనేకమున్నాయి. ముఖ్యమైన శాస్త్రము గీత. బ్రహ్మా ద్వారా
బ్రాహ్మణ, దేవతా, క్షత్రియ ధర్మాలను స్థాపిస్తారని శాస్త్రాలలో వ్రాయబడి ఉంది.
కావున ప్రజాపిత కూడా ఇక్కడే ఉండాలి. బ్రహ్మాకు ఇంతమంది పిల్లలు ఉన్నారంటే వీరు
ముఖవంశావళి పిల్లలు, ఇంతమంది కుఖవంశావళి (గర్భము ద్వారా జన్మించినవారు) ఉండరు.
సరస్వతి కూడా ముఖవంశావళి కనుక ఆమె బ్రహ్మాకు పత్ని కాలేరు. ఇప్పుడు తండ్రి అంటారు -
బ్రహ్మా నోటి ద్వారా మీరు బ్రాహ్మణులుగా అవుతారు, నా పిల్లలుగా అవుతారు. శివబాబాకు
ఎంతటి మహిమ ఉంది అనేది పిల్లలైన మీకు తెలుసు. తండ్రి పతిత-పావనుడు మరియు
ముక్తిప్రదాత కూడా. ఇలా అందరూ మహిమ చేస్తారు కానీ అర్థం చేసుకోరు, అందుకే - వారు
పతిత-పావనుడు మరియు గీతా భగవానుడు కూడా అని ముందు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి.
శివబాబా నిరాకారుడు కనుక తప్పకుండా వచ్చి జ్ఞానాన్ని వినిపించి ఉంటారు. ఇప్పుడు ఎవరి
శరీరము ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తారో, వారి పేరును ‘బ్రహ్మా’ అని పెట్టారు. లేదంటే
బ్రహ్మా ఎక్కడ నుండి వస్తారు! బ్రహ్మాకు తండ్రి ఎవరు? బ్రహ్మా, విష్ణు, శంకరుల
రచయిత ఎవరు? ఇది గుహ్యమైన ప్రశ్న. త్రిమూర్తి దేవతలు అని అయితే అంటారు కానీ వారు
ఎక్కడ నుండి వచ్చారు! ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, వీరి రచయిత కూడా
ఉన్నతోన్నతమైన భగవంతుడే, వారిని ‘శివ’ అని అంటారు. ఈ 3 దేవతలు లైట్ (ప్రకాశ) రూపము
కలవారు, వీరిలో ఎముకలు, మాంసము ఉండవు, కానీ మందబుద్ధి కలవారు ఈ విషయాలు అర్థం
చేసుకోలేరు. ఈ సందర్భములో, ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు అన్నది అర్థం చేయించాలి. వారు
బ్రహ్మా ద్వారా స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసారు...
అని పాడుతారు కూడా. తర్వాత విష్ణువు నాభి నుండి బ్రహ్మా వెలువడినట్లుగా చూపిస్తారు.
ఎప్పుడైనా నాభి నుండి కూడా పిల్లలు జన్మిస్తారా? ఇప్పుడు తండ్రి కూర్చుని అన్ని
రహస్యాలను అర్థం చేయిస్తారు. కానీ ఎవరైనా అర్థం చేసుకోవాలి కదా.
ఆత్మనే
పాపాత్మ, పుణ్యాత్మ అని అంటారని మీకు తెలుసు. అలాగని పవిత్ర ఆత్మయే పరమాత్మ అని కాదు.
పరమాత్మ అయిన తండ్రి అయితే సదా పావనమైనవారు. తమోప్రధానముగా ఉన్నవారిని పతితులని
అంటారు. సత్యయుగములో సుఖము ఉన్నప్పుడు దుఃఖము అన్న పేరు కూడా ఉండేది కాదు.
మనుష్యులైతే, స్వర్గము ఇప్పుడే ఉందని అంటారు. ఏమీ అర్థం చేసుకోరు, కానీ చివరిలో
వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. మేము మా రాజధానిని స్థాపన
చేసుకుంటున్నామని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. విశ్వానికి యజమానులుగా ఇంకెవ్వరూ
అవ్వలేరు. విశ్వముపై రాజ్యము సత్యయుగములో జరుగుతుంది. కలియుగములో పూర్తి విశ్వముపై
రాజ్యము చేయలేరు. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. మహాభారీ యుద్ధము జరిగిందని గీతలో కూడా
ఉంది, అప్పుడే అన్ని ధర్మాలు వినాశనమవుతాయి. వెదురు అడవి ఉందనుకోండి, ఆ చెట్టు
ఎండిపోయినప్పుడు దాని కొమ్మలు ఒకదానికొకటి రాసుకున్నప్పుడు నిప్పు అంటుకుంటుంది
మరియు మొత్తం అడవి అంతా కాలిపోతుంది. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షము కూడా
శిథిలావస్థకు చేరుకుంది. దీనికి కూడా ఇప్పుడు నిప్పు అంటుకోనున్నది, పరస్పరము ఒకరితో
ఒకరు కొట్లాడుకుని సమాప్తమైపోతారు. పేలుడు పదార్థాలను తయారుచేస్తూనే ఉంటారు. ఇప్పుడు
అణు బాంబుల ద్వారా నిప్పు అంటుకోనున్నది, ఈ రహస్యము వారికి తెలియదు. ఇప్పుడు కలియుగ
నరకము పరివర్తనై స్వర్గముగా అవ్వనున్నది. ఈ జ్ఞానములో చాలా ఆనందము ఉండాలి. నేను ఆ
ఆనందములో లేక నషాలో ఉంటున్నానా అని స్వయాన్ని చూసుకోవాలి. మనము పరమాత్ముని సంతానము,
వారి నుండి స్వర్గ వారసత్వాన్ని పొందుతున్నాము. పరస్పరములో మాట్లాడుకునే విధానములో
రాయల్టీ ఉండాలి. ఇక్కడి నుండి అంతా నేర్చుకోవాలి. తర్వాత ఆ సంస్కారాలనే
తీసుకువెళ్తారు. అతి మధురముగా అవ్వాలి, చాలా నషా ఉండాలి. మనము శివబాబాకు పిల్లలము,
దేవతా పదవిని పొందబోతున్నాము, కనుక పరస్పరము ఎంత ప్రేమగా మాట్లాడుకోవాలి. కానీ
పిల్లల నోటి నుండి ఇప్పుడింకా పుష్పాలు వెలువడడము లేదు. మీరు ఎంత ఉన్నతమైనవారు. మనము
శివబాబాకు సంతానమని, ఆ తర్వాత సత్యయుగములో మహారాజులుగా అవుతామని మీకు గుర్తుండాలి
అనగా మనము విశ్వానికి కిరీటధారీ రాకుమారులుగా తయారవుతాము.
మనము
పరమాత్ముని సమ్ముఖములో కూర్చుని ఉన్నామని పిల్లలైన మీకు ఆంతరిక సంతోషముండాలి, వారి
ద్వారా స్వర్గ వారసత్వము లభిస్తుంది, వారి శ్రీమతముపై నడవాలి. మన రాజధాని స్థాపనవుతూ
ఉందని మీకు తెలుసు. రాజధానిలో అందరూ కావాలి. కానీ పిల్లలైన మీ నోటి నుండి సదా
రత్నాలే వెలువడాలి. బాబా రూప్ కూడా మరియు బసంత్ కూడా. అన్ని కథలు ఇప్పటివే. తండ్రి
జ్ఞానసాగరుడు. వారు జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు. అంతేకానీ ఇంద్ర దేవుడు వర్షాన్ని
కురిపిస్తారనే విషయమేమీ లేదు. ఈ మేఘాలు న్యాచురల్ గా తయారవుతాయి, వర్షాన్ని
కురిపిస్తాయి. సత్యయుగములో ఈ 5 తత్వాలు కూడా మీకు దాసిగా అవుతాయి. కానీ ఇక్కడి
మనుష్యులు అన్నింటికీ బానిసలుగా అయిపోయారు. ఇక్కడ ప్రతి విషయములోనూ కృషి చేయాల్సి
ఉంటుంది. అక్కడ అన్ని విషయాలు స్వతహాగా జరిగిపోతాయి. కావున పిల్లలకు బాబా స్మృతి సదా
ఉండాలి, దాని ద్వారా సంతోషపు పాదరసము సదా పైకి ఎక్కి ఉంటుంది. వారు (సైన్స్ వారు)
కూడా మంథనము చేస్తారు. పిల్లలైన మీరు వాణిని మంథనము చేయాలి. వాణి యొక్క ప్రవాహము
ఒక్కోసారి చాలా బాగుంటుంది, ఒక్కోసారి తక్కువగా ఉంటుంది, దీనినే మంథనము చేయడమని
అంటారు. పిల్లలు తండ్రి అవస్థను చూస్తున్నారు మరియు బాబా తమ అనుభవాన్ని వినిపిస్తారు.
అప్పుడప్పుడు చాలా ఉప్పొంగి ప్రవహిస్తుంది, అప్పుడప్పుడు తక్కువగా ఉంటుంది.
అప్పుడప్పుడు చాలా మంచి పాయింట్లు వెలువడతాయి. బాబా కూడా సహాయకులుగా అవుతారు. ఇది
మీరు కూడా ఫీల్ అవుతారు. బాబా అయితే ఎప్పుడూ మురళిని చేతిలోకి తీసుకోరు. పిల్లలు
మ్యాగజిన్ ను వ్రాసినప్పుడు, పిల్లలు ఏ పొరపాట్లు చేయడము లేదు కదా అని బాబా
అప్పుడప్పుడు చూస్తుంటారు. మ్యాగజిన్ లో కూడా మంచి-మంచి మురళి పాయింట్లు వస్తుంటాయి
మరియు అన్ని వైపులకు వెళ్తుంటాయి. ఎవరి వద్దకైనా మురళి చేరుకోలేదంటే, బాబా ఈ విధముగా
అంటారు - రచయిత మరియు రచనల జ్ఞానాన్ని 7 రోజులలో అర్థం చేసుకున్నారు కదా, ఇంకేమి
కావాలి. ఇక 5 వికారాలను భస్మం చేసే పురుషార్థము చేయాలి, ఇంకే కష్టము లేదు.
పిల్లలైన మీరు
ఏ సత్సంగానికైనా వెళ్ళవచ్చు, సేవ చేయాలనే ఉల్లాసము కూడా రావాలి. అన్ని ధర్మాలవారు
ఒక దగ్గరకు చేరుకున్నప్పుడు ఇలా అర్థం చేయించాలి - ప్రతి ఒక్కరి ధర్మము వేర్వేరు.
భాయి-భాయి అని అంటారు కానీ అందరూ కలిసి ఒకటి అవ్వడమనేది జరగదు. ఇది కేవలం చెప్పుకునే
విషయము మాత్రమే. తండ్రి అంటారు - నేను వచ్చి బ్రాహ్మణులుగా తయారుచేసి, తర్వాత
దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను, అక్కడ వేరే ఏ ధర్మము ఉండదు. ఇది ఆ మహాభారత
యుద్ధమే. గీతలో కూడా దీని గురించి వర్ణన చేయబడి ఉంది. ఈ చదువు ఒక్కటే. చదివించేవారు
కూడా ఒక్కరే. తండ్రి అంటారు, జ్ఞానము ఎప్పుడైతే పూర్తి అవుతుందో, అప్పుడు నేను కూడా
వెళ్ళిపోతాను. నేను కలియుగ అంతిమములో జ్ఞానాన్ని వినిపించాలి, నేను కల్ప-కల్పము
రావాలి. ఒక్క సెకెండు కూడా ముందు వెనుక అవ్వదు. ఎప్పుడైతే జ్ఞానము పూర్తి అవుతుందో,
అప్పుడు కర్మాతీత అవస్థకు చేరుకుంటారు, అప్పుడు వినాశనము కూడా జరుగుతుంది.
రోజురోజుకు మీ సేవ వృద్ధి అవుతూ ఉంటుంది. ఇక్కడైతే ఎవరిలోనూ పవిత్రత లేదు, దైవీ
గుణాల ధారణ లేదు. అక్కడున్న పవిత్రతలో ఎంత తేడా ఉందో చూడండి. మీరు ఇప్పుడు సంగమములో
కూర్చుని ఉన్నారు, ఇదే పురుషోత్తమ యుగము. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అవుతున్నారు.
కానీ ఆ హుందాతనము, ఆ నడవడిక కూడా ఉండాలి. ఎప్పుడూ నోటి నుండి రాళ్ళు వెలువడకూడదు.
నోటి నుండి రత్నాలే వెలువడాలి. ఇప్పుడు మీరు దేవతల వలె పుష్పాలుగా అవుతున్నారు.
భగవంతుడు వచ్చి భగవాన్-భగవతీలుగా తయారుచేస్తారు. దేవతలనే భగవాన్-భగవతి అని అంటారు.
కానీ అలా తయారుచేసేవారు ఎవరు? ఇది ఎవ్వరికీ తెలియదు. మీ బుద్ధిలో రచయిత మరియు రచనల
పూర్తి జ్ఞానముంది, మరియు ఇతరులను తమ సమానముగా తయారుచేసే బాధ్యత ఉంది. చాలామంది
వస్తూ ఉంటారు. స్వదర్శన చక్రధారులుగా బ్రాహ్మణులే అవుతారు. మాయా తుఫానులు కూడా
పిల్లలకే వస్తాయి. ఒక్కోసారి తుఫానులు వచ్చినప్పుడు ఎముకలన్నీ విరిగిపోతాయి.
నడుస్తూ-నడుస్తూ కొంతమంది డిస్సర్వీస్ కూడా చేస్తారు. తండ్రి అంటారు - ఎలాంటి
అశుద్ధమైన పనులు చేయకండి. మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు, వారు కుఖవంశావళి. ఎంత తేడా
ఉంది. వారు దైహిక యాత్రలకు తీసుకువెళ్తారు, మీది ఆత్మిక యాత్ర. మీరు అనంతమైన తండ్రి
నుండి వారసత్వము తీసుకుంటున్నారు. వారూ బ్రాహ్మణులే, మనము బ్రాహ్మణులమే, కానీ
ఇరువురిలో సత్యమైన బ్రాహ్మణులెవరు అని అర్థం చేసుకునే తెలివి కూడా ఎవ్వరిలోనూ లేదు.
ఆ బ్రాహ్మణులు తమను తాము బ్రహ్మాకుమారులని పిలుచుకోలేరు. మీరు స్వయాన్ని
బ్రహ్మాకుమారులని పిలుచుకుంటారు, కనుక తప్పకుండా బ్రహ్మా కూడా ఉంటారు. కానీ ఇవి
అడగడానికి వారి బుద్ధిలోకి ఈ విషయాలు రావు. బాబా కల్ప-కల్పము వచ్చి పిల్లలైన మీకు ఈ
విషయాలను అర్థం చేయిస్తారు. బ్రహ్మా సంతానమైన మీరు బ్రాహ్మణులు, మీరంతా
సోదరీ-సోదరులు. మరి మీరు వికారాలలోకి ఎలా వెళ్ళగలరు. ఒకవేళ ఎవరైనా వెళ్ళినట్లయితే
బ్రాహ్మణ కులానికి కళంకము తెచ్చినవారు అవుతారు. తమను తాము
బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలుగా పిలుచుకున్న తర్వాత ఇక మళ్ళీ పతితులుగా అవ్వకూడదు.
అచ్ఛా!
మధురాతి
మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. వాణి ద్వారా ఏదైతే వింటారో, దానిపై మంథనము చేయాలి. పురుషోత్తములుగా
అవుతున్నారు, అందుకే నడవడికను చాలా రాయల్ గా తయారుచేసుకోవాలి. నోటి నుండి ఎప్పుడూ
రాళ్ళు వెలువడకూడదు.
2. అనేకులను తమ సమానముగా తయారుచేసే బాధ్యతను మీదిగా భావించి సేవలో తత్పరులై
ఉండాలి. ఎలాంటి ఛీ-ఛీ అశుద్ధమైన పనులు చేసి డిస్సర్వీస్ చేయకూడదు.
వరదానము:-
అతీంద్రియ సుఖమయ స్థితి ద్వారా అనేక ఆత్మలను ఆహ్వానించే
విశ్వ కళ్యాణకారీ భవ
ఎంతగా లాస్ట్ కర్మాతీత స్థితి సమీపముగా వస్తూ ఉంటుందో,
అంతగా శబ్దానికి అతీతమైన శాంతి స్వరూప స్థితి ఎక్కువ ప్రియమనిపిస్తుంది - ఈ స్థితిలో
సదా అతీంద్రియ సుఖము యొక్క అనుభూతి కలుగుతుంది మరియు ఈ అతీంద్రియ సుఖమయ స్థితి
ద్వారానే అనేక ఆత్మలను సహజముగా ఆహ్వానించగలరు. ఈ శక్తిశాలి స్థితియే విశ్వ
కళ్యాణకారీ స్థితి. ఈ స్థితి ద్వారా ఎంత దూరంగా ఉన్న ఆత్మకైనా సరే సందేశాన్ని
చేర్చగలరు.
స్లోగన్:-
ప్రతి ఒక్కరి
విశేషతను స్మృతిలో ఉంచుకుని విశ్వాసపాత్రులుగా అయినట్లయితే సంగఠన ఏకమతమవుతుంది.
అవ్యక్త ప్రేరణలు -
బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి
బ్రహ్మాబాబా గురించి
అందరి నోటి నుండి ఒకటే మాట వెలువడుతుంది - ‘‘మేరా బాబా’’ (నా బాబా). అలాగే శ్రేష్ఠ
ఆత్మలైన మీలోని ప్రతి ఒక్కరి పట్ల ఇదే భావన ఉండాలి, అనుభూతి ఉండాలి. మీలోని ప్రతి
ఒక్కరి నుండి ‘‘వీరు నా వారు’’ అన్న అనుభూతి కలగాలి. మిమ్మల్ని ‘‘వీరు నా
శుభచింతకులు, సహయోగీ సేవా సహచరులు’’ అని ప్రతి ఒక్కరూ భావించాలి. దీనినే బాబా సమానము
అని అంటారు. ఇదే సంపన్న మరియు సంపూర్ణ కర్మాతీత స్టేజ్.