24-01-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి మీకు ఏ చదువునైతే చదివిస్తున్నారో, దానిని బుద్ధిలో ఉంచుకొని అందరినీ చదివించాలి, ప్రతి ఒక్కరికీ తండ్రి మరియు సృష్టి చక్రము యొక్క పరిచయాన్ని ఇవ్వాలి’’

ప్రశ్న:-
ఆత్మ సత్యయుగములో కూడా పాత్రను అభినయిస్తుంది మరియు కలియుగములో కూడా అభినయిస్తుంది, కానీ తేడా ఏమిటి?

జవాబు:-
సత్యయుగములో పాత్రను అభినయించేటప్పుడు అక్కడ పాప కర్మలేవీ జరగవు, ప్రతి కర్మ అక్కడ అకర్మగా అవుతుంది ఎందుకంటే రావణుడు లేడు, ఆ తర్వాత కలియుగములో ఎప్పుడైతే పాత్రను అభినయిస్తుందో, అప్పుడు ప్రతి కర్మ వికర్మగా లేక పాపముగా అవుతుంది ఎందుకంటే ఇక్కడ వికారాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. మీకు మొత్తము జ్ఞానమంతా ఉంది.

ఓంశాంతి
మనము బాబా ఎదురుగా కూర్చున్నామని ఇప్పుడు పిల్లలకైతే తెలుసు. పిల్లలు నా ఎదురుగా కూర్చున్నారని బాబాకు కూడా తెలుసు. తండ్రి మనకు శిక్షణను ఇస్తున్నారని, దానిని మళ్ళీ ఇతరులకు ఇవ్వాలని ఇది కూడా మీకు తెలుసు. మొట్టమొదటైతే తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి ఎందుకంటే అందరూ తండ్రిని మరియు తండ్రి శిక్షణలను మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి ఏదైతే చదివిస్తున్నారో, ఈ చదువు మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత లభిస్తుంది. ఈ జ్ఞానము ఇంకెవ్వరికీ లేదు. ముఖ్యమైనది తండ్రి పరిచయము, ఆ తర్వాత మనమందరమూ సోదరులము అని కూడా అర్థం చేయించాలి. మొత్తము ప్రపంచములో ఉన్న ఆత్మలందరూ పరస్పరములో సోదరులు. అందరూ తమకు లభించిన పాత్రను ఈ శరీరము ద్వారా అభినయిస్తున్నారు. ఇప్పుడిక తండ్రి కొత్త ప్రపంచములోకి తీసుకువెళ్ళేందుకు వచ్చారు, దానిని స్వర్గమని అంటారు. కానీ సోదరులమైన మనమందరమూ పతితముగా ఉన్నాము, ఒక్కరిమి కూడా పావనముగా లేము. పతితులందరినీ పావనముగా తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇది ఉన్నదే పతిత, వికారీ, భ్రష్టాచారీ రావణ ప్రపంచము. రావణుడు అంటే అర్థము - స్త్రీలోని 5 వికారాలు, పురుషునిలోని 5 వికారాలు. బాబా చాలా సింపుల్ రీతిలో అర్థం చేయిస్తారు. మీరు కూడా ఈ విధముగా అర్థం చేయించగలరు. కావున మొట్టమొదట ఇది అర్థం చేయించండి - వారు ఆత్మలమైన మన తండ్రి, మనమందరమూ సోదరులము. అర్థం చేయించిన తర్వాత, ఇది సరేనా అని వారిని అడగండి. వారిని ఇలా వ్రాయమని చెప్పండి - మనమంతా పరస్పరము సోదరులము, మనందరి తండ్రి కూడా ఒక్కరే, ఆత్మలైన మనందరికీ వారు సుప్రీమ్ సోల్, వారిని ఫాదర్ అని అంటారు. దీనిని బుద్ధిలో పక్కాగా కూర్చోబెట్టండి, అప్పుడు సర్వవ్యాపి మొదలైన విషయాలు ముందు తొలగిపోతాయి. మొదట భగవంతుడి గురించి చదువుకోవాలి. ఇంతకుముందు సర్వవ్యాపి అని అనేవాడిని, ఇప్పుడు సర్వవ్యాపి కాదని భావిస్తున్నాను అని మంచి రీతిలో కూర్చుని వ్రాయమని వారికి చెప్పండి. మనమందరమూ సోదరులము. ఆత్మలందరూ - గాడ్ ఫాదర్, పరమపిత అని అంటారు. మొదటైతే ఈ నిశ్చయాన్ని కూర్చోబెట్టాలి - మనము ఆత్మలము, పరమాత్మ కాదు, మనలో పరమాత్మ వ్యాపించి లేరు, అందరిలోనూ ఆత్మ వ్యాపించి ఉంది. ఆత్మ శరీరము ఆధారముతో పాత్రను అభినయిస్తుంది, ఇది పక్కా చేయించండి. అచ్ఛా, తర్వాత ఆ తండ్రి సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని కూడా వినిపిస్తారు. ఈ సృష్టి చక్రము యొక్క వయసు ఎంత అనేది ఇతరులెవ్వరికీ తెలియదు. తండ్రియే టీచర్ రూపములో కూర్చుని అర్థం చేయిస్తారు. లక్షల సంవత్సరాల విషయమే లేదు. ఈ చక్రము అనాదిగా, ఏక్యురేట్ గా తయారై, తయారుచేయబడినది, దీనిని తెలుసుకోవలసి ఉంటుంది. సత్య, త్రేతాయుగాలు గడిచిపోయాయి, ఇది నోట్ చేసుకోండి. వాటిని స్వర్గము మరియు సెమీ స్వర్గము అని అంటారు. అక్కడ దేవీ-దేవతల రాజ్యము నడుస్తుంది, వారికి 16 కళలు, వీరికి 14 కళలు ఉంటాయి. మెల్లమెల్లగా కళలు తగ్గిపోతూ ఉంటాయి. ప్రపంచమైతే తప్పకుండా పాతదిగా అవుతుంది కదా. సత్యయుగము యొక్క ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది. దాని పేరే స్వర్గము, హెవెన్, కొత్త ప్రపంచము... దానినే మహిమ చేయాలి. కొత్త ప్రపంచములో ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమే ఉంటుంది. మొదట తండ్రి పరిచయాన్ని, ఆ తర్వాత చక్రము యొక్క పరిచయాన్ని ఇవ్వడము జరుగుతుంది. నిశ్చయము ఏర్పరచేందుకు చిత్రాలు కూడా మీ వద్ద ఉన్నాయి. ఈ సృష్టిచక్రము తిరుగుతూ ఉంటుంది. సత్యయుగములో లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది, త్రేతాలో సీతా-రాముల రాజ్యము ఉండేది. ఇది అర్ధకల్పము, రెండు యుగాలు గడిచిపోతాయి, ఆ తర్వాత ద్వాపర-కలియుగాలు వస్తాయి. ద్వాపరములో రావణ రాజ్యము ఉంటుంది. దేవతలు వామ మార్గములోకి వెళ్ళిపోతారు కావున వికారాల సిస్టమ్ తయారవుతుంది. సత్య, త్రేతాయుగాలలో అందరూ నిర్వికారులుగా ఉంటారు. ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమే ఉంటుంది. చిత్రాలను కూడా చూపించాలి, నోటి ద్వారా కూడా అర్థం చేయించాలి. తండ్రి మనకు టీచర్ గా అయి ఈ విధముగా చదివిస్తున్నారు. తండ్రి తమ పరిచయాన్ని స్వయమే వచ్చి ఇస్తారు. తండ్రి స్వయముగా అంటారు, నేను పతితులను పావనముగా చేయడానికి వస్తాను కావున నాకు శరీరము తప్పకుండా కావాలి, లేకపోతే నేను ఎలా మాట్లాడగలను. నేను చైతన్యుడిని, సత్యమును మరియు అమరుడిని. ఆత్మ సతో, రజో, తమోలలోకి వస్తుంది. ఆత్మయే పావనముగా మరియు పతితముగా అవుతుంది, అందుకే పతితాత్మ, పావనాత్మ అని అంటారు. ఆత్మలోనే అన్ని సంస్కారాలు ఉన్నాయి. గతము యొక్క కర్మ-వికర్మల సంస్కారాలను ఆత్మ తీసుకువస్తుంది. సత్యయుగములో వికర్మలు జరగనే జరగవు. కర్మలు చేస్తారు, పాత్రను అభినయిస్తారు, కానీ ఆ కర్మలు అకర్మలుగా అవుతాయి. గీతలో కూడా ఈ పదాలు ఉన్నాయి, ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా అర్థం చేసుకుంటున్నారు. పాత ప్రపంచాన్ని మార్చడానికి, కొత్త ప్రపంచాన్ని తయారుచేయడానికి బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. ఎక్కడైతే కర్మలు అకర్మలుగా అవుతాయో, దానినే సత్యయుగమని అంటారు మరియు ఎక్కడైతే అన్ని కర్మలు వికర్మలుగా అవుతాయో, దానిని కలియుగమని అంటారు. మీరు ఇప్పుడు సంగమములో ఉన్నారు. బాబా ఇరువైపులా ఉన్న విషయాలను అర్థం చేయిస్తున్నారు. సత్య, త్రేతాయుగాలు పవిత్ర ప్రపంచము, అక్కడ ఏ పాపమూ జరగదు. ఎప్పుడైతే రావణ రాజ్యము ప్రారంభమవుతుందో అప్పుడే పాపాలు జరుగుతాయి. అక్కడ వికారాల పేరు ఉండదు. రామ రాజ్యము మరియు రావణ రాజ్యము యొక్క చిత్రాలైతే ఎదురుగా ఉన్నాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది చదువు. ఇది బాబాకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఈ చదువైతే మీ బుద్ధిలో ఉండాలి. తండ్రి కూడా గుర్తుకువస్తారు, చక్రము కూడా బుద్ధిలోకి వచ్చేస్తుంది. క్షణములో అంతా గుర్తుకువచ్చేస్తుంది. వర్ణన చేయడానికి సమయము పడుతుంది. వృక్షము ఇలా ఉంటుంది, దీనికి మూడు ఫౌంటెన్ లు (శాఖలు) ఉన్నాయి, బీజము మరియు వృక్షము క్షణములో గుర్తుకువచ్చేస్తాయి. ఈ బీజము ఫలానా వృక్షముదని, ఈ విధముగా దీని నుండి ఫలాలు వెలువడతాయని గుర్తుకొచ్చేస్తుంది. ఈ అనంతమైన మనుష్య సృష్టి రూపీ వృక్షము ఎలా ఉంటుంది అని దీని రహస్యాన్ని మీరు అర్థం చేయిస్తారు. అర్ధకల్పము రాజ్యము ఎలా నడుస్తుంది, ఆ తర్వాత రావణ రాజ్యము మొదలైనప్పుడు సత్య, త్రేతా యుగవాసులే, ద్వాపరయుగ వాసులుగా అవుతారని పిల్లలకు మొత్తమంతా అర్థం చేయించారు. వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. అర్ధకల్పము తర్వాత రావణ రాజ్యము మొదలవుతుంది, వికారులుగా అయిపోతారు. తండ్రి ద్వారా ఏ వారసత్వమైతే లభించిందో, అది అర్ధకల్పము కొనసాగింది. జ్ఞానాన్ని వినిపించి వారసత్వాన్ని ఇచ్చారు, ఆ ప్రారబ్ధాన్ని అనుభవించారు అనగా సత్య, త్రేతాయుగాలలో సుఖాన్ని పొందారు. దానిని సుఖధామమని, సత్యయుగమని అనడము జరుగుతుంది. అక్కడ దుఃఖము ఉండనే ఉండదు. ఎంత సింపుల్ గా అర్థం చేయిస్తారు. ఒకరికి అర్థం చేయిస్తున్నా లేక అనేకులకు అర్థం చేయిస్తున్నా - వారు అర్థం చేసుకుంటున్నారా, అవును-అవును అని అంటున్నారా, అని అటెన్షన్ పెట్టాలి. మీరు వారికి ఇలా చెప్పండి - మీరు నోట్ చేసుకుంటూ ఉండండి, ఏదైనా సందేహము కలిగితే అడగండి, ఏ విషయమైతే ఎవ్వరికీ తెలియదో దానిని మేము అర్థం చేయిస్తున్నాము, మీకు ఏమీ తెలియదు, ఇంకేమి అడుగుతారు?

బాబా అయితే ఈ అనంతమైన వృక్షము యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మీరు 84 జన్మల చక్రములోకి ఎలా వస్తారు అనేది తండ్రి అర్థం చేయించారు. దీనిని బాగా నోట్ చేసుకోండి, ఆ తర్వాత దీనిపై ఆలోచించాలి. ఉదాహరణకు టీచర్ వ్యాసము వ్రాయమని టాపిక్ ఇస్తే తర్వాత ఇంటికి వెళ్ళి రివైజ్ చేసుకుని వస్తారు కదా. మీరు కూడా ఈ జ్ఞానాన్ని ఇస్తారు, తర్వాత ఏమవుతుందో చూడండి. అడుగుతూ ఉండండి. ఒక్కొక్క విషయాన్ని మంచి రీతిలో అర్థం చేయించండి. తండ్రి, టీచర్ యొక్క కర్తవ్యాన్ని అర్థం చేయించి ఆ తర్వాత గురువు గురించి అర్థం చేయించండి. మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనముగా చేయండి అని వారిని పిలిచారు. ఆత్మ పావనముగా అయినట్లయితే శరీరము కూడా పావనమైనది లభిస్తుంది. బంగారము ఏ విధముగా ఉంటుందో, ఆభరణము అదే విధముగా తయారవుతుంది. 24 క్యారెట్ల బంగారాన్ని తీసుకుని, అందులో మలినాలు కలపకపోతే ఆభరణము కూడా అదే విధముగా సతోప్రధానముగా తయారవుతుంది. కల్తీ కలపడము వలన తమోప్రధానముగా అయిపోయారు. మొట్టమొదట భారత్ 24 క్యారెట్ల పక్కా బంగారు పిచ్చుకగా ఉండేది అనగా సతోప్రధాన కొత్త ప్రపంచముగా ఉండేది, తర్వాత తమోప్రధానముగా అయ్యింది. ఇది తండ్రియే అర్థం చేయిస్తారు, ఇతర ఏ మనుష్యులకు, గురువులకు తెలియదు. మీరు వచ్చి పావనముగా చేయండి అని పిలుస్తారు. అదైతే గురువు పనే. వానప్రస్థ అవస్థలో మనుష్యులు గురువులను ఆశ్రయిస్తారు. వాణి నుండి అతీతమైన స్థానము నిరాకారీ ప్రపంచము, అక్కడ ఆత్మలు నివసిస్తాయి. ఇది సాకారీ ప్రపంచము. ఇది రెండింటి మిలనము. అక్కడైతే శరీరము ఉండదు. అక్కడ కర్మలేవీ జరగవు. తండ్రిలోనైతే మొత్తము జ్ఞానమంతా ఉంది. డ్రామా ప్లాన్ అనుసారముగా వారిని నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. వారు చైతన్యమైనవారు, సత్-చిత్-ఆనంద స్వరూపులు కావున వారిని నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. ఓ పతిత-పావన, నాలెడ్జ్ ఫుల్ శివబాబా అని పిలుస్తారు కూడా, వారి పేరు సదా శివ అనే ఉంటుంది. మిగిలిన ఆత్మలంతా పాత్రను అభినయించడానికి వస్తారు కావున రకరకాల పేర్లను ధారణ చేస్తారు. తండ్రిని పిలుస్తారు కానీ వారికేమీ అర్థం కాదు. తప్పకుండా భాగ్యశాలి రథము కూడా ఉంటుంది, అందులోనే తండ్రి ప్రవేశించి మిమ్మల్ని పావన ప్రపంచములోకి తీసుకువెళ్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి-మధురమైన పిల్లలూ, ఎవరైతే అనేక జన్మల అంతిమములో ఉన్నారో, పూర్తి 84 జన్మలను తీసుకున్నారో, నేను వారి తనువులోకే వస్తాను. భాగ్యశాలి రథములోకి రావలసి ఉంటుంది. మొదటి నంబరులోనైతే శ్రీకృష్ణుడు ఉన్నారు. వారు కొత్త ప్రపంచానికి యజమాని. మళ్ళీ వారే కిందికి దిగిపోతారు. బంగారు యుగము నుండి వెండి, రాగి, ఇనుప యుగాలలోకి వస్తారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఇనుము నుండి బంగారముగా అవుతున్నారు. తండ్రి అంటారు, కేవలం మీ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఎవరిలోనైతే నేను ప్రవేశించానో, ఆ ఆత్మలోనైతే కొద్దిగా కూడా జ్ఞానముండేది కాదు. వీరిలోకి నేను ప్రవేశిస్తాను, అందుకే వీరిని భాగ్యశాలి రథమని అంటారు. లేదంటే అందరికన్నా ఉన్నతమైనవారైతే ఈ లక్ష్మీ-నారాయణులే, వీరిలో ప్రవేశించాలి, కానీ వీరిలో పరమాత్మ ప్రవేశించరు కావున వీరిని భాగ్యశాలి రథమని అనరు. రథములోకి వచ్చి పతితులను పావనముగా చేయాలి కావున తప్పకుండా అది కలియుగీ తమోప్రధానమైనదే ఉంటుంది కదా. వారు స్వయంగా చెప్తున్నారు - నేను అనేక జన్మల అంతిమములో వస్తాను. గీతలో కూడా ఏక్యురేట్ పదాలు ఉన్నాయి. గీతనే సర్వశాస్త్రమయి శిరోమణి అని అంటారు. ఈ సంగమయుగములోనే తండ్రి వచ్చి బ్రాహ్మణ కులాన్ని మరియు దేవతా కులాన్ని స్థాపన చేస్తారు. అనేక జన్మల అంతిమములో అనగా సంగమయుగములోనే తండ్రి వస్తారు. తండ్రి అంటారు, నేను బీజరూపుడను. శ్రీకృష్ణుడు సత్యయుగ నివాసి. వారిని వేరే చోటైతే ఎవ్వరూ చూడలేరు. పునర్జన్మలు తీసుకునేటప్పుడు నామ, రూప, దేశ, కాలాలు అన్నీ మారిపోతాయి. ముఖకవళికలే మారిపోతాయి. మొదట చిన్న బిడ్డగా, సుందరముగా ఉంటారు, పెద్దవారైన తర్వాత వారు శరీరాన్ని వదిలి మరొక చిన్న శరీరాన్ని తీసుకుంటారు. ఈ తయారై, తయారుచేయబడిన ఆట డ్రామాలో నిశ్చితమై ఉంది. మరో శరీరము తీసుకున్న తర్వాత వారిని శ్రీకృష్ణుడని అనరు. ఆ శరీరానికి పేరు మొదలైనవి వేరేవి ఉంటాయి. సమయము, ముఖకవళికలు, తిథి-తారీఖులు మొదలైనవన్నీ మారిపోతాయి. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు యథావిధిగా రిపీట్ అవుతాయని అంటారు. కావున ఈ డ్రామా రిపీట్ అవుతూ ఉంటుంది. సతో, రజో, తమోలలోకి రావాల్సిందే. సృష్టి యొక్క నామము, యుగము యొక్క నామము, అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడిది సంగమయుగము. నేను సంగమములోనే వస్తాను. నేను మీకు మొత్తము ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికము యొక్క సత్యాన్ని తెలియజేస్తాను. ఆది నుండి మొదలుకుని అంతిమము వరకు ఇంకెవ్వరికీ తెలియదు. సత్యయుగము ఆయుష్షు ఎంత అనేది తెలియని కారణముగా లక్షల సంవత్సరాలని అనేస్తారు. ఇప్పుడు మీ బుద్ధిలో అన్ని విషయాలు ఉన్నాయి. తండ్రి, తండ్రి-టీచర్-సద్గురువు అని, సతోప్రధానముగా అయ్యేందుకు వారు చాలా మంచి యుక్తిని తెలియజేస్తున్నారని మీరు లోపల పక్కా చేసుకోవాలి. దేహ సహితముగా దేహపు సర్వ ధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని గీతలో కూడా ఉంది. తిరిగి తమ ఇంటికి తప్పకుండా వెళ్ళాలి. భగవంతుని వద్దకు వెళ్ళేందుకు భక్తి మార్గములో ఎంత కృషి చేస్తారు. అది ముక్తిధామము, అక్కడ కర్మల నుండి ముక్తులుగా ఉంటారు. మనము నిరాకారీ ప్రపంచములోకి వెళ్ళి కూర్చుంటాము. పాత్రధారి ఇంటికి వెళ్తే ఇక పాత్ర నుండి ముక్తులైనట్లే. మేము ముక్తిని పొందాలని అందరూ కోరుకుంటారు. మోక్షమైతే ఎవ్వరికీ లభించదు. ఈ డ్రామా అనాది, అవినాశీ అయినది. రావడము, వెళ్ళడము యొక్క ఈ పాత్ర మాకు ఇష్టము లేదని ఎవరైనా అన్నా సరే, ఇందులో ఏమీ చెయ్యలేరు. ఈ అనాది డ్రామా తయారై ఉంది. ఒక్కరు కూడా మోక్షాన్ని పొందలేరు. అవన్నీ అనేక రకాల మనుష్య మతాలు. ఇది శ్రేష్ఠముగా తయారుచేయడానికి శ్రీమతము. మనుష్యులను శ్రేష్ఠులని అనరు. దేవతలను శ్రేష్ఠులని అంటారు. వారి ఎదురుగా అందరూ నమస్కరిస్తారు కావున వారు శ్రేష్ఠమైనవారు కదా. శ్రీకృష్ణుడు దేవత, వారు వైకుంఠానికి రాకుమారుడు. వారు ఇక్కడకు ఎలా వస్తారు. వారు గీతను కూడా వినిపించలేదు. శివుని ఎదురుగా వెళ్ళి మాకు ముక్తినివ్వండని అంటారు. శివుడు ఎప్పుడూ జీవన్ముక్తిలోకి, జీవన బంధనములోకి రానే రారు, అందుకే వారిని ముక్తినివ్వమని పిలుస్తారు. జీవన్ముక్తి కూడా వారే ఇస్తారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మనమంతా ఆత్మ రూపములో సోదరులము, ఈ పాఠాన్ని పక్కా చేసుకోవాలి మరియు చేయించాలి. తమ సంస్కారాలను స్మృతి ద్వారా సంపూర్ణ పావనముగా చేసుకోవాలి.

2. 24 క్యారెట్ల సత్యమైన బంగారముగా (సతోప్రధానముగా) అయ్యేందుకు కర్మ-అకర్మ-వికర్మల గుహ్య గతిని బుద్ధిలో ఉంచుకుని ఇప్పుడిక ఎటువంటి వికర్మలను చేయకూడదు.

వరదానము:-
గాభరాపడే డ్యాన్స్ ను వదిలి సదా సంతోషపు డ్యాన్స్ ను చేసే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ భవ

ఏ పిల్లలైతే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా ఉంటారో వారు ఎప్పుడూ గాభరాపడే డ్యాన్స్ ను చేయలేరు. క్షణములో మెట్టు కిందకు దిగడము, మళ్ళీ క్షణములో పైకి ఎక్కడము... ఇప్పుడు ఇక ఈ పైకి-కిందికి అయ్యే సంస్కారాన్ని మార్చుకున్నట్లయితే చాలా వేగముగా ముందుకు వెళ్తారు. కేవలం మీకు లభించిన అథారిటీని, జ్ఞానాన్ని, పరివార సహయోగాన్ని ఉపయోగించుకోండి, బాబా చేతిలో చేయి వేసి ముందుకు వెళ్తూ ఉండండి, అప్పుడు సంతోషపు డ్యాన్స్ ను చేస్తూ ఉంటారు, గాభరాపడే డ్యాన్స్ జరగదు. కానీ ఎప్పుడైతే మాయ చేతిని పట్టుకుంటారో అప్పుడు గాభరాపడే డ్యాన్స్ జరుగుతుంది.

స్లోగన్:-
ఎవరి సంకల్పాలు మరియు కర్మలు మహాన్ గా ఉంటాయో, వారే మాస్టర్ సర్వశక్తివంతులు.

అవ్యక్త ప్రేరణలు - ఈ అవ్యక్త మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవము చేయండి

మాస్టర్ త్రికాలదర్శులుగా అయ్యి ప్రతి కర్మను, ప్రతి సంకల్పాన్ని చేయండి మరియు మాటలను మాట్లాడండి, అప్పుడు ఏ కర్మ కూడా వ్యర్థమైనదిగా లేక అనర్థమైనదిగా అవ్వదు. త్రికాలదర్శి అనగా సాక్షీతనపు స్థితిలో స్థితులై ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేసినట్లయితే కర్మకు వశీభూతులు అవ్వరు. సదా కర్మ మరియు కర్మ బంధనము నుండి ముక్తులై తమ ఉన్నతమైన స్థితిని ప్రాప్తి చేసుకుంటారు.