24-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ మహాభారత యుద్ధములో పాత వృక్షము సమాప్తమవ్వనున్నది, అందుకే యుద్ధానికి ముందే తండ్రి నుండి పూర్తి-పూర్తి వారసత్వాన్ని తీసుకోండి’’

ప్రశ్న:-
బాబాకు మాతల సంగఠన కావాలి కానీ ఆ సంగఠన యొక్క విశేషత ఏమై ఉండాలి?

జవాబు:-
ఎటువంటి సంగఠన ఉండాలంటే, వారు దేహీ-అభిమానులుగా ఉండేందుకు పూర్తి-పూర్తి పురుషార్థము చేయాలి. వారికి - మేము పావనముగా అయి పావన ప్రపంచాన్ని తయారుచేయాలి అనే పక్కా నషా ఉండాలి. పతితముగా అవ్వకూడదు. నష్టోమోహా గ్రూప్ అయి ఉండాలి, అప్పుడు ఏదైనా అద్భుతము చేసి చూపించగలరు. ఎవరి పట్ల మోహము ఉండకూడదు. మోహమనే బంధము చాలా నష్టపరుస్తుంది.

ఓంశాంతి
మధురమైన బాబా మనల్ని స్వర్గవాసులుగా తయారుచేయడానికి ఇక్కడకు వచ్చారని మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. ఈ విషయము పిల్లల బుద్ధిలో ఉంది. ఆత్మలమైన మనము ఈ స్మృతియాత్రతో పవిత్రముగా అవుతామని ప్రతి ఒక్కరికీ అర్థం చేయించాలి. ఇది ఎంత సహజమైన ఉపాయము - కేవలం తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి ఒక్క సెకెండులో ముక్తి-జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇస్తారని పిల్లలకు తెలుసు. ఇప్పుడు అందరూ జీవన బంధనములో ఉన్నారు, రావణ రాజ్యము యొక్క బంధనములో ఉన్నారు. ఈ విషయము తండ్రికి తెలుసు మరియు పిల్లలకు తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. మనము అనంతమైన తండ్రిని స్మృతి చేస్తామని పిల్లలైన మీకు నిశ్చయముంది కనుక ఆత్మకు లోలోపల చాలా సంతోషము ఉండాలి. ఏ తండ్రినైతే అర్ధకల్పము నుండి స్మృతి చేస్తూ వచ్చారో, ఆ తండ్రి లభించారు. దుఃఖములో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. ఇంతకుముందు మీరు కూడా స్మరించేవారు కానీ ఇప్పుడు మీరు దుఃఖముతో స్మరించరు. ఎవరినైతే మొత్తము ప్రపంచమంతా స్మరిస్తూ ఉందో, ఆ తండ్రి వచ్చారని మీకు తెలుసు. బాబా పదే-పదే అర్థం చేయించారు - మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు, నేను ఒక ఆత్మను అని భావించండి. బాబా పరంధామము నుండి వచ్చి ఉన్నారు. కల్ప-కల్పము తమ ప్రతిజ్ఞ అనుసారముగా వస్తారు. బాబా ప్రతిజ్ఞ ఏమిటంటే - మీరు ఎప్పుడైతే పిలుస్తారో, మరియు అర్ధకల్పము ఎప్పుడైతే పూర్తి అవుతుందో, అప్పుడు నేను రావాల్సి ఉంటుంది. కలియుగము తర్వాత సత్యయుగము రావాలి, కావున నేను రావాల్సి ఉంటుంది. ఇది సంగమయుగమని, బాబా వచ్చి ఉన్నారని కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. పిల్లలైన మీరు కూడా సేవ చేస్తారు, రోజురోజుకు పరిచయము ఇస్తూ ఉంటారు, అలా తండ్రి పరిచయము అందరికీ లభిస్తూ ఉంటుంది. అనంతమైన తండ్రి అయిన శివబాబా, మనకు మళ్ళీ అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారని, ఇక్కడ కూర్చుని ఉన్న మీకు తెలుసు. మీరు బాబా-బాబా అని అంటారు కదా. మనము శివబాబా వద్దకు వచ్చాము. కల్పక్రితం వలె నేను సాధారణ తనువులోకి వచ్చానని శివబాబా కూడా అంటారు. ఇది మర్చిపోకూడదు. ఎవరి ద్వారానైతే పతితము నుండి పావనముగా అవ్వవలసి ఉంటుందో, అటువంటి బాబా స్మృతిని మాయ మరపింపజేస్తుంది. సర్వుల సద్గతిదాత ఒక్క సద్గురువేనని మీకు తెలుసు. సిక్కులు కూడా సత్ శ్రీ అకాల్ అని పాడుతూ ఉంటారు. పతిత-పావనుడినే సద్గురువు అని అంటారు. ఓ పతిత-పావనా, అని పిలుస్తారు కూడా. ఆత్మ పిలుస్తుంది. మనము ఇక్కడకు తండ్రిని సమ్ముఖముగా కలుసుకునేందుకు వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు. గొప్ప వ్యక్తులు పరస్పరములో ఒకరినొకరు కలుసుకునేందుకు వెళ్ళినప్పుడు, వారికి ఎంత మహిమ జరుగుతుంది. పరస్పరములో ఒకరినొకరు స్వాగతము చేసుకునేందుకు, చాలా ఆర్భాటముగా సంతోషపు బ్యాండ్ మేళాలు మొదలైనవి మ్రోగిస్తారు. ఇక్కడ గుప్త వేషములో ఎవరు వచ్చి ఉన్నారు అనేది మీకు మాత్రమే తెలుసు. వారిని దూరదేశములో నివసించే బాటసారి అని అంటారు.

ఆత్మలమైన మనము పరంధామములో నివసించేవారమని మీకు తెలుసు. పాత్రను అభినయించేందుకు ఇక్కడకు బాటసారిగా అయి వచ్చాము. తండ్రి అర్థం చేయించే ఒక్కొక్క పదము ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. మీరు తండ్రి నుండి వింటున్నారు. దానిని మంచి రీతిలో ధారణ చేయాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ కర్మక్షేత్రములో మీరంతా బాటసారులు. మనము శాంతిధామములో నివసించేవారము, తర్వాత ఇక్కడకు టాకీ వరల్డ్ లోకి వచ్చాము. మనము శాంతిధామము యొక్క బాటసారులము, 84 జన్మల పాత్రను ఇక్కడ అభినయిస్తాము. చివరికి ఇది అంతిమ సమయము. కనుక తండ్రి పాత సృష్టిని కొత్తగా చేయడానికి వచ్చి ఉన్నారు. ఈ విషయము కూడా మీకు తెలుసు. చిత్రాలు కూడా స్పష్టముగా ఉన్నాయి, శివబాబా బ్రహ్మా ద్వారా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. అంతేకానీ, శ్రీకృష్ణుడి ద్వారానో, విష్ణువు ద్వారానో స్థాపన చేస్తారని కాదు. తండ్రి వచ్చేదే బ్రహ్మా ద్వారా స్వర్గాన్ని రచించేందుకని. తండ్రి సాధారణ తనువులోకి వచ్చారు. ఇది ఉన్నదే పతిత ప్రపంచము, పావనమైనవారు ఒక్కరు కూడా లేరు. మొదటి నంబరులోని లక్ష్మీ-నారాయణులు కూడా పతితముగా అవుతారు. ఎవరైతే పావనముగా ఉండేవారో, వారే మొత్తము వంశావళి సహితముగా పతితముగా అయిపోయారు. దేవతా ధర్మము వారిగా ఉండే మనమే, ఇప్పుడు శూద్ర ధర్మము వారిగా అయిపోయామని మీకు తెలుసు. అమెరికా మొదలైన చోట్ల పెద్ద-పెద్ద షావుకారులు ఉంటారు. కానీ సత్యయుగముతో పోలిస్తే అమెరికా అసలేమీ కాదు. ఇవన్నీ చివరిలో తయారయ్యాయి. ఇది అల్పకాలికమైన ఆర్భాటము. వినాశనమైతే జరగాల్సిందే. పిల్లలైన మీకు చాలా మంచి నషా ఉండాలి. ఏ తండ్రి అయితే మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారో, వారిని పిల్లలైన మనము స్మృతి చేయము, ఇది ఎంత విచిత్రము. మాయ స్మృతి చేయనివ్వదు. పిల్లలైన మీరిప్పుడు ఇలా అంటారు - బాబా, మాయ మమ్మల్ని స్మృతి చేయనివ్వడము లేదు అని. అరే, ఏ బాబా అయితే మిమ్మల్ని 21 జన్మలకు స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారో, వారిని మీరు స్మృతి చేయలేరా? ప్రజలు కూడా స్వర్గానికి యజమానులుగా అవుతారు కదా. అందరూ సుఖముగా ఉంటారు. ఇప్పుడైతే అందరూ దుఃఖితులుగా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ మొదలైనవారికైతే రాత్రింబవళ్ళు చింత ఉంటూనే ఉంటుంది. యుద్ధము మొదలైనవాటిలో ఎంతమంది మరణిస్తూ ఉంటారు. మహాభారత యుద్ధము కూడా ప్రసిద్ధమైనదని మీకు తెలుసు. కానీ అందులో ఏమి జరిగింది అనేది ఎవరి బుద్ధిలోనూ లేదు. మీకు తండ్రి బుద్ధిలో కూర్చోబెట్టారు. మహాభారత యుద్ధములో అందరూ మరణించారు! ఇది ఎంత పెద్ద మనుష్య సృష్టి. ఆత్మల వృక్షము కూడా ఉంటుంది. వృక్షము ముందు కొత్తగా ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉంటుంది, తర్వాత వృద్ధి చెందుతూ ఉంటుంది. మొదట దైవీ ధర్మము ఉన్నప్పుడు ఎంత చిన్న వృక్షముండేది, ఆది సనాతన దేవతా ధర్మముండేదని మీకు తెలుసు. ఇప్పుడు ఎన్ని వెరైటీ ధర్మాలు ఉన్నాయి. ఈ మహాభారత యుద్ధము ద్వారా వాటన్నింటి వినాశనము జరగనున్నది. కానీ ఈ జ్ఞానము ఎవరిలోనూ లేదు. ఇది అదే యుద్ధమని అంటారు కానీ దీనితో ఏమి జరగనున్నది అనేది వారికి తెలియదు. మీరు ఇప్పుడు ప్రకాశములో ఉన్నారు. వినాశనము జరగనున్నదని మీకు తెలుసు. అందుకే మహాభారత యుద్ధానికి ముందే మీ వారసత్వాన్ని తీసుకోండి. విషయమైతే చాలా సహజమైనది. పవిత్రముగా అవ్వండి మరియు తండ్రిని స్మృతి చేయండి. చాలామంది కుమార్తెలపై అత్యాచారాలు జరుగుతాయి. ఒకరినొకరు రక్షించుకునేందుకు మాతలైన మీ సంగఠన ఉండాలి. కానీ దేహీ-అభిమానులుగా తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది. మేము పావనముగానైతే తప్పకుండా అవ్వాలి అనే పక్కా నషా ఉండాలి. ఇటువంటి నషాలో ఉండేవారే అర్థం చేయించగలరు. మనము తండ్రిని స్మృతి చేయాలి, పవిత్రముగా అవ్వాలి. మేము స్వదర్శన చక్రధారులము - ఈ నషా అయితే ఉండాలి. మనకు రచయిత అయిన తండ్రి గురించి మరియు రచన యొక్క చక్రము గురించి తెలుసు. ఇప్పుడు మనము తండ్రి నుండి కొత్త ప్రపంచమైన సత్యయుగ వారసత్వాన్ని తీసుకోవాలి. మనము 84 జన్మలను ఎలా తీసుకుంటాము, ఇది అర్థం చేయిస్తూ ఉండండి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు సమాప్తమైపోతాయి. పావనముగా అయితే తప్పకుండా అవ్వాలి. పావనము అనగా పవిత్రము. కామము మహాశత్రువు. మనము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసాము, ఇప్పుడు తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు రిఫ్రెష్ అయ్యేందుకే ఇక్కడకు వస్తారు. తండ్రినైన నన్ను స్మృతి చేయండి - 21 జన్మల వారసత్వాన్ని తీసుకోవాలి. ఎవరి పట్ల మోహమనే బంధము ఉండకూడదు. నష్టోమోహులుగా అవ్వాలి. ఈ శరీరము పట్ల కూడా మోహము ఉండకూడదు. ఇదైతే పాత తోలు (శరీరము). కానీ చదువు చదువుకునేందుకు వీలుగా దీనిని సంభాళించాల్సి ఉంటుంది. శరీరానికి కష్టము కలిగితే (వ్యాధులు వస్తే) అతుకులు వేయాల్సి ఉంటుంది. ఇది పాత కుళ్ళిపోయిన శరీరమని మీకు తెలుసు. దీనికి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. దుఃఖమనేది ఆత్మకు కలుగుతుంది. ఇప్పుడిక ఈ శరీరాన్ని వదలాలని మీకు తెలుసు. యోగబలముతో దీనిని నిలబెట్టాలి. తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి, అంతే. ఇతర లౌకిక సంబంధాలేవీ కూడా గుర్తుకు రాకూడదు. నేను దేహాన్ని కాదు, ఆత్మను. తండ్రి అంటారు - నేను ఆత్మలైన మీకు వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఆత్మ పవిత్రముగా ఉన్నప్పుడు ఇక శరీరము కూడా మంచిదే లభిస్తుంది.

ఇప్పుడు మన ఆత్మ పావనముగా అవ్వనున్నదని మీకు తెలుసు. మనము పావనముగా ఉన్నప్పుడు ఈ లక్ష్మీ-నారాయణుల వలె ఉండేవారము. ఈ లక్ష్మీ-నారాయణులు 84 జన్మలు తీసుకున్నారు. మొత్తము సూర్యవంశము వారందరూ 84 జన్మలు తీసుకున్నారు. చంద్రవంశీయులకు 84 జన్మలని అనరు. ఎవరైతే సూర్యవంశములో మొట్టమొదట దాస-దాసీలుగా అయ్యి ఉంటారో, వారు మళ్ళీ త్రేతాలో ఎంతోకొంత పదవిని పొందుతారు, వారివి 84 జన్మలు అంటారు. రాజా-రాణి, ప్రజలు, దాస-దాసీలు మొదలైనవారంతా, ఎవరైతే సూర్యవంశములోకి వస్తారో, వారే 84 జన్మలు తీసుకుంటారు. ఈ విధముగా మీతో మీరు మాట్లాడుకోవాలి. మనము 84 జన్మలను ఎలా తీసుకుంటాము అని విచార సాగర మంథనము చేయాలి. ఎంత వీలైతే అంత తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. నడుస్తూ-తిరుగుతూ కూడా మేము బాబా పిల్లలమని భావించండి. ఎవరు కలిసినా సరే, వారికి బాబా పరిచయాన్ని ఇవ్వాలి. ఈ చిత్రాలలో మొత్తం జ్ఞానమంతా ఉంది. అంతా అర్థం చేయించాలి. బాబా బ్రహ్మా తనువులోకి వచ్చి ఉన్నారు. మనమంతా బ్రహ్మాకుమార-కుమారీలము కదా. బ్రహ్మాకుమార-కుమారీలైన మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేయడానికి బాబా వచ్చి ఉన్నారు. ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. మనము బ్రహ్మాకుమార-కుమారీలము. మీ కార్డులను కూడా చూపించవచ్చు. ఎక్కడైనా ఆఫీసులు మొదలైన చోట్ల కూడా కార్డులు ఇవ్వండి, కానీ బి.కె.లు ఎవరు అనేది వారు అర్థం చేసుకోలేరు. అనేక రకాల విఘ్నాలు వస్తాయి. ఇది మా ఫ్యామిలీ అని గవర్నమెంట్ కు కూడా అర్థం చేయించడము జరుగుతుంది. దాదా మరియు బాబా ఉన్నారు. దాదా ద్వారా మనము వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఇది గుర్తు చేసుకున్నప్పుడు సంతోషముండాలి. ఆస్తి అయితే తాతగారిది. మనవలకు దానిపై హక్కు ఉంటుంది. అన్ని భాగాలను పంచుకుంటారు.

శివబాబా నుండి బ్రహ్మా ద్వారా మనము వారసత్వాన్ని తీసుకుంటామని మీకు కూడా తెలుసు. ఇది గుర్తుంచుకోవాలి. చదువుకోవాలి, మళ్ళీ చదివించాలి. పిల్లల పాలన చేయడమనేది తండ్రి బాధ్యత. కుమారులు, కుమారీలు మేజర్ అవ్వనంత వరకు తండ్రి వారిని సంభాళించాలి. పిల్లల పని చదువుకోవడము. తమ కాళ్ళపై తాము నిలబడేందుకు చదువుకుంటారు. బాబా మనల్ని 21 జన్మల కోసం చదివిస్తున్నారని మీకు తెలుసు. తర్వాత మన కాళ్ళపై మనము నిలబడతాము. ఎంతగా చదువుకుంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు. మేము శ్రీ లక్ష్మీ మరియు శ్రీ నారాయణునిగా అయ్యేందుకు ఇక్కడకు వచ్చామని మీరు స్వయంగా అంటారు. ఇది సత్యనారాయణుడి కథ కదా. ఈ లక్ష్మీ-నారాయణులు 84 జన్మలు ఎలా తీసుకుంటారు అనేది ఎవరికీ తెలియదు. రాధ భక్తులైతే రాధ అంతటా హాజరై ఉన్నారని అంటారు. ఎక్కడ చూసినా ‘రాధనే రాధ’, ‘శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడు’, ‘శివుడే శివుడని’ అంటారు. అంతా కలగాపులగము చేసేసారు. ఈశ్వరుడు, రాధ, శ్రీకృష్ణుడు అందరూ సర్వవ్యాపి అని, అవన్నీ ఈశ్వరుని రూపాలని, భగవంతుడు ఆ రూపాలను ధారణ చేసారని అంటారు. ఎక్కడ చూస్తే అక్కడ నీవే నీవు... అని అంటారు, పూర్తిగా వివేకహీనులుగా అయిపోయారు. ఇది వికారీ పతిత ప్రపంచము. సత్యయుగము నిర్వికారీ పావన ప్రపంచము. నిర్వికారీ ప్రపంచమంటే స్వర్గమని అర్థం. అక్కడ పిల్లలైతే ఉంటారు కదా, వారు ఎలా జన్మిస్తారని అడుగుతారు. కేవలం ఈ ప్రశ్ననే అడుగుతుంటారు. పిల్లలు జన్మించకపోతే సృష్టి ఎలా వృద్ధి చెందుతుంది అని అంటారు. ప్రతి సంవత్సరము ఎంతమంది మనుష్యులు పెరిగారు అని జనాభా లెక్కలు తీస్తారు. ఎంతమంది మరణించారు అనేది తెలపరు. పిల్లలు మొదట తమ కళ్యాణము చేసుకోవాలి. నేను ఆత్మను - ముందు ఇది నిశ్చయము చేసుకోండి. బాబాను స్మృతి చేయాలి. ఎవరైతే అంతిమ సమయములో నారాయణుడిని స్మరిస్తారో... అని అంటూ ఉంటారు, ఇప్పుడు నారాయణుడిని స్మరించడమనే మాట తప్పుగా వ్రాశారు. అంతిమ సమయములో ఎవరైతే శివబాబాను స్మరిస్తారో, ఆ చింతనతోనే ఎవరైతే మరణిస్తారో, వారే స్వర్గములో నారాయణుడిగా అవుతారు. అంతిమ సమయములో నారాయణుడి స్మరణ అని ఎందుకంటారు? శ్రీకృష్ణుడే జ్ఞానాన్ని ఇచ్చారని భావిస్తారు కావున శ్రీకృష్ణుడిని స్మరించాలి కదా అని అనుకుంటారు. శ్రీకృష్ణుడిని స్మరణ చేస్తారు. నారాయణుడి గురించి ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణ జయంతిని జరుపుకుంటారు, మరి రాధ జయంతి ఏమైంది? శ్రీకృష్ణుడి జన్మదినాన్ని జరుపుకుంటారు, మరి నారాయణుడి జన్మదినము? ప్రపంచము యొక్క రాజు-రాణి అయిన లక్ష్మీ-నారాయణుల గురించి ఎవరికీ తెలియనే తెలియదు. ప్రజాపిత బ్రహ్మాకు ముఖవంశావళి ఉంటారు కదా. వారు ఎక్కడికి వెళ్ళిపోయారు! బ్రాహ్మణ దేవీ-దేవతాయ నమః అని అంటారు. బ్రహ్మా ముఖవంశావళి ఉండేవారు కదా. బ్రహ్మా ద్వారా శివబాబా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారని పిల్లలు అర్థం చేసుకున్నారు. బ్రాహ్మణ ధర్మాన్ని బ్రహ్మా రచించలేదు, శివబాబా రచించారు. ఇప్పుడు వీరు బ్రహ్మాగా అయ్యారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పాత శరీరములో ఉంటూ చదువు చదువుకుని, 21 జన్మల కొరకు సంపాదించుకోవాలి, అందుకే దీనిని సంభాళించాలి. ఇకపోతే దీని పట్ల మోహము ఉంచుకోకూడదు.

2. ఎటువంటి అభ్యాసము చేయాలంటే అంతిమ సమయములో ఒక్క శివబాబాయే గుర్తుండాలి. ఇతర ఏ చింతనలోకి వెళ్ళకూడదు, తమ కళ్యాణము చేసుకోవాలి.

వరదానము:-
మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా అయి తెలియనితనాన్ని సమాప్తము చేసే జ్ఞాన స్వరూప, యోగయుక్త భవ

మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా అయ్యేవారిలో ఏ రకమైన తెలియనితనమూ ఉండదు, వారు - ఫలానా విషయము గురించి మాకు తెలియనే తెలియదు అని అంటూ తమను తాము విడిపించుకోలేరు. జ్ఞాన స్వరూపులైన పిల్లలలో ఏ విధమైన అజ్ఞానము ఉండదు మరియు ఎవరైతే యోగయుక్తులు ఉన్నారో, వారికి - ముందు నుండే అన్నీ తెలిసినట్లుగా అనుభవమవుతుంది. మాయ యొక్క ఆకర్షణలు తక్కువేమీ కాదని, మాయ కూడా చాలా శోభాయమానముగా ఉంటుందని, కావున దాని నుండి జాగ్రత్తగా ఉండాలని వారికి తెలుసు. ఎవరైతే అన్ని రూపాలలోనూ మాయకు చెందిన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో, వారు ఓటమిని పొందడము అసంభవము.

స్లోగన్:-
ఎవరైతే సదా ప్రసన్నచిత్తులుగా ఉంటారో, వారు ఎప్పుడూ ప్రశ్నచిత్తులుగా అవ్వలేరు.

అవ్యక్త ప్రేరణలు - జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి

యోగములో సదా లైట్ హౌస్ మరియు మైట్-హౌస్ స్థితిని అనుభవము చేయండి. జ్ఞానము లైట్ మరియు యోగము మైట్. జ్ఞానము మరియు యోగము - రెండు శక్తులూ లైట్ మరియు మైట్ సంపన్నముగా ఉండాలి, అటువంటివారిని మాస్టర్ సర్వశక్తివంతులు అని అంటారు. ఇటువంటి శక్తిశాలి ఆత్మలు ఎటువంటి పరిస్థితినైనా సెకండులో దాటివేస్తారు. వారికి సమయము పట్టదు.