25-01-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 02.04.2008


‘‘ఈ సంవత్సరము నాలుగు సబ్జెక్టులలోనూ అనుభవము యొక్క అథారిటీగా అవ్వండి, లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానముగా చేసుకోండి’’

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న సంతుష్టముగా ఉండే తమ సంతుష్టమణులను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి ముఖముపై సంతుష్టత యొక్క మెరుపు కనిపిస్తూ ఉంది. సంతుష్టమణులు స్వయానికి కూడా ప్రియులు, బాబాకు కూడా ప్రియులు మరియు పరివారానికి కూడా ప్రియులు ఎందుకంటే సంతుష్టత గొప్ప శక్తి. సంతుష్టత ఎప్పుడు ధారణ అవుతుందంటే సర్వ ప్రాప్తులు ప్రాప్తించినప్పుడు. ఒకవేళ ప్రాప్తులు తక్కువగా ఉన్నట్లయితే సంతుష్టత కూడా తక్కువగా ఉంటుంది. సంతుష్టత ఇతర శక్తులను కూడా ఆహ్వానిస్తుంది. సంతుష్టత యొక్క వాయుమండలము ఇతరులకు కూడా యథాశక్తి సంతుష్టత యొక్క వైబ్రేషన్లను ఇస్తుంది. ఎవరైతే సంతుష్టముగా ఉంటారో వారి గుర్తు ఏమిటంటే - వారు సదా ప్రసన్నచిత్తులుగా కనిపిస్తారు, వారి ముఖము సదా హర్షితముఖముగా స్వతహాగానే ఉంటుంది. సంతుష్ట ఆత్మ ఎదురుగా ఎటువంటి పరిస్థితి కూడా స్వస్థితిని కదిలించలేదు. ఎంతటి పెద్ద పరిస్థితి అయినా కానీ సంతుష్ట ఆత్మ కొరకు అది కార్టూన్ షోలా మనోరంజకముగా కనిపిస్తుంది, అందుకే వారు పరిస్థితిలో కలవరపడరు మరియు పరిస్థితి వారిపై దాడి చెయ్యలేదు, అది ఓడిపోతుంది. అందుకే అతీంద్రియ సుఖమయ మనోరంజకమైన జీవితాన్ని అనుభవము చేస్తారు. శ్రమ చెయ్యవలసిన అవసరము ఉండదు, మనోరంజకముగా అనుభవమవుతుంది. కావున ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడమైతే వచ్చు కదా! వచ్చు కదా? ఎవరికైతే స్వయాన్ని చెక్ చేసుకోవడము వచ్చో, ఇతరులను కాదు, స్వయాన్ని చెక్ చేసుకోవడము వచ్చో వారు చేతులెత్తండి. చెక్ చేసుకోవడము వచ్చా? అచ్ఛా. అభినందనలు.

బాప్ దాదా యొక్క వరదానము కూడా ప్రతి బిడ్డకు ప్రతిరోజూ అమృతవేళ భిన్న-భిన్న రూపాలలో ఏమని లభిస్తుందంటే - సంతోషముగా ఉండండి, సంపన్నముగా ఉండండి. ప్రతిరోజూ వరదానము అందరికీ లభిస్తుంది. బాప్ దాదా అందరికీ ఒకే విధముగా, ఒకేసారి వరదానాన్ని ఇస్తారు. కానీ తేడా ఏమిటి? నంబరువారుగా ఎందుకవుతున్నారు? దాత ఒక్కరే మరియు ఇవ్వడము కూడా ఒకే విధముగా ఇస్తారు, ఒకరికి కొద్దిగా, మరొకరికి ఎక్కువగా ఇవ్వరు, విశాల హృదయముతో ఇస్తారు, కానీ తేడా ఎక్కడ వస్తుంది? ఈ అనుభవము కూడా అందరికీ ఉంది ఎందుకంటే ఇప్పటికీ బాప్ దాదా వద్దకు ఒక మాట చేరుకుంటూనే ఉంది. అది ఏ మాట, తెలుసు కదా? ‘‘అప్పుడప్పుడు’’, ‘‘కొంచెం-కొంచెం’’ - ఈ మాట ఇప్పటికీ కూడా చేరుకుంటూనే ఉంది. బాప్ దాదా అన్నారు - బ్రాహ్మణ ఆత్మల జీవితము రూపీ డిక్షనరీ నుండి ఈ రెండు పదాలు తొలగిపోవాలి. తండ్రి అవినాశీ, ఖజానాలు అవినాశీ, మీరందరూ కూడా అవినాశీ శ్రేష్ఠ ఆత్మలు. కావున ఏ పదము ఉండాలి? అప్పుడప్పుడు అన్న పదమా లేక సదా అన్న పదమా? ప్రతి ఖజానా ముందు చెక్ చేసుకోండి - సర్వ శక్తులు సదా ఉన్నాయా? సర్వ గుణాలు సదా ఉన్నాయా? మీ అందరి భక్తులు మీ గుణగానాన్ని చేసేటప్పుడు ఏమంటారు? అప్పుడప్పుడూ గుణదాతలు అని అంటారా? బాప్ దాదా ప్రతి వరదానములోనూ ‘సదా’ అన్న పదాన్ని ఉపయోగించారు. సదా సర్వశక్తివంతులు అన్నారు, ఒక్కోసారి శక్తివంతులు, ఒక్కోసారి సర్వశక్తివంతులు అని అనలేదు. అన్నివేళలా రెండు పదాలను మీరు కూడా ఉపయోగిస్తారు, బాబా కూడా ఉపయోగిస్తారు, అదేమిటంటే - సమానముగా అవ్వండి. కొంచెం-కొంచెం సమానముగా అవ్వండి అని అనరు. సంపన్నముగా మరియు సంపూర్ణముగా అవ్వాలి. పిల్లలు అప్పుడప్పుడు ఏమి చేస్తుంటారు? బాప్ దాదా కూడా ఆటను చూస్తుంటారు కదా! పిల్లల ఆటనైతే చూస్తూనే ఉంటారు. పిల్లలు ఏమి చేస్తుంటారు, కొంతమంది పిల్లలు, అందరూ కాదు. ఏ వరదానమైతే లభించిందో ఆ వరదానము గురించి ఆలోచించి, వర్ణన చేసి పుస్తకములో నోట్ చేసుకుని, స్మృతి కూడా చేస్తారు, కానీ వరదానము రూపీ బీజాన్ని ఫలప్రదం చేసుకోరు. బీజము నుండి ఫలాన్ని పొందలేకపోతారు. కేవలం - ‘చాలా మంచి వరదానము’ అని వర్ణన చేస్తూ సంతోషపడిపోతూ ఉంటారు. వరదానము బీజము వంటిది కానీ బీజాన్ని ఎంతగా ఫలప్రదం చేసుకుంటారో అంతగా వారు వృద్ధిని పొందుతారు. ఫలప్రదం చేసుకోవాలంటే దానికి రహస్యము ఏమిటి? దానిని సమయానికి కార్యములో ఉపయోగించడము. కార్యములోకి తీసుకురావడము మర్చిపోతారు, కేవలం పుస్తకములో చూసుకుంటూ - చాలా బాగుంది, చాలా బాగుంది అని వర్ణిస్తూ ఉంటారు. బాబా చాలా మంచి వరదానాన్ని ఇచ్చారు. కానీ ఎందుకోసం ఇచ్చారు? దానిని ఫలప్రదం చేసుకోవడానికి ఇచ్చారు. బీజము నుండి ఫలము యొక్క విస్తారము జరుగుతుంది. వరదానాన్ని స్మరణ చేస్తారు, కానీ వరదానీ స్వరూపముగా కావడములో నంబరువారుగా అయిపోతారు. బాప్ దాదా ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూస్తూ హర్షిస్తూ ఉంటారు, కానీ బాప్ దాదా యొక్క హృదయములోని ఆశను ఇంతకుముందు కూడా వినిపించారు. అందరూ చేతులు కూడా ఎత్తారు. గుర్తుందా? ‘మేము కారణాన్ని సమాప్తము చేసి సమాధాన స్వరూపులుగా అవుతాము’. ఈ హోమ్ వర్క్ గుర్తుందా? కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణలో లేక ఉత్తరాలు, ఈ-మెయిల్స్ ద్వారా రిజల్టును వ్రాసారు కూడా. మంచిది. అటెన్షన్ అయితే పెట్టారు కానీ బాప్ దాదాకు ‘సదా’ అన్న ఈ పదమైతే ఇష్టమనిపిస్తుందో, అది ఉందా? మీరందరూ ఎవరైతే వచ్చారో, మీరు విని ఉన్నా లేక చదివి ఉన్నా కానీ ఒక్క నెల హోమ్ వర్క్ లో, ఒక్క నెల మాత్రమే అయ్యింది, ఎక్కువ అవ్వలేదు, ఒక్క నెల కోసం లక్ష్యమైతే పెట్టుకున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు కూడా, కానీ ఈ ఒక్క నెల హోమ్ వర్క్ లో ఎవరైతే మంచి మార్కులు తీసుకున్నారో వారు చేతులెత్తండి. ఎవరైతే పాస్ అయ్యారో, వారు పాస్ అయ్యారు. పాస్ విత్ ఆనర్ అయ్యారా? పాస్ విత్ ఆనర్ అయినవారు లేచి నిలబడండి. పాస్ విత్ ఆనర్ అయినవారిని దర్శనము చేసుకోవాలి కదా? మాతలు లేరా? సోదరీలు, టీచర్లు చేతులెత్తలేదు. ఎవ్వరూ లేరా? మధుబన్ వారు? ఇదైతే చాలా తక్కువ రిజల్టు. (చాలా కొద్దిమంది లేచారు) అచ్ఛా, సెంటర్లలో కూడా ఉండి ఉంటారు. అభినందనలు, చప్పట్లు అయితే కొట్టండి. బాప్ దాదా పట్ల ప్రేమ ఎవరికి ఉంది మరియు ఎంత ఉంది? అని బాప్ దాదా అడిగినప్పుడు బాప్ దాదా చిరునవ్వు నవ్వుతారు. అప్పుడు ఏమని జవాబు చెప్తారు? బాబా, ఎంత ప్రేమ ఉందంటే అది మేము చెప్పలేము అని అంటారు. జవాబు చాలా బాగా ఇస్తారు. బాప్ దాదా కూడా సంతోషపడిపోతారు. కానీ ప్రేమకు ఋజువు ఏమిటి? ఈ రోజుల్లోని ప్రపంచములో దేహాభిమానపు ప్రేమ ఉన్నవారైతే ప్రాణాన్ని కూడా బలిహారము చేసేస్తారు. మరి పరమాత్మ ప్రేమ ఉన్న చోట కష్టముగా ఎందుకు అనుభవము చేస్తున్నారు? బాబా చెప్పారు మరియు పిల్లలు చేసారు. బాబా, మేము సర్వస్వాన్ని బలిహారము చేసే దీపపు పురుగులము, మేము దీపముపై బలిహారమయ్యేవారము... అని పాటలైతే చాలా మంచి-మంచివి పాడుతారు, మరి ఈ ‘కారణము’ అన్న పదాన్ని స్వాహా చెయ్యలేరా?

ఇప్పుడైతే ఈ సంవత్సరములోని చివరి టర్న్ వచ్చేసింది. వచ్చే సంవత్సరములో ఏమవుతుంది అనేదైతే మీరు మరియు బాబా చూస్తూనే ఉన్నారు, చూస్తారు కూడా. కానీ ఈ ఒక్క పదాన్ని సమయాన్ని చూసి... సమయపు పిలుపు అని మీరు అంటారు కదా. భక్తుల పిలుపును, సమయపు పిలుపును, దుఃఖిత ఆత్మల పిలుపును, మీ స్నేహీ, సహయోగీ ఆత్మల పిలుపును మీరే పూర్తి చేస్తారు కదా! మీ టైటిల్ ఏమిటి? మీ కర్తవ్యము ఏమిటి? ఏ కర్తవ్యము కోసం బ్రాహ్మణులుగా అయ్యారు? విశ్వపరివర్తకులు అన్నది మీ టైటిల్. విశ్వపరివర్తన అన్నది మీ కార్యము మరియు ఇందులో మీకు తోడుగా ఉన్నది ఎవరు? బాప్ దాదాతోపాటు మీరు ఈ కార్యములో నిమిత్తముగా అయ్యారు. మరి ఏమి చేయాలి? ఇప్పుడు కూడా ‘చేస్తారా’ అని చేతులెత్తిస్తే అందరూ చేతులెత్తేస్తారు. లక్ష్యమునైతే పెట్టుకున్నారు. బాప్ దాదా చూసారు, పూర్తిగా ఈ సంవత్సరము యొక్క సీజన్ లో అందరూ సంకల్పమైతే చేసారు కానీ సఫలతకు తాళంచెవి - దృఢత... చెయ్యాల్సిందే... ఈ పదానికి బదులుగా ‘అప్పుడప్పుడు చేస్తున్నాము, నడుస్తున్నాము, చేసేస్తాములే అన్న ఈ సంకల్పాలు దృఢతను సాధారణముగా చేసేస్తాయి. దృఢత ఉన్నచోట కారణము అన్న మాటే రానే రాదు. నివారణ జరిగిపోతుంది. కారణాలు వస్తాయి కూడా కానీ చెకింగ్ ఉన్న కారణముగా, ఆ కారణము నివారణలోకి మారిపోతుంది.

బాప్ దాదా రిజల్టును చెక్ చేసినప్పుడు ఏమి చూసారు? జ్ఞానీ, యోగీ, ధారణా స్వరూపము, సేవాధారి - నాలుగు సబ్జెక్టులలోనూ ప్రతి ఒక్కరూ యథా శక్తి జ్ఞానీ కూడా, యోగీ కూడా, ధారణ కూడా చేస్తున్నారు, సేవ కూడా చేస్తున్నారు. కానీ నాలుగు సబ్జెక్టులలోనూ అనుభవీ స్వరూపముగా అవ్వటము, అనుభవము యొక్క అథారిటీగా అవ్వటము - ఇందులో లోటు కనిపించింది. అనుభవీ స్వరూపముగా ఉండాలి. జ్ఞాన స్వరూపములో కూడా అనుభవీ స్వరూపముగా ఉండాలి, అనగా జ్ఞానాన్ని నాలెడ్జ్ అని అన్నట్లయితే అనుభవీమూర్త ఆత్మలో నాలెడ్జ్ అనగా ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అన్న జ్ఞానము ఉంటుంది. నాలెడ్జ్ యొక్క లైట్ మరియు మైట్ ఉంటుంది. కావున అనుభవీ స్వరూపులు అనగా అర్థము ఏమిటంటే జ్ఞానీ ఆత్మ చేసే ప్రతి కర్మలో లైట్ మరియు మైట్ న్యాచురల్ గా ఉండాలి. జ్ఞానీ అనగా జ్ఞానాన్ని, నాలెడ్జ్ ను తెలుసుకోవడము, వర్ణన చేయడము, దానితో పాటుగా ప్రతి కర్మలోనూ లైట్ మైట్ ఉండాలి. అనుభవీ స్వరూపుల ద్వారా ప్రతి కర్మ న్యాచురల్ గా శ్రేష్ఠముగా ఉంటుంది మరియు సఫలమవుతుంది. శ్రమ చెయ్యవలసిన అవసరము ఉండదు ఎందుకంటే వారు జ్ఞానము యొక్క అనుభవీ మూర్తులు. అనుభవము యొక్క అథారిటీ అన్ని అథారిటీలలో కల్లా శ్రేష్ఠమైనది. జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మరియు జ్ఞానపు అనుభవీ స్వరూపము యొక్క అథారిటీతో ప్రతి కర్మను చెయ్యడానికి తేడా ఉంది. మరి మీరు అనుభవీ స్వరూపులేనా? నాలుగు సబ్జెక్టులలోనూ చెక్ చేసుకోండి. నేను ఆత్మను, కానీ అనుభవీ స్వరూపముగా అయి ప్రతి కర్మను చేస్తున్నారా? అనుభవము యొక్క అథారిటీ అనే సీట్ పై సెట్ అయినట్లయితే అథారిటీ ఎదురుగా శ్రేష్ఠ కర్మలు, సఫలత స్వరూప కర్మలు న్యాచురల్ నేచర్ గా కనిపిస్తాయి. ఆలోచిస్తారు కానీ అనుభవీ స్వరూపులుగా అవ్వాలి, యోగయుక్తమైన రహస్యయుక్తమైన నేచర్ గా అవ్వాలి, న్యాచురల్ గా అవ్వాలి. ధారణలో కూడా సర్వ గుణాలు స్వతహాగానే ప్రతి కర్మలోనూ కనిపించాలి. ఇటువంటి అనుభవీ స్వరూపములో సదా ఉండటము, అనుభవము అనే సీట్ పై సెట్ అవ్వటము, ఈ ఆవశ్యకత పట్ల అటెన్షన్ పెట్టటము, ఇది అవసరము. అనుభవము యొక్క అథారిటీ అనే సీట్ చాలా గొప్పది. అనుభవీని మాయ కూడా అంతము చెయ్యలేదు ఎందుకంటే మాయ యొక్క అథారిటీ కన్నా అనుభవము యొక్క అథారిటీ పదమాల రెట్లు ఉన్నతమైనది. ఆలోచించడము వేరు, మననము చెయ్యడము వేరు, కానీ అనుభవీ స్వరూపముగా అయి నడుచుకోవడము, ఇప్పుడు దీని అవసరము ఉంది.

మరి ఇప్పుడు ఈ సంవత్సరము ఏమి చేస్తారు? బాప్ దాదా చూసారు - ఒక సబ్జెక్ట్ లో మెజారిటీ పాస్ అయి ఉన్నారు. అది ఏ సబ్జెక్ట్? సేవా సబ్జెక్ట్. నలువైపుల నుండి బాప్ దాదా వద్దకు సేవా రికార్డులు చాలా మంచి-మంచిగా వచ్చాయి మరియు సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలు ఈ సంవత్సరపు సేవా సమాచారాల ప్రకారము మంచిగా కనిపించింది. ప్రతి వర్గమువారు, ప్రతి జోన్ వారు భిన్న-భిన్న రూపాలలో సేవలో సఫలతను ప్రాప్తి చేసుకున్నారు. దీని కోసం బాప్ దాదా ప్రతి జోన్ కు, ప్రతి వర్గానికి పదమాల, పదమాల రెట్లు అభినందనలు ఇస్తున్నారు. అభినందనలు. ప్లాన్లు కూడా మంచి-మంచివి తయారుచేసారు. కానీ ఇప్పుడు సమయమనుసారముగా ఇది అకస్మాత్తు యొక్క సీజన్. ఈ సంవత్సరములో ఎంతమంది బ్రాహ్మణులు అకస్మాత్తుగా వెళ్ళిపోయారో మీరు విని ఉంటారు, చూసి ఉంటారు. కావున అకస్మాత్తు అనే గంట కొట్టడము ఇప్పుడు మరింత వేగము పుంజుకుంటుంది. ఆ అనుసారముగా ఇప్పుడు ఈ సంవత్సరములో ‘నాలుగు సబ్జెక్టులలోనూ నేను అనుభవీ స్వరూపముగా ఎంతవరకు అయ్యాను’, ఎందుకంటే నాలుగు సబ్జెక్టులలోనూ మంచి మార్కులు కావాలి. ఒకవేళ ఒక్క సబ్జెక్టులోనైనా పాస్ మార్కులకన్నా తక్కువ వచ్చినట్లయితే పాస్ విత్ ఆనర్ గా, మాలలోని మణులుగా, బాప్ దాదా మెడలోని హారముగా ఎలా అవుతారు! ఏ రూపములోనైనా ఓటమి పొందేవారు బాబా మెడలోని హారముగా అవ్వలేరు. ఇక్కడ చేతులు ఎత్తించినప్పుడు అందరూ ఏమని చెప్తారు? లక్ష్మీ-నారాయణులుగా అవుతాము అని అంటారు. సరే, లక్ష్మీ-నారాయణులు లేక లక్ష్మీ-నారాయణుల వరివారములోని సహచరులు, అలా కావడము కూడా శ్రేష్ఠ పదవియే, అందుకే బాప్ దాదా కేవలం ఒక్క మాట చెప్తున్నారు, అదేమిటంటే - ఇప్పుడు తీవ్రగతితో ఎగిరే కళలో ఎగురుతూ ఉండండి మరియు మీ ఎగిరే కళ యొక్క వైబ్రేషన్లతో వాయుమండలములో సహయోగము యొక్క వాయుమండలాన్ని వ్యాపింపజేయండి. ప్రకృతిని కూడా మేము పరివర్తన చేసే తీరుతాము అని ప్రకృతి విషయములో మీరందరూ ఛాలెంజ్ చేసారు కదా? చేసారు కదా ప్రతిజ్ఞ? ప్రతిజ్ఞ చేసారా? చేసారా? తల ఊపండి, చేతులు కాదు. మరి అటువంటప్పుడు మీ తోటి మనుష్యాత్మలను దుఃఖము మరియు అశాంతి నుండి పరివర్తన చేయలేరా? ఒకటేమో, మీరు ఛాలెంజ్ చేసారు మరియు రెండవది, బాప్ దాదాకు కూడా ప్రతిజ్ఞ చేసారు - మేమందరమూ ఇప్పుడు కూడా మీ కార్యములో మీతోపాటు ఉన్నాము, పరంధామములో కూడా మీతోపాటు ఉంటాము మరియు రాజ్యములో కూడా బ్రహ్మాబాబాతోపాటు ఉంటాము. ఈ ప్రతిజ్ఞను చేసారు కదా! కావున కలిసి వెళ్తాము, కలిసి ఉంటాము మరియు ఇప్పుడు కూడా కలిసి ఉన్నాము. మరి బాబా ఇస్తున్న సూచనలను సమయమనుసారముగా ప్రాక్టికల్ గా చూస్తూనే ఉన్నారు - అకస్మాత్తు, ఎవర్రెడీ. దాదీ వెళ్ళిపోతారు అని దాదీ గురించి ఆలోచించగలిగారా? అకస్మాత్తుగా జరిగిన ఆటను చూసారు కదా.

కావున ఈ సంవత్సరము ఎవర్రెడీ. బాబా హృదయములోని ఆశలను పూర్తి చేసే ఆశా దీపాలుగా అవ్వాల్సిందే. బాబా యొక్క ఆశలు గురించైతే మీకు తెలుసు కదా! తయారవ్వాలా లేక తయారైపోతాములే, చూద్దాములే...అని అనుకుంటున్నారా! తయారవ్వాల్సిందే అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. చూడండి, కెమెరాలో వస్తోంది. బాప్ దాదానైతే చాలా బాగా సంతోషపెడతారు. బాప్ దాదా కూడా పిల్లలు లేకుండా ఒంటరిగా వెళ్ళలేరు. చూడండి, బ్రహ్మాబాబా కూడా ముక్తి ద్వారాలను తెరవడానికి పిల్లలైన మీ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అడ్వాన్స్ పార్టీ కూడా ఎదురుచూస్తోంది. మీరు ఏర్పాట్లు చేసేవారు. మీరు ఎదురుచూసేవారు కాదు, ఏర్పాట్లు చేసేవారు. కావున ఈ సంవత్సరము లక్ష్యము పెట్టుకోండి కానీ లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానముగా పెట్టుకోండి. లక్ష్యము చాలా ఉన్నతముగా మరియు లక్షణాలలో బలహీనముగా ఉండకూడదు. లక్ష్యము మరియు లక్షణాలు సమానముగా ఉండాలి. ఎప్పుడైతే లక్ష్యము మరియు లక్షణాలు సమానముగా అవుతాయో, అప్పుడే - సమానముగా అవ్వాలి అన్న మీ ఆశ ఏదైతే ఉందో, అది పూర్తవుతుంది. లక్ష్యానికి మరియు లక్షణాలకు మధ్యన ఇప్పుడు కొంచెం-కొంచెం తేడా వచ్చేస్తూ ఉంటుంది. ప్లాన్లు చాలా బాగా తయారుచేస్తారు, పరస్పరములో ఆత్మిక సంభాషణను కూడా చాలా బాగా చేసుకుంటారు, ఒకరికొకరు అటెన్షన్ ను కూడా ఇచ్చుకుంటూ ఉంటారు. దృఢత మా జన్మ సిద్ధ అధికారము అని ఇప్పుడు ఈ సంకల్పాన్ని అనుభవ స్వరూపములోకి తీసుకురండి. చెక్ చేసుకోండి - ఏదైతే చెప్తున్నారో దానిని అనుభవము కూడా చేస్తున్నారా? మొదటి మాట ‘నేను ఆత్మను’, దీనినే చెక్ చేసుకోండి. ఈ ఆత్మ స్వరూపము యొక్క అనుభవము యొక్క అథారిటీనా? ఎందుకంటే అనుభవము యొక్క అథారిటీ నంబర్ వన్. అచ్ఛా! ఎటువంటి పరిస్థితిలోనైనా స్వ స్థితిలో స్థితి అయ్యి ఉండగలరా?

మనసు యొక్క ఏకాగ్రత (డ్రిల్). మంచిది. మూడు బిందువుల స్మృతి స్వరూపులుగా అవ్వగలరు కదా! ఫుల్ స్టాప్, అంతే. అచ్ఛా!

ఇప్పుడు ఒక్క సెకండులో మీ శ్రేష్ఠ స్వమానమైన బాప్ దాదా హృదయ సింహాసనాధికారిని... ఈ ఆత్మిక స్వమానము యొక్క నషాలో స్థితులవ్వండి. నేను సింహాసనాధికారి ఆత్మను, ఈ అనుభవములో లవలీనులైపోండి. అచ్ఛా!

నలువైపులా ఉన్న అతి ప్రియమైనవారు, సదా బాబా ప్రేమలో లీనమయ్యేవారు, సదా స్వమానధారీ, స్వరాజ్యాధికారీ విశేష ఆత్మలకు, నలువైపులా ఉల్లాస-ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరేవారికి మరియు తమ మనసు యొక్క వైబ్రేషన్లతో వాయుమండలాన్ని శాంతిగా, శ్రేష్ఠముగా తయారుచేసేవారందరికీ, బాబా సందేశాన్ని ఇచ్చి దుఃఖము నుండి విడిపించి ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించేవారికి, సదా దృఢత ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునేవారికి, ఈ విధముగా నలువైపులా హృదయానికి సమీపముగా ఉన్నవారికి మరియు సమ్ముఖములో వచ్చిన పిల్లలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ మరియు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు, ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-
ధర్మము మరియు కర్మ, ఈ రెండింటి యొక్క సరైన బ్యాలెన్స్ ను ఉంచే దివ్యమైన మరియు శ్రేష్ఠమైన వివేకవంతులుగా కండి

కర్మ చేసే సమయములో ధర్మము అనగా ధారణ కూడా సంపూర్ణముగా ఉండాలి. ధర్మము మరియు కర్మ, ఈ రెండింటి బ్యాలెన్స్ సరిగ్గా ఉండటము ద్వారా ప్రభావము పెరుగుతుంది. కర్మ సమాప్తమైపోయిన తర్వాత ధారణ స్మృతిలోకి రావటము కాదు. బుద్ధిలో ఈ రెండు విషయాల బ్యాలెన్స్ సరిగ్గా ఉండాలి, అప్పుడే శ్రేష్ఠమైన మరియు దివ్యమైన వివేకవంతులు అని అంటారు, లేకపోతే సాధారణ బుద్ధి ఉంటుంది, కర్మలు కూడా సాధారణముగా, ధారణలు కూడా సాధారణముగానే ఉంటాయి. సాధారణతలో సమానతను తీసుకురాకూడదు, శ్రేష్ఠతలో సమానత ఉండాలి. ఏ విధముగా కర్మలు శ్రేష్ఠముగా ఉన్నాయో అలా ధారణలు కూడా శ్రేష్ఠముగా ఉండాలి.

స్లోగన్:-
మీ మనసు-బుద్ధిని అనుభవము అనే సీట్ పై సెట్ చేసినట్లయితే ఇక ఎప్పుడూ అప్సెట్ (డిస్టర్బ్) అవ్వరు.

అవ్యక్త ప్రేరణలు - ఈ అవ్యక్త మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవము చేయండి

జ్ఞాన స్వరూపులుగా, మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా, మాస్టర్ సర్వశక్తివంతులుగా అయిన తర్వాత ఒకవేళ యుక్తియుక్తముగా లేనటువంటి కర్మను ఏదైనా చేసినట్లయితే, ఆ కర్మ యొక్క బంధనము అజ్ఞానకాలములోని కర్మ బంధనము కంటే పదమాల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ కారణము వలన బంధనములో చిక్కుకున్న ఆత్మ స్వతంత్రముగా లేని కారణముగా ఏది అనుకుంటే అది చేయలేకపోతుంది, అందుకే యుక్తియుక్త కర్మల ద్వారా ముక్తిని ప్రాప్తి చేసుకోండి.