25-02-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు, మీరే భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు, కనుక మీకు మీ బ్రాహ్మణ జాతి యొక్క నషా ఉండాలి’’

ప్రశ్న:-
సత్యమైన బ్రాహ్మణుల యొక్క ముఖ్యమైన గుర్తులు ఏమిటి?

జవాబు:-
1. సత్యమైన బ్రాహ్మణులది ఈ పాత ప్రపంచము నుండి లంగరు ఎత్తి వేయబడి ఉంటుంది. వారు ఈ ప్రపంచము యొక్క తీరాన్ని వదిలిపెట్టినట్లుగా ఉంటారు. 2. సత్యమైన బ్రాహ్మణులనగా, వారు చేతులతో పని చేస్తూ ఉంటారు మరియు బుద్ధి సదా తండ్రి స్మృతిలో ఉంటుంది అంటే కర్మయోగులుగా ఉంటారు. 3. బ్రాహ్మణులనగా కమలపుష్ప సమానముగా ఉంటారు. 4. బ్రాహ్మణులనగా సదా ఆత్మాభిమానులుగా ఉండే పురుషార్థాన్ని చేసేవారు. 5. బ్రాహ్మణులనగా కామమనే మహాశత్రువుపై విజయము ప్రాప్తి చేసుకునేవారు.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలనగా ఎవరు? ఈ బ్రాహ్మణులు. మనము బ్రాహ్మణులమని, దేవతలుగా తయారవ్వనున్నామని ఎప్పుడూ మర్చిపోకండి, వర్ణాలను కూడా గుర్తు ఉంచుకోవలసి ఉంటుంది. ఇక్కడ మీరు పరస్పరము అంతా బ్రాహ్మణులే. బ్రాహ్మణులను అనంతమైన తండ్రి చదివిస్తారు, ఈ బ్రహ్మా చదివించరు. శివబాబా బ్రహ్మా ద్వారా చదివిస్తారు. బ్రాహ్మణులనే చదివిస్తారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవీ-దేవతలుగా అవ్వలేరు. వారసత్వము శివబాబా నుండి లభిస్తుంది. ఆ శివబాబా అయితే అందరికీ తండ్రి. ఈ బ్రహ్మాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. లౌకిక తండ్రి అయితే అందరికీ ఉంటారు. పారలౌకిక తండ్రిని భక్తి మార్గములో తలచుకుంటారు. వీరు అలౌకిక తండ్రి అని, వీరి గురించి ఎవ్వరికీ తెలియదని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బ్రహ్మా యొక్క మందిరముంది, ఇక్కడ కూడా ప్రజాపిత అయిన ఆదిదేవుని మందిరముంది. వీరిని కొంతమంది మహావీర్ అని అంటారు, దిల్ వాలా (మనసున్నవారు) అని కూడా అంటారు, కానీ వాస్తవానికి మనసును గెలుచుకునేవారు శివబాబా, అంతేకానీ ప్రజాపిత అయిన ఆదిదేవ్ బ్రహ్మా కాదు. ఆత్మలందరినీ సదా సుఖవంతులుగా చేసేవారు, సంతోషపరిచేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇది కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు. ప్రపంచములోని మనుష్యులకు ఏమీ తెలియదు. వారు తుచ్ఛ బుద్ధి కలవారిగా ఉన్నారు. బ్రాహ్మణులమైన మనమే శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఈ విషయాన్ని మీరు కూడా ఘడియ, ఘడియ మర్చిపోతారు. స్మృతి అనేది చాలా సహజము. యోగమనే పదాన్ని సన్యాసులు పెట్టారు. మీరైతే తండ్రిని స్మృతి చేస్తారు. యోగమనేది సామాన్యమైన పదము. దీనిని యోగాశ్రమము అని కూడా అనరు, ఎందుకంటే ఇక్కడ తండ్రి మరియు పిల్లలు కూర్చుని ఉన్నారు. పిల్లల కర్తవ్యము అనంతమైన తండ్రిని స్మృతి చేయడము. మనము బ్రాహ్మణులము, మనము బ్రహ్మా ద్వారా తాతగారి నుండి వారసత్వము తీసుకుంటున్నాము, అందుకే శివబాబా అంటారు, ఎంత వీలైతే అంత స్మృతి చేస్తూ ఉండండి. చిత్రాలను కూడా మీ వద్ద పెట్టుకోండి, అప్పుడు స్మృతి ఉంటుంది. మనము బ్రాహ్మణులము, తండ్రి నుండి వారసత్వము తీసుకుంటాము. బ్రాహ్మణులు ఎప్పుడైనా తమ జాతిని మర్చిపోతారా. మీరు శూద్రుల సాంగత్యములోకి రావడముతో మీ బ్రాహ్మణత్వమును మర్చిపోతారు. బ్రాహ్మణులైతే దేవతల కన్నా ఉన్నతమైనవారు, ఎందుకంటే బ్రాహ్మణులైన మీరు నాలెడ్జ్ ఫుల్. భగవంతుడిని జానీజాననహార్ (అన్నీ తెలిసినవారు) అని అంటారు కదా, దీని అర్థం కూడా తెలియదు. అలాగని అందరి హృదయాలలో ఏముంది అనేది వారు కూర్చుని చూస్తారని కాదు. అలా కాదు, వారికి సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. వారు బీజరూపుడు. వారికి వృక్షము యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. అటువంటి తండ్రిని చాలా స్మృతి చేయాలి. వీరి (బ్రహ్మా) ఆత్మ కూడా ఆ తండ్రిని స్మృతి చేస్తుంది. ఆ తండ్రి అంటారు - ఈ బ్రహ్మా కూడా నన్ను స్మృతి చేస్తారు, అందుకే ఈ పదవిని పొందుతారు. మీరు కూడా స్మృతి చేస్తేనే పదవిని పొందుతారు. మొట్టమొదట మీరు అశరీరిగా వచ్చారు, మళ్ళీ అశరీరిగా అయ్యి తిరిగి వెళ్ళాలి. మిగిలినవారంతా మీకు దుఃఖాన్ని ఇచ్చేవారు, అటువంటివారిని ఎందుకు స్మృతి చేస్తారు. నేను మీకు లభించాను కదా, నేను మిమ్మల్ని కొత్త ప్రపంచములోకి తీసుకువెళ్ళడానికి వచ్చాను. అక్కడ ఎటువంటి దుఃఖము ఉండదు. అక్కడ ఉన్నవి దైవీ సంబంధాలు. ఇక్కడ మొట్టమొదట భార్య-భర్తల సంబంధములో దుఃఖముంటుంది, ఎందుకంటే వికారులుగా అవుతారు. మిమ్మల్ని ఇప్పుడు నేను ఎటువంటి ప్రపంచానికి యోగ్యులుగా తయారుచేస్తానంటే అక్కడ వికారాల విషయము ఉండదు. కామమును మహాశత్రువని అంటారు, అది ఆదిమధ్యాంతాలు దుఃఖము ఇస్తుంది. క్రోధము కోసం అది ఆదిమధ్యాంతాలు దుఃఖము ఇస్తుందని అనరు. అలా అనరు. కామమును జయించాలి. అదే ఆదిమధ్యాంతాలు దుఃఖము ఇస్తుంది, పతితులుగా చేస్తుంది. పతితులు అన్న పదము వికారులకు ఉపయోగిస్తారు. ఈ శత్రువుపై విజయము పొందాలి. మనము స్వర్గము యొక్క దేవీ-దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. ఈ నిశ్చయము ఏర్పడనంతవరకు ఏమీ పొందలేరు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మనసా-వాచా-కర్మణా ఏక్యురేట్ గా తయారవ్వాలి. ఇందులో శ్రమ ఉంది. మీరు భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారని ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు, మున్ముందు అర్థం చేసుకుంటారు. ఒకే ప్రపంచము, ఒకే రాజ్యము, ఒకే ధర్మము, ఒకే భాష ఉండాలని కోరుకుంటారు కూడా. సత్యయుగములో నేటికి 5 వేల సంవత్సరాల క్రితము ఒకే రాజ్యము, ఒకే ధర్మము ఉండేదని, దానిని స్వర్గమని అంటారని మీరు అర్థం చేయించవచ్చు. రామ రాజ్యము మరియు రావణ రాజ్యము గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. 100 శాతము తుచ్ఛ బుద్ధి కలవారి నుండి ఇప్పుడు మీరు స్వచ్ఛమైన బుద్ధి కలవారిగా నంబరువారు పురుషార్థానుసారముగా తయారవుతారు. తండ్రి కూర్చుని మిమ్మల్ని చదివిస్తారు. మీరు కేవలం తండ్రి మతముపై నడవండి. తండ్రి అంటారు - పాత ప్రపంచములో ఉంటూ కమలపుష్ప సమానముగా పవిత్రముగా ఉండండి, నన్ను స్మృతి చేస్తూ ఉండండి. తండ్రి ఆత్మలకే అర్థం చేయిస్తారు. నేను ఈ కర్మేంద్రియాల ద్వారా ఆత్మలను చదివించడానికే వచ్చాను. ఆత్మలైన మీరు కూడా కర్మేంద్రియాల ద్వారా వింటారు. పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇదైతే పాత ఛీ-ఛీ శరీరము. బ్రాహ్మణులైన మీరు పూజకు యోగ్యులు కారు. మీరు మహిమా యోగ్యులు, పూజకు యోగ్యులు దేవతలు. మీరు శ్రీమతముపై విశ్వాన్ని పవిత్రముగా, స్వర్గముగా తయారుచేస్తారు, అందుకే మీకు మహిమ ఉంది. మీకు పూజ జరగడానికి లేదు. మహిమ కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఉంది, అంతేకానీ దేవతలకు లేదు. తండ్రి మిమ్మల్నే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేస్తారు. జగదంబ మరియు బ్రహ్మా మొదలైనవారి మందిరాలను నిర్మిస్తారు కానీ వారెవరు అనేది నిర్మించినవారికి తెలియదు. జగత్పిత అయితే బ్రహ్మాయే కదా, వారిని దేవత అని అనరు. దేవతల ఆత్మ మరియు శరీరము, రెండూ పవిత్రముగా ఉంటాయి. ఇప్పుడు మీ ఆత్మ పవిత్రముగా అవుతూ ఉంటుంది. శరీరము పవిత్రముగా లేదు. ఇప్పుడు మీరు ఈశ్వరుని మతముపై భారత్ ను స్వర్గముగా తయారుచేస్తున్నారు. మీరు కూడా స్వర్గానికి యోగ్యులుగా అవుతున్నారు. సతోప్రధానముగా తప్పకుండా అవ్వాలి. కేవలం బ్రాహ్మణులైన మిమ్మల్ని మాత్రమే తండ్రి కూర్చొని చదివిస్తారు. బ్రాహ్మణుల వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. ఏ బ్రాహ్మణులైతే పక్కాగా అయిపోతారో, వారు వెళ్ళి తర్వాత దేవతలుగా అవుతారు. ఇది కొత్త వృక్షము. మాయ తుఫానులు కూడా వస్తాయి. సత్యయుగములో ఎటువంటి తుఫానులు రావు. ఇక్కడ మాయ తండ్రి స్మృతిలో ఉండనివ్వదు. బాబా స్మృతిలో ఉండాలని, తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలని మనము కోరుకుంటాము. అంతా స్మృతిపైనే ఆధారపడి ఉంది. భారత్ యొక్క ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది. ఎవరైనా వచ్చి ప్రాచీన యోగాన్ని నేర్పించాలని విదేశీయులు కూడా కోరుకుంటారు. ఇప్పుడు యోగము కూడా రెండు రకాలుగా ఉంటుంది - ఒక రకము వారు హఠయోగులు, రెండవ రకము వారు రాజయోగులు. మీరు రాజయోగులు. ఇది భారత్ యొక్క ప్రాచీన రాజయోగము, దీనిని తండ్రియే నేర్పిస్తారు. కేవలం గీతలో నా పేరుకు బదులుగా శ్రీకృష్ణుని పేరును వేసారు, దానితో ఎంత తేడా వచ్చేసింది. శివజయంతి జరిగితే మీ వైకుంఠ జయంతి కూడా జరుగుతుంది, అక్కడ శ్రీకృష్ణుని రాజ్యముంటుంది. శివబాబా జయంతి జరిగినప్పుడు గీతా జయంతి కూడా జరుగుతుందని మీకు తెలుసు. వైకుంఠ జయంతి కూడా జరుగుతుంది, అక్కడ మీరు పవిత్రముగా ఉంటారు. కల్పక్రితము వలె స్థాపన చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. స్మృతి చేయకపోతే మాయ ఏదో ఒక వికర్మ చేయిస్తుంది. స్మృతి చేయలేదు అంటే చెంపదెబ్బ తగులుతుంది. స్మృతిలో ఉంటే చెంపదెబ్బ తినరు. ఇక్కడ బాక్సింగ్ జరుగుతుంది. మన శత్రువు మనిషేమీ కాదని, మన శత్రువు రావణుడని మీకు తెలుసు.

తండ్రి అంటారు, ఈ సమయములో వివాహము చేసుకోవడమంటే నాశనము చేసుకోవడమే, ఒకరినొకరు నాశనము చేసుకుంటారు (పతితముగా చేసుకుంటారు). ఇప్పుడు పారలౌకిక తండ్రి ఆజ్ఞను జారీ చేసారు - పిల్లలూ, ఈ కామము మహాశత్రువు, దీనిపై విజయము పొందండి మరియు పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేయండి. ఎవ్వరూ పతితముగా అవ్వకూడదు. జన్మజన్మలుగా మీరు ఈ వికారాల వలన పతితముగా అయ్యారు, అందుకే కామము మహాశత్రువని అంటారు. పతిత-పావనా రండి అని సాధు-సన్యాసులందరూ అంటారు. సత్యయుగములో పతితులెవ్వరూ ఉండరు. తండ్రి వచ్చి జ్ఞానముతో సర్వులకు సద్గతినిస్తారు, ఇప్పుడు అందరూ దుర్గతిలో ఉన్నారు. జ్ఞానాన్ని ఇచ్చేవారు ఎవ్వరూ లేరు. జ్ఞానాన్ని ఇచ్చేవారు ఒక్క జ్ఞానసాగరుడు మాత్రమే. జ్ఞానముతో పగలు ఏర్పడుతుంది. పగలు రాముడిది, రాత్రి రావణుడిది. ఈ పదాల యొక్క యథార్థమైన అర్థం కూడా పిల్లలైన మీకు అర్థం చేసుకుంటారు. కేవలం పురుషార్థములో బలహీనముగా ఉన్నారు. తండ్రి అయితే చాలా మంచి రీతిలో అర్థం చేయిస్తారు. మీరు 84 జన్మలను పూర్తి చేసారు, ఇప్పుడు పవిత్రముగా అయి తిరిగి వెళ్ళాలి. మీకైతే శుద్ధమైన అహంకారము ఉండాలి. ఆత్మలమైన మనము తండ్రి మతముపై ఈ భారత్ ను స్వర్గముగా తయారుచేస్తున్నాము, ఆ స్వర్గములో మళ్ళీ రాజ్యము చేస్తాము. ఎంత కృషి చేస్తే, అంతటి పదవిని పొందుతారు. రాజా-రాణులుగా అయినా అవ్వండి లేదా ప్రజలుగా అయినా అవ్వండి. రాజా-రాణులుగా ఎలా తయారవుతారు అనేది కూడా మీరు చూస్తున్నారు. ఫాలో ఫాదర్ అని అంటూ ఉంటారు, అది ఇప్పటి విషయమే. ఈ మాట లౌకిక సంబంధము కోసము అనరు. ఈ తండ్రి డైరెక్షన్ ఇస్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మనము ఇప్పుడు శ్రీమతముపై నడుస్తున్నామని మీరు భావిస్తారు. ఎంతోమందికి సేవ చేస్తారు. పిల్లలు తండ్రి వద్దకు వచ్చినప్పుడు, శివబాబా కూడా జ్ఞానముతో ఆహ్లాదపరుస్తారు. వీరు (బ్రహ్మా) కూడా నేర్చుకుంటున్నారు కదా. శివబాబా అంటున్నారు, నేను ఉదయాన్నే వస్తాను. అచ్ఛా, ఆ తర్వాత ఎవరైనా కలుసుకునేందుకు వస్తే వీరు (బ్రహ్మా) అర్థం చేయించరా. బాబా, మీరు వచ్చి అర్థం చేయించండి, నేను అర్థం చేయించలేను అని వీరు ఈ విధముగా అంటారా ఏమిటి. ఇవి చాలా గుప్తమైన, గుహ్యమైన విషయాలు కదా. నేనైతే అందరికన్నా బాగా అర్థం చేయించగలను. శివబాబాయే అర్థం చేయిస్తారని, బ్రహ్మా అర్థం చేయించరని మీరెందుకు ఇలా అనుకుంటారు. కల్పక్రితము వీరు అర్థం చేయించారు కావుననే ఈ పదవిని పొందారని కూడా మీకు తెలుసు. మమ్మా కూడా అర్థం చేయించేవారు కదా. ఆమె కూడా ఉన్నత పదవిని పొందుతారు. మమ్మా-బాబాలను సూక్ష్మవతనములో చూస్తారు, కనుక పిల్లలు ఫాలో ఫాదర్ చేయాలి. సరెండర్ (సమర్పణ) కూడా పేదవారే అవుతారు, షావుకార్లు అవ్వలేరు. బాబా, ఇదంతా మీదే అని పేదవారే అంటారు. శివబాబా అయితే దాత. వారెప్పుడూ తీసుకోరు. ఇదంతా మీదేనని పిల్లలతో అంటారు. నేను నా కోసం మహళ్ళను ఇక్కడా నిర్మించుకోను, అలాగే అక్కడ కూడా నిర్మించుకోను. మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను. ఇప్పుడు ఈ జ్ఞాన రత్నాలతో జోలెను నింపుకోవాలి. నా జోలెను నింపండి అని మందిరాలకి వెళ్ళి అంటారు. కానీ అది ఏ రకమైన జోలె, దేనితో జోలెను నింపుకోవాలి... అనేది తెలియదు, జోలెను నింపేవారైతే లక్ష్మి కదా, ఆమె ధనాన్ని ఇస్తారు. శివుని వద్దకైతే వెళ్ళరు, శంకరుని వద్దకు వెళ్ళి అలా అంటారు. శివుడు మరియు శంకరుడు ఒక్కరేనని భావిస్తారు కానీ అలా కాదు.

తండ్రి వచ్చి సత్యమైన విషయాలను తెలియజేస్తారు. తండ్రి ఉన్నదే దుఃఖహర్త, సుఖకర్త. పిల్లలైన మీరు గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి, వ్యాపారము కూడా చేయాలి. ప్రతి ఒక్కరూ స్వయము కోసం సలహాను అడుగుతారు. ఉదాహరణకు - బాబా, మేము ఈ విషయములో అసత్యము చెప్పవలసి వస్తోంది అని అడుగుతారు. బాబా ప్రతి ఒక్కరి నాడిని చూసి సలహా ఇస్తారు, ఎందుకంటే నేను చెప్పినా వీరు చెయ్యలేకపోతే అటువంటి సలహాను నేను ఎందుకివ్వాలని బాబా భావిస్తారు. నాడిని చూసి వారు చేయగలిగే సలహానే ఇవ్వడము జరుగుతుంది. చెప్పినా చేయకపోతే ఆజ్ఞను ఉల్లంఘించినవారి లైనులోకి వచ్చేస్తారు. ప్రతి ఒక్కరికీ తమ-తమ లెక్కాచారాలు ఉంటాయి. సర్జన్ అయితే ఒక్కరే, వారి వద్దకు రావలసి ఉంటుంది. వారు పూర్తి సలహానిస్తారు. బాబా, ఈ పరిస్థితిలో మేము ఎలా నడుచుకోవాలి? ఇప్పుడు ఏం చేయాలి? అని ప్రతి ఒక్కరూ అడగాలి. తండ్రి స్వర్గములోకైతే తీసుకువెళ్తారు. మనము స్వర్గవాసులుగా అవ్వబోతున్నామని మీకు తెలుసు. ఇప్పుడు మనము సంగమయుగవాసులము. మీరు ఇప్పుడు నరకములోనూ లేరు, స్వర్గములోనూ లేరు. ఎవరెవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారి లంగరు ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి ఎత్తివేయబడింది. మీరు కలియుగీ ప్రపంచము యొక్క తీరాన్ని వదిలేసారు. కొంతమంది బ్రాహ్మణులు స్మృతియాత్రలో చురుకుగా వెళ్తున్నారు, కొంతమంది నెమ్మదిగా వెళ్తున్నారు. కొంతమంది చేతిని వదిలేస్తారు అనగా మళ్ళీ కలియుగములోకి వెళ్ళిపోతారు. నావికుడు ఇప్పుడు మనల్ని తీసుకువెళ్తున్నారని మీకు తెలుసు. ఆ యాత్రలైతే అనేక రకాలుగా ఉంటాయి. మీదైతే ఒకే రకమైన యాత్ర. ఇది పూర్తిగా అతీతమైన యాత్ర. అయితే, తుఫానులు వస్తాయి, అవి స్మృతిని తెంచేస్తాయి. ఈ స్మృతియాత్రను మంచి రీతిలో పక్కా చేసుకోండి. ఇందులో కృషి చేయండి. మీరు కర్మయోగులు. ఎంత వీలైతే అంత, చేతులతో పని చేస్తూ మనసుతో తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి... అర్ధకల్పము ప్రేయసులైన మీరు ప్రియుడిని స్మృతి చేస్తూ వచ్చారు. బాబా, ఇక్కడ చాలా దుఃఖముంది, ఇప్పుడు మమ్మల్ని సుఖధామానికి యజమానులుగా చేయండి అని తలచుకున్నారు. స్మృతియాత్రలో ఉన్నట్లయితే మీ పాపాలు సమాప్తమైపోతాయి. మీరే స్వర్గ వారసత్వాన్ని పొందారు, ఇప్పుడు పోగొట్టుకున్నారు. భారత్ స్వర్గముగా ఉండేది, అందుకే ప్రాచీన భారత్ అని అంటారు. భారత్ కే చాలా గౌరవము ఇస్తారు. భారత్ అన్నింటికన్నా పెద్దది కూడా మరియు అన్నింటికన్నా పాతది కూడా. ఇప్పుడైతే భారత్ ఎంత నిరుపేదగా ఉంది, అందుకే అందరూ భారత్ కు సహాయము చేస్తారు. మా వద్ద చాలా ధాన్యము పండుతుంది, ఇక ఎక్కడి నుండి తెప్పించాల్సిన అవసరము ఉండదని మనుష్యులు భావిస్తారు కానీ వినాశనము ఎదురుగా నిలబడి ఉందని మీకు తెలుసు. ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో, వారికి లోలోపల చాలా సంతోషముంటుంది. ప్రదర్శనీలకు ఎంతమంది వస్తారు. మీరు సత్యము చెప్తున్నారని అంటారు కానీ మేము తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలని వారు అర్థం చేసుకోవాలి, ఈ విషయము వారి బుద్ధిలో కూర్చోదు. ఇక్కడ నుండి బయటకు వెళ్ళగానే సమాప్తము. బాబా మనల్ని స్వర్గములోకి తీసుకువెళ్తారని మీకు తెలుసు. అక్కడ గర్భ జైలులోకి వెళ్ళము, అలాగే స్థూలమైన జైలులోకి వెళ్ళము. ఇప్పుడు జైలు యాత్ర కూడా ఎంత సహజమైపోయింది. సత్యయుగములో ఎప్పుడూ జైలు ముఖము కూడా కనిపించదు, రెండు జైళ్ళూ ఉండవు. ఇక్కడ ఇదంతా మాయ యొక్క ఆర్భాటము. పెద్ద-పెద్ద వారిని సమాప్తము చేసేస్తారు. ఈ రోజు చాలా గౌరవము ఇస్తారు, రేపు ఆ గౌరవము సమాప్తమైపోతుంది. ఈ రోజుల్లో ప్రతి విషయము త్వరత్వరగా అయిపోతుంది. మృత్యువులు కూడా త్వరగా జరిగిపోతూ ఉంటాయి. సత్యయుగములో ఇటువంటి ఉపద్రవాలేవీ ఉండవు. మున్ముందు ఏమి జరుగుతుందో చూడాలి, అది చాలా భయంకరమైన దృశ్యము. పిల్లలైన మీకు సాక్షాత్కారము కూడా కలిగింది. పిల్లల కోసము ముఖ్యమైనది స్మృతియాత్ర. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మనసా-వాచా-కర్మణా చాలా-చాలా ఏక్యురేట్ గా అవ్వాలి. బ్రాహ్మణులుగా అయి శూద్రుల కర్మలేవీ చేయకూడదు.

2. బాబా నుండి ఏదైతే సలహా లభిస్తుందో, దానిపై పూర్తిగా నడుచుకుంటూ ఆజ్ఞాకారులుగా అవ్వాలి. కర్మయోగులుగా అయి ప్రతి కార్యము చేయాలి. సర్వుల జోలెను జ్ఞాన రత్నాలతో నింపాలి.

వరదానము:-
డబుల్ లైట్ గా అయి కర్మాతీత అవస్థను అనుభవం చేసే కర్మయోగీ భవ

ఏ విధముగా కర్మలోకి రావడము స్వాభావికమైపోయిందో, అలా కర్మాతీతముగా అవ్వడము కూడా స్వాభావికమైపోవాలి. దీని కోసం డబుల్ లైట్ గా ఉండండి. డబుల్ లైట్ గా ఉండేందుకు కర్మలు చేస్తూ కూడా స్వయాన్ని ట్రస్టీగా భావించండి మరియు ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చేయండి. ఈ రెండు విషయాలపై అటెన్షన్ ను ఉంచడము ద్వారా క్షణములో కర్మాతీతముగా మరియు క్షణములో కర్మయోగిగా అయిపోతారు. నిమిత్తమాత్రముగా కర్మ చేయడానికి కర్మయోగిగా అవ్వండి, మళ్ళీ కర్మాతీత అవస్థను అనుభవం చేయండి.

స్లోగన్:-
ఎవరి హృదయమైతే విశాలముగా ఉంటుందో, వారి కొరకు అసంభవ కార్యాలు కూడా సంభవమైపోతాయి.

అవ్యక్త సూచనలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి

మీలో ఏవైతే విశేషతలు ఉన్నాయో, వాటిని ఎదురుగా పెట్టుకోండి, అంతేకానీ బలహీనతలను కాదు, అప్పుడు మీపై మీకు నమ్మకము ఉంటుంది. బలహీనతకు సంబంధించిన విషయము గురించి ఎక్కువ ఆలోచించకండి, అప్పుడు సదా సంతోషములో ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రాక్టికల్ గా అనేక దేశాలు, అనేక భాషలు, అనేక రూపాలు-రంగులు ఉన్నాయి కానీ అనేకతలో కూడా అందరి మనసులో ఏకత ఉంది కదా! ఎందుకంటే మనసులో ఒక్క బాబా ఉన్నారు, ఒక్క శ్రీమతముపై నడిచేవారు. అనేక భాషలు ఉన్నప్పటికీ మనసులోని పాట, మనసు యొక్క భాష ఒక్కటే.