25-11-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - శివబాబాకు చెందినవారిగా అయి ఎటువంటి పొరపాట్లు చేయకండి, పొరపాట్లు చేసినట్లయితే తండ్రి పేరును అప్రతిష్ఠపాలు చేస్తారు’’

ప్రశ్న:-
అందరికంటే పెద్ద ప్రవృత్తి ఎవరిది మరియు ఎలా?

జవాబు:-
శివబాబాది అందరికంటే పెద్ద ప్రవృత్తి. భక్తిలో అందరూ త్వమేవ మాతాశ్చ పితా... (నీవే తల్లివి, తండ్రివి...) అని అంటూ పిలుస్తారు అంటే వారు ప్రవృత్తి మార్గానికి చెందినవారు అయినట్లు కదా. కానీ ఎప్పటివరకైతే వారు సాకారములోకి రారో, అప్పటివరకు వారికి ఎటువంటి ప్రవృత్తి ఉండదు ఎందుకంటే పైనైతే ఆత్మలు తండ్రితో పాటు నిరాకారీ రూపములో ఉంటాయి. సాకారములోకి వచ్చి వీరిలో ప్రవేశించినప్పుడు వారికి అందరికంటే పెద్ద ప్రవృత్తి ఉంటుంది.

ఓంశాంతి
విశేషముగా భారత్ కు మరియు మొత్తం ప్రపంచానికి, అనంతమైన తండ్రి నివృత్తి మార్గానికి చెందినవారా లేక ప్రవృత్తి మార్గానికి చెందినవారా అన్న విషయము తెలియదు. తండ్రి వచ్చినప్పుడు - పిల్లలూ-పిల్లలూ అంటూ పిలుస్తారు ఎందుకంటే వారిని త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ... అని కూడా పిలవడము జరుగుతుంది, అంటే వారు గృహస్థి అయినట్లు. శివుడు నిరాకారుడు అన్నది అక్కడైతే అందరికీ తెలుసు. శివునికి ఆకారముంది కానీ పిల్లలైతే లేరు. ఒకవేళ ఉన్నా కూడా, ఆత్మలందరూ వారి పిల్లలే. వారి పిల్లలందరూ ఒకేలా ఉంటారు, అందుకే అందరూ పరమాత్మయేనని భావిస్తారు. ఆత్మది కూడా బిందు రూపమే, పరమాత్మునిది కూడా బిందు రూపమే. గృహస్థులే త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ... అని పాడుతారు. నివృత్తి మార్గానికి చెందిన సన్యాసులు, పరమాత్మ అంటే బ్రహ్మతత్వము అని అంటారు. వారు త్వమేవ మాతాశ్చ పిత... అని అనరు. వారి మార్గము వేరు. వీరు కూడా పొరపాటున లక్ష్మీ-నారాయణుల ఎదురుగా వెళ్ళి - త్వమేవ మాతాశ్చ పిత... అని మహిమను పాడుతారు లేక అచ్యుతమ్ కేశవమ్... అని అంటారు. భక్తి మార్గములో చాలా మహిమను చేస్తూ ఉంటారు. వాస్తవానికి పరమాత్మ తండ్రి, వారి నుండి వారసత్వము ఎలా లభిస్తుంది మరియు ఏమి లభిస్తుంది. బ్రహ్మా తండ్రి కూడా, సోదరుడు కూడా, పెద్ద తల్లి కూడా, ప్రజాపిత కూడా అని పిల్లలైన మీకు తెలుసు. వీరి ద్వారా ఏమని చెప్తారంటే - పిల్లలూ, నేను మీకు తండ్రిని కూడా, మళ్ళీ నేను కూడా ప్రవృత్తి మార్గములోకి రావాల్సి ఉంటుంది. వీరు నాకు యుగళ్ కూడా, పుత్రుడు కూడా. వీరిలో ప్రవేశించినప్పుడు ప్రవృత్తి మార్గానికి చెందినవానిగా అవుతాను. నన్నే సుప్రీమ్ తండ్రి, సుప్రీమ్ టీచర్, సుప్రీమ్ గురువు అని కూడా అంటారు. గురువు ముక్తి కోసం గైడ్ చేస్తారు. అదంతా అసత్యము, ఇది సత్యము. ఇంగ్లీష్ లో పరమాత్మను ‘ట్రూత్’ అని అంటారు. ట్రూత్ (సత్యమైనవారు) వచ్చి ఏ సత్యాన్ని తెలియజేస్తారు, ఇది ఎవ్వరికీ తెలియదు. నాకు, మీకు కూడా ఇంతకుముందు తెలియదు. అంటే ఇది కొత్త విషయమైనట్లే కదా. వారు జ్ఞాన సాగరుడు, సత్య ఖండాన్ని స్థాపన చేసేవారు. తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు సత్యాన్ని వినిపించి ఉంటారు, అందుకే మహిమ ఉంది. సత్య ఖండాన్ని హెవెన్ అని అంటారు. అక్కడ దైవీ సామ్రాజ్యాన్ని చూపిస్తారు. ఇప్పుడిది పాత ప్రపంచము, ఇది మళ్ళీ కొత్త ప్రపంచముగా తయారవ్వనున్నది. పాత ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది. స్థాపనా సమయములో వినాశనము జరుగుతుందని కూడా అంటూ ఉంటారు. చేసేవారు చేయించేవారు పరమాత్మ అని అంటూ ఉంటారు. బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారు. ఎలా చేయిస్తారు? అది వారు స్వయమే వచ్చి తెలియజేస్తారు. మనుష్యులకేమీ తెలియదు. పరమాత్మ చేసేవారు చేయించేవారు అని అంటారు. మీకు డ్రామా గురించి కూడా తెలిసింది. కలియుగాంతము, సత్యయుగ ఆది... ఈ సంగమాన్నే ఉన్నతమైనదిగా భావించాలి. కలియుగము తర్వాత సత్యయుగము వస్తుంది. తర్వాత కిందకు దిగిపోతారు. స్వర్గము, నరకము అని అంటూ ఉంటారు. మనుష్యులు మరణించినప్పుడు స్వర్గవాసులయ్యారని అంటారు. అంటే ఎప్పుడో ఒకప్పుడు స్వర్గవాసులుగా అయి ఉంటారు. విశేషముగా భారతవాసులు మాత్రమే ఇలా అంటారు ఎందుకంటే భారత్ అన్నింటికంటే ప్రాచీనమైనది అని తెలుసు. కనుక తప్పకుండా ఇదే స్వర్గముగా ఉండి ఉంటుంది. విషయాలు ఎంత సహజమైనవి. కానీ డ్రామానుసారముగా అర్థం చేసుకోరు. అందుకే అర్థం చేయించడానికి తండ్రి వస్తారు. ఈ విధముగా పిలుస్తారు కూడా - బాబా, రండి, మీలో ఉన్న జ్ఞానాన్ని వచ్చి మాకు ఇవ్వండి, పతితులను పావనముగా తయారుచేయడానికి రండి. మళ్ళీ మా దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వండి అని కూడా అంటారు. కానీ వారు ఏ జ్ఞానాన్ని ఇస్తారు, ఏం సుఖాన్ని ఇస్తారు అనేది వారికి తెలియదు! వారు తండ్రి అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, కనుక తప్పకుండా తండ్రి ద్వారా రచన రచించబడి ఉంటుంది. తండ్రి అనగా రచయిత. పిల్లలు తండ్రి అని సంబోధిస్తున్నారంటే వారు రచన అయినట్లు. రచన కూడా తప్పకుండా ఎవరి ద్వారానో రచించబడి ఉంటారు, తర్వాత పిల్లలకు ప్రాపర్టీని కూడా ఇచ్చి ఉంటారు. ఇది కామన్ విషయము, అందుకే నన్ను త్వమేవ మాతాశ్చ పిత అని అంటారు. కనుక బాబా పెద్ద గృహస్థి అయినట్లు కదా. ఓ మాత-పిత రండి, వచ్చి పావనముగా తయారుచేయండి అని పిలుస్తారు కూడా. ఇప్పుడు తండ్రి ఉన్నారు కానీ తల్లి లేకుండా రచన ఎలా జరుగుతుంది. బాబా ఇక్కడ రచనను ఎలా రచిస్తారు. ఇది పూర్తిగా కొత్త విషయము. ఇక్కడ కూడా చాలామంది బుద్ధిలో నిలవదు. మిగిలిన అన్ని చోట్ల పరమాత్మను తండ్రి అని పిలుస్తారు. ఇక్కడ తల్లి-తండ్రి ఇరువురూ వారే, అంటే ఇది ప్రవృత్తి మార్గము అయినట్లు కదా. అక్కడ కేవలం తండ్రి అని అనడముతో వారికి ముక్తి యొక్క వారసత్వము లభిస్తుంది. వారు రావడము కూడా వెనుక వస్తారు. క్రిస్టియన్ ధర్మము కంటే ముందు బౌద్ధ ధర్మముండేదని, దాని కంటే ముందు ఇస్లామ్ ధర్మముండేదని అందరికీ తెలుసు. ఈ మెట్ల వరస చిత్రములో వేరే ధర్మాల గురించి లేదు, అందుకే దీనిని సృష్టి చక్రము చిత్రము పక్కన పెట్టాలి. ఇది పాఠశాల. ఇప్పుడు పాఠశాలలో కేవలం ఒక్క పుస్తకము మాత్రమే ఉండదు. పాఠశాలలోనైతే మ్యాపులు కూడా కావాలి. ఆ భౌతిక విద్య అయితే ఉపయోగపడదు. మ్యాపుల ద్వారా మనుష్యులు వెంటనే అర్థం చేసుకుంటారు. ఇవే మీ ముఖ్యమైన మ్యాపులు. ఎంత విస్తారముగా అర్థం చేయించడము జరుగుతుంది, అయినా రాతిబుద్ధి కలవారు అర్థం చేసుకోరు.

బాబా అర్థం చేయించారు - ప్రదర్శనీలలో, వారు మీ బాబా, వీరు దాదా, వారు జ్ఞానము ఎలా ఇస్తారు, వారసత్వము ఎలా ఇస్తారు అని త్రిమూర్తి చిత్రము గురించి ముందు అర్థం చేయించాలి. భారతవాసులకు మాత్రమే వారసత్వము లభించనున్నది. పరమపిత పరమాత్మ బ్రాహ్మణ, దేవత, క్షత్రియ - ఈ మూడు ధర్మాలను స్థాపన చేస్తారు. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులనే రచిస్తారు. ఇది యజ్ఞము, దీనిని రుద్ర జ్ఞాన యజ్ఞము అని అంటారు. భక్తి మార్గములో ఉన్న యజ్ఞాలన్నీ ఆలస్యముగా మొదలవుతాయి ఎందుకంటే మొట్టమొదట శివుని పూజ జరుగుతుంది, తర్వాత దేవతల పూజ జరుగుతుంది. ఆ సమయములో యజ్ఞాలేవీ ఉండవు. ఈ యజ్ఞాలను తర్వాత చేయడము మొదలుపెడతారు. ముందు దేవతలను పూజిస్తారు, వారికి పుష్పాలను అర్పిస్తారు. ఇప్పుడు మీరు పూజకు యోగ్యులుగా లేరు. మనుష్యులు శివునికి జిల్లేడు పూలను, ఉమ్మెత్త పూలను ఎందుకు సమర్పిస్తారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరందరూ ముళ్ళగా ఉండేవారు. అందులో నుండి కొందరు సదా గులాబీలుగా (సుగంధభరితమైన దేశీ గులాబీలు), కొందరు గులాబీలుగా, కొందరు మల్లెలుగా తయారవుతారు. మరికొందరు జిల్లేడు పూలగా కూడా అవుతారు. పూర్తిగా చదువుకోకపోతే జిల్లేడు పూలగా అవుతారు, దేనికీ పనికిరారు. శివబాబాకు ముళ్ళను సమర్పిస్తారు, బాబా వాటిని పుష్పాలుగా తయారుచేస్తారు. కానీ పుష్పాలలో కూడా వెరైటీ పుష్పాలు తయారవుతాయి. పూలతోటలో వెరైటీ పుష్పాలు ఉంటాయి కదా. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. కొందరు సింహాసనాధికారులుగా అవుతారు, కొందరు మరోలా అవుతారు. ఈ విషయాలన్నింటినీ తండ్రియే అర్థం చేయిస్తారు, ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. భక్తి మార్గము ఎంత విస్తారమైనది, కానీ అందులో జ్ఞానము కొద్దిగా కూడా లేదు. సత్యయుగములో దేవీ-దేవతలు ఉండేవారు. కలియుగములో దేవతలు ఒక్కరు కూడా లేరు. కావున తప్పకుండా పరమాత్మ మనుష్యులను దేవతలుగా తయారుచేసి ఉంటారు. తండ్రి వచ్చి ఎటువంటి కర్మలను నేర్పిస్తారంటే, మనుష్యులు వాటిని నేర్చుకుని దైవీ గుణాలను ధారణ చేసి దేవీ-దేవతలుగా అయ్యారు. ఇతర ధర్మాల వారు ఏం నేర్పిస్తారు? ఎందుకంటే వారికైతే పై నుండి ధర్మపితల వెనుక రావాల్సి ఉంటుంది. వారు కేవలం పవిత్రతకు సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తారు. క్రైస్టు ఎప్పుడైతే వస్తారో, అప్పుడు క్రిస్టియన్లు ఎవ్వరూ లేరు. అతని వెనుక పై నుండి వారంతా వస్తారు. తండ్రి అర్థం చేయించారు, ముఖ్యమైన ధర్మాలు నాలుగు. ఎవరైతే ధర్మ స్థాపన చేస్తారో, వారి శాస్త్రాన్ని ధర్మశాస్త్రము అని అంటారు. కావున ముఖ్యమైనవి 4 ధర్మాలు. ఇక మిగిలినవన్నీ చిన్న-చిన్న ధర్మాలు, అవి వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇస్లాముల ధర్మశాస్త్రము వేరు, బౌద్ధులది వేరు, ఎవరిది వారికుంది, కావున ధర్మశాస్త్రాలు కేవలం ఇవి మాత్రమే. బ్రాహ్మణ ధర్మమైతే ఈ సమయానికి చెందినది. వారు బ్రాహ్మణ దేవతాయ నమః... అని పాడుతారు. కావున ఆ బ్రాహ్మణులకు ఇలా అర్థం చేయించాలి - పరమాత్మ ఎప్పుడైతే బ్రహ్మా ద్వారా వచ్చి బ్రహ్మా ముఖవంశావళిని రచిస్తారో, వారే సత్యమైన బ్రాహ్మణులు, మీరు ప్రజాపిత బ్రహ్మాకు సంతానము కాదు, మీరు కేవలం స్వయాన్ని బ్రాహ్మణులుగా చెప్పుకుంటారు కానీ అర్థమేమీ తెలియదు. బ్రహ్మా భోజనము తినేటప్పుడు సంస్కృతములో శ్లోకాలు చదివి బ్రహ్మా భోజనాన్ని మహిమ చేస్తారు. అర్థమేమీ తెలియకుండా మహిమను చేస్తారు. మీరు బ్రాహ్మణులు ఎలా అవుతారు అని వారిని అడగాలి. పరమాత్మ సృష్టిని రచించేందుకు ముందుగా బ్రహ్మా కావాలి. కావున సత్యమైన బ్రాహ్మణులు మీరు. బ్రాహ్మణులకైతే పిలకను చూపిస్తారు కదా. విరాట రూపములో బ్రాహ్మణులను చూపించరు. మరి బ్రాహ్మణులు ఎక్కడ నుండి వచ్చారు. మీరు స్వయాన్ని బ్రాహ్మణులుగా చెప్పుకుంటున్నారు కానీ పరమాత్మ వచ్చి బ్రహ్మా ద్వారా కొత్త రచనను రచించినప్పుడే బ్రాహ్మణులు అవుతారు. తర్వాత బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులు సంగమములోనే ఉంటారు. కలియుగములో అందరూ శూద్రులు. బ్రాహ్మణులను చాలా మహిమ చేస్తారు. ఈ విషయాలన్నింటినీ బాబా అర్థం చేయిస్తున్నారు. అల్ఫ్ మరియు బే (భగవంతుడు మరియు రాజ్యాధికార వారసత్వము), మిగిలినదంతా విస్తారము. భక్తి గురించి కూడా అర్థం చేయించాలి. బాబా ఒక్కోసారి, నీవు భక్తునివా అని అంటారు, అంతేకానీ బాబా ఎప్పుడూ కోప్పడరు. తండ్రి అయితే అర్థం చేయిస్తారు కదా. ఎందుకంటే పిల్లలు ఒకవేళ పొరపాటు చేస్తే, ఎవరి పేరు పాడవుతుంది, శివబాబాదే కదా, అందుకే బాబా పిల్లల కళ్యాణార్థము శిక్షణను ఇస్తారు. ఒకవేళ వీరి ద్వారా ఏదైనా పొరపాటు జరిగినా కానీ దానిని సరిదిద్దడము డ్రామాలో నిశ్చితమై ఉంది. దాని వలన కూడా లాభమే ఉంటుంది ఎందుకంటే వీరు పెద్ద కొడుకు కదా. అంతా వీరిపైనే ఆధారపడి ఉంది. వీరి వలన ఏ నష్టము కలగదు. వీరు, ఇలా చేయండి అని చెప్తే, అలా చేయాలి. అప్పుడు నష్టము నుండి కూడా లాభమే వెలువడుతుంది. నష్టమన్న మాటే ఉండదు. ప్రతి విషయములోనూ కళ్యాణమే కళ్యాణముంటుంది. అకళ్యాణము కూడా డ్రామాలో ఉంది. పొరపాట్లు అయితే అందరి ద్వారా జరుగుతూ ఉంటాయి. కానీ ఎటువంటి పరిస్థితిలోనైనా చివరిలో కళ్యాణము జరగాల్సిందే ఎందుకంటే తండ్రి కళ్యాణకారి. అందరి కళ్యాణము చేయాలి. అందరికీ సద్గతినిస్తారు. ఇప్పుడిది అందరి వినాశన సమయము. పాపాల భారము అందరి తలపై ఉంది. అందరి లెక్కాచారాలు సమాప్తమవుతాయి. శిక్షలు లభించడానికి సమయము పట్టదు. క్షణములో జీవన్ముక్తి లభిస్తుంది అన్నప్పుడు క్షణములో పాపాలకు శిక్షలు అనుభవించలేరా! కాశీలోని కత్తుల బావిలో ఇలాగే జరుగుతుంది, శరీరము పోతుంది, అలాగని వారు వెళ్ళి శివబాబాను కలుస్తారని కాదు. కేవలం వెనుకటి పాపాల లెక్క సమాప్తమై మళ్ళీ కొత్తగా మొదలవుతాయి. మధ్యలో ఎవరూ తిరిగి వెళ్ళలేరు. జ్ఞానము క్షణానికి సంబంధించినదే కానీ చదువునైతే చదువుకోవాల్సిందే. రోజూ జ్ఞానసాగరుడైన శివబాబా ఆత్మ వచ్చి చదివిస్తారు. శ్రీకృష్ణుడైతే దేహధారి, వారు పునర్జన్మలలోకి వస్తారు. బాబా అయితే అజన్మ. ఎవరైతే చదువుకోరో, వారు తప్పకుండా విఘ్నాలు కలిగిస్తారు. యజ్ఞములో విఘ్నాలైతే కలుగుతాయి. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. అదంతా కల్పక్రితం వలె జరుగుతూ ఉంది. అసురులు ఎలాంటి హంగామా చేస్తారు, చిత్రాలు చింపేస్తారు. కొన్ని సార్లు నిప్పు అంటించడానికి కూడా సంకోచించరు. మనమేమి చేస్తాము. ఇది విధి వ్రాత అని లోపల అర్థం చేసుకుంటాము, బయటకు మాత్రం పోలీసులు మొదలైనవారికి రిపోర్టు చేయవలసి ఉంటుంది. కల్పక్రితం ఏదైతే జరిగిందో, అదే జరుగుతుందని, ఇందులో దుఃఖము యొక్క విషయమేమీ లేదని మనకు లోలోపల తెలుసు. చాకలివాని ఇంటి నుండి ఏదైనా పోతే నష్టము కలుగుతుంది. కానీ మళ్ళీ ఇంకొకటి తయారవుతుంది.

బాబా చెప్తున్నారు - ఎక్కడైనా ప్రదర్శనీలు మొదలైనవి చేస్తే, 8 రోజుల కోసం ఇన్ష్యూరెన్స్ చేయించండి. ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే, డబ్బులు కూడా తీసుకోరు. ఒకవేళ ఇన్ష్యూరెన్స్ చేయించకపోతే ఏమవుతుంది. మళ్ళీ కొత్తవి మంచి చిత్రాలు తయారవుతాయి. అడుగడుగులోనూ పదమాలు ఉన్నాయి. మీ ప్రతి అడుగు, ప్రతి క్షణము చాలా విలువైనది. మీరు పదమపతులుగా అవుతారు. 21 జన్మల కొరకు బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు కనుక ఎంత బాగా అర్థం చేయించాలి. అక్కడ స్వర్గములో మీ వద్ద లెక్కలేనంత ధనముంటుంది, లెక్కపెట్టే మాటే ఉండదు. అంటే బాబా మిమ్మల్ని ఎంత ధనవంతులుగా, సుఖమయముగా చేస్తారు. ఇది ఎంత గొప్ప ఆదాయము. ప్రజలు కూడా ఎంత షావుకారులుగా అవుతారు. ఇది 21 జన్మల కోసం సంపాదనకు ఆధారము. ఇది మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే పాఠశాల. ఇక్కడ చదివించేవారు ఎవరు? తండ్రి. కనుక ఇటువంటి చదువులో నిర్లక్ష్యము చేయకూడదు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ కళ్యాణకారీ యుగములో ప్రతి విషయములోనూ కళ్యాణముందని, మనకు అకళ్యాణము జరగదని సదా స్మృతి ఉండాలి. ప్రతి విషయములోనూ కళ్యాణముందని భావిస్తూ సదా నిశ్చింతగా ఉండాలి.

2. సదా గులాబీగా అయ్యేందుకు చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి. చదువులో నిర్లక్ష్యము చేయకూడదు. జిల్లేడు పుష్పముగా అవ్వకూడదు.

వరదానము:-
అమృతవేళ మహత్వాన్ని అర్థం చేసుకుని ఆ సమయాన్ని యథార్థ రీతిలో ఉపయోగించుకునే సదా శక్తి సంపన్న భవ

స్వయాన్ని శక్తి సంపన్నముగా తయారుచేసుకునేందుకు రోజూ అమృతవేళ తనువుతో మరియు మనసుతో విహరించండి. ఎలాగైతే అమృతవేళలో సమయము యొక్క సహయోగముంటుందో, అలాగే బుద్ధి యొక్క సతోప్రధాన స్థితి యొక్క సహయోగము కూడా ఉంటుంది. కావున అటువంటి వరదానీ సమయములో మనసు యొక్క స్థితి కూడా అన్నింటికన్నా శక్తిశాలి స్థితిలో ఉండాలి. శక్తిశాలి స్థితి అంటే తండ్రి సమానమైన బీజరూప స్థితి. సాధారణ స్థితిలోనైతే కర్మలు చేస్తూ కూడా ఉండగలరు కానీ వరదానీ సమయాన్ని యథార్థ రీతిలో ఉపయోగించుకున్నట్లయితే బలహీనతలు సమాప్తమైపోతాయి.

స్లోగన్:-
తమ శక్తుల ఖజానాతో శక్తిహీనులుగా, పరవశులుగా ఉన్న ఆత్మలను శక్తిశాలిగా చేయండి.

అవ్యక్త ప్రేరణలు - బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి

ఎలా అయితే బ్రహ్మాబాబా సదా శబ్దము నుండి అతీతముగా ఉంటూ తమ శ్రేష్ఠ స్థితిలో స్థితులై ఉండే అభ్యాసము చేస్తూ ఉండేవారో, దాని వలన వారు సర్వ వ్యక్త ఆకర్షణల నుండి దూరముగా, శక్తిశాలిగా, అతీతమైన మరియు ప్రియమైన స్థితిలో ఉండేవారో, అలా పిల్లలైన మీరు కూడా ఆ శ్రేష్ఠ స్థితిలో స్థితులై ఉండే అభ్యాసము చేస్తూ ఉండండి, అప్పుడు కర్మలు చేస్తూ కూడా విశేషముగా శాంతి యొక్క శక్తిని అనుభవము చేస్తూ ఉంటారు, ఈ అభ్యాసముతోనే బాబా సమానముగా సంపన్నముగా మరియు సంపూర్ణముగా అవుతారు.