28-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ ప్రేమ వినాశీ శరీరాలపై ఉండకూడదు, ఒక్క విదేహీనే ప్రేమించండి, దేహాన్ని చూస్తూ కూడా చూడకండి’’

ప్రశ్న:-
బుద్ధిని స్వచ్ఛముగా తయారుచేసుకునేందుకు పురుషార్థము ఏమిటి? స్వచ్ఛమైన బుద్ధి యొక్క గుర్తులు ఏమిటి?

జవాబు:-
దేహీ-అభిమానులుగా అవ్వడము ద్వారానే బుద్ధి స్వచ్ఛముగా అవుతుంది. ఇటువంటి దేహీ-అభిమానులైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క తండ్రిని ప్రేమిస్తారు. తండ్రి నుండే వింటారు, కానీ మందబుద్ధికలవారు ఎవరైతే ఉంటారో వారు దేహాన్ని ప్రేమిస్తారు, దేహాన్నే అలంకరించుకుంటూ ఉంటారు.

ఓంశాంతి
ఓం శాంతి అని ఎవరన్నారు మరియు ఎవరు విన్నారు? ఇతర సత్సంగాలలోనైతే జిజ్ఞాసువులు వింటారు. అక్కడ మహాత్మ లేక గురువు వినిపించారు అని అంటారు. ఇక్కడ పరమాత్మ వినిపించారు మరియు ఆత్మ విన్నది అని అంటారు. ఇది కొత్త విషయము కదా. దేహీ-అభిమానులుగా అవ్వాల్సి ఉంటుంది. చాలా మంది ఇక్కడ కూడా దేహాభిమానులుగా అయి కూర్చుంటారు. పిల్లలైన మీరు దేహీ-అభిమానులుగా అయి కూర్చోవాలి. ఆత్మనైన నేను ఈ శరీరములో విరాజమానమై ఉన్నాను. శివబాబా మనకు అర్థం చేయిస్తున్నారు, ఇది బుద్ధిలో చాలా మంచి రీతిలో గుర్తుండాలి. ఆత్మనైన నా యొక్క కనెక్షన్ (సంబంధము) పరమాత్మతో ఉంది. పరమాత్మ వచ్చి ఈ శరీరము ద్వారా వినిపిస్తారు, వీరు మధ్యవర్తి అయినట్లు. మీకు అర్థం చేయించేవారు వారు. వీరికి కూడా వారసత్వాన్ని వారు ఇస్తారు. కావున బుద్ధి వారి వైపుకు వెళ్ళాలి. తండ్రికి ఒకవేళ 5-7 మంది పిల్లలు ఉన్నారనుకోండి, వారి బుద్ధియోగము ఆ తండ్రి వైపే ఉంటుంది కదా ఎందుకంటే తండ్రి నుండి వారసత్వము లభించనున్నది. సోదరుల నుండి వారసత్వము లభించదు. వారసత్వము ఎల్లప్పుడూ తండ్రి నుండే లభిస్తుంది. ఆత్మకు ఆత్మల నుండి వారసత్వము లభించదు. మీకు తెలుసు, ఆత్మ రూపములో మనమంతా సోదరులము. ఆత్మలమైన మనందరి కనెక్షన్ (సంబంధము) ఒక్క పరమపిత పరమాత్మతో ఉంది. వారంటారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. నా ఒక్కరితోనే ప్రీతిని పెట్టుకోండి. రచనతో ప్రీతిని పెట్టుకోకండి. దేహీ-అభిమానులుగా అవ్వండి. నన్ను తప్ప ఇతర దేహధారులు ఎవరినైనా స్మృతి చేస్తే, దీనిని దేహాభిమానము అని అంటారు. ఈ దేహధారులు మీ ఎదురుగా ఉన్నా కానీ మీరు వారిని చూడకండి. బుద్ధిలో వారి స్మృతియే ఉండాలి. వారు ఏదో నామమాత్రంగా సోదరులము అని అంటారు, ఇప్పుడు మీకు తెలుసు - మనమంతా ఆత్మలము, పరమపిత పరమాత్ముని యొక్క సంతానము అని. వారసత్వము పరమాత్మ తండ్రి నుండి లభిస్తుంది. ఆ తండ్రి అంటారు - మీ ప్రేమ నా ఒక్కరితోనే ఉండాలి. నేనే స్వయంగా వచ్చి ఆత్మలైన మీ నిశ్చితార్థాన్ని నాతో చేయిస్తాను. ఈ నిశ్చితార్థం దేహధారితో జరగడం లేదు. మిగిలిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో, అవి దైహిక సంబంధాలు, అవి ఈ ప్రపంచానికి సంబంధించినవి. ఈ సమయములో మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఆత్మలమైన మనము తండ్రి నుండి వింటాము, బుద్ధి తండ్రి వైపుకు వెళ్ళాలి. తండ్రి వీరి పక్కన కూర్చుని మనకు జ్ఞానాన్ని ఇస్తారు. వారు శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు. ఆత్మ ఈ శరీరమనే ఇంట్లోకి వచ్చి తన పాత్రను అభినయిస్తుంది. పాత్రను అభినయించేందుకు ఆత్మ తనను తాను అండర్ హౌస్ అరెస్ట్ చేసుకుంటుంది (ఇంట్లో బంధించుకుంటుంది). ఆ మాటకొస్తే ఆత్మ స్వతంత్రంగా ఉంటుంది. కానీ, ఈ శరీరంలోకి ప్రవేశించి, తనను తాను ఈ ఇంట్లో బంధించుకొని పాత్రను అభినయిస్తుంది. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది, పాత్రను అభినయిస్తుంది. ఈ సమయములో ఎవరు ఎంత దేహీ-అభిమానులుగా ఉంటారో, వారు అంత ఉన్నత పదవిని పొందుతారు. బాబా యొక్క శరీరంపై కూడా మీకు ప్రేమ ఉండకూడదు, అంశమాత్రము కూడా ఉండకూడదు. ఈ శరీరము ఎందుకూ పనికిరాదు. నేను కేవలము మీకు అర్థం చేయించడం కోసమే ఈ శరీరములోకి ప్రవేశిస్తాను. ఇది రావణ రాజ్యము, పరాయి దేశము. రావణుడిని కాలుస్తారు కానీ అసలేమీ అర్థం చేసుకోరు, చిత్రాలు మొదలైనవి ఏవైతే తయారుచేస్తారో, వాటి గురించి తెలియదు. పూర్తిగా మందబుద్ధికలవారిగా ఉన్నారు. రావణ రాజ్యములో అందరూ మందబుద్ధికలవారిగా అవుతారు. దేహాభిమానము ఉంది కదా. తుచ్ఛ బుద్ధి కలవారిగా అయిపోయారు. తండ్రి అంటారు - మందబుద్ధికలవారు ఎవరైతే ఉంటారో, వారు దేహాన్ని స్మృతి చేస్తూ ఉంటారు, దేహాన్ని ప్రేమిస్తారు. స్వచ్ఛబుద్ధి కలవారు ఎవరైతే ఉంటారో, వారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మను స్మృతి చేస్తూ, పరమాత్మ నుండి వింటూ ఉంటారు, ఇందులోనే శ్రమ ఉంది. వీరు కేవలం తండ్రి యొక్క రథము మాత్రమే. ఎంతోమందికి వీరి పట్ల ప్రేమ కలుగుతుంది. హుస్సేన్ గుర్రాన్ని ఎంతగా అలంకరిస్తారు. వాస్తవానికి మహిమ అయితే హుస్సేన్ ది (పరమాత్మది) కదా. గుర్రానిది కాదు కదా. తప్పకుండా మనుష్య తనువులోకి హుస్సేన్ (పరమాత్మ) యొక్క ఆత్మ ప్రవేశించి ఉంటుంది కదా. వారు ఈ విషయాలను అర్థం చేసుకోరు. ఇప్పుడు దీనిని రాజస్వ అశ్వమేధ అవినాశీ రుద్ర జ్ఞాన యజ్ఞము అని అంటారు. అశ్వము అన్న పేరును విని వారు గుర్రము అని భావించారు, ఆ గుర్రాన్ని స్వాహా చేస్తారు. ఇవన్నీ భక్తి మార్గపు కథలు. ఇప్పుడు మిమ్మల్ని సుందరముగా తయారుచేసే యాత్రికుడు వీరే కదా.

ఇప్పుడు మీకు తెలుసు - మనం మొదట సుందరముగా ఉండేవారము, తర్వాత నల్లగా అయ్యాము. ఏ ఆత్మలైతే మొట్టమొదట వస్తారో, వారు మొదట సతోప్రధానముగా ఉంటారు, ఆ తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తారు. తండ్రి వచ్చి అందరినీ సుందరముగా తయారుచేస్తారు. ధర్మ స్థాపనార్థము ఎవరైతే వస్తారో, వారందరూ సుందరమైన ఆత్మలుగానే ఉంటారు, తర్వాత కామచితిపై కూర్చొని నల్లగా అయిపోతారు. మొదట సుందరముగా ఉంటారు, తర్వాత నల్లగా అవుతారు. వీరు మొట్టమొదట నంబరువన్ లోకి వస్తారు, కావున అందరికన్నా ఎక్కువ సుందరముగా అవుతారు. వీరి వంటి (లక్ష్మీనారాయణుల వంటి) ప్రకృతిసిద్ధమైన సౌందర్యము ఇంకెవ్వరికీ ఉండదు. ఇది జ్ఞానము యొక్క విషయము. క్రిస్టియన్లు భారతవాసుల కన్నా సుందరముగా (తెల్లగా) ఉంటారు, ఎందుకంటే వారు అటువైపు ఉంటారు. కానీ సత్యయుగములోనైతే ప్రకృతిసిద్ధమైన సౌందర్యము ఉంటుంది. అక్కడ ఆత్మ, శరీరము రెండూ సుందరముగా ఉంటాయి. ఈ సమయములో అందరూ పతితులుగా, నల్లగా ఉన్నారు, మళ్ళీ తండ్రి వచ్చి అందరినీ సుందరముగా తయారుచేస్తారు. మొదట సతోప్రధానముగా, పవిత్రముగా ఉంటారు, తర్వాత దిగుతూ-దిగుతూ కామచితిపై కూర్చొని నల్లగా అయిపోతారు. ఇప్పుడు ఆత్మలందరినీ పవిత్రముగా చేయడానికి తండ్రి వచ్చారు. తండ్రిని స్మృతి చేయడము ద్వారానే మీరు పావనముగా అవుతారు. కావున ఆ ఒక్కరిని స్మృతి చేయాలి. దేహధారుల పట్ల ప్రీతిని పెట్టుకోకూడదు. మేము ఒక్క తండ్రికి చెందినవారము, వారే మాకు సర్వస్వము అని బుద్ధిలో ఉండాలి. ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తామో, అదంతా వినాశనమైపోతుంది. ఈ కళ్ళు కూడా వినాశనమైపోతాయి. పరమపిత పరమాత్మను త్రినేత్రి అని అంటారు. వారికి జ్ఞానమనే మూడవ నేత్రము ఉంది. త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిలోకనాథుడు అన్న టైటిల్స్ వారికి లభించాయి. ఇప్పుడు మీకు మూడు లోకాల జ్ఞానము ఉంది, తర్వాత ఇది మాయమైపోతుంది. ఎవరిలోనైతే జ్ఞానము ఉంటుందో, వారే వచ్చి మళ్ళీ ఇస్తారు. మీకు తండ్రి 84 జన్మల జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రి అంటారు - స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను మిమ్మల్ని పావనముగా చేయడానికి ఈ శరీరంలోకి ప్రవేశించి వచ్చాను. నన్ను స్మృతి చేయడము ద్వారానే పావనముగా అవుతారు. ఇంకెవరినైనా స్మృతి చేసారంటే సతోప్రధానముగా అవ్వలేరు. పాపాలు అంతం అవ్వకపోతే, వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి అని అంటారు. మనుష్యులు చాలా అంధవిశ్వాసంలో ఉన్నారు. దేహధారులపైనే మోహము కలిగి ఉన్నారు. ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఒక్కరి పైనే మోహము కలిగి ఉండాలి. ఇంకెవరి పైనైనా మోహము కలిగి ఉంటే తండ్రి నుండి విపరీత బుద్ధి కలవారిగా ఉన్నట్లు. తండ్రినైన నన్నే స్మృతి చేయండి అని తండ్రి ఎంతగా అర్థం చేయిస్తున్నారు, ఇందులోనే శ్రమ ఉంది. పతితులైన మమ్మల్ని వచ్చి పావనముగా చేయండి అని మీరు అంటారు. తండ్రే పావనముగా తయారుచేస్తారు. పిల్లలైన మీకు 84 జన్మల చరిత్ర-భౌగోళాలను తండ్రియే అర్థం చేయిస్తారు. ఇది సహజమే కదా. ఇకపోతే స్మృతి అన్నదే అన్నింటికన్నా కష్టమైన సబ్జెక్టు. తండ్రితో యోగం జోడించడంలో ఎవ్వరూ చురుకుగా లేరు.

ఏ పిల్లలైతే స్మృతి చేయడంలో చురుకుగా ఉండరో, వారు పండితుల వంటివారు. జ్ఞానములో ఎంత తెలివైనవారిగా ఉన్నా, స్మృతి లేకపోతే వారు పండితుల వంటివారే. బాబా పండితుని ఒక కథను వినిపిస్తారు కదా. ఆ పండితుడు ఎవరికైతే వినిపిస్తారో, వారు పరమాత్మను స్మృతి చేసి నదిని దాటేస్తారు. పండితుని ఉదాహరణ కూడా పిల్లలైన మీకు సంబంధించినదే. తండ్రిని స్మృతి చేసినట్లయితే తీరాన్ని దాటుతారు. కేవలం మురళిలో చురుకుగా ఉన్నట్లయితే తీరాన్ని దాటలేరు. స్మృతి లేకుండా వికర్మలు వినాశనం అవ్వవు. ఈ ఉదాహరణలన్నీ తయారుచేయబడ్డాయి. తండ్రి కూర్చుని యథార్థ రీతిలో అర్థం చేయిస్తారు. పండితుడు ఎవరికైతే వినిపించారో, వారికి నిశ్చయం ఏర్పడింది. పరమాత్మను స్మృతి చేయడంతో తీరాన్ని దాటగలము అన్న ఒక్క విషయాన్ని పట్టుకున్నారు. కేవలం జ్ఞానము ఉంది, యోగము లేదు అంటే ఉన్నత పదవిని పొందలేరు. ఇలా ఎంతోమంది ఉన్నారు, వారు స్మృతిలో ఉండరు, ముఖ్యమైన విషయమే స్మృతికి సంబంధించినది. చాలా మంచిగా సేవ చేసేవారు ఉన్నారు, కానీ బుద్ధియోగము సరిగ్గా లేకపోతే చిక్కుకుపోతారు. యోగములో ఉన్న వారు ఎప్పుడూ దేహాభిమానములో చిక్కుకోరు, వారికి అశుద్ధ సంకల్పాలు రావు. స్మృతిలో అపరిపక్వముగా ఉన్నట్లయితే తుఫాన్లు వస్తాయి. యోగము ద్వారా కర్మేంద్రియాలు పూర్తిగా వశమవుతాయి. తండ్రి రైట్-రాంగ్ ను అర్థం చేసుకునే బుద్ధిని కూడా ఇస్తారు. ఇతరుల దేహము వైపుకు బుద్ధి వెళ్ళినట్లయితే విపరీత బుద్ధి వినశ్యంతిగా అవుతారు. జ్ఞానము వేరు, యోగము వేరు. యోగము ద్వారా ఆరోగ్యము, జ్ఞానము ద్వారా సంపద లభిస్తాయి. యోగము ద్వారా శరీరం యొక్క ఆయుష్షు పెరుగుతుంది, ఆత్మ ఎప్పుడూ పెద్దగా-చిన్నగా అవ్వదు. ఆత్మ అంటుంది - నా శరీరము యొక్క ఆయుష్షు పెరుగుతుంది. ఇప్పుడు ఆయుష్షు తక్కువగా ఉంది. మళ్ళీ అర్ధకల్పము కొరకు శరీరము యొక్క ఆయుష్షు పెరుగుతుంది. మనము తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతాము. ఆత్మ పవిత్రముగా అవుతుంది, మొత్తమంతా ఆత్మను పవిత్రముగా తయారుచేసుకోవడం పైన ఆధారపడి ఉంది. పవిత్రముగా అవ్వకపోతే పదవిని కూడా పొందలేరు.

చార్టు పెట్టడంలో మాయ పిల్లలను సోమరులుగా చేస్తుంది. పిల్లలు స్మృతి యాత్ర యొక్క చార్టును చాలా అభిరుచితో పెట్టాలి. చెక్ చేసుకోవాలి - నేను తండ్రిని స్మృతి చేస్తున్నానా లేక మిత్ర-సంబంధీకులు మొదలైనవారి వైపుకు బుద్ధి వెళ్తుందా? రోజంతటిలో ఎవరి స్మృతి ఉంది అనగా ప్రీతిని ఎవరి పట్ల కలిగి ఉన్నాను, ఎంత సమయము వృధా చేశాను? తమ చార్టును పెట్టుకోవాలి. కానీ రెగ్యులర్ గా చార్టు పెట్టే అంతటి శక్తి ఎవ్వరికీ లేదు. ఎవరో అరుదుగా ఆ విధంగా చార్టు పెట్టగలరు. మాయ పూర్తి చార్టును పెట్టనివ్వదు. పూర్తిగా సోమరులుగా చేస్తుంది. చురుకుదనము పోతుంది. తండ్రి అంటారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. నేను ప్రేయసులందరికీ ప్రియుడిని, కావున ప్రియుడిని స్మృతి చేయాలి కదా. ప్రియుడైన తండ్రి అంటున్నారు - మీరు నన్ను అర్ధకల్పము స్మృతి చేశారు, నన్ను మీరు స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని నేను ఇప్పుడు చెప్తున్నాను. తండ్రి, ఎవరైతే ఇంతటి సుఖాన్ని ఇస్తారో, వారిని ఎంతగా స్మృతి చేయాలి. మిగిలినవారందరూ దుఃఖాన్ని ఇచ్చేవారు. వారు ఎందుకూ పనికిరారు. అంతిమ సమయములో ఒక్క పరమాత్మ అయిన తండ్రి మాత్రమే ఉపయోగపడతారు. అంతిమ సమయము ఒకటి హద్దుకు సంబంధించినది, ఇంకొకటి అనంతమైనది.

తండ్రి అర్థం చేయిస్తారు - మంచి రీతిలో స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అకాల మరణాలు సంభవించవు. మిమ్మల్ని అమరులుగా తయారుచేస్తారు. మొట్టమొదట తండ్రి పైన ప్రీతి బుద్ధి కలిగి ఉండాలి. ఎవరి శరీరము పట్లనైనా ప్రీతి ఉన్నట్లయితే కింద పడిపోతారు. ఫెయిల్ అయిపోతారు. చంద్రవంశములోకి వెళ్ళిపోతారు. స్వర్గము అని సత్యయుగ సూర్యవంశీ రాజ్యాన్నే అంటారు. త్రేతాయుగాన్ని కూడా స్వర్గము అని అనరు. ఏ విధంగానైతే ద్వాపర-కలియుగాలు ఉన్నాయి, కలియుగాన్ని రౌరవ నరకము, తమోప్రధానమైనది అని అంటారు. ద్వాపరయుగాన్ని అంతగా అనరు. తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యేందుకు స్మృతి కావాలి. మాకు ఫలానా వారిపై చాలా ప్రీతి ఉంది, వారి ఆధారం లేకుండా మా కళ్యాణము జరుగదు అని భావిస్తారు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మరణిస్తే ఏమవుతుంది. వినాశన సమయములో పరమాత్ముని పట్ల విపరీత బుద్ధి కలిగినవారు (ప్రీతి లేనివారు) వినాశనము చెందుతారు. అతి చిన్న పదవిని పొందుతారు.

ఈ రోజుల్లో ప్రపంచములో ఫ్యాషన్ కూడా చాలా పెద్ద సమస్యగా ఉంది. తమవైపుకు ఆకర్షించుకుంనేందుకు శరీరాన్ని ఎంత టిప్ టాప్ గా అలంకరించుకుంటారు. ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలూ, ఎవరి నామరూపాలలోనూ చిక్కుకోకండి. లక్ష్మీనారాయణుల వస్త్రాలను చూడండి, ఎంత రాయల్ గా (హుందాగా) ఉన్నాయి. అది శివాలయము, దీనిని వేశ్యాలయము అని అంటారు. ఈ దేవతల ఎదురుగా వెళ్ళి - మేము వేశ్యాలయములో ఉండేవారము అని అంటారు. ఈ రోజుల్లో ఫ్యాషన్ ఎంత సమస్యగా ఉందంటే, అందరి దృష్టి వారివైపుకు వెళ్తుంది, తర్వాత వారిని ఎత్తుకుపోతారు. సత్యయుగములో నడవడిక నియమానుసారముగా ఉంటుంది. అక్కడ ఉన్నది ప్రకృతిసిద్ధమైన సౌందర్యము కదా. అంధవిశ్వాసం యొక్క విషయమేమీ లేదు. ఇక్కడైతే ఎవరినైనా చూస్తూనే మనసు వారి వైపుకు వెళ్ళిపోతుంది, ఇతర ధర్మాలవారిని కూడా వివాహం చేసుకుంటారు. ఇప్పుడు మీది ఈశ్వరీయ బుద్ధి, రాతిబుద్ధి నుండి పారసబుద్ధి కలవారిగా తండ్రి తప్ప ఇంకెవ్వరూ తయారుచేయలేరు. వారు రావణ సాంప్రదాయము కలవారు. మీరు ఇప్పుడు రాముని సాంప్రదాయము కలవారిగా అయ్యారు. పాండవులు, కౌరవులు ఒకే సాంప్రదాయానికి చెందినవారు, కానీ యాదవులు యూరోప్ వాసులు. యాదవులు యూరోప్ వాసులు అని గీత ద్వారా ఎవరూ అర్థము చేసుకోలేరు. వారు యాదవ సాంప్రదాయం కలవారు కూడా ఇక్కడి వారే అని అంటారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు - యాదవులు యూరోప్ వాసులు, వారు తమ వినాశనము కొరకు ఈ మిసైల్స్ మొదలైనవి తయారుచేసారు. పాండవులు విజయాన్ని పొందుతారు, వారు వెళ్ళి స్వర్గానికి యజమానులుగా అవుతారు. పరమాత్మయే వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు. పాండవులు కరిగిపోయి మరణించారని శాస్త్రాలలో చూపించారు, మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలేమీ అర్థం చేసుకోరు. రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు కదా. డ్రామా రహస్యాన్ని కొద్దిగా కూడా ఎవరూ అర్థం చేసుకోరు. బాబా వద్దకు పిల్లలు వస్తారు, నేను అంటాను - మీరు కావాలంటే ఆభరణాలు మొదలైనవి ధరించండి. పిల్లలు అంటారు - బాబా, ఇక్కడ ఆభరణాలు ఎక్కడ శోభిస్తాయి! పతిత ఆత్మకు, పతిత శరీరానికి ఆభరణాలు ఏమి శోభిస్తాయి! అక్కడ మేము ఈ ఆభరణాలు మొదలైనవాటితో అలంకరించబడి ఉంటాము. లెక్కలేనంత ధనము ఉంటుంది, అందరూ సుఖముగా ఉంటారు. అక్కడ - వీరు రాజులు మనము ప్రజలము అని ఫీల్ అవుతుంది, కానీ దుఃఖము యొక్క విషయము ఉండదు. ఇక్కడ ధాన్యము మొదలైనవి లభించకపోతే మనుష్యులు దుఃఖితులుగా అవుతారు. అక్కడైతే అన్నీ లభిస్తాయి. దుఃఖము అన్న మాట నోటి నుండి వెలువడదు. దాని పేరే స్వర్గము. యూరోపియన్లు దానిని ‘ప్యారడైజ్’ (స్వర్గము) అని అంటారు. అక్కడ గాడ్-గాడెస్ (దేవీ-దేవతలు) ఉండేవారని భావిస్తారు, అందుకే వారి చిత్రాలను కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ఆ స్వర్గము ఇప్పుడు ఎక్కడుంది అన్నది ఎవరికీ తెలియదు. ఈ చక్రము ఎలా తిరుగుతుంది అని ఇప్పుడు మీకు తెలుసు. ప్రపంచము కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి కొత్తదిగా అవుతుంది. దేహీ-అభిమానులుగా అవ్వడములో ఎంతగానో శ్రమించాల్సి ఉంటుంది. మీరు దేహీ-అభిమానులుగా అయినట్లయితే ఈ అనేక రోగాలు మొదలైనవాటి నుండి విముక్తులుగా అవ్వగలరు. తండ్రిని స్మృతి చేయడము ద్వారా ఉన్నత పదవిని పొందుతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ దేహధారినీ కూడా తమకు ఆధారముగా చేసుకోకూడదు. శరీరాల పట్ల ప్రీతిని పెట్టుకోకూడదు. హృదయపూర్వకమైన ప్రీతిని ఒక్క తండ్రితో పెట్టుకోవాలి. ఎవరి నామ-రూపాలలోనూ చిక్కుకోకూడదు.

2. స్మృతి చార్టును అభిరుచితో పెట్టాలి. ఇందులో సోమరులుగా అవ్వకూడదు. చార్టులో పరిశీలించుకోవాలి - నా బుద్ధి ఎవరివైపుకైనా వెళ్తుందా? ఎంత సమయము వృధా చేస్తున్నాను? సుఖమిచ్చే తండ్రి ఎంత సమయము స్మృతిలో ఉంటున్నారు?

వరదానము:-
గృహస్థ వ్యవహారము మరియు ఈశ్వరీయ వ్యవహారము, రెండింటి సమానత ద్వారా సదా తేలికగా మరియు సఫలురుగా కండి

పిల్లలందరికీ శరీర నిర్వహణ మరియు ఆత్మ నిర్వహణ అనే డబల్ సేవ లభించింది. కానీ రెండు సేవలలోనూ సమయము మరియు శక్తుల యొక్క సమానమైన అటెన్షన్ కావాలి. ఒకవేళ శ్రీమతమనే ముల్లు సరిగ్గా ఉన్నట్లయితే రెండు వైపులా సమానంగా ఉంటుంది. కానీ గృహస్థము అన్న పదము అనడంతోనే గృహస్థులుగా అయిపోతారు, అప్పుడు సాకులు మొదలవుతాయి. కావున గృహస్థులము కాదు, ట్రస్టీలము - ఈ స్మృతి ద్వారా గృహస్థ వ్యవహారము మరియు ఈశ్వరీయ వ్యవహారము రెండింటిలో సమానత కలిగి ఉండండి, అప్పుడు సదా తేలికగా మరియు సఫలురుగా ఉంటారు.

స్లోగన్:-
ఫస్ట్ డివిజన్ లోకి వచ్చేందుకు కర్మేంద్రియాజీతులుగా, మాయాజీతులుగా అవ్వండి.

అవ్యక్త సూచనలు -‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి’’

మీ శివశక్తి కంబైండు రూపము యొక్క స్మృతిచిహ్నము సదా పూజించబడుతుంది. శక్తి శివుడి నుండి వేరుగా లేరు, శివుడు శక్తి నుండి వేరుగా లేరు. ఇలా కంబైండు రూపములో ఉండండి, ఈ స్వరూపాన్నే సహజయోగీ అని అంటారు. మీరు యోగము జోడించేవారు కాదు కానీ సదా కంబైండుగా అనగా తోడుగా ఉండేవారు. తోడుగా ఉంటాము, తోడుగా జీవిస్తాము, తోడుగా నడుస్తాము... అన్న ప్రతిజ్ఞ ఏదైతే ఉందో, ఈ ప్రతిజ్ఞను పక్కాగా గుర్తుంచుకోండి.