ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు - ఆత్మిక తండ్రి ఈ సాధారణ పాత తనువు
యొక్క నోటి ద్వారా చెప్పారు. తండ్రి చెప్తున్నారు, నేను పాత తనువులోకి, పాత
రాజధానిలోకి రావలసి ఉంటుంది. ఇప్పుడు ఇది రావణుడి రాజధాని. ఈ తనువు కూడా పరాయిది
ఎందుకంటే ఈ శరీరములోనైతే ముందు నుండే ఆత్మ ఉంది. నేను పరాయి తనువులోకి ప్రవేశిస్తాను.
నాకు నాదంటూ తనువు ఉంటే దానికి పేరు ఉండేది. నా పేరు మారదు. నన్ను శివబాబా అని
అంటారు. పాటనైతే పిల్లలు రోజూ వింటారు. నవయుగము అనగా కొత్త ప్రపంచమైన సత్యయుగము
వచ్చింది. ఇప్పుడు మేలుకోండి అని ఎవరికి చెప్తున్నారు? ఆత్మలకు, ఎందుకంటే ఆత్మలు
ఘోర అంధకారములో నిద్రిస్తూ ఉన్నారు. వివేకము ఏ మాత్రము లేదు. తండ్రి గురించే తెలియదు.
ఇప్పుడు తండ్రి మేలుకొలిపేందుకు వచ్చారు. ఇప్పుడు మీకు అనంతమైన తండ్రి గురించి
తెలుసు. వారి ద్వారా కొత్త యుగములో అనంతమైన సుఖము లభించనున్నది. సత్యయుగాన్ని కొత్త
యుగమని, కలియుగాన్ని పాత యుగమని అంటారు. విద్వాంసులు, పండితులు మొదలైనవారెవ్వరికీ
తెలియదు. కొత్త యుగము మళ్ళీ పాతదిగా ఎలా అవుతుందని ఎవరినైనా అడిగితే, ఎవ్వరూ
చెప్పలేకపోతారు. ఇది లక్షల సంవత్సరాల విషయము కదా అని అంటారు. మనము కొత్త యుగము నుండి
మళ్ళీ పాత యుగములోకి ఎలా వచ్చాము అనగా స్వర్గవాసుల నుండి నరకవాసులుగా ఎలా అయ్యాము
అనేది ఇప్పుడు మీకు తెలుసు. మనుష్యులకైతే ఏమీ తెలియదు, ఎవరినైతే పూజిస్తున్నారో వారి
జీవిత చరిత్ర గురించి కూడా తెలియదు. ఉదాహరణకు జగదంబను పూజిస్తారు, కానీ ఆ అంబ ఎవరు
అనేది తెలియదు. అంబ అని వాస్తవానికి మాతలను అంటారు. కానీ పూజ అయితే ఒక్కరికే జరగాలి.
శివబాబాకు కూడా ఒకటే అవ్యభిచారి స్మృతిచిహ్నము ఉంది. అంబ కూడా ఒక్కరే. కానీ జగదంబ
గురించి తెలియదు. వీరు జగత్తుకు అంబ మరియు లక్ష్మి జగత్తుకు మహారాణి. జగత్తుకు అంబ
ఎవరు మరియు జగత్తుకు మహారాణి ఎవరు అనేది మీకు తెలుసు. ఈ విషయాలను ఎప్పుడూ ఎవ్వరూ
తెలుసుకోలేరు. లక్ష్మిని దేవి అని, జగదంబను బ్రాహ్మణి అని అంటారు. బ్రాహ్మణులు
సంగమములోనే ఉంటారు. ఈ సంగమయుగము గురించి ఎవ్వరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మా ద్వారా
కొత్త పురుషోత్తమ సృష్టి రచింపబడుతుంది. పురుషోత్తములు మీకు అక్కడ కనిపిస్తారు. ఈ
సమయములో బ్రాహ్మణులైన మీరు గాయన యోగ్యులుగా ఉన్నారు. సేవ చేస్తున్నారు. ఆ తర్వాత
మీరు పూజకు యోగ్యులుగా అవుతారు. బ్రహ్మాకు ఇన్ని భుజాలను చూపిస్తారు, మరి అంబకు
ఎందుకు చూపించరు. ఆమెకు కూడా అందరూ పిల్లలే కదా. తల్లి-తండ్రియే ప్రజాపిత అవుతారు.
పిల్లలను ప్రజాపిత అని అనరు. లక్ష్మీ-నారాయణులను ఎప్పుడూ సత్యయుగములో జగత్పిత,
జగన్మాత అని అనరు. ప్రజాపిత పేరు ప్రసిద్ధి చెందింది. జగత్పిత మరియు జగన్మాత ఒక్కరే.
మిగిలినవారంతా వారి పిల్లలు. అజ్మేర్ లో ప్రజాపిత బ్రహ్మా మందిరములోకి వెళ్తే వారిని
బాబా (తండ్రి) అని అంటారు, ఎందుకంటే వారే ప్రజాపిత. హద్దులోని తండ్రులు పిల్లలకు
జన్మనిస్తారు కనుక వారు హద్దులోని ప్రజాపితలు. వీరు అనంతమైన ప్రజాపిత. శివబాబా అయితే
ఆత్మలందరికీ అనంతమైన తండ్రి. పిల్లలైన మీరు ఈ వ్యత్యాసాన్ని కూడా వ్రాయాలి. జగదంబ
సరస్వతి ఒక్కరే. వారికి దుర్గ, కాళి మొదలైన పేర్లు ఎన్ని పెట్టారు. అంబకు మరియు
బాబాకు మీరందరూ పిల్లలు. వీరు రచన కదా. ప్రజాపిత బ్రహ్మాకు కుమార్తె సరస్వతి, వారిని
అంబ అని అంటారు. మిగిలినవారంతా కుమారులు మరియు కుమార్తెలు. అందరూ దత్తత
తీసుకోబడినవారే. ఇంతమంది పిల్లలు ఎక్కడి నుండి రాగలరు. వీరంతా ముఖవంశావళి. నోటి
ద్వారా స్త్రీని రచించారు కనుక ఆ తండ్రి రచయిత అయినట్లు. ఈమె నా వారు, నేను ఈమె
ద్వారా పిల్లలకు జన్మనిచ్చాను అని లౌకిక తండ్రి అంటారు. ఇక్కడ వీరంతా దత్తత
తీసుకోబడినవారు. వీరంతా నోటి ద్వారా రచించబడిన ఈశ్వరీయ రచన. ఆత్మలైతే ముందు నుండే
ఉన్నాయి. ఆత్మలను దత్తత తీసుకోవడం జరగదు. తండ్రి అంటున్నారు, ఆత్మలైన మీరు సదా నా
పిల్లలు, ఇప్పుడు మళ్ళీ నేను వచ్చి ప్రజాపిత బ్రహ్మా ద్వారా పిల్లలను దత్తత
తీసుకుంటాను. పిల్లలను (ఆత్మలను) దత్తత తీసుకోరు, కుమారులను మరియు కుమార్తెలను
దత్తత తీసుకుంటారు. ఇవి కూడా అర్థం చేసుకోవలసిన చాలా సూక్ష్మమైన విషయాలు. ఈ విషయాలను
అర్థం చేసుకోవడం ద్వారా మీరు ఈ లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. వీరు ఇలా ఎలా
తయారయ్యారు అనేది మనము అర్థం చేయించగలము. వీరు విశ్వానికి యజమానులుగా అయ్యారంటే
అటువంటి కర్మలు ఏమి చేశారు. మీరు ప్రదర్శనీ మొదలైనవాటిలో కూడా ఈ ప్రశ్నను అడుగవచ్చు.
వీరు ఆ స్వర్గ రాజధానిని ఎలా తీసుకున్నారు అనేది మీకు తెలుసు. మీలో కూడా ప్రతి
ఒక్కరూ యథార్థ రీతిలో అర్థం చేయించలేరు. ఎవరిలోనైతే దైవీ గుణాలు ఉంటాయో, ఈ ఆత్మిక
సేవలో నిమగ్నమై ఉంటారో, వారు అర్థం చేయించగలరు. మిగిలినవారంతా మాయ రోగములో
చిక్కుకుని ఉంటారు. అనేక రకాల రోగాలు ఉన్నాయి. దేహాభిమానము యొక్క రోగము కూడా ఉంది.
ఈ వికారాలే మిమ్మల్ని రోగులుగా చేశాయి.
తండ్రి అంటున్నారు, నేను మిమ్మల్ని పవిత్రమైన దేవతలుగా తయారుచేస్తాను. మీరు
సర్వగుణ సంపన్నులుగా... పవిత్రముగా ఉండేవారు. ఇప్పుడు పతితముగా అయిపోయారు. అనంతమైన
తండ్రి ఈ విధముగా చెప్తున్నారు. ఇలా చెప్తున్నప్పుడు నిందించడం లేదు, ఇక్కడ అర్థం
చేయిస్తున్నారు. భారతవాసులకు అనంతమైన తండ్రి చెప్తున్నారు, నేను ఇక్కడ భారత్ లోకి
వస్తాను. భారత్ యొక్క మహిమ అయితే అపారమైనది. వారు ఇక్కడకు వచ్చి నరకాన్ని స్వర్గముగా
తయారుచేస్తారు, అందరికీ శాంతిని ఇస్తారు. కనుక అటువంటి తండ్రి మహిమ కూడా అపారమైనది.
వారి మహిమకు అవధులు లేవు. జగదంబ గురించి మరియు జగదంబ మహిమ గురించి ఎవ్వరికీ తెలియదు.
ఇది జగదంబ యొక్క జీవిత చరిత్ర, ఇది లక్ష్మి యొక్క జీవిత చరిత్ర అని వీరిరువురికీ
మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని కూడా మీరు తెలియజేయవచ్చు. ఆ జగదంబయే తర్వాత లక్ష్మిగా
అవుతారు. మళ్ళీ లక్ష్మియే 84 జన్మల తర్వాత జగదంబగా అవుతారు. చిత్రాలను కూడా
వేర్వేరుగా ఉంచాలి. లక్ష్మికి కలశము లభించినట్లుగా చూపిస్తారు కానీ లక్ష్మి
సంగమయుగములోకి ఎక్కడ నుంచి వచ్చారు. వారు సత్యయుగములో ఉండేవారు. ఈ విషయాలన్నింటినీ
తండ్రి అర్థం చేయిస్తున్నారు. చిత్రాలు తయారుచేసేందుకు ఎవరైతే నిమిత్తమో, వారు
విచార సాగర మంథనము చేయాలి. అప్పుడు అర్థం చేయించడం సహజమవుతుంది. ఇంతటి విశాల బుద్ధి
ఉండాలి, అప్పుడే హృదయాన్ని అధిరోహించగలరు. బాబాను మంచి రీతిలో స్మృతి చేసినప్పుడు,
జ్ఞాన చితిపై కూర్చున్నప్పుడు హృదయాన్ని అధిరోహించగలరు. అంతేకానీ ఎవరైతే వాణిని చాలా
బాగా నడిపిస్తారో, వారు హృదయాన్ని అధిరోహించగలరని కాదు. అలా కాదు. తండ్రి
చెప్తున్నారు, నంబరువారు పురుషార్థానుసారముగా ఎప్పుడైతే దేహాభిమానము సమాప్తమవుతుందో,
అప్పుడు అంతిమములో హృదయాన్ని అధిరోహించగలరు.
తండ్రి అర్థం చేయించారు, బ్రహ్మ జ్ఞానులు బ్రహ్మములో లీనమయ్యేందుకు కృషి చేస్తారు,
కానీ అలా ఎవ్వరూ లీనమవ్వలేరు. కానీ కృషి చేస్తారు, ఉత్తమ పదవిని పొందుతారు.
ప్లాటినమ్ తో తూకం వేసేటటువంటి మహాత్ములుగా అవుతారు ఎందుకంటే వారు బ్రహ్మములో
లీనమయ్యే కృషినైతే చేస్తున్నారు కదా. ఆ కృషికి కూడా ఫలము లభిస్తుంది. కానీ
ముక్తి-జీవన్ముక్తులు లభించవు. ఇప్పుడు ఈ పాత ప్రపంచము ఇక వెళ్ళిపోయినట్లే అని
పిల్లలైన మీకు తెలుసు. ఇన్ని బాంబులు తయారుచేశారు - ఇవన్నీ ఊరికే అలా ఉంచుకునేందుకని
తయారుచేయలేదు కదా. పాత ప్రపంచ వినాశనము కోసం ఈ బాంబులు పనికొస్తాయని మీకు తెలుసు.
అనేక రకాల బాంబులు ఉన్నాయి. తండ్రి జ్ఞాన-యోగాలను నేర్పిస్తారు, ఆ తర్వాత
రాజ-రాజేశ్వరులుగా, డబల్ కిరీటధారులైన దేవీ-దేవతలుగా అవుతారు. ఉన్నత పదవి ఏది.
బ్రాహ్మణులు పిలక రూపములో పైన ఉన్నారు. పిలక అన్నిటికన్నా పైన ఉంటుంది. ఇప్పుడు
పిల్లలైన మిమ్మల్ని పతితము నుండి పావనముగా చేసేందుకు తండ్రి వచ్చారు. తర్వాత మీరు
కూడా పతిత-పావనిగా అవుతారు - ఈ నషా ఉందా? మనము అందరినీ పావనముగా తయారుచేసి
రాజ-రాజేశ్వరులుగా తయారుచేస్తున్నామా? నషా ఉన్నట్లయితే చాలా సంతోషముగా ఉంటారు. నేను
ఎంతమందిని నా సమానముగా తయారుచేస్తున్నాను అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి.
ప్రజాపిత బ్రహ్మా మరియు జగదంబ, ఇరువురూ ఒకేలా ఉన్నారు. బ్రాహ్మణులను రచిస్తారు.
శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారయ్యే యుక్తిని తండ్రియే తెలియజేస్తారు. ఇది
శాస్త్రాలలోనేమీ లేదు. వాస్తవానికి ఇది గీతా యుగము. మహాభారత యుద్ధము కూడా తప్పకుండా
జరిగింది. రాజయోగాన్ని ఒక్కరికే నేర్పించి ఉంటారా. కానీ మనుష్యుల బుద్ధిలో అర్జునుడు
మరియు కృష్ణుడు మాత్రమే ఉన్నారు. ఇక్కడైతే అనేకమంది చదువుకుంటున్నారు. ఎంత
సాధారణముగా కూర్చుని ఉన్నారో చూడండి. చిన్న పిల్లలు అల్ఫ్ బే (ఉర్దు అక్షరాలు)
చదువుకుంటారు కదా. మీరు కూర్చున్నారు, మీకు కూడా అల్ఫ్ బే (భగవంతుడు మరియు
రాజ్యాధికార వారసత్వము) గురించి చదివిస్తున్నారు. భగవంతుడు మరియు వారసత్వము. తండ్రి
అంటున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. ఎటువంటి
ఆసురీ కర్మలు చేయకూడదు. దైవీ గుణాలను ధారణ చేయాలి. నాలో ఏ అవగుణాలు లేవు కదా అని
చూసుకోవాలి. నిర్గుణుడినైన నాలో గుణాలేవీ లేవు అని అంటారు. ఇప్పుడు నిర్గుణ ఆశ్రమము
అని కూడా ఉంది కానీ అర్థమేమీ తెలియదు. నిర్గుణ అనగా నాలో ఏ గుణము లేదు. ఇప్పుడు
గుణవంతులుగా చేయడమనేది తండ్రి కర్తవ్యమే. తండ్రికి సంబంధించిన టైటిల్స్ యొక్క టోపీని
స్వయముపై పెట్టేసుకున్నారు. తండ్రి ఎన్ని విషయాలను అర్థం చేయిస్తారు. డైరెక్షన్లు
కూడా ఇస్తారు. జగదంబకు మరియు లక్ష్మికి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని చూపించండి.
బ్రహ్మా-సరస్వతులు సంగమయుగానికి చెందినవారు, లక్ష్మీ-నారాయణులు సత్యయుగానికి
చెందినవారు. ఈ చిత్రాలు అర్థం చేయించడం కోసం ఉన్నాయి. సరస్వతి బ్రహ్మాకు కుమార్తె.
మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు.
సత్యయుగీ దేవతలు కూడా మనుష్యులే కానీ వారిని దేవతలని అంటారు, వారిని మనుష్యులు అని
అంటే వారిని అవమానపరిచినట్లు అవుతుంది, అందుకే వారిని దేవీ-దేవతలు లేక భగవాన్-భగవతి
అని అంటారు. ఒకవేళ రాజా-రాణులను భగవాన్-భగవతి అని అంటే మరి ప్రజలను కూడా అలా అనవలసి
ఉంటుంది, అందుకే దేవీ-దేవతలు అని అనడం జరుగుతుంది. త్రిమూర్తి చిత్రము కూడా ఉంది.
సత్యయుగములో చాలా కొద్దిమంది మనుష్యులే ఉంటారు, కలియుగములో చాలా ఎక్కువమంది
మనుష్యులు ఉంటారు. ఇది ఎలా అర్థం చేయించాలి. దీని కోసం సృష్టి చక్రము చిత్రము కూడా
తప్పకుండా కావాలి. ప్రదర్శనీలకు ఎంతోమందిని పిలుస్తారు. కస్టమ్స్ కలెక్టర్ కు అయితే
ఎప్పుడూ ఎవ్వరూ ఆహ్వానము ఇవ్వలేదు. ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి, ఇందులో చాలా
విశాల బుద్ధి కావాలి.
తండ్రిపై గౌరవముంచాలి. హుస్సేన్ గుర్రాన్ని ఎంతగా అలంకరిస్తారు. గుర్రముపై కప్పే
వస్త్రము ఎంత చిన్నదిగా ఉంటుంది, గుర్రము ఎంత పెద్దదిగా ఉంటుంది. ఆత్మ కూడా ఎంత
చిన్నని బిందువు, దాని అలంకరణ ఎంత పెద్దది. ఇది అకాలమూర్తి యొక్క సింహాసనము కదా.
సర్వవ్యాపి అన్న విషయాన్ని కూడా గీత నుండి తీసుకున్నారు. తండ్రి అంటున్నారు, నేను
ఆత్మలకు రాజయోగాన్ని నేర్పిస్తాను, కావున సర్వవ్యాపిని ఎలా అవుతాను.
తండ్రి-టీచర్-గురువు సర్వవ్యాపి ఎలా అవుతారు. తండ్రి అంటున్నారు, నేను అయితే మీకు
తండ్రిని, అలాగే జ్ఞానసాగరుడిని. మీకు అనంతమైన చరిత్ర-భౌగోళికాన్ని అర్థం చేసుకోవడము
ద్వారా అనంతమైన రాజ్యము లభిస్తుంది. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. మాయ ఒక్కసారిగా
ముక్కు పట్టుకుంటుంది, అప్పుడు నడవడిక అశుద్ధముగా అయిపోతుంది, అప్పుడు - ఇటువంటి
పొరపాటు జరిగిపోయింది, మేము నల్ల ముఖము చేసుకున్నాము అని వ్రాస్తారు. ఇక్కడైతే
పవిత్రత నేర్పించడం జరుగుతుంది, అయినా ఒకవేళ ఎవరైనా పడిపోతే అందులో తండ్రి ఏం
చేయగలరు. ఇంట్లో పిల్లలెవరైనా అశుద్ధముగా అయితే, నల్ల ముఖము చేసుకుంటే, నీవు మరణించి
ఉంటే మంచిదని తండ్రి అంటారు. అనంతమైన తండ్రికి డ్రామా గురించి తెలుసు, అయినా కానీ
వారు కూడా ఇలా అంటారు కదా. మీరు ఇతరులకు శిక్షణను ఇచ్చి స్వయం పడిపోతే 1000 రెట్లు
పాపం వస్తుంది. మాయ చెంపదెబ్బ వేసిందని అంటారు. మాయ ఎలా దెబ్బ వేస్తుందంటే
ఒక్కసారిగా తెలివినే మాయం చేసేస్తుంది.
తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు, కళ్ళు చాలా మోసము చేస్తాయి. ఎప్పుడూ కూడా ఎటువంటి
వికర్మలు చేయకూడదు. తుఫానులైతే ఎన్నో వస్తాయి ఎందుకంటే మీరు యుద్ధ మైదానములో ఉన్నారు
కదా. ఏం జరుగుతుందో కూడా తెలియదు. మాయ వెంటనే చెంపదెబ్బ వేస్తుంది. ఇప్పుడు మీరు
ఎంత తెలివైనవారిగా అవుతున్నారు. ఆత్మయే తెలివైనదిగా అవుతుంది కదా. ఆత్మయే
తెలివిహీనముగా ఉండేది. ఇప్పుడు తండ్రి తెలివైనవారిగా తయారుచేస్తున్నారు. చాలామంది
దేహాభిమానములో ఉన్నారు. నేను ఒక ఆత్మను అని అర్థం చేసుకోరు. తండ్రి ఆత్మలైన మనల్ని
చదివిస్తున్నారు. ఆత్మనైన నేను ఈ చెవుల ద్వారా వింటున్నాను. ఇప్పుడు తండ్రి
చెప్తున్నారు, వికారాలకు సంబంధించిన విషయాలేవీ ఈ చెవులతో వినకండి. తండ్రి మిమ్మల్ని
విశ్వానికి యజమానులుగా తయారుచేస్తున్నారు, గమ్యము చాలా గొప్పది. మృత్యువు సమీపముగా
వచ్చినప్పుడు మీకు భయమనిపిస్తుంది. మనుష్యులు మరణించే సమయములో కూడా మిత్ర-సంబంధీకులు
మొదలైనవారు - భగవంతుడిని స్మృతి చేయండి లేదా మీ గురువును మొదలైనవారినెవరినైనా స్మృతి
చేయండి అని చెప్తారు కదా. దేహధారులను స్మృతి చేయడం నేర్పిస్తారు. తండ్రి
చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇది పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఉంది.
తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. దేహధారులను స్మృతి చేయకూడదు.
తల్లి-తండ్రులు కూడా దేహధారులే కదా. నేను అయితే విచిత్రుడిని, విదేహిని, వీరిలో
కుర్చుని మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను. మీరు ఇప్పుడు జ్ఞాన-యోగాలను
నేర్చుకుంటున్నారు. రాజ-రాజేశ్వరులుగా అయ్యేందుకు మేము జ్ఞానసాగరుడైన తండ్రి ద్వారా
జ్ఞానాన్ని నేర్చుకుంటున్నామని మీరు అంటారు. జ్ఞానసాగరుడు జ్ఞానాన్ని కూడా
నేర్పిస్తారు, రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.