29-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీ భద్రత కొరకు వికారాల రూపీ మాయ
యొక్క పంజా నుండి సదా స్వయాన్ని రక్షించుకుంటూ ఉండాలి, దేహాభిమానములోకి ఎప్పుడూ
రాకూడదు’’
ప్రశ్న:-
పుణ్యాత్మగా అయ్యేందుకు తండ్రి పిల్లలందరికీ ఏ ముఖ్యమైన శిక్షణను ఇస్తారు?
జవాబు:-
బాబా అంటారు -
పిల్లలూ, పుణ్యాత్మగా అవ్వాలంటే 1. శ్రీమతముపై సదా నడుస్తూ ఉండండి. స్మృతియాత్రలో
నిర్లక్ష్యము చేయకండి. 2. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థము చేసి
కామమనే మహాశత్రువుపై విజయము పొందండి. పుణ్యాత్మగా అయి ఈ దుఃఖధామాన్ని దాటి
సుఖధామములోకి వెళ్ళేందుకు ఇదే సమయము.
ఓంశాంతి
తండ్రియే ప్రతిరోజు పిల్లలను ప్రశ్నిస్తూ ఉంటారు. పిల్లలు కలవారు అని శివబాబా కోసం
ఈ విధముగా అనరు. ఆత్మలైతే అనాదిగా ఉన్నాయి. తండ్రి కూడా అనాదిగా ఉన్నారు. ఈ సమయములో
ఎప్పుడైతే తండ్రి మరియు దాదా ఇరువురూ ఉన్నారో అప్పుడే పిల్లలను సంభాళించవలసి ఉంటుంది.
ఎంతమంది పిల్లలను సంభాళించవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరి లెక్కాపత్రాన్ని ఉంచవలసి
ఉంటుంది. లౌకిక తండ్రికి కూడా చింత ఉంటుంది కదా. లౌకిక తండ్రి ఏమనుకుంటారంటే - నా
పిల్లలు కూడా ఈ బ్రాహ్మణ కులములోకి వస్తే బాగుంటుంది, నా పిల్లలు కూడా పవిత్రముగా
అయి పవిత్ర ప్రపంచములోకి వెళ్ళాలి, ఈ పాత మాయ యొక్క కాలువలో వారు కొట్టుకుపోకూడదు
అని. అనంతమైన తండ్రికి కూడా పిల్లల గురించి చింత ఉంటుంది. ఎన్ని సెంటర్లు ఉన్నాయి,
ఏ పిల్లలను ఎక్కడికి పంపిస్తే సురక్షితముగా ఉంటారు అన్న చింత వారికి ఉంటుంది. ఈ
రోజుల్లో భద్రత కూడా కష్టముగా ఉంది. ప్రపంచములో ఏ విధమైన భద్రతా లేదు.
స్వర్గములోనైతే ప్రతి ఒక్కరికి భద్రత ఉంటుంది. ఇక్కడ ఎవరికీ భద్రత లేదు. ఎక్కడో
అక్కడ వికారాల రూపీ మాయ యొక్క పంజాలో చిక్కుకుపోతారు. ఇప్పుడు ఆత్మలైన మీకు ఇక్కడ
చదువు లభిస్తుంది. సత్యమైన సాంగత్యము కూడా ఇక్కడే ఉంది. ఇక్కడే దుఃఖధామాన్ని దాటి
సుఖధామములోకి వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు దుఃఖధామము అంటే ఏమిటి, సుఖధామము
అంటే ఏమిటి అనేది తెలిసింది. తప్పకుండా ఇప్పుడిది దుఃఖధామము. మనము ఎన్నో పాపాలు
చేసాము. ఆ ప్రపంచములో పుణ్యాత్ములు మాత్రమే ఉంటారు. మనము ఇప్పుడు పుణ్యాత్ములుగా
అవ్వాలి. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ మీ 84 జన్మల చరిత్ర-భౌగోళికముల గురించి
తెలుసుకున్నారు. ప్రపంచములోనివారికెవ్వరికీ 84 జన్మల చరిత్ర-భౌగోళికముల గురించి
తెలియదు. ఇప్పుడు తండ్రి వచ్చి పూర్తి జీవితకథను అర్థం చేయించారు. స్మృతియాత్ర
ద్వారా మనము పూర్తి పుణ్యాత్మగా అవ్వాలని ఇప్పుడు మీకు తెలుసు. నిర్లక్ష్యము
కారణముగానే ఇందులోనే చాలా మోసపోతూ ఉంటారు. తండ్రి అంటారు - ఈ సమయములో నిర్లక్ష్యము
చేయడము మంచిది కాదు. శ్రీమతముపై నడవాలి. అందులో కూడా ముఖ్యమైన విషయము ఏం
చెప్తున్నారంటే - ఒకటేమో, స్మృతియాత్రలో ఉండండి, రెండు, కామమనే మహాశత్రువుపై విజయము
పొందాలి. తండ్రిని అందరూ పిలుస్తారు ఎందుకంటే వారి నుండి ఆత్మలకు శాంతి మరియు సుఖము
యొక్క వారసత్వము లభిస్తుంది. ఇంతకుముందు దేహాభిమానులుగా ఉండేవారు కావున ఏమీ తెలిసేది
కాదు. ఇప్పుడు పిల్లలను ఆత్మాభిమానులుగా తయారుచేయడం జరుగుతుంది. కొత్తవారికి
మొట్టమొదట ఒకటేమో హద్దులోని తండ్రి గురించి, మరొకటి అనంతమైన తండ్రి గురించి పరిచయము
ఇవ్వాలి. అనంతమైన తండ్రి నుండి స్వర్గము యొక్క భాగ్యము లభిస్తుంది. హద్దులోని తండ్రి
నుండి నరకము యొక్క భాగ్యము లభిస్తుంది. పిల్లలు ఎప్పుడైతే యుక్త వయస్కులుగా అవుతారో
అప్పుడు ఆస్తికి హక్కుదారులుగా అవుతారు. ఎప్పుడైతే ఆ వివేకము వస్తుందో అప్పుడిక
మెల్ల-మెల్లగా మాయకు ఆధీనులుగా అయిపోతారు. అవన్నీ రావణ రాజ్యము (వికారీ ప్రపంచము)
యొక్క ఆచార వ్యవహారాలు. ఇప్పుడు మీకు తెలుసు, ఈ ప్రపంచము మారుతోంది, ఈ పాత ప్రపంచము
యొక్క వినాశనము జరుగుతుంది. ఒక్క గీతలోనే వినాశనానికి సంబంధించిన వర్ణన ఉంది, ఇంకే
ఇతర శాస్త్రాలలోనూ మహాభారత మహాభారీ యుద్ధానికి సంబంధించిన వర్ణన లేదు. గీతకు
సంబంధించినది ఈ పురుషోత్తమ సంగమయుగమే. గీతా యుగము అనగా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము
యొక్క స్థాపన. గీత దేవీ-దేవతా ధర్మము యొక్క శాస్త్రము. ఇది గీతా యుగము, ఈ సమయములోనే
కొత్త ప్రపంచము స్థాపన అవుతోంది. మనుష్యులు కూడా మారాలి. మనుష్యుల నుండి దేవతలుగా
తయారవ్వాలి. కొత్త ప్రపంచములో తప్పకుండా దైవీ గుణాలు కల మనుష్యులు కావాలి కదా. ఈ
విషయాల గురించి ప్రపంచానికి తెలియదు. వారు కల్పము ఆయుష్షును చాలా ఎక్కువగా చూపించారు.
ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు తప్పకుండా బాబా మమ్మల్ని
చదివిస్తున్నారు అని భావిస్తారు. శ్రీకృష్ణుడిని ఎప్పుడూ తండ్రి, టీచరు మరియు గురువు
అని అనలేరు. శ్రీకృష్ణుడు టీచరు అయినట్లయితే మరి వారు ఎక్కడి నుండి నేర్చుకున్నారు?
వారిని జ్ఞానసాగరుడు అని అనలేరు.
ఇప్పుడు పిల్లలైన మీరు పెద్ద-పెద్దవారికి అర్థం చేయించాలి. సేవను ఏ విధముగా
వృద్ధి చేయాలి, విహంగ మార్గపు సేవ ఎలా జరుగుతుంది అని పరస్పరము కలిసి చర్చించుకోవాలి.
బ్రహ్మాకుమారీల గురించి ఎవరైతే ఎంతో గొడవ చేస్తూ ఉన్నారో, వారే తర్వాత వీరు
సత్యమైనవారు అని అర్థం చేసుకుంటారు. ఇక మిగిలిన ప్రపంచమంతా అసత్యమైనది, అందుకే
సత్యము యొక్క నావను కదలిస్తూ ఉంటారు. తుఫానులైతే వస్తాయి కదా. మీరు ఆవలి తీరానికి
వెళ్ళే నావ వంటి వారు. మేము ఈ మాయావీ ప్రపంచాన్ని దాటి వెళ్ళాలి అని మీకు తెలుసు.
అన్నింటికన్నా మొదటి నంబరులో వచ్చే తుఫాను దేహాభిమానము. అది అన్నింటికన్నా చెడ్డది,
అది అందరినీ పతితముగా తయారుచేసింది. అందుకే తండ్రి కామము మహాశత్రువు అని అంటారు. ఇది
చాలా తీవ్రమైన తుఫాను వంటిది. దీనిని జయించినవారు కూడా కొందరు ఉన్నారు. గృహస్థ
వ్యవహారములోకి వెళ్ళి ఉన్నారు, ఇక తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నము చేస్తారు.
కుమార, కుమారీలకైతే ఇది చాలా సహజము. అందుకే కన్నయ్య అన్న పేరు గాయనము చేయబడింది.
ఇంతమంది కన్యలు తప్పకుండా శివబాబాకు చెందినవారై ఉంటారు కదా. దేహధారి అయిన
శ్రీకృష్ణుడికైతే ఇంతమంది కన్యలు ఉండే అవకాశము లేదు. ఇప్పుడు మీరు ఈ చదువు ద్వారా
పట్టపురాణులుగా అవుతున్నారు. ఇందులో పవిత్రత కూడా ముఖ్యముగా కావాలి. స్మృతి చార్టు
సరిగ్గా ఉందా అని స్వయాన్ని చూసుకోవాలి. బాబా వద్దకు కొందరిది 5 గంటల చార్టు,
కొందరిది 2-3 గంటల చార్టు కూడా వస్తుంది. కొందరైతే అసలు రాయనే రాయరు. చాలా తక్కువగా
స్మృతి చేస్తారు. అందరి యాత్ర ఏకరసముగా ఉండదు. ఇప్పుడింకా ఎంతోమంది పిల్లలు వృద్ధి
చెందుతారు. ప్రతి ఒక్కరూ తమ చార్టు చూసుకోవాలి - నేను ఎంతవరకు పదవిని పొందగలను? నాకు
ఎంతవరకు సంతోషము ఉంది? ఉన్నతోన్నతమైన తండ్రికి చెందినవారిగా అయ్యాక మనకు సంతోషము సదా
ఎందుకు ఉండటం లేదు. డ్రామానుసారముగా మీరు చాలా భక్తిని చేసారు. భక్తులకు ఫలము
ఇచ్చేందుకే తండ్రి వచ్చారు. రావణ రాజ్యములోనైతే వికర్మలు జరుగుతూనే ఉంటాయి. మీరు
సతోప్రధాన ప్రపంచములోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఎవరైతే పూర్తి
పురుషార్థము చేయరో వారు సతోలోకి వస్తారు. అందరూ ఇంతటి జ్ఞానాన్ని తీసుకోరు. వారు
ఎక్కడున్నా సందేశాన్ని తప్పకుండా వింటారు, అందుకే మూలమూలలోకి వెళ్ళాలి. విదేశాలకు
కూడా ఈ మిషన్ (బృందము) వెళ్ళాలి. ఉదాహరణకు బౌద్ధులు మరియు క్రిస్టియన్ల మిషన్ లు
ఇక్కడ ఉన్నాయి కదా. ఇతర ధర్మాల వారిని తమ ధర్మములోకి తీసుకువచ్చే విశేష కార్యము
చేస్తారు. మేము వాస్తవానికి దేవీ-దేవతా ధర్మానికి చెందినవారము, ఇప్పుడు హిందూ
ధర్మానికి చెందినవారిగా అయిపోయాము అని మీరు అర్థం చేయిస్తారు. మీ వద్దకు చాలా వరకు
హిందూ ధర్మము వారే వస్తారు. వారిలోనూ ఎవరైతే శివుడు మరియు దేవతల పూజారులుగా ఉంటారో
వారు వస్తారు. రాజుల సేవ చేయండి అని బాబా అన్నారు కదా. వారు చాలా వరకు దేవతలను
పూజిస్తూ ఉంటారు, వారి ఇళ్ళల్లో మందిరాలు ఉంటాయి, వారి కళ్యాణము కూడా చేయాలి. మేము
తండ్రితో పాటు దూరదేశము నుండి వచ్చామని మీరు కూడా భావించండి. తండ్రి వచ్చిందే కొత్త
ప్రపంచాన్ని స్థాపన చేయడానికి, మీరు కూడా ఆ కార్యము చేస్తున్నారు. ఎవరైతే స్థాపన
చేస్తారో వారు పాలన కూడా చేస్తారు. దైవీ రాజ్యాన్ని స్థాపన చేయడానికి, మొత్తం
విశ్వాన్ని స్వర్గముగా తయారుచేయడానికి మేము శివబాబాతో పాటు వచ్చామని మీకు లోలోపల నషా
ఉండాలి. ఈ దేశములో ఏమేమి చేస్తూ ఉన్నారో, పూజలు ఎలా చేస్తూ ఉన్నారో చూస్తున్నప్పుడు
ఆశ్చర్యము కలుగుతుంది. నవరాత్రులలో దేవీల పూజలు జరుగుతాయి కదా. రాత్రి కూడా ఉంది,
అలాగే పగలు కూడా ఉంటుంది. ఏమి విచిత్రము చూశాము... అని మీ వద్ద ఒక పాట కూడా ఉంది కదా.
మట్టితో మూర్తిని తయారుచేసి, అలంకరించి, దానిని పూజిస్తారు, ఆ తరువాత దానిపై ఎంత
మోహము ఏర్పడుతుందంటే ఇక దానిని నదిలో నిమజ్జనము చేయడానికి వెళ్ళినప్పుడు ఏడ్వడము
మొదలుపెడతారు. మనుష్యులు చనిపోయినప్పుడు ఆ దేహాన్ని కూడా నదీ తీరము వద్దకు
తీసుకువెళ్తారు. హరి అని జపించండి, హరి అని జపించండి అంటూ ముంచి వేస్తారు. అక్కడికి
ఎంతోమంది వెళ్తారు కదా. నది అయితే ఎల్లప్పుడూ ఉంటుంది. యమునా నదీ తీరములో
రాస-విలాసాలు మొదలైనవి చేసేవారని మీకు తెలుసు. అక్కడైతే పెద్ద-పెద్ద మహళ్ళు ఉంటాయి.
మీరే వెళ్ళి వాటిని తయారుచేయాలి. ఎవరైనా ఏదైనా పెద్ద పరీక్షను పాస్ అయినట్లయితే వారి
బుద్ధిలో ఏమి నడుస్తూ ఉంటుందంటే - మేము పాస్ అయిన తరువాత ఈ పని చేస్తాము, ఇల్లు
కట్టుకుంటాము అని. అలాగే పిల్లలైన మీరు కూడా - మేము దేవతలుగా అవుతాము, ఇప్పుడు మేము
మా ఇంటికి వెళ్తాము అన్న ఆలోచన పెట్టుకోవాలి. ఇంటిని గుర్తు చేసుకుంటూ సంతోషపడాలి.
మనుష్యులు ప్రయాణాలు చేసి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు - మేము ఎక్కడైతే జన్మించామో,
ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తున్నాము అన్న సంతోషము కలుగుతుంది. ఆత్మలైన మన ఇల్లు మూలవతనము.
ఎంత సంతోషము కలుగుతుంది. మనుష్యులు ముక్తి కోసమే ఇంత భక్తి చేస్తుంటారు. కానీ
డ్రామాలో పాత్ర ఎలా ఉందంటే, ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. వారు తప్పకుండా అర్ధకల్పము
పాత్రను అభినయించవలసిందేనని మీకు తెలుసు. ఇప్పుడు మన 84 జన్మలు పూర్తవుతాయి, ఇప్పుడు
తిరిగి వెళ్ళాలి, మళ్ళీ రాజధానిలోకి వస్తాము. కేవలం ఇల్లు మరియు రాజధానియే
గుర్తున్నాయి. ఇక్కడ కూర్చుని ఉన్నా కూడా కొంతమందికి తమ ఫ్యాక్టరీలు మొదలైనవి
గుర్తుకొస్తూ ఉంటాయి. ఉదాహరణకు బిర్లాను చూడండి, అతనికి ఎన్ని ఫ్యాక్టరీలు మొదలైనవి
ఉన్నాయి. అతనికి రోజంతా అవే ఆలోచనలు ఉంటూ ఉండవచ్చు. అతనికి బాబాను స్మృతి చేయమని
చెప్తే ఎన్ని అవరోధాలు ఉంటూ ఉండవచ్చు. ఘడియ, ఘడియ వ్యాపారమే గుర్తుకొస్తూ ఉంటుంది.
అందరికన్నా మాతలకు సహజము, వారికంటే కూడా కన్యలకు సహజము. జీవిస్తూ మరణించాలి, మొత్తము
ప్రపంచాన్ని మర్చిపోవాలి. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శివబాబాకు చెందినవారిగా
అవుతారు, దీనినే జీవిస్తూ మరణించడము అని అంటారు. దేహ సహితముగా, దేహపు సర్వ సంబంధాలను
వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శివబాబాకు చెందినవారిగా అయిపోవాలి. శివబాబానే
స్మృతి చేస్తూ ఉండాలి, ఎందుకంటే పాపాల భారము తలపై ఎంతగానో ఉంది. మనము జీవిస్తూ
మరణించి శివబాబాకు చెందినవారిగా అవ్వాలని అందరికీ మనసులో ఉంటుంది. శరీర భానము
ఉండకూడదు. మనము అశరీరిగా వచ్చాము, మళ్ళీ అశరీరిగా అయి వెళ్ళాలి. తండ్రికి
చెందినవారిగా అయ్యాము కావున తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తు ఉండకూడదు. ఇది త్వరగా
జరిగితే ఇక యుద్ధము కూడా త్వరగా ప్రారంభమవుతుంది. బాబా ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు.
మనమైతే శివబాబాకు చెందినవారము కదా. మనము అక్కడ ఉండేవారము. ఇక్కడైతే ఎంత దుఃఖము ఉంది.
ఇప్పుడు ఇది అంతిమ జన్మ. తండ్రి చెప్పారు - మీరు సతోప్రధానముగా ఉన్నప్పుడు ఇంకెవ్వరూ
ఉండేవారు కాదు, మీరు ఎంత షావుకారులుగా ఉండేవారు. ఈ సమయములో ధనము గవ్వల వలె ఉంది కానీ
అసలు ఇదేమీ కాదు, ఇవి కేవలం గవ్వలే. ఇవన్నీ అల్పకాలిక సుఖము కొరకే. తండ్రి అర్థం
చేయించారు - గతములో దానపుణ్యాలు చేసి ఉన్నట్లయితే ధనము కూడా బాగా లభిస్తుంది, ఆ
తరువాత మళ్ళీ దానము చేస్తారు, కానీ అది కేవలం ఒక్క జన్మ విషయము మాత్రమే. ఇక్కడైతే
జన్మ-జన్మాంతరాల కొరకు షావుకారులుగా అవుతారు. ఎంత పెద్ద వ్యక్తి అయితే అంత ఎక్కువ
దుఃఖాన్ని పొందుతారు. ఎవరి వద్దనైతే ఎంతో ధనము ఉందో వారు ఎంతగానో చిక్కుకుని ఉన్నారు.
వారు ఎప్పుడూ ఇక్కడ నిలవలేరు. సాధారణమైన పేదవారే సమర్పణ అవుతారు. షావుకారులు ఎప్పుడూ
అవ్వరు. వారు తమ పిల్లలు, మనవల కోసమే సంపాదిస్తూ ఉంటారు, తమ కులము నడుస్తూ ఉండాలని
సంపాదిస్తూ ఉంటారు. వారు స్వయం ఆ ఇంటిలో జన్మ తీసుకోరు కానీ మంచి కర్మలు చేసుకున్న
పిల్లలు, మనవలు అందులోకి వస్తారు. ఉదాహరణకు ఎవరైతే బాగా దానము చేస్తారో వారు రాజుగా
అయితే అవుతారు కానీ వారు సదా ఆరోగ్యవంతముగా అయితే ఉండరు. రాజ్యము ఉంటే ఉపయోగమేముంది,
అవినాశీ సుఖమైతే లేదు కదా. ఇక్కడ అడుగడుగులోనూ అనేక రకాల దుఃఖాలు ఉంటాయి. అక్కడ ఈ
దుఃఖాలన్నీ దూరమైపోతాయి. మా దుఃఖాలను దూరము చేయండి అని తండ్రిని పిలుస్తూ ఉంటారు.
దుఃఖాలన్నీ దూరమైపోవలసిందేనని మీరు అర్థం చేసుకుంటారు. కేవలం తండ్రిని స్మృతి చేస్తూ
ఉండాలి. ఒక్క తండ్రి నుండి తప్ప ఇంకెవ్వరి నుండీ వారసత్వము లభించదు. తండ్రి మొత్తము
విశ్వమంతటి దుఃఖాన్ని దూరము చేస్తారు. ఈ సమయములోనైతే జంతువులు మొదలైనవి కూడా ఎంత
దుఃఖములో ఉన్నాయి. దీని పేరే దుఃఖధామము. దుఃఖము పెరుగుతూ ఉంటుంది, తమోప్రధానముగా
అవుతూ ఉంటారు. ఇప్పుడు మనము సంగమయుగములో కూర్చున్నాము, వారంతా కలియుగములో ఉన్నారు.
ఇది పురుషోత్తమ సంగమయుగము. బాబా మనల్ని పురుషోత్తములుగా తయారుచేస్తున్నారు. ఈ విషయము
గుర్తున్నా సంతోషము ఉంటుంది. భగవంతుడు చదివిస్తున్నారు, విశ్వానికి యజమానులుగా
తయారుచేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా స్మృతి చేయండి. భగవంతుని పిల్లలు చదువు ద్వారా
భగవాన్, భగవతీలుగా అవ్వాలి కదా. భగవంతుడు అయితే సుఖాన్ని ఇచ్చేవారు, మరి దుఃఖము ఎలా
లభిస్తుంది? అది కూడా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. భగవంతుని పిల్లలు మరి
దుఃఖములో ఎందుకు ఉన్నారు, భగవంతుడు దుఃఖహర్త-సుఖకర్త. తప్పకుండా పిల్లలు దుఃఖములోకి
వస్తారు కావుననే వారిని పిలుస్తారు. తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని మీకు
తెలుసు. మనము పురుషార్థము చేస్తున్నాము. ఇందులో సంశయము ఉండకూడదు. బి.కె.లైన మనము
రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. మనము అబద్ధాలు చెప్పము కదా. ఎవరికైనా సంశయము వస్తే
- ఇది చదువు అని వారికి అర్థం చేయించాలి. వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. మనము
సంగమయుగీ బ్రాహ్మణులము, పిలక వంటి వారము. ప్రజాపిత బ్రహ్మా ఉన్నారు కావున తప్పకుండా
బ్రాహ్మణులు కూడా ఉండాలి. మీకు కూడా అర్థం చేయించడం జరిగింది, అప్పుడే నిశ్చయము
ఏర్పడింది. ఇకపోతే ముఖ్యమైన విషయము స్మృతియాత్ర, ఇందులోనే విఘ్నాలు ఏర్పడతాయి. తమ
చార్టు చూసుకుంటూ ఉండండి - నేను ఎంతవరకు బాబాను స్మృతి చేస్తున్నాను? నాకు ఎంతవరకు
సంతోషపు పాదరసము పైకి ఎక్కుతుంది? మాకు తోట యజమాని అయిన, పతిత-పావనుడి యొక్క చేయి
లభించింది అన్న ఆంతరిక సంతోషము ఉండాలి. మనము శివబాబాతో బ్రహ్మా ద్వారా షేక్ హాండ్
చేస్తాము. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తమ ఇంటిని మరియు రాజధానిని స్మృతి చేస్తూ అపారమైన సంతోషములో ఉండాలి. సదా ఈ
స్మృతిలో ఉండాలి - ఇప్పుడు మా యాత్ర పూర్తి అయ్యింది, ఇక మేము మా ఇంటికి వెళ్తాము,
మళ్ళీ రాజధానిలోకి వస్తాము.
2. మేము శివబాబాతో బ్రహ్మా ద్వారా షేక్ హాండ్ చేస్తాము, ఆ తోట యజమాని మమ్మల్ని
పతితుల నుండి పావనులుగా తయారుచేస్తున్నారు, మేము ఈ చదువు ద్వారా స్వర్గపు
పట్టపురాణిగా అవుతాము - ఈ ఆంతరిక సంతోషములోనే ఉండాలి.
వరదానము:-
మూడు రకాల విజయం మెడల్స్ ను ప్రాప్తి చేసుకునే సదా విజయీ భవ
విజయమాలలో నంబరును ప్రాప్తి చేసుకునేందుకు మొదట స్వయముపై
విజయులుగా, ఆ తరువాత సర్వులపై విజయులుగా, ఆ తర్వాత ప్రకృతిపై విజయులుగా అవ్వండి.
ఎప్పుడైతే ఈ మూడు రకాల విజయం మెడల్స్ ప్రాప్తిస్తాయో అప్పుడు విజయమాలలోని మణులుగా
అవ్వగలరు. స్వయముపై విజయులుగా అవ్వడము అనగా అర్థము తమ వ్యర్థ భావాన్ని, స్వభావాన్ని
శ్రేష్ఠ భావము, శుభ భావనతో పరివర్తన చేయడము. ఎవరైతే ఈ విధముగా స్వయముపై విజయులుగా
అవుతారో, వారే ఇతరులపై కూడా విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ప్రకృతిపై విజయాన్ని
ప్రాప్తి చేసుకోవడం అనగా అర్థము వాయుమండలము, వైబ్రేషన్లు మరియు స్థూల ప్రకృతి యొక్క
సమస్యలపై విజయులుగా అవ్వడము.
స్లోగన్:-
స్వయము
యొక్క కర్మేంద్రియాలపై సంపూర్ణ రాజ్యము చేసేవారే సత్యమైన రాజయోగులు.
అవ్యక్త ప్రేరణలు -
సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి
పిల్లలైన మీకు
జ్ఞానముతోపాటుగా సత్యమైన ఆత్మిక ప్రేమ లభించింది. ఆ ఆత్మిక ప్రేమయే ప్రభువుకు
చెందినవారిగా చేసింది. పిల్లలు ప్రతి ఒక్కరికీ డబుల్ ప్రేమ లభిస్తుంది - ఒకటి తండ్రి
ప్రేమ, మరొకటి దైవీ పరివారము యొక్క ప్రేమ. కావున ఈ ప్రేమ యొక్క అనుభవము దీపపు పురుగు
వలె తయారుచేసింది. ప్రేమయే అయస్కాంతము వలె పని చేస్తుంది. అప్పుడిక వినేందుకు మరియు
మరణించేందుకు కూడా సిద్ధమైపోతారు. సంగమములో ఎవరైతే సత్యమైన ప్రేమలో జీవిస్తూనే
మరణిస్తారో, వారే స్వర్గములోకి వెళ్తారు.
| | |