01-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రికి పిల్లలైన మీరంటేనే ఎంతో ప్రేమ, తండ్రి మిమ్మల్ని తీర్చిదిద్దేందుకే శ్రీమతాన్ని ఇస్తారు, సదా ఈశ్వరీయ మతముపై నడుస్తూ స్వయాన్ని పవిత్రముగా తయారుచేసుకోండి’’

ప్రశ్న:-
విశ్వములో శాంతి స్థాపన ఎప్పుడు మరియు ఏ విధి ద్వారా జరుగుతుంది?

జవాబు:-
మీకు తెలుసు - విశ్వములో శాంతి అయితే మహాభారత యుద్ధము తర్వాతనే స్థాపన అవుతుంది. కానీ దాని కొరకు మీరు ముందు నుండే తయారుగా ఉండాలి. మీ కర్మాతీత అవస్థను తయారుచేసుకునేందుకు కృషి చేయాలి. సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని స్మరణ చేస్తూ తండ్రి స్మృతి ద్వారా సంపూర్ణ పావనముగా తయారవ్వాలి. అప్పుడు ఈ సృష్టి పరివర్తన జరుగుతుంది.

పాట:-
నేడు మానవుడు అంధకారములో ఉన్నాడు...

ఓంశాంతి
ఈ పాట భక్తి మార్గములో గానం చేయబడినది. మేము అంధకారములో ఉన్నాము, ఇప్పుడు జ్ఞానము యొక్క మూడవ నేత్రాన్ని ఇవ్వండి అని అంటారు. జ్ఞాన సాగరుడి నుండి జ్ఞానాన్ని కోరుకుంటారు, మిగిలినదంతా అజ్ఞానము. కలియుగములో అందరూ అజ్ఞానమనే ఆసురీ నిద్రలో నిదురిస్తున్న కుంభకర్ణులవంటి వారని కూడా అంటూ ఉంటారు. తండ్రి అంటారు, జ్ఞానమైతే చాలా సహజమైనది. భక్తి మార్గములో ఎన్ని వేద-శాస్త్రాలు మొదలైనవి చదువుతారు, హఠయోగము చేస్తారు, గురువులు మొదలైనవారిని ఆశ్రయిస్తారు, ఇప్పుడు ఇక వారందరినీ వదలవలసి ఉంటుంది ఎందుకంటే వారు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. తండ్రియే రాజ్యాధికారాన్ని ఇస్తారు. మనుష్యులు మనుష్యులకు ఇవ్వలేరు. కానీ దాని గురించే సన్యాసులు, అది కాకిరెట్టతో సమానమైన సుఖము అని అంటారు ఎందుకంటే వారు స్వయం తమ ఇళ్ళు-వాకిళ్ళను వదిలి వెళ్తారు. ఈ జ్ఞానాన్ని జ్ఞానసాగరుడైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఈ రాజయోగాన్ని భగవంతుడే నేర్పిస్తారు. మనుష్యులు మనుష్యులను పావనముగా తయారుచేయలేరు. పతిత-పావనుడు ఒక్క తండ్రియే. మనుష్యులు భక్తి మార్గములో ఎంతగా చిక్కుకుపోయి ఉన్నారు. జన్మ-జన్మాంతరాల నుండి భక్తి చేస్తూ వచ్చారు, స్నానాలు చేయడానికి వెళ్తుంటారు. అలాగని కేవలం గంగా నదిలో మాత్రమే స్నానము చేస్తారని కాదు, ఎక్కడ చెరువు కనిపించినా దానిని కూడా పతిత-పావనిగా భావిస్తారు. ఇక్కడ కూడా గౌముఖము ఉంది, జలపాతాల నుండి నీరు వస్తుంది. బావిలో నీరు ఊరినప్పుడు దానిని పతిత-పావని గంగ అని అనరు కదా. ఇది కూడా ఒక తీర్థ స్థానమని మనుష్యులు భావిస్తారు. చాలామంది మనుష్యులు ఎంతో భావనతో అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారు. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానము లభించింది. మీరు ఈ విషయాలను వారికి తెలియజేసినా వారు అంగీకరించరు. మేము ఎన్నో శాస్త్రాలను చదివాము... అని వారికి తమ దేహ అహంకారము చాలా ఉంటుంది. తండ్రి అంటారు, ఇంతవరకు మీరు చదివినదంతా మర్చిపోండి. ఇప్పుడు ఈ విషయాలన్నింటి గురించి మనుష్యులకు ఎలా తెలుస్తుంది, అందుకే బాబా అంటారు - ఇటువంటి పాయింట్లను వ్రాసి ఏరోప్లేన్ల నుండి వేయండి. ఈ రోజుల్లో - విశ్వములో శాంతి ఎలా ఏర్పడుతుంది అని అంటుంటారు. ఎవరైనా దీనికి సలహా ఇచ్చినట్లయితే వారికి బహుమతి లభిస్తుంది, కానీ వారేమీ శాంతిని స్థాపన చేయలేరు కదా. శాంతి ఎక్కడ ఉంది? అసత్యమైన బహుమతులు ఇస్తూ ఉంటారు.

విశ్వములో శాంతి అనేది యుద్ధము తర్వాత ఏర్పడుతుందని ఇప్పుడు మీకు తెలుసు. ఈ యుద్ధము ఎప్పుడైనా ప్రారంభమవ్వవచ్చు. ఆ విధమైన ఏర్పాట్లు ఉన్నాయి. కేవలము పిల్లలైన మీదే ఆలస్యము. పిల్లలైన మీరు కర్మాతీత అవస్థను చేరుకోవాలి. అందులోనే శ్రమ ఉంది. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి మరియు గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానముగా పవిత్రముగా అవ్వండి మరియు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండండి. డ్రామానుసారముగా కల్పపూర్వము వలె విశ్వములో శాంతి స్థాపన జరిగిపోతుంది అని మీరు వ్రాయవచ్చు కూడా. మీరు ఇది కూడా అర్థం చేయించవచ్చు - విశ్వములో శాంతి అనేది సత్యయుగములోనే ఉంటుంది, ఇక్కడ తప్పకుండా అశాంతియే ఉంటుంది. కానీ కొందరు మీ మాటలను విశ్వసించరు, ఎందుకంటే వారు అసలు స్వర్గములోకి వచ్చేదే లేదు కావున వారు శ్రీమతముపై నడవనే నడవరు. శ్రీమతముపై పవిత్రముగా ఉండలేనివారు ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. ఉన్నతోన్నతమైన భగవంతుడి యొక్క మతము మీకు లభిస్తోంది. ఎవరి నడవడిక అయినా సరిగ్గా లేకపోతే, నీకు ఈశ్వరుడు మంచి మతాన్ని ఇవ్వాలి అని అంటారు కదా. ఇప్పుడు మీరు ఈశ్వరీయ మతముపై నడవాలి. తండ్రి అంటారు, 63 జన్మలు మీరు విషయసాగరములో మునకలు వేస్తూ వచ్చారు. తండ్రి పిల్లలతో మాట్లాడుతున్నారు. పిల్లలనే తండ్రి తీర్చిదిద్దుతారు కదా. మొత్తము ప్రపంచమునంతటినీ ఎలా తీర్చిదిద్దగలరు. పిల్లల ద్వారా అర్థం చేసుకోండి అని తండ్రి బయటివారికి చెప్తారు. తండ్రి బయటివారితో మాట్లాడరు. తండ్రికి పిల్లలే ప్రియమనిపిస్తారు. సవతి పిల్లలు అంత ప్రియమనిపించరు కదా. లౌకిక తండ్రి కూడా సుపుత్రులైన పిల్లలకే ధనాన్ని ఇస్తారు. పిల్లలందరూ ఒకేలా ఉండరు కదా. తండ్రి కూడా అంటారు, ఎవరైతే నావారిగా అవుతారో వారికే నేను వారసత్వాన్ని ఇస్తాను. ఎవరైతే నా పిల్లలుగా అవ్వరో వారు దీనిని జీర్ణించుకోలేరు, శ్రీమతముపై నడవలేరు. వారు భక్తులు. బాబా ఎంతోమందిని చూసారు. ఎవరైనా పెద్ద సన్యాసి వస్తే, అతనికి ఎంతోమంది అనుచరులు ఉంటారు. వారు చందాలు వసూలు చేస్తూ ఉంటారు. వారి-వారి శక్తి అనుసారముగా చందాలు ఇస్తారు. ఇక్కడైతే తండ్రి చందాలు వసూలు చేయమని చెప్పరు. ఇక్కడ ఏ బీజాలనైతే నాటుతారో దాని ఫలాన్ని 21 జన్మలు పొందుతారు. మనుష్యులు దానము చేస్తే ఈశ్వరార్థము మేము దానము చేస్తున్నామని భావిస్తారు. ఈశ్వర సమర్పణము అని అంటారు, లేకపోతే శ్రీకృష్ణ సమర్పణము అని అంటారు. శ్రీకృష్ణుడి పేరును ఎందుకు తీసుకుంటారు? ఎందుకంటే అతడిని గీతా భగవానుడిగా భావిస్తారు. శ్రీరాధే అర్పణము అని ఎప్పుడూ అనరు. ఈశ్వరార్పణము లేక శ్రీకృష్ణార్పణము అని అంటారు. అందరికీ ఫలాన్ని ఇచ్చేవారు ఈశ్వరుడే అని వారికి తెలుసు. ఎవరైనా షావుకారుల ఇంటిలో జన్మ తీసుకుంటే, ఆ బిడ్డ గత జన్మలో ఎన్నో దాన-పుణ్యాలు చేసి ఉంటాడు, అందుకనే ఇక్కడ జన్మ తీసుకున్నాడు అని అంటారు. అలా రాజులుగా కూడా అవ్వవచ్చు. కానీ అదంతా అల్పకాలికమైన కాకిరెట్ట సమానమైన సుఖము. రాజులను కూడా సన్యాసులు సన్యాసము చేయించినప్పుడు, వారికి - స్త్రీ ఒక సర్పము వంటిది అని చెప్తారు. కానీ దుశ్శాసనుడు నన్ను వివస్త్రముగా చేస్తున్నాడు అని ద్రౌపది కదా పిలిచింది. ఇప్పుడు కూడా అబలలు తమ పరువును రక్షించమని ఎంతగా పిలుస్తూ ఉంటారు. బాబా, ఇతను నన్ను బాగా కొడుతున్నారు, విషాన్ని ఇవ్వు లేకపోతే చంపేస్తాను అని అంటున్నారు, బాబా, నన్ను ఈ బంధనాల నుండి విడిపించండి అని పిలుస్తూ ఉంటారు. తండ్రి అంటారు, ఈ బంధనాలన్నీ ఇక సమాప్తమవ్వవలసిందే, ఇక మళ్ళీ 21 జన్మలు ఎప్పుడూ వివస్త్రముగా అవ్వరు. అక్కడ వికారాలు ఉండవు. ఈ మృత్యులోకములో ఇది అంతిమ జన్మ. ఈ ప్రపంచమే వికారీ ప్రపంచము.

తండ్రి మరో విషయాన్ని అర్థం చేయిస్తున్నారు - ఈ సమయములో మనుష్యులు ఎంత బుద్ధిహీనులుగా అయిపోయారు. ఎప్పుడైనా ఎవరైనా చనిపోయినప్పుడు స్వర్గస్థులయ్యారు అని అంటారు, కానీ స్వర్గము ఎక్కడ ఉంది. ఇది నరకము. స్వర్గస్థులయ్యారు అంటే మరి తప్పకుండా అంతకుముందు నరకములోనే ఉన్నారని అర్థము. కానీ ఎవరినైనా - నీవు నరకవాసివి అని డైరెక్టుగా అంటే క్రోధములోకి వచ్చి డిస్టర్బ్ అవుతారు. అటువంటి వారికి మీరు ఇలా వ్రాయాలి - ఫలానా వ్యక్తి స్వర్గస్థులయ్యారు అంటే మరి మీరు నరకవాసి అనే అర్థము కదా, మేము మీకు ఎటువంటి యుక్తిని చెప్తామంటే దాని ద్వారా మీరు సత్యమైన స్వర్గములోకి వెళ్తారు. ఈ పాత ప్రపంచము ఇప్పుడు ఇక అంతము కానున్నది. ఐదు వేల సంవత్సరాల క్రితము వలె ఈ యుద్ధము తర్వాత విశ్వములో శాంతి ఏర్పడనున్నదని మీరు వార్తాపత్రికలలో వ్రాయండి. అక్కడ ఒక్క అది సనాతన దేవీ-దేవతా ధర్మము మాత్రమే ఉండేది. కానీ వాళ్ళు అంటారు - అక్కడ కూడా కంసుడు, జరాసంధుడు మొదలైన అసురులు ఉండేవారు, త్రేతాలో రావణుడు ఉండేవాడు అని. అటువంటివారి వెనుక ఎవరు తల బాదుకుంటారు. జ్ఞానము మరియు భక్తిలో రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇంత సహజమైన విషయము కూడా ఎవరి బుద్ధిలోనైనా కష్టము మీద కూర్చుంటుంది. కావున ఈ విధమైన స్లోగన్లు తయారుచేయాలి. డ్రామానుసారముగా ఈ యుద్ధము తర్వాత విశ్వములో శాంతి ఏర్పడుతుంది. కల్ప-కల్పములో విశ్వములో శాంతి ఏర్పడుతుంది, ఆ తర్వాత మళ్ళీ కలియుగ అంతిమములో అశాంతి ఏర్పడుతుంది. సత్యయుగములోనే శాంతి ఉంటుంది. గీతలో ఈ తప్పు చేసిన కారణముగానే భారత్ పరిస్థితి ఇలా తయారయ్యింది అని మీరు వ్రాయవచ్చు. మొత్తం 84 జన్మలు తీసుకునే శ్రీకృష్ణుడి పేరును అందులో వ్రాసారు. శ్రీనారాయణుడి పేరును కూడా అందులో వ్రాయలేదు, ఎందుకంటే అతనికి 84 జన్మలలో కొన్ని రోజులు తక్కువ అవుతాయి కదా. శ్రీకృష్ణుడికి పూర్తి 84 జన్మలు ఉంటాయి. శివబాబా పిల్లలను వజ్ర సమానముగా తయారుచేయడానికి వస్తారు కావున మరి వారు ప్రవేశించేందుకు డిబ్బి కూడా బంగారముది ఉండాలి కదా, అందులోకి తండ్రి వచ్చి ప్రవేశించేలా ఉండాలి. మరి ఇతను బంగారముగా ఎలా తయారవుతారు? కావుననే వెంటనే అతడికి సాక్షాత్కారము చేయించారు - నీవు విశ్వానికి యజమానిగా అవుతావు, ఇప్పుడు ఇక నన్నొక్కరినే స్మృతి చేయి, పవిత్రముగా అవ్వు అని, దానితో వెంటనే పవిత్రముగా అవ్వడము మొదలుపెట్టారు. పవిత్రముగా అవ్వకుండానైతే జ్ఞాన ధారణ జరుగదు. పులి పాల కోసం బంగారు పాత్ర కావాలి. ఈ జ్ఞానము - పరమపిత పరమాత్మ ఇచ్చే జ్ఞానము. దీనిని ధారణ చేసేందుకు కూడా బంగారు పాత్ర కావాలి, పవిత్రత కావాలి, అప్పుడు ధారణ జరుగుతుంది. పవిత్రతా ప్రతిజ్ఞ చేసి మళ్ళీ కింద పడిపోతే ఇక యోగము యొక్క యాత్రనే అంతమైపోతుంది, జ్ఞానము కూడా అంతమైపోతుంది. అప్పుడిక - భగవానువాచ, కామము మహాశత్రువు అన్న మాటను ఇంకెవ్వరికీ చెప్పలేకపోతారు. అటువంటివారి బాణము ఎవ్వరికీ తగలదు. ఇక వారు నామమాత్రపు జ్ఞానులుగా అవుతారు. ఏ వికారమూ మీలో ఉండకూడదు. రోజూ లెక్కాపత్రాన్ని వ్రాయండి. ఏ విధముగా తండ్రి సర్వశక్తివంతుడో అలాగే మాయ కూడా సర్వశక్తివంతమైనది. అర్ధకల్పము రావణుడి రాజ్యము నడుస్తుంది, అతడిపై తండ్రి తప్ప ఇంకెవ్వరూ విజయాన్ని అందించలేరు. డ్రామానుసారముగా రావణ రాజ్యము కూడా రావలసిందే. భారత్ యొక్క గెలుపు-ఓటముల పైనే ఈ డ్రామా తయారుచేయబడి ఉంది. ఈ విషయాలను తండ్రి పిల్లలైన మీకు మాత్రమే అర్థం చేయిస్తారు. ముఖ్యమైన విషయము పవిత్రముగా అవ్వడము. తండ్రి అంటారు, నేను పతితులను పావనముగా తయారుచేయడానికే వస్తాను. కానీ శాస్త్రాలలో పాండవులు మరియు కౌరవుల యుద్ధాన్ని, జూదము మొదలైనవాటిని చూపించారు. ఇటువంటి విషయాలు అక్కడ ఎలా ఉంటాయి. రాజయోగము యొక్క చదువు ఎక్కడైనా ఈ విధంగా ఉంటుందా ఏమిటి? యుద్ధ మైదానములో గీతా పాఠశాల ఉంటుందా ఏమిటి? జనన-మరణ రహితుడైన శివబాబా ఎక్కడ, పూర్తి 84 జన్మలు తీసుకునే శ్రీకృష్ణుడు ఎక్కడ? అతని అంతిమ జన్మలోనే తండ్రి వచ్చి ప్రవేశిస్తారు. ఇది ఎంత స్పష్టముగా ఉంది. గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రముగా కూడా అవ్వాలి. సన్యాసులు అయితే - ఇద్దరు ఒకేచోట కలిసి ఉంటూ పవిత్రముగా ఉండలేరు అని అంటారు. మీరు చెప్పండి - మీకైతే ఏ ప్రాప్తి లేదు కావున మీరు ఒకేచోట ఉంటూ పవిత్రముగా ఎలా ఉండగలరు? ఇక్కడైతే విశ్వ రాజ్యాధికారము లభిస్తుంది. తండ్రి అంటారు, నా కోసం కుల గౌరవాన్ని నిలబెట్టండి. శివబాబా అంటారు, ఇతడి గడ్డము పరువు నిలబెట్టండి. ఈ ఒక్క అంతిమ జన్మ పవిత్రముగా ఉన్నట్లయితే స్వర్గానికి యజమానులుగా అవుతారు. మీరు మీ కోసమే కృషి చేస్తున్నారు. ఇంకెవ్వరూ స్వర్గములోకి రాలేరు. ఇక్కడ మీ రాజధానియే స్థాపన అవుతోంది. ఇందులో అందరూ కావాలి కదా. అక్కడ మంత్రులు ఉండరు. రాజులకు సలహాల అవసరము ఉండదు. పతిత రాజులకు కూడా ఒకే మంత్రి ఉంటారు, కానీ ఇక్కడ ఎంతమంది మంత్రులు ఉంటారో చూడండి. వారు పరస్పరము కొట్లాడుకుంటూ ఉంటారు. తండ్రి అన్ని జంజాటాల నుండి విడిపిస్తారు. మూడు వేల సంవత్సరాల వరకు ఇక ఏ యుద్ధమూ జరుగదు. జైళ్ళు మొదలైనవేవీ ఉండవు. కోర్టులు మొదలైనవేవీ ఉండవు. అక్కడ అంతా సుఖమే సుఖము ఉంటుంది. దాని కోసం పురుషార్థము చేయవలసి ఉంటుంది. మృత్యువు తలపై నిలబడి ఉంది. స్మృతియాత్ర ద్వారా వికర్మాజీతులుగా అవ్వాలి. మీరే సందేశకులు, మీరు అందరికీ - మన్మనాభవ అన్న సందేశాన్ని ఇస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞానాన్ని ధారణ చేసేందుకు పవిత్రముగా అయి బుద్ధి రూపీ పాత్రను స్వచ్ఛముగా తయారుచేసుకోవాలి. కేవలం నామమాత్రపు జ్ఞానులుగా అవ్వకూడదు.

2. డైరెక్టుగా తండ్రి ముందు మీ సర్వస్వాన్ని అర్పణ చేసి శ్రీమతముపై నడుస్తూ 21 జన్మల కొరకు రాజ్య పదవిని పొందాలి.

వరదానము:-
ప్రతి శక్తిని కార్యములో వినియోగిస్తూ వాటిని వృద్ధి చేసే శ్రేష్ఠమైన ధనవంతులుగా మరియు వివేకవంతులుగా కండి

వివేకవంతులైన పిల్లలకు ప్రతి శక్తిని కార్యములో వినియోగించే విధి తెలుసు. ఎవరు ఎంతగా శక్తులను కార్యములో వినియోగిస్తారో అంతగా వారి ఆ శక్తులు వృద్ధి చెందుతూ ఉంటాయి. ఎటువంటి ఈశ్వరీయ బడ్జెట్ ను తయారుచేయండి అంటే విశ్వములోని ప్రతి ఆత్మ మీ ద్వారా ఏదో ఒక ప్రాప్తిని పొంది మీ గుణగానము చేయాలి. అందరికీ ఏదో ఒకటి తప్పకుండా ఇవ్వాలి. ముక్తినైనా ఇవ్వండి, జీవన్ముక్తినైనా ఇవ్వండి. ఈశ్వరీయ బడ్జెట్ ను తయారుచేసి సర్వ శక్తులను పొదుపు చేసి జమ చేయండి మరియు జమ అయిన శక్తుల ద్వారా సర్వ ఆత్మలను బికారీతనము నుండి, దుఃఖము, అశాంతి నుండి ముక్తులుగా చేయండి.

స్లోగన్:-
శుద్ధ సంకల్పాలను మీ జీవితపు అమూల్య ఖజానాగా చేసుకున్నట్లయితే సుసంపన్నముగా అయిపోతారు.

మాతేశ్వరిగారి అమూల్య మహావాక్యాలు

‘‘ఇప్పుడు వికర్మలను తయారుచేసుకునే కాంపిటీషన్ ను చెయ్యకూడదు’’

మొట్టమొదటగా మీ వద్ద తప్పకుండా ఈ లక్ష్యాన్ని పెట్టుకోవాలి - నేను ఎలాగైనా సరే నా వికారాలను వశము చేసుకోవాలి అని. అప్పుడే ఈశ్వరీయ సుఖ-శాంతులలో ఉండగలరు. మీ ముఖ్య పురుషార్థము ఏమిటంటే - స్వయం శాంతిలో ఉంటూ ఇతరులను శాంతిలోకి తీసుకురావటము, ఇందులో సహనశక్తి తప్పకుండా కావాలి. మొత్తమంతా మీపైనే ఆధారపడి ఉంది. ఎవరైనా ఏదైనా అంటే అశాంతిలోకి వచ్చేయడము కాదు, అలా ఉండకూడదు. జ్ఞానము యొక్క మొదటి గుణము - సహనశక్తిని ధారణ చెయ్యటము. చూడండి, అజ్ఞానకాలములో కూడా ఏమంటూ ఉంటారంటే - ఎవరు ఎంత నిందించినా కానీ నాకేం అంటుకోలేదులే అని భావించండి. అయితే, ఎవరైతే నిందించారో వారు ఎలాగూ స్వయం అశాంతిలోకి వస్తారు, వారి లెక్కాచారాన్ని వారు తయారుచేసుకున్నారు. కానీ మనం కూడా అశాంతిలోకి వచ్చి, ఏదైనా అన్నామంటే మన వికర్మ తయారవుతుంది. కనుక వికర్మలను తయారుచేసుకునే కాంపిటీషన్ ను చెయ్యకండి. మీరు వికర్మలను భస్మము చేసుకోవాలి, అంతేకానీ తయారుచేసుకోకూడదు. ఇటువంటి వికర్మలనైతే జన్మ-జన్మాంతరాలు తయారుచేసుకుంటూనే వచ్చారు మరియు దుఃఖాన్ని పొందుతూనే వచ్చారు. ఇప్పుడైతే ఈ పంచ వికారాలను జయించండి అన్న జ్ఞానము లభిస్తూ ఉంది. వికారాల విస్తారము కూడా చాలా ఉంది, అవి చాలా సూక్ష్మ రీతిలో వస్తాయి. ఒక్కోసారి ఈర్ష్య వస్తుంది, అప్పుడు - వీరు ఇలా చేసారు కనుక నేనెందుకు చెయ్యకూడదు అన్న ఆలోచన వస్తుంది. ఇది చాలా పెద్ద పొరపాటు. స్వయాన్ని అయితే పొరపాట్లు చేయనివారిగా తయారుచేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఏదైనా అంటే - నాలో ఎంతవరకు సహనశక్తి ఉంది? అని ఇది కూడా నా పరీక్ష అని భావించండి. నేను చాలా సహించాను అని ఒకవేళ ఎవరైనా ఒక్కసారైనా ఆవేశములోకి వచ్చారంటే చివరకు ఫెయిల్ అయినట్లే. ఎవరైతే ఇలా అంటారో వారు తమది తాము పాడు చేసుకున్నట్లే. కానీ మనమైతే మనది మంచిగా తయారుచేసుకోవాలి, అంతేకానీ పాడు చేసుకోకూడదు, అందుకే మంచి పురుషార్థము చేసి జన్మ-జన్మాంతరాల కొరకు మంచి ప్రారబ్ధాన్ని తయారుచేసుకోవాలి. ఇకపోతే ఎవరైతే వికారాలకు వశమై ఉన్నారో వారిలో భూతము ప్రవేశించినట్లు, భూతాల భాషే ఇలా వస్తుంది. కానీ ఎవరైతే దైవీ ఆత్మలు ఉంటారో, వారి భాష దైవీగానే వస్తుంది. కనుక స్వయాన్ని దైవీగా తయారుచేసుకోవాలే కానీ ఆసురీగా కాదు. అచ్ఛా - ఓం శాంతి.

అవ్యక్త సూచనలు - సహజయోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి

పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి, అప్పుడు అదే అనుభవముతో సహజయోగిగా అయి ఎగురుతూ ఉంటారు. పరమాత్మ ప్రేమ ఎగిరేలా చేసే సాధనము. ఎగిరేవారు ఎప్పుడూ ధరణి యొక్క ఆకర్షణలోకి రాలేరు. మయ ఎంత ఆకర్షితమైన రూపములో ఉన్నా కానీ, ఆ ఆకర్షణ ఎగిరే కళలో ఉండేవారి వద్దకు చేరుకోలేదు.