01-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - చ్యారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ (దానము ఇంటి నుండి మొదలవుతుంది), మీ పరివారములోని వారికి జ్ఞానాన్ని వినిపించండి, మీ తోటివారి యొక్క కళ్యాణాన్ని చేయండి’’

ప్రశ్న:-
ఏ శ్రీమతాన్ని పాలన చేసే పిల్లలు తమ అవస్థను ఏకరసంగా తయారుచేసుకోగలరు?

జవాబు:-
అవస్థను ఏకరసంగా తయారుచేసుకునేందుకు తండ్రి శ్రీమతము ఏమిటంటే - పిల్లలూ, ప్రతి రోజూ ఉదయాన్నే లేచి చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు బాబా ఏదైతే వినిపిస్తారో, అది వినండి. ఒకవేళ స్మృతి చేయకపోతే అనవసరమైన ఆలోచనలు నడుస్తాయి, వ్యర్థ సంకల్పాలు వస్తాయి, అందుకే బాబా సలహాను ఇస్తున్నారు - పిల్లలూ, ప్రతి రోజూ ఉదయాన్నే లేచి మీతో మీరు ఈ విధముగా ప్రతిజ్ఞ చేసుకోండి - నడుస్తూ-తిరుగుతూ, తింటూ... భోజనము తయారుచేస్తూ ఒక్క బాబాను మాత్రమే స్మృతి చేస్తాము.

ఓంశాంతి
మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు - ఆత్మిక తండ్రి సర్వాత్మలకు తండ్రి, వారు అందరికన్నా ఉన్నతోన్నతమైనవారు, వారినే శివాయ నమః అంటారు. వారిని తండ్రి అని కూడా అంటారు, ఆ తండ్రి స్వర్గ రచయిత, వారిని పతిత-పావనుడు, జ్ఞానసాగరుడు అని అంటారు. ఇప్పుడు మనము వారితో పాటు కూర్చుని ఉన్నామని మీరు అర్థం చేసుకుంటారు. ఇది పిల్లలైన మీరు అర్థం చేయించాలి. ఉదాహరణకు, ఎక్కడో ఒక గీతా పాఠశాలలో 6 అడుగుల పొడవైన శ్రీకృష్ణుని చిత్రము ఉండేది. వాస్తవానికి శ్రీకృష్ణుడిని చిన్న బాలునిగానే చూపిస్తారు, కానీ వారు గీతా భగవానుడు అని అంటారు. మరి గీతను వారు ఎప్పుడు వినిపించారు? బాల్యములోనా లేక 6 అడుగుల పెద్దవారిగా అయిన తర్వాత వినిపించారా? రాధ-కృష్ణులు జంటగా ఉండేవారు. శ్రీకృష్ణునికి రాధ ఏమవుతారు? రాధను భగవతి అని, శ్రీకృష్ణుడిని భగవాన్ అని అంటారు. వీరిరువురికి ఉన్న సంబంధమేమిటి అనేది ఎవ్వరికీ తెలియదు. శ్రీకృష్ణుడు గీతోపదేశము చేసారు, కానీ ఎప్పుడు చేసారు? మీరు ఈ విధమైన ప్రశ్నలను అడిగారంటే - బ్రహ్మాకుమార, కుమారీలు తప్ప ఇంకెవ్వరూ ఇలా అడగలేరని మనుష్యులకు అర్థమవుతుంది. గొప్ప-గొప్ప రాజులు మొదలైనవారంతా సన్యాసులను చూసినప్పుడు తప్పకుండా వారి పాదాలకు నమస్కరిస్తారు. ఈ విధమైన ప్రశ్నలు అడిగే ధైర్యము ఎవ్వరికీ ఉండదు. మీరైతే ధైర్యము ఉంచుతారు. వారు ఏమంటారు అంటే - బ్రహ్మాకుమారీలలో ఎంత జ్ఞానముందంటే వారు కూర్చుని రచయిత మరియు రచనల జ్ఞానాన్ని ఇస్తారు, వారి జీవిత చరిత్రను వినిపిస్తారు. మీరు అడుగవచ్చు - శివజయంతిని జరుపుకుంటారు కదా, పూజలు మొదలైనవి కూడా చేస్తారు కదా, అంటే తప్పకుండా వారు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి ఉంటారు, అందుకే శివజయంతిని జరుపుకుంటున్నారు అని. అయితే వారెప్పుడు వచ్చారు? శివబాబా అయితే నిరాకారుడు. వారికి తమదంటూ శరీరము లేదు. శివజయంతిని జరుపుకుంటున్నారంటే తప్పకుండా వారు శరీరములోకి వచ్చి ఉంటారు. నిరాకారుని జయంతి ఎలా జరుగుతుంది? ఆత్మ అయితే అమరమైనది. మరణించి, మళ్ళీ జన్మించినప్పుడు జయంతిని జరుపుకుంటారు. ఆత్మకు జయంతి ఉండదు. ఆత్మ అయితే అవినాశీ. ఆత్మ యొక్క జయంతి అని అనరు. శివుడు అయితే నిరాకారుడు, వారి చిత్రాన్ని లింగము రూపములో ఉంచుతారు. పిల్లలైన మీకు ఈ ఆలోచన ఉండాలి. ఇక్కడ నుండి మీ ఇంటికి, వ్యాపార-వ్యవహారాలలోకి వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ బుద్ధి నుండి తొలగిపోతాయి, చింతన నడవదు. గురువులు మొదలైనవారి సంకెళ్ళలో కూడా చాలా మంది చిక్కుకుని ఉంటారు, ఇక అడగకండి. అబలలు చాలా అమాయకముగా ఉంటారు కదా. మీరు వారిని ఈ విధముగా అడగవచ్చు - శివజయంతిని జరుపుకుంటారు కదా, అయితే వారెవరు, వచ్చి ఏం చేసారు మరియు ఎప్పుడు వచ్చారు. జయంతి అంటేనే జన్మ. నిరాకార శివుని జన్మదినాన్ని జరుపుకుంటారు. వారు నిరాకారుడు, మరి వారి జన్మదినాన్ని ఎలా జరుపుకుంటారు? వారు ఎవరిలోకి వచ్చారు? ఆత్మ శరీరములోకి వెళ్ళినప్పుడు, జన్మ తీసుకున్నారని అంటారు. ఆత్మ అయితే ఆత్మయే. శరీరములో ప్రవేశించినప్పుడు, ఆత్మ పాత్రను అభినయించేందుకు శరీరము తీసుకుంది అని అంటారు. వారు (శివబాబా) నిరాకారుడు. వారు జన్మను ఎలా తీసుకున్నారు? ఎవరిలోకి వచ్చారు? వారిని పరమాత్మ అని అంటారు. ఇది ఎవ్వరికీ తెలియదు. అనేక శాస్త్రాలు మొదలైనవి చదివారు, కానీ ఏమీ తెలియదు. ఇప్పుడు మీరు జ్ఞానముతో నిండుగా ఉన్నారు. ఇప్పుడు మీరు జ్ఞానాన్నే వినిపించాలి. కొంతమంది 2-3 సంవత్సరాలు వస్తారు, తర్వాత వారిలో అజ్ఞానము ప్రవేశిస్తుంది. బాబా అప్పుడు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ధారణ చేయిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానము ఇవ్వడము జరుగుతుంది. కానీ పురుషుడు జ్ఞానములో ఉండి, స్త్రీ అజ్ఞానములో ఉంటే, వారు హంస మరియు కొంగల వలె అవుతారు. అందుకే, ముందు స్త్రీకి జ్ఞానమివ్వాలి. పత్ని తన పతిని గురువుగా, ఈశ్వరునిగా భావిస్తారు. అటువంటప్పుడు, పత్ని గురువు ఆజ్ఞను పాటించాలి కదా. ఇది ఇక్కడి విషయము. అక్కడ (స్వర్గములో) ఆజ్ఞను పాటించడము, పాటించకపోవడము అన్న ప్రశ్నే ఉండదు. అక్కడ అందరూ ప్రేమగా నడుచుకుంటారు. అక్కడ ఇలాంటి విషయమేమీ ఉండదు. దానము ఇంటి నుండే మొదలవుతుంది. పత్ని జ్ఞానములోకి వచ్చి, పతి రాకపోతే, ఆ పత్ని ఏం చేయగలరు! భూ-భూ చేయాలి. పిల్లలైన మనము కూడా భూ-భూ చేయాలి, మన తోటివారి కళ్యాణము చేయాలి. వారికి కూడా - తండ్రిని స్మృతి చేయండి అని చెప్పాలి. ఇప్పుడు యుద్ధము ఎదురుగా నిలబడి ఉంది, బాబా వచ్చి ఉన్నారు. ఓ పతిత-పావనా రండి, అని మనుష్యులు పిలుస్తూ ఉంటారు. పతిత ప్రపంచ వినాశనము జరగనున్నది అన్నప్పుడు మీరు మళ్ళీ పతితులుగా ఎందుకు అవుతారు! మాత జ్ఞానములో ఉన్నారంటే మాత పని తమ తోటివారి కళ్యాణము చేయడము.

ఇప్పుడు మీరు తండ్రి నుండి 21 జన్మల కోసం మొత్తం రాజ్యాన్ని అంతా తీసుకుంటారు. మీపై ఎవ్వరూ చేయి వేయలేరు (అనగా మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు). మీరు పూర్తి విశ్వానికి యజమానులుగా అవుతారు. ఎంత తేడా ఉందో చూడండి. ఇలా వారసత్వాన్ని ఇచ్చేవారిని ఎంతగా స్మృతి చేయాలి. మొత్తం రోజంతటిలో శివబాబాను స్మృతియే చేయనివారు ఇక్కడ చాలామంది ఉన్నారు. రోజంతా ఇల్లు, వ్యాపార-వ్యవహారాలకు సంబంధించిన పనులలోనే ఉంటారు. లేదంటే ఉదయాన్నే లేచి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. బాబా, మేము మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాము, మేము మీ నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము, బాబా, మీరు ఎంత మధురమైనవారు, మీ స్మృతితో మా వికర్మలు వినాశనమవుతాయి. మీతో మీరు లోలోపల మాట్లాడుకోవాలి, దీనినే విచార సాగర మంథనము చేయడము అని అంటారు. బాబా, మీ నుండి మేము పూర్తి వారసత్వాన్ని తీసుకునే తీరుతాము. ఇప్పుడు మనము తమోప్రధానము నుండి సతోప్రధానముగా తప్పకుండా అవ్వాలి. అప్పుడే సత్యయుగీ రాజ్యాన్ని పొందుతాము. బాబా, మిమ్మల్ని మేము నిరంతరము స్మృతి చేస్తాము. 63 జన్మలలో మేము ఎన్ని పాపాలు చేసాము, తలపై ఎంత భారముంది, అందుకే - బాబా, మేము మిమ్మల్ని చాలా స్మృతి చేస్తాము. బాబా, మేము వంట చేస్తున్నా, బయట తిరగడానికి వెళ్ళినా సరే, మీ స్మృతిలోనే ఉంటాము. ఈ విధముగా మాట్లాడుతూ ప్రతిజ్ఞ చేశారంటే, వికర్మలు వినాశనమవుతూ ఉంటాయి. బాబా, మేము మీ స్మృతిలో భోజనము తయారుచేస్తాము. మేము తప్పకుండా సతోప్రధానముగా అవ్వాలి. ఒకవేళ రేపే శరీరము వదిలేస్తే, మేము సతోప్రధానముగా అసలు అవ్వలేము! మృత్యువు గురించి భయముంటుంది కదా. బాబా, మేము జీవిస్తూనే మీ నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము. ఆ తర్వాత, ఈ రోజంతటిలో మేము ఎంత స్మృతి చేసాము అనేది చూసుకోవాలి. ఎలాంటి పరిస్థితులలోనైనా సరే, స్మృతియాత్రలో తప్పకుండా ఉండాలి. గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి, యుక్తిగా నడుచుకోవాలి. ఇలా తీవ్ర వేగముతో పురుషార్థములో నిమగ్నమైతే స్మృతి కూడా ఉంటుంది మరియు ఆయుష్షు కూడా పెరుగుతుంది. భవిష్యత్తులో మీ ఆయుష్షు పెరుగుతుంది. స్మృతి చేయకపోతే పదవి కూడా తగ్గిపోతుంది. పురుషార్థము చేసి బాబా నుండి వారసత్వాన్ని అయితే తీసుకోవాలి కదా. ఇంకా స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఉదాహరణకు హిందువులను క్రిస్టియన్లుగా కన్వర్ట్ చేయడానికి నన్స్ చాలా చోట్లకు తిరుగుతూ ఉంటారు. ఇళ్ళకు, దుకాణాలకు వెళ్ళి - బైబిల్ తీసుకోండి, ఇది తీసుకోండి, మా క్రిస్టియన్ ధర్మములో చాలా సుఖముంది అని అందరికీ చెప్తుంటారు. వారిది కూడా ఒక సంస్థే, అలాగే బౌద్ధులది కూడా ఒక సంస్థే. వారు ఏం చేస్తున్నారు అనేది హిందువులకు అర్థం కాదు. హిందూ ధర్మము వారిని క్రిస్టియన్లుగా కన్వర్ట్ చేస్తూ ఉంటారు. మీరు ప్రదర్శనీలలో ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. వారు తమ అభిప్రాయాలను కూడా వ్రాసి ఇస్తారు, ఇంటికి వెళ్ళగానే సమాప్తమైపోతుంది. దీని గురించే - కోతుల ముందు రత్నాలను ఉంచితే, వాటిని రాళ్ళు అనుకుని విసిరేస్తాయి అని అంటూ ఉంటారు. అలాగే, ఈ అవినాశీ జ్ఞాన రత్నాలను కూడా వారు రాళ్ళుగా భావించి విసిరేస్తారు. ఈ విషయాలను కూడా వారేమీ అర్థం చేసుకోరు. అయితే, ఈ ధర్మానికి చెందినవారు ఎవరైతే ఉంటారో, వారికే టచ్ అవుతుంది. విషయము చాలా సహజమైనది. తండ్రి స్వర్గ రచయిత. తండ్రి భారత్ లో ఒక్కసారి మాత్రమే వస్తారు.

తండ్రి అంటారు - మీరు పతిత-పావన తండ్రినైన నన్ను పిలుస్తూ వచ్చారు, మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేయడానికి ఇప్పుడు నేను వచ్చాను. మీరు అంటారు కూడా - మేము ఈ భ్రష్టాచారీ సృష్టిని శ్రేష్ఠాచారిగా తయారుచేసే తీరుతాము అని. ఇప్పుడైతే అందరూ నరకవాసులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు శివబాబా శ్రీమతాన్ని అనుసరిస్తున్నారు. శివ భగవానువాచ - నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా, రాజులకే రాజులుగా తయారుచేస్తాను. గీతలో కూడా చాలా బాగా వ్రాయబడి ఉంది - నేను ఈ సాధువులను కూడా ఉద్ధరించేందుకు వస్తాను అని అన్నారు. ఈ విషయము వారికి కూడా వినిపించాలి కదా. పతిత-పావన సీతల రామ అని పిలుస్తారు కూడా. ఇప్పుడు దీని అర్థం కూడా వారికి తెలియదు. అందరూ భక్తురాళ్ళు అనగా సీతలు. ఓ రామా, వచ్చి సీతలైన మమ్మల్ని ఉద్ధరించండి అని వారు పిలుస్తారు. మళ్ళీ, రఘుపతి రాఘవ రాజా రామ... అని అంటారు. వాస్తవానికి ఇది రాజా రాముని విషయము కాదు. ముఖ్యమైన పొరపాటు ఏమిటంటే - శివునికి బదులుగా శ్రీకృష్ణుని పేరును వేసారు. శ్రీకృష్ణుడిని మరియు రాముడిని నల్లగా ఎందుకు చూపించారని అడగాలి. సత్య, త్రేతాయుగాలలో సుందరముగా ఉంటారు, తర్వాత శ్యామముగా అవుతారు. మొదటిది బంగారు యుగము, తర్వాత వెండి యుగము, తర్వాత రాగి, తర్వాత ఇనుప యుగము ఉంటుంది. ఈ సమయములో ఉన్నది ఇనుప యుగము. బంగారు యుగము ఉన్నప్పుడు ఎంత గౌరవముండేది. మీరు యుక్తిగా వెళ్ళి అర్థం చేయించాలి. వారు అంత త్వరగా తమ హఠాన్ని వదిలిపెట్టరు. వృక్షము ఆయువు పెరిగినప్పుడు, ఆ వృక్షము శిథిలావస్థకు చేరుకుంటుంది. ఈ ప్రపంచానికి కూడా ఆయువు ఉంటుంది కదా. కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము ఉంటుంది. పాత ప్రపంచము అంటే కలియుగము, తమోప్రధాన ప్రపంచము. ఈ ప్రపంచములో ఒక్కరు కూడా సతోప్రధానముగా ఉండరు. ఇప్పుడు తమోప్రధానత సమాప్తమవ్వాల్సి ఉంది. కొత్త ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేస్తారు? ఆ తండ్రియే చేస్తారు. అలాగని ప్రళయము జరుగుతుందని కాదు. పతితులుగా అయినప్పుడే తండ్రిని పిలుస్తారు. మీరు వచ్చి పావనముగా చేయండి అని అడుగుతారు. వారు తప్పకుండా పాత ప్రపంచములోనే వస్తారు. వారిని పతిత-పావనుడు అంటున్నారంటే, వారు తప్పకుండా అంతిమములోనే వస్తారు. వారు స్వయముగా చెప్తున్నారు - నేను కల్ప-కల్పము కల్పము యొక్క సంగమయుగములో పావన ప్రపంచాన్ని తయారుచేయడానికి వస్తాను. ఇప్పుడు ఇది సంగమము. ఇప్పుడు తండ్రి అందరినీ సద్గతిలోకి తీసుకువెళ్తారు. మరి, అటువంటి తండ్రి శ్రీమతాన్ని అనుసరించాలి కదా. మీ అవస్థను తయారుచేసుకోవాలి. ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఇవి శరీరము యొక్క ఇంద్రియాలు. తండ్రి అంటారు - ఓ పిల్లలూ, నేను మీకు ఏదైతే వినిపిస్తానో, అది వినండి. ముక్తి-జీవన్ముక్తుల కోసం ఇంకెవ్వరి మాటలను వినకండి. పావనముగా తయారుచేయడానికి పరంధామము నుండి తండ్రి వచ్చారు. మళ్ళీ మీరు పాత శాస్త్రాలను ఎందుకు గుర్తు చేసుకుంటారు? భగవంతుడు లభిస్తారనే మీరు భక్తి చేస్తారు. వారైతే సర్వుల సద్గతిదాత అయిన తండ్రి కదా. తండ్రి తప్ప ఈ జ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. ఈ లక్ష్మీ-నారాయణులకు కూడా ఈ రాజ్యము ఎలా లభించింది? ఆత్మ గురించి ఈ విధముగా అంటారు - ఆత్మ ఒక బిందువు, ప్రకాశించే ఒక అద్భుతమైన నక్షత్రము. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు నన్ను పరమాత్మ, సుప్రీమ్ సోల్ అని అంటారు. లౌకిక తండ్రిని ఎప్పుడైనా పరమాత్మ అని అంటారా? పరంధామములో ఉన్న పరమాత్మనే సుప్రీమ్ సోల్ అని అంటారు. వారు మీ తండ్రి. వారు వచ్చి ఇతనిలో (బ్రహ్మాలో) ప్రవేశిస్తారు. గురువు శిష్యుని పక్కన కూర్చుంటారు కదా. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. వారు మన తండ్రి అని ఇప్పుడు మీకు తెలుసు. 5 వేల సంవత్సరాల క్రితం కూడా తండ్రి యోగము నేర్పించారు. నన్ను స్మృతి చేయండి మరియు విష్ణుపురిని స్మృతి చేయండి అని చెప్పారు. ఈ విధముగా తప్పకుండా సంగమయుగములోనే చెప్తారు. సత్యయుగములో ఒకే ధర్మముండేది. కావున ఇప్పుడు మళ్ళీ ఒకే ధర్మము ఉంటుంది కదా. ఇన్ని ధర్మాలన్నీ వినాశనమైపోతాయి. ఇది ఆ సమయమే. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తాను. తండ్రి స్మృతి ద్వారానే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. తండ్రి అంటారు - ఏ పిల్లలైతే మంచి రీతిలో సేవ చేస్తారో, నేను వారిని స్మృతి చేస్తాను ఎందుకంటే వారు నా సహాయకులు. వారు అనేకుల కళ్యాణము చేస్తారు కనుక వారు నాకు ప్రియముగా అనిపిస్తారు. మీకు ఒక్క తండ్రి మాత్రమే ప్రియముగా అనిపిస్తారు, వారి నుండే మీకు వారసత్వము లభిస్తుంది. అందుకే పిల్లలైన మీరు మంచి రీతిలో పురుషార్థము చేయాల్సి ఉంటుంది. స్మృతియాత్రలో ఉండాలి. అనవసరమైన ఆలోచనలు కూడా చాలా వస్తాయి. భక్తి మార్గములో వారికి శివుని దర్శనము కలగాలి అని తమను తాము హతమార్చుకుంటారు కూడా. దర్శనము కోసం చాలా కృషి చేస్తారు. తండ్రి స్మృతితో పాపాలు కట్ అవుతాయి మరియు 21 జన్మల కోసం వారసత్వము లభిస్తుందని ఇక్కడ మీరు అర్థం చేసుకుంటారు. దర్శనము అయినంత మాత్రాన పాపాలేమీ కట్ అవ్వవు. విశ్వానికి యజమానులుగా తయారుచేసే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. ఇప్పుడు మనము ఎలా తయారవుతున్నాము అనేది మీ బుద్ధిలో ఉంది. మరుసటి జన్మలో మనము ఇలా (లక్ష్మీ-నారాయణుల వలె) తయారవుతాము. ఇది సత్యయుగములోని రాకుమారులుగా, రాకుమారీలుగా తయారయ్యే కాలేజి. తండ్రి వచ్చి ధర్మముతో పాటు దైవీ రాజ్యాన్ని కూడా స్థాపన చేస్తారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ముక్తి-జీవన్ముక్తుల కోసం జ్ఞానము యొక్క విషయాలను ఏవైతే వినిపించారో, వాటిని మాత్రమే వినాలి మరియు ధారణ చేయాలి, మిగిలినవన్నీ మర్చిపోవాలి. తమ కళ్యాణాన్ని మరియు తమ లౌకిక పరివారము యొక్క కళ్యాణాన్ని చేయాలి.

2. వ్యర్థ ఆలోచనలను సమాప్తము చేయడానికి ఉదయాన్నే లేచి విచార సాగర మంథనము చేయాలి. స్మృతియాత్రలో నిమగ్నమై ఉండాలి.

వరదానము:-
జ్ఞాన-యోగాల శక్తిశాలి కిరణాల ద్వారా పాత సంస్కారాల రూపీ క్రిములను భస్మము చేసే మాస్టర్ జ్ఞాన సూర్య భవ

ఎటువంటి పతిత వాతావరణాన్ని అయినా మార్చేందుకు మరియు పాత సంస్కారాల రూపీ క్రిములను భస్మము చేసేందుకు ఇదే స్మృతి ఉండాలి - నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడిని. సూర్యుని కర్తవ్యము వెలుగును ఇవ్వటము మరియు చెత్తను భస్మము చెయ్యటము. కావున జ్ఞాన-యోగాల శక్తి మరియు శ్రేష్ఠ నడవడిక ద్వారా ఈ కర్తవ్యమునే చేస్తూ ఉండండి. ఒకవేళ శక్తి తక్కువగా ఉన్నట్లయితే జ్ఞానము కేవలం ప్రకాశాన్ని ఇస్తుంది, కానీ పాత సంస్కారాల రూపీ క్రిములు భస్మమవ్వవు. అందుకే మొదట యోగము ద్వారా, తపస్య ద్వారా శక్తిశాలిగా అవ్వండి.

స్లోగన్:-
శుభ భావన, శుభ కామనల శ్రేష్ఠ సంకల్పాలే జమ ఖాతాను పెంచుతాయి.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి

వర్తమాన సమయములో పిల్లలైన మీరు మీ దయా హృదయాన్ని మరియు దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి. మీ అన్ని భాండాగారాలు నిరంతరం తెరిచి ఉండాలి. అనాది, ఆది దాతా సంస్కారాన్ని మీ జీవితములో సదా ఇమర్జ్ చేసుకుని, పరమాత్ముని సందేశవాహకులుగా అయ్యి విశ్వములో బాబా ప్రత్యక్షతకు సంబంధించిన సందేశాన్ని వ్యాపింపజేయండి. అనంతమైన దాతగా అయ్యి ప్రపంచమనే గ్లోబ్ పై నిలబడి అనంతమైన సేవలలో వైబ్రేషన్లను వ్యాపింపజేయండి. మహాదాతగా అవ్వండి.