02-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఎప్పుడూ అలసిపోయి స్మృతి యాత్రను విడిచిపెట్టకండి, సదా దేహీ-అభిమానులుగా ఉండేందుకు ప్రయత్నించండి, తండ్రి ప్రేమను ఆకర్షించేందుకు మరియు మధురముగా తయారయ్యేందుకు స్మృతిలో ఉండండి’’

ప్రశ్న:-
16 కళల సంపూర్ణులుగా అయ్యేందుకు మరియు పర్ఫెక్ట్ గా అయ్యేందుకు ఏ పురుషార్థాన్ని తప్పనిసరిగా చేయాలి?

జవాబు:-
ఎంత వీలైతే అంత స్వయాన్ని ఆత్మగా భావించండి, ప్రేమ సాగరుడైన తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు పర్ఫెక్ట్ గా తయారవుతారు. జ్ఞానము చాలా సహజమైనది కానీ 16 కళల సంపూర్ణులుగా అయ్యేందుకు స్మృతి ద్వారా ఆత్మను పర్ఫెక్ట్ గా తయారుచేసుకోవాలి. ఆత్మగా భావించడము ద్వారా మధురముగా తయారవుతారు, అన్ని గొడవలు సమాప్తమవుతాయి.

పాట:-
నీవు ప్రేమ సాగరుడవు...

ఓంశాంతి
ప్రేమ సాగరుడు తన పిల్లలను కూడా తనలా ప్రేమ సాగరులుగా తయారుచేస్తారు. మేము ఈ లక్ష్మీ-నారాయణులుగా తయారవ్వాలి అన్నదే పిల్లల లక్ష్యము. వీరిని అందరూ ఎంతగా ప్రేమిస్తూ ఉంటారు. బాబా మమ్మల్ని వీరిలా మధురముగా తయారుచేస్తున్నారని పిల్లలకు తెలుసు. మధురముగా ఇక్కడే తయారవ్వాలి మరియు అలా స్మృతి ద్వారానే తయారవుతారు. భారత్ యొక్క యోగము ప్రసిద్ధమైనది, అదే స్మృతి. ఈ స్మృతి ద్వారానే మీరు వీరిలా విశ్వానికి యజమానులుగా తయారవుతారు. దీని కోసమే పిల్లలు కష్టపడాలి. మాకు జ్ఞానము ఎంతో ఉంది అని మీరు ఈ అహంకారములోకి ఎప్పుడూ రాకండి. ముఖ్యమైనది స్మృతియే. స్మృతియే ప్రేమను ఇస్తుంది. చాలా మధురముగా, చాలా ప్రియముగా అవ్వాలనుకుంటే, ఉన్నత పదవిని పొందాలనుకుంటే కష్టపడండి, లేకపోతే చాలా పశ్చాత్తాపపడతారు. ఎందుకంటే చాలామంది పిల్లలు స్మృతిలో ఉండలేకపోతున్నారు, ఇక అలసిపోయి స్మృతి చేయడం మానేస్తారు. ఒకటేమో, దేహీ-అభిమానులుగా అయ్యేందుకు చాలా ప్రయత్నము చేయండి లేకపోతే చాలా తక్కువ పదవిని పొందుతారు. ఇంత మధురముగా ఇంకెప్పుడూ తయారవ్వరు. చాలా తక్కువమంది పిల్లలు తండ్రిని ఆకర్షిస్తారు ఎందుకంటే వారు స్మృతిలో ఉంటారు. కేవలం తండ్రి స్మృతి మాత్రమే కావాలి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా చాలా మధురముగా తయారవుతారు. ఈ లక్ష్మీ-నారాయణులు కూడా తమ గత జన్మలో ఎంతో స్మృతి చేసారు, స్మృతి ద్వారానే మధురముగా తయారయ్యారు. సత్యయుగీ సూర్యవంశీయులు మొదటి నంబరులో ఉన్నారు, చంద్రవంశీయులు రెండవ నంబరులో ఉన్నారు. ఈ లక్ష్మీ-నారాయణులు చాలా ప్రియముగా అనిపిస్తారు. ఈ లక్ష్మీ-నారాయణుల ముఖ కవళికలకు మరియు సీతా-రాముల ముఖ కవళికలకు మధ్యన ఎంతో తేడా ఉంటుంది. ఈ లక్ష్మీ-నారాయణులపై ఎప్పుడూ ఎవ్వరూ ఏ కళంకము మోపలేదు. శ్రీకృష్ణుడిపై పొరపాటున కళంకాలను మోపారు, అలాగే సీతా-రాములపై కూడా కళంకాలను మోపారు.

తండ్రి అంటారు - ఎప్పుడైతే నేను ఆత్మను అని భావిస్తారో, అప్పుడే చాలా మధురముగా తయారవుతారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడములోనే ఎంతో ఆనందము ఉంది. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా సతోప్రధానులుగా, 16 కళల సంపూర్ణులుగా తయారవుతారు. 14 కళలు అంటే, ఎంతో కొంత లోపమున్నట్లే, దాని తరువాత ఇంకా లోపము పెరుగుతూ ఉంటుంది. 16 కళలతో పర్ఫెక్ట్ గా తయారవ్వాలి. జ్ఞానమైతే చాలా సహజమైనది. దీనినెవరైనా నేర్చుకోవచ్చు. 84 జన్మలను కల్ప-కల్పము తీసుకుంటూ వచ్చారు. ఎప్పటివరకైతే పూర్తిగా పవిత్రముగా అవ్వరో అప్పటివరకు ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు, లేకపోతే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. బాబా పదే-పదే అర్థం చేయిస్తున్నారు, ఎంత వీలైతే అంత మొట్టమొదట ‘నేను ఒక ఆత్మను’ అన్న ఈ విషయాన్ని పక్కా చేసుకోండి. ఆత్మ అయిన మనము మన ఇంటిలో ఉన్నప్పుడు సతోప్రధానముగా ఉంటాము, ఆ తరువాత మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకుంటాము. కొందరు కొన్ని జన్మలు, కొందరు కొన్ని జన్మలు తీసుకుంటారు. అంతిమములో తమోప్రధానముగా అవుతారు. ప్రపంచము యొక్క గౌరవము తగ్గుతూ ఉంటుంది. ఇల్లు కొత్తగా ఉన్నప్పుడు అందులో ఎంతో విశ్రాంతి లభిస్తుంది, ఆ తరువాత దానిలో లోపాలు ఏర్పడతాయి, కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఒకవేళ పిల్లలైన మీరు పర్ఫెక్ట్ ప్రపంచములోకి వెళ్ళాలనుకుంటే పర్ఫెక్ట్ గా తయారవ్వాలి. కేవలం జ్ఞానము మాత్రమే ఉంటే దానిని పర్ఫెక్ట్ అని అనరు. ఆత్మ పర్ఫెక్ట్ గా తయారవ్వాలి. ఎంత వీలైతే అంత - నేను ఒక ఆత్మను, బాబా బిడ్డను అని భావించడానికి ప్రయత్నించండి. లోలోపల ఎంతో సంతోషము ఉండాలి. మనుష్యులు తమను తాము దేహధారులుగా భావిస్తూ సంతోషిస్తూ ఉంటారు. నేను ఫలానావారి బిడ్డను... అని భావిస్తారు, అది అల్పకాలికమైన నషా. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రితో పూర్తి బుద్ధియోగాన్ని జోడించాలి, ఇందులో తికమకపడకూడదు. విదేశాల్లో మీరెక్కడకు వెళ్ళినా కేవలం ఒక్క విషయాన్ని పక్కాగా ఉంచుకోండి - బాబాను స్మృతి చేయాలి. బాబా ప్రేమ సాగరుడు. ఈ మహిమ మనుష్యమాత్రులెవరిదీ కాదు. ఆత్మ తన తండ్రి మహిమను చేస్తుంది. ఆత్మలందరూ పరస్పరము సోదరులు. అందరికీ తండ్రి ఒక్కరే. తండ్రి అందరికీ చెప్తున్నారు - పిల్లలూ, మీరు సతోప్రధానముగా ఉండేవారు, మీరే ఇప్పుడు తమోప్రధానముగా అయ్యారు. తమోప్రధానముగా అవ్వడం వలన మీరు దుఃఖితులుగా అయ్యారు. ఇప్పుడు ఆత్మనైన నాకు పరమాత్మ తండ్రి చెప్తున్నారు - మీరు మొదట పర్ఫెక్ట్ గా ఉండేవారు. ఆత్మలంతా అక్కడ పర్ఫెక్ట్ గానే ఉంటాయి. పాత్రలు వేర్వేరుగా ఉన్నా కానీ పర్ఫెక్ట్ గా అయితే ఉంటారు కదా. పవిత్రత లేకుండానైతే అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు. సుఖధామములో మీకు సుఖము కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది, అందుకే మీ ధర్మము ఉన్నతోన్నతమైనది. అక్కడ అపారమైన సుఖము ఉంటుంది. మనము ఎలా తయారవ్వబోతున్నామో ఆలోచించండి. స్వర్గానికి యజమానులుగా అవ్వబోతున్నాము. అది వజ్రతుల్యమైన జన్మ. ఇప్పుడు ఇది గవ్వవంటి జన్మ. ఇప్పుడు తండ్రి - స్మృతిలో ఉండాలి అన్న సూచనను ఇస్తున్నారు. మీరు వచ్చి మమ్మల్ని పతితము నుండి పావనముగా తయారుచేయండి అనే మీరు పిలుస్తారు. సత్యయుగములో సంపూర్ణ నిర్వికారులు ఉంటారు. సీతా-రాములను కూడా సంపూర్ణులు అని అనరు. వారు రెండవ శ్రేణిలోకి వెళ్ళిపోయారు. వారు స్మృతి యాత్రలో పాస్ అవ్వలేదు. జ్ఞానములో ఎంత చురుకుగా ఉన్నా కానీ తండ్రికి ఎప్పుడూ మధురముగా అనిపించరు. స్మృతిలో ఎప్పుడైతే ఉంటారో అప్పుడే మధురముగా తయారవుతారు. అప్పుడు తండ్రి కూడా మీకు మధురముగా అనిపిస్తారు. చదువైతే చాలా సహజమైనది కానీ పవిత్రముగా తయారవ్వాలి, స్మృతిలో ఉండాలి. ఈ విషయాన్ని బాగా నోట్ చేసుకోండి. స్మృతి యాత్రలో ఉన్నట్లయితే అక్కడక్కడ ఏవైతే గొడవలు జరుగుతున్నాయో, అహంకారము వస్తుందో, అది ఇక జరుగదు. ముఖ్యమైన విషయము - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడము. ప్రపంచములోని మనుష్యులు ఎంతగా గొడవపడుతూ, కొట్లాడుకుంటూ ఉంటారు. జీవితాన్నే విషతుల్యముగా మార్చుకుంటారు. ఈ పదాలు సత్యయుగములో ఉండవు. మున్ముందు మనుష్యుల జీవితము ఇంకా విషతుల్యముగా తయారవుతుంది. ఈ ప్రపంచమే ఒక విషయసాగరము. అందరూ రౌరవ నరకములో పడి ఉన్నారు, ఇక్కడ ఎంతో అశుద్ధత ఉంది. రోజురోజుకు ఈ అశుద్ధత పెరుగుతూ ఉంటుంది. దీనిని డర్టీ వరల్డ్ (అశుద్ధమైన ప్రపంచము) అని అంటారు. ఒకరికొకరు దుఃఖమే ఇచ్చుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ దేహాభిమానము అనే భూతము ఉంది, కామము అనే భూతము ఉంది. తండ్రి అంటారు, ఈ భూతాలను పారద్రోలండి. ఈ భూతాలే మిమ్మల్ని నల్ల ముఖము చేసుకునేలా చేస్తాయి. కామ చితిపై కూర్చుని నల్లగా అయిపోతారు, అందుకే తండ్రి అంటారు, నేను వచ్చి మళ్ళీ జ్ఞానామృతము యొక్క వర్షాన్ని కురిపిస్తాను. ఇప్పుడు మీరు ఎలా తయారవుతున్నారు. అక్కడైతే వజ్రాలతో నిర్మించిన మహళ్ళు ఉంటాయి, అన్ని రకాల వైభవాలు ఉంటాయి. ఇక్కడైతే అన్నీ కల్తీ కలిసిన వస్తువులే. గోవుల భోజనము చూడండి, అందులో ఉన్న సారమంతటినీ తీసేసి మిగిలినది దానికి పెడతారు. గోవులకు భోజనము కూడా సరిగ్గా దొరకదు. శ్రీకృష్ణుని గోవులను చూడండి, వాటిని ఎంత ఫస్ట్ క్లాస్ గా చూపిస్తారు. సత్యయుగములో గోవులు ఎంత బాగుంటాయంటే ఇక అడగకండి. వాటిని చూస్తూనే ఎంతో ఆనందము కలుగుతుంది. ఇక్కడైతే ప్రతి వస్తువు నుండి సారాన్ని తీసివేస్తారు. ఈ ప్రపంచమే చాలా ఛీ-ఛీ అశుద్ధమైన ప్రపంచము. మీరు దీని పట్ల మనసు పెట్టుకోకూడదు. తండ్రి అంటారు, మీరు ఎంత వికారులుగా అయిపోయారు. యుద్ధాలలో ఒకరినొకరు ఎలా హతమార్చుకుంటూ ఉంటారు. అణుబాంబులు తయారుచేసేవారికి కూడా ఎంత గౌరవము ఉంది. వాటి ద్వారా అందరి వినాశనము జరుగుతుంది. ఈ రోజు మనుష్యులు ఎలా ఉన్నారు, రేపటి మనుష్యులు ఎలా ఉంటారు అన్నది తండ్రి కూర్చుని తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీరు మధ్యలో ఉన్నారు. సత్సాంగత్యము తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యము ముంచేస్తుంది. మీరు పురుషోత్తములుగా అయ్యేందుకు తండ్రి చేతిని పట్టుకుంటారు. ఎవరైనా ఈత కొట్టడం నేర్చుకునేటప్పుడు, నేర్పించేవారి చేతిని పట్టుకోవలసి ఉంటుంది, లేకపోతే గుటకలు మింగవలసి ఉంటుంది, అలాగే ఇక్కడ కూడా చేయి పట్టుకోవాలి, లేకపోతే మాయ తనవైపుకు లాగేస్తుంది. మీరు ఈ మొత్తం విశ్వమంతటినీ స్వర్గముగా తయారుచేస్తారు. మేము శ్రీమతము ద్వారా మా రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము అని స్వయాన్ని నషాలోకి తీసుకురావాలి. మనుష్యమాత్రులందరూ దానమైతే చేస్తూనే ఉంటారు. వారు పేదలకు ఇస్తూ ఉంటారు. తీర్థయాత్రలలో పండాలకు దానము చేస్తూ ఉంటారు, పిడికెడు బియ్యమునైనా తప్పకుండా దానము చేస్తారు. అవన్నీ భక్తి మార్గములో కొనసాగుతూ ఉంటాయి. ఇప్పుడు బాబా మనల్ని డబుల్ దాతలుగా తయారుచేస్తారు. తండ్రి అంటారు, మూడడుగుల నేలపై మీరు ఈ ఈశ్వరీయ యూనివర్శిటీని, ఈశ్వరీయ హాస్పిటల్ ను తెరవండి, ఇందులోకి మనుష్యులు వచ్చి 21 జన్మల కొరకు ఆరోగ్యాన్ని పొందుతారు. ఈ ప్రపంచములో ఎలాంటి అనారోగ్యాలు ఉంటాయో చూడండి, అనారోగ్యము వలన ఎంత దుర్గంధము ఏర్పడుతుంది. హాస్పిటళ్ళు చూసినట్లయితే అయిష్టము కలుగుతుంది. కర్మభోగము ఎంతగా ఉంది! ఈ దుఃఖాలన్నింటి నుండి విముక్తులయ్యేందుకు తండ్రి అంటారు - కేవలము స్మృతి చేయండి, నేను మీకు ఇంకే కష్టమును ఇవ్వను. పిల్లలు చాలా కష్టాలు అనుభవించారని బాబాకు తెలుసు. వికారీ మనుష్యులవి ముఖ కవళికలే మారిపోతాయి. వారు పూర్తిగా శవాలలా మారిపోతారు. ఉదాహరణకు మద్యము తాగేవారు మద్యము లేనిదే ఉండలేరు. మద్యముతో చాలా నషా ఎక్కుతుంది, కానీ అది అల్పకాలికమైనది. దాని వల్ల వికారీ మనుష్యుల ఆయుష్షు కూడా ఎంత తగ్గిపోతుంది. నిర్వికారీ దేవతల ఆయుష్షు సగటున 125 నుండి 150 సంవత్సరాల వరకు ఉంటుంది. సదా ఆరోగ్యవంతులుగా అయినట్లయితే ఆయుష్షు కూడా పెరుగుతుంది కదా. శరీరము నిరోగిగా అయిపోతుంది. తండ్రిని అవినాశీ సర్జన్ అని కూడా అంటారు. జ్ఞాన ఇంజెక్షన్ ను సద్గురువు ఇవ్వడముతో అజ్ఞానాంధకారము వినాశనమైపోతుంది. తండ్రిని తెలుసుకోలేదు కావున అజ్ఞానాంధకారము అని అనడం జరుగుతుంది. ఇది భారతవాసులు విషయమే. క్రైస్టు విషయములో వారు ఫలానా సంవత్సరములో వచ్చారు అన్నది తెలుసు. వారి వద్ద ఆ తారీఖుల లిస్టు అంతా ఉంది. పోప్ లు ఏ విధంగా నంబరువారుగా ముఖ్య ఆసనముపై కూర్చుంటారు అనేది వారికి తెలుసు. ఒక్క భారత్ కు మాత్రమే ఎవరి చరిత్ర గురించి తెలియదు. ఓ దుఃఖహర్తా, సుఖకర్తా పరమాత్మా, ఓ మాతా పితా... అని పిలుస్తారు కూడా. అచ్ఛా, మరి మాతా పితల చరిత్రను గురించి చెప్పండి అని అడిగితే వారికేమీ తెలియదు.

ఇది పురుషోత్తమ సంగమయుగమని మీకు తెలుసు. మనము ఇప్పుడు పురుషోత్తములుగా తయారవుతున్నాము కావున పూర్తిగా చదువుకోవాలి. లోకులు ఏమనుకుంటారనే భావనలో మరియు కుల మర్యాదలలో కూడా చాలామంది చిక్కుకుని ఉంటారు. ఈ బాబా అయితే ఎవ్వరినీ లెక్క చేయలేదు. సంకల్పములో, స్వప్నములో కూడా ఎప్పుడూ లేనంతగా ఎన్నో నిందలు పడ్డారు. దారిలో వెళ్తుండగా బ్రాహ్మణుడు చిక్కుకుపోయారు. బాబా బ్రాహ్మణుడిగా తయారుచేశాక వీరికి ఎన్నో నిందలు వచ్చాయి. మొత్తము పంచాయితీ అంతా ఒకవైపు ఉంటే దాదా ఒక్కరు ఒకవైపు ఉన్నారు. నువ్వు చేస్తున్నదేమిటి? అని మొత్తము సింధీ పంచాయితీ అంతా ఇతడిని అన్నారు! అరే, కామము మహాశత్రువని గీతలో భగవానువాచ ఉంది కదా, దానిపై విజయాన్ని పొందడము ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇవి భగవద్గీతలోని మాటలు. కామ వికారాన్ని జయించినట్లయితే నీవు జగజ్జీతునిగా అవుతావు అని నా ద్వారా కూడా ఎవరో చెప్పిస్తున్నారు. ఈ లక్ష్మీ-నారాయణులు కూడా విజయము పొందారు కదా. ఇందులో యుద్ధము మొదలైనవాటి విషయమేమీ లేదు. మీకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు పవిత్రముగా అవ్వండి మరియు తండ్రిని స్మృతి చేయండి. నేను పావనముగా అవుతాను అని పత్ని అంటే, నేను అవ్వను అని పతి అంటారు. ఒకరు హంసగా, ఒకరు కొంగగా అవుతారు. తండ్రి వచ్చి జ్ఞాన రత్నాలను గ్రోలే హంసగా తయారుచేస్తారు. కానీ ఒకరు తయారై ఇంకొకరు తయారవ్వకపోతే గొడవ జరుగుతుంది. ప్రారంభములోనైతే ఎంతో శక్తి ఉండేది. కానీ ఇప్పుడు ఎవ్వరిలోనూ అంత ధైర్యము లేదు. మేము వారసులము అని అంటారు కానీ అసలు వారసులుగా అవ్వడమంటే అది వేరు. ప్రారంభములోనైతే చాలా అద్భుతముగా ఉండేది. పెద్ద-పెద్ద ఇళ్ళవారు వారసత్వాన్ని పొందడానికి ఒక్కసారిగా అన్నీ వదిలేసి వచ్చారు. కావున వారు యోగ్యులుగా అయ్యారు. మొట్టమొదట వచ్చినవారు అద్భుతము చేసారు. ఇప్పుడు అలాంటివారు ఏ ఒక్కరో వెలువడుతారు. లోకులు ఏమనుకుంటారో అనే భావన ఎక్కువ ఉంది. మొదటిలో ఎవరైతే వచ్చారో, వారు ఎంతో ధైర్యాన్ని చూపించారు. ఇప్పటివారు అంత సాహసాన్ని చూపించడం చాలా కష్టము. అయితే, పేదవారు చూపించగలుగుతారు. మాలలోని మణులుగా అయ్యేందుకు మరి పురుషార్థము చేయవలసి ఉంటుంది. మాల అయితే చాలా పెద్దగా ఉంటుంది. 8 రత్నాల మాల కూడా ఉంది, అలాగే 108 రత్నాల మాల కూడా ఉంది, అలాగే 16,108 మణిపూసల మాల కూడా ఉంది. తండ్రి స్వయం చెప్తున్నారు - చాలా చాలా కష్టపడండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. పిల్లలు సత్యము వినిపించరు. ఎవరైతే తమను తాము చాలా మంచివారిగా భావిస్తున్నారో, వారు జ్ఞానీ ఆత్మలే అయినా కానీ, వారి ద్వారా కూడా వికర్మలు జరుగుతూ ఉంటాయి. అందరికీ బాగా అర్థం చేయిస్తున్నా కానీ యోగము లేకపోతే తండ్రి హృదయము పైకి ఎక్కలేరు. స్మృతిలోనే ఉండకపోతే మరి హృదయము పైకి కూడా ఎక్కరు. స్మృతి ద్వారానే స్మృతి లభిస్తుంది కదా. ప్రారంభములో ఒక్కసారిగా బలిహారమైపోయారు. ఇప్పుడు బలిహారమవ్వడము అంత సులువైన విషయము కాదు. ముఖ్యమైన విషయము స్మృతి, అప్పుడే సంతోషమనే పాదరసము పైకెక్కుతుంది. ఎంతగా కళలు తగ్గిపోతూ వచ్చాయో, అంతగా దుఃఖము పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎంతగా కళలు పెరుగుతాయో అంతగా సంతోషమనే పాదరసము పైకెక్కుతుంది. అంతిమములో మీకు అన్నీ సాక్షాత్కారమవుతాయి. ఎక్కువ స్మృతి చేసేవారు ఏ పదవిని పొందుతారో మీరు చూస్తారు. చివరిలో ఎన్నో సాక్షాత్కారాలవుతాయి. ఎప్పుడైతే వినాశనమవుతుందో అప్పుడు మీరు స్వర్గ సాక్షాత్కారాలనే హల్వాను తింటారు. బాబా పదే-పదే అర్థం చేయిస్తున్నారు - స్మృతిని పెంచండి. ఎవరికైనా కొద్దిగా అర్థం చేయించినంత మాత్రాన బాబా దానికేమీ సంతోషించరు. ఒక పండితుని కథ కూడా ఉంది కదా. రామ, రామ అని అన్నట్లయితే సముద్రాన్ని దాటి వెళ్ళవచ్చు అని అనేవారు. నిశ్చయములోనే విజయము ఉంది అన్న విషయాన్ని చెప్పేందుకు ఈ ఉదాహరణనిస్తారు. తండ్రిపై సంశయము వచ్చినట్లయితే వినాశనమైపోతారు. తండ్రి స్మృతి ద్వారానే పాపాలు నశిస్తాయి, అందుకే రాత్రింబవళ్ళు స్మృతి చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడు కర్మేంద్రియాలలో ఉన్న చంచలత్వము సమాప్తమైపోతుంది. ఇందులో ఎంతో శ్రమ ఉంది. స్మృతి చార్టు సరిగ్గా లేనివారు ఎంతోమంది ఉన్నారు అనగా పునాదే సరిగ్గా లేదు. ఎంత వీలైతే అంత, ఎలాగో అలా స్మృతి చేస్తూ ఉండాలి, అప్పుడే సతోప్రధానులుగా, 16 కళల సంపూర్ణులుగా తయారవుతారు. పవిత్రతతోపాటు స్మృతి యాత్ర కూడా కావాలి. పవిత్రముగా ఉండడము ద్వారానే స్మృతిలో ఉండగలుగుతారు. ఈ పాయింటును బాగా ధారణ చేయండి. తండ్రి ఎంతటి నిరహంకారి! మున్ముందు అందరూ మీ చరణాలపై తల వంచుతారు. ఈ మాతలు తప్పకుండా స్వర్గ ద్వారాలను తెరుస్తారు అని అంటారు. స్మృతి యొక్క పదును ఇప్పుడు తక్కువగా ఉంది. ఏ దేహధారినీ స్మృతి చేయకూడదు. తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వడములోనే శ్రమ ఉంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పతిత ఛీ-ఛీ దుఃఖమయమైన ప్రపంచము పట్ల మనసు పెట్టుకోకూడదు. ఒక్క తండ్రి చేతిని పట్టుకుని దీనిని దాటి వెళ్ళాలి.

2. మాలలోని మణిపూసగా అయ్యేందుకు ఎంతో సాహసాన్ని ఉంచి పురుషార్థము చేయాలి. జ్ఞాన రత్నాలను గ్రోలే హంసలుగా అవ్వాలి. ఏ వికర్మలూ చేయకూడదు.

వరదానము:-
నిమిత్త భావము ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే శ్రేష్ఠమైన సేవాధారీ భవ

నిమిత్త భావము - సేవలో స్వతహాగానే సఫలతను ప్రాప్తింపజేయిస్తుంది. నిమిత్త భావము లేకపోతే సఫలత ఉండదు. శ్రేష్ఠమైన సేవాధారులు అనగా ప్రతి అడుగును తండ్రి అడుగుపై వేసేవారు, ప్రతి అడుగును శ్రేష్ఠ మతముపై శ్రేష్ఠముగా తయారుచేసుకునేవారు. ఎంతగా సేవలో మరియు స్వయములో వ్యర్థము సమాప్తమైపోతుందో అంతగానే సమర్థులుగా అవుతారు మరియు సమర్థ ఆత్మ ప్రతి అడుగులోనూ సఫలతను ప్రాప్తి చేసుకుంటుంది. ఎవరైతే స్వయము కూడా సదా ఉల్లాస-ఉత్సాహాలతో ఉంటారో మరియు ఇతరులకు కూడా ఉల్లాస-ఉత్సాహాలను ఇప్పిస్తారో వారే శ్రేష్ఠమైన సేవాధారులు.

స్లోగన్:-
ఈశ్వరీయ సేవలో స్వయాన్ని ఆఫర్ చేసుకున్నట్లయితే అభినందనలు లభిస్తూ ఉంటాయి.

అవ్యక్త సూచనలు - సహజయోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి

ఈ పరమాత్మ ప్రేమ అనే దారము దూరదూరాల నుండి లాక్కుని తీసుకువస్తుంది. ఇది ఎంతటి సుఖదాయకమైన ప్రేమ అంటే ఈ ప్రేమలో ఒక్క క్షణమైనా మైమరచిపోయినట్లయితే అనేక దుఃఖాలను మర్చిపోతారు మరియు సదాకాలము కొరకు సుఖపు ఊయలలో ఊగటం మొదలుపెడతారు. తండ్రికి పిల్లలైన మీ పట్ల ఎంత ప్రేమ ఉందంటే, వారు జీవితములోని సుఖ-శాంతుల మనోకామనలన్నింటినీ పూర్తి చేస్తారు. తండ్రి కేవలము సుఖాన్ని ఇవ్వడమే కాదు, సుఖపు భాండాగారానికి యజమానులుగా తయారుచేస్తారు.