02-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - రావణుడి మతాన్ని అనుసరించి ఏ వికర్మలు చేయకండి, పతితులకు పావనముగా తయారయ్యే మార్గాన్ని తెలపండి’’

ప్రశ్న:-
తెలివైన, వివేకవంతులైన పిల్లలు ఏ పురుషార్థాన్ని చేస్తూ కూడా ఒక శ్రీమతముపై తప్పకుండా అటెన్షన్ పెడతారు?

జవాబు:-
వివేకవంతులైన పిల్లలు ఉన్నత పదవిని పొందేందుకు నిరంతరం స్మృతిలో ఉండే పురుషార్థము చేస్తూ - నేను నిమిత్తముగా అయి అనేకాత్మల కళ్యాణము చేయాలి అన్న ఈ శ్రీమతముపై సదా అటెన్షన్ పెడతారు. ఎవరైతే అనేకుల కళ్యాణము చేస్తారో, వారి కళ్యాణము స్వతహాగానే జరుగుతుంది.

పాట:-
భాగ్యాన్ని మేలుకొలుపుకుని వచ్చాను...

ఓంశాంతి
ఇప్పుడు పిల్లల బుద్ధిలో కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము, రెండూ ఉన్నాయి ఎందుకంటే పాత ప్రపంచ వినాశనము ఇప్పుడు జరగనున్నదని మరియు కొత్త ప్రపంచాన్ని తండ్రియే రచిస్తారని పిల్లలకు తెలుసు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు, అలాగే రాత్రిని (శివరాత్రి) కూడా జరుపుకుంటారని పిల్లలకు తెలుసు. ఈ రెండు పదాల అర్థం ప్రపంచములో ఎవరికీ తెలియదు. శివజయంతి అనగా శివుని జన్మ. ఇక్కడ మనుష్యుల జన్మదినాన్ని జరుపుకుంటారు, శివునికైతే జన్మయే ఉండదు. వారు ఎలా జన్మ తీసుకుంటారు అనేది అర్థం చేసుకోరు. శ్రీకృష్ణుని విషయములో, వారు జన్మించారని చెప్తూ ఉంటారు. శివ జయంతి గురించైతే ఎటువంటి వర్ణన లేదు. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారని అంటూ ఉంటారు కూడా. మరి వారు పైన సూక్ష్మవతనములో కూర్చుని ఎవరికైనా ప్రేరణనిస్తారా? అలా జరగదు. పతిత-పావనుడైన తండ్రినే స్మృతి చేస్తారు. ఎప్పుడైతే తండ్రి స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారో, అప్పుడు మనుష్యుల బుద్ధిలో కూర్చుంటుంది. డ్రామాలో ఉన్న కారణముగా తండ్రి సంగమములోనే రావాల్సి ఉంటుంది. తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు కానీ ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎవరో కష్టం మీద అర్థం చేసుకున్నారు. నిజంగా పరమాత్మ బ్రహ్మా ద్వారా భారత్ ను మళ్ళీ శ్రేష్ఠాచారీ సత్యయుగీ ప్రపంచముగా తయారుచేస్తున్నారు అన్న అభిప్రాయాన్ని ఎవరూ వ్రాయరు. తండ్రి వచ్చి ఉన్నారని, స్వర్గ రాజ్యము యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారని, రాజయోగాన్ని నేర్పిస్తున్నారని యథార్థ రీతిలో ఎవరూ అర్థం చేసుకోరు. రావడము వేలాదిమంది వస్తారు కానీ వారిలో కొంతమంది మాత్రమే నిలుస్తారు, మళ్ళీ ఆ కొంతమందిలో కూడా వస్తూ-వస్తూ తగ్గిపోతూ ఉంటారు. ఎంత తమోప్రధాన బుద్ధి కలవారిగా అయ్యారు, ఇంత సహజమైన విషయాన్ని కూడా అర్థం చేసుకోలేరు. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇది యోగాగ్ని, దీనితో మీరు సతోప్రధానముగా తయారవుతారు. ఎలాంటి వికర్మలు చేయకండి. వికర్మలు చేయించేది రావణుడు, అతని మతముపై నడవకండి. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకండి. తండ్రి, పతితులను పావనముగా తయారుచేయడానికి వచ్చారు. మీ వ్యాపారము కూడా ఇదేనని బాబా అంటారు. మేము పతితులకు పావనముగా తయారయ్యే మార్గాన్ని ఎలా తెలియజేయాలి అని రాత్రింబవళ్ళు ఇదే చింతన చేయండి. మార్గము చాలా సహజమైనది. యోగబలముతోనే మనము సతోప్రధానముగా అవుతాము. ఇది అవినాశీ సర్జన్ ఇచ్చిన మందు. ఇది మంత్రమేమీ కాదు. ఇక్కడ కేవలం తండ్రిని స్మృతి చేయాలి. ఎంత స్పష్టముగా అర్థం చేయిస్తారు. కల్ప-కల్పము ఈ విషయాన్ని అర్థం చేయించారు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని అంటూ ఉంటారు కూడా. దేని పట్ల వైరాగ్యము? ఈ పాత ఛీ-ఛీ ప్రపంచము పట్ల వైరాగ్యము. పాత ప్రపంచములో పూర్తిగా పాపాత్ములుగా అయిపోయారు. ఓ పతిత-పావనా, ముక్తిప్రదాత రండి అని అంటారు కూడా. దేని నుండి విముక్తులుగా చేయాలి? దుఃఖము నుండి, రావణ రాజ్యము నుండి విముక్తులుగా చేయాలి. రావణుడిని ఇంగ్లీషులో ఈవిల్ (సైతాన్) అని అంటారు. అందుకే అంటారు - సైతాన్ రాజ్యము నుండి విముక్తులుగా చేసి ఇంటికి తీసుకువెళ్ళండి, మాకు గైడ్ గా అయి మీతో పాటు తీసుకువెళ్ళండి అని. ఎలాగైతే ఎవరైనా జైలు నుండి విడిపించి చాలా ప్రేమగా ఇంటికి తీసుకువెళ్తారో, అలా అనంతమైన తండ్రి పిల్లలందరినీ పాలన చేస్తారు - నేను మిమ్మల్ని జైలు నుండి విడిపించేందుకు వచ్చాను. మేళాలలో, ప్రదర్శనీలలో కూడా, అందరూ జైలులో ఏ విధముగా ఉన్నారు అనేది మోడల్ రూపములో చూపించడము జరిగింది. అయినా మనుష్యులు ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి ఎంత సహజమైన పద్ధతిలో అర్థం చేయించి విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నశిస్తాయి, మీరు సత్యయుగానికి యజమానులుగా అవుతారని అంటారు. ఇది ఎంత సులభము. ఏ ధర్మము వారైనా అర్థం చేసుకోగలరు. ఫలానా ధర్మము ఎప్పుడు స్థాపన అవుతుంది అనేది తెలియజేయాలి. అంతిమములో ఆత్మలందరూ తమ-తమ సెక్షన్లలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ దేవీ-దేవతా ధర్మము ప్రారంభమవుతుంది. బ్రహ్మా ద్వారా స్థాపన అని వ్రాసి ఉంది. త్రిమూర్తి చిత్రము నంబరువన్ చిత్రము. త్రిమూర్తి మరియు సృష్టి చక్రము, ఈ చిత్రాలపై బాగా స్పష్టముగా అర్థం చేయించవచ్చు. ఒకటి శాంతిధామము, రెండవది సుఖధామము మరియు ఇది దుఃఖధామము అని కూడా అర్థం చేయించారు. ఈ దుఃఖధామము పట్ల వైరాగ్యము ఉండాలి. ఇప్పుడు భక్తి యొక్క రాత్రి పూర్తయింది. సత్య, త్రేతాయుగాల పగలు మొదలవుతుంది.

తండ్రి అంటారు - ఇప్పుడు పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది, అందుకే దీని పట్ల వైరాగ్యము కావాలి. అది హద్దు వైరాగ్యము, ఇది అనంతమైన వైరాగ్యము. ఆ సన్యాసులు మొదలైనవారెవ్వరూ కొత్త ప్రపంచాన్ని రచించరు. రచయిత తండ్రి కదా. వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు, వారు హెవెన్ ను స్థాపన చేసేవారు. ఇంకెవ్వరూ చేయలేరు. ఈ చదువు సత్యయుగీ రాజధానిని ప్రాప్తి చేసుకునేందుకు ఉంది. జ్ఞానసాగరుడు వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు అని వారినే అంటారు. వారిలో దేని గురించిన జ్ఞానముంది? బ్యారిస్టర్, సర్జన్ గా అయ్యే జ్ఞానమా? పరమాత్మలో సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. అందులోనే మొత్తము జ్ఞానమంతా వచ్చేస్తుంది - బ్యారిస్టర్, ఇంజనీర్ మొదలైనవాటన్నింటి మూల సారము ఈశ్వరీయ జ్ఞానము. ఆ భౌతిక విద్యను చదవడము, ఇంజనీర్ మొదలైనవారిగా అవ్వడము పెద్ద విషయమేమీ కాదు. సత్యయుగీ కొత్త ప్రపంచానికి సంబంధించిన ఆచార-పద్ధతులేవైతే ఉంటాయో, అవే అక్కడ కొనసాగుతాయని మీకు తెలుసు. మనము కల్పక్రితం ఎలాగైతే మహళ్ళు మొదలైనవి నిర్మించామో, అదే రిపీట్ చేస్తాము, దానినే సత్యయుగమని అంటారు. అక్కడి ఆచార-పద్ధతుల గురించి, అక్కడ వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఎలా తయారవుతాయి అనేది మనుష్యులకు తెలియదు. వారు 16 కళల సంపూర్ణులుగా, సంపూర్ణ నిర్వికారులుగా మహిమ చేయబడతారు. అక్కడి ఆచార-పద్ధతులు ఏవైతే ఉంటాయో, వాటి అనుసారముగానే రాజ్యము నడుస్తుంది. అది డ్రామాలో నిశ్చితమై ఉంది, ఆత్మలు తమ పాత్రను అభినయిస్తారు. అక్కడ ఇళ్ళు ఎలా నిర్మిస్తారు, ఎలా ఉంటారు, ఇవన్నీ నిశ్చితమై ఉన్నాయి. ఈ పాత ప్రపంచానికి సంబంధించినవి ఎలాగైతే నడుస్తాయో, అలాగే ఆ కొత్త ప్రపంచానివి కూడా నడుస్తాయి. ఇక్కడ అసురులు ఉన్నారు, అక్కడ దేవతలు ఉంటారు. శాస్త్రాల్లో ఈ విషయాలేవీ లేవు. జ్ఞానము మరియు భక్తి, బ్రహ్మా యొక్క పగలు, బ్రహ్మా యొక్క రాత్రి అని అంటూ ఉంటారు కూడా. ఇలా అన్నప్పుడు బ్రహ్మా పేరును తీసుకుంటారే కానీ విష్ణువు పేరు కాదు. బ్రహ్మాయే విష్ణువుగా అవుతారు. బ్రహ్మా-సరస్వతులు విష్ణువు యొక్క రెండు రూపాలైన లక్ష్మీ-నారాయణులు. అందుకే, లక్ష్మీ-నారాయణులే 84 జన్మల తర్వాత ఈ విధముగా అవుతారని బాబా అర్థం చేయించారు. రాజయోగ తపస్యను ఇక్కడే చేస్తారు, సూక్ష్మవతనములో చేయరు. యజ్ఞాలు మొదలైనవి కూడా ఇక్కడే రచించబడతాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది అంతిమ యజ్ఞము, తర్వాత సత్య, త్రేతాయుగాలలో ఏ యజ్ఞము ఉండదు. రకరకాల యజ్ఞాలను రచిస్తారు, వర్షము పడకపోతే యజ్ఞము రచిస్తారు. ఏదైనా దుఃఖము వస్తే యజ్ఞము రచిస్తారు, యజ్ఞముతో దుఃఖము తొలగిపోతుందని భావిస్తారు. ఇది అన్నింటికంటే పెద్ద యజ్ఞము, ఈ జ్ఞాన యజ్ఞముతో మొత్తం సృష్టి యొక్క దుఃఖము తొలగిపోతుంది. ఇది రాజస్వ అశ్వమేధ అవినాశీ జ్ఞాన యజ్ఞము. ఇందులో అన్నీ స్వాహా అయిపోతాయి. ఎంత మంచి రీతిలో అర్థం చేయించడము జరుగుతుంది.

ఢిల్లీలో మండపాన్ని (టెంటు) తయారుచేసి మేళా నిర్వహించారు. ఇది కూడా మంచిదే. మండపాన్ని తయారుచేయడానికి సమయమేమీ పట్టదు. హాలు కోసం ఎంతో హైరానా పడాల్సి ఉంటుంది కదా, దాని కంటే మండపాన్ని (టెంటు) తీసుకోవచ్చు. చిన్న-చిన్న పల్లెటూర్ల కోసం చిన్న మండపాలను కూడా తయారుచేసుకోండి. పల్లెటూర్లు మొదలైన స్థానాలలో కరెంటు లేకపోతే పగలు పూట కూడా ప్రదర్శనీలు పెట్టవచ్చు. మీ సామాగ్రియే ఉండాలి, అద్దెకు ఎందుకు తీసుకోవాలి! ప్రదర్శనీ కమిటీ వారికి తండ్రి డైరెక్షన్ ఏమిస్తున్నారంటే - వాటర్ ప్రూఫ్ మండపాన్ని (టెంటు) తయారుచేయండి, అప్పుడు వర్షము పడినా పర్వాలేదు. బాబా ఢిల్లీకి వెళ్ళినప్పుడు చలిలో కూడా మండపములోకి వెళ్ళి భాషణ చేసేవారు. చలి కోసం అందరికీ వెచ్చదనము అందించే వస్త్రాలు ఉన్నాయి. ప్రదర్శనీల కోసమైతే ఎన్ని మండపాలనైనా తయారుచేయవచ్చు. ఎవరూ విఘ్నాలు వేయకుండా మంచి ఇన్ష్యూరెన్స్ కూడా చేయించవచ్చు. సేవైతే చేయాల్సి ఉంటుంది కదా. అర్థం చేయించాలి కూడా. తండ్రి యొక్క పూర్తి పరిచయాన్ని ఇవ్వాలి. ఇప్పుడైతే మనము తండ్రితో పాటు ఉన్నాము. జ్ఞానసాగరుడైన తండ్రి నుండి మనకు జ్ఞానము లభిస్తుంది. సత్యయుగములో జ్ఞానము యొక్క అవసరముండదు. తండ్రి అంటారు - నేను సద్గతినిచ్చేందుకు వచ్చాను, తర్వాత రావణుడి వలన దుర్గతి కలుగుతుంది. సద్గతిదాత అయితే ఒక్క తండ్రి మాత్రమే. ఎంత స్పష్టముగా అర్థం చేయించడము జరుగుతుంది. స్వయం అర్థం చేసుకోరు కానీ ఇది మనుష్యులకు చాలా బాగుంటుంది అని అంటూ ఉంటారు. ఇకపోతే, స్వయం అర్థం చేసుకునేందుకు తీరిక ఉండదు. పెద్ద-పెద్ద వ్యక్తుల వద్దకు కూడా వెళ్ళి ఎంతగా అర్థం చేయిస్తారు. తండ్రి శ్రేష్ఠాచారీ ప్రపంచాన్ని ఎలా తయారుచేస్తారో అర్థం చేసుకోండి. శ్రేష్ఠాచారులుగా తయారుచేయడము తండ్రి పని, అందుకే తండ్రిని పిలుస్తారు. దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని అంటూ ఉంటారు. తండ్రి వచ్చినట్లయితే, మేము బలిహారమవుతాము, శ్రీమతమనుసారముగా యథార్థముగా నడుచుకుంటామని కూడా భావిస్తారు. అయినా తండ్రి శ్రీమతాన్ని అనుసరించరు. భగవంతుడు ఎవరు అనేది మనుష్యులకు తెలియదు. వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. అరే, పతిత-పావనుడైన భగవంతుడు ఒక్కరే కదా. వారు సర్వవ్యాపి ఎలా అవుతారు? అలా అయితే, అందరూ భగవంతుడిగానే పిలవబడతారు. భగవంతుడు చిన్నగా, పెద్దగా అవ్వరు కదా. కొందరు మాంసం తింటూ ఉన్నట్లుగా, కొందరు కొట్లాడుకుంటూ ఉన్నట్లు కూడా ప్రదర్శనీలలో చూపించారు, మరి ఇవన్నీ భగవంతుడు చేస్తారా అని వారిని అడగండి. ఆ సమయములో మనుష్యులు సంతోషించి వెళ్ళిపోతారు, బయటకు వెళ్ళగానే మళ్ళీ ఎక్కడి విషయాలు అక్కడే ఉండిపోతాయి. కేవలం ప్రజలు తయారవుతారు. రాజులుగా తయారయ్యేందుకు ఎంతగా కష్టపడతారు. రాజులుగా అవుతామని అందరూ చేతులు ఎత్తుతారు. 5-7 రోజుల తర్వాత చూస్తే, వారు ఉండనే ఉండరు. మాయ ఎంత శక్తివంతమైనది, వెంటనే చిక్కుకునేలా చేస్తుంది. రాజధానిని స్థాపన చేయడము ఎంత కష్టము. ధర్మ స్థాపన చేయడములో కష్టమేమీ ఉండదు. అక్కడ అసురుల విఘ్నాలేవీ కలగవు. ఇక్కడ పిల్లలు, మేము వివాహము చేసుకోము అని అంటే, లౌకిక తండ్రి అంటారు - నీవు తప్పకుండా వివాహము చేసుకోవాలి, వివాహము లేకుండా ప్రపంచము ఎలా నడుస్తుంది అని. అరే, వివాహము చేసుకోకపోతే మంచిదే కదా. వివాహము చేసుకోకపోతే పిల్లలు కూడా ఉండరు. బర్త్ కంట్రోల్ (జనాభా నియంత్రణ) అవుతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు ఎవరు చేస్తే వారు పొందుతారు. ఇక మున్ముందు చాలా త్వరత్వరగా తయారవుతారు. కల్పక్రితం ఎలాగైతే స్థాపన జరిగిందో, అలాగే జరుగుతుందని పిల్లలైన మీకు తెలుసు. గడిచిన ప్రతి రోజు కల్పక్రితం వలె గడుస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు - గడిచిన ఈ రోజంతా డ్రామానుసారముగా గడిచింది, మళ్ళీ రేపు ఏదైతే జరగనున్నదో అది డ్రామానుసారముగానే జరుగుతుంది అనే ఆలోచన వస్తుంది. ఇది డ్రామా అని, దీని ఆదిమధ్యాంతాలు ఏమిటి అనేది మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మేము పురుషార్థము చేస్తున్నామని, మిగిలినవారంతా ఘోర అంధకారములో ఉన్నారని మీకు తెలుసు. ఏ పాత్ర అయితే నడుస్తుందో, అది డ్రామానుసారముగా నడుస్తుంది. ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు, రేపు అనారోగ్యము పాలైతే, దానిని కూడా డ్రామానుసారముగా కర్మ భోగాన్ని అనుభవించాల్సిందేనని అంటారు. కల్ప-కల్పము ఇలాగే జరుగుతుంది. డ్రామా బుద్ధిలో ఉంది, అందుకే ఏ చింత ఉండదు. విఘ్నాలు కలిగితే, పని ఆలస్యమైతే - కల్ప-కల్పము ఇలాగే ఆలస్యమై ఉంటుందని అర్థం చేసుకుంటారు. లక్షణాలు అలా కనిపిస్తాయి. ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థము చాలా చేయాలి. మేము ఉన్నతిలోకి వెళ్తున్నామా? బాబా సేవ చేస్తున్నామా లేక ఒకే స్థానములో ఆగిపోయామా? మేము ఎవరి కళ్యాణమునైనా చేస్తున్నామా? అని చూసుకోవాలి. అనేకుల కళ్యాణము చేస్తే మన కళ్యాణము కూడా జరుగుతుంది. పరీక్ష పూర్తయినప్పుడు, మేము ఈ పదవిని పొందుతామని అంతా తెలిసిపోతుంది. ఇది కల్ప-కల్పపు పందెము. తర్వాత చివరిలో, మేము ఇంత సమయము పురుషార్థము ఎందుకు చేయలేదు? బాబా శ్రీమతమనుసారముగా ఎందుకు నడుచుకోలేదు? అని చాలా పశ్చాత్తాపపడతారు. బాబా కేవలం ‘మన్మనాభవ’ అని చెప్తారు, అంతే. ఎంత ప్రేమగా చెప్తారు - పిల్లలూ, నన్ను స్మృతి చేయండి, ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేసే సేవను చేయండి. మరి పురుషార్థము చేసి ఉన్నత పదవిని ఎందుకు పొందకూడదు! అటువంటివారిని తెలివైన, వివేకవంతులైన పిల్లలు అని అంటారు. ఫలానావారు శ్రీమతాన్ని అనుసరించడము లేదు, ఎవరి కళ్యాణము చేయడము లేదు కనుక తప్పకుండా పదవి కూడా తక్కువదే లభిస్తుందని చదివించేవారు కూడా అర్థం చేసుకుంటారు. ఎంతగా అనేకులకు మార్గాన్ని తెలియజేస్తారో, అంతగా ఉన్నత పదవిని పొందుతారు. మీ కోసం మీరు సేవ చేయాలి, ఎవరు చేస్తే వారు పొందుతారు. కనుక మేము ఎందుకు అలాంటి సేవను చేయకూడదు అని పురుషార్థము చేయాలి. ఎక్కడైనా ప్రదర్శనీ జరిగితే, అక్కడికి సగం జీతము నష్టపోయినా కూడా వెళ్ళి సేవ చేస్తారు. కొంతమందైతే మొత్తం జీతాన్ని కూడా వదిలి సేవ చేస్తారు. బాబా అంటారు - పిల్లలకు ఏదైనా కావాలంటే పంపండి. శరీర నిర్వహణను 1000 రూపాయలతోనైనా చేయవచ్చు, 10 రూపాయలతోనైనా చేయవచ్చు. ఎవరి వద్దనైనా చాలా ధనము ఉంటే, లక్షల రూపాయలు కూడా ఖర్చవుతాయి. బాబా అంటారు - మీరు గడ్డి కోస్తున్నా కూడా, కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే 21 జన్మలకు స్వర్గానికి యజమానులుగా అవుతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అన్ని చింతల నుండి విముక్తులుగా అయ్యేందుకు డ్రామాను యథార్థ రీతిలో బుద్ధిలో ఉంచుకోవాలి. ఏది గడిచినా, అది కల్పక్రితం వలె గడిచింది అని భావించాలి.

2. మేము పతితులను పావనముగా తయారుచేసే మార్గాన్ని ఎలా తెలియజేయాలి అని రాత్రింబవళ్ళు ఇదే చింతన చేయాలి. శ్రీమతమనుసారముగా తమ మరియు ఇతరుల కళ్యాణము చేయాలి.

వరదానము:-
విశ్వ పరివర్తన అనే శ్రేష్ఠ కార్యము యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ డబల్ లైట్ గా ఉండే ఆధారమూర్త భవ

ఎవరైతే ఆధారమూర్తులుగా ఉంటారో, వారిపైనే మొత్తం బాధ్యత ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ రూపముతో ఎక్కడ అడుగు వేసినా, అలా అనేక ఆత్మలు మిమ్మల్ని ఫాలో చేస్తారు, ఇది బాధ్యత. కానీ ఈ బాధ్యత అవస్థను తయారుచేసుకోవడములో చాలా సహాయము చేస్తుంది, ఎందుకంటే దాని ద్వారా అనేకాత్మల ఆశీర్వాదాలు లభిస్తాయి, ఈ కారణముగా బాధ్యత తేలిక అయిపోతుంది, ఈ బాధ్యత అలసటను దూరం చేసేటటువంటిది.

స్లోగన్:-
మనసు మరియు బుద్ధి, ఈ రెండింటి బ్యాలెన్స్ ను పెట్టుకుని సేవ చేసినట్లయితే సఫలత లభిస్తుంది.

అవ్యక్త ప్రేరణలు - పరోపకార భావనతో సంపన్నముగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి

స్వయములో ఉన్న అన్ని ఖజానాలను ఇతర ఆత్మలకు దానము చెయ్యటము - ఇదే పరోపకారము చెయ్యటము. ఇటువంటి పరోపకారులు స్వయాన్ని సర్వ ఖజానాలతో సంపన్నముగా చేసుకుని నిశ్చింత చక్రవర్తులుగా అనుభవం చేస్తారు. వారి సంకల్పములో కూడా చింతకు చెందిన సంస్కారాలు ఇమర్జ్ అవ్వలేవు. ఎక్కడైతే సేవ ఉంటుందో, అక్కడ ఎవరిలోని బలహీన సంస్కారాలను చూడకుండా, వారి పట్ల దయాహృదయముతో కూడిన దృష్టిని పెట్టుకుని, అపకారులకు కూడా ఉపకారము చెయ్యండి.