02-11-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇక్కడకు మీ రాజ్య భాగ్యాన్ని
తయారుచేసుకోవడానికి వచ్చారు, ఎంతగా స్మృతిలో ఉంటారో, చదువు పట్ల అటెన్షన్ పెడతారో,
అంతగా భాగ్యము శ్రేష్ఠముగా తయారవుతూ ఉంటుంది’’
ప్రశ్న:-
సంగమములో ఏ
శ్రీమతాన్ని పాలన చేసి 21 జన్మలకు మీరు మీ భాగ్యాన్ని శ్రేష్ఠముగా తయారుచేసుకుంటారు?
జవాబు:-
సంగమములో
తండ్రి శ్రీమతమేమిటంటే - మధురమైన పిల్లలూ, నిర్వికారిగా అవ్వండి. దేహీ-అభిమానులుగా
అవ్వడానికి పూర్తి పురుషార్థము చేయండి. ఎప్పుడూ ఏ పాప కర్మ చేయకండి. అప్పుడు 21
జన్మల కోసం భాగ్యము శ్రేష్ఠముగా తయారవుతుంది.
పాట:-
భాగ్యాన్ని
మేలుకొలుపుకుని వచ్చాను...
ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఇప్పుడు ఈ రెండు లైనుల అర్థాన్ని
ఎవరైతే అర్థం చేసుకున్నారో, వారు చేతులెత్తండి? భాగ్యాన్ని మేలుకొలుపుకుని వచ్చాను
అని ఎవరన్నారు? ఆత్మ. నేను భాగ్యాన్ని తయారుచేసుకుని వచ్చాను అని అందరి ఆత్మలు
అంటారు. ఏ భాగ్యము? కొత్త ప్రపంచములోకి వెళ్ళే భాగ్యము. కొత్త ప్రపంచము స్వర్గము, ఈ
పాత ప్రపంచము నరకము. ఈ విషయాన్ని ఆత్మలందరూ అంటారు. ఆత్మకైతే శరీరము తప్పకుండా
కావాలి, అప్పుడే మాట్లాడగలదు. మేము స్కూల్లో భాగ్యాన్ని తయారుచేసుకోవడానికి వచ్చామని
జీవాత్మలు అంటారు. చదివించేవారు ఎవరు? జ్ఞానసాగరుడైన శివబాబా. మనుష్యులను దేవతలుగా
లేదా పతితులను పావనులుగా, నరకవాసులను స్వర్గవాసులుగా తయారుచేసేవారు ఆ ఒక్క తండ్రి
మాత్రమే. ఈ నరకానికి నిప్పు అంటుకోనున్నది. మేము అనంతమైన తండ్రి వద్దకు వచ్చామని
పిల్లలు చెప్పేటువంటి స్కూలు ప్రపంచములో ఏదీ లేదు. అలానే, నేను తండ్రిని కూడా,
టీచరును కూడా, గురువును కూడా అని చెప్పేవారు ఎవ్వరూ లేరు. ఈ బ్రహ్మా కూడా చెప్పలేరు.
ఒక్క శివబాబా మాత్రమే - నేను అందరికీ తండ్రిని, టీచరును, గురువును అని చెప్తారు.
వారే కూర్చుని చదివిస్తారు. కనుక ఇప్పుడు పిల్లలు భాగ్యాన్ని తయారుచేసుకోవాలి. మేము
కొత్త ప్రపంచ రాజధాని యొక్క భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు వచ్చామని పిల్లలంటారు. ఈ
పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నదని మనకు తెలుసు. తండ్రి వచ్చి కొత్త ప్రపంచాన్ని
స్థాపన చేస్తారు. మీరు 21 జన్మల రాజ్య భాగ్యాన్ని తీసుకోవడానికి చదువుకుంటారు అనగా
మీరు రాజ్య భాగ్యాన్ని తయారుచేసుకోవడానికి వచ్చారు. ఇక్కడ రాజయోగాన్ని నేర్చుకుంటూ
ఉన్నారు. ఈ పాట ఆ నాటకము వాళ్ళ ద్వారా తయారుచేయబడినదే, కానీ దీని అర్థం ఇక్కడ అర్థం
చేయించబడుతుంది. ఎలాగైతే, తండ్రి కూర్చుని అన్ని వేదాల-శాస్త్రాల సారాన్ని అర్థం
చేయిస్తారు. ఈ సమయములో మొత్తం ప్రపంచములో భక్తి ఉంది. సత్యయుగములో భక్తి, మందిరాలు
మొదలైనవి ఉండవు. మీరు అర్ధకల్పము భక్తి చేసారు, ఇప్పుడు భగవంతుడు లభించారు.
మొట్టమొదట భారత్ లో ఈ దేవీ-దేవతల రాజ్యముండేది. తర్వాత 84 జన్మలు
తీసుకుంటూ-తీసుకుంటూ భాగ్యము పాడైపోయింది. ఇప్పుడు మళ్ళీ భాగ్యాన్ని
తయారుచేసుకుంటారు. తండ్రి భాగ్యాన్ని తయారుచేయడానికే వచ్చారు. నన్ను స్మృతి చేయండి,
మీరు చాలా పాపాత్ములుగా అయిపోయారు అని పిల్లలకు చెప్తున్నారు. మొట్టమొదట భక్తి
శివబాబాకు చేయడము జరుగుతుంది, అది అవ్యభిచారి భక్తి. తర్వాత భక్తి కూడా వ్యభిచారిగా
అయిపోతుంది. కనుక పిల్లలకు మొట్టమొదట ఈ నిశ్చయముండాలి - ఎవరినైతే భగవంతుడని అంటారో,
వారు మనల్ని చదివిస్తున్నారు. వారికి శరీరమేమీ లేదు, వారు ఈ శరీరములో కూర్చుని
మాట్లాడుతారు. ఎలాగైతే మీ ఆత్మ ఈ శరీరములోకి రావడముతో మాట్లాడటము మొదలుపెడుతుంది.
అప్పుడప్పుడు మనుష్యులు మరణిస్తారు కానీ శ్మశానానికి తీసుకువెళ్ళేటప్పుడు సగం దారిలో
కదలడము మొదలుపెడతారు. అలాగని, ఆత్మ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిందని కాదు. అలా కాదు.
ఆత్మ చాలా సూక్ష్మమైనది కదా, కావున ఎక్కడో దాగి ఉండిపోయింది. స్పృహ తప్పిపోయింది,
ఎవరికీ తెలియలేదు అని అంటారు. అలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. చితిపై నుండి కూడా
లేస్తారు, అప్పుడు వారిని చితిపై నుండి దించేస్తారు. మరి అదేమిటి? ఆత్మ ఎక్కడో దాగి
ఉండిపోయింది, మళ్ళీ తన స్థానానికి వచ్చేసింది. ఆత్మ లేకపోతే శరీరము పూర్తిగా శవములా
అయిపోతుంది. ఆత్మల దేశము పరంధామము. మనము అక్కడ ఆ ఇంటిలో ఉండేటువంటి వారము అని మీకు
తెలుసు. మొట్టమొదట ఆత్మలమైన మనము ఇంటి నుండి సత్యయుగములోకి వచ్చాము. భారతవాసులు,
ఎవరైతే దేవీ-దేవతలుగా ఉండేవారో, వారే వచ్చి ఉంటారు. వాస్తవానికి ఏయే ధర్మాలనైతే
స్థాపన చేస్తారో, అవి చివరి వరకు నిలిచి ఉంటాయి. బుద్ధుని యొక్క ధర్మము నిలిచి ఉంది,
క్రైస్టు యొక్క ధర్మము నిలిచి ఉంది. కేవలం దేవీ-దేవతా ధర్మమువారు, ఎవరైతే రాజ్యము
చేసేవారో, వారి పేరే మాయమైపోయింది. స్వయాన్ని దేవీ-దేవతా ధర్మమువారిగా
చెప్పుకునేవారు ఎవ్వరూ లేరు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - భారతవాసులు తమ ధర్మాన్ని మర్చిపోయారు, మన గృహస్థ
ధర్మము పవిత్రముగా ఉండేది. సంపూర్ణ నిర్వికారీ, మహారాజు-మహారాణుల రాజ్యముండేది.
వారిని భగవతి లక్ష్మి మరియు భగవాన్ నారాయణ అని అంటారు. వాస్తవానికి భగవంతుడు ఒక్కరే,
వారినే జ్ఞాన సాగరుడని అంటారు. ఈ లక్ష్మి-నారాయణులలోనైతే ఏ జ్ఞానము లేదు. జ్ఞాన
సాగరుడు ఒక్క శివబాబా మాత్రమే. వారు కూర్చుని పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తారు.
మీరు ఇప్పుడు చదువుకుంటున్నారు, ఈ చదువును మళ్ళీ అక్కడ మర్చిపోతారు. మా ఆత్మలో 84
జన్మల రికార్డు నిండి ఉందని ఇప్పుడు మీలోని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారు. ఆత్మ
ఇప్పుడు జ్ఞానము తీసుకుంటూ ఉంది. తర్వాత సత్యయుగములోకి వెళ్ళి తన రాజ్యము చేస్తుంది.
మీరంటారు - మేము 84 జన్మల చక్రములో తిరిగాము, ఇప్పుడు బాబా నుండి మేము స్వర్గ
రాజ్యాధికారాన్ని తీసుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఆ తాతగారి నుండి వారసత్వాన్ని
తీసుకుంటారు, కానీ తమ-తమ పురుషార్థమనుసారముగా తీసుకుంటారు. ఇందులో వాటాలు ఏమీ పంచడము
జరగదు. అజ్ఞాన కాలములో పంచడము జరుగుతుంది కదా. అనంతమైన తండ్రి అంటారు - నేను
వైకుంఠాన్ని స్థాపన చేస్తాను, అందులో ఉన్నత పదవిని పొందడమనేది మీ పురుషార్థముపై
ఆధారపడి ఉంటుంది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా వికర్మలు వినాశనమవుతాయి,
పవిత్రముగా అవుతారు. బంగారాన్ని భట్టీలో వేస్తారు కదా. అప్పుడు దాని నుండి మాలిన్యము
తొలగి సత్యమైన బంగారు ముద్దగా అవుతుంది. ఈ ఆత్మ కూడా సత్యమైన బంగారముగా ఉండేది,
ఇక్కడకు పాత్రను అభినయించడానికి వస్తుంది. మొదట బంగారుయుగానికి చెందినదిగా ఉంటుంది,
ఆ తర్వాత వెండి యొక్క మాలిన్యము ముందుగా చేరింది. ఆత్మ కొద్దిగా అపవిత్రముగా
అవుతుంది. తర్వాత నెమ్మది-నెమ్మదిగా కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఇల్లు కూడా ముందు
కొత్తదిగా, తర్వాత నెమ్మది-నెమ్మదిగా పాతదిగా అవుతూ ఉంటుంది. 100 సంవత్సరాల తర్వాత
పాతది అని అంటారు. అలాగే ప్రపంచము కూడా కొత్తదిగా మరియు పాతదిగా అవుతుంది. నేటికి 5
వేల సంవత్సరాల క్రితం కొత్తదిగా ఉండేది. ఆ దేవీ-దేవతల రాజ్యమేదైతే ఉండేదో, అది
ఏమయ్యింది? 84 జన్మలను అనుభవిస్తూ-అనుభవిస్తూ పాతబడిపోయింది. ఆత్మ కూడా మలినముగా
అయిపోయింది, శరీరము కూడా మలినముగా అయిపోయింది. తెల్లగా ఉన్నవారి నుండి నల్లగా
అయ్యారు. శ్రీకృష్ణుడిని కూడా తెల్లగా మరియు నల్లగా చూపిస్తారు కదా, కాళ్ళను నరకము
వైపు, ముఖాన్ని స్వర్గము వైపు చూపించాలి. మీరు కూడా ఆ కులానికి చెందినవారే. మీవి
కూడా కాళ్ళు నరకము వైపు, ముఖము స్వర్గము వైపు ఉన్నాయి. ఇప్పుడు మీరు ముందు
నిర్వాణధామములోకి వెళ్ళి తర్వాత స్వర్గములోకి వస్తారు. కలియుగానికి నిప్పు
అంటుకుంటుంది. కుండపోత వర్షాలు కురుస్తాయి, మంటలు అంటుకుంటాయి, భూకంపాలు వస్తాయి.
పతిత ఆత్మలు లెక్కాచారాలన్నీ సమాప్తము చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. కొంతమంది
మాత్రమే మిగులుతారు. పవిత్రాత్మలు వస్తూ ఉంటారు. ఇప్పుడైతే అందరూ ముళ్ళలా ఉన్నారు.
కామ ఖడ్గాన్ని ఉపయోగించడము, ఇది ముల్లు గుచ్చడము వంటిది. ఇక్కడైతే తండ్రి అంటారు,
సంపూర్ణ నిర్వికారిగా అవ్వాలి. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే నేను మీకు
స్వర్గ వారసత్వాన్ని ఇస్తాను, మీరు పవిత్రముగా అవుతారు. మీరు పావనముగా ఉన్నప్పుడు
గృహస్థ వ్యవహారము కూడా పవిత్రముగా ఉండేది. ఇప్పుడు మీరు పతితముగా అయ్యారు కనుక
గృహస్థ వ్యవహారము కూడా అపవిత్రముగా, వికారీగా ఉంది. సత్యయుగములో వ్యాపార-వ్యవహారాలు
కూడా సత్యముగా జరుగుతాయి. అక్కడ అసత్యము మొదలైనవి చెప్పాల్సిన అవసరము ఉండదు. ఎక్కువ
ధనాన్ని సంపాదించాలనే లోభము ఉన్నప్పుడు అసత్యము చెప్పడము జరుగుతుంది. అక్కడైతే
అపారమైన ధనము లభిస్తుంది. ధాన్యము మొదలైనవాటికి ధర ఏమీ ఉండదు. అక్కడ పేదవారు ఎవ్వరూ
ఉండనే ఉండరు. ఎవరైతే మంచి పురుషార్థము చేస్తారో, వారు మహారాజుగా అవుతారు.
వజ్ర-వైఢూర్యాల మహళ్ళు లభిస్తాయి. పురుషార్థము పూర్తిగా చేయకపోతే ప్రజల్లోకి
వెళ్ళిపోతారు. రాజు-రాణి, తర్వాత రాకుమారుడు-రాకుమారి, మొత్తం వంశమంతా ఉంటుంది కదా.
తర్వాత ప్రజల్లో కూడా నంబరువారుగా షావుకారులు మరియు పేద ప్రజలు ఉంటారు. అక్కడైతే
అందరూ పవిత్రముగా ఉంటారు. రాజు, రాణి ఉంటారు, మంత్రి కూడా ఒకరు ఉంటారు. అక్కడ
చాలామంది మంత్రులేమీ ఉండరు. రాజులో రాజ్యాన్ని నడిపించే శక్తి ఉంటుంది. తండ్రి ఏ
విధముగా అర్థం చేయిస్తారో, అలా పిల్లలు కూడా అర్థం చేయించాలి. భారతవాసులైన మనము
దేవీ-దేవతలుగా ఉండేవారము. సత్యయుగములో మన రాజ్యముండేది. గృహస్థ వ్యవహారములో మనము
పవిత్రముగా ఉండేవారము, స్వర్గవాసులుగా ఉండేవారము. తర్వాత పతితముగా అవుతూ-అవుతూ
నరకవాసులుగా అయ్యాము, మళ్ళీ స్వర్గవాసులుగా అవుతాము. ఈ ఆట తయారుచేయబడి ఉంది.
స్వర్గవాసులుగా ఒక్క జన్మలో అవుతారు, మళ్ళీ నరకవాసులుగా అవ్వడానికి 84 జన్మలు
తీసుకోవాల్సి ఉంటుంది. మెట్ల వరస చిత్రములో చాలా స్పష్టముగా చూపించడము జరిగింది.
మనము వెళ్ళి స్వర్గములో రాజ్యము చేస్తామని ఇప్పుడు బుద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు
తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. తండ్రియే సత్యాన్ని తెలియజేసి నరుని
నుండి నారాయణునిగా తయారుచేస్తారు. అక్కడ వారు సత్యనారాయణ కథను ఏదైతే వింటారో, దాని
ద్వారా ఎవ్వరూ నరుని నుండి నారాయణునిగా అవ్వరు. అంటే ఆ కథ అసత్యమైనది కదా. ఇక్కడ
మీరు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకే కూర్చున్నారు. పవిత్రముగా అవ్వండి,
నన్నొక్కరినే స్మృతి చేయండి అని వారు ఇలా చెప్పరు. సత్యనారాయణ కథను పౌర్ణమి రోజున
వినిపిస్తారు. ఇప్పుడు ఈ సమయములో 16 కళల చంద్రుడిని పౌర్ణమి అని అంటారు. చివరికి,
చంద్రుడు ఒక గీత వలె ఉంటాడు, దానిని అమావాస్య అని అంటారు. అమావాస్య అనగా
అంధకారమయమైన రాత్రి. సత్య, త్రేతాయుగాలను పగలు అని, ద్వాపర, కలియుగాలను రాత్రి అని
అంటారు. ఈ పాయింట్లన్నీ అర్థం చేసుకోవాల్సినవి. వీటిని శివబాబా కూర్చుని చదివిస్తారు.
వారు తండ్రి కూడా, టీచరు కూడా మరియు గురువు కూడా. వీరిలో ప్రవేశించి ఆత్మలను
చదివిస్తారు.
తండ్రి అంటారు - ఎలాగైతే వీరి ఆత్మ భృకుటి మధ్యలో కూర్చుందో, నేను కూడా వచ్చి ఇక్కడ
కూర్చుంటాను. కూర్చుని మీకు అర్థం చేయిస్తాను. మీరు ముందు పావనముగా ఉండేవారు,
తర్వాత పతితముగా అయ్యారు. ఇప్పుడు తండ్రినైన నన్ను స్మృతి చేయండి, పవిత్రముగా
అవ్వకుండా తిరిగి ఇంటికి వెళ్ళలేరు. పవిత్రముగా అయినప్పుడే ఎగురుతారు. అందరూ
పిలుస్తారు కూడా - ఓ పతిత-పావనా రండి, పావనముగా తయారుచేయండి, అప్పుడే మేము
ఎగరగలుగుతాము, మా ఇల్లు అయిన ముక్తిధామానికి వెళ్ళగలుగుతాము అని. అది ఆత్మలైన మన
ఇల్లు. పతితులు ఆ ఇంటికి వెళ్ళలేరు. ఎవరైతే మంచి రీతిలో శిక్షణలను ధారణ చేస్తారో,
వారు స్వర్గములోకి త్వరగా వస్తారు లేదంటే ఆలస్యముగా వస్తారు. కొత్త ఇంటిలోకి రావాలి
కదా. కొత్త ఇంటిలో మజా ఉంటుంది కదా. మొట్టమొదట సత్యయుగములోకి రావాలి. మమ్మా-బాబా
సత్యయుగములోకి వెళ్తారు, మరి మనమెందుకు ఆలస్యముగా వెళ్ళాలి! మీరు కూడా బ్రహ్మాను
ఫాలో చేయండి. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఏ విషయములోనైనా కష్టమనిపిస్తే
శివబాబాను అడగండి. శ్రీమతముతోనే శ్రేష్ఠముగా అవుతారు. పాత ప్రపంచములోనైతే 5 వికారాల
రూపీ రావణుడి మతముపై నడుస్తూ వచ్చారు. మొట్టమొదటిది దేహాభిమానము. ఇప్పుడు పిల్లలైన
మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఆత్మనైన నేను పరంధామ నివాసిని. దానిని శాంతిధామమని
అంటారు. ఇలాంటి విషయాలను ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. తండ్రి మాత్రమే అర్థం
చేయిస్తారు. మీ ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా వింటుంది. సత్యయుగములో శరీరము ఎప్పుడూ అసలు
పాడవ్వదు. ఇక్కడైతే కూర్చుని-కూర్చునే అకాల మృత్యువు జరుగుతుంది. సత్యయుగములో ఇలాంటి
విషయాలేవీ ఉండవు, దానినే హెవెన్, స్వర్గము, ప్యారడైజ్ అని అంటారు. మళ్ళీ మనము
చక్రములో తిరుగుతూ పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ 84 జన్మల చక్రాన్ని పూర్తి
చేసాము. మళ్ళీ తండ్రి వచ్చి పిల్లలను స్వర్గానికి యోగ్యులుగా తయారుచేస్తారు. ఇప్పుడు
మీరు కొత్త ప్రపంచానికి యోగ్యులుగా అయ్యారు. ఇప్పుడిది నరకము. ఇప్పుడు మీరు
నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యే భాగ్యాన్ని తయారుచేసుకోవడానికి వచ్చారు. మేము
శివబాబా వద్దకు భాగ్యము తయారుచేసుకోవడానికి వచ్చామని అంటారు. కల్ప-కల్పము ప్రతి 5
వేల సంవత్సరాల తర్వాత మనము భాగ్యము తయారుచేసుకుంటాము. మనము స్వర్గవాసులుగా అవుతాము,
తర్వాత రావణ రాజ్యము మొదలవ్వడముతో మనము వికారులుగా అవుతాము. ఇప్పుడు అందరూ
వికారులుగా, పతితులుగా ఉన్నారు, అందుకే బాబా వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన
చేస్తారు. కొత్త ప్రపంచములో కేవలం పిల్లలైన మీరు మాత్రమే ఉంటారు. మిగిలినవారంతా
శాంతిధామానికి వెళ్ళిపోతారు. పైన ఆత్మల వృక్షముంది. తర్వాత తమ-తమ సమయాలలో వస్తారు.
మన రాజ్యమున్నప్పుడు అక్కడ ఇతర ధర్మాలవారు ఉండరు. మళ్ళీ ద్వాపరములో రావణ రాజ్యము
మొదలవుతుంది. ఈ విషయాలన్నింటినీ మంచి రీతిలో ధారణ చేయాలి. ఇక్కడ నరకవాసుల నుండి
స్వర్గవాసులుగా తయారవ్వాలి. నరకవాసులైన మనుష్యులను అసురులని మరియు స్వర్గవాసులైన
మనుష్యులను దేవతలని అంటారు. ఇప్పుడు అందరూ ఆసురీ స్వభావము కలవారు. ఇప్పుడు తండ్రి
కూర్చుని పురుషార్థము చేయిస్తారు. తండ్రి అంటారు - పవిత్రముగా అవ్వండి, ప్రతి
విషయములో అడుగుతూ ఉండండి. కొంతమంది అడుగుతారు - బాబా, వ్యాపారములో అబద్ధము చెప్పవలసి
వస్తుంది. అబద్ధము చెప్పడము వలన కొంత పాపము తయారవుతుంది. మళ్ళీ తండ్రిని స్మృతి
చేస్తూ ఉన్నట్లయితే పాపాలు తొలగిపోతాయి. ఈ రోజుల్లో ప్రపంచములో అందరూ పాపాలు చేస్తూ
ఉంటారు. ఎన్ని లంచాలు తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రదర్శనీ చిత్రాలు మ్యాపుల వంటివి.
ఇలాంటి మ్యాపులు ఎక్కడా ఉండవు. ఒకవేళ ఎవరైనా వాటిని చూసి కాపీ చేసి తయారుచేసినా కూడా,
వాటి అర్థాన్ని ఏమీ అర్థం చేసుకోలేరు. ప్రదర్శనీలకు, మేళాలకు చాలామంది వస్తారు.
వారితో ఇలా చెప్పడము జరుగుతుంది - 7 రోజుల కోసం అర్థం చేసుకోవడానికి వచ్చినట్లయితే
మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు యోగ్యులుగా అవుతారు. ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు,
మెట్ల వరస చిత్రములో చూడండి ఎంత స్పష్టముగా ఉంది. ఇది పతిత ప్రపంచము. పావన ప్రపంచము
పైన ఉంది.
ఇప్పుడు పిల్లలైన మీరు శివబాబాకు ప్రతిజ్ఞ చేస్తారు - బాబా, మేము నరకవాసుల నుండి
స్వర్గవాసులుగా తప్పకుండా అవుతాము. ఇప్పుడు మీరు శివాలయములోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు
చేసుకుంటున్నారు, అందుకే వికారాలలోకి ఎప్పుడూ వెళ్ళకూడదు. తుఫానులైతే మాయకు
సంబంధించినవి చాలానే వస్తాయి, కానీ వివస్త్రగా (పతితముగా) అవ్వకూడదు. పతితముగా
అవ్వడము వలన పెద్ద తప్పు జరుగుతుంది, అప్పుడు ధర్మరాజు ద్వారా చాలా పెద్ద శిక్షలు
అనుభవించాల్సి ఉంటుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడానికి ఆసురీ స్వభావము ఏదైతే ఉందో, అబద్ధము
చెప్పే అలవాటు ఏదైతే ఉందో, దానిని త్యాగము చేయాలి. దైవీ స్వభావాన్ని ధారణ చేయాలి.
2. ఇంటికి వెళ్ళేందుకు పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. మాయా తుఫానులు వచ్చినా కూడా,
కర్మేంద్రియాలతో ఎప్పుడూ ఎలాంటి వికర్మలు చేయకూడదు.
వరదానము:-
అధికారీతనపు స్థితి ద్వారా తండ్రిని తమ సహచరునిగా చేసుకునే
సదా విజయీ భవ
తండ్రిని సహచరునిగా చేసుకునేందుకు సహజమైన పద్ధతి -
అధికారీతనపు స్థితి. ఎప్పుడైతే అధికారీతనపు స్థితిలో స్థితులై ఉంటారో, అప్పుడు
వ్యర్థ సంకల్పాలు లేక అశుద్ధ సంకల్పాల అలజడిలో లేక అనేక రసాలలో బుద్ధి కింద-మీద
అవ్వదు. బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా ఎదుర్కునే శక్తి, పరిశీలనా శక్తి మరియు
నిర్ణయించే శక్తి వస్తాయి, అవి సహజముగానే మాయ చేసే అనేక రకాల దాడులలో విజయులుగా
చేస్తాయి.
స్లోగన్:-
ఎవరికైతే
క్షణములో సారము నుండి విస్తారములోకి మరియు విస్తారము నుండి సారములోకి వెళ్ళే
అభ్యాసము ఉంటుందో, వారే రాజయోగులు.
అవ్యక్త ప్రేరణలు -
బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి
బ్రహ్మాబాబా
సంపూర్ణముగా అయ్యేందుకై తమ సర్వ ఖజానాలను ఆది నుండి అంతిమ రోజు వరకు సఫలము చేసారు,
దానికి ప్రత్యక్ష ఫలాన్ని చూసారు, వారు సంపూర్ణ ఫరిశ్తాగా అయ్యారు. కనుక లక్ష్యము
పెట్టుకోండి - నేను బాబా సమానముగా సంపన్నముగా మరియు సంపూర్ణముగా అవ్వాల్సిందే. దాని
కోసం ఏ పురుషార్థము చెయ్యాల్సి వచ్చినా సరే బాబా సమానముగా అవ్వాల్సిందే అన్నది
నిశ్చితము.