03-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీకు సత్యాతి-సత్యమైన యాత్రను నేర్పించేందుకు సత్యమైన పండా (మార్గదర్శకుడు) వచ్చారు, మీ యాత్రలో ముఖ్యమైనది పవిత్రత, స్మృతి చేయండి మరియు పవిత్రముగా అవ్వండి’’

ప్రశ్న:-
మెసెంజర్ లేక సందేశకుని పిల్లలైన మీరు ఏ ఒక్క విషయములో తప్ప ఇంకే విషయములోనూ వాదించకూడదు?

జవాబు:-
సందేశకుని పిల్లలైన మీరు అందరికీ ఇదే సందేశాన్ని ఇవ్వండి - స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు ఈ యోగాగ్నితో మీ వికర్మలు వినాశనమవుతాయి. తపనతో కూడిన ఈ ఒక్క చింతే పెట్టుకోండి, ఇతర విషయాలలోకి వెళ్ళడము వలన ఎటువంటి లాభమూ లేదు. మీరు కేవలం అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి, తద్వారా వారు ఆస్తికులుగా అవ్వాలి. రచయిత అయిన తండ్రిని అర్థం చేసుకున్నట్లయితే రచనను అర్థం చేసుకోవడం సహజమైపోతుంది.

పాట:-
మా తీర్థము అతీతమైనది...

ఓంశాంతి
మేము సత్యమైన తీర్థవాసులము అని మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు తెలుసు. సత్యమైన పండా మరియు వారి పిల్లలమైన మనమందరమూ కూడా సత్యమైన తీర్థయాత్రకు వెళ్తున్నాము. ఇది అసత్య ఖండము లేక పతిత ఖండము. ఇప్పుడు సత్యఖండములోకి లేక పావన ఖండములోకి వెళ్తున్నాము. మనుష్యులు యాత్రలకు వెళ్తారు కదా. కొన్ని యాత్రలు విశేషముగా ఉంటాయి, ఆ యాత్రలకు ఎవరైనా వెళ్ళవచ్చు. అలాగే ఇది కూడా యాత్రయే, అయితే ఎప్పుడైతే సత్యమైన పండా స్వయంగా వస్తారో అప్పుడే ఈ యాత్రకు వెళ్ళడం జరుగుతుంది. వారు కల్ప-కల్పము సంగమములో వస్తారు. ఈ యాత్రలో చలి లేక వేడి అనే విషయము లేదు. అలాగే ఎటూ భ్రమించవలసిన విషయము లేదు. ఇది స్మృతియాత్ర. ఆ యాత్రలకు సన్యాసులు కూడా వెళ్తారు. యాత్రలను సత్యాతి-సత్యముగా చేసేవారు ఎవరైతే ఉంటారో, వారు పవిత్రముగా ఉంటారు. మీలో అందరూ యాత్రలో ఉన్నారు. మీరు బ్రాహ్మణులు. సత్యాతి-సత్యమైన బ్రహ్మాకుమార, కుమారీలు ఎవరు? ఎవరైతే ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళరో వారు. వాస్తవానికి అందరూ పురుషార్థులే. మనసా సంకల్పాలలో రావచ్చు. ముఖ్యమైనది వికారాల విషయము. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని - మీ వద్ద నిర్వికారీ బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు అని అడిగితే, మీరు చెప్పండి, ఈ విషయము అడగవలసిన అవసరం లేదు, ఈ విషయాలతో మీకు ఏం కడుపు నిండుతుంది. మీరు యాత్రికులుగా అవ్వండి. యాత్ర చేస్తున్నవారు ఎంతమంది ఉన్నారు అని అడగడములో ఉపయోగమేమీ లేదు. బ్రాహ్మణులలో కొందరు సత్యమైనవారు కూడా ఉన్నారు, కొందరు అసత్యమైనవారు కూడా ఉన్నారు. ఈ రోజు సత్యముగా ఉంటారు, రేపు అసత్యమైనవారిగా అయిపోతారు. వికారాలలోకి వెళ్ళారంటే ఇక వారు బ్రాహ్మణులు కారు, వారు మళ్ళీ శూద్రులుగా అయిపోయినట్లే. ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తారు, రేపు వికారాలలో పడి అసురులుగా అయిపోతారు. ఇప్పుడు ఈ విషయాలను ఎంతవరకని అర్థం చేయించగలము. ఈ విషయాలతో కడుపు ఏమీ నిండదు, అలాగే నోరు ఏమీ తీపి అవ్వదు. ఇక్కడ మనము తండ్రిని స్మృతి చేస్తాము మరియు తండ్రి రచన యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకుంటాము. ఇక మిగిలిన విషయాలలో సారము ఏమీ లేదు. మీరు ఇలా చెప్పండి - ఇక్కడ తండ్రిని స్మృతి చేయడం నేర్పించడం జరుగుతుంది మరియు ఇందులో పవిత్రత ముఖ్యమైనది. ఎవరైతే ఈ రోజు పవిత్రముగా అయి రేపు మళ్ళీ అపవిత్రముగా అయిపోతారో, వారు అసలు బ్రాహ్మణులే కారు. ఈ లెక్కను మీకు ఎంతవరకని కూర్చుని వినిపించగలము. ఆ మాటకొస్తే ఎంతోమంది మాయ తుఫానుల్లో పడిపోతూ ఉండవచ్చు. అందుకే బ్రాహ్మణుల మాల తయారవ్వదు. సందేశకుని పిల్లలమైన మేము సందేశాన్ని వినిపిస్తాము, మెసెంజర్ పిల్లలమైన మేము మెసేజ్ ఇస్తాము, అదేమిటంటే - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు ఈ యోగాగ్నితో వికర్మలు వినాశనమవుతాయి. తపనతో కూడిన ఈ చింతను ఉంచుకోండి. ఇకపోతే ప్రశ్నలైతే మనుష్యులు ఎన్నో అడుగుతూ ఉంటారు. కేవలం ఒక్క తండ్రి గురించి తప్ప ఇంకే విషయాలలోకి వెళ్ళినా లాభమేమీ ఉండదు. ఇక్కడ తెలుసుకోవలసినది ఏమిటంటే - ఆ నాథుడి నుండి వారసత్వాన్ని పొందడము కోసం నాస్తికుల నుండి ఆస్తికులుగా, అనాథల నుండి సనాథలుగా ఎలా అవ్వాలి - ఈ ప్రశ్న అడగండి. ఇకపోతే అందరూ పురుషార్థులే. వికారాల విషయములోనే ఎంతోమంది ఫెయిల్ అవుతారు. చాలా రోజుల తరువాత స్త్రీని చూసారంటే, ఇక అడగకండి. కొందరికి మద్యము తాగే అలవాటు ఉంటుంది, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మద్యము తాగే అలవాటు లేక బీడీ కాల్చే అలవాటు ఎవరికైతే ఉంటుందో, వారు అవి లేకుండా ఉండలేకపోతారు. వాటిని దాచిపెట్టుకుని తాగుతూ ఉంటారు. ఇంకేమి చేయగలరు. నిజం చెప్పనివారు చాలామంది ఉన్నారు. దాచిపెడుతూ ఉంటారు.

యుక్తిగా సమాధానము ఎలా ఇవ్వాలి అని బాబా పిల్లలకు యుక్తులు తెలియజేస్తూ ఉంటారు. ఒక్క తండ్రి పరిచయమునే ఇవ్వాలి, తద్వారా వారు ఆస్తికులుగా అవుతారు. ముందుగా తండ్రి గురించి ఎప్పటివరకైతే తెలుసుకోలేదో అప్పటివరకు ఇతర ప్రశ్నలు అడగడం వృధాయే. ఈ విధముగా ఎంతోమంది వస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. కేవలం వింటూ ఉంటారు, దాని వల్ల లాభమేమీ లేదు. 1000, 2000 మంది వచ్చారు అని బాబాకు వ్రాస్తారు, వారిలో నుండి ఒకరిద్దరు మాత్రమే అర్థం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఫలానా, ఫలానా పెద్ద వ్యక్తి వస్తూ ఉంటారు కానీ అతనికి ఏ పరిచయమైతే లభించాలో అది లభించలేదని నాకు అర్థమైపోతుంది. పూర్తి పరిచయము లభిస్తే అప్పుడు వారు అర్థం చేసుకుంటారు - వీరు యథార్థమే చెప్తున్నారు, ఆత్మలైన మన తండ్రి పరమపిత పరమాత్మయే, వారు చదివిస్తున్నారు. వారు అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి. ఈ అంతిమ జన్మలో పవిత్రముగా అవ్వండి. ఎవరైతే పవిత్రముగా ఉండరో వారు బ్రాహ్మణులు కారు, వారు శూద్రులు. ఇది యుద్ధ మైదానము. వృక్షము పెరుగుతూ ఉంటుంది మరియు తుఫానులు కూడా వస్తాయి. ఎన్నో ఆకులు రాలిపోతూ ఉంటాయి. సత్యమైన బ్రాహ్మణులు ఎవరు అన్నది ఎవరు కూర్చుని లెక్కపెడతారు. ఎవరైతే ఎప్పుడూ శూద్రులుగా అవ్వరో వారే సత్యమైనవారు. కొద్దిగా కూడా దృష్టి చంచలమవ్వకూడదు. అంతిమములో కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. ఇది చాలా ఉన్నతమైన లక్ష్యము. మనసులో కూడా రాకుండా ఉండే అవస్థ అంతిమములో ఏర్పడనున్నది. ఈ సమయములో ఒక్కరి అవస్థ కూడా ఆ విధముగా లేదు. ఈ సమయములో అందరూ పురుషార్థులుగా ఉన్నారు. పైకీ కిందికీ అవుతూ ఉంటారు. ముఖ్యమైనది కళ్ళ విషయమే. మనము ఆత్మ, ఈ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తాము - ఈ అభ్యాసము పక్కాగా ఉండాలి. ఎప్పటివరకైతే రావణ రాజ్యము ఉంటుందో అప్పటివరకు యుద్ధము నడుస్తూనే ఉంటుంది. చివరిలో కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. మున్ముందు మీకు ఈ ఫీలింగ్ కలుగుతుంది మరియు మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే వృక్షము చాలా చిన్నగా ఉంది, తుఫానులు వస్తాయి, ఆకులు రాలిపోతాయి. ఎవరైతే కచ్చాగా ఉంటారో వారు రాలిపోతారు. ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి - నా అవస్థ ఎంతవరకు చేరుకుంది. మిగిలిన ప్రశ్నలు ఏవైతే అడుగుతారో ఆ విషయాలలోకి ఎక్కువగా వెళ్ళనే వెళ్ళకండి. మీరు వారికి చెప్పండి - మేము తండ్రి శ్రీమతముపై నడుస్తున్నాము. ఆ అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన సుఖాన్ని ఇస్తారు మరియు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. అక్కడ సుఖమే ఉంటుంది. ఎక్కడైతే మనుష్యులు ఉంటారో దానినే ప్రపంచము అని అంటారు. నిరాకారీ ప్రపంచములో ఆత్మలే ఉంటాయి కదా. ఆత్మ ఏ విధముగా బిందువులా ఉంటుందో ఎవరి బుద్ధిలోనూ లేదు. ఈ విషయాన్ని కూడా కొత్తవారికెవరికీ అర్థం చేయించకూడదు. మొట్టమొదటైతే - అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు అన్నది అర్థం చేయించాలి. భారత్ పావనముగా ఉండేది, ఇప్పుడు పతితముగా ఉంది. కలియుగము తరువాత మళ్ళీ సత్యయుగము రానున్నది. బి.కె.లు తప్ప ఇంకెవ్వరూ వీటిని అర్థం చేయించలేరు. ఇది కొత్త రచన. తండ్రి చదివిస్తున్నారు - ఈ వివరణ బుద్ధిలో ఉండాలి. ఇది పెద్ద కష్టమైన విషయమేమీ కాదు, కానీ మాయ మరపింపజేస్తుంది, వికర్మలు చేయిస్తుంది. అర్ధకల్పము నుండి వికర్మలు చేసే అలవాటు ఏర్పడింది. ఆ ఆసురీ అలవాట్లన్నింటినీ తొలగించాలి. బాబా స్వయం చెప్తుంటారు - అందరూ పురుషార్థులే. కర్మాతీత అవస్థను చేరుకోవడానికి చాలా సమయము పడుతుంది. బ్రాహ్మణులు ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళరు. యుద్ధ మైదానములో వెళ్తూ-వెళ్తూ ఓడిపోతారు. ఈ ప్రశ్నల వల్ల లాభమేమీ లేదు. మొదట మన తండ్రిని స్మృతి చేయండి. మనకు శివబాబా కల్పపూర్వము వలె ఈ ఆజ్ఞను ఇచ్చారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి అని. ఇది కల్పపూర్వము యొక్క ఆ యుద్ధమే. తండ్రి ఒక్కరే, శ్రీకృష్ణుడిని తండ్రి అని అనరు. శ్రీకృష్ణుడి పేరు వేసారు. తప్పును సరిదిద్దేవారు తండ్రే, కావుననే వారిని సత్యము అని అంటారు కదా. ఈ సమయములో పిల్లలైన మీకే మొత్తం సృష్టి రహస్యము గురించి తెలుసు. సత్యయుగములో దేవతా వంశము ఉంది. రావణ రాజ్యములో ఆసురీ వంశము ఉంది. సంగమయుగాన్ని స్పష్టముగా చూపించాలి, ఇది పురుషోత్తమ సంగమయుగము. అటువైపు దేవతలు, ఇటువైపు అసురులు. వీరిరువురికీ మధ్యన యుద్ధము జరగలేదు. యుద్ధమనేది బ్రాహ్మణులైన మీకు వికారాలతో జరుగుతుంది. వాస్తవానికి దీనిని కూడా యుద్ధము అని అనరు. అన్నింటికన్నా పెద్దది కామ వికారము, ఇది మహాశత్రువు, దీనిపై విజయము పొందడం ద్వారానే మీరు జగత్త్ జీతులుగా అవుతారు. ఈ విషము వల్లే అబలలు, మాతలు దెబ్బలు తింటూ ఉంటారు. అనేక రకాల విఘ్నాలు వస్తూ ఉంటాయి. ముఖ్యమైన విషయము పవిత్రత. పురుషార్థము చేస్తూ-చేస్తూ, తుఫానులు వస్తూ-వస్తూ మీరు విజయము పొందుతారు, మాయ అలసిపోతుంది. కుస్తీలో పహల్వాన్లు ఎవరైతే ఉంటారో వారు వెంటనే ఎదుర్కుంటారు. బాగా యుద్ధము చేసి విజయాన్ని పొందడమే వారి వ్యాపారము. పహల్వాన్ల పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. వారికి బహుమతులు లభిస్తాయి. ఇక్కడ మీది గుప్తమైన విషయము.

మీకు తెలుసు - ఆత్మలైన మనము పవిత్రముగా ఉండేవారము, ఇప్పుడు అపవిత్రముగా అయ్యాము, మళ్ళీ పవిత్రముగా అవ్వాలి. ఈ సందేశాన్నే అందరికీ ఇవ్వాలి. ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే మీరు ఆ విషయాల్లోకి వెళ్ళనే వెళ్ళకూడదు. మీ వ్యాపారము ఆత్మిక వ్యాపారము. ఆత్మలైన మనలో బాబా జ్ఞానాన్ని నింపారు, ఆ తరువాత ప్రారబ్ధాన్ని పొందాము, జ్ఞానము అంతమైపోయింది. ఇప్పుడు మళ్ళీ తండ్రి జ్ఞానము నింపుతున్నారు. ఇకపోతే నషాలో ఉండండి. మీరు ఇలా చెప్పండి - మేము తండ్రి సందేశాన్ని ఇస్తున్నాము, అదేమిటంటే - తండ్రిని స్మృతి చేసినట్లయితే కళ్యాణము జరుగుతుంది. మీ వ్యాపారము ఈ ఆత్మిక వ్యాపారమే. మొట్టమొదటి విషయమేమిటంటే - తండ్రిని తెలుసుకోవడము. తండ్రియే జ్ఞానసాగరుడు. వారు పుస్తకమేమీ వినిపించరు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ మొదలైన డిగ్రీలు పొందేవారు పుస్తకాలు చదువుతారు. భగవంతుడు అయితే నాలెడ్జ్ ఫుల్. వారికి సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉంది. వారేమైనా చదివారా? వారికైతే వేద-శాస్త్రాలు మొదలైనవాటన్నింటి గురించి తెలుసు. తండ్రి అంటారు, నా పాత్ర మీకు జ్ఞానాన్ని అర్థం చేయించడము. జ్ఞానము మరియు భక్తికి మధ్యన ఉన్న తారతమ్యాన్ని ఇంకెవ్వరూ తెలియజేయలేరు. ఇది జ్ఞానము యొక్క చదువు. భక్తిని జ్ఞానము అని అనరు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రియే. ప్రపంచ చరిత్ర తప్పకుండా రిపీట్ అవుతుంది. పాత ప్రపంచము తరువాత మళ్ళీ కొత్త ప్రపంచము తప్పకుండా రానున్నది. బాబా మనల్ని మళ్ళీ చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి అంటారు, మీరు నన్ను స్మృతి చేయండి, ఈ విషయానికే ప్రాధాన్యత ఉంది. బాబాకు తెలుసు - చాలా మంచి-మంచి ప్రఖ్యాతి చెందిన పిల్లలు ఈ స్మృతియాత్రలో చాలా బలహీనముగా ఉన్నారు మరియు ఎవరైతే ప్రఖ్యాతి చెందలేదో, బంధనములో ఉన్నారో, పేదవారిగా ఉన్నారో వారు స్మృతియాత్రలో చాలా ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి - నేను తండ్రిని ఎంత సమయము స్మృతి చేస్తున్నాను? బాబా అంటారు - పిల్లలూ, ఎంత వీలైతే అంత నన్ను స్మృతి చేయండి. లోలోపల చాలా హర్షితముగా ఉండండి. భగవంతుడు చదివిస్తుంటే మరి ఎంత సంతోషము ఉండాలి. తండ్రి అంటారు, మీరు పవిత్రాత్మగా ఉండేవారు, ఆ తరువాత శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తూ, అభినయిస్తూ పతితముగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పవిత్రముగా అవ్వాలి. మళ్ళీ ఆ దైవీ పాత్రనే అభినయించాలి. మీరు దైవీ ధర్మానికి చెందినవారు కదా. మీరే 84 జన్మల చక్రములో తిరిగారు. సూర్యవంశీయులందరూ 84 జన్మలు తీసుకోరు. తర్వాతర్వాత వస్తూ ఉంటారు కదా. లేదంటే వెంటనే అందరూ వచ్చేస్తారు. ఉదయమే లేచి బుద్ధి ద్వారా చింతన చేస్తే అర్థం చేసుకోగలుగుతారు. పిల్లలే విచార సాగర మంథనము చేయాలి. శివబాబా అయితే చేయరు. వారు అంటారు, డ్రామానుసారముగా నేను ఏదైతే వినిపిస్తానో, అది కల్పపూర్వము అర్థం చేయించినదే మళ్ళీ అర్థం చేయిస్తున్నాను అని మీరు భావించండి. విచార సాగర మంథనము మీరే చేస్తారు. మీరే ఇతరులకు అర్థం చేయించాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి. ఈ బ్రహ్మా కూడా మంథనము చేస్తారు. బి.కె.లే మంథనము చేయాలి, శివబాబా కాదు. ముఖ్యమైన విషయమేమిటంటే, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకూడదు. శాస్త్రవాదులు పరస్పరము చాలా వాదించుకుంటూ ఉంటారు, మీరు వాదించకూడదు. మీరు కేవలం సందేశాన్ని ఇవ్వాలి. మొదటగా ముఖ్యమైన ఒక్క విషయముపైనే అర్థం చేయించండి మరియు వారితో అది వ్రాయించండి. మొట్టమొదట ఈ పాఠము వారికి చెప్పండి - ఇది ఎవరు చదివిస్తున్నారు, ఆ విషయము వ్రాయమని వారికి చెప్పండి. కానీ ఈ విషయాన్ని మీరు చివరిలో చెప్తారు, అందుకే వారికి సంశయము కలుగుతుంది. నిశ్చయబుద్ధి కలవారిగా లేని కారణముగా అర్థం చేసుకోరు. కేవలం, ఈ విషయము యథార్థమే అని అంటారు, అంతే. మొట్టమొదటి ముఖ్యమైన విషయమే ఇది. రచయిత అయిన తండ్రిని అర్థం చేసుకోండి, ఆ తరువాత రచన యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోండి. ముఖ్యమైన విషయము ఏమిటంటే - గీతా భగవానుడు ఎవరు? మీ విజయము కూడా ఇందులోనే జరగాలి. మొట్టమొదట ఏ ధర్మము స్థాపించబడింది? పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచముగా ఎవరు తయారుచేస్తారు? తండ్రియే ఆత్మలకు కొత్త జ్ఞానాన్ని వినిపిస్తారు, దీని ద్వారా కొత్త ప్రపంచము స్థాపన అవుతుంది. మీకు తండ్రి మరియు రచన యొక్క పరిచయము లభిస్తుంది. మొట్టమొదట అయితే భగవంతుడి గురించి పక్కాగా అర్థం చేయించండి, అప్పుడు వారు ఇచ్చే రాజ్యాధికార వారసత్వము దానంతట అదే లభిస్తుంది. తండ్రి నుండే వారసత్వము లభిస్తుంది. తండ్రిని తెలుసుకోగానే వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. బిడ్డ జన్మ తీసుకుంటాడు, తన తల్లిదండ్రులను చూస్తాడు, ఇక అంతే అది పక్కా అయిపోతుంది. తల్లిదండ్రుల వద్దకు తప్ప ఇంకెవ్వరి వద్దకు వెళ్ళను కూడా వెళ్ళడు, ఎందుకంటే తల్లి నుండి పాలు లభిస్తాయి. అలాగే ఇక్కడ కూడా జ్ఞానమనే పాలు లభిస్తాయి. వీరు తల్లి, తండ్రి కదా. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు, వీటిని అంత త్వరగా ఎవరూ అర్థం చేసుకోలేరు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సత్యాతి-సత్యమైన పవిత్ర బ్రాహ్మణులుగా అవ్వాలి, ఎప్పుడూ శూద్రులుగా (పతితులుగా) అవ్వాలని మనసులో కూడా ఆలోచన రాకూడదు. కొద్దిగా కూడా దృష్టి వెళ్ళకూడదు, అటువంటి అవస్థను తయారుచేసుకోవాలి.

2. తండ్రి ఏదైతే చదివిస్తున్నారో, ఆ వివరణను బుద్ధిలో ఉంచుకోవాలి. వికర్మలను చేసే ఆసురీ అలవాట్లు ఏవైతే ఏర్పడ్డాయో, వాటిని తొలగించాలి. పురుషార్థము చేస్తూ-చేస్తూ సంపూర్ణ పవిత్రత యొక్క ఉన్నతమైన గమ్యాన్ని ప్రాప్తి చేసుకోవాలి.

వరదానము:-
కారణాన్ని నివారణ చేసి చింత మరియు భయము నుండి ముక్తులుగా ఉండే మాస్టర్ సర్వశక్తివాన్ భవ

వర్తమాన సమయములో అల్పకాలికమైన సుఖముతోపాటు చింత మరియు భయము, ఈ రెండూ ఉండనే ఉన్నాయి. ఎక్కడైతే చింత ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉండదు. ఎక్కడైతే భయము ఉంటుందో అక్కడ శాంతి ఉండదు. కావున సుఖముతోపాటు ఈ దుఃఖము, అశాంతి యొక్క కారణాలు కూడా ఉండనే ఉన్నాయి. కానీ సర్వశక్తుల ఖజానాలతో సంపన్నులైన మీరు మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలు, మీరు దుఃఖాల కారణాన్ని నివారణ చేసేవారు, ప్రతి సమస్యను సమాధానపరిచే సమాధాన స్వరూపులు, అందుకే చింత మరియు భయము నుండి ముక్తులుగా ఉంటారు. ఏ సమస్య అయినా మీ ముందుకు ఆట ఆడేందుకు వస్తుంది, అంతేకానీ భయపెట్టేందుకు కాదు.

స్లోగన్:-
మీ వృత్తిని శ్రేష్ఠముగా చేసుకున్నట్లయితే మీ ప్రవృత్తి స్వతహాగా శ్రేష్ఠముగా అయిపోతుంది.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలా రూపముగా చేయండి

సమయమనుసారముగా ఇప్పుడు సర్వ బ్రాహ్మణ ఆత్మలను సమీపముగా తీసుకువస్తూ జ్వాలా స్వరూపపు వాయుమండలాన్ని తయారుచేసే సేవను చేయండి, దాని కొరకు భట్టీలైనా చేయండి లేక పరస్పరము సంగఠనలో ఆత్మిక సంభాషణ అయినా చేయండి, కానీ జ్వాలా స్వరూపాన్ని అనుభవం చేయండి మరియు చేయించండి, ఈ సేవలో నిమగ్నమైపోయినట్లయితే చిన్న-చిన్న విషయాలు సహజముగానే పరివర్తన అయిపోతాయి.