‘‘కొత్త సంవత్సరములో తీవ్ర పురుషార్థీ భవ అనే
వరదానముతో మీ ముఖము ద్వారా ఫరిశ్తా రూపాన్ని చూపించండి,
లైట్-మైట్ స్వరూపులై జ్వాలాముఖీ యోగముతో వ్యర్థాన్ని కాల్చి
వేయండి, దుఃఖముతో, అశాంతితో ఉన్న ఆత్మలకు శక్తులను దానము చేయండి’’
ఈ రోజు బ్రాహ్మణ పరివార రచయిత తన నలువైపులా ఉన్న పరివారాన్ని
చూస్తున్నారు. ఇది చిన్న పరివారము, చిన్న ప్రపంచము, కానీ ఇది
చాలా ప్రియమైనది ఎందుకంటే కోట్లలో కొద్దిమందిగా ఉన్నారు. ఎందుకు
ప్రియమైనవారు? ఎందుకంటే బాబాను గుర్తించారు, బాబా నుండి
వారసత్వానికి అధికారులుగా అయ్యారు. కనుక, ఎలా అయితే బాబా
ప్రియమైనవారో అలాగే ఈ బ్రాహ్మణ పరివారము కూడా ప్రియమైనది.
పిల్లలు జన్మించగానే బాప్ దాదా ప్రతి బిడ్డ మస్తకముపై అదృష్ట
సితార మెరిసేలా చేసారు. అందుకే ఈ చిన్న ప్రపంచము అతి ప్రియమైనది.
మీ అందరికీ కూడా మీకున్న ఇంతటి స్వమానము గురించి తెలుసు కదా!
బాప్ దాదా కూడా ఒక్కొక్క బిడ్డను చూసి సంతోషిస్తారు మరియు ఏ
పాటను పాడుతారు? వాహ్ పిల్లలూ వాహ్!
ఈ రోజు అందరూ ఈ శ్రేష్ఠమైన రోజున బాబాను కలుసుకోవడానికి
వచ్చారు. ఈ రోజు సంగమము జరిగే రోజు. వీడ్కోలు కూడా మరియు
అభినందనలు కూడా. మామూలుగా కూడా సంగమానికి మహత్వము ఉంటుంది.
సాగరము మరియు నదుల సంగమము ఎక్కడ జరిగినా, దానికి ఎంతో మహత్వము
ఉంటుంది. అలాగే ఈ రోజు మహత్వము కూడా చాలా గాయన యోగ్యమైనది. పాత
సంవత్సరము సమాప్తమవ్వనున్నది మరియు కొత్త సంవత్సరము ఆరంభము
అవ్వనున్నది. ఈ రోజున అందరి హృదయాలలో రాబోయే కొత్త సంవత్సరము
కోసం ఎంత ఉత్సాహము ఉంది! ప్రతి ఒక్కరూ తమ-తమ హృదయాలలో - ఏమి
వదలాలి మరియు ఎలా అవ్వాలి అని ప్లాన్ తయారుచేసుకున్నారు!
రెండింటి ప్లాన్ తయారుచేసుకున్నారు కదా? తయారుచేసుకున్నారా?
ఎవరైతే రాబోయే సంవత్సరములో తాము ముందుకు వెళ్ళేందుకు - స్వ
ఉన్నతి కోసం, తీవ్ర పురుషార్థము కోసం ప్లాన్ తయారుచేసుకున్నారో
వారు చేతులెత్తండి. ప్లాన్ తయారుచేసుకున్నారు కదా! అభినందనలు,
ఎందుకంటే బాప్ దాదా ప్రతి బిడ్డ నుండి ఏమి ఆశిస్తున్నారో
అందరికీ తెలుసు. బాప్ దాదా ప్రతి బిడ్డ కోసం ఏ శుభ భావనను
పెట్టుకున్నారంటే - ప్రతి బిడ్డ బాబా సమానముగా సంపన్నముగా మరియు
సంపూర్ణముగా అవ్వాలి. ఇప్పుడైతే సమయము కూడా సహాయాన్ని
అందిస్తుంది. మరి ప్రతి ఒక్కరూ తమ మనసులో తమ కోసం కొత్త ప్లాన్
ను తయారుచేసుకున్నారు కదా! కొంత వదిలిపెట్టాలి మరియు కొంత
ముందుకు వెళ్ళాలి. ఏమి వదలాలి? బాప్ దాదా ఏం చూసారంటే, పాత
ప్రపంచాన్ని మరియు పాత సంబంధాలను వదిలిపెట్టే విషయములో అందరికీ
పురుషార్థముపై అటెన్షన్ కూడా ఉంది. పాత సంస్కారాలను వదలాలని
అనుకుంటారు కూడా, కానీ బాప్ దాదా ఏం చూసారంటే, ఇప్పటివరకు పాత
సంస్కారాలను వదలాలంటే పిల్లలకు కొద్దిగా కష్టమనిపిస్తుంది.
కనుక బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు, ఈ కొత్త సంవత్సరములో ప్రతి
బిడ్డ తన పాత సంస్కారాలను అంతిమ సంస్కారము చేయాలి. మీరందరూ కూడా
ఈ సంకల్పాన్నే పూర్తి చెయ్యాలని అనుకుంటున్నారు కదా! ఎందుకంటే
పాత సంస్కారాలను మీరు ‘నా నేచర్’ అని అంటారు. ‘నా భావము’ అలా
కాదు కానీ అది ‘నా నేచర్’ అని అంటారు. మీరు అంటున్న ఆ ‘నేచర్’
ఈ వర్తమాన బ్రాహ్మణ జన్మది కాదు, అది పాతది. ఆ పాత సంస్కారాన్ని
లేక నేచర్ ను వదలాలి అని ఈ రోజున సంకల్పము చేయగలరా? ప్రతి
ఒక్కరికీ స్వయం గురించైతే తెలుసు. కనుక ఈ రోజు పాత సంవత్సరానికి
వీడ్కోలు ఇవ్వడముతో పాటు ఆ పాత సంస్కారాన్ని కూడా వదిలిపెట్టే
దృఢ సంకల్పాన్ని చెయ్యగలరా? చెయ్యగలరా? కోరుకుంటున్నారు కూడా,
కోరుకోవడము లేదని కూడా కాదు, అయినప్పటికీ పదే-పదే పురుషార్థములో
తీవ్రతను తీసుకువచ్చే విషయములో ఆ సంస్కారమే భిన్న-భిన్న రూపాలలో
విఘ్నము కలిగిస్తుంది. బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారంటే,
సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడముతోపాటు ఈ రోజున ఆ పాత
సంస్కారానికి కూడా వీడ్కోలు ఇచ్చేయండి. ఇందుకు సిద్ధముగా
ఉన్నారా? ఎవరైతే సిద్ధముగా ఉన్నారో, వారు చేతులెత్తండి. దాని
కోసం ఏం చేస్తారు? మీ కోసం ఏమైనా ప్లాన్ ను ఆలోచించారా? దీని
కోసం అన్నింటికంటే మంచి విషయము - దృఢ సంకల్పము. అది జరగాలి అని
సంకల్పము ఉంది, కానీ సంకల్పములో తీవ్రత కావాలి. ఎలా అయితే
బ్రాహ్మణులుగా అవ్వడముతోపాటు ఎటువంటి అశుద్ధ భోజనాన్ని
స్వీకరించకూడదు అని ప్రతిజ్ఞను చేసారు, ఇందులో దృఢ సంకల్పము
ద్వారా మెజారిటీ పాస్ అవ్వడాన్ని బాప్ దాదా చూసారు. మరి ఎలా
అయితే తనువు విషయములో అశుద్ధ భోజనము తీసుకోము అని సంకల్పము
చేసారో మరియు అది ప్రాక్టికల్ గా చేస్తున్నారో, అలాగే మనసు కోసం
ఈ దృఢ సంకల్పము చేయాలి - ఎప్పుడూ కూడా ఎవరి పట్ల కూడా ఎటువంటి
పరిస్థితిలోనూ ఏ వ్యర్థ సంకల్పాలను చెయ్యకుండా సదా ప్రతి ఆత్మ
పట్ల శుభ భావనను, శుభ కామనను ఉంచవలసిందే. మనసుకు భోజనము
సంకల్పాలు. మరి ఎలా అయితే తనువు కోసం మెజారిటీ దృఢ సంకల్పము
చేసారో, అలాగే మనసు కోసం కూడా వ్యర్థ సంకల్పాలను, అశుద్ధ
భావనలను తొలగించలేరా? ప్రతి ఆత్మ పట్ల హృదయపూర్వక స్నేహాన్ని
మరియు సహయోగాన్ని మీ మనసులో నిలుపుకోలేరా?
ఈ రోజు బాప్ దాదా ఈ పాత సంవత్సరముతోపాటు ఇటువంటి వృత్తికి
మరియు దృష్టికి ప్రతి బిడ్డ వీడ్కోలు ఇవ్వాలని ఆశిస్తున్నారు.
ఈ దృఢ సంకల్పాన్ని చెయ్యగలరా? చెయ్యగలరా? చెప్పండి, మాతలు,
టీచర్లు, అన్నయ్యలు అందరూ కోరుకుంటున్నారు కదా. ఆ, చేతులెత్తండి.
రేపటి నుండి ఏ ఆత్మ పట్లనైనా ఒకవేళ ఏ వ్యర్థము ఉన్నా, ఆ వ్యర్థ
భావనకు మరియు వ్యర్థ భావానికి ఈ రోజు సమాప్తి సమారోహము జరపాలని
కోరుకుంటున్నారా. చెప్పండి, టీచర్లందరూ సిద్ధముగా ఉన్నారా?
టీచర్లు రెండేసి చేతులెత్తండి. ఎత్తండి. అచ్ఛా! ఎవరైతే చేతులు
ఎత్తలేదో వారు ఎత్తండి. ఎవరైతే చేతులు ఎత్తలేదో వారు కాస్త లేచి
నిలబడండి. మంచిది. మేము పురుషార్థము చేస్తాము కానీ దృఢ సంకల్పము
చెయ్యము అనేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరైతే లేచారో, వారిలో ఎవరైతే
లక్ష్యాన్ని పెట్టుకుంటాము మరియు పురుషార్థాన్ని చేస్తాము అని
అంటారో, వారు చేతులెత్తండి. ఎందుకంటే సమయము పట్ల అటెన్షన్
పెట్టి ఆలోచించండి, అందరూ ఈ సంగమ సమయములోనే భవిష్య బహుకాలపు
సఫలతను ప్రాప్తి చేసుకోవాలి కదా. 21 జన్మల వారసత్వాన్ని
తీసుకోవాలి. ఎక్కడ ఈ ఒక్క జన్మ మరియు ఎక్కడ ఆ 21 జన్మలు! ఈ
ఒక్క జన్మలో కూడా ఎంతో సమయము తమ పురుషార్థాన్ని తీవ్రముగా
చెయ్యాల్సి ఉంటుంది, అప్పుడే బహుకాలము ఏదైతే ప్రాప్తిని పొందాలో,
అది పొందగలరు. బాబా పట్ల ప్రేమ ఉంది కదా, అంటే బాబాతోపాటు
ఉండాలి కదా! సమీపముగా ఉండాలి కదా! బ్రహ్మాబాబాకు సహచరులుగా అయి
రాజ్యాధికారులుగా అవ్వాలి కదా! మరి దాని కోసం ఇప్పుడు కూడా అంత
సమయము బాబా సమానముగా అవ్వాలి కదా. బ్రహ్మాబాబాకు ఒక్కొక్క
బిడ్డ పట్ల ఎంత ప్రేమ ఉంది అనేదైతే మీకు తెలుసు. ప్రతి ఒక్కరూ
- బాబాకు నాపై ఎంతైతే ప్రేమ ఉందో అంత ప్రేమ మరెవ్వరిపై లేదు,
నాపై బాబాకు ప్రేమ ఉంది అని అంటారు కదా. మరి ఆ ప్రేమను, బాప్
దాదా ఇరువురి ప్రేమను ఈ జన్మలోనే అనుభవం చేస్తున్నారు.
ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో, వారి మాటను ఎప్పుడూ కూడా
కొట్టిపారేయడము జరగదు. బ్రహ్మాబాబా పట్ల అందరికీ ప్రేమ ఉంది కదా,
ఎంత ప్రేమ ఉంది? చాలా ప్రేమ ఉంది. ఎంత ప్రేమ ఉంది అనేది
చూపించలేకపోయినా కానీ పిల్లలందరికీ ప్రేమ ఉంది అనేది బాబాకు
తెలుసు, నంబరువారుగా ఉంది కానీ ప్రేమ అయితే ఉంది. ఈ విషయములో
బాప్ దాదా కూడా ‘ప్రేమ ఉంది’ అని పిల్లలందరికీ సర్టిఫికేట్ ను
ఇస్తున్నారు. ప్రేమ అయితే ఉంది కానీ పిల్లలు అప్పుడప్పుడూ
అల్లరి చెయ్యడాన్ని బాబా చూసారు. మరి బాబా ఆ సమయములో ఏమి
చేస్తారు? అది చూసి బాబా విశేషముగా శక్తిని ఇస్తూ ఉంటారు
ఎందుకంటే బాబా ఇదే కోరుకుంటున్నారు, ప్రతి బిడ్డ రాజా బిడ్డగా
ఉండాలి. ప్రపంచములో అతి ప్రియమైన పిల్లలను రాజా బిడ్డ అని
అంటారు. వాస్తవానికి రాజుకు బిడ్డ కాకపోయినా కానీ రాజా బిడ్డ
అని అంటారు. కానీ మీరందరూ బాప్ దాదాకు ఇప్పుడు కూడా రాజా
పిల్లలే, భవిష్యత్తులో కూడా రాజా పిల్లలే. ఇప్పుడు స్వమానము
ఉంది, స్వరాజ్యము ఉంది. ఇప్పుడు ఆత్మ రాజ్యము సర్వ
కర్మేంద్రియాలపై ఉంది. కనుక ఇప్పుడు స్వరాజ్యాధికారులు మరియు
భవిష్యత్తులో విశ్వ రాజ్యాధికారులు. మరి రాజా పిల్లలే కదా!
అవును అనుకుంటే తల ఊపండి.
బాప్ దాదా ఈ రోజు అమృతవేళ నలువైపులా, దేశ-విదేశాలలో
నలువైపులా చుట్టి వచ్చారు. ఏమి చూసారు? అమృతవేళలో మెజారిటీ
యోగములో కూర్చుంటారు, కానీ స్నేహముతో కూర్చుంటారు, బాప్ దాదాతో
మాటలు కూడా మాట్లాడుతారు, ఆత్మిక స్థితిలో కూడా కూర్చుంటారు,
బాప్ దాదా నుండి శక్తిని కూడా తీసుకుంటారు, కానీ ఇప్పుడు బాప్
దాదా రాబోయే కొత్త సంవత్సరములో నవీనతను కోరుకుంటున్నారు,
ఎందుకంటే ఇప్పుడు సమయము రోజురోజుకూ నాజూకుగా అవ్వనున్నది.
ఇటువంటి సమయములో ఇప్పుడు జ్వాలాముఖి యోగము కావాలి. అటువంటి
జ్వాలాముఖి యోగము ఇప్పుడు అవసరము. జ్వాలాముఖి యోగము అనగా
శక్తిశాలి లైట్ మైట్ స్వరూపము, ఎందుకంటే సమయమనుసారముగా ఇప్పుడు
దుఃఖము-అశాంతి, అలజడులు పెరిగేదే ఉంది, అందుకే దుఃఖములో,
ఆందోళనలో ఉన్న ఆత్మలకు విశేషముగా జ్వాలాముఖి యోగము ద్వారా
శక్తులను ఇవ్వవలసిన అవసరము ఉంటుంది. దుఃఖము, అశాంతికి బదులుగా
ఏదైనా ఒక శక్తిని, శాంతిని తమ మనసా సేవ ద్వారా ఇవ్వవలసి ఉంటుంది.
‘ఒక్క పరివారము’ అని మీరిప్పుడు టాపిక్ పెట్టారు కదా, దాని
అనుసారముగా ఒకే పరివారము అనుకున్నప్పుడు అశాంతితో ఉన్న ఆత్మలకు
ఏదో ఒక దానాన్ని ఇస్తారు. అందుకే బాప్ దాదా రాబోయే కొత్త
సంవత్సరము కోసం, అది ఇప్పుడు ఇక వచ్చేసినట్లే, దాని పట్ల
అటెన్షన్ ఇప్పిస్తున్నారు - ఇప్పుడు జ్వాలాముఖి యోగము అవసరము.
జ్వాలాముఖి యోగము ద్వారానే ఏవైతే సంస్కారాలు మిగిలి ఉన్నాయో,
అవి భస్మమవ్వనున్నాయి.
ఇప్పుడు అడ్వాన్స్ పార్టీలో ఉన్న మీ సహచరులు మీ అందరి నుండి
ఇదే కోరుకుంటున్నారు - ఇప్పుడు సమాప్తి సమయాన్ని ఎదురుగా
తెచ్చుకోండి. ఇప్పుడు రిటర్న్ జర్నీని (తిరుగు ప్రయాణము)
గుర్తుంచుకోండి. మీ దీదీ (మన్మోహిని దీదీ) గుర్తు
చేసుకుంటున్నారు - నాకు సదా ‘‘ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు
ఇంటికి వెళ్ళాలి’’ అన్న వాక్యము గుర్తుండేది అని. మీ దాదీ ఏమని
గుర్తు చేయిస్తున్నారంటే, నాకు ఇప్పుడు సంపన్నముగా అవ్వాలి,
సంపూర్ణముగా అవ్వాలి అన్న ధ్యాస సదా ఉండేది. ఈ రోజు విశేషముగా
అమృతవేళ వతనములో బాప్ దాదాతో మిలనము జరుపుకుంటూ అడ్వాన్స్
పార్టీవారు ఏమని చెప్తున్నారంటే, ఏ దాదీలైతే వెళ్ళారో వారందరూ
కలిసి ఏమని చెప్తున్నారంటే, మా అందరి తరఫున చెప్తుంది ఏమిటంటే
- ఇప్పుడు జ్వాలాముఖి యోగము చాలా అవసరము, ఇతరులకు శక్తిని
ఇచ్చేందుకు కావచ్చు లేక తమ బ్రాహ్మణ పరివారాన్ని సంపన్నముగా
చేసేందుకు కావచ్చు. ఇప్పుడు సమయాన్ని సమీపముగా తీసుకువచ్చేందుకు
మీరు నిమిత్తులు. అందుకే రాబోయే సంవత్సరములో ఏం చేస్తారు?
విశేషముగా ఏం చేస్తారు? ఒకరికొకరు స్నేహీ, సహయోగిగా అయ్యి ప్రతి
సెంటరులో, సేవాస్థానములో జ్వాలాముఖి యోగము యొక్క వైబ్రేషన్లు
ఉండాలి మరియు కర్మలలో ఒకరికొకరు స్నేహీగా, సహయోగిగా అయ్యి ప్రతి
ఒక్కరి పట్ల అటెన్షన్ పెడుతూ వారిలో ఏ లోపాలైతే ఉన్నాయో, అవి
తొలగిపోయేందుకు సహయోగాన్ని ఇవ్వండి. మనసా ద్వారా ఇతరాత్మల సేవ
చేయండి మరియు మీ సహయోగము ద్వారా తోటి బ్రాహ్మణులకు విశేష సేవ
చేయండి, అప్పుడే మా మనసులోని ఆశ పూర్తవుతుంది.
ఈ రోజు వతనములో అడ్వాన్స్ పార్టీవారు రాబోయే సంవత్సరము కోసం
మీ అందరికీ ప్రియస్మృతులను కూడా తెలిపారు మరియు వారి మనసులోని
ఆశలను కూడా తెలియజేసారు. మరి చెప్పండి, బాప్ దాదా సంకల్పాన్ని
అయితే విన్నారు కానీ దానితోపాటు మీ దాదీల మనసులో కొత్త
సంవత్సరము కోసం ఉన్న శుభ భావనలను కూడా విన్నారు కదా! బాప్ దాదా
అయితే పిల్లలందరికీ - ఎవరైనా బలహీనులైనా లేక తీవ్ర
పురుషార్థీలైనా, అందరికీ మూడు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు
- ఒకటి, కొత్త జీవితానికి శుభాకాంక్షలు, రెండు, కొత్త
సంవత్సరానికి శుభాకాంక్షలు మరియు మూడు, కొత్త ప్రపంచములోకి
కలిసి వెళ్ళబోతున్నందుకు శుభాకాంక్షలు.
బాప్ దాదా ఇది కూడా చెప్పారు - అందరూ మీ లోపల మీ కోసం ఒక
సమయాన్ని నిర్ధారించుకోండి - ఎప్పటిలోపు తమను తాము బాబా
సమానముగా తయారుచేసుకుంటారు. మీ లోపల మీ కోసం మీరు
నిర్ధారించుకోండి. నిర్ధారించుకోవడము వచ్చు కదా? బాప్ దాదా
అయితే ఈ రోజు ప్రతి బిడ్డను చూస్తూ ఈ వరదానాన్నే ఇస్తున్నారు -
రాబోయే సంవత్సరములో ప్రతి బిడ్డ తీవ్ర పురుషార్థీ భవ. అమృతవేళ
స్మృతిలో కూర్చున్నప్పుడు, అమృతవేళ పూర్తి అయి లేచే సమయము
వచ్చినప్పుడు, ఆ సమయములో బాప్ దాదా ఇచ్చిన ఈ వరదానాన్ని తమ
మనసులో గుర్తుంచుకోండి - తీవ్ర పురుషార్థీ భవ. బాప్ దాదా రెండు
విషయాలపై ముందే అటెన్షన్ ఇప్పించి ఉన్నారు, ఎందుకంటే సంగమ సమయము
అకస్మాత్తుగా సమాప్తము అవ్వనున్నది. ఒకటి సమయము, రెండు
సంకల్పాలు, రెండింటిపై ప్రతి క్షణము అటెన్షన్ ఉంచండి. బాప్
దాదాకు ప్రతి బిడ్డ పట్ల ఈ శుభ భావన కూడా ఉంది, అదేమిటంటే -
ప్రతి బిడ్డ ఈ సంవత్సరములో ఏమవుతారు? ఏమవుతారు? ఎవరు మీ
ముఖాన్ని చూసినా, మీ ముఖము ద్వారా వారికి ఫరిశ్తా రూపము
కనిపించాలి. ఫలానా వారు, ఫలానా వారు అని కాదు. ఫరిశ్తా అనుభవం
కావాలి, దాని కోసం జ్వాలాముఖి యోగము ఉండాలి, ఎటువంటి వ్యర్థము
ఉండకూడదు. లైట్ మరియు మైట్ స్వరూప యోగముతో వ్యర్థాన్ని కాల్చి
వేయండి. సమర్థమైన ఫరిశ్తా కనిపించాలి. మీలో ఎవరిని చూసినా అలాగే
అనిపించాలి, ఎందుకంటే మీరందరూ బాబాకు అతి ప్రియమైనవారు కదా.
బాబా మిమ్మల్నందరినీ ప్రత్యేకముగా ఎక్కడెక్కడినుండో ఎంచుకుని
తమవారిగా చేసుకున్నారు. కనుక లక్ష్యము పెట్టుకోండి - నేను
బ్రాహ్మణ సో ఫరిశ్తాను. అమృతవేళలో మరియు మీ దినచర్యలో
గుర్తుంచుకోండి - ‘నేను బ్రాహ్మణ సో ఫరిశ్తాను’.
నడుస్తూ-తిరుగుతూ ఉన్న ఫరిశ్తా స్వరూపము. ఫరిశ్తా స్వరూపమైతే
మంచిగా అనిపిస్తుంది కదా! బ్రహ్మాబాబా ఫరిశ్తా అయ్యారు, ఫాలో
ఫాదర్.
ఈ సంవత్సరము ‘తీవ్ర పురుషార్థీ భవ’ అన్న వరదానాన్ని ఇవ్వడము
జరిగింది. సాధారణ పురుషార్థము కాదు. సాధారణ పురుషార్థము
ఉన్నట్లయితే రాజ్యములో సహచరులుగా అవ్వరు. బాబా కోరుకునేదేమిటంటే,
ఎంతమందైతే బాప్ దాదా మురళిని అధ్యయనము చేసే ఈశ్వరీయ
విద్యార్థులు ఉన్నారో, వారందరూ ఏమవుతారు? ఫరిశ్తా. భారమంతా
తొలగిపోతుంది. సంస్కారాల భారము కూడా సమాప్తమైపోతుంది. మరి ఈ
సంవత్సరానికి హోమ్ వర్క్ ఏమిటి? ఫరిశ్తా స్వరూపములో ఉండాలి,
దీనినే తీవ్ర పురుషార్థము అని అంటారు. ఇప్పుడు ప్రతి సెంటరులోనూ
ప్రతి వారము ప్రతి విద్యార్థి యొక్క రిజల్టును చూడాలి - తీవ్ర
పురుషార్థీగా ఉన్నారా? ఒకవేళ ఏదైనా పరిస్థితి వస్తే, ఆ విషయములో
వారికి సహయోగిగా అయ్యి స్నేహముతో వారికి ధైర్యాన్ని ఇవ్వండి
మరియు తమ సెంటరును, విద్యార్థిని తీవ్ర పురుషార్థీగా చేయండి,
ప్రతి వారము రిజల్టును చూడండి, ఎందుకంటే సమయము అలజడుల సమయముగా
అవ్వనున్నది.
ఈ రోజు ఈ సంగమ రోజున, వీడ్కోలు మరియు శుభాకాంక్షల రోజున,
నలువైపులా ఉన్నవారు, పిల్లలు ఎవరు ఎక్కడ కూర్చుని ఉన్నా కానీ
అందరినీ బాప్ దాదా చూస్తున్నారు. సైన్సు సాధనాల ద్వారా అందరూ
చూస్తున్నారు కూడా మరియు చూస్తూ-చూస్తూ ఎంత సంతోషిస్తున్నారు.
నలువైపులా ఉన్న పిల్లలకు బాప్ దాదా విశేషమైన వరదానాన్ని
ఇస్తున్నారు - ‘సదా సంతుష్టమణి భవ’. సంతుష్టముగా ఉండండి మరియు
సంతుష్టము చేయండి. అచ్ఛా!
ఇప్పుడు దాదీలందరూ కలిసి ఏదైనా కొత్త ప్లాన్ ను తయారుచేయండి.
(జానకి దాదీ అన్నారు ‘‘బాబా, జనవరి నెలకు చాలా మహత్వము ఉంది కదా,
జనవరి నెలలో అందరూ కలిసి పురుషార్థము చేయాలి, అటువంటి సేవ కోసం
ఏదైనా ప్లాన్ తయారుచేయాలి, తద్వారా అందరి మనసుల నుండి చాలా
ప్రేమగా ‘నా బాబా’ అని రావాలి, ఇది నా భావన)
బాప్ దాదా కొత్త సంవత్సరములో నవీనతను కోరుకుంటున్నారు, అవే
పాత సంస్కారాలు వద్దంటున్నారు. ఒక్కొక్క బిడ్డ బాబా సమానముగా
కనిపించాలి. ఫాలో బ్రహ్మాబాబా. పరిస్థితులు, మాటలు అన్నీ బాబా
ముందు కూడా వచ్చాయి కానీ వారు ఫరిశ్తాగా అయిపోయారు. ఫరిశ్తాగా
అవ్వాల్సిందే అన్న దృఢ సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ మీతో మీరు
చేయండి, ఎందుకంటే మీతో మీరు చేసుకుంటే అటెన్షన్ ఉంటుంది. నేను
అవ్వాల్సిందే, అంతే. మీరు అలా అవ్వడము వలన సహజముగా వైబ్రేషన్లు
వ్యాపిస్తాయి. మరి ఇప్పుడు ఏ లక్ష్యము పెట్టుకున్నారు?
ఫరిశ్తాగా అవ్వాల్సిందే. చెప్పండి, పక్కా కదా! అచ్ఛా! అందరికీ
బాప్ దాదా యొక్క చాలా-చాలా హృదయపూర్వకమైన ప్రేము మరియు
అభినందనలు.