05-02-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మిమ్మల్ని రావణ రాజ్యము నుండి విముక్తులుగా చేసి సద్గతిని ఇవ్వడానికి మరియు నరకవాసులను స్వర్గవాసులుగా తయారుచేయడానికి తండ్రి వచ్చారు’’

ప్రశ్న:-
తండ్రి భారతవాసీ పిల్లలైన మీకు ఏయే స్మృతులను ఇప్పించారు?

జవాబు:-
ఓ భారతవాసీ పిల్లలూ! మీరు స్వర్గవాసులుగా ఉండేవారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గముగా ఉండేది, బంగారము మరియు వజ్రాల మహళ్ళు ఉండేవి. మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారు. భూమి, ఆకాశము అన్నీ మీవిగా ఉండేవి. భారత్ శివబాబా ద్వారా స్థాపించబడిన శివాలయముగా ఉండేది. అక్కడ పవిత్రత ఉండేది. ఇప్పుడు మళ్ళీ అటువంటి భారత్ తయారవ్వనున్నది.

పాట:-
నయనహీనులకు దారి చూపించండి ప్రభూ...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు (ఆత్మలు) ఈ పాటను విన్నారు. ఇలా ఎవరు అన్నారు? ఆత్మల యొక్క ఆత్మిక తండ్రి అన్నారు. ఆత్మిక తండ్రిని ఆత్మిక పిల్లలు - ఓ బాబా అని అన్నారు. వారిని ఈశ్వరా అని కూడా అంటారు, పిత అని కూడా అంటారు. ఏ పిత? పరమపిత. ఎందుకంటే తండ్రులు ఇద్దరు ఉన్నారు - ఒకరు లౌకిక తండ్రి, రెండవవారు పారలౌకిక తండ్రి. లౌకిక తండ్రి పిల్లలు పారలౌకిక తండ్రిని - ఓ బాబా అని పిలుస్తారు. అచ్ఛా, మరి బాబా పేరు ఏమిటి? శివ. వారు నిరాకారునిగా పూజింపబడతారు. వారిని సుప్రీమ్ ఫాదర్ అని అంటారు. లౌకిక తండ్రిని సుప్రీమ్ అని అనరు. ఉన్నతోన్నతమైనవారు, ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. జీవాత్మలందరూ ఆ తండ్రిని స్మృతి చేస్తారు. నా తండ్రి ఎవరు అన్నది ఆత్మలు మర్చిపోయారు. ఓ గాడ్ ఫాదర్ - నయనహీనులైన మాకు నయనాలు ఇవ్వండి, అప్పుడు మేము మా తండ్రిని గుర్తించగలము, భక్తి మార్గపు భ్రమించడము నుండి విడిపించండి అని పిలుస్తారు. సద్గతి కోసము మూడవ నేత్రాన్ని పొందేందుకు, తండ్రిని కలుసుకునేందుకు పిలుస్తారు ఎందుకంటే తండ్రియే కల్ప-కల్పము భారత్ లో వచ్చి, భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు. ఇప్పుడిది కలియుగము, కలియుగము తర్వాత సత్యయుగము రానున్నది. ఇది పురుషోత్తమ సంగమయుగము. అనంతమైన తండ్రి వచ్చి పతితముగా, భ్రష్టాచారులుగా అయిపోయినవారిని పురుషోత్తములుగా తయారుచేస్తారు. ఈ (లక్ష్మీ-నారాయణులు) పురుషోత్తములు భారత్ లో ఉండేవారు. లక్ష్మీ-నారాయణుల వంశావళి యొక్క రాజ్యముండేది. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం సత్యయుగములో శ్రీ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. ఇది పిల్లలకు స్మృతిని ఇప్పిస్తున్నారు. భారతవాసులైన మీరు నేటికి 5 వేల సంవత్సరాల క్రితం స్వర్గవాసులుగా ఉండేవారు. ఇప్పుడైతే అందరూ నరకవాసులుగా ఉన్నారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గముగా ఉండేది. భారత్ కు చాలా మహిమ ఉండేది, బంగారము మరియు వజ్రాల మహళ్ళుండేవి. ఇప్పుడైతే అవేవీ లేవు. ఆ సమయములో ఇంకే ధర్మము ఉండేది కాదు, కేవలం సూర్యవంశీయులే ఉండేవారు, చంద్రవంశీయులు కూడా తర్వాత వస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు సూర్యవంశీ రాజ్యానికి చెందినవారిగా ఉండేవారు. ఇప్పటికీ కూడా ఈ లక్ష్మీ-నారాయణుల మందిరాలను తయారుచేస్తూ ఉంటారు. కానీ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఎప్పుడు ఉండేది, వారు ఆ రాజ్యాన్ని ఎలా పొందారు, ఇది ఎవ్వరికీ తెలియదు. పూజ చేస్తారు కానీ వారి గురించి తెలియదు, అంటే అది అంధవిశ్వాసము అయినట్లు కదా. శివుని పూజను, లక్ష్మీ-నారాయణుల పూజను చేస్తారు, కానీ వారి జీవితచరిత్ర గురించి కూడా తెలియదు. ఇప్పుడు భారతవాసులు స్వయముగా అంటారు - మేము పతితముగా ఉన్నాము, పతితులైన మమ్మల్ని పావనముగా తయారుచేసే తండ్రి, రండి, వచ్చి మమ్మల్ని దుఃఖాల నుండి, రావణ రాజ్యము నుండి విముక్తులుగా చేయండి. తండ్రియే వచ్చి అందరినీ విముక్తులుగా చేస్తారు. సత్యయుగములో తప్పకుండా ఒకే రాజ్యముండేదని పిల్లలకు తెలుసు. బాపూజీ కూడా - మాకు మళ్ళీ రామ రాజ్యము కావాలని, పతితమైపోయిన గృహస్థ ధర్మము పావనమైనదిగా అవ్వాలని అనేవారు. మనము స్వర్గవాసులుగా అవ్వాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు నరకవాసుల పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారు కదా. దీనిని నరకము, ఆసురీ ప్రపంచము అని అంటారు. ఈ భారత్ యే దైవీ ప్రపంచముగా ఉండేది. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, మీరు 84 జన్మలు తీసుకున్నారు, అంతేకానీ 84 లక్షల జన్మలు కాదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు వాస్తవానికి శాంతిధామ నివాసులు, మీరు ఇక్కడకు పాత్రను అభినయించడానికి వచ్చారు, 84 జన్మల పాత్రను అభినయించారు. పునర్జన్మలనైతే తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది కదా. పునర్జన్మలు 84 ఉంటాయి.

ఇప్పుడు అనంతమైన తండ్రి పిల్లలైన మీకు అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. తండ్రి పిల్లలైన మీతో (ఆత్మలతో) మాట్లాడుతున్నారు. ఇతర సత్సంగాలలో మనుష్యులు, మనుష్యులకు భక్తి మార్గపు విషయాలను వినిపిస్తారు. అర్ధకల్పము భారత్ స్వర్గముగా ఉన్నప్పుడు పతితులు ఒక్కరు కూడా ఉండేవారు కాదు. ఈ సమయములో ఒక్కరు కూడా పావనమైనవారు లేరు. ఇది ఉన్నదే పతిత ప్రపంచము. గీతలో శ్రీకృష్ణ భగవానువాచ అని వ్రాసారు, వారైతే గీతను వినిపించలేదు. మనుష్యులకు తమ ధర్మశాస్త్రము గురించి కూడా తెలియదు, తమ ధర్మాన్నే మర్చిపోయారు. హిందూ అనేది ధర్మమేమీ కాదు. ముఖ్యమైన ధర్మాలు నాలుగు. మొదటిది ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము. సూర్యవంశము మరియు చంద్రవంశము, రెండింటినీ కలిపి దేవీ-దేవతా ధర్మము అని అంటారు. అక్కడ దుఃఖము అనే మాటే ఉండేది కాదు. 21 జన్మలైతే మీరు సుఖధామములో ఉండేవారు, ఆ తర్వాత రావణ రాజ్యము, భక్తి మార్గము ప్రారంభమవుతుంది. భక్తి మార్గము అనేది కిందకు దిగేటువంటిది. భక్తి రాత్రి, జ్ఞానము పగలు. ఇప్పుడిది ఘోర అంధకారమయమైన రాత్రి. శివజయంతి మరియు శివరాత్రి, ఈ రెండు పదాలను ఉపయోగిస్తారు. శివబాబా ఎప్పుడు వస్తారు, రాత్రి అయినప్పుడు వస్తారు. భారతవాసులు ఘోర అంధకారములోకి వచ్చినప్పుడు తండ్రి వస్తారు. బొమ్మల పూజను చేస్తూ ఉంటారు, కానీ ఒక్కరి జీవితచరిత్ర గురించి కూడా తెలియదు. ఈ భక్తి మార్గపు శాస్త్రాలు కూడా తయారవ్వాల్సిందే. ఈ డ్రామాను, ఈ సృష్టి చక్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి. శాస్త్రాలలో ఈ జ్ఞానము లేదు. అది భక్తి యొక్క జ్ఞానము, ఫిలాసఫీ. అది సద్గతి మార్గాన్ని తెలిపే జ్ఞానమేమీ కాదు. తండ్రి అంటారు - నేను వచ్చి మీకు బ్రహ్మా ద్వారా యథార్థ జ్ఞానాన్ని వినిపిస్తాను. మాకు సుఖధామము, శాంతిధామము యొక్క మార్గాన్ని తెలియజేయండి అని పిలుస్తారు కూడా. తండ్రి అంటారు, నేటికి 5 వేల సంవత్సరాల క్రితం సుఖధామము ఉండేది, ఆ సమయములో మీరు మొత్తం విశ్వముపై రాజ్యము చేసేవారు, సూర్యవంశీ రాజ్యముండేది, మిగిలిన ఆత్మలంతా శాంతిధామములో ఉండేవారు. అక్కడ 9 లక్షల జనాభా అని అంటారు. పిల్లలైన మిమ్మల్ని నేటికి 5 వేల సంవత్సరాల క్రితం చాలా షావుకారులుగా తయారుచేసాను, ఎంతో ధనాన్ని ఇచ్చాను, దానిని మీరు ఎక్కడ పోగొట్టుకున్నారు? మీరు ఎంత షావుకారులుగా ఉండేవారు. భారత్ ఏమని పిలవబడేది. భారత్ యే అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన ఖండము. వాస్తవానికి ఇదే అందరి తీర్థస్థానము, ఎందుకంటే ఇది పతిత-పావనుడైన తండ్రి యొక్క జన్మ స్థానము. ఏయే ధర్మాలవారైతే ఉండేవారో, అందరికీ తండ్రి వచ్చి సద్గతినిస్తారు. ఇప్పుడు రావణ రాజ్యము మొత్తము సృష్టి అంతటిపైనా ఉంది, కేవలం ఒక్క లంకలోనే ఉండేది కాదు. అందరిలోనూ 5 వికారాలు ప్రవేశించి ఉన్నాయి. సూర్యవంశీ రాజ్యము ఉన్నప్పుడు ఈ వికారాలే ఉండేవి కావు. భారత్ నిర్వికారిగా ఉండేది, ఇప్పుడు వికారీగా ఉంది. సత్యయుగములో దైవీ సాంప్రదాయము ఉండేది. వారే మళ్ళీ 84 జన్మలను అనుభవించి ఇప్పుడు ఆసురీ సాంప్రదాయులుగా అయ్యారు, మళ్ళీ దైవీ సాంప్రదాయులుగా అవుతారు. భారత్ చాలా షావుకారుగా ఉండేది. ఇప్పుడు పేదదిగా అయ్యింది, అందుకే భిక్షము అడుగుతున్నారు.

తండ్రి అంటారు - మీరు ఎంత షావుకారులుగా ఉండేవారు. మీకు లభించినంత సుఖము ఇంకెవ్వరికీ లభించదు. మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారు. భూమి, ఆకాశము అన్నీ మీవిగానే ఉండేవి. తండ్రి స్మృతిని ఇప్పిస్తున్నారు - భారత్ శివబాబా ద్వారా స్థాపించబడిన శివాలయముగా ఉండేది, అక్కడ పవిత్రత ఉండేది, ఆ కొత్త ప్రపంచములో దేవీ-దేవతలు రాజ్యము చేసేవారు. రాధా-కృష్ణులకు పరస్పరములో ఏం సంబంధముంది అనేది కూడా భారతవాసులకు తెలియదు. ఇరువురూ వేర్వేరు రాజధానులకు చెందినవారిగా ఉండేవారు, స్వయంవరము తర్వాత లక్ష్మీ-నారాయణులుగా అయ్యారు. ఈ జ్ఞానము మనుష్యులెవ్వరిలోనూ లేదు. పరమపిత పరమాత్మయే జ్ఞానసాగరుడు, వారే మీకు ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తారు, ఈ ఆత్మిక జ్ఞానాన్ని కేవలం ఒక్క తండ్రి మాత్రమే ఇవ్వగలరు. ఇప్పుడు తండ్రి అంటారు - ఆత్మాభిమానులుగా అవ్వండి, మీ పరమపిత పరమాత్మ శివుడినైన నన్ను స్మృతి చేయండి. స్మృతితోనే సతోప్రధానముగా అవుతారు. మీరు ఇక్కడకు మనుష్యుల నుండి దేవతలుగా మరియు పతితుల నుండి పావనులుగా అయ్యేందుకే వస్తారు. ఇప్పుడిది రావణ రాజ్యము. భక్తి మార్గములో రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. రావణుడేమీ ఒక్క సీతను మాత్రమే అపహరించలేదు. భక్తి చేసే మీరందరూ రావణుని పంజాలో ఉన్నారు. మొత్తం సృష్టి అంతా 5 వికారాల రూపీ రావణుని జైలులో ఉంది. అందరూ శోకవాటికలో దుఃఖితులుగా ఉన్నారు. తండ్రి వచ్చి అందరినీ విముక్తులుగా చేస్తారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ స్వర్గాన్ని తయారుచేస్తున్నారు. అంతేకానీ, ఇప్పుడు ఎవరికైతే చాలా ధనము ఉందో, వారు స్వర్గములో ఉన్నారని కాదు. అలా కాదు, ఇప్పుడిది నరకము. అందరూ పతితముగా ఉన్నారు, అందుకే గంగలోకి వెళ్ళి స్నానము చేస్తారు, గంగ పతిత-పావని అని భావిస్తారు. కానీ పావనముగా ఎవ్వరూ అవ్వరు. పతిత-పావనుడు అని తండ్రిని మాత్రమే అంటారు, నదులను కాదు. ఇదంతా భక్తి మార్గము. తండ్రియే వచ్చి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీకు ఇదైతే తెలుసు - ఒకరు లౌకిక తండ్రి, రెండవది అలౌకిక తండ్రి అయిన ప్రజాపిత బ్రహ్మా మరియు వారు పారలౌకిక తండ్రి. ముగ్గురు తండ్రులు ఉన్నారు. శివబాబా ప్రజాపిత బ్రహ్మా ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు. బ్రాహ్మణులను దేవతలుగా తయారుచేయడానికి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఒక్కసారి మాత్రమే తండ్రి వచ్చి ఆత్మలకు రాజయోగాన్ని నేర్పిస్తారు. ఆత్మలు పునర్జన్మలు తీసుకుంటారు. నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాను అని ఆత్మయే అంటుంది. తండ్రి అంటారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అవుతారు, ఏ దేహధారినీ స్మృతి చేయకండి. ఇప్పుడిది మృత్యులోకము యొక్క అంతిమము. అమరలోకము స్థాపనవుతోంది. మిగిలిన అనేక ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. సత్యయుగములో ఒక్క దేవతా ధర్మమే ఉండేది, ఆ తర్వాత త్రేతాలో చంద్రవంశీ సీతా-రాములు ఉండేవారు. పిల్లలైన మీకు మొత్తం చక్రమంతటినీ స్మృతిని ఇప్పిస్తారు. శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్థాపన చేసేది తండ్రియే. మనుష్యులు, మనుష్యులకు సద్గతిని ఇవ్వలేరు. వారందరూ భక్తి మార్గపు గురువులు. భక్తి మార్గములో మనుష్యులు అనేక రకాల చిత్రాలను తయారుచేసి, పూజించి, వెళ్ళి నీటిలో ముంచి మునిగిపో, మునిగిపో అని అంటారు. చాలా పూజలు చేస్తారు, తినిపిస్తారు, తాగిస్తారు, కానీ అక్కడ తినేది ఆ బ్రాహ్మణులే. దీనిని బొమ్మల పూజ అని అంటారు, ఎంతటి అంధవిశ్వాసము. ఇప్పుడు వారికి ఎవరు అర్థం చేయించాలి.

తండ్రి అంటారు, ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము. మీరు ఇప్పుడు తండ్రి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఈ రాజధాని స్థాపనవుతోంది. ప్రజలైతే చాలామంది తయారవ్వనున్నారు. కోట్లలో ఏ కొందరో రాజులుగా అవుతారు. సత్యయుగాన్ని పుష్పాలతోట అని అంటారు. ఇప్పుడిది ముళ్ళ అడవి. ఇప్పుడు రావణ రాజ్యము మారుతోంది. ఇది వినాశనము అయ్యేదే ఉంది. ఈ జ్ఞానము ఇప్పుడు కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే లభిస్తుంది. లక్ష్మీ-నారాయణులకు కూడా ఈ జ్ఞానము ఉండదు. ఈ జ్ఞానము కనుమరుగైపోతుంది. భక్తి మార్గములో ఎవ్వరికీ తండ్రి గురించే తెలియదు. తండ్రియే రచయిత. బ్రహ్మా-విష్ణు-శంకరులు కూడా రచనయే. పరమాత్మను సర్వవ్యాపి అని అన్నట్లయితే అందరూ తండ్రులైపోతారు. వారసత్వపు హక్కు ఉండదు. తండ్రి అయితే వచ్చి పిల్లలందరికీ వారసత్వాన్ని ఇస్తారు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. ఎవరైతే మొట్టమొదట సత్యయుగములోకి వస్తారో, 84 జన్మలను వారే తీసుకుంటారు అని కూడా అర్థం చేయించారు. క్రిస్టియన్లకు ఎన్ని జన్మలు ఉంటాయి? 40 జన్మలు ఉండవచ్చు. ఈ లెక్క తీయడము జరుగుతుంది. ఒక్క భగవంతుడిని వెతికేందుకు ఎంతగా భ్రమిస్తారు. ఇప్పుడు మీరు భ్రమించరు. మీరు కేవలం ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఇది స్మృతియాత్ర. ఇది పతిత-పావనుడైన గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. మీ ఆత్మ చదువుకుంటుంది. సాధు-సత్పురుషులు, ఆత్మ నిర్లేపి అని అంటారు. అరే, ఆత్మయే కర్మల అనుసారముగా మరొక జన్మ తీసుకోవలసి ఉంటుంది. ఆత్మయే మంచి లేక చెడు కర్మలు చేస్తుంది. ఈ సమయములో మీ కర్మలు వికర్మలుగా అవుతాయి, సత్యయుగములో కర్మలు అకర్మలుగా అవుతాయి, అక్కడ వికర్మలు జరగవు. అది పుణ్యాత్ముల ప్రపంచము. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన మరియు అర్థం చేయించవలసిన విషయాలు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే, నంబరువారు పురుషార్థమనుసారముగా ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ముళ్ళ నుండి పుష్పాలుగా అయి పుష్పాలతోటను (సత్యయుగాన్ని) స్థాపన చేసే సేవ చేయాలి. ఎటువంటి చెడు కర్మలు చేయకూడదు.

2. తండ్రి నుండి విన్న ఆత్మిక జ్ఞానాన్నే అందరికీ వినిపించాలి. ఆత్మాభిమానులుగా అయ్యే కృషి చేయాలి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, ఏ దేహధారినీ కాదు.

వరదానము:-
నింద-స్తుతి, జయ-పరాజయాలలో సమాన స్థితిలో ఉండే బాబా సమాన సంపన్న మరియు సంపూర్ణ భవ

ఎప్పుడైతే ఆత్మకు సంపన్న మరియు సంపూర్ణ స్థితి తయారవుతుందో, అప్పుడు నింద-స్తుతి, జయ-పరాజయాలు, సుఖ-దుఃఖాలు, అన్నింటిలోనూ సమానత ఉంటుంది. దుఃఖములో కూడా ముఖముపై లేక మస్తకముపై దుఃఖపు అలకు బదులుగా సుఖము లేక సంతోషపు అల కనిపించాలి. నింద వింటూ కూడా - ఇది నింద కాదు, సంపూర్ణ స్థితిని పరిపక్వము చేయడానికి ఇవి మహిమాయోగ్య పదాలు అని అనుభవమవ్వాలి - ఇటువంటి సమానత ఉండాలి, అప్పుడు బాబా సమానమైనవారు అని అంటారు. వృత్తిలో కొద్దిగా కూడా - వీరు శత్రువులు, నిందించేవారు లేక వీరు మహిమ చేసేవారు అన్నది రాకూడదు.

స్లోగన్:-
నిరంతర యోగాభ్యాసము పట్ల అటెన్షన్ పెట్టినట్లయితే ఫస్ట్ డివిజన్ లో నంబర్ లభిస్తుంది.

అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి

బ్రాహ్మణ పరివారము యొక్క విశేషత ఏమిటంటే - అనేకులు ఉన్నప్పటికీ ఒకటిగా ఉండటము. మీ అన్ని సేవా కేంద్రాల వైబ్రేషన్లు ఎలా ఉండాలంటే - వీరు అనేకమంది కాదు ఒక్కరే అని అందరికీ అనుభవమవ్వాలి. మీ ఏకత యొక్క వైబ్రేషన్లు పూర్తి విశ్వములో ఏక ధర్మాన్ని, ఏక రాజ్యాన్ని స్థాపన చేస్తాయి. కావున విశేషమైన అటెన్షన్ పెడుతూ భిన్నత్వాన్ని తొలగించి ఏకతను నిలపండి.