05-05-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - సుఖ-శాంతుల వరదానము ఒక్క తండ్రి నుండి
మాత్రమే లభిస్తుంది, ఏ దేహధారుల నుండి లభించదు, మీకు ముక్తి-జీవన్ముక్తుల మార్గాన్ని
చూపించేందుకు బాబా వచ్చారు’’
ప్రశ్న:-
తండ్రితో పాటు వెళ్ళేందుకు మరియు సత్యయుగ ఆదిలో వచ్చేందుకు పురుషార్థము ఏమిటి?
జవాబు:-
బాబాతో పాటు
వెళ్ళాలంటే పూర్తిగా పవిత్రముగా అవ్వాలి. సత్యయుగ ఆదిలో వచ్చేందుకు ఇతర సాంగత్యాల
నుండి బుద్ధియోగాన్ని తెంచి, ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. ఆత్మాభిమానిగా తప్పకుండా
అవ్వాలి. ఒక్క తండ్రి మతముపై నడిచినట్లయితే ఉన్నత పదవి యొక్క అధికారము లభిస్తుంది.
పాట:-
నయనహీనులకు
మార్గము చూపించండి...
ఓంశాంతి
ఈ పాటను ఎవరు పాడారు? పిల్లలు పాడారు, ఎందుకంటే తండ్రి అయితే ఒక్కరే, వారినే రచయిత
అని అనడము జరుగుతుంది. రచన తన రచయితను పిలుస్తుంది. బాబా అర్థం చేయించారు, భక్తి
మార్గములోనైతే మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు, ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక
తండ్రి. ఆత్మలందరి తండ్రి ఒక్కరే. తండ్రి ఒక్కరే అయిన కారణముగా ఆత్మలందరూ పరస్పరం
తమను తాము సోదరులము అని పిలుచుకుంటారు. ఓ గాడ్ ఫాదర్, ఓ పరమపిత, దయ చూపించండి,
క్షమించండి అని ఆ తండ్రిని పిలుస్తారు. భక్తుల రక్షకుడు భగవంతుడు ఒక్కరే.
మొట్టమొదటైతే మనకు ఇద్దరు తండ్రులు ఉన్నారు అన్న విషయాన్ని అర్థం చేయించాలి.
పారలౌకిక తండ్రి అయితే అందరికీ ఒక్కరే. ఇకపోతే లౌకిక తండ్రి ప్రతి ఒక్కరికీ
వేరు-వేరుగా ఉంటారు. ఇప్పుడు లౌకిక తండ్రి గొప్పవారా లేదా పారలౌకిక తండ్రి గొప్పవారా?
లౌకిక తండ్రినైతే ఎప్పుడూ భగవంతుడు అని లేదా పరమపిత అని అనరు. ఆత్మల తండ్రి ఒక్క
పరమపిత పరమాత్మయే. ఆత్మ పేరు ఎప్పుడూ మారదు. శరీరము పేరు మారుతుంది. ఆత్మ రకరకాల
శరీరాలను ధరించి పాత్రను అభినయిస్తుంది అనగా పునర్జన్మలను తీసుకుంటుంది. చివరికి
ఎన్ని జన్మలు ఉంటాయి అనేది కూడా తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. పిల్లలూ, మీకు మీ
జన్మల గురించి తెలియదు. తండ్రి వచ్చేది భారత్ లోనే, వారి పేరు శివ. శివుడు పరమాత్మ
అని అర్థం చేసుకుంటారు కూడా. శివజయంతిని లేక శివరాత్రిని కూడా జరుపుకుంటారు. ఎలాగైతే
ఆత్మ కూడా నిరాకారియో, అలా వారు కూడా నిరాకారుడు. వారు నిరాకారీ లోకము నుండి పాత్రను
అభినయించేందుకు సాకారములోకి వస్తారు. ఇప్పుడు నిరాకార శివుడైతే శరీరము లేకుండా
పాత్రను అభినయించలేరు. మనుష్యులు ఈ విషయాలను ఏమీ అర్థం చేసుకోరు, నయనహీనులుగా
ఉన్నారు. శరీరము యొక్క రెండు నేత్రాలైతే అందరికీ ఉంటాయి. కానీ జ్ఞానము యొక్క మూడవ
నేత్రము ఆత్మకు లేదు, దానిని దివ్య చక్షువు అని కూడా అంటారు. ఆత్మ తన తండ్రిని
మర్చిపోయింది, అందుకే నయనహీనులకు మార్గము చూపించండి అని పిలుస్తారు. ఎక్కడికి
మార్గము? శాంతిధామానికి మరియు సుఖధామానికి మార్గము. సర్వుల సద్గతిదాత, సద్గురువు
ఒక్కరే. మనిషి, మనిషికి గురువుగా అయి సద్గతినివ్వలేరు. వారు స్వయము సద్గతిని పొందరు,
అలాగే ఇతరులకు కూడా ఇవ్వరు. ఒక్క తండ్రి మాత్రమే సర్వులకు సద్గతిని ఇస్తారు. ఆ
భగవంతుడైన తండ్రినే స్మృతి చేయాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మనుష్యమాత్రులెవరూ
ముక్తి-జీవన్ముక్తిని, శాంతిని మరియు సుఖాన్ని సదా కాలం కోసం ఇవ్వలేరు. సుఖ-శాంతుల
వరదానాన్ని అయితే ఒక్క తండ్రి మాత్రమే ఇవ్వగలరు. మనుష్యులు, మనుష్యులకు ఇవ్వలేరు.
భారతవాసులు సతోప్రధానముగా ఉన్నప్పుడు, సత్యయుగీ స్వర్గవాసులుగా ఉండేవారు. ఆత్మ
పవిత్రముగా ఉండేది. ఆత్మలు పవిత్రముగా, సతోప్రధానముగా ఉన్నప్పుడు భారత్ ను స్వర్గము
అని అనడము జరుగుతుంది.
తప్పకుండా నేటికి 5 వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గముగా, సతోప్రధానముగా
ఉండేదని, ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేదని మీకు తెలుసు. ఇప్పుడిది కలియుగములో కూడా
అంతిమము, దీనిని నరకము అని అనడము జరుగుతుంది. ఇదే భారత్ స్వర్గముగా ఉన్నప్పుడు చాలా
సంపన్నముగా ఉండేది. వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉండేవి. తండ్రి పిల్లలకు స్మృతిని
ఇప్పిస్తున్నారు. సత్యయుగ ఆదిలో ఈ లక్ష్మీ-నారాయణుల రాజధాని ఉండేది. దానిని స్వర్గము,
వైకుంఠము అని అంటారు. ఇప్పుడైతే స్వర్గము లేదు, ఇది తండ్రి అర్థం చేయిస్తున్నారు.
బాబా భారత్ లోనే వస్తారు. నిరాకారుడైన శివుని జయంతిని కూడా జరుపుకుంటారు, కానీ వారు
ఏమి చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. ఆత్మలైన మన తండ్రి శివుడు, వారి జయంతిని మనము
జరుపుకుంటాము. తండ్రి యొక్క బయోగ్రఫీ గురించి కూడా తెలియదు. దుఃఖములో అందరూ
స్మరిస్తారు అని అంటూ ఉంటారు కూడా. ఓ గాడ్ ఫాదర్, దయ చూపించండి, మేము చాలా దుఃఖములో
ఉన్నాము అని పిలుస్తారు కూడా ఎందుకంటే ఇది రావణ రాజ్యము. ప్రతి సంవత్సరము రావణుడిని
కాలుస్తారు కదా. కానీ 10 తలల రావణుడు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. మనము రావణుడిని
ఎందుకు కాలుస్తాము, రావణుడు ఎలాంటి శత్రువు అయిన కారణముగా అతడి దిష్టిబొమ్మను
తయారుచేసి కాలుస్తున్నాము అనేది ఎవరికీ తెలియదు. భారతవాసులకు అసలు తెలియదు, ఎందుకంటే
జ్ఞానము యొక్క మూడవ నేత్రము లేదు, అందుకే రామ రాజ్యము కావాలని కోరుకుంటారు. 5
వికారాలు స్త్రీలో ఉన్నాయి, 5 వికారాలు పురుషుడిలో ఉన్నాయి, అందుకే దీనిని రావణ
సాంప్రదాయమని అంటారు. ఈ రావణుడి 5 వికారాలే అతి పెద్ద శత్రువు, అతడి దిష్టిబొమ్మను
తయారుచేసి కాలుస్తారు. మేము కాలుస్తున్న ఆ రావణుడు ఎవరు అనేది భారతవాసులకు తెలియదు.
రావణ రాజ్యము ఎప్పటినుండి ప్రారంభమయ్యింది, ఇది కూడా ఎవరికీ తెలియదు. తండ్రి అర్థం
చేయిస్తున్నారు - రామ రాజ్యము సత్య-త్రేతాయుగాలు, రావణ రాజ్యము ద్వాపర-కలియుగాలు.
సత్యయుగములో ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది, వారికి ఈ రాజ్యము ఎక్కడ నుండి
లభించింది, ఎలా లభించింది, ఇది ఎవరికీ తెలియదు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ
విషయాల పట్ల అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది. అత్యంత ప్రియమైనవారు తండ్రి, అందుకే
వారిని భక్తి మార్గములో కూడా పిలుస్తారు. భారత్ లో వీరి (లక్ష్మీ-నారాయణుల) రాజ్యము
ఉన్నప్పుడు దుఃఖమన్న మాటే ఉండేది కాదు. ఇప్పుడిది దుఃఖధామము, అనేక ధర్మాలు ఎన్ని
ఉన్నాయి. సత్యయుగములో ఒకే ధర్మముండేది, మిగిలిన ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి,
ఇది కూడా ఎవరికీ తెలియదు ఎందుకంటే నయనహీనులుగా ఉన్నారు. శాస్త్రాల ద్వారా జ్ఞానము
యొక్క మూడవ నేత్రము ఎవరికీ లభించదు. జ్ఞాన నేత్రాన్ని జ్ఞానసాగరుడైన పరమపిత
పరమాత్మయే ఇస్తారు. ఆత్మకు మూడవ నేత్రము లభిస్తుంది. నేను ఎన్ని జన్మలు తీసుకున్నాను
అనేది ఆత్మ మర్చిపోయింది. సత్యయుగములో ఏదైతే దేవీ-దేవతల రాజ్యముండేదో, అది ఎక్కడికి
వెళ్ళిపోయింది? మనుష్యులు 84 జన్మలు తీసుకుంటారని పాడుతారు కూడా. 84 జన్మల చక్రమని
అంటారు. కానీ ఏ ఆత్మ 84 జన్మలను తీసుకుంటుంది? ఎవరైతే మొదట భారత్ లోకి వస్తారో, వారు
దేవీ-దేవతలు. ఆ తర్వాత 84 జన్మలను అనుభవించి చివరిలో పతితముగా అయిపోతారు. ఓ
పతిత-పావనా అని పాడుతారు కూడా, అంటే స్వయము పతితులమని వారు నిరూపించుకుంటున్నారు,
అందుకే - ఓ పతిత-పావనా, మమ్మల్ని పావనముగా చేయడానికి రండి అని పిలుస్తారు. ఎవరైతే
స్వయమే పతితులుగా ఉన్నారో, వారు ఇతరులను పావనముగా ఎలా తయారుచేయగలరు. తండ్రి అర్థం
చేయిస్తున్నారు - అర్ధకల్పము భక్తి మార్గములో రావణ రాజ్యము, 5 వికారాలు ఉన్న
కారణముగా భారత్ ఇంతటి దుఃఖాన్ని పొందింది. 84 జన్మలనైతే తప్పకుండా తీసుకుంటారు. ఆ
లెక్కను కూడా అర్థం చేయించాలి. మొట్టమొదట సత్యయుగములో సతోప్రధానముగా ఉంటారు, తర్వాత
త్రేతాలో సతో... అలా ఆత్మలో మాలిన్యము చేరుకుంటుంది. తండ్రి వచ్చేదే భారత్ లో.
శివజయంతి ఉంది కదా. మిగిలిన ఆత్మలన్నీ అయితే గర్భము ద్వారా జన్మ తీసుకుంటాయి. తండ్రి
అంటారు - నేను సాధారణ వృద్ధ తనువులో ప్రవేశిస్తాను. ఇది వీరి అనేక జన్మల అంతిమ జన్మ.
ఇది ఎవరో ఒక్కరికే అర్థం చేయించరు. ఇది గీతా పాఠశాల. మనుష్యులను దేవతలుగా
తయారుచేయడానికి ఈ రాజయోగాన్ని నేర్పించడము జరుగుతుంది. స్వర్గ రాజ్యాధికారాన్ని
ప్రాప్తి చేసుకునేందుకు మీరు ఇక్కడకు వచ్చారు, దీనిని తండ్రి మాత్రమే ఇవ్వగలరు.
గీతను చదవడము ద్వారా ఎవరూ రాజులుగా అవ్వరు, ఇంకా పేదవారిగా అవుతూ ఉంటారు. తండ్రి
గీతా జ్ఞానాన్ని వినిపించి రాజుగా తయారుచేస్తారు, ఇతరుల ద్వారా గీతను వినడముతో
నిరుపేదలుగా అయిపోయారు. భారత్ లో ఎప్పుడైతే ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేదో,
అప్పుడు పవిత్రత, శాంతి, సంపదలు ఉండేవి, పవిత్ర గృహస్థ ఆశ్రమము ఉండేది. అక్కడ హింస
అన్న మాటే లేదు, తర్వాత ద్వాపరము నుండి మొదలుకుని హింస ప్రారంభమయ్యింది. కామ
ఖడ్గాన్ని ఉపయోగిస్తూ-ఉపయోగిస్తూ మీ పరిస్థితి ఇలా అయిపోయింది. సత్యయుగములో 100 శాతం
సంపన్నులుగా, సతోప్రధానముగా ఉండేవారు. ఈ రహస్యము గురించి మనుష్యులెవరికీ మరియు
సాధువు-సత్పురుషులు మొదలైనవారెవరికీ తెలియదు. జ్ఞానసాగరుడు, పతిత-పావనుడైన తండ్రియే
వచ్చి సతోప్రధానముగా అయ్యే యుక్తిని తెలియజేస్తారు. రావణుడి మతముపై మనుష్యుల
పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. ఎవరైతే పవిత్ర రాజులు ఉండి వెళ్ళారో, ఇక్కడి
రాజులు వారి చరణాలకు నమస్కరిస్తారు మరియు వారి మహిమను పాడుతారు - మీరు సర్వగుణ
సంపన్నులు, మేము నీచులము, పాపులము, మాలో ఏ గుణాలు లేవు అని. అంతేకాక, మాపై దయ
చూపించండి, మీరు వచ్చి మమ్మల్ని మందిర యోగ్యులుగా తయారుచేయండి అని అంటారు. తండ్రి ఏ
విధముగా వచ్చి దేవీ-దేవతా ధర్మాన్ని మళ్ళీ స్థాపన చేయిస్తారు అనేది ఎవరికీ అర్థం
కాదు. మేమే దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారము, మేమే క్షత్రియులుగా,
వైశ్యులుగా, శూద్రులుగా అయ్యాము, ఇన్ని జన్మలు తీసుకున్న తర్వాత ఇప్పుడు 84 జన్మలు
పూర్తి అయ్యాయని మీరు అర్థం చేసుకుంటారు. మళ్ళీ ప్రపంచ చక్రము తిరగవలసి ఉంటుంది,
అందుకే మీరు పావనముగా ఇక్కడే అవ్వాలి. పతితులైతే సుఖధామానికి, శాంతిధామానికి
వెళ్ళలేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, సతోప్రధానముగా ఉన్న మీరు తమోప్రధానముగా
అయ్యారు. బంగారు యుగము నుండి మళ్ళీ ఇనుప యుగములోకి వచ్చారు, మళ్ళీ బంగారు యుగము
వారిగా అవ్వాలి, అప్పుడే ముక్తిధామానికి, సుఖధామానికి వెళ్ళగలరు. భారత్ సుఖధామముగా
ఉండేది. ఇప్పుడు దుఃఖధామముగా ఉంది. నయనహీనులైన మాకు మార్గాన్ని చూపించండి... అని
పాటలో కూడా విన్నారు. మనము మన శాంతిధామానికి ఎలా వెళ్ళగలము. వారు పరమాత్మ సర్వవ్యాపి,
వారు ఫలానా అవతారము, పరశురాముని అవతారమని అనేస్తారు. ఇప్పుడు తండ్రి పరశురామునిగా
అయి ఎవరినైనా హతమారుస్తారా ఏమిటి? అది అసంభవము. మీరు ఈ చక్రములో 84 జన్మలను ఎలా
తీసుకున్నారు అనేది తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు భగవంతుడినైన నన్ను స్మృతి
చేయండి. ఓ ఆత్మలు, దేహీ-అభిమానులుగా అవ్వండి. దేహాభిమానులుగా అయి మీరు పూర్తిగా
దుఃఖమయముగా, నిరుపేదగా, నరకవాసులుగా అయిపోయారు. ఒకవేళ స్వర్గవాసులుగా అవ్వాలనుకుంటే,
తప్పకుండా ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని
తీసుకుంటుంది. ఇప్పుడు 84 జన్మలు పూర్తయ్యాయి, మళ్ళీ సత్యయుగ ఆదిలోకి వెళ్ళాలి.
ఇప్పుడు నన్ను స్మృతి చేయండి, ఇతర సాంగత్యాల నుండి బుద్ధియోగాన్ని తెంచండి. గృహస్థ
వ్యవహారములో ఉండండి కానీ స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి. ఆత్మ ఒక శరీరాన్ని
వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వాలి, నన్ను స్మృతి
చేసినట్లయితే మాలిన్యమంతా కాలిపోతుంది, మీరు పవిత్రముగా అయిపోతారు, అప్పుడు నేను
పిల్లలందరినీ తీసుకువెళ్తాను. ఒకవేళ నా మతముపై నడవకపోతే, అంతటి ఉన్నత పదవిని పొందరు.
ఈ లక్ష్మీ-నారాయణులది ఉన్నత పదవి. వీరి రాజ్యము ఉన్నప్పుడు వేరే ధర్మము ఏదీ లేదు.
ద్వాపరము నుండి మళ్ళీ ఇతర ధర్మాలు వస్తాయి. సత్యయుగములో మనుష్యులు కూడా కొద్దిమందే
ఉంటారు. ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్న కారణముగా ఎంత దుఃఖితులుగా అయిపోయారు. ఆ దేవతా
ధర్మము వారే ఇప్పుడు మళ్ళీ పతితులుగా అయిన కారణముగా స్వయాన్ని దేవతలుగా చెప్పుకోరు.
హిందూ అన్న పేరును పెట్టారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు యోగ్యమైన
దేవీ-దేవతలుగా ఉన్నప్పుడు మొత్తము విశ్వముపై మీ రాజ్యముండేది, అందరూ సుఖమయముగా
ఉండేవారు. ఇప్పుడు దుఃఖితులుగా అయిపోయారు. భారత్ స్వర్గముగా ఉండేది, అది ఇప్పుడు
నరకముగా అయిపోయింది, మళ్ళీ నరకాన్ని స్వర్గముగా తండ్రి తప్ప మరెవ్వరూ తయారుచేయలేరు.
దేవతలను సంపూర్ణ నిర్వికారులని అంటారు. ఇక్కడి మనుష్యులైతే సంపూర్ణ వికారులు, వీరిని
పతితులని అంటారు. భారత్ శివాలయముగా ఉండేది, అది శివబాబా ద్వారా స్థాపన చేయబడినది.
తండ్రి స్వర్గాన్ని తయారుచేస్తారు, రావణుడు మళ్ళీ నరకముగా చేస్తాడు. రావణుడు
శాపాన్ని ఇస్తాడు, తండ్రి 21 జన్మల కోసం వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు మీరు ప్రతి
ఒక్కరు తండ్రినే స్మృతి చేయండి, ఏ దేహధారిని స్మృతి చేయకండి. దేహధారిని భగవంతుడని
అనరు. భగవంతుడైతే ఒక్కరే. తండ్రి అయితే అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు, మళ్ళీ రావణుడు
శాపగ్రస్థులుగా చేస్తాడు. ఈ సమయములో భారత్ శాపగ్రస్థమై ఉంది, చాలా దుఃఖములో ఉంది.
ఇప్పుడు ఈ రావణుడిపై విజయాన్ని పొందాలి. దానమిస్తే గ్రహణము తొలగిపోతుందని పాడుతారు
కూడా. ఆ గ్రహణమైతే భూమిపై ఏర్పడే నీడ. ఇప్పుడు తండ్రి అంటారు, మీ పై 5 వికారాల రూపీ
రావణుడి గ్రహణముంది. ఈ 5 వికారాలను దానముగా ఇచ్చేయాలి. ముందు అయితే - మేమెప్పుడూ
వికారాలలోకి వెళ్ళమని దానమివ్వండి. ఈ కామ ఖడ్గమే మనుష్యులను పతితులుగా చేస్తుంది.
అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి ఏదైతే జ్ఞానాన్ని ఇస్తారో, దాని పట్ల పూర్తి అటెన్షన్ పెట్టి
చదువుకోవాలి. జ్ఞానము యొక్క మూడవ నేత్రము ద్వారా మీ 84 జన్మలను తెలుసుకుని, ఇప్పుడు
ఈ అంతిమ జన్మలో పావనముగా అవ్వాలి.
2. రావణుడి శాపము నుండి రక్షించుకునేందుకు, ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. 5
వికారాలను దానమివ్వాలి, ఒక్క తండ్రి మతముపై నడవాలి.
వరదానము:-
కిరీటాన్ని మరియు తిలకాన్ని ధారణ చేసి బాప్ దాదాకు సహాయకులుగా
అయ్యే హృదయ సింహాసనాధికారీ భవ
ఏ విధముగా ఎవరైనా సింహాసనముపై కూర్చున్నప్పుడు వారికి
తిలకము మరియు కిరీటము గుర్తుగా ఉంటాయో, అదే విధముగా ఎవరైతే హృదయ సింహాసనాధికారిగా
ఉంటారో, వారి మస్తకముపై సదా ఆవినాశీ ఆత్మిక స్థితి అనే తిలకము దూరము నుండే
మెరుస్తున్నట్లుగా కనిపిస్తుంది. సర్వ ఆత్మల కళ్యాణము జరగాలనే శుభభావన వారి నయనాల
ద్వారా మరియు ముఖము ద్వారా కనిపిస్తుంది. వారి ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ బాబా
సమానముగా ఉంటాయి.
స్లోగన్:-
సరళమైన
స్మృతి కొరకు సరళతా గుణాన్ని ధారణ చేయండి, సంస్కారాలను సరళముగా చేసుకోండి.
అవ్యక్త ప్రేరణలు -
‘‘సదా అచంచలమైన, స్థిరమైన, ఏకరస స్థితిని అనుభవము చెయ్యండి’’
ఎవరికైతే డ్రామా
జ్ఞానము యొక్క శక్తి ప్రాక్టికల్ జీవితములో ధారణ అయ్యి ఉంటుందో వారు ఎప్పుడూ కూడా
అలజడిలోకి రాలేరు. సదా ఏకరసముగా, అచంచలముగా, స్థిరముగా తయారవ్వటానికి మరియు ఇతరులను
అలా తయారుచేయటానికి విశేషమైన శక్తి ఈ డ్రామా పాయింట్. దీనిని శక్తి రూపములో ధారణ
చేసేవారు ఎప్పుడూ ఓడిపోలేరు. ఈ కళ్యాణకారీ డ్రామాలోని ప్రతి సీన్ లో ఏదో ఒక కళ్యాణము
ఇమిడి ఉంది. ఓర్పు కలవారిగా అయ్యి సాక్షీగా ఉంటూ చూసే అభ్యాసము చేసినట్లయితే
అచంచలముగా, స్థిరముగా ఉంటారు.
| | | |