05-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 15.12.2010


‘‘నాది అన్నదానిని నీది లోకి పరివర్తన చేసి నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి, సెకండులో వ్యర్థానికి బిందువు పెట్టే అభ్యాసకులుగా అయ్యి ప్రతి సంకల్పాన్ని మరియు సమయాన్ని సఫలం చేయండి’’

ఈ రోజు నలువైపులా ఉన్న తమ నిశ్చింత చక్రవర్తులైన పిల్లలను చూస్తున్నారు. ఇటువంటి నిశ్చింత చక్రవర్తుల సభ ఇప్పుడే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడే బాబా చింతలను తీసుకుని నిశ్చింత చక్రవర్తులుగా చేస్తారు, అందుకే మీ ఈ సభ ఇప్పుడే కనిపిస్తుంది. మీరందరూ ఉదయము నుండి లేస్తూనే నిశ్చింత స్థితిలో స్థితులవుతారు. తింటూ, తాగుతూ, కర్మలు చేస్తూ ఎటువంటి చింత లేదు. నిద్రిస్తున్నా సరే నిశ్చింత. అటువంటి చక్రవర్తులు మరియు నిశ్చింతులు. లేచినా, నిద్రిస్తున్నా, నిశ్చింతులు - ఈ విధముగా అనుభవం చేస్తున్నారా? ఎందుకంటే మీరందరూ బాబాకు చింతలను ఇచ్చి నషాను తీసుకున్నారు, అందుకే నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారు. ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా చింత వచ్చినట్లయితే ఆ చింత ఏం చేస్తుంది? నషా ఉన్నట్లయితే మీ మస్తకములో ప్రకాశపు మెరుపు మెరుస్తుంది. ఒకవేళ చింత వచ్చినట్లయితే భారమనే తట్ట వచ్చేస్తుంది. మరి చెప్పండి, మీకు ప్రకాశపు మెరుపు ఇష్టమనిపిస్తుందా లేక భారమనే తట్ట ఇష్టమనిపిస్తుందా? నిశ్చింత చక్రవర్తులు స్వయానికి కూడా ప్రియమనిపిస్తారు మరియు ఎవరైతే ఇటువంటి స్థితిలో ఎగురుతారో, వారి మెరుస్తున్న ప్రకాశాన్ని చూసి ఇతరులకు కూడా వారి పట్ల ఎంత ప్రేమ కలుగుతుంది. అందుకే బాప్ దాదా సదా పిల్లలను నిశ్చింత చక్రవర్తి అన్న స్థితిలో ఉంచుతూ ఆ స్మృతి స్వరూపములో స్థితి అయ్యే విధముగా చేస్తారు. అందుకే మీ చిత్రాలను కూడా భక్తులు డబుల్ కిరీటాలతో చూపిస్తారు. ఒకటి ప్రకాశ కిరీటము మరియు రెండవది వికారాలను జయించినందుకు చక్రవర్తి యొక్క కిరీటము. డబుల్ కిరీటాన్ని చూపిస్తారు. అందుకే బాప్ దాదా సదా ప్రతి బిడ్డకు ఈ శిక్షణనే ఇస్తారు. సదా ఆనందములో ఉండటము చాలా సహజము. ఎందుకని సహజము? కేవలం హద్దు యొక్క నాది అన్నదానిని బాబాకు ఇచ్చేయండి. నాది అన్నదానిని నీదిలోకి చేసినట్లయితే నిశ్చింత చక్రవర్తులుగా అయినట్లే. ఒక్క అక్షరమే తేడా, నీది, నాది - నీ, నా. ఈ ఒక్క అక్షరము తేడాతో నిశ్చింత చక్రవర్తులుగా అయిపోతారు. సహజమే కదా! నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారు కదా? లేక ఇంకా చింతలు ఉన్నాయా? ఒకవేళ ఎప్పుడైనా నషాకు బదులుగా చింత వచ్చిందంటే, అది కేవలం నీది అని అనుకోవడానికి బదులుగా నాది అనుకోవడము వల్లనే. అందరి ప్రాక్టికల్ రిజల్ట్ ఏముంది? చింతలను ఇచ్చేసారా లేక మధ్యమధ్యలో నషాను విడిచి చింతలోకి వస్తున్నారా? చింత కలుగుతుందా లేక నిశ్చింతగానే ఉంటున్నారా? ఎవరైతే సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటున్నారో, వారు చేతులెత్తండి. నిశ్చింత చక్రవర్తులు, పక్కానా లేక అప్పుడప్పుడూనా! నిశ్చింత చక్రవర్తులేనా, చేతులు బాగా పైకి ఎత్తండి. అప్పుడప్పుడు అనేవారు కూడా ఇందులో ఉన్నారు. సేవ యొక్క చింత ఉండటము వేరే విషయము. ఆ చింతైతే ఇతరులను కూడా నిశ్చింతులుగా చేసే సాధనము. ఒకవేళ తమ సంస్కారము వలన చింత కులుగుతున్నట్లయితే, దానిని ఆ సమయములోనే నాది అన్నదాని నుండి నీదిలోకి మార్చేయండి. బాబాకు చింతను ఇచ్చేయండి మరియు నషాను తీసుకోండి, ఎందుకంటే బాబా వచ్చిందే పిల్లల చింతలను తీసుకుని నషాను ఇవ్వటానికి. కావున చెక్ చేసుకోండి - నాలో అప్పుడప్పుడూ బహుకాలపు సంస్కారాలు ఇమర్జ్ అవ్వడము లేదు కదా? ఎందుకంటే బాప్ దాదా కొంత సమయము నుండి పిల్లలకు ఏమని చెప్తున్నారంటే - వర్తమాన సమయమనుసారముగా ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు మరియు ఎప్పుడైనా జరగవచ్చు. అందుకే ప్రతి బిడ్డ స్వయం పట్ల ఈ అటెన్షన్ పెట్టాలి - ఒక్క సెకండులో బిందువు పెట్టాలనుకున్నప్పుడు పెట్టగలరా? ఒకవేళ ఏదైనా వ్యర్థ సంకల్పము వచ్చినట్లయితే బిందువు ద్వారా ఒక్క సెకండులో వ్యర్థాన్ని సమాప్తము చెయ్యగలరా? అంతటి అభ్యాసము ఉందా? లేక ఆ సమయములో, అప్పుడున్న పరిస్థితుల అనుసారముగా పురుషార్థము చేసి వ్యర్థాన్ని తొలగించాల్సి వస్తుందా! బిందువును పెట్టాలనుకుంటే ప్రశ్నార్థకము వస్తుందా - ఎందుకు, ఏమిటి, ఎలా... ఆ సమయములో ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నట్లయితే రాబోయే సమయములో - బాబాతోపాటుగా వెళ్తాము అన్న లక్ష్యమేదైతే ఉందో, బాబా అయితే సెకండులో వెళ్ళిపోతారు, ఎందుకంటే వారు బిందువే, సెకండు కూడా బిందువే మరియు ఫుల్ స్టాప్ కూడా బిందువే. మరి మీకు కూడా అంతటి అభ్యాసము ఉందా? దీని కోసం ఇప్పటినుండే ఈ అభ్యాసము యొక్క అభ్యాసకులుగా ఉంటేనే బాబా సమానముగా శ్రీమతము అనే చేతిలో చేయి వేసి ఇంటికి చేరుకుంటారు. అందుకే బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించి ఉన్నారు, రెండు విషయాల పట్ల అటెన్షన్ ను అండర్ లైన్ చేయండి. రెండు విషయాలు ఏమిటి?

ఒకటి, సంకల్పాల ఖజానా మరియు రెండవది, సమయము యొక్క ఖజానా. ఖజానాలైతే చాలా లభించాయి - జ్ఞాన ఖజానా, శక్తుల ఖజానా, యోగము ద్వారా సంపన్నముగా అవ్వడానికి ముఖ్యమైన యుక్తులేవైతే ఉన్నాయో, అన్నింటి ప్రాప్తిని ఇవ్వడము జరిగింది, ఎందుకంటే ఈ సంగము సమయము పూర్తి కల్పములోకి అమూల్యమైన విశేష సమయము. ఈ సమయములోనే ఎంత ప్రాప్తి కావాలంటే అంత చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ ఒక్క జన్మయే మహాన్ జన్మ. ఒక్క జన్మలోనే అనేక జన్మల ప్రారబ్ధాన్ని తయారుచేసుకోవాలి. సంగమయుగపు సమయములో ఒక్క సెకండును కూడా పోగొట్టుకోకూడదు. ఒక్క సెకండు యొక్క కనెక్షన్ అనేక జన్మలతో ఉంటుంది. ఒక్క సంవత్సరము జమ చేసుకున్నట్లయితే అనేక సంవత్సరాలు ప్రాప్తి లభిస్తుంది, అందుకే ఈ సమయము యొక్క విలువ ఒక్క సెకండు లేక నిమిషము కాదు, ఒక్క గంట కూడా గొప్పదే. ఒక్క సెకండు కూడా గొప్పదే. మరియు సంకల్పాలు ఈ సంగమ జన్మకు విశేషమైన ఆధారము. చూడండి, యోగము చేస్తున్నప్పుడు మన్మనాభవ అని అంటారు కదా. ఇదే పునాదికి ఆధారము. మనసు యొక్క పనే సంకల్పాలు చేయడము, సంకల్పాల ద్వారానే స్మృతియాత్రను అనుభూతి చేస్తారు. ఇతరులకు కూడా విశేషముగా భిన్న-భిన్న సంకల్పాలను ఇచ్చి అభ్యాసము చేయిస్తారు కదా! కనుక అందరూ చెక్ చేసుకోండి - సమయము యొక్క వేగము రోజంతటిలో నడుస్తూ, తిరుగుతూ, కర్మలు చేస్తూ, సంబంధాలలోకి వస్తూ అమూల్య రూపములో ఉందా? ఎందుకంటే సమయము అమూల్యమైనది. సంకల్పము సర్వశక్తివంతునిగా తయారుచేస్తుంది.

బాప్ దాదా పదే-పదే చెప్తున్నారు, బాప్ దాదా యొక్క ప్రియమైన పిల్లలూ, హృదయములో ఉండే పిల్లలూ, ఇప్పుడు వ్యర్థ ఖాతాను సమాప్తము చేయండి, సఫలం చేసుకోండి. సఫలం చేయడమే సఫలత. ఒక్క సెకండే కదా పోయింది అని అనుకోకండి. ప్రతి సెకండు, ప్రతి సంకల్పము సఫలమయ్యే విధముగా అంతటి అటెన్షన్ ను స్వయము పట్ల ఉంచాల్సిందే. అంతగా ఫుల్ స్టాప్ పెట్టే విషయములో చెకింగ్ చేసుకోండి. నిర్లక్ష్యులుగా అవ్వవద్దు. బాప్ దాదా చెప్పారు కానీ మనము అర్థం చేసుకోలేదు, సమయము గురించి ఆలోచించలేదు, సమయము ఎంతో ఫాస్టుగా వెళ్తూ ఉంది, మున్ముందు కూడా ఇలాగే వెళ్తుంది. ఇప్పుడు బాప్ దాదా అందరి నుండి నిర్లక్ష్యాన్ని తీసుకోవాలని అనుకుంటున్నారు. నేను అర్థం చేసుకోలేదు, నేను ఆలోచించలేదు - ఇటువంటి మాటలు ఇక వినదల్చుకోలేదు. ఇప్పుడు సంవత్సరము కూడా కొత్తది రాబోతుంది, కావున కొత్త సంవత్సరము ప్రారంభమయ్యే కంటే ముందే బ్రాహ్మణ ప్రపంచము నుండి నిర్లక్ష్యాన్ని, అలాగే సోమరితనాన్ని కూడా తీసేయ్యండి. సోమరితనము కూడా భిన్న-భిన్న ప్రకారాలుగా ఉంటుంది. ఈ సంవత్సరము పూర్తి అయ్యే లోపు ఏదైతే సమయము మిగిలి ఉందో, ఆ సమయములో ఈ అభ్యాసాన్ని ప్రారంభించండి మరియు ఎప్పుడైతే కొత్త సంవత్సరము ప్రారంభమవుతుందో, అప్పుడు ధైర్యము ఉంచి సంకల్పము చేయండి మరియు వీటికి వీడ్కోలు ఇచ్చేయండి. సంవత్సరముతోపాటు వీటికి కూడా వీడ్కోలు ఇచ్చేయండి. ఇవ్వగలరా! ఇవ్వగలరా? ఎవరైతే ఇవ్వగలరో, వారు చేతులెత్తండి. (అందరూ చేతులెత్తారు) వాహ్ పిల్లలు వాహ్! చేతులెత్తడములో మాత్రం బాప్ దాదాను ఎంతగానో సంతోషపరుస్తారు. బాప్ దాదా చూసారు - చాలామంది పిల్లలకు చేతులెత్తినందుకు రిటర్ను ఇవ్వాలి అన్నది గుర్తుంటుంది. కొంతమంది ఇది గుర్తు పెట్టుకోవడములో కూడా నిర్లక్ష్యులుగా ఉంటారు. బాప్ దాదాతో చాలా మంచి ఆత్మిక సంభాషణను చేస్తారు. అయిపోతుందిలే, బాబా మీరు చూస్తూ ఉండండి, ఇప్పుడిక అయిపోతుంది, ఇప్పుడిక అయిపోతుంది... బాప్ దాదా కూడా నిర్లక్ష్యముతో ఉన్న ఇటువంటి పిల్లలు చెప్పేది విని నవ్వుకుంటారు, మరింకేం చేస్తారు! మంచిదే, చేయాలి, చేయాలి, చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు... ఇలా చాలా ఆలోచిస్తూ ఉంటారు కానీ చేస్తున్నారా లేక చెయ్యడము లేదా అన్న చెకింగ్ విషయములో ఏమంటారు! నిర్లక్ష్యులుగా అయిపోతారు.

ఈ రోజు నలువైపులా ఉన్న పిల్లలకు, తమ-తమ దేశాలలో, తమ-తమ స్థానాలలో ఎవరెవరైతే చూస్తున్నారో, వారందరికీ అక్కడ కూడా చక్కగా కనిపిస్తుంది మరియు వినిపిస్తుంది కూడా అని బాప్ దాదా విన్నారు. బాప్ దాదా సమ్ముఖములోకి వచ్చిన పిల్లలకు మరియు తమ-తమ స్థానాల నుండి చూస్తూ, వింటూ ఉన్నవారికి ఇదే చెప్తున్నారు - ఇప్పుడు పురుషార్థాన్ని, సంకల్పాలను మరియు సంగమ సమయాన్ని అండర్ లైన్ చేయండి. పిల్లలందరూ ప్రేమలో అయితే మెజారిటీ పాస్ అయ్యారు. ప్రేమ ఆధారముతో మంచి అభివృద్ధినే సాధిస్తున్నారు. ప్రేమ కారణముగా, బాబా ప్రేమ తిరిగి లభిస్తున్న కారణముగా ముందుకు నడుస్తున్నారు. కానీ బాబా ఏమని భావిస్తున్నారంటే, ఎలా అయితే ప్రేమలో అనుభవీలుగా అయ్యి ముందుకు వెళ్తున్నారో, అలాగే స్మృతి అనే సబ్జెక్టులో, అనేక జన్మల వికర్మలను వినాశనము చేసుకోవడములో మరింత అటెన్షన్ ను ఇవ్వండి. ఎందుకని? వికర్మలు వినాశనమైతేనే తోడుగా వెళ్ళగలరు, లేకపోతే వెనుక వస్తారు. మరియు బాబా ఏమని భావిస్తారంటే, ప్రేమకు రెస్పాండ్ అవ్వడము అంటే ఎవరి మీదైతే ప్రేమ ఉంటుందో, వారు చెప్పినట్లు చెయ్యాల్సిందే. బాబా కోరుకుంటుంది ఏమిటంటే - పిల్లల ప్రేమ బాబాతో ఉన్నప్పుడు మరి తోడుగా ఉండాలి. రాజధానిలోకి కూడా బ్రహ్మాబాబాతో పాటుగా రాజధానిలోకి రావాలి. రాజధానిలోకి రావడము అంటే రాయల్ ఫ్యామిలీలోకి రావడము. సింహాసనముపై కూర్చోకపోయినా గానీ రాయల్ ఫ్యామిలీలోని సహచరులుగా అయితే అవ్వాలి కదా. దీనిని ఎలా గుర్తుంచాలి అనేది బాప్ దాదా ఇంతకుముందుకు కూడా చెప్పి ఉన్నారు. ఎప్పటినుండైతే మీరు వచ్చారో, జ్ఞానములో మీ వయస్సు ఎంతైతే ఉందో, అంత సమయము ఒకవేళ మీరు బాప్ దాదా హృదయ సింహాసనాధికారులుగా ఉన్నట్లయితే, ఎవరైతే ఎక్కువ సమయము హృదయ సింహాసనముపై ఉన్నారో, మట్టిలో పాదము పెట్టలేదో, వారు దాని అనుసారముగా రాయల్ ఫ్యామిలీలో దగ్గరి సంబంధములోకి వస్తారు. రాయల్ ఫ్యామిలీవారిగా ఉంటారు. మరి ప్రేమ ఉంది, ప్రేమ ఉన్నవారు తోడుగా ఉండటములో వెనుకబడరు. ఎవరైతే హృదయ సింహాసనాధికారులుగా ఉన్నారో, వారు ద్వాపర, కలియుగాల సంబంధాలలో కూడా ఉంటారు, దగ్గరగా ఉంటారు. అందుకే ప్రేమను నిలుపుకునేవారిగా, సదా హృదయ సింహాసనాధికారులుగా అవ్వండి మరియు జన్మజన్మల హక్కును తీసుకోండి. అందుకే బాప్ దాదా ప్రతి బిడ్డను ప్రేమిస్తారు. ప్రేమ యొక్క సబ్జెక్టులో మెజారిటీ పాస్ అయ్యారు అని బాబా సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పుడు అన్ని సబ్జెక్టులలోనూ పాస్ అవ్వాల్సిందే. పాస్ అవ్వాలి, సమీపముగా ఉండాలి.

మొదటిసారి వచ్చిన పిల్లలు లేవండి. మొదటిసారి వచ్చారా! సగము క్లాసు అయితే కొత్తవారే ఉన్నారు. వచ్చారు, కొత్తగా వచ్చినవారికి బాప్ దాదా స్వాగతము పలుకుతున్నారు. అభినందనలు. మొదటిసారి వచ్చినందుకు అభినందనలు. లేట్ గా వచ్చినా కానీ టూ లేట్ కన్నా ముందే వచ్చారు. ఇప్పుడు ఈ అటెన్షన్ పెట్టండి - కొద్ది సమయములోనే తీవ్ర పురుషార్థులుగా అయ్యి మీ భవిష్యత్తును ఎంతగా పెంచుకోవాలనుకుంటే అంతగా తీవ్ర పురుషార్థము ద్వారా ముందుకు వెళ్ళవచ్చు, ఎందుకంటే ఎంతైనా ఇప్పటికీ పురుషార్థము చేయడానికి అవకాశము ఉంది. ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. బాప్ దాదా మరియు ఈ దైవీ పరివారము మీకు తోడుగా ఉంటూ మీరు ముందుకు వెళ్ళడానికి వైబ్రేషన్లు ఇస్తారు, అందుకే ముందుకు సాగండి, ధైర్యమును ఉంచండి. ధైర్యము మీది, సహాయము బాప్ దాదా మరియు పరివారము ఇస్తారు. ముందుకు వెళ్ళండి. సరేనా! సరే అనండి, ముందుకు వెళ్ళండి. అచ్ఛా!

మధుబన్ నివాసులతో:- మధుబన్ వారైతే అదృష్టవంతులు. కొద్దిగా సంగఠనను పక్కా చేసుకుని తోడుగా చేసుకోండి. ఇతర విషయాలలో తోడుగా పెట్టుకోవడము కాదు, ఇందులో (లక్ష్యాన్ని సాధించడములో) తోడుగా చేసుకుని మొదటి నంబరు మధుబన్ తీసుకోవాలి. తీసుకుంటారా! గతించిందేదో గతించిపోయింది. ఏదైతే జరిగిందో, అందరూ చూసారు, విన్నారు. మధుబన్ వారికైతే ఇది చాలా సువర్ణావకాశము. మధుబన్ అంటే అందులో అందరూ వచ్చేసారు. పాండవ భవన్ వేరు, మరో స్థానము వేరు అని కాదు, అలా కాదు. మధుబన్ అంటే అంతా ఒక్కటే. మరి మధుబన్ వారు చేస్తాము అని భావిస్తున్నారా! చేస్తాము అనేవారు చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. చెయ్యడమనేది ఏమంత పెద్ద విషయము, బాప్ దాదా ఉన్నారు, దాదీలు ఉన్నారు కావున ఇది పెద్ద విషయమేమీ కాదు అని ఎవరు భావిస్తున్నారు. దాదీలు ఏమని భావిస్తున్నారు! మధుబన్ వారైతే నంబరువన్. బాగుంది, ఇది చేసి చూపించమని బాప్ దాదా అందరికీ చెప్పారు, కానీ మధుబన్ అయితే మధుబనే. మీరుందరూ వైబ్రేషన్లు ఇవ్వండి, అయిపోతుంది, పెద్ద విషయమేమీ కాదు. విఘ్నము యొక్క నామ-రూపాలు ఉండవు. ఏదైనా విషయము జరిగినా కానీ, ఇచ్చిపుచ్చుకోవడాలు చేసారు, ఇక సమాప్తము. కొంత సమయము క్రితం దాదీ ఉన్నప్పుడు ఒకసారి అందరూ హాజీ పాఠాన్ని పక్కా చేసుకున్నారు. లేదు అని అనము అన్నారు. హాజీ, చాలా మంచిది. కావున మధుబన్ మొదటి నంబరులోకి వెళ్తుంది. బాప్ దాదాకు మధుబన్ పట్ల నషా ఉంది కదా! ప్రతి జోన్ ను చూసి నషా ఉంది. ఇప్పుడు మధుబన్ ఎదురుగా వచ్చింది కానీ బాప్ దాదా అన్ని జోన్ల వారికీ చెప్తున్నారు - హాజీ, మధురమైన ఆత్మ, ఇది అందరి పక్కా పాఠము. పక్కానే కదా? బహుమతి అయితే మధుబన్ తీసుకోవాలి. ఒక్క సెకండులో గతం గతః అని అనగలరా! సరే, పురుషార్థీలే కావచ్చు, జరిగిపోయింది, కానీ గతం గతః చేసేసి ఎగరండి. ఎగిరేవారు వెనుకదానిని విడిచిపెట్టేస్తారు, అప్పుడే ఎగరగలరు. అయితే చాలా మంచిది.

ఇప్పుడు గుజరాత్ వారు ఏదైనా నవీనతను చేయండి. బాప్ దాదా ఢిల్లీ వారికి కూడా ఏదైనా నవీనతను చేయమని చెప్పారు. బాప్ దాదాకు సమాచారము లభించింది - ఇప్పుడు దేశము మరియు విదేశములోని యూత్ కలిసి ఏదైతే ఆరంభించారో, దాని ద్వారా మంచి రిజల్టు రావచ్చు. ఇప్పుడైతే ఇన్వెన్షన్ ను ప్రారంభించారు. కానీ భారత్ మరియు విదేశాలు, రెండూ కలిసి మరింత అద్భుతము చేయగలరు. ఇప్పుడైతే ఆరంభించారు. కానీ ఢిల్లీవారు మంచి ధైర్యాన్ని ఉంచారు. ఇప్పుడు ప్రారంభించారు, ఇప్పుడిది విశ్వములో వ్యాపించాలి. అయితే విదేశాలు మరియు దేశము కలిసి ఒక్క బ్రాహ్మణ పరివారముగా అయ్యారు మరియు విశ్వము ఎదుట విశ్వాన్ని కూడా ఏకం చేస్తారు. మొదలైతే అయింది, ఇప్పుడు ముస్లింలు కూడా ముందుకు వస్తున్నారు. ముఖ్యమైన దేశాల నుండి వచ్చే విధముగా ఇప్పుడు ఒక పెద్ద ప్రోగ్రాము చేయండి. అందరూ ఒక్క తండ్రి పిల్లలు, పరస్పరము సోదరీ-సోదరులు, సోదర భావము, సోదరీ భావము, ఈ శబ్దము వ్యాపిస్తూ ఉండాలి, ఇది విశ్వములో ప్రసిద్ధి చెందాలి. ఒకే స్టేజిపై అన్ని వైపుల నుండి వచ్చిన వ్యక్తుల విశేష అనుభవముండాలి. అందరూ ప్లాన్ అయితే తయారుచేస్తున్నారు. ఇప్పుడు బేహద్ లోకి వెళ్తున్నారు. ఇది ఒక్క భగవంతుని పరివారము అని అందరికీ తెలియాలి, ఇది ప్రసిద్ధమవ్వాలి. ఇకపోతే ఎవరైతే వస్తున్నారో, సేవ కూడా చేస్తున్నారు, స్వ పురుషార్థము కూడా చేస్తున్నారు, మరియు ఇది భగవంతుని కార్యము. ఇది కూడా ప్రపంచములో ప్రసిద్ధి చెందుతుంది. ఒక్క పరివారము. అచ్ఛా!

నలువైపులా ఉన్న పిల్లలకు బాప్ దాదా ఇప్పుడు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రతి రోజూ ప్రతి గంట ముందుకు వెళ్తున్నందుకు అభినందనలు. సమయము మీ కోసం ఎదురుచూస్తుంది. మీరు సమయము కోసం ఎదురుచూడకండి. మీరు సమాప్తి యొక్క సమయాన్ని ఎంత సమీపముగా తీసుకురావాలనుకుంటే, అంత సమీపముగా తీసుకురావచ్చు. సమయము వచ్చినప్పుడు తయారవుతాము అన్న సంకల్పము బ్రాహ్మణులైన మీకు రాకూడదు, మీరు సమయాన్ని సమీపముగా తీసుకురండి. ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మలు సమయము అనే నన్ను సమీపముగా తీసుకురావాలి అని సమయము బాబాకు చెప్తుంది. ఇప్పుడు సమాప్తిని సమీపముగా తీసుకురండి అని ప్రకృతి కూడా బాబాకు చెప్తుంది. మరి బాప్ దాదా ఏమని జవాబు ఇవ్వాలి? ఏమని జవాబు ఇవ్వాలి? సమయము ఇక వచ్చేసినట్లే అని చెప్పనా! మీ తరఫున ఈ జవాబు చెప్పమంటారా? ఏమని జవాబు ఇవ్వాలి? చెప్పండి. ఏమని జవాబు ఇవ్వాలి? ఇప్పుడు సమాప్తిని సమీపముగా తీసుకురావడము అంటే స్వయాన్ని సంపన్నముగా, సంపూర్ణముగా తయారుచేసుకోవడము ఎందుకంటే బాప్ దాదా ఒంటరిగా వెళ్ళరు, పిల్లలతో సహా వెళ్తారు. మరి డేట్ ను ఫిక్స్ చేయండి. ఎప్పటిలోపు? పని అయితే ఇచ్చాము, ఇప్పుడిక పరస్పరము చర్చించుకోండి. ప్రకృతికి బాప్ దాదా ఏమని జవాబు ఇవ్వాలి? ప్రకృతి చాలా అలజడిలో ఉంది. దుఃఖములో ఉన్న ఆత్మలు మనసులో ఎంతో మొరపెట్టుకుంటున్నారు. మనసా సేవను ఇప్పుడు మరింత పెంచండి. మనసా సేవను చేస్తున్నారు కానీ దానిని నిరంతరము పెంచుతూ ఉండండి, దానిని మరింత పెంచండి, ఎందుకంటే ప్రకృతి మరియు దుఃఖములో ఉన్న ఆత్మలు బాబా వద్దకు వస్తున్నారు, మొరపెట్టుకుంటున్నారు. కావున మీరు వారికి కొంచెం శాంతిని మరియు సుఖము యొక్క అనుభూతిని చేయించండి. వారు ఒక్క సెకండు కోసమైనా శాంతిని అనుభవం చేయాలనుకుంటున్నారు. కొద్దిగా శాంతిని ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆకలిగా ఉన్నవారు ఏది లభించినా పర్వాలేదు, కొద్దిగా లభించినా చాలు అని అనుకుంటారు కదా. కావున ఇప్పుడు మనసా సేవను కూడా పెంచండి. వాచ అయితే జరుగుతూనే ఉంది. బాప్ దాదా సంతోషిస్తున్నారు. అచ్ఛా, బాప్ దాదా ఏదైతే హోమ్ వర్కును ఇచ్చారో, దానిని గుర్తుంచుకోండి మరియు ఇతరులు కూడా గుర్తు ఉంచుకునేలా చూడండి. అచ్ఛా!

బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారీ పిల్లలకు, విశ్వ కళ్యాణ కర్తవ్యములో సదా ముందుకు వెళ్ళేవారికి బాప్ దాదా దృష్టిని ఇస్తూ హృదయపూర్వకమైన ప్రేమను మరియు అభినందనలు, అభినందనలు... ఇస్తున్నారు. ప్రతి బిడ్డ దూరముగా కూర్చుని ఉన్నా కూడా సమ్ముఖముగా అనుభవం చేస్తున్నారు మరియు బాప్ దాదా పిల్లలందరినీ హృదయములో ఇముడ్చుకుని పిల్లలందరికీ నమస్తే, నమస్తే చెప్తున్నారు.

వరదానము:-
స్నేహము మరియు శక్తి రూపపు బ్యాలెన్స్ ద్వారా సేవను చేసే సఫలతామూర్త భవ

ఏ విధముగా ఒక కంటిలో బాబా స్నేహము మరియు ఇంకొక కంటిలో బాబా ద్వారా లభించిన కర్తవ్యము (సేవ) సదా స్మృతిలో ఉంటుందో, అలా స్నేహమూర్తితో పాటు ఇప్పుడు శక్తి రూపముగా కూడా అవ్వండి. స్నేహముతోపాటు మీ మాటలలో ఎటువంటి పదును ఉండాలంటే, అది ఎవ్వరి హృదయమునైనా విదీర్ణము చేసేయ్యాలి. ఏ విధముగా తల్లి పిల్లలకు ఎటువంటి పదాలతో శిక్షణను ఇచ్చినా కానీ తల్లి స్నేహము కారణముగా ఆ పదాలు కఠినముగా లేక చేదుగా అనిపించవో, అలాగే జ్ఞానపు సత్యమైన విషయాలేవైతే ఉన్నాయో, వాటిని స్పష్టమైన పదాలలో ఇవ్వండి, కానీ మాటలలో స్నేహము ఇమిడి ఉన్నట్లయితే సఫలతామూర్తులుగా అయిపోతారు.

స్లోగన్:-
సర్వశక్తివంతుడైన తండ్రిని మీ సహచరునిగా చేసుకున్నట్లయితే పశ్చాత్తాపము నుండి విముక్తులైపోతారు.

అవ్యక్త ప్రేరణలు - జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి

ఎలా అయితే సూర్యుని కిరణాలు వ్యాపిస్తాయో, అలానే మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో శక్తులు మరియు విశేషతల రూపీ కిరణాలు నలువైపులా వ్యాపించటాన్ని అనుభవము చేయాలి, దీని కోసం ‘‘నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని, విఘ్నవినాశక ఆత్మను’’ అన్న ఈ ఉన్నతమైన స్వమానము అనే స్మృతి యొక్క సీట్ పై స్థితులై యోగాన్ని జ్వాలా రూపముగా చేసినట్లయితే ఏ విఘ్నమైనా ఎదురుగా కూడా రాలేదు.