05-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు ఎవరినైతే ఈ రోజు వరకు మహిమ
చేస్తూ వచ్చారో, వారే ఇప్పుడు మీ ముందు హాజరై ఉన్నారు, అందుకే సదా సంతోషములో నాట్యము
చేస్తూ ఉండండి, ఏ విషయానికి సంబంధించిన దుఃఖము ఉండకూడదు’’
ప్రశ్న:-
పురుషార్థీ
పిల్లలు తమ హృదయములో ఏ చెకింగ్ ను తప్పకుండా చేసుకుంటారు?
జవాబు:-
ఇప్పటివరకు
ఆత్మనైన నాలో చిన్న-చిన్న ముళ్ళు ఏవీ లేవు కదా? కామమనే ముల్లు అన్నింటికంటే
తీవ్రమైనది. క్రోధమనే ముల్లు కూడా చాలా చెడ్డది. దేవతలెప్పుడూ క్రోధితులు అవ్వరు.
అందుకే మధురమైన పిల్లలూ, ఏదైనా ముల్లు ఉంటే, దానిని తొలగించి వేయండి. మిమ్మల్ని మీరు
నష్టపరచుకోకండి.
పాట:-
నీవే తల్లివి,
తండ్రివి...
ఓంశాంతి
మధురాతి
మధురమైన ఆత్మిక పిల్లలు తమ తండ్రి మహిమను విన్నారు. వారు పాడుతూ ఉంటారు, ఇక్కడ మీరు
ప్రాక్టికల్ గా ఆ బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. బాబా మన ద్వారా భారత్
ను స్వర్గముగా తయారుచేస్తున్నారని మీకు తెలుసు. ఎవరి ద్వారానైతే తయారుచేస్తున్నారో,
తప్పకుండా వారే సుఖధామానికి యజమానులుగా అవుతారు. పిల్లలకైతే చాలా సంతోషముండాలి. బాబా
మహిమ అపారమైనది, వారి నుండి మనము వారసత్వాన్ని పొందుతున్నాము. ఇప్పుడు పిల్లలైన మీపై
మాత్రమే కాదు, మొత్తం ప్రపంచముపై బృహస్పతి దశ ఉంది. ఇప్పుడు ఈ విషయము బ్రాహ్మణులైన
మీకు మాత్రమే తెలుసు. ముఖ్యముగా భారత్ మరియు మిగతా ప్రపంచమంతటిపైనా, అందరిపైనా
బృహస్పతి దశ కూర్చుని ఉంది, ఎందుకంటే ఇప్పుడు 16 కళల సంపూర్ణులుగా అవుతారు. ఈ
సమయములో ఏ కళ లేదు. పిల్లలకు చాలా సంతోషముండాలి. అలాగని ఇక్కడ సంతోషముండి, బయటకు
వెళ్ళగానే అది మాయమైపోవడము కాదు. ఎవరి మహిమనైతే పాడుతూ ఉంటారో, వారిప్పుడు మీ వద్ద
హాజరై ఉన్నారు. బాబా అర్థం చేయిస్తున్నారు - 5 వేల సంవత్సరాల క్రితం కూడా రాజ్యము
ఇచ్చి వెళ్ళాను. ఇప్పుడు మెల్లమెల్లగా అందరూ పిలవడాన్ని మీరు చూస్తారు. మీ స్లోగన్లు
కూడా వెలువడుతూ ఉంటాయి. ఉదాహరణకు - ఒకే ధర్మముండాలి, ఒకే రాజ్యముండాలి, ఒకే భాష
ఉండాలి అని కొందరు అంటారు. ఆత్మలే అలా అంటారు కదా. తప్పకుండా భారత్ లో దేవీ-దేవతల
రాజధాని ఒకటే ఉండేదని ఆత్మకు తెలుసు. ఈ సుగంధము వ్యాపిస్తూ ఉంటుంది. మీరు ఈ
సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటారు. డ్రామా ప్లాన్ అనుసారంగా యుద్ధానికి సంబంధించిన
గుర్తులు కూడా ఎదురుగా నిలబడి ఉన్నాయి. ఇది కొత్త విషయమేమీ కాదు. భారత్ 16 కళల
సంపూర్ణముగా తప్పకుండా తయారవ్వాలి. మనము ఈ యోగబలముతో 16 కళల సంపూర్ణులుగా
అవుతున్నామని మీకు తెలుసు. దానమిస్తే గ్రహణము తొలగుతుందని అంటారు కదా. తండ్రి కూడా
- వికారాలను, అవగుణాలను దానమివ్వండి అని చెప్తారు. ఇది రావణ రాజ్యము కదా. తండ్రి
వచ్చి దీని నుండి విడిపిస్తారు, ఇందులో కూడా కామ వికారము చాలా పెద్ద అవగుణము. మీరు
దేహాభిమానులుగా అయిపోయారు. ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వాలి. శరీర భానాన్ని కూడా
వదలాల్సి ఉంటుంది. ఈ విషయాలను పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు, ఇవి
ప్రపంచానికి తెలియవు. భారత్ 16 కళల సంపూర్ణముగా ఉండేది, అక్కడ సంపూర్ణ దేవతల
రాజ్యముండేది. ఈ లక్ష్మీ-నారాయణుల రాజధాని ఉండేది. భారత్ స్వర్గముగా ఉండేది. ఇప్పుడు
5 వికారాల గ్రహణము పట్టి ఉంది, అందుకే తండ్రి అంటారు - దానమిస్తే గ్రహణము తొలగుతుంది.
ఈ కామ వికారమే కింద పడేస్తుంది, అందుకే తండ్రి అంటారు, దీనిని దానమిచ్చినట్లయితే 16
కళల సంపన్నులుగా అవుతారు. దానమివ్వకపోతే అవ్వరు. ఆత్మలకు తమ-తమ పాత్రలు లభించి
ఉన్నాయి కదా. ఇది కూడా మీ బుద్ధిలో ఉంది కదా. ఆత్మ అయిన మీలో ఎంత పాత్ర ఉంది. మీరు
విశ్వ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు. ఇది అనంతమైన డ్రామా, ఇందులో చాలామంది
పాత్రధారులు ఉన్నారు. ఇందులో ఫస్ట్ క్లాస్ పాత్రధారులు ఈ లక్ష్మీ-నారాయణులు, వారిది
నంబర్ వన్ పాత్ర. విష్ణువే బ్రహ్మా-సరస్వతులుగా, మళ్ళీ బ్రహ్మా-సరస్వతులే విష్ణువుగా
అవుతారు. వీరు 84 జన్మల చక్రములో ఎలా తిరుగుతారో, అదంతా మీ బుద్ధిలోకి వచ్చేస్తుంది.
వ్యాపారస్థులు ఖాతా పుస్తకాలు పెట్టినప్పుడు, దానిపై స్వస్తిక్ గుర్తును వేస్తారు.
గణేశుడిని పూజ చేస్తారు. ఇది అనంతమైన ఖాతా. స్వస్తిక్ లో 4 భాగాలుంటాయి. పూరీలో
కుండలో అన్నం వండుతారు. అది ఉడికిన తర్వాత 4 భాగాలుగా అవుతుంది. అక్కడ అన్నమే భోగ్
గా పెడతారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు? అతి ప్రియమైన తండ్రి
వచ్చి మీకు సేవకునిగా అయ్యారు, మీ సేవ చేస్తారు. మనుష్యులైతే ఆత్మ నిర్లేపి అని
అంటారు. ఆత్మలో 84 జన్మల పాత్ర ఉందని ఇప్పుడు మీకు తెలుసు. మరి ఆత్మను నిర్లేపి అంటే
రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా అవుతుంది. ఇదంతా ఎవరైనా ఒక నెల, ఒకటిన్నర నెల కూర్చుని
మంచి రీతిలో అర్థం చేసుకున్నట్లయితే, అప్పుడు పాయింట్లు బుద్ధిలో కూర్చుంటాయి.
రోజురోజుకు చాలా పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. ఇది కస్తూరి వంటిది. శాస్త్రాలలోనైతే
సారమేమీ లేదు. బాబా అంటారు - ఇప్పుడు వాటిని బుద్ధి నుండి తొలగించండి.
జ్ఞానసాగరుడిని నేనొక్కడినే. పూర్తి నిశ్చయము ఏర్పడినప్పుడు - వాస్తవానికి ఇవన్నీ
భక్తి మార్గం కోసమని అర్థం చేసుకుంటారు. పరమపిత పరమాత్మయే వచ్చి దుర్గతి నుండి
సద్గతిని కలిగిస్తారు. మెట్ల వరుస చిత్రములో కూడా స్పష్టముగా చూపించాలి. భక్తి
మార్గము ప్రారంభమైనప్పుడు రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. ఇప్పుడు గీతా అధ్యాయము
రిపీట్ అవుతూ ఉంది. తండ్రి అంటారు - నేను కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమయుగములో
వస్తాను. వారు కూర్మావతారము, మత్స్యావతారము అని అన్నారు. 24 అవతారాలని అంటారు. బాబా
అంటారు - ఇప్పుడు మీ పై బృహస్పతి దశ ఉంది. నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా
తయారుచేసాను. ఇప్పుడు రావణుడు మీపై రాహు దశను కూర్చోబెట్టాడు. ఇప్పుడు మళ్ళీ తండ్రి
స్వర్గానికి యజమానులుగా చేయడానికి వచ్చారు. కనుక మిమ్మల్ని మీరు నష్టపరచుకోకూడదు.
వ్యాపారస్థులు తమ ఖాతాను ఎప్పుడూ సరిగ్గా ఉంచుకుంటారు. నష్టపరచుకునే వారిని
బుద్ధిహీనులని అంటారు. ఇప్పుడు వీరు అందరికంటే పెద్ద వ్యాపారి. ఎవరో అరుదుగా ఈ
వ్యాపారాన్ని చేస్తారు. ఇదే అవినాశీ వ్యాపారము, మిగిలిన వ్యాపారాలన్నీ మట్టిలో
కలిసిపోనున్నాయి. ఇప్పుడు మీ సత్యమైన వ్యాపారము జరుగుతుంది. తండ్రి అనంతమైన
వ్యాపారస్థుడు, రత్నాకరుడు... మరియు జ్ఞానసాగరుడని పిలవబడతారు. ప్రదర్శనీలకు ఎంతమంది
వస్తారో చూడండి. సెంటర్ కు ఎవరో కష్టం మీద వస్తారు. భారత్ అయితే చాలా విస్తారమైనది
కదా. మీరు అన్ని చోట్లకు వెళ్ళాలి. నీటి గంగలైతే మొత్తం భారత్ అంతటా లేవు. నీటి గంగ
పతిత-పావని కాదు అని కూడా మీరు అర్థం చేయించాల్సి ఉంటుంది. జ్ఞాన గంగలైన మీరు
వెళ్ళాల్సి ఉంటుంది. నలువైపులా ప్రదర్శనీలు, మేళాలు నిర్వహిస్తూ ఉంటారు. రోజురోజుకు
చిత్రాలు కూడా మంచి-మంచివి తయారవుతూ ఉంటాయి. శోభాయమానమైన చిత్రాలు ఎలా ఉండాలంటే -
వాటిని చూడగానే, వీరు సత్యమే తెలియజేస్తున్నారని సంతోషము కలగాలి. ఇప్పుడు
లక్ష్మీ-నారాయణుల రాజధాని స్థాపనవుతూ ఉంది. ఇప్పుడు బ్రాహ్మణ ధర్మము స్థాపనవుతూ ఉంది.
ఈ బ్రాహ్మణులే దేవీ-దేవతలు అవుతారు.
మీరు ఇప్పుడు
పురుషార్థము చేస్తున్నారు కనుక హృదయములో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - నాలో
చిన్న-చిన్న ముళ్ళు ఏవీ లేవు కదా! కామమనే ముల్లు లేదు కదా! క్రోధమనే చిన్న ముల్లు
కూడా చాలా చెడ్డది. దేవతలు ఎప్పుడూ క్రోధితులు అవ్వరు. శంకరుడి నేత్రము తెరుచుకోగానే
వినాశనమవుతుందన్నట్లు చూపిస్తారు. ఇది కూడా ఒక కళంకమే. వినాశనమైతే జరిగేదే ఉంది.
సూక్ష్మవతనములో శంకరునికి సర్పాలు మొదలైనవేవీ ఉండవు. సర్పాలు మొదలైనవి రావడానికి
అసలు అక్కడ భూమి ఎక్కడ ఉంది. ఆకాశములో సర్పాలు విహరించవు. సూక్ష్మవతనము మరియు
మూలవతనములో తోటలు, ఉద్యానవనాలు, సర్పాలు మొదలైనవేవీ ఉండవు. అవన్నీ ఇక్కడ ఉంటాయి.
స్వర్గము కూడా ఇక్కడే ఉంటుంది. ఈ సమయములో మనుష్యులు ముళ్ళ వలె ఉన్నారు, అందుకే
దీనిని ముళ్ళ అడవి అని అంటారు. సత్యయుగము పుష్పాల తోట. బాబా తోటను ఎలా తయారుచేస్తారు
అనేది మీరు చూస్తారు. చాలా సుందరముగా తయారుచేస్తారు. అందరినీ సుందరమైనవారిగా
తయారుచేస్తారు. వారు సదా సుందరముగా ఉంటారు. ప్రేయసులందరినీ అనగా పిల్లలను సుందరముగా
తయారుచేస్తారు. రావణుడు పూర్తిగా నల్లగా తయారుచేసాడు. మనపై బృహస్పతి దశ కూర్చుని
ఉందని ఇప్పుడు పిల్లలైన మీకు సంతోషముండాలి. అర్ధ సమయము దుఃఖముండి, అర్ధ సమయము
సుఖముంటే, దాని వలన లాభమేముంది? అలా కాదు, 3 వంతులు సుఖముంటుంది. ఈ డ్రామా తయారై
ఉంది. డ్రామాను ఇలా ఎందుకు తయారుచేసారని చాలామంది అడుగుతారు. అరే, ఇది అనాది డ్రామా
కదా. ఇది ఎందుకు తయారయ్యింది అన్న ప్రశ్నే తలెత్తదు. ఇది అనాది, అవినాశీ, తయారై
తయారుచేయబడిన డ్రామా. ఈ సృష్టి నాటకము తయారై సిద్ధముగా ఉన్నది, అదే ఇప్పుడు
జరుగుతుంది, ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు... ఎవ్వరికీ మోక్షము లభించదు. ఈ
సృష్టి అనాదిగా నడుస్తూ వస్తుంది, ఇది నడుస్తూనే ఉంటుంది. ప్రళయము జరగదు. బాబా
కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తారు కానీ దానికి ఎంత అవకాశముంది. మనుష్యులు పతితులుగా,
దుఃఖితులుగా అయినప్పుడే పిలుస్తారు. బాబా వచ్చి అందరి శరీరాలను కల్పవృక్ష సమానముగా
తయారుచేస్తారు. ఆత్మ అయిన మీరు పవిత్రముగా అయితే శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది.
తండ్రి మీ శరీరాన్ని కల్పతరువుగా తయారుచేస్తారు. అర్ధకల్పము మీకు ఎప్పుడూ అకాల
మృత్యువు సంభవించదు. మీరు కాలుడిపై విజయము పొందుతారు. పిల్లలైన మీరు చాలా
పురుషార్థము చేయాలి. ఎంత ఉన్నత పదవిని పొందితే అంత మంచిది. పురుషార్థమైతే ప్రతి
ఒక్కరు ఎక్కువ సంపాదన కోసమని చేస్తారు. కట్టెలు కొట్టేవారు కూడా - మేము ఎక్కువ
కట్టెలు తీసుకువెళ్తే ఎక్కువ సంపాదన జరుగుతుందని అంటారు. కొందరైతే మోసం చేసి కూడా
సంపాదిస్తారు. అక్కడ ఇలా దుఃఖానికి సంబంధించిన విషయమేమీ ఉండదు. ఇప్పుడు మీరు తండ్రి
నుండి ఎంత వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మేము స్వర్గానికి వెళ్ళేందుకు యోగ్యులుగా
ఉన్నామా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. (నారదుని ఉదాహరణ) శాస్త్రాలలోనైతే చాలా
విషయాలు వ్రాశారు. ఈ తీర్థయాత్రలు మొదలైనవన్నీ విడిచిపెట్టండి. పాట కూడా ఉంది కదా -
నలువైపులా తిరిగి వచ్చాము, అయినా కానీ నిత్యం దూరంగానే ఉన్నాము... ఇప్పుడు తండ్రి
మీకు ఎంత మంచి యాత్రను నేర్పిస్తారు, ఇందులో ఏ కష్టము లేదు. తండ్రి కేవలం ఇలా అంటారు
- నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. మీకు చాలా మంచి యుక్తిని
వినిపిస్తాను. పిల్లలూ, వింటున్నారా! ఇది నేను అప్పుగా తీసుకున్న రథము. ఈ తండ్రికి
(బ్రహ్మాకు) ఎంత సంతోషము కలుగుతుంది - నేను తండ్రికి నా శరీరాన్ని అప్పుగా ఇచ్చాను,
తండ్రి నన్ను విశ్వానికి యజమానిగా చేస్తారు అని. పేరు కూడా భగీరథుడు. మీకు తెలుసు -
బాంబులు మొదలైనవి తయారవుతూ ఉన్నాయి, నిప్పు అంటుకోనున్నది. అంతం చేయడానికి రావణుడి
దిష్టిబొమ్మను కూడా తయారుచేస్తారు. కానీ ఇక్కడ అలా హతమార్చే విషయమేమీ లేదు.
రావణుడిని హతమార్చే విషయమెక్కడ, ఈ రావణపురి సమాప్తమయ్యే విషయమెక్కడ. పిల్లలైన మీరు
రామపురిలోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నారు. కావున పూర్తి పురుషార్థము చేయాలి,
ముల్లుగా అవ్వకూడదు.
మీరు
బ్రాహ్మణ-బ్రాహ్మణీలు. అంతా మురళీపై ఆధారపడి ఉంటుంది. మీకు మురళీ లభించకపోతే మీరేమి
చేస్తారు. ఒక్క బ్రాహ్మణి మాత్రమే మురళీని వినిపించాలని కాదు, ఎవరైనా మురళీని చదివి
వినిపించవచ్చు. ఈ రోజు మీరు వినిపించండి అని చెప్పాలి. ఇప్పుడు అర్థం చేయించేందుకు
చిత్రాలు కూడా చాలా చక్కగా తయారయ్యాయి. ఈ ముఖ్యమైన చిత్రాలను మీ దుకాణములో
పెట్టుకుని అనేకుల కళ్యాణము చేయండి. ఆ వ్యాపారముతో పాటు ఈ వ్యాపారాన్ని కూడా చేయండి.
ఇది బాబా యొక్క అవినాశీ జ్ఞాన రత్నాల దుకాణము. ఇళ్ళు మొదలైనవి కట్టుకోకండి అని బాబా
ఏమీ అనరు. కట్టుకుంటే కట్టుకోండి. ధనమైతే మట్టిలో కలిసిపోతుంది. దాని కన్నా ఇల్లు
కట్టుకుని ప్రశాంతముగా ఎందుకు ఉండకూడదు. ధనాన్ని కార్యములో వినియోగించాలి. ఇల్లు
కూడా కట్టుకోండి, తినడానికి కూడా పెట్టుకోండి, దాన-పుణ్యాలు కూడా చేయండి. కాశ్మీరు
రాజు మరణించినప్పుడు తమ వ్యక్తిగత ఆస్తి ఏదైతే ఉందో, దానినంతా ఆర్య సమాజము వారికి
దానముగా ఇచ్చి వెళ్ళారు. తమ ధర్మము కోసం చేసుకుంటారు కదా. ఇక్కడైతే అలాంటి విషయమేమీ
లేదు. అందరూ పిల్లలే. దానము మొదలైనవాటి విషయమేమీ లేదు. అది హద్దు దానము. నేనైతే మీకు
విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తాను. డ్రామానుసారముగా భారతవాసులే రాజ్య భాగ్యాన్ని
తీసుకుంటారు. భక్తి మార్గములో వ్యాపారస్థులు ధర్మార్థము ఎంతోకొంత తప్పకుండా పక్కకు
తీస్తారు. దానికి ప్రతిఫలముగా కూడా మరుసటి జన్మలో అల్పకాలికముగా లభిస్తుంది.
ఇప్పుడైతే నేను డైరెక్టుగా వచ్చాను కనుక మీరు ఈ కార్యములో వినియోగించండి. నాకైతే ఏమీ
వద్దు. శివబాబా తమ కోసం ఏమైనా ఇల్లు కట్టుకోవాలా ఏమిటి! ఇదంతా బ్రాహ్మణులది. పేదవారు,
షావుకారులు అందరూ కలిసి ఉంటారు. కనుక ఇదంతా పిల్లలదే. తమ ఇళ్ళలో వారు ఎంత సుఖముగా
ఉంటారు అనేది చూసి ఆ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది, అందుకే అందరినీ బాగా చూసుకోండి అని
అంటారు. ఏదైనా వస్తువు లేదు అంటే అది లభించగలదు. తండ్రికి పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది.
ఇంతటి ప్రేమ ఇంకెవ్వరికీ ఉండదు. పిల్లలకు ఎంతగా అర్థం చేయిస్తారు - పురుషార్థము
చేయండి, ఇతరుల కోసం కూడా యుక్తులను రచించండి. దీని కోసం కేవలం మూడు అడుగుల నేల
కావాలి, అందులో కుమార్తెలు అర్థం చేయిస్తూ ఉండాలి. ఎవరైనా గొప్ప వ్యక్తుల హాలు ఉంటే
ఇలా చెప్పండి - మేము అవసరమైన చిత్రాలను పెడతాము, ఒకటి రెండు గంటలు ఉదయము, సాయంత్రము
క్లాస్ చేసి వెళ్ళిపోతాము, ఖర్చంతా మాదే, పేరు మీది, చాలామంది వచ్చి గవ్వ నుండి
వజ్ర సమానముగా తయారవుతారు. అచ్ఛా!
మధురాతి
మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. అవినాశీ తండ్రితో సత్యాతి-సత్యమైన అవినాశీ వ్యాపారము చేయాలి. ఆ వ్యాపారముతో
పాటు ఈ వ్యాపారానికి కూడా సమయము ఇవ్వాలి. జ్ఞాన గంగలుగా అయి అందరినీ పావనముగా
తయారుచేయాలి.
2. బ్రాహ్మణ జీవితానికి ఆధారము ‘మురళి’, దానిని ప్రేమగా వినాలి మరియు వినిపించాలి.
లోపల ఏదైనా ముల్లు ఉంటే దానిని తొలగించి వేయాలి. అవగుణాలను దానమివ్వాలి.
వరదానము:-
దయా హృదయ భావన ద్వారా అపకారులపై కూడా ఉపకారము చేసే శుభ చింతక
భవ
ఎవరు ఎటువంటి ఆత్మ అయినా కానీ, సతోగుణీ కావచ్చు, తమోగుణీ
కావచ్చు, ఎవరు సంపర్కములోకి వచ్చినా కానీ అందరి పట్ల శుభ చింతకులుగా అనగా అపకారులపై
కూడా ఉపకారము చేసేవారిగా అవ్వండి. ఎప్పుడూ ఏ ఆత్మ పట్ల ద్వేష దృష్టి ఉండకూడదు
ఎందుకంటే వారు అజ్ఞానానికి వశమై ఉన్నారని, అవివేకులుగా ఉన్నారని మీకు తెలుసు. వారిపై
దయ, జాలి, స్నేహము కలగాలి, ద్వేషము కాదు. శుభ చింతక ఆత్మ - వారిలా ఎందుకు చేసారని
ఆలోచించదు, వారి కళ్యాణము ఎలా జరగాలి అని ఆలోచిస్తుంది, ఇదే శుభ చింతక స్థితి.
స్లోగన్:-
తపస్యా బలముతో
అసంభవాన్ని సంభవము చేసి సఫలతామూర్తులుగా అవ్వండి.
అవ్యక్త ప్రేరణలు -
పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి
మీరు త్రికాలదర్శులైన
కారణముగా ఆత్మ యొక్క సంపూర్ణ సహయోగాన్ని ఎదురుగా పెట్టుకుని, ప్రతి ఆత్మ యొక్క
బలహీనతను పరిశీలించేటప్పుడు వారి బలహీనతను స్వయంలో ధారణ చెయ్యరు, వర్ణించరు. మీరు
ఇతరాత్మల బలహీనత అనే ముల్లును కళ్యాణకారీ స్వరూపము ద్వారా సమాప్తము చేస్తారు.
ముల్లుకు బదులుగా - ముల్లును కూడా పుష్పముగా చేస్తారు.