06-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోండి - మేము చాలా-చాలా మధురముగా అవ్వాలి, అందరినీ సుఖమయమైన, ప్రేమపూర్వకమైన దృష్టితో చూడాలి, ఎవరి నామ-రూపాలలోనూ చిక్కుకోకూడదు’’

ప్రశ్న:-
యోగము ద్వారా కలిగేటువంటి సిద్ధి ఏమిటి? పక్కా యోగుల గుర్తు ఏమిటి?

జవాబు:-
కర్మేంద్రియాలన్నీ పూర్తిగా శాంతిగా, శీతలముగా అయిపోవాలి - ఇదే యోగము ద్వారా కలిగేటువంటి సిద్ధి. పక్కా యోగీ పిల్లలు ఎవరంటే - వారి కర్మేంద్రియాలు కొద్దిగా కూడా చంచలమవ్వవు, కొద్దిగా కూడా ఏ దేహధారి పట్ల వారి దృష్టి వెళ్ళదు. మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు యువత కారు, ఇది మీ వానప్రస్థ అవస్థ.

పాట:-
మేలుకోండి ప్రేయసులారా మేలుకోండి...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. దీని అర్థం గురించి మనసులో విచార సాగర మంథనము చేయాలి మరియు సంతోషపడాలి, ఎందుకంటే ఇవి కొత్త ప్రపంచము కోసం కొత్త విషయాలు. ఈ కొత్త విషయాలను ఇప్పుడు వినాలి. కొత్త ప్రపంచాన్ని మనుష్యులెవరూ స్థాపన చేయలేరని ఇప్పుడు పిల్లలకు తెలుసు. మీరు ఈ విషయాలను విన్నప్పుడు, ఇవి 5 వేల సంవత్సరాల క్రితం నాటి పాత విషయాలని, వాటినే మళ్ళీ కొత్తగా వినిపించడము జరుగుతుందని అర్థం చేసుకుంటారు. అంటే పాతవి కొత్తగా, కొత్తవి పాతగా అయిపోతాయి. ఇప్పుడు మీకు తెలుసు - 5 వేల సంవత్సరాల క్రితం నాటి ఆ విషయాలనే బాబా కొత్తగా వినిపిస్తారు. విషయాలు అవే. వాటిని ఎందుకు వినిపిస్తారు? కొత్త ప్రపంచ వారసత్వాన్ని పొందేందుకు. ఇందులో జ్ఞాన డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. భక్తిలో కూడా చాలా డ్యాన్స్ చేస్తారు. నలువైపులా తిరుగుతూ డ్యాన్స్ చేస్తారు. జ్ఞాన డ్యాన్స్ అయితే చాలా సహజమైనది. ఆ డ్యాన్స్ లోనైతే కర్మేంద్రియాలను చాలా ఉపయోగిస్తారు, శ్రమించాల్సి ఉంటుంది. ఇక్కడైతే, కేవలం లోలోపల జ్ఞాన డ్యాన్స్ నడుస్తుంది. సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది - ఈ జ్ఞానము బుద్ధిలో ఉంది. ఇందులో ఎటువంటి శ్రమ లేదు. అయితే, ఇక్కడ స్మృతిలో శ్రమ అనిపిస్తుంది. కొంతమంది పిల్లలు ఫెయిల్ అయిపోతారు, ఎక్కడో ఒక చోట పడిపోతారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయము ఏమిటంటే - నామ-రూపాలలో చిక్కుకోకూడదు. స్త్రీ-పురుషులు కామానికి వశులై నామ-రూపాలలో చిక్కుకుంటారు కదా. క్రోధము నామ-రూపాలలో చిక్కుకునేలా చేయదు. మొట్టమొదటి వికారము ఇదే, దీని నుండి చాలా సంబాళించుకోవాలి, ఎవరి నామ-రూపాలలోనూ చిక్కుకోకూడదు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మనైన నేను అశరీరిగా వచ్చాను, ఇప్పుడు అశరీరిగా అయ్యి వెళ్ళాలి. ఈ శరీర భానాన్ని తెంచివేయాలి. నామ-రూపాలలో చిక్కుకోవడమనేది చాలా చెడ్డ రోగము. తండ్రి పిల్లలకు అటెన్షన్ ఇప్పిస్తున్నారు. కొంతమంది ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. నీవు నామ-రూపాలలో చిక్కుకున్నావని బాబా నన్ను అనవసరంగా అంటున్నారని అంటారు. కానీ ఇది గుప్తమైన రోగము, అందుకే ప్రియుడు ప్రేయసులను మరియు తండ్రి పిల్లలను మేలుకొలుపుతారు - పిల్లలూ మేలుకోండి, ఇప్పుడు మళ్ళీ కలియుగము తర్వాత సత్యయుగము రానున్నది. తండ్రి జ్యోతిని వెలిగించేందుకు వస్తారు. మనుష్యులు మరణించినప్పుడు వారి కోసం జ్యోతిని వెలిగిస్తారు. ఆ తర్వాత, ఆ దీపము ఆరిపోకూడదని, ఆత్మకు అంధకారము ఏర్పడకూడదని దానిని సంబాళిస్తారు. వాస్తవానికి ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు. ఆత్మ అయితే సెకండులో వెళ్ళిపోతుంది. కొంతమంది జ్యోతిని కూడా భగవంతునిగా భావిస్తారు. బ్రహ్మ తత్వాన్ని ఒక పెద్ద జ్యోతిగా భావిస్తారు. బ్రహ్మ సమాజము వారి మందిరాలు ఉంటాయి, అక్కడ రాత్రింబవళ్ళు జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఎంత ఖర్చు అవుతుంది. నూనె వ్యర్థముగా పోతుంది. ఇక్కడ అవేవీ వేయాల్సిన అవసరము లేదు. స్మృతి నూనె వలె పని చేస్తుంది. ఇది స్మృతి రూపీ నూనె. మధురాతి మధురమైన పిల్లలు ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. ఇది కొత్త విషయమైన కారణముగానే గొడవలు జరుగుతాయి. తండ్రి అంటారు - నేను మధురమైన పిల్లల వద్దకు వస్తాను. నేను భారత్ లోనే వస్తాను. అందరికీ తమ జన్మభూమి ప్రియమనిపిస్తుంది కదా. తండ్రికైతే అందరూ ప్రియమనిపిస్తారు. కానీ ఎంతైనా నేను నా భారత దేశములోనే వస్తాను. గీతలో ఒకవేళ శ్రీకృష్ణుని పేరు లేకపోయి ఉంటే మనుష్యమాత్రులందరూ శివబాబాను నమ్మేవారు. శివుని మందిరాలకు ఎంతమంది వెళ్తారు. సోమనాథ మందిరము అన్నింటికంటే పెద్దదిగా ఉండేది. ఇప్పుడైతే లెక్కలేనన్ని మందిరాలు నిర్మించబడ్డాయి. అనంతమైన తండ్రిని నమ్మినంతగా శ్రీకృష్ణుడిని నమ్మరు. ఈ సమయములో మీకు బాబా వంటి ప్రియమైన వస్తువు ఇంకేదీ లేదు. ఇందులో సాకారుని మహిమ ఏమీ లేదు. ఇది నిరాకారుడి మహిమ, వారు అభోక్త. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత అయినప్పుడు వారి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునే పురుషార్థము చేయాలి కదా.

ఈ రోజు, రేపు అని అంటూ-అంటూ మృత్యువు కబళిస్తుంది. ఇప్పుడింకా కొద్ది సమయమే మిగిలి ఉంది. తండ్రి నుండి వారసత్వాన్ని అయితే తీసుకోండి. ప్రశ్నావళి నింపే సమయములో అర్థం చేయించాలి కూడా - వారు అనంతమైన తండ్రి అని మీకు నిశ్చయము ఏర్పడినప్పుడు, మరి ఆ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే పురుషార్థము చేయండి అని. లేదంటే, బయటకు వెళ్ళగానే వెంటనే మర్చిపోతారు. తండ్రి అయితే కళ్యాణకారి కదా. తండ్రి అంటారు, ఈ యోగము ద్వారానే మీ దుఃఖాలన్నీ 21 జన్మల కోసం దూరమవ్వనున్నాయి. కుమార్తెలు ఇళ్ళల్లో కూడా ఏమని అర్థం చేయిస్తూ ఉండాలంటే - ఇప్పుడు దుఃఖాలన్నింటినీ దూరం చేసే అనంతమైన తండ్రిని స్మృతి చేయడము ద్వారానే తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతాము అని. పవిత్రముగా అయితే తప్పకుండా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయము పవిత్రతకు సంబంధించినది. ఎంత ఎక్కువగా స్మృతిలో ఉంటారో, అంతగా ఇంద్రియాలు కూడా శాంతిగా అయిపోతాయి. ఎప్పటివరకైతే యోగము యొక్క సిద్ధి పూర్తిగా లభించదో, అప్పటివరకు ఇంద్రియాలు కూడా శాంతిగా అవ్వవు. కామ వికారము నన్నేమీ మోసం చేయడము లేదు కదా అని ప్రతి ఒక్కరూ తమను తాము చెక్ చేసుకోవాలి. ఒకవేళ నేను పక్కా యోగిని అయినట్లయితే, ఎటువంటి చంచలత ఉండకూడదు. ఇది వానప్రస్థ అవస్థ వంటిది - తండ్రినే స్మృతి చేస్తూ ఉండాలి. తండ్రి పిల్లలందరికీ అర్థం చేయిస్తారు. మీరు మంచి యోగిగా తయారైనప్పుడు, మీ దృష్టి ఎటువైపుకు వెళ్ళదు, మీ ఇంద్రియాలు శాంతిగా అయిపోతాయి. ముఖ్యమైనవి ఈ కనులే, ఇవే అందరినీ మోసగిస్తూ ఉంటాయి. యోగములో మంచి అవస్థ తయారైనప్పుడు - మేము యవ్వనములోనే వానప్రస్థ అవస్థలోకి వచ్చేసాము అన్నట్లుగా అనుభవమవుతుంది. తండ్రి అంటారు - కామము మహాశత్రువు. కనుక స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఎంతగా స్మృతిలో ఉంటారో, అంతగా కర్మేంద్రియాలు శాంతిగా అయిపోతాయి మరియు చాలా మధుర స్వభావము కలవారిగా అయిపోతారు. ఇంతకుముందు నేను ఎంత చేదుగా ఉండేవాడిని, ఇప్పుడు ఎంత మధురముగా అయ్యాను అనేది ఫీల్ అవుతారు. బాబా ప్రేమ సాగరుడు కదా, కనుక పిల్లలు కూడా అలా తయారవ్వాలి. కనుక తండ్రి అంటారు, అందరి పట్ల ప్రేమపూర్వకమైన దృష్టి ఉండాలి. ఒకవేళ ఎవరికైనా దుఃఖము ఇచ్చినట్లయితే దుఃఖితులై మరణిస్తారు, అందుకే చాలా మధురముగా తయారవ్వాలి.

తండ్రి అంటారు - నేను రూప్ బసంత్ ను కదా. తండ్రి నుండి ఎన్ని అమూల్యమైన జ్ఞాన రత్నాలు లభిస్తాయి. వాటితో మీరు జోలిని నింపుకుంటారు. ఆ మనుష్యులేమో శంకరుని ఎదురుగా వెళ్ళి జోలిని నింపండి అని అడుగుతారు. శంకరుడు జోలిని నింపేవారు కాదని వారికి తెలియదు. జ్ఞానసాగరుడైన బాబా జ్ఞాన రత్నాలతో పిల్లలైన మన జోలిని నింపుతారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మీరు కూడా రూప్ బసంత్ లు. ప్రతి ఒక్కరి ఆత్మ రూప్ బసంత్. స్వయాన్ని చూసుకుంటూ ఉండండి - నేను ఎంతగా జ్ఞాన రత్నాలను ధారణ చేసి జ్ఞాన డాన్స్ ను చేస్తున్నాను అనగా ఎంతగా రత్నాలను దానము చేస్తున్నాను. అన్నింటికన్నా మంచి రత్నము - మన్మనాభవ. తండ్రిని స్మృతి చేసినట్లయితే తండ్రి వారసత్వాన్ని పొందుతారు. ఎలాగైతే బాబాలో జ్ఞానము నిండి ఉందో, అలా తండ్రి కూర్చుని పిల్లలను తమ సమానముగా తయారుచేస్తారు. గురువులు కూడా తమ సమానముగా తయారుచేస్తారు. వీరు అనంతమైన తండ్రి, వీరి రూపము బిందువు, మీ రూపము కూడా బిందువే. వారు మిమ్మల్ని తమ సమానముగా జ్ఞాన సాగరునిగా తయారుచేస్తారు. మీరు ఎంతగా ధారణ చేస్తారో, చేయిస్తారో... అంతగా ఉన్నత పదవి లభిస్తుందని భావించవచ్చు. అనేకుల కళ్యాణకారిగా అయినట్లయితే అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి. తండ్రి కూడా రోజూ సేవ చేస్తారు కదా. ఈ గుల్జార్ బచ్చీ, ఎంత మధురముగా అర్థం చేయిస్తారు. అందరికీ బాగా అనిపిస్తుంది. మాకు ఇటువంటి బ్రాహ్మణి (టీచర్ అక్కయ్య) లభించాలని మనసుకు అనిపిస్తుంది. ఇప్పుడు ఒకే బ్రాహ్మణి అన్ని చోట్లకు వెళ్ళలేరు. అయినా తండ్రి అంటారు - ఎవరైతే తాము బాగా అర్థం చేయిస్తారని అనుకుంటారో, వారు ఆల్రౌండ్ సేవ చేయాలి. నేను సెంటర్లు తిరిగి రావాలి అని తమంతట తమకే అభిరుచి ఉండాలి. నేను అనేకుల కళ్యాణము చేయగలను, నా నుండి మంచి సుగంధము వెలువడుతుంది అని ఎవరెవరైతే భావిస్తారో, వారికి అభిరుచి ఉండాలి. నేను 10-15 రోజులు వెళ్ళి సెంటర్లు తిరిగి వస్తాను అని భావించాలి. ఒకరిని చూసి ఇతరులు కూడా నేర్చుకుంటారు. ఎవరైతే చేస్తారో, వారు పొందుతారు. ఈ సేవ చాలా కళ్యాణకారి. మీరు మనుష్యులకు ప్రాణదానాన్ని ఇస్తారు. ఇది ఎంతో ఉత్తమోత్తమమైన కార్యము. వ్యాపారస్థులు కూడా యుక్తిగా సమయాన్ని తీసి సేవకు వెళ్ళవచ్చు. సర్వీసబుల్ గా ఉన్నవారినైతే తండ్రి ప్రేమిస్తారు కూడా, వారి పాలన కూడా చేస్తారు. ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో, వారు సేవ లేకుండా ఉండలేరు. తండ్రి సహాయము కూడా చేస్తారు కదా. పిల్లలు చాలా దయార్ద్ర హృదయులుగా అవ్వాలి. పాపం వారిది చాలా దుఃఖమయ జీవితము. మీరు ప్రాణదానాన్ని ఇస్తారు. ఎవరికైనా అవినాశీ జ్ఞాన రత్నాలను దానమివ్వడము వంటి సర్వోత్తమమైన జ్ఞాన దానము ఇంకొకటేదీ లేదు. చాలా దయార్ద్ర హృదయులుగా అవ్వాలి. బ్రాహ్మణి బలహీనముగా ఉన్న కారణముగా సేవ ఢీలా అయిపోతుంది, అందుకే మంచి టీచరు కావాలని అడుగుతారు. మీకు ఆలోచన వచ్చిన వెంటనే వెళ్ళిపోవాలి - బాబా, ఏ సెంటరు చల్లబడిపోయింది, మేము వెళ్ళి చూసి వస్తాము అని అనాలి. ప్రదర్శనీ చిత్రాలు కూడా ఉన్నాయి. చిత్రాలను చూపిస్తే ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. మేము సేవను ఎలా పెంచాలి అని ఆలోచిస్తూ ఉండాలి. తండ్రి కూడా అందరి జీవితాన్ని వజ్ర సమానముగా తయారుచేస్తారు. పిల్లలైన మీరు కూడా సేవ చేయాలి. వందేమాతరం అని అంటూ ఉంటారు కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. పతిత మనుష్యులకు లేక భూమి మొదలైనవాటికి ఎప్పుడూ నమస్కరించడం జరగదు. ఇవి పంచ తత్వాలు, వీటికేమి నమస్కరిస్తారు. ఇది పంచ తత్వాలతో తయారుచేయబడిన శరీరము కనుక శరీరాలను పూజించడము అనగా బొమ్మల పూజ చేస్తున్నట్లు. శివబాబాకైతే శరీరము లేదు. వారి పూజ అన్నింటికంటే ఉత్తమమైనది. మిగిలినవన్నీ మధ్యమమైనవి. ఈ రోజుల్లోనైతే మనుష్యులను కూడా పూజిస్తూ ఉంటారు, వారు పతితులు. మహాన్ ఆత్మలు దేవతలే. వారు సన్యాసుల కన్నా పవిత్రమైనవారు.

మనము దేవతలుగా అవుతున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి మనకు ఈ అవినాశీ జ్ఞాన రత్నాలను దానము చేయడము నేర్పిస్తారు. దీనంతటి ఉన్నతమైన దానము ఇంకొకటేదీ ఉండదు. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. శివుడు మరియు లక్ష్మీ-నారాయణుల చిత్రాలైతే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వీటిని తమ ఇళ్ళల్లో పెట్టుకున్నట్లయితే, శివబాబా మమ్మల్ని ఈ లక్ష్మీ-నారాయణుల వలె తయారుచేస్తున్నారని గుర్తుంటుంది. ఈ సమయములో మీరు అలా తయారవుతున్నారు. స్వర్గ రచయిత ఒక్క శివబాబాయే. వారు సత్యయుగములో వారసత్వాన్ని ఇవ్వరు కదా. నన్ను స్మృతి చేసినట్లయితే మీరిలా తయారవుతారు అని ఈ అంతిమ జన్మలో శివబాబా చెప్తారు. మిగిలిన విషయాలన్నింటినీ వదిలి కేవలం సేవయే సేవ చేయండి. మీరు తండ్రిని స్మృతి చేస్తున్నారు - ఇది కూడా పెద్ద సేవ చేయడమే. తత్వాలు మొదలైనవన్నీ పావనముగా అయిపోతాయి. యోగానికి చాలా భారీ మహిమ ఉంది. ప్రపంచములో యోగాశ్రమాలైతే చాలా ఉన్నాయి కానీ అవన్నీ భౌతిక హఠయోగాలు, మీది రాజయోగము. దీనితో మీ నావ తీరాన్ని చేరుతుంది. ఆ అనేక రకాల హఠయోగాలు మొదలైనవాటితో మెట్లు దిగుతూ వచ్చారు. ముఖ్యమైన విషయము - స్మృతికి సంబంధించినది. నా మనసు ఎక్కడా వికారాల వైపుకు వెళ్ళడము లేదు కదా అని చూసుకోవాలి. వికారులనే పతితులని అంటారు అనగా వారు గవ్వ సమానమైనవారు. వికారాలలోకి పడిపోవటముతో తమను తామే నష్టపర్చుకుంటారు. తండ్రి చూసినా, చూడకపోయినా కానీ, ఎవరైతే చేస్తారో వారు పొందుతారు. స్వయాన్ని చెక్ చేసుకోవాలి - నేను తండ్రి సేవను చేస్తున్నానా, నాలో ఎటువంటి అవగుణాలు లేవు కదా! ఒకవేళ ఉంటే వాటిని తొలగించుకోవాలి. స్వయము నుండి అవగుణాలను తొలగించుకునేందుకు తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు. నిర్గుణ అన్న పదము యొక్క అర్థాన్ని కూడా ఎవరూ అర్థం చేసుకోరు. వారిలో ఏ గుణాలు లేనప్పుడు, నిర్గుణ బాలకుల మండలి ఏమి చేయగలదు? అర్థం తెలియక ఏది తోస్తే అది చెప్తూ ఉంటారు. అనేక మతాలు ఉన్నాయి కదా. మీకు ఒకే మతము లభిస్తుంది. దీని ద్వారా మీకైతే అపారమైన సంతోషము కలగాలి. తండ్రి కేవలం ఇదే చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి మరియు కమల పుష్ప సమానముగా అవ్వండి, మనసా-వాచా-కర్మణా పవిత్రముగా అవ్వండి. బ్రాహ్మణులైన మనము శ్రీమతము ఆధారముగా మన తనువు-మనసు-ధనముల ద్వారానే స్వయం మరియు మొత్తం విశ్వము యొక్క సేవను చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి రావడము కూడా భారత్ లోనే వస్తారు కదా. పాండవులైన మీరు భారత్ ను స్వర్గముగా తయారుచేసే సేవను చేస్తున్నారు. మీరు మీ పని చేస్తున్నారు. చివరికి పాండవులదే విజయము. ఇందులో యుద్ధము యొక్క విషయమేమీ లేదు. మీరు డబుల్ అహింసకులు. వికారాలలోకీ వెళ్ళరు, అలాగే తుపాకులతో కాల్చరు. హింస ద్వారా ఎవరూ విశ్వముపై రాజ్యాధికారాన్ని పొందలేరు. బాబా అర్థం చేయించారు - వారిరువురూ (క్రిస్టియన్లు) ఒకవేళ పరస్పరములో కలిసిపోతే, విశ్వముపై రాజ్యము చేయగలరు. కానీ డ్రామాలో అలా లేదు. క్రిస్టియన్లే కృష్ణపురిని మింగేసారు. వాస్తవానికి భారత్ శ్రీకృష్ణుని పురిగానే ఉండేది కదా. యుద్ధము చేసి రాజ్యాధికారాన్ని తీసుకున్నారు, చాలా ధనాన్ని తీసుకువెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ధనము తిరిగి వస్తూ ఉంటుంది మరియు మీరు మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతారు. బాబా ఎన్ని యుక్తులను తెలియజేస్తారు. వారే మీ రాజ్యాన్ని లాక్కున్నారు, వారే మళ్ళీ పరస్పరములో కొట్లాడుకుంటారు మరియు విశ్వానికి యజమానులుగా మీరు అవుతారు. ఇది ఎంత పెద్ద రాజ్యాధికారము. స్మృతి చేస్తూ ఉండండి మరియు మీ వారసత్వాన్ని తీసుకోండి - శ్రమంతా కేవలం ఇందులోనే ఉంది. ఇందులో విసుగు చెందకూడదు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇతర విషయాలన్నింటినీ వదిలి జ్ఞాన దానము చేయాలి. రూప్ బసంతులుగా అవ్వాలి. తమ అవగుణాలను తొలగించుకునే పురుషార్థము చేయాలి. ఇతరులను చూడకూడదు.

2. తమ స్వభావాన్ని చాలా మధురముగా తయారుచేసుకోవాలి. అందరి పట్ల ప్రేమపూర్వకమైన దృష్టిని పెట్టుకోవాలి. ఎవరికీ దుఃఖము ఇవ్వకూడదు. కర్మేంద్రియజీతులుగా అవ్వాలి.

వరదానము:-
సంపూర్ణ సమర్పణ యొక్క విధి ద్వారా సర్వగుణ సంపన్నులుగా అయ్యే పురుషార్థములో సదా విజయీ భవ

ఎవరికైతే సంకల్పములో కూడా దేహాభిమానము ఉండదో, వారినే సంపూర్ణ సమర్పణ అని అంటారు. నేను ఫలానా అనే దేహ భానాన్ని కూడా అర్పణ చేయాలి - ఈ సంకల్పాన్ని కూడా అర్పణ చేసి సంపూర్ణ సమర్పణ అయ్యేవారు సర్వగుణాలలో సంపన్నముగా అవుతారు. వారిలో ఏ గుణము లోపించి ఉండదు. ఎవరైతే సర్వం సమర్పణ చేసి, సర్వగుణ సంపన్నులుగా మరియు సంపూర్ణులుగా అయ్యే లక్ష్యము పెట్టుకుంటారో, అటువంటి పురుషార్థులకు బాప్ దాదా సదా విజయీ భవ అనే వరదానాన్ని ఇస్తారు.

స్లోగన్:-
మనసును వశము చేసుకునేవారే మన్మనాభవగా ఉండగలరు.

అవ్యక్త ప్రేరణలు - అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా) అవ్వండి

పవిత్రతకు లేక అపవిత్రతకు కారణము ‘స్మృతి’. ఫలానావారు దేవి అన్న స్మృతి ఉన్నట్లయితే అది స్మృతి, దృష్టి మరియు వృత్తిని పవిత్రముగా తయారుచేస్తుంది. అలా కాకుండా ఫలానావారు ఫిమేల్ (ఆడవారు) అన్న స్మృతి ఉన్నట్లయితే అది స్మృతి, వృత్తి మరియు దృష్టిని అపవిత్రత వైపుకు లాగుతుంది. అక్కడ రూపాన్ని చూస్తారు మరియు ఇక్కడ ఆత్మికతను చూస్తారు.