06-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మేము అందరికీ సుఖధామానికి వెళ్ళే మార్గాన్ని ఎలా తెలియజేయాలి అని మీకు ఇదే చింత ఉండాలి. ఇదే పురుషోత్తములుగా అయ్యే సంగమయుగము అని అందరికీ తెలియాలి’’

ప్రశ్న:-
పిల్లలైన మీరు పరస్పరము ఒకరికొకరు ఏ అభినందనలు తెలుపుకుంటారు? మనుష్యులు అభినందనలను ఎప్పుడు తెలుపుతారు?

జవాబు:-
ఎప్పుడైనా ఎవరైనా జన్మించినప్పుడు, విజయులుగా అయినప్పుడు లేక వివాహము చేసుకున్నప్పుడు లేక ఏదైనా పండుగ రోజున మనుష్యులు అభినందనలు తెలుపుకుంటారు. కానీ అవేమీ సత్యమైన అభినందనలు కాదు. పిల్లలైన మీరు ఒకరికొకరు తండ్రికి చెందినవారిగా అయినందుకు అభినందనలు తెలుపుకుంటారు. మీరు అంటారు - మేమెంత అదృష్టవంతులము, ఎందుకంటే అన్ని దుఃఖాల నుండి విముక్తులమై సుఖధామములోకి వెళ్తున్నాము. మీకు హృదయాంతరాలలో సంతోషము కలుగుతుంది.

ఓంశాంతి
అనంతమైన తండ్రి కూర్చుని అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు - అనంతమైన తండ్రి ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతుంది. అందరికీ తండ్రి ఒక్కరేనని మీకు తెలుసు, వారినే పరమపిత అని అంటారు. లౌకిక తండ్రిని పరమపిత అని అనరు. పరమపిత అయితే ఒక్కరే, వారిని పిల్లలందరూ మర్చిపోయారు, అందుకే దుఃఖహర్త, సుఖకర్త అయిన పరమపిత పరమాత్ముని గురించి, ఆ తండ్రి మన దుఃఖాలను ఏ విధంగా హరిస్తున్నారు అనేది పిల్లలైన మీకు తెలుసు, ఆ తర్వాత ఇక సుఖ-శాంతులలోకి వెళ్ళిపోతాము. అందరూ అయితే సుఖములోకి వెళ్ళరు. కొందరు సుఖములోకి, కొందరు శాంతిలోకి వెళ్తారు. కొందరు సత్యయుగములో పాత్రను అభినయిస్తారు, కొందరు త్రేతాయుగములో, కొందరు ద్వాపరయుగములో అభినయిస్తారు. మీరు సత్యయుగములో ఉన్నప్పుడు మిగిలినవారంతా ముక్తిధామములో ఉంటారు. దానిని ఈశ్వరుని ఇల్లు అని అంటారు. ముసల్మానులు నమాజ్ చదివేటప్పుడు అందరూ కలిసి ఖుదాతాలాకు (అల్లాకు) నమస్కరిస్తారు, ఎందుకని? స్వర్గములోకి వెళ్ళేందుకా? లేక అల్లా వద్దకు వెళ్ళేందుకా? అల్లా ఇంటిని స్వర్గము అని అనరు. అక్కడైతే ఆత్మలు శాంతిగా ఉంటాయి. అక్కడ శరీరాలు ఉండవు. అల్లా వద్దకు శరీరాలతో వెళ్ళము, కేవలం ఆత్మలమైన మనమే వెళ్తాము అని వారికి తెలిసి ఉండవచ్చు. ఇప్పుడు కేవలం అల్లాను అలా తలచుకోవడం వలన పవిత్రముగానేమీ అవ్వరు. అసలు అల్లా గురించి తెలియనే తెలియదు. ఆ తండ్రి సుఖ-శాంతుల వారసత్వాన్ని ఇస్తున్నారని ఇప్పుడు ఈ మనుష్యులకు ఎలా సలహాను ఇవ్వాలి. విశ్వములో శాంతి ఎలా ఏర్పడుతుంది, విశ్వములో శాంతి ఎప్పుడు ఉండేది అని ఈ విషయాలను వారికి ఎలా అర్థం చేయించాలి? సర్వీసబుల్ పిల్లలెవరైతే ఉన్నారో, వారికి నంబరువారు పురుషార్థానుసారముగా ఈ చింతన ఉంటుంది. బ్రహ్మాముఖ వంశావళులైన బ్రాహ్మణులైన మీకే తండ్రి తమ పరిచయాన్ని ఇచ్చారు, అలాగే మొత్తం ప్రపంచములోని మనుష్యమాత్రులందరి పాత్ర గురించి కూడా పరిచయాన్ని ఇచ్చారు. ఇప్పుడు మనం మనుష్యమాత్రులకు తండ్రి మరియు రచన యొక్క పరిచయాన్ని ఎలా ఇవ్వాలి? తండ్రి అందరికీ చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే ఖుదా ఇంటికి వెళ్ళిపోతారు. స్వర్ణయుగములోకి లేక స్వర్గములోకి అందరూ అయితే వెళ్ళరు. అక్కడైతే ఒకే ధర్మము ఉంటుంది. మిగిలినవారంతా శాంతిధామములో ఉంటారు. ఇందులో ఎవరూ అసంతుష్టులుగా అయ్యే విషయమేమీ లేదు. మనుష్యులు శాంతిని కోరుకుంటారు, అది అల్లా లేక గాడ్ ఫాదర్ యొక్క ఇంటిలోనే లభిస్తుంది. ఆత్మలన్నీ శాంతిధామము నుండి వస్తాయి, మళ్ళీ ఎప్పుడైతే నాటకము పూర్తవుతుందో అప్పుడు అక్కడికి వెళ్తారు. తండ్రి రావడము కూడా పతిత ప్రపంచము నుండి అందరినీ తీసుకువెళ్ళేందుకే వస్తారు.

మనము శాంతిధామములోకి వెళ్తామని, మళ్ళీ సుఖధామములోకి వస్తామని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇది పురుషోత్తమ సంగమయుగము. పురుషోత్తములు అనగా ఉత్తమోత్తమ పురుషులు. ఎప్పటివరకైతే ఆత్మ పవిత్రముగా అవ్వదో అప్పటివరకూ ఉత్తమ పురుషులుగా అవ్వలేరు. ఇప్పుడు తండ్రి మీకు చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి మరియు సృష్టి చక్రాన్ని తెలుసుకోండి, అలాగే దైవీ గుణాలను కూడా ధారణ చేయండి. ఈ సమయములో మనుష్యులందరి క్యారెక్టర్లు పాడైపోయి ఉన్నాయి. కొత్త ప్రపంచములోనైతే క్యారెక్టర్లు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. భారతవాసులే ఉన్నతమైన క్యారెక్టర్ కలవారిగా అవుతారు. ఆ ఉన్నతమైన క్యారెక్టర్ కలవారికి తక్కువ క్యారెక్టర్ కలవారు తల వంచి నమస్కరిస్తారు. వారి క్యారెక్టర్లను వర్ణన చేస్తారు. ఇది పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఇది ఇతరులకు ఎలా అర్థం చేయించాలి? ఏ సహజ యుక్తిని రచించాలి? ఇది ఆత్మల యొక్క మూడవ నేత్రాన్ని తెరవడము. బాబా ఆత్మలో జ్ఞానము ఉంది. నాలో జ్ఞానము ఉంది అని మనుష్యులు అంటారు, అది దేహాభిమానము. ఇందులోనైతే ఆత్మాభిమానులుగా అవ్వాలి. సన్యాసుల వద్ద శాస్త్రాల జ్ఞానము ఉంది. తండ్రి వద్ద ఉన్న జ్ఞానమైతే వారు వచ్చి ఇచ్చినప్పుడే తెలుస్తుంది. యుక్తిగా అర్థం చేయించాలి. వారు కృష్ణుడిని భగవంతుడిగా భావిస్తారు. భగవంతుని గురించి వారికి తెలియనే తెలియదు. ఋషులు, మునులు మొదలైనవారు మాకు తెలియదు అని అనేవారు. మనిషి భగవంతుడు కాలేరని భావిస్తారు. నిరాకారుడైన భగవంతుడే రచయిత అని భావిస్తారు కానీ వారు ఎలా రచిస్తారు, వారి నామ, రూప, దేశ, కాలాలు ఏమిటి? అనేది తెలియదు. ఇక వారు నామ-రూపాలకు అతీతుడు అని అనేస్తారు. నామ-రూపాలకు అతీతమైన వస్తువు అసలు ఎలా ఉండగలదు అని ఈ మాత్రము కూడా అర్థం చేసుకోరు. అది అసలు అసంభవము. ఒకవేళ రాయి-రప్పలలో, కూర్మావతారము, మత్స్యావతారములో, అన్నింటిలోనూ వారు ఉన్నారంటే మరి అవి నామ-రూపాలే అవుతాయి కదా. ఒక్కోసారి ఒక్కోలా అంటుంటారు. మనుష్యులకు మేము ఎలా అర్థం చేయించాలి అని పిల్లలకు రాత్రింబవళ్ళు చాలా చింతన నడవాలి. ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పురుషోత్తమ సంగమయుగము. మనుష్యులు దేవతలకు నమస్కరిస్తారు. మనుష్యులు మనుష్యులకు నమస్కరించరు, మనుష్యులు భగవంతుడికి లేక దేవతలకు నమస్కరించవలసి ఉంటుంది. ముసల్మానులు కూడా నమస్కరిస్తారు, అల్లాను తలచుకుంటారు. వారు అల్లా వద్దకైతే చేరుకోలేరని మీకు తెలుసు. ముఖ్యమైన విషయమేమిటంటే - అల్లా వద్దకు ఎలా చేరుకోవాలి? ఆ తర్వాత విషయము, అల్లా కొత్త సృష్టిని ఎలా రచిస్తారు? ఈ విషయాలన్నింటినీ ఎలా అర్థం చేయించాలి, దీని కోసమే పిల్లలు విచార సాగర మంథనము చేయవలసి ఉంటుంది. తండ్రి అయితే విచార సాగర మంథనము చేయనవసరం లేదు. తండ్రి విచార సాగర మంథనము చేసే యుక్తిని పిల్లలకు నేర్పిస్తారు. ఈ సమయములో అందరూ ఇనుపయుగములో తమోప్రధానముగా ఉన్నారు. తప్పకుండా ఏదో సమయములో బంగారు యుగము కూడా ఉంటుంది. బంగారు యుగాన్ని పవిత్ర యుగము అని అంటారు. పవిత్రత మరియు అపవిత్రత. బంగారములో మాలిన్యాన్ని కలుపుతారు కదా. అలా ఆత్మ కూడా మొదట పవిత్రముగా, సతోప్రధానముగా ఉంటుంది, ఆ తర్వాత దానిలో మాలిన్యము చేరుకుంటుంది. ఎప్పుడైతే ఆత్మ తమోప్రధానముగా అవుతుందో, అప్పుడు తండ్రి రావలసి ఉంటుంది, తండ్రియే వచ్చి సతోప్రధాన సుఖధామాన్ని తయారుచేస్తారు. సుఖధామములో కేవలం భారతవాసులు మాత్రమే ఉంటారు. మిగిలినవారంతా శాంతిధామానికి వెళ్తారు. శాంతిధామములో అందరూ పవిత్రముగా ఉంటారు, మళ్ళీ ఇక్కడకు వచ్చి మెల్ల-మెల్లగా అపవిత్రముగా అవుతూ ఉంటారు. మనుష్యులు ప్రతి ఒక్కరూ సతో, రజో, తమోగా తప్పకుండా అవుతారు. మీరందరూ అల్లా ఇంటికి చేరుకోవచ్చు అని ఇప్పుడు వారికి ఎలా తెలియజేయాలి. దేహపు సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. భగవానువాచ అయితే ఉంది - నన్ను స్మృతి చేసినట్లయితే ఈ 5 భూతాలు ఏవైతే ఉన్నాయో, అవి తొలగిపోతాయి. పిల్లలైన మీకు రాత్రింబవళ్ళు ఈ చింతే ఉండాలి. తండ్రికి కూడా చింత కలిగింది, అందుకే - నేను వెళ్ళాలి, వెళ్ళి అందరినీ సుఖమయముగా తయారుచేయాలి అన్న ఆలోచన కలిగింది. ఇందులో నాతోపాటుగా పిల్లలు కూడా సహాయకులుగా అవ్వాలి. తండ్రి ఒంటరిగా ఏమి చేస్తారు. కావున ఈ విచార సాగర మంథనము చేయండి. ఇది పురుషోత్తమ సంగమయుగము అని మనుష్యులు వెంటనే అర్థం చేసుకునే విధముగా ఏ ఉపాయాన్ని రచించాలి? ఈ సమయములోనే మనుష్యులు పురుషోత్తములుగా అవ్వగలరు. మొదట ఉన్నతముగా ఉంటారు, ఆ తర్వాత కింద పడిపోతారు. ప్రారంభములోనే పడిపోరు కదా. వచ్చీ రావడముతోనే తమోప్రధానముగా ఉండరు. ప్రతి వస్తువు మొదట సతోప్రధానముగా ఉంటుంది, ఆ తర్వాత సతో, రజో, తమోగా అవుతుంది. పిల్లలు ఇన్ని ప్రదర్శినీలు మొదలైనవి చేస్తారు, అయినా కూడా మనుష్యులు ఏమీ అర్థం చేసుకోరు, మరి ఇంకే ఉపాయాన్ని రచించాలి. భిన్న-భిన్న ఉపాయాలనైతే రచించవలసి ఉంటుంది కదా. దాని కొరకు మనకు సమయము కూడా ఉంది. ఒక్కసారిగా ఎవ్వరూ సంపూర్ణము అవ్వలేరు. చంద్రుడు కూడా కొద్ది-కొద్దిగా పెరుగుతూ చివరకు సంపూర్ణము అవుతాడు. అలాగే మనము కూడా తమోప్రధానముగా అయ్యాము, మళ్ళీ సతోప్రధానముగా అవ్వడానికి సమయము పడుతుంది. అది జడమైనది, ఇక్కడ మనము చైతన్యములో ఉన్నాము. మరి మనము ఎలా అర్థం చేయించాలి. ముసల్మానుల మౌల్వీలకు (ముస్లిమ్ పండితులకు) - మీరు ఈ నమాజ్ ఎందుకు చదువుతున్నారు, ఎవరి స్మృతిలో చదువుతున్నారు అన్నది అర్థం చేయించాలి. ఇలా విచార సాగర మంథనము చేయాలి. విశేషమైన రోజులలో (పండుగ రోజులలో) ప్రెసిడెంట్ మొదలైనవారు కూడా మసీదులకు వెళ్తారు. పెద్దవారిని కలుస్తారు. అన్ని మసీదులకు మళ్ళీ ఒక పెద్ద మసీదు ఉంటుంది - అక్కడకు ఈద్ ముబారక్ అని అభినందనలు తెలపడానికి వెళ్తారు. వాస్తవానికి ఎప్పుడైతే మనము అన్ని దుఃఖాల నుండి విముక్తులై సుఖధామములోకి వెళ్తామో, అప్పుడే అభినందనలు తెలపవలసి ఉంటుంది. మనము శుభవార్తను వినిపిస్తాము. ఎవరైనా గెలిచినప్పుడు కూడా అభినందనలు తెలియజేస్తారు. ఎవరైనా వివాహము చేసుకున్నప్పుడు కూడా - సదా సుఖముగా ఉండండి అంటూ అభినందనలు తెలియజేస్తారు. మనము ఒకరికొకరు అభినందనలను ఎలా తెలుపుకోవాలి అనేది ఇప్పుడు మీకైతే తండ్రి అర్థం చేయించారు. ఈ సమయములో మనము అనంతమైన తండ్రి నుండి ముక్తి, జీవన్ముక్తుల వారసత్వాన్ని తీసుకుంటున్నాము. మీకైతే అభినందనలు లభించగలవు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీకు అభినందనలు. మీరు 21 జన్మల కొరకు పదమపతులుగా అవుతున్నారు. ఇప్పుడు మనుష్యులందరూ తండ్రి నుండి వారసత్వాన్ని ఎలా తీసుకోగలరు, అందరూ అభినందనలకు పాత్రులుగా ఎలా అవ్వగలరు. మీకు ఇప్పుడు తెలిసింది కానీ మీకు మనుష్యులు అభినందనలు తెలపలేరు. వారికి మీ గురించి తెలియనే తెలియదు. వారు అభినందనలు తెలియజేసారంటే స్వయము కూడా తప్పకుండా అభినందనలు పొందేందుకు యోగ్యులుగా అవుతారు. మీరు గుప్తముగా ఉన్నారు కదా. మీరు ఒకరికొకరు అభినందనలు తెలుపుకోగలరు. మనము అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యాము, అభినందనలు. మీరు ఎంత అదృష్టవంతులు. ఏదైనా లాటరీ లభిస్తే లేక బిడ్డ జన్మిస్తే, మీకు అభినందనలు అని అంటారు. పిల్లలు పాస్ అయినప్పుడు కూడా అభినందనలు తెలియజేస్తారు. మీకు హృదయాంతరాలలో సంతోషము కలుగుతుంది - మాకు తండ్రి లభించారు, వారి నుండి మేము వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని మీకు మీరు అభినందనలు తెలుపుకుంటారు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - దుర్గతిని పొందిన ఆత్మలైన మీరు ఇప్పుడు సద్గతిని పొందారు. అభినందనలైతే అందరికీ ఒకే విధమైనవి లభిస్తున్నాయి. చివరిలో అందరికీ తెలుస్తుంది. ఎవరైతే ఉన్నతోన్నతముగా తయారవుతారో, వారితో కిందివారు అంటారు - మీకు అభినందనలు. మీరు సూర్యవంశీ కులములో మహారాజు-మహారాణులుగా అవుతారు. ఎవరైతే విజయమాలలోని మణులుగా అవుతారో, వారికి తక్కువ కులం వారు అభినందనలు తెలియజేస్తారు. ఎవరైతే పాస్ అవుతారో వారికి అభినందనలు లభిస్తాయి, వారికే పూజ జరుగుతుంది. ఏ ఆత్మ అయితే ఉన్నత పదవిని పొందుతుందో, ఆ ఆత్మకు కూడా అభినందనలు. ఆ తర్వాత భక్తి మార్గములో వారి పూజయే జరుగుతుంది. ఎందుకు పూజిస్తున్నారు అనేది మనుష్యులకు తెలియదు. ఎలా అర్థం చేయించాలి అన్న చింతయే పిల్లలకు ఉంటుంది. మనము పవిత్రముగా అయ్యాము, ఇతరులను పవిత్రముగా ఎలా తయారుచేయాలి? ప్రపంచమైతే చాలా పెద్దది కదా. ఇంటింటికీ సందేశాన్ని చేర్చాలంటే ఏమి చేయాలి? కరపత్రాలను పై నుండి వేస్తే అందరికీ ఏమీ లభించవు. ఇక్కడైతే ప్రతి ఒక్కరి చేతికి ఈ సందేశము అందాలి ఎందుకంటే - తండ్రి వద్దకు ఎలా చేరుకోవాలి అన్నది వారికి ఏ మాత్రమూ తెలియదు. అన్ని మార్గాలూ పరమాత్మను కలుసుకునేందుకే అని అంటారు. కానీ తండ్రి అంటారు - ఈ భక్తి, దాన, పుణ్యాలు మొదలైనవైతే జన్మ-జన్మాంతరాలుగా చేస్తూ వచ్చారు కానీ మార్గము ఎక్కడ లభించింది? ఇవన్నీ అనాదిగా కొనసాగుతూ వచ్చాయి అని అంటారు, కానీ ఎప్పటినుండి ప్రారంభమైంది? అనాది అన్న పదము యొక్క అర్థము తెలియదు. మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారముగా అర్థం చేసుకుంటారు. జ్ఞానము యొక్క ప్రారబ్ధము 21 జన్మలు ఉంటుంది, అది సుఖము, ఆ తర్వాత దుఃఖము ఉంటుంది. ఎవరు ఎక్కువ భక్తిని చేసారు అన్న లెక్కను పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఈ విస్తారమైన విషయాలన్నింటినీ ఒక్కొక్కరికీ అయితే అర్థం చేయించలేము. మరి ఏం చేయాలి, ఏదైనా వార్తాపత్రికలో ముద్రించాలా, మరి దానికి సమయమైతే పడుతుంది. అందరికీ సందేశము అంత త్వరగా అయితే లభించదు. అందరూ పురుషార్థము చేయడం మొదలుపెడితే ఇక స్వర్గములోకి వచ్చేస్తారు. ఈ విధంగా జరగనే జరగదు. ఇప్పుడు మీరు స్వర్గము కొరకు పురుషార్థము చేస్తారు. ఇప్పుడు మన ధర్మానికి చెందినవారు ఎవరైతే ఉన్నారో, వారిని ఎలా వెలికి తీయాలి? ఎవరెవరు ట్రాన్స్ఫర్ అయ్యారు అనేది ఎలా తెలుస్తుంది? హిందూ ధర్మమువారు వాస్తవానికి దేవ-దేవతా ధర్మానికి చెందినవారు, ఇది కూడా ఎవరికీ తెలియదు. పక్కా హిందువులుగా ఉంటే తమ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని నమ్ముతారు. ఈ సమయములోనైతే అందరూ పతితముగా ఉన్నారు. పతిత-పావనా రండి అని పిలుస్తారు. మీరు వచ్చి మమ్మల్ని పావన ప్రపంచములోకి తీసుకువెళ్ళండి అని నిరాకారుడినే తలచుకుంటారు. వీరు ఇంత పెద్ద రాజ్యాన్ని ఎలా పొందారు? ఎవరిపైనైనా విజయము పొంది రాజ్యాన్ని తీసుకునేందుకు అసలు భారత్ లో ఈ సమయములో రాజ్యమే లేదు. వారేమీ యుద్ధము చేసి రాజ్యాన్ని పొందరు. మనుష్యుల నుండి దేవతలుగా ఎలా తయారుచేస్తారు అన్నది ఎవరికీ తెలియదు. మీకు కూడా ఇప్పుడు తండ్రి ద్వారా తెలిసింది. ఇతరులు ముక్తి, జీవన్ముక్తులను పొందేందుకు వారికి ఈ విషయాలు ఎలా తెలియజేయాలి. పురుషార్థము చేయించేవారు కావాలి కదా, తద్వారా స్వయము గురించి తెలుసుకుని అల్లాను స్మృతి చేయగలగాలి. మీరు చెప్పండి, మీరు ఈద్ ముబారక్ అని ఎవరికి చెప్తున్నారు! మీరు అల్లా వద్దకు వెళ్తున్నారు, పక్కా నిశ్చయము ఉందా? ఆ విషయములో మీకు ఎంతో సంతోషము ఉంటుంది. దీనినైతే మీరు ఎన్ని సంవత్సరాలుగా జరుపుకుంటూ వచ్చారు, అసలు ఎప్పటికైనా ఖుదా వద్దకు వెళ్తారా లేదా? అని అడిగితే తికమకపడతారు. మనమేదైతే చదువుకుంటూ ఉన్నామో, అది దేని కోసము. ఉన్నతోన్నతమైనవారైతే ఒక్క అల్లాయే. అల్లా పిల్లలైన మీరు కూడా ఆత్మలే అని చెప్పండి. మేము అల్లా వద్దకు వెళ్ళాలి అని ఆత్మ కోరుకుంటుంది. ఆత్మ ఏదైతే మొదట పవిత్రముగా ఉండేదో, అది ఇప్పుడు పతితముగా అయ్యింది. ఇప్పుడు దీనిని స్వర్గము అనైతే అనరు. ఆత్మలన్నీ పతితముగా ఉన్నాయి, అల్లా ఇంటికి వెళ్ళేందుకు పావనముగా ఎలా అవ్వగలరు. అక్కడ వికారీ ఆత్మలు ఉండవు. నిర్వికారులుగా ఉండాలి. ఆత్మ ఏమీ క్షణములో సతోప్రధానముగా అవ్వదు. ఇదంతా విచార సాగర మంథనము చేయడం జరుగుతుంది. బాబాకు విచార సాగర మంథనము నడుస్తూ ఉంటుంది, అందుకే కదా అర్థం చేయిస్తారు. ఎవరికి ఎలా అర్థం చేయించాలి అని యుక్తులను రచించాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ విధముగా తండ్రికి - నేను వెళ్ళి పిల్లలను దుఃఖాల నుండి విడిపించాలి, సుఖవంతులుగా చేయాలి అన్న ఆలోచన కలిగిందో, అదే విధముగా తండ్రికి సహాయకులుగా అవ్వాలి, ఇంటింటికి సందేశాన్ని అందించే యుక్తులను రచించాలి.

2. సర్వుల అభినందనలను ప్రాప్తి చేసుకునేందుకు విజయమాలలోని మణులుగా అయ్యే పురుషార్థము చేయాలి. పూజ్యులుగా అవ్వాలి.

వరదానము:-
చేసేవారు మరియు చేయించేవారి యొక్క స్మృతి ద్వారా ప్రకాశ కిరీటధారి భవ

నేను నిమిత్త కర్మయోగిని, చేసేవాడిని మరియు చేయించేది తండ్రి - ఒకవేళ ఈ స్మృతి స్వతహాగా ఉన్నట్లయితే సదా ప్రకాశ కిరీటధారులుగా మరియు చింతలేని చక్రవర్తులుగా అవుతారు. కేవలం తండ్రి మరియు నేను, అంతే, మూడవవారు ఎవ్వరూ లేరు - ఈ అనుభూతి సహజముగానే చింతలేని చక్రవర్తులుగా చేస్తుంది. ఎవరైతే ఇటువంటి చక్రవర్తులుగా అవుతారో వారే మాయాజీతులుగా, కర్మేంద్రియజీతులుగా మరియు ప్రకృతీజీతులుగా అవుతారు. కానీ ఒకవేళ పొరపాటుగానైనా కూడా, ఏదైనా వ్యర్థ భావపు భారాన్ని తమపైకి తీసుకున్నట్లయితే కిరీటానికి బదులుగా చింతలతో కూడిన అనేక గంపలు తలపైకి వచ్చేస్తాయి.

స్లోగన్:-
సర్వ బంధనాల నుండి ముక్తులుగా అయ్యేందుకు దైహిక సంబంధాల నుండి నష్టోమోహులుగా అవ్వండి.

అవ్యక్త ప్రేరణలు- ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితము చేసియోగాన్ని జ్వాలా రూపముగా చేయండి

యోగములో ఎప్పుడైతే మిగిలిన సంకల్పాలన్నీ శాంతిస్తాయో మరియు ‘‘బాబా మరియు నేను’’ అన్న ఈ ఒక్క సంకల్పమే ఉంటుందో, దానినే శక్తిశాలి యోగము అని అంటారు. బాబా మిలనము యొక్క అనుభూతి తప్ప మిగిలిన సంకల్పాలన్నీ మర్జ్ అయిపోవాలి, అప్పుడు జ్వాలా రూపపు స్మృతి అని అంటారు, దాని ద్వారానే పరివర్తన జరుగుతుంది.