06-11-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఈ గమ్యము చాలా పెద్దది, అందుకే మీ
సమయాన్ని వృధా చేసుకోకుండా సతోప్రధానముగా తయారయ్యే పురుషార్థము చేయండి’’
ప్రశ్న:-
పిల్లలు ఎక్కే
కళలో లేకపోవడానికి ముఖ్యమైన కారణమేమిటి?
జవాబు:-
నడుస్తూ-నడుస్తూ కాస్త అహంకారము వచ్చినా, తమను తాము తెలివైనవారిగా భావించినా,
మురళీని మిస్ చేసినా, బ్రహ్మాబాబా ఆజ్ఞను ఉల్లంఘించినా, ఇక ఎప్పుడూ ఎక్కే కళలోకి
వెళ్ళరు. సాకారుని హృదయము నుండి దిగిపోయారంటే నిరాకారుని హృదయము నుండి కూడా
దిగిపోయినట్లే.
పాట:-
ప్రపంచము వారు
లక్ష చేసినా సరే...
ఓంశాంతి
పిల్లలు పాటను విన్నారు. పిల్లలు అంటారు - మమ్మల్ని సంశయబుద్ధి కలవారిగా చేయడానికి
ఎవరు ఏం చేసినా కానీ, మేము సంశయబుద్ధి కలవారిగా అవ్వము. ఎవరు ఎన్ని తప్పుడు మాటలను
వినిపించినా కానీ, మేము సంశయబుద్ధి కలవారిగా అవ్వము. శ్రీమతముపై నడుస్తూ ఉంటాము.
తండ్రి ప్రతి రోజు భిన్న-భిన్న పాయింట్లను అర్థం చేయిస్తూ ఉంటారు. సత్యయుగములో 9
లక్షలమంది ఉండేవారు, అంటే మిగిలిన ఇంతమంది మనుష్యులందరి వినాశనము తప్పకుండా
జరుగుతుంది. ఎవరైతే తెలివైనవారు ఉంటారో, వారు సూచన ద్వారా ఈ విషయాన్ని అర్థం
చేసుకుంటారు - తప్పకుండా ఈ యుద్ధము ద్వారానే అనేక ధర్మాల వినాశనము జరిగి ఒక్క
దేవీ-దేవతా ధర్మము యొక్క స్థాపన జరగనున్నది అని. ఎవరైతే యోగ్యులుగా అవుతారో, వారే
మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ మనుష్యుల నుండి దేవతలుగా
తయారుచేయలేరు. కనుక పిల్లలకు, ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలి అన్నది గుర్తుండాలి,
కానీ మాయ పదే-పదే మరపింపజేస్తుంది. ఇక్కడ నుండి ఇప్పుడు బాబాను స్మృతి చేసి
సతోప్రధానముగా అవ్వాలి. ఏ సమయములోనైనా యుద్ధము పెద్దది అవ్వచ్చు, దీనికి నియమమేమీ
లేదు. బహుశా ఇక ఆగనంత పెద్ద యుద్ధము కూడా జరగవచ్చు అని కూడా అంటూ ఉంటారు. అందరూ
పరస్పరములో కొట్లాడుకోవడము మొదలుపెడతారు. మరి వినాశనమయ్యే కంటే ముందే మనము స్మృతిలో
ఉంటూ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యే పురుషార్థము ఎందుకు చేయకూడదు.
స్మృతియాత్రలోనే మాయ విఘ్నాలు వేస్తుంది, అందుకే బాబా ప్రతి రోజు - చార్టు వ్రాయండి
అని చెప్తారు. కష్టం మీద ఇద్దరో, నలుగురో వ్రాస్తారు. మిగిలినవారు తమ
వ్యాపార-వ్యవహారాల్లోనే రోజంతా ఉంటున్నారు. అనేక రకాల విఘ్నాలలో చిక్కుకుని
ఉంటున్నారు. మేము సతోప్రధానముగా తప్పకుండా అవ్వాలి అని పిల్లలకు తెలుసు. కనుక ఎక్కడ
ఉన్నా సరే, పురుషార్థము చేయాలి. మనుష్యులకు అర్థం చేయించడానికని చిత్రాలు మొదలైనవి
కూడా తయారుచేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ సమయములో మనుష్యులు 100 శాతం తమోప్రధానముగా
ఉన్నారు. మొదట, ముక్తిధామము నుండి వచ్చేటప్పుడు సతోప్రధానముగా ఉంటారు. తర్వాత సతో,
రజో, తమోలలోకి వస్తూ-వస్తూ ఈ సమయములో అందరూ తమోప్రధానముగా అయిపోయారు. తండ్రిని
స్మృతి చేసినట్లయితే తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు - అన్న బాబా
సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. వినాశనము కూడా ఎదురుగా నిలబడి ఉంది. సత్యయుగములో ఒకే
ధర్మముండేది, మిగిలినవారంతా నిర్వాణధామములో ఉండేవారు. పిల్లలు చిత్రాలపై అటెన్షన్
పెట్టాలి. పెద్ద చిత్రాలు ఉంటే మంచి రీతిలో అర్థం చేసుకోగలరు. అందరికీ బాబా
సందేశాన్ని ఇవ్వాలి. మన్మనాభవ అనే పదము ముఖ్యమైనది. భగవంతుడు మరియు రాజ్యాధికార
వారసత్వము - ఇది అర్థం చేయించడానికి ఎంత శ్రమించాల్సి ఉంటుంది. అర్థం చేయించేవారు
కూడా నంబరువారుగా ఉన్నారు. అనంతమైన తండ్రి పట్ల ప్రేమ ఉండాలి. మేము బాబా సేవ
చేస్తున్నామని బుద్ధిలో ఉండాలి. ఈశ్వరీయ సేవాధారులుగా అవ్వాలి. వారు ఈ పదాన్ని
వాడుతారు కానీ అర్థాన్ని అర్థం చేసుకోరు. ఇప్పుడు బాబా పిల్లల సేవ చేయడానికి వచ్చారు.
ఎంత ఉత్తమమైన దేవీ-దేవతలుగా తయారుచేస్తారు. ఈ రోజు మనము ఎంత నిరుపేదగా అయిపోయాము.
సత్యయుగములో ఎంతగా సర్వగుణ సంపన్నులుగా అవుతాము. ఇక్కడ ఒకరితో ఒకరు
కొట్లాడుతూ-గొడవపడుతూ ఉంటారు. వినాశనము జరగనున్నదని ఎవ్వరికీ తెలియదు. శాంతి
ఏర్పడుతుందని భావిస్తారు. పూర్తిగా ఘోర అంధకారములో ఉన్నారు. ఇప్పుడు వారికి అర్థం
చేయించేవారు కావాలి. విదేశాలలో కూడా ఈ జ్ఞానాన్ని ఇవ్వవచ్చు. సభలో కూర్చుని ఒకే
విషయాన్ని అర్థం చేయించండి - మహాభారీ యుద్ధమైతే ప్రసిద్ధమైనది, దీనితో పాత ప్రపంచ
వినాశనము జరగనున్నది. ఇప్పుడు గాడ్ ఫాదర్ కూడా ఇక్కడే ఉన్నారు, తప్పకుండా వారే
బ్రహ్మా ద్వారా స్వర్గ స్థాపన చేస్తున్నారు. శంకరుని ద్వారా కలియుగ వినాశనము కూడా
జరగనున్నది ఎందుకంటే ఇప్పుడిది సంగమము. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరగనున్నాయి. మూడవ
ప్రపంచ యుద్ధము చివరి యుద్ధమని అంటారు. ఆఖరి వినాశనము కూడా తప్పకుండా జరగనున్నది.
అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు ముక్తిధామానికి వెళ్ళిపోతారు అనే
విషయాన్ని ఇప్పుడు మీరు అందరికీ చెప్పాల్సి ఉంటుంది. వారు తమ-తమ ధర్మాలలో ఉన్నా కానీ,
బాబాను స్మృతి చేసినట్లయితే తమ-తమ ధర్మములో మంచి పదవిని పొందగలరు.
అనంతమైన తండ్రి మనకు ప్రజాపిత బ్రహ్మా తనువు ద్వారా జ్ఞానము ఇస్తున్నారని మీకు
తెలుసు, కావున మీరు ఇతరులకు కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. దానము ఇంటి నుండే
ప్రారంభమవుతుంది. చుట్టు పక్కల ఉన్న వారందరికీ సందేశాన్ని ఇవ్వాలి. ఇతర ధర్మాల
వారికి కూడా బాబా పరిచయాన్ని ఇవ్వాలి. బయటివారికి, రాజులకు కూడా జ్ఞానాన్ని ఇవ్వాలి.
దాని కోసం ఏర్పాట్లు చేయాలి. బాబా అంటారు, ఈ ముఖ్య చిత్రాలేవైతే ఉన్నాయో -
త్రిమూర్తి, సృష్టి చక్రము, కల్పవృక్షము, ఇవి కూడా వస్త్రముపై ముద్రించినట్లయితే,
బయటకు కూడా తీసుకువెళ్లవచ్చు. పెద్ద సైజులో ముద్రించలేకపోతే, రెండు భాగాలుగా చేయండి.
ఈ త్రిమూర్తి, కల్పవృక్షము, సృష్టి చక్రము చిత్రాలలో మొత్తం జ్ఞానమంతా ఉంది. మెట్ల
వరస చిత్రములోని జ్ఞానము కూడా సృష్టి చక్రము చిత్రములో ఉంటుంది. 84 జన్మలు ఎలా
తీసుకుంటారు అనేది మెట్ల వరస చిత్రములో విస్తారముగా చూపించబడింది. సృష్టి చక్రము
చిత్రములో అన్ని ధర్మాలవారు వస్తారు. సతోప్రధానము నుండి సతో, రజో, తమోలలోకి ఎలా
వస్తారు, కిందకు ఎలా దిగుతారు అనేది మెట్ల వరస చిత్రములో చూపిస్తారు. ఇప్పుడు బాబా
అంటున్నారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. బాబాకు రోజంతా ఆలోచన నడుస్తూ ఉంటుంది.
ఎవరైనా కొత్తగా పెద్ద ఇంటిని నిర్మించేటప్పుడు, అందులో గోడలు ఎంత పెద్దగా ఉండాలంటే
వాటిపై 6x9 అడుగుల సైజు ఉన్న చిత్రాలను పెట్టే విధముగా ఉండాలి. తక్కువలో తక్కువ 12
అడుగులు ఉన్న గోడ కావాలి. ఈ సమయములో భాషలు కూడా చాలా ఉన్నాయి. అన్ని ధర్మాల వారికి
అర్థం చేయించాలంటే ఎన్ని భాషలలో తయారుచేయాల్సి ఉంటుంది. ఇంతటి విశాల బుద్ధితో
యుక్తిని రచించాలి. సేవ పట్ల అభిరుచి ఉండాలి. ఖర్చు అయితే చేయాల్సిందే. ఇకపోతే, మీకు
ఎవరినీ యాచించాల్సిన అవసరము లేదు. హుండీ దానంతట అదే నిండిపోతుంది. డ్రామాలో
నిశ్చితమై ఉంది. పిల్లల బుద్ధి నడవాలి. కానీ పిల్లలు కొద్దిగా చేసినా సరే, మేము చాలా
తెలివైనవారము అనే నషా ఎక్కుతుంది. కానీ బాబా అంటారు - రూపాయిలో 4 అణాలు కూడా
నేర్చుకోలేదు. కొందరు 2 అణాలు, కొందరు ఒక అణా, కొందరు ఒక పైసా అంత, అది కూడా కష్టం
మీద నేర్చుకున్నారు. ఏమీ అర్థం చేసుకోరు. మురళీ చదివే అభిరుచి కూడా ఉండదు. షావుకారు
ప్రజలు, పేద ప్రజలు అందరూ ఇక్కడే తయారయ్యేది ఉంది. కొందరైతే తండ్రితో ప్రతిజ్ఞ చేసి
మళ్ళీ నల్ల ముఖము చేసుకుంటారు. బాబా, ఓడిపోయాము అని అంటారు. తండ్రి అంటారు - మీరు
పాదచారుల కన్నా తక్కువగా ఉన్నారు, పైసా అంత విలువ కూడా లేనివారిగా ఉన్నారు.
ఇటువంటివారు ఏ పదవిని పొందుతారు! ఇప్పుడు సూర్యవంశీ రాజధాని స్థాపనవుతూ ఉంది.
ఎవరికైతే బాబా స్మృతి ఉంటుందో, వారే సంతోషముగా ఉంటారు. తండ్రి ద్వారా ఏ వారసత్వాన్ని
తీసుకుంటున్నాము - కేవలం ఈ విషయము గుర్తున్నా కూడా చాలా లాభము ఉంటుంది. ధారణ చేసి,
తర్వాత తమ సమానముగా తయారుచేయాలి. పిల్లలు అంతటి సేవను చేయలేకపోతున్నారు. కొంచెం సేవ
చేయగానే, మేము పాస్ అయిపోయామని భావిస్తారు. దేహాభిమానములోకి వచ్చి పడిపోతారు. ఒకవేళ
బాబాను (బ్రహ్మాను) అగౌరవపరిస్తే, శివబాబా అంటారు, నన్ను అగౌరవపరిచినట్లే. బాప్ దాదా,
ఇరువురూ కలిసి ఉన్నారు కదా. మాకైతే శివబాబాతో కనెక్షన్ ఉంది అని కాదు. అరే,
వారసత్వమైతే వీరి ద్వారా లభిస్తుంది కదా. వీరికి మనసులోని సమాచారాన్ని వినిపించాలి,
సలహా తీసుకోవాలి. శివబాబా అంటారు - నేను సాకారుని ద్వారా సలహా ఇస్తాను. బ్రహ్మా
లేకుండా శివబాబా నుండి వారసత్వాన్ని ఎలా తీసుకుంటారు. తండ్రి లేకుండా ఏ పని జరగదు.
అందుకే, పిల్లలు చాలా-చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు అహంకారములోకి వచ్చి స్వయాన్ని
నష్టపరచుకుంటారు. సాకారుని హృదయము నుండి దిగిపోతే నిరాకారుని హృదయము నుండి కూడా
దిగిపోతారు. చాలామంది ఎలా ఉన్నారంటే - ఎప్పుడూ మురళీని కూడా వినరు, లెటర్ కూడా
వ్రాయరు, ఇక తండ్రి ఏమనుకుంటారు! గమ్యము చాలా పెద్దది. పిల్లలు సమయాన్ని వృధా
చేయకూడదు. ఎవరైతే స్వయాన్ని మహారథులుగా భావిస్తారో, వారు ఉన్నతమైన కార్యములో సహాయము
చేయాలి. అప్పుడు తండ్రి సంతోషించి అభినందిస్తారు - వీరి ద్వారా అనేకుల కళ్యాణము
జరుగుతుందని అంటారు. ప్రదర్శనీలకైతే ఎంతోమంది వస్తారు. ప్రజలైతే తయారవుతారు. బాబాకు
సర్వీసబుల్ పిల్లలపై దృష్టి ఉంటుంది. ఈ ఇంద్రసభలోకి సూర్యవంశీ రాజు-రాణులుగా
అయ్యేవారు రావాలి. ఎవరైతే సేవ చేయరో, వారు యోగ్యులు కారు. ఎవరెవరు ఏమవుతారో
మున్ముందు అంతా తెలుస్తుంది! మేము రేపు స్వర్గములోకి వెళ్ళి రాకుమారులుగా అవుతామని
పిల్లలకు చాలా నషా ఉండాలి. ఇక్కడికి మీరు రాజయోగము నేర్చుకోవడానికి వచ్చారు. మంచి
రీతిలో చదువుకోకపోతే తక్కువ పదవిని పొందుతారు. బాబా, ఈ రోజు నేను ఈ సేవ చేసాను అని
బాబా వద్దకు సేవా సమాచారము రావాలి. ఎప్పుడూ లెటర్ కూడా వ్రాయకపోతే బాబా ఏమనుకోవాలి?
మరణించారని అనుకుంటారు. ఏ పిల్లలైతే సేవలో ఉంటారో, తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉంటారో,
బాబాకు కూడా ఆ పిల్లలే గుర్తుంటారు. శివబాబా బ్రహ్మా ద్వారా బ్రహ్మాకుమార-కుమారీలకు
వారసత్వాన్ని ఇస్తారు. శివబాబా బ్రహ్మా ద్వారా బ్రాహ్మణుల రచనను రచిస్తారు. ఇప్పుడు
మిగతా ధర్మాలన్నీ ఉన్నాయి, ఇకపోతే, పునాది అయిన దేవీ-దేవతా ధర్మము మాయమైపోయింది. ఈ
ఆటంతా తయారుచేయబడి ఉంది. మెట్ల వరస చిత్రములో అన్ని ధర్మాలు లేవు. ఈ కారణముగా సృష్టి
చక్రము చిత్రముపై అర్థం చేయించాల్సి ఉంటుంది. సృష్టి చక్రము చిత్రములో స్పష్టముగా
ఉంది. సత్యయుగములో దేవీ-దేవతలు డబల్ కిరీటధారులుగా ఉండేవారని కూడా అర్థం చేయించాలి.
ఈ సమయములో పవిత్రతా కిరీటము ఎవ్వరికీ లేదు. మనము లైట్ (ప్రకాశ) కిరీటము ఇవ్వదగిన
వారు ఒక్కరు కూడా లేరు. స్వయానికి కూడా ఇచ్చుకోలేరు. మనము ప్రకాశము కోసం పురుషార్థము
చేస్తున్నాము. శరీరమైతే ఇక్కడ పవిత్రముగా లేదు. ఆత్మ యోగబలముతో పవిత్రముగా
అవుతూ-అవుతూ చివరికి పవిత్రముగా అయిపోతుంది. కిరీటమైతే సత్యయుగములో లభిస్తుంది.
సత్యయుగములో డబల్ కిరీటము, భక్తి మార్గములో సింగిల్ కిరీటము. ఇక్కడ ఏ కిరీటము లేదు.
ఇప్పుడు మీకు కేవలం పవిత్రతా కిరీటాన్ని ఎక్కడ చూపించాలి? ప్రకాశాన్ని ఎక్కడ
చూపించాలి? జ్ఞానులుగా అయితే అయ్యారు కానీ పూర్తిగా పవిత్రముగా అయినప్పుడు ప్రకాశము
ఉంటుంది. మరి సూక్ష్మవతనములో ప్రకాశాన్ని చూపించాలా? మమ్మా సూక్ష్మవతనములో పవిత్ర
ఫరిశ్తాగా ఉన్నారు కదా. అక్కడ సింగిల్ కిరీటము ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రకాశాన్ని
ఎలా చూపించాలి? చివరిలో పవిత్రముగా అవుతారు. యోగములో కూర్చున్నప్పుడు అక్కడ
ప్రకాశాన్ని చూపించాలా? ఈ రోజు ప్రకాశాన్ని చూపించి, రేపు పతితముగా అయితే ప్రకాశమే
మాయమైపోతుంది, అందుకే అంతిమములో కర్మాతీత అవస్థ ఏర్పడినప్పుడు ప్రకాశము ఉండగలదు.
కానీ మీరు సంపూర్ణముగా అయిన వెంటనే సూక్ష్మవతనానికి వెళ్ళిపోతారు. ఉదాహరణకు
బుద్ధునికి, క్రైస్టుకు చూపిస్తారు! మొట్టమొదట పవిత్ర ఆత్మ ధర్మ స్థాపన చేయడానికి
వస్తుంది, వారికి ప్రకాశాన్ని చూపించవచ్చు కానీ కిరీటాన్ని చూపించలేము. మీరు కూడా
బాబాను స్మృతి చేస్తూ-చేస్తూ పవిత్రముగా అయిపోతారు. స్వదర్శన చక్రాన్ని
తిప్పుతూ-తిప్పుతూ మీరు రాజ్య పదవిని పొందుతారు. అక్కడ మంత్రులు ఉండరు. ఇక్కడ
అనేకుల నుండి సలహా తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ అందరూ సతోప్రధానముగా ఉంటారు. ఇవన్నీ
అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. బాప్ దాదా నుండి శభాష్ ను అందుకునేందుకు తండ్రి యొక్క ఉన్నతమైన కార్యములో
పూర్తిగా సహాయకులుగా అవ్వాలి. బాబాకు మీ సేవల యొక్క సమాచారాన్ని తెలియజేయాలి.
2. దేహాభిమానములోకి వచ్చి ఎప్పుడూ అగౌరవపరచకూడదు. తప్పుడు నషాలోకి రాకూడదు. మీ
సమయాన్ని వృధా చేసుకోకూడదు. సేవ యొక్క యుక్తులను రచించాలి, సేవాధారులుగా అవ్వాలి.
వరదానము:-
సదా దయా దృష్టి మరియు కళ్యాణ దృష్టి ద్వారా విశ్వ సేవ చేసే
విశ్వ పరివర్తక భవ
విశ్వ పరివర్తకులు మరియు విశ్వ సేవాధారీ ఆత్మల ముఖ్య
లక్షణము - తమ దయా దృష్టి మరియు కళ్యాణ దృష్టి ద్వారా విశ్వాన్ని సంపన్నముగా మరియు
సుఖీగా చేయడము. అలాగే, ఏ వస్తువులైతే ఎవరి వద్ద లేవో, అనగా, ఈశ్వరీయ సుఖము, శాంతి
మరియు జ్ఞాన ధనము, సర్వ శక్తులు, వీటితో సర్వాత్మలను బికారుల నుండి అధికారులుగా
చేయడము. ఇటువంటి సేవాధారులు తమ ప్రతి సెకండును, మాటను మరియు కర్మను,
సంబంధ-సంపర్కాలను సేవలోనే వినియోగిస్తారు. వారి యొక్క చూడడములో, నడవడములో, తినడములో,
అన్నింటిలోనూ సేవ ఇమిడి ఉంటుంది.
స్లోగన్:-
పేరు-ప్రతిష్టలను త్యాగము చేసి తమ సమయాన్ని అనంతమైన సేవలో సఫలం చేయడమే పరోపకారులుగా
అవ్వడము.
అవ్యక్త ప్రేరణలు -
బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి
అంతిమ సంపూర్ణ
స్థితిని ప్రాప్తి చేసుకునేందుకై స్వయాన్ని అతిథిగా భావిస్తూ నడుచుకోండి. ఎవరైతే
స్వయాన్ని అతిథిగా భావిస్తారో వారు వ్యక్తములో ఉంటూ కూడా అవ్యక్త స్థితిలో ఉంటారు,
వారికి ఎవరి పట్ల మోహము ఉండదు. మనము ఈ శరీరములో, ఈ పాత ప్రపంచములో అతిథులము, కేవలం
కొద్ది సమయము కోసం ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి.